May 3, 2024

ఒక తుఫాను..ఒక నగరం..ఒక మనిషి

రచన- రామా చంద్రమౌళి

డాక్టర్ హెచ్.సూర్యుడు. ఎంటెక్ పి. హెచ్. డి.. మెకానికల్ ఇంజినీరింగ్.. ఐ ఐ టి ఖరగ్ పూర్ నుండి. పదేళ్ళక్రితం.
తర్వాత..వేట..ఉద్యోగం కోసం వేట..వృత్తి తృప్తి కోసం వేట..తనలో నిక్షిప్తమై జ్వలించే అధ్యయనాల తాలూకు పరిశోధనలూ..నూతన ఆవిష్కరణలూ..ఆలోచనలూ..హైపాథిసిస్ తాలూకు దాహానికి సంబంధించిన తృప్తికోసం వేట.
వేట..వెదుకులాట..అన్వేషణ..ఫలించాయా.?
వ్చ్.
మనిషి లోపల కణకణలాడే నిప్పుకణికలా నిత్యం జ్వలించే శోధనాకాంక్ష..ఒక సముద్రమా.?
ఒక ఆకాశమా.?
ఒక అనంతానంత శూన్యమా.?
హుద్ హుద్ తుఫాన్ రాబోతోందని హెచ్చరిక.. బంగాళాఖాతమంతా బీభత్స కల్లోలం.
సూర్యుడు..ఒంటరిగా..నక్కవానిపాలెం..మున్సిపల్ స్కూల్ ప్రక్కన..నాల్గంతస్తుల మేడపైనున్న పెంట్ హౌజ్ లో,
రాత్రి..తొమ్మిది దాటుతూండగా,
టేబుల్ పై ముడుచుకున్న చేతులపై ముఖాన్ని దాచుకుని దాచుకుని..కళ్ళు మూసుకుని మూసుకుని,
మూసిన కళ్ళనిండా చీకటి.
కళ్ళుమూస్తే ఎప్పుడైనా చీకటే.
కాని కళ్ళు తెరిస్తే మాత్రం ఎప్పుడైనా వెలుతురు కాదు. అప్పుడప్పుడు వెలుతురు..అప్పుడప్పుడు చీకటి.
ఎవరో కవి అన్నాడు..”చీకటే శాశ్వతం..వెలుతురే అప్పుడప్పుడు వచ్చిపోయే అతిథి”అని.నిజమేనా.
చీకటి వెంట వెలుతురు..వెలుతురు వెంట చీకటి..ఒక నిరంతర వేట.

cyclone-hudhud

 

తుఫానుగాలి గంటకు రెండువందల కిలోమీటర్ల వేగంతో.. ఒకటే వికృతమైన హోరు.కోటిమంది భీకర రాక్షసులు ఒకేచోట నిలబడి విశాఖ నగరంపై హూంకరిస్తూ అరుస్తున్నట్టు..చెవులు పగిలిపోతాయా అన్నట్టు భరించలేని వికృత శబ్దం.
చెవులను గట్టిగా మూసుకున్నాడు సూర్యుడు శబ్ద బీభత్సాన్ని భరించలేక.
బయట చెట్లు ఊగిఊగి ఫెళఫెళా కూలిపోతున్న చప్పుడు.పూరిండ్ల కప్పులు, రేకులు, దుకాణాల ఆచ్ఛాదనలు, హోర్డింగులు అన్నీ ఒట్టి అట్టముక్కల్లా గాలిలో లేచిపోతున్న ధ్వని.
ఎత్తైన భవనాలన్నీ కూలి నేలమట్టమైపోతాయా.? సముద్రం ఆకాశమంత ఎత్తుతో నగరంపై విరుచుకుపడి సమూలంగా ధ్వంసించి సర్వాన్నీ నిశ్శేషం చేస్తుందా.?
చివరికి అసలిక్కడ ఈ నగరపు ఆనవాళ్ళేమైనా మిగుల్తాయా.?
మొత్తం శ్మశానమై ఒక శవాల దిబ్బ మిగుల్తుందా.?
ఏమో.
మోచేతులపైనుండి తలెత్తిన సూర్యుడికి అప్పటినుండి టేబుల్ పై పరిచిఉన్న మూడు ప్లాస్టిక్ ఆక్షరాలు కనిపించాయి. వాటిని అప్పుడు సాయంకాలం తన పి హెచ్ డి థీసిస్ కోసం గత నాల్గు రోజులుగా ఎడతెరిపి లేకుండా తనచుట్టూ తిరుగుతున్న సింహాద్రి తనవెంట తెచ్చినట్టున్నాడు. చూశాడు తను. ఆ మూడు అక్షరాలను తనతో మాట్లాడుతున్నంతసేపూ టేబుల్ పై అటుఇటూ జరుపుతూండగా మధ్య మధ్య సింహాద్రినీ, వాటినీ గమనించాడు.
అరచేతి సైజ్ లో..ముదురు నారింజ రంగులో..మూడక్షరాలు. ప్రక్కప్రక్కనే అమర్చి ఉన్నాయి.
ఒకటి జి..మరొకటి ఒ..ఇంకొకటి డి.
జి ఒ డి..గాడ్..భగవంతుడు.
తళతళా మెరుస్తున్నాయి అక్షరాలు.
సూర్యుడు అనాలోచితంగానే ఆ అక్షరాలను తాకాడు చేతితో.
ఎందుకో ఏదో షాక్ కొట్టినట్టు ఉలిక్కిపడి..నున్నగా అక్షరాల తలం.మెరుపు.చమక్కు.
అక్షరమంటే తన దృష్టిలో ఒక ప్రాణబిందువు.జీవకణం.
ఆ అక్షరాలను అటుఇటూ జరిపి..రీసెట్ చేసి చూశాడు.
వరుస మారింది. పదం మారింది.అర్థం మారింది.అంతా తలక్రిందులైంది.
డి ఒ జి..డాగ్..కుక్క.
గాడ్..అక్షరాలను తిరిగేస్తే డాగ్.
భగవంతుడు..తలక్రిందులై..కుక్క.
కుక్క విశ్వాసముగా కాపలా కాయును..అవిశ్వాసిని కరుచును..విడువకుండా నీడవలె వెంటనే ఉండును.తుదివరకు వెంట వచ్చును.
భగవంతుడుకూడా అంతేకదా..కాచును..కరుచును.
ఫెళఫెళా ఆకాశం భయంకరంగా గర్జించింది.ఎక్కడో పిడుగులు ఆగకుండా కురుస్తున్నట్టు..వందల శతఘ్నులు ప్రేలుతున్నట్టు ప్రళయ భీకర ధ్వని.
ఆకాశం కూలి భూమ్మీద పడి పతనమైపోతుందా.
అప్పటినుండి ఎడతెగకుండా కురుస్తున్న వర్షం చటుక్కున పదంతలు పెరిగి..భోరున వాన.వర్షం శబ్దాన్ని అంత భయంకరంగా ఎన్నడూ వినలేదు సూర్యుడు.
దాదాపు ముప్పయ్యేళ్ళ జీవితం..ఎన్నడూ ఇంత బీభత్స వాతావరణాన్ని చూడలేదు తను.
గత రెండు రోజులుగా టి వి ల్లో..రేడియోల్లో..బయట పరిపాలనా యంత్రాంగంకూడా పదే పదే అరచి చెబుతూనే ఉంది..తుఫాన్ ముంచుకొస్తోందని.
తుఫానా ఇది.హరికేన్..టోర్నడొ..ఇంకా అంతకంటే అతితీవ్ర ఉత్పాతం.
మూడక్షరాల్లోనుండి “జి” ని అటు జరిపి..మిగతా రెండక్షరాలు..డి..ఒ..ప్రక్క ప్రక్కనే పెట్టి,
‘ డి ఒ’..డు.చేయుము.
ఏమి చేయుము.
ఏదైనా చేయుము..ఏదో ఒకటి ఎల్లప్పుడు చేయుము.చేస్తూనే ఉండుము.
చేస్తూనే ఉన్నాడు తను .. జీవితమంతా.పని .. పని.బీదరికంలో బ్రతికేందుకు పని .. చదువుకునేందుకు చేయూతకోసం పని .. రాతినేలలోనుండి మొలకలా తలెత్తుకుని జీవించేందుకు పని.ఒక్కో మెట్టును ఎక్కి ఎక్కి ప్రపంచాన్ని అధ్యయనం చేసేందుకు..పని పని.నాణ్యమైన విద్యను,జ్ఞానాన్ని సముపార్జించేందుకు పని.ఆ విద్యను సరియైన విధంగా ఈ మానవ అభ్యున్నతికోసం వినియోగించేందుకు పని.
‘ డు ’. . పనిచేయుము.
పనిని విలక్షణంగా..అందరికంటే భిన్నంగా..కొత్తగా ఇదివరకెవ్వరూ చేయనట్టు చేయాలి.
ఎందుకో చటుక్కున లేచి నిలబడి తన ఒంటరి పెంట్ హౌజ్ గదినుండి బయటికొచ్చి నిలబడ్దామని,
బయట పెనుగాలి ప్రతిదాన్నీ తన్నుకుపోతోంది వెంట. తలదాచుకోవలసిందే ఎక్కడో ఒకచోట.. లోపల.
ఒక బలమైన వాయుతెప్ప బలంగా తోస్తే తప్పున గదిలోపలికొచ్చి పడ్డాడు సూర్యుడు.
గది లోపలికి అప్పటినుండి వచ్చిన నీళ్ళు నేలంతా పరుచుకుని,

hudhud

అంతా నీటి వాసన..గాలి తడి వాసన..గర్జించే సముద్రపు ఉప్పు వాసన..భయం వాసన..నిస్సహాయత వాసన.అప్పుడే మొదలౌతున్న కన్నీటి వాసన.
చిన్నప్పటినుండీ అంతే తను. ప్రతి సందర్భాన్నీ విలక్షణంగా చూడడం..విలక్షణమైన పరిష్కారంతో అడుగు ముందుకు వేయడం.
లేకుంటే..ఎక్కడి జాలరిపేట..తాగుబోతు తండ్రి..ఎన్నడూ పది రూపాయలు ఇంటికి తేని చేపలవేట. నాలుగిండ్లలో పాచిపనులు చేసే అమ్మ.
ఆకాశం నుండి జారే నీటిధారను పట్టుకుని పైకి ప్రాకవలసిన దుస్థితి తనది.

ఒకటే నమ్మకం..దేశమేదైనా కానీ,నిజంగా పని చేయాలనే సంకల్పమున్నవాడికి పని ఎప్పుడూ చేయి చాపితే అందేంత దూరంలోనే ఉంటుంది..అని.
అందుకే హోటల్లలో పనిచేసి..న్యూస్ పేపర్లేసి..పదిమంది డబ్బున్నోళ్ళ కార్లు తుడిచి..సాయంత్రం ఆటో గ్యారేజ్ లలో సర్వీస్ చేసి,
జీవితం సముద్ర మథనం.చిలకాలి..ఇంకా ఇంకా మథించాలి..అలసిపోకుండా..దీక్షగా..నిష్టగా..నిబద్ధతతో.
ఐతే మెట్లెక్కుతున్నకొద్దీ..ప్రపంచం విశాలంగా, విచిత్రంగా, విభిన్నంగా కబడ్తుందని తెలుసుకుంటూ.. అన్వేషణ.
ప్రతి విషయం యొక్క మూలం గురించిన జిజ్ఞాస.ఆది బిందువు గురించి ఆసక్తి. పునాది గురించీ, అనాది గురించీ అవలోకన.
తెలుసుకోవాలి..జీవితం గురించి..జీవితాతీతం గురించి..కనబడేదాని గురించి..కనబడనిదాని గురించి.. మిథ్య.. నిజ స్థితుల గురించి..అంతిమంగా “ఏమిటి.?”అన్నదానిగురించి.
చెవులు పగిలిపోతున్నాయి..గాలి హోరుతో.
ఒకటే వణుకు..గజగజ..పంజా విసుర్తున్న సింహం ముందు కోడిపిల్లలా బిక్కుబిక్కుమని..విశాఖ నగరం..విశోఖ నగరం.
నాల్గురోజులనుండి ఉపగ్రహ చిత్రాలద్వారా అధ్యయనం చేస్తూ..రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ..అటు నాసా..ఇంకెవరెవరో ఒకటే హెచ్చరికలు. నష్టనివారణ చర్యలంటూ ఒకటే హడావిడి..బంగాళాఖాతంలో రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం క్రమంగా పశ్చిమ దిశగా పయనించి…
కనుక్కున్నాం..కనుక్కున్నాం..అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందే ప్రకృతి ప్రకోపాన్ని అంచనా వేయగల్గుతున్నాం ..మనుషులం మేం..బుద్ధిజీవులం..ఉపరితల ఆవర్తనాలు..వాయుగుండ కేంద్ర కదలికలు..దిశ..గమనం..తీవ్రత..వాయువేగ ఉధృతి..వగైరా.
కాని..అసలు..వాయుగుండం ఎందుకు ఏర్పడుతోంది..అది ఆ దిశలోనే ఎందుకు కదుల్తోంది..ఎవరు దాన్ని సృష్టిస్తున్నారు..ఎందుకు సృష్టించబడ్తోంది..అంత తీవ్రతే ఎందుకుంటోంది..ఇవన్నీ ప్రశ్నలు.
జి ఒ డి..గాడ్..డి ఒ జి..డాగ్.
కళ్ళు మూసుకున్నాడు సూర్యుడు.
లోపల పిడికెడు గుండె బంగాళాఖాతం కంటే మహోధృతంగా కొట్టుకుంటోంది. జీవితంలో మొట్ట మొదటిసారిగా భయం కలిగిందతనికి. బలమైన గాలితెప్పకు లేచిపోతున్న అట్టముక్కలా గజగజలాడిపోయాడు. కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే..అన్ని ర్యాక్స్ లో..కట్టలు కట్టలుగా పుస్తకాలు..ఫైళ్ళు..అన్నీ పరిశోధనా పత్రాలే.ఎవరెవరొవో.ఒక పెద్ద క్యూ తన దగ్గర..చుట్టూ తిరుగుడు రాత్రింబవళ్ళు.. జనం.. విద్యావంతులు.. హైలీ క్వాలిఫైడ్.
“ఇచట అన్ని రకముల ఎం ఫిల్..పి హెచ్ డి..థీసిస్ లు రాయబడును” అదీ వృత్తి తనదిప్పుడు.
బ్రాంచ్ ఏదైనా కానీ..సబ్జెక్ట్ ఏదైనా కానీ..గైడ్ ఎవరన్నా కానీ..యూనివర్సిటీ ఏదైనా కానీ..ఏ అభ్యర్థికైనా సరిగ్గా సరిపోయి డిగ్రీని సంపాదించిపెట్టగల మేధోపరిపుష్టత గల అన్ని రకాల థీసిస్ లను డా.సూర్యుడు రాసి పెట్టగలడు.
అసాధారణ మేధావి సూర్యుడు..ఎప్పుడూ గంజాయి తాగినట్టో..ఏ ఇతర లోకానికో చెంది ఈ భూమిపై అనాహ్వానిత అతిథిగా జీవిస్తూ..ఏదో తపస్సులోనో..మత్తులోనో..ధ్యానంలోనో..మరేదో మనకు చెందని అతీత లోకంలోనో తననుతాను కోల్పోయినట్టు..పిచ్చి పిచ్చిగా..పరాకు పరాకుగా..ఆబ్సెంట్ మైండెడ్ గా..కనిపించే సూర్యుడు,
చుట్టూ..మూడు కంప్యూటర్లు.
రోజూ ముగ్గురు ఆపరేటర్లు డిక్టేషన్ను తీసుకుంటారు వివిధ అంశాలపై.
జర్దా పాన్ ను నముల్తూ..కళ్ళు మూసుకుని రివాల్వింగ్ కుర్చీలో వెనక్కి వంగి..కాళ్ళు చాపుకుని స్టూల్ పై పెట్టి.. ఇక చెబుతాడు సూర్యుడు డిక్టేషన్..పేజీలకు పేజీలు నిరంతరాయంగా..ఒక ప్రవాహం.. ఫార్ములాలు.. సమీకరణాలు.. గణనాలు..ఒక అక్షర వర్షం..ఉధృతి.
అప్పుడు..ఆ క్షణం అతడు..యోగనిద్రలో ఉన్నట్టు..తపస్సిస్తూ ఏదో అశరీర వాణి వినిపిస్తున్నట్టు,

ఏక కాలంలో..ముగ్గురికి డిక్టేషన్..ధార..ప్రవాహం..ఒరుసుకుంటూ,
అప్పుడంతా నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది చుట్టూ. ఒట్టి ఆపరేటర్ల కీబోర్డ్ టకటకలు మాత్రమే వినిపిస్తూ,
అటు ప్రక్కన, ఇటు సూర్యుణ్ణీ.. ఆపరేటర్లనూ సమన్వయ పరుస్తూ..గీతిక.
ముప్పై రెండేళ్ళ డాక్టర్ గీతిక. గత పదేళ్ళుగా సూర్యుని వెంట.. సూర్యునితో..సూర్యుని నీడలా అనుక్షణం వెన్నంటి ఉండే గీతిక.
యూనివర్సిటీలు పూర్తిగా చెడిపోయేయి. విద్య పూర్తిగా వ్యాపారమైపోయింది.డిగ్రీలు పూర్తిగా నకిలీవైపోయి కల్తీ ఐపోయేయి.. విద్యా వ్యవస్థ కుళ్ళిపోయింది.
విద్యార్థులెవ్వరూ చదువుకొనడం లేదు. చదువును కొంటున్నారు. ఫేక్ డిగ్రీలు..ఫేక్ ఇంజనీర్లు..ఫేక్ లెక్చరర్లు..ఫేక్ మనుషులు.
వాడు డాక్టరేట్ చేస్తాడు..ఒక్క వాక్యం తప్పు లేకుండా రాయరాదు..మాట్లాడరాదు.సబ్జెక్ట్ అస్సలే తెలియదు.
హయ్యర్ ఎడ్యుకేషన్ ఒక ఫార్స్.పరిశోధనలు ఒట్టి మిథ్య.రిజిష్ట్రేషన్ దగ్గరినుండి అంతా పైరవీ. రిజిస్ట్రార్ కింత..గైడ్ సెలక్షన్ కు ఇంత..టాపిక్ సెలక్షన్ కు ఇంత..ఇక సినాప్సిస్ రైటింగ్ కు ఇంత..పైలట్ కాపీ థీసిస్ కు ఇంత..ఫైనల్ వర్షన్ థీసిస్ కు ఇంత..వైవా కు వస్తున్న ఎక్స్ టర్నల్ ప్రొఫెసర్ కు ఇంత..చివరికి డిగ్రీని అవార్డ్ చేస్తున్నపుడు ఇంత.అన్ని రేట్లే..ఇడ్లీ ఇంత,వడ ఇంత,దోశ ఇంత వలె.
విసిగిపోయి..చితికిపోయి..అలసిపోయి..అసలు “ఏమిటి.?”అన్న ప్రశ్నలతో కనలిపోయి.,
చేతన..అచేతన.అంతర్..బహిర్..లోపల బయట..చూపు..దృష్టి.
ఒక నిత్య సంఘర్షణ..అంతర్యుద్ధం.
ఎక్కడి కాలిఫోర్నియా యూనివర్సిటీ..మెసాచుట్స్..నాసా..వివిధ విద్యాలయాల్లో,
పోస్ట్ డాక్టోరల్ అధ్యయనాలు..ప్రయోగాలు..నిరూపణలు..విచికిత్సలు..చర్చలు.
చివరికి ఒక “ఆత్మాన్వేషణ”స్థితిలోకి జారిపోవడం..శిఖరంపై నుండి లోయలోకి.
మళ్ళీ ఒక ఘన సాంస్కృతిక,ఆధ్యాత్మిక,ఆత్మిక వారసత్వం గల భారతదేశానికే తిరిగి రావాలని తహతహ.”తెలుసుకోవాలని” జిజ్ఞాస.
సర్వైవల్..జీవిక..దైనందిన వ్యవహారం..ఇవీ.
భౌతిక..అభౌతిక అనివార్యతలు..పోరాటం.
అప్పుడప్పుడు చటుక్కున ఏ హిమాలయాల్లోకో నిష్క్రమణ. లేనిదాని గురించి ఉన్నదాంట్లో వెదుకులాట. పరి-శోధన.రీసర్చ్.ఉన్నదాన్నే మళ్ళీ మళ్ళీ వెదుకుట.
దేన్ని వెదుకుట..ఎప్పుడు వెదుకుట..ఎందుకు వెదుకుట.ఏ రకంగా వెదుకుట.
చివరికి వెదికేందుకు అసలు ఏదైనా ఉందా అనే ప్రశ్నలోకి వచ్చి నిలబడుట.
లోపలంతా కల్లోలం..నిరంతర అనంత కల్లోలం.
జ్ఞాన సముపార్జన ఒక తీరని దాహం.ప్రజ్వలితాగ్ని.
ఒక్కసారిగా ఆరోజే ముగ్గురు ఇంజనీరింగ్ డాక్టరేట్లకోసం ఉదయం నుండి ఇచ్చిన డిక్టేషన్ జ్ఞాపకమొచ్చింది సూర్యుడికి. మొత్తం నూటా అరవై పేజీలు.
మెకానికల్ ఇంజనీర్ ఒకడు..పి హెచ్ డి టాపిక్..”స్వార్మ్ రోబొటిక్స్”.
స్వార్మ్..కీటకాల గుంపు నివసించే పుట్ట.చీమల పుట్ట..పాముల పుట్ట.జీవకణాల పుట్ట.ఆలోచనల పుట్ట.
వ్యష్టిగా..సమిష్టిగా పుట్టవలె వ్యవస్థీకృతమై పనిచేసే మరమనుషుల ప్రవర్తన..ఫలితాలు..భవిష్యత్ అంచనాలు..ఒక కొత్త ఆవిష్కరణ.
మరో..థీసిస్..ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కు చెందింది..కాన్సెంట్రేటెడ్ సోలార్ పవర్ జనరేషన్.ఒక సమూహంగా సోలార్ ప్యానెల్స్ ను వలయాకృతిలో అమర్చి..ప్రపంచ ప్రసిద్ధి చెందిన విద్యుత్ ఉత్పత్తి నమూనాను తయారుచేసిన చిన్న దేశం..స్పెయిన్..2240 మెగావాట్స్.ఒక సాంకేతిక విప్లవం.భవిష్యత్తంతా సౌర శక్తి వినియోగమే.వేరే మార్గం లేదు.అదో కీలక అధ్యయనం.

ఇంకో..పరిశోధన గ్రంథం..ఆర్గానిక్ ఎలక్ట్రానిక్స్..ఆర్గానిక్ మాలిక్యూల్స్..పాలిమర్స్..వాహక ప్రవాహకతను.. కండక్టివిటీని ఉన్నతీకరించే ప్రయత్నం తో..1971 లో లీన్ చువా ప్రతిపాదించిన “మెమరిస్టర్” కు రూపకల్పన. ఇప్పటికే హెవెట్ పాకార్డ్ ఈ దిశలో ప్రయత్నిస్తోంది. ప్రయోగాలు చేస్తోంది.జ్ఞాపకాలను నిక్షిప్తపర్చి ఉంచే సాధనం. రూపొందితే ఒక విప్లవం.
ఎందుకో గీతిక జ్ఞాపకమొచ్చింది సూర్యుడికి.
ఎవరీమె..ఒకరోజు అలా పరిచయమై..సన్నిహితురాలై..అనుచరురాలై..ఇంకా.,
తనకన్నా రెండేళ్ళు పెద్దది.మనిషి మెరుపు.
వ్చ్..మనుషులు కొందరు ఎందుకు పరిచయమై..ఎందుకు చేరువై..ఎందుకు స్థిరపడిపోతారో..ఉహూ..అర్థంకాదు.
ఫెళ్ళున ఏదో విరిగి..కూలి..ధబాల్న పడిపోయిన చప్పుడు.
అప్పుడే కరెంట్ పోయింది లిప్తపాటులో..చీకటి చిక్కగా.
గదిలోనుండి బయటికి పరుగెత్తాడు సూర్యుడు.
ప్రక్కనున్న ముప్పై ఫీట్ల కొబ్బరిచెట్టు విరిగి కూలిపోయింది.ప్రక్కనే ఉన్న కరెంట్ తీగలపైబడి..చర్రున మంటలు.వర్షం..గాలి..హోరు..దూరంగా పతంగిలా ఆకాశంలో ఎగిరిపోతున్న సీతమ్మ ధార మూలమీది టాటా డొకొమొ హోర్డింగ్.సూర్యుణ్ణి గాలి బలంగా నెట్టి తన్నేసింది.పట్టుతప్పి వెళ్ళి పిట్టగోడకు గుద్దుకున్నాడు.
మోకాలికి దెబ్బతగిలి..ఎర్రగా రక్తం.తూలి పడిపోబోయి తమాయించుకుని,
అప్పుడు చూశాడు సూర్యుడు తలెత్తి తేరిపార.
తన జీవితంలో అంత భయంకరంగా ఆకాశాన్నీ,ఉగ్ర ప్రకృతినీ,వాయు ఉధృతినీ,బీభత్సాన్నీ ఎన్నడూ చూడలేదు.
పొద్దటినుండి ఈ థీసిస్ ల డిక్టేషన్ లలో నిమగ్నమై..లోకాన్ని మరచిపోయి.,
ఇపుడు ఏదో చేయిదాటి పోతున్నట్టు..మానవాతీత శక్తేదో వేటాడుతున్నట్టు..సకల వ్యవస్థ ఒట్టి నిశ్చేష్టగా మారి స్తంభించినట్టు.,
గాడ్.,
డాగ్.,
డు.,
ఇటెరేషన్ ప్రాసెస్.
అసలు తుఫాన్లు ఎందుకేర్పడ్తున్నాయి. శూన్యం ఏర్పడి..పీడన అసమానతలేర్పడి..శక్తి తారతమ్యాలేర్పడి.. అసమ తన్యతలతో.,
సమతౌల్యం లోపిస్తోంది అన్ని జీవన రంగాల్లో.దృశ్యాదృశ్య జీవన వ్యవస్థల్లో.విధానాల్లో.
అందుకే ఏదో మనిషికి తెలియని అజ్ఞాత అతీత శక్తేదో ఈ హెచ్చుతగ్గులను సవరిస్తూ ఏకపరుస్తోందా.? సమపరుస్తోందా.?
ప్రకృతి తనను తాను సవరించుకుంటూ..పర్యావరణాన్ని సవరిస్తూ..హెచ్చుతగ్గులను సమపరుస్తూ..సకల సృష్టి పాలననూ నియంత్రిస్తోందా.
ఐతే సహజ సృష్టి ప్రవర్తనను భంగపరుస్తున్నదెవరు.అతి సహజరీతిలో తనదారిన తాను వెళ్తూ ఈ అఖిల చరాచర జగత్తును సౌందర్యమయం చేస్తున్న ప్రకృతిని ధ్వంసం చేస్తున్నదెవరు.ఈ భంగపాటు కేవలం భౌతికమైందేనా.చెట్లను నరుకుట..అడవులను హరించుట..పర్వతాలను ధ్వంసించుట..సముద్రాల గర్భంలో అణుపరీక్షలు జరిపి సాగర గర్భశోకాన్ని మిగుల్చుట..అంతరిక్షంలో విస్ఫోటనాలు జరిపి సమతుల్యతను పటాపంచలు చేయుట..ఇవన్నీ ఏమిటి.
ఇవేగాక..మనుషుల్లో ప్రకృతి పరంగా నిర్దేశించబడిన సహజ ధర్మ,నైతిక,న్యాయ అనువర్తనల మాటేమిటి. రోజురోజుకూ మితిమీరిపోతున్న మానవుల అవినీతి ప్రవర్తన,ఆపేక్షలు,హద్దుమీరిన సుఖలాలసత,అనైతిక అక్రమ కాంక్షలు,హద్దులులేని ధన వ్యామోహం,అధర్మ చింతన ఇవన్నీకూడా ప్రకృతి ప్రకోపానికి కారణం కావా.
ధర్మో రక్షతి రక్షితః
ధర్మాన్ని మనిషి రక్షించలేని నాడు ధర్మం మాత్రం మనిషిని ఎందుకు రక్షిస్తుంది.ఎందుకు రక్షించాలి.
సూర్యుడు అలాగే ఆ చీకట్లో..భీకరమైన వర్షంలో..ప్రచండమైన గాలిలో..తడుస్తూ..నిశ్చేష్టుడై నిలబడ్డాడు.
6
చుట్టూ..ఒకటే భయంకరమైన హోరు.
ముందు తనను తాను పరిశీలించుకుంటున్నాడు ఆ క్షణం.
తన చదువు..తన ఉన్నత ఉద్యోగాలు..ఆ ఉద్యోగాల్లో లభించని ఆత్మ తృప్తి..పరుగు..వెదుకులాట..ఆపేక్ష..ఇంకా ఇంకా ఏదో కావాలి.ఏదో చేయాలి.ఎక్కడికో అందని ఎత్తుకు చేరాలి.
ఏమిటా ఎత్తు..ఎక్కడుందా గమ్యం.
ఈ అనిశ్చిత తత్వంతో..తన మేధోశక్తిపై మితిమీరిన విశ్వాసంతో,
తనకిప్పుడు విపరీతమైన మార్కెట్.
ఏ థీసిసైనా సూర్యుడు రాస్తాడు..ఏ నూతన ఆవిష్కరణకు సంబంధించిన విషయాన్నైనా నూతనంగా ఎవరికీ చిక్కకుండా కాగితంపై అక్షరీకరిస్తాడు.యాన్ ఇంటలెక్చువల్ రౌడీ.మేధో రాక్షసుడు..సూర్యుడు..సూర్యుడు ద అకడెమిక్ కిల్లర్.
సూర్యుడు చాలా కాస్ట్లీ.లక్షలకు లక్షలు తీసుకుంటాడు.కాని..పని పర్ఫెక్ట్ గా చేస్తాడు.ఏ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూ దొరకని జిమ్మిక్కులు జొప్పిస్తాడు.మనిషిని తికమకపర్చి ఛంగున జింకపిల్లలా అవతలికి దూకివెళ్తాడు.అంతిమంగా ఎం ఫిలైనా..పి హెచ్ డి ఐనా గ్యారంటీగా తెప్పిస్తాడు.
ఐతే..ఇదంతా నైతికమా..అనైతికమా..టిట్ ఫర్ టాట్ సిద్ధాంతమా..అంటే,
తుఫాను ముంచుకొస్తున్నప్పుడు తప్పించుకుని పరుగెత్తి పరుగెత్తి తనను తాను రక్షించుకోవడమే కర్తవ్యం.
పరుగులో ఉన్నప్పుడు విచక్షణ ఉండదు.గమ్యమే పరమావధి.
గమ్యం..గమ్యం.
మళ్ళీ జ్ఞాపకమొచ్చాయి సూర్యుడికి ఆ మూడక్షరాలు జి ఒ డి.
‘ జి ఒ డి’…గాడ్..భగవంతుడు..భగవంతురాలు.
‘ డి ఒ జి.’.డాగ్..కుక్క.
‘ డి ఒ’..డు..చేయుము.
చివరికి,
‘జి ఒ.’.గో.వెళ్ళుము.
ఎక్కడికి వెళ్ళుము.
ఎక్కడికో ఓ దగ్గరికి..నీనుండి నువ్వు విముక్తమౌతూ..వేరే ఎక్కడికో ఎవరితోనో సంయుక్తమౌతూ..ఉన్నచోటినుండి వేరే ఎక్కడికైనా,
‘గో’..వెళ్ళుము.అంతే.
సూర్యుడు..బీభత్స తుఫాన్ విశాఖ నగరాన్ని తన రాక్షస బాహువుల్లో ఛిద్రం చేస్తున్న ఆ అర్థరాత్రి వర్షంలో తడుస్తూ..ఒకటొకటిగా మెట్లు దిగి..దిగి..రోడ్దుపైకొచ్చి,
నడుస్తున్నాడు.
అన్నీ..కూలిన విద్యుత్ స్తంభాలు..తెగి అస్తవ్యస్తంగా పడున్న వైర్లు..పడిపోయిన వృక్షాలు..నేలకూలిన హోర్డింగ్ లు..వాన నీటికి కొట్టుకొచ్చిన మోటార్ బైక్ లు..మోకాళ్ళ లోతున అరుస్తూ ప్రవహిస్తున్న వర్షపు మురుగు నీరు.
చెవులు పగిలే అతిధ్వనులతో దద్ధరిల్లుతున్న గాలి హోరు.
తుఫాను మెల్లమెల్లగా బయటినుండి సూర్యుడి మనసులోకి..హృదయంలోకి ప్రవేశిస్తోంది.
దూరంగా గర్జిస్తూ..సముద్రం..బంగాళాఖాతం..కబడ్డంలేదు..కాని వినబడ్తోంది..భీకరంగా శ్వాసిస్తూ. *

4 thoughts on “ఒక తుఫాను..ఒక నగరం..ఒక మనిషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *