May 4, 2024

ఇసీకో ప్యార్ కహతే హైఁ – పారసీక ఛందస్సు – 8

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

ఈ మధ్య “హై అప్నా దిల్ తు అవారా న జానే కిస్ పె ఆయేగా”

అనే పాటను వినడము జరిగినది. ఈ పాటలోని పల్లవి నన్ను ఆకర్షించినది. దాని అమరికలో పదేపదే ఒక హ్రస్వము (లఘువు), మూడు దీర్ఘములు (గురువులు) ఉండేటట్లు తోచినది. శ్రీ హేమంత్ కుమార్ పామర్తిగారు, పల్లవి మాత్రమే కాక పాటంతా ఇదే ఛందస్సులో ఉండే ఒక ఉదాహరణమును ఎత్తి చూపారు.

ఆ పాట –


తెరీ దునియామె జీనేసే తొ బెహతర్ హై కి మర్ జాయే
వహీ ఆంసూ వహీ ఆహే వహీ గం హై జిధర్ జాయే

కులాధారీ అనే వృత్తపు అమరిక ఇట్టిదే. క్రింద కులాధారికి నా ఉదాహరణములు –

కులాధారీ – య/ర/గగ IUUU – IUUU
8 అనుష్టుప్పు 18

వనమ్మందున్ విరుల్ జూడన్
మనమ్మందున్ విరుల్ జూడన్
కనంగా సత్కవిత్వమ్మే
మనంగా రా కులాధారీ

అలాగే రా చలాకీగా
విలాసాలే విచిత్రాలై
కళారూపమ్ముగా నాకై
జ్వలించంగాఁ బ్రియా యాశల్

చిదానందాకృతీ దేవా
మదిన్ నీవే సుధాధారా
నిధుల్ నీవే జగమ్మందున్
వ్యధల్ బాయన్ స్మరింతున్ నిన్

సరోజాక్షా సునీలాంగా
సరోజాస్యా సుహృద్భావా
సిరుల్ పాదమ్ములే గావా
చిరమ్మై బ్రోవఁగన్ రావా

ఈ పాదములను ద్విగుణీకృతము చేసి వ్రాసినప్పుడు పాదమునకు 16 అక్షరములు ఉంటాయి. అట్టి వృత్తము ఛందశ్శాస్త్రములో లేకున్నను, మనము కల్పించవచ్చును. దానిని నేను “ప్రకాశ” అని పిలువ దలచినాను. ప్రకాశ వృత్తమునకు నా ఉదాహరణములు –

ప్రకాశ – య/ర/త/మ/య/గ IUUU IUUU – IUUU IUUU
16 అష్టి 4370

అనంతమ్మీ ఖగోళమ్మా – అనంతమ్మీ ప్రపంచమ్మా
అనంతమ్మీ స్వరూపమ్మా – అనంతమ్మీ ప్రకాశమ్మా
అనంతమ్మీ యనంగమ్మా – అనంతమ్మీ విచారమ్మా
అనాంతమ్మా అశేషమ్మా – అచింత్యమ్మా అదూరమ్మా
(అనంగము=మనసు)

వెలింగెన్ దారలా నింగిన్ – బ్రియా నా కంధకారమ్మే
కలల్ రావే కనుల్ మూయన్ – గవిత్వమ్ముల్ విషాదమ్మే
చలించెన్గా మనస్సిందున్ – సదా నీకై చెలీ రావా
అలల్గాఁ జింతనల్ రాత్రిన్ – హసించంగా సకీ రావా

ఇదే పాటగా –
వెలింగెను తారలా నింగి- ప్రియా నా కంధకారమ్మే
కలలు రావే కనులు మూయ – కవిత్వమ్మువిషాదమ్మే
చలించెన్గా మనస్సిందు – సదా నీకై చెలీ రావా
అలల్గాఁ జింతనలు రాత్రి- హసించంగా సకీ రావా

పద్యములోని న-కర, ర-కారపు పొల్లులు ఇందులో లేవు. అందుకు బదులుగా గురువు స్థాన్ములో రెండు లఘువులు (గెన్->గెను, లల్->లలు, ఇత్యాదులు) కొన్ని చోటులలో ఉన్నాయి. కొన్ని వేళలలో హ్రస్వమును పొడిగించి దీర్ఘము చేయాలి పాడేటప్పుడు (నింగి->నింగీ, మూయ->మూయా, ఇత్యాదులు).

దీనినే సామాన్య యతికి బదులు ప్రాసయతితో కూడ వ్రాయవచ్చును. దానికి ఒక ఉదాహరణము –

విరుల్ బూయన్ వసంతమ్మే – మరుల్ బొందన్ వసంతమ్మే
సిరుల్ నిండన్ వసంతమ్మే – ధరన్ నేఁడే వసంతమ్మే
విరాజిల్లెన్ వసంతమ్మే – స్వరాలెం దీ వసంతమ్మే
స్మరుండుండన్ వసంతమ్మే – వరించంగా వసంతమ్మే

ఇదే పాటగా –
విరులు బూయవసంతమ్మే – మరులు బొంద వసంతమ్మే
సిరులు నిండ వసంతమ్మే – ధరను నేఁడే వసంతమ్మే
విరాజిల్లెను వసంతమ్మే – స్వరాలెం దీ వసంతమ్మే
స్మరుండుండవసంతమ్మే – వరించంగా వసంతమ్మే

రెండింతలైన “కులాధారీ” వృత్తమును లేక నేను కల్పించిన “ప్రకాశ” వృత్తమును పారసీక / ఉర్దూ భాషలలో “హజజ్ ముసమ్మన్ సాలిం” అంటారు. “హజజ్ ముసమ్మన్ సాలిం” ఛందస్సుకు నాలుగు (IUUU) గణములు ఉండాలి. “కులాధారి”కి పాదములో రెండే. “కులాధారి” రెండు పాదములను చేర్చినప్పుడు మనకు ఆ ఛందస్సు సిద్ధిస్తుంది. నాలుగు IUUU గణములతో ఉండే వృత్తము నేను కల్పించిన “ప్రకాశ” వృత్తము. గజలులలో ఒక మౌలిక ఛందస్సును సూచిస్తారు. ఇక్కడ అది IUUU IUUU IUUU IUUU. కాని వ్రాసేటప్పుడు మాత్రా ఛందస్సులో ఆ లయ ఉండేటట్లు వ్రాస్తారు. అంతే కాక హ్రస్వములను దీర్ఘములుగా మార్చుట, దీర్ఘములను హ్రస్వములుగా మార్చుట సర్వసాధారణము. ఈ IUUU గణమును మ-ఫా-ఈ-లున్ అని పిలుస్తారు. కాబట్టి ఈ ఛందస్సు సూత్రము మ-ఫా-ఈ-లున్ / మ-ఫా-ఈ-లున్ / మ-ఫా-ఈ-లున్ / మ-ఫా-ఈ-లున్. వాళ్లు దీనిని -=== / -=== / -=== / -=== అని వ్రాస్తారు. సామాన్యముగా పాదపు మధ్యలో ఒక విరామ యతి (pause) ఉంటుంది.

క్రింద ఈ ఛందస్సులో నేను వ్రాసిన ఒక గజల్ పాడుకొనవచ్చును. ఇందులో పై ఛందస్సు లయ మాత్రమే ఉన్నది. కొన్ని చోటులలో ఒక గురువుకు బదులుగా రెండు లఘువులు వాడాను. పాదము మధ్యలో మాత్రము విఱుపు తప్పని సరిగా ఉండాలి. అప్పుడే పాడుకొనుటకు బాగుంటుంది.

అదే నింగి అదే నేల – అదే బ్రదుకు వృథాయేనా
సదా నిన్నే తలంచేను – సకీ బ్రదుకు కథయ్యేనా

మనస్సేమో నినే పిల్చె – మహాదుఃఖమ్ము నాకేనా
వినా నీవు ప్రపంచమ్ము – విషాదమ్మౌ కథయ్యేనా

విలాసాలు వినోదాలు – విచిత్రమ్మౌ కలయ్యేనా
విలాపాల సముద్రమ్మే – ప్రియా నేడు కథయ్యేనా

సుగమ్మే లేదు మోహన యీ – సుధాస్రోతస్సు యెండేనా
జగమ్మందు తమమ్మెందు – సగమ్మే యీ కథయ్యేనా

హస్రత్ జైపూరీ వ్రాసిన
నజర్ ముఝ్‌సే మిలాతీ హో తొ తుం శర్‌మా-సి జాతీ హో
ఇసీకో ప్యార్ కహతే హైఁ ఇసీకో ప్యార్ కహతే హైఁ

దీనిని ఇక్కడ వినవచ్చును –

భాషలు వేఱుగా నుండవచ్చును, కానీ ఛందస్సు ఒకటే, లయ ఒకటే, సంగీతము ఒకటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *