May 3, 2024

వెటకారియా రొంబ కామెడియా 9 .. కరెంట్ కోతలు

రచన: మధు అద్దంకి

పవర కట్

ఉస్సురంటూ ఇంటికొచ్చి కూలబడ్డాడు పా.రా ( పాపారావు) సాయంత్రం 5 గంటలప్పుడు..

“ఏమేవ్ ఎక్కడ చచ్చావ్ ? కాసిని మంచినీళ్ళు నా మొహాన పడేయ్” అనరిచాడు పా.రా..

“మీకు నీళ్ళివ్వడానికి నేను చావడమెందుకూ?  నిక్షేపంలా బతికే ఉన్నా ..ఇంద కాచ్” అని అతని మీదకి నీళ్ళ చెంబు విసిరింది సు.ల(సుబ్బ లక్ష్మి)

నీళ్ళన్నీ పా.రా మీద పడ్డాయి. చెంబు పాదం మీద పడి “కుయ్యోయ్” అని ఒక్క గెంతు గెంతాడు..అమ్మో దీనికి కోపమొచ్చేలా ఉంది అనుకుని ” హి హి హీ..నువ్వు భలే చిలిపి సు.ల ” అన్నాడు..

” సరే కాని బయట ఎండ మండిపోతోంది కాస్త మజ్జిగ నీళ్ళివ్వు” అన్నాదు పా.రా

“సరే” అంటూ ఒక గ్లాసుడు మజ్జిగ తెచ్చింది.. “ఇంద తీసుకోండి” అని చేతికిచ్చింది..

మజ్జిగ ఒక్క గుక్క తాగాడో లేదొ ” కుయ్యో” అని ఒక్కరుపు అరిచాడు..

“మళ్ళా ఏమయ్యిందండీ? మజ్జిగ తాగటానికి అంతలేసి కేకలెందుకు వెయ్యడం “అంటూ ఒక్క టెంకి జెల్ల ఇచ్చింది సు.ల.

“ఇలా నువ్వు జెల్లకాయలిస్తుంటే నేను బయటికి పోయి ముంజకాయ్ తినొస్తా” అంటూ బయటకి పోబోయాడు పా.రా

“చాల్లే ఆపండి మీ సరసం” అని బుగ్గ మీద ఒక్క పోటు పొడిచింది.. చిల్లిగారెలా బుగ్గ చిల్లడిందేమో అని దడుచుకున్నాడు పా.రా..అమ్మో దీనితో చమత్కరించడం డేంజర్ అనుకున్నాడు బుగ్గ తడుముకుంటూ..

“ఇంతకీ మజ్జిగ తాగుతూ ఆ వింత సవుండేంటి చెప్తారా మళ్ళా బుగ్గ మీద ఒక్క పోటు పొడవనా” అనడిగింది సు.ల

” హి హి హీ నువ్వు భలే చిలిపోయ్” అంటూ చల్లని మజ్జిగ తెమ్మంటే పొయ్యి మీదనుండి తెచ్చావేంటి? ఆ మజ్జిగ తాగి నాలుక కాలింది..మరీ ఇంత చిలిపితనం పనికిరాదోయ్” అన్నాడు పా.రా.

గాడిద ఎక్కిళ్ళు పడుతున్న శబ్దం విని “ఉండు గాడిదలని తోలోస్తా బయటకి” అని వెళ్ళబోయాడు పా.రా.

జబ్బుచ్చుకుని ఒక్క లాగు లాగింది సు.ల అంతే గోడకి కొట్టుకుని బంతిలాగ వెనక్కి పడ్డాడు పా.రా..

“ఇదే నీతో వచ్చిన గొప్ప చిక్కు..భలే చిలిపిగా హింసిస్తుంటావ్” అని కాస్త చెయ్యందించు అనబోయి వొద్దులే చెయ్యి ఊడి చేతిలోకొస్తుందేమో అని భయపడి నెమ్మదిగా తనే ఎలాగోలా కష్టపడి లేచి నించున్నాడు..

“మరి నేను నవ్వితే గాడింద ఎక్కిళ్ళు పెట్టింది అనుకుంటే భలే నవ్వొచ్చిందండీ” అని మళ్ళా ఎక్కిళ్ళు పెట్టింది సు.ల

“సరే నీ గార్ధబ స్వర సంకీర్తన ఆపుతావా? నేను చెప్పినదానికి నువ్వు మరీ ఇలా ఎక్కిళ్ళు పట్టి మరీ ఏడిపించాలా నన్ను?”

” మీ అమాయకత్వానికి నవ్వొచ్చిందండీ.. ఎండాకాలంలో మజ్జిగెక్కడన్నా చల్లగా ఉంటుందా? వేడిగా నోరు కాలేట్టుంటుంది కాని”…అసలే కరెంట్ కోతలు..ఇంక ఫ్రిజ్ లో మజ్జిగ ఎలా చల్లబడుతుందీ?” అన్నది సు.ల

“అదీ పాయింటే కాని కుండ ఉండాలి కద మనింట్లో..” అనడిగాడు పా.రా..

“మరే మన కుండని మన పక్కింటివాళ్ళకి అద్దెకిచ్చానండీ రోజుకి 2 రూపాయలు అద్దె.. ఎలా ఉంది నా తెలివి” అనడిగింది సు.ల

“ఇది తెలివి కాదు గెలివి. ఈ రోజుల్లో కుండని కొనడమంటే హిమాలయాన్ని కొనుక్కోవడమే అది కూడ వాళ్ళకి ముష్టి రెండు రూపాయలకి అద్దెకిస్తావా? రోజుకి కనీసం ఐదు రూపాయలన్నా అద్దె ఉండాలి గాని” అన్నాడు పా.రా..

“నిజమేనండోయ్ నాకు తట్టలేదు సుమీ.. ఉండండి మన కుండ తెచ్చేస్తా అద్దెతో సహా” అంటూ దడదడలాడిస్తూ బయటకి పరిగెత్తింది సు.ల

“దీనికేమొచ్చినా పట్టలేం” అనుకుంటూ కూలబడ్డాడు పా.రా బుగ్గ తడుముకుంటూ…

రాత్రికి డిన్నర్ టయిం అయ్యింది. టేబిల్ ముందు కూర్చోంగానే పవర్ కట్..

హారి భగవంతుడా ఈ టయింలోనే పోవాలా అనుకుంటూ ” ఏమోయ్ కాస్త కాండిల్ తీసుకురా అన్నాడు” పారా

మళ్ళా ఎక్కిళ్ళ చప్పుడు వినిపించింది..

“ఎందుకు అలా నవ్వుతున్నావు” అనడిగాడు పా.రా.

“మీ అమాయకత్వానికి నవ్వుతున్నా” అన్నది సు.ల

“కాండిల్ అడగటంలో అమాయకత్వం ఏముంది ” అనడిగాడు పా.రా

“అమాయకత్వం కాక మరేమిటి ఈ కరెంటు కోత సమయాల్లో కాండిల్స్ కి బాగా గిరాకి కదా అని ఎదురింటి వాళ్ళకి అద్దెకిచ్చానండీ” అన్నది సు.ల

“ఓసి నిన్ను తగలెయ్య కాండిల్స్ అద్దెకివ్వటమేంటే మనం ఎలా తినేది? కళ్ళూ లేని కబోదుల్లా ఈ బతుకేమిటి చీకట్లో”అనరిచాడు పా.రా

“ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదండీ అందుకే నా మొహంలో కాంతితో మీరు భోంచెయ్యండి” అన్నది సు.ల

” ఈ సామెతలు కనిపెట్టిన వాడు ఎక్కడన్నా దొరికితే బాగుండు ..వాడిని కుళ్ళబొడిచెయ్యాలి” అనుకున్నాడు పా.రా.

” ఇదంతా జరిగే పని కాదు కాని అన్నం ఎలా తినాలో ఈ చీకట్లో చెప్పి ఏడు” అని విసుక్కున్నాడు పా.రా

” కబోదులు తిన్నట్టు తినడమే అన్నీ తడుముకుని” అని ఠపీమని చెప్పింది సు.ల

“మరైతే అమ్మా నేను ఎలా చదువుకోను తడుముకుంటూ” అన్నాడు వారి ముద్దుల పుత్రరత్నం ఏ.కొ( ఏడుకొండలు)

భలే చిలిపి..నీకన్నీ మీ అమ్మ బుద్ధులే ” అని వాడిని తడిమి వాడి బుగ్గ మీద కూడ ఒక్క పోటు పొడిచింది సు.ల

” అంబా ” అంటూ రంకె పెట్టాడు ఏ.కొ.

ఆ రంకెకి సు.ల , పా,రా బిత్తరపోయి తత్తరపడి “ఎందుకురా అలా అరిచావు” అనడిగారు..

“అసలే ఒక పక్క కరెంట్ పోయి నేనెడుస్తుంటే బుగ్గ మీద పోటు పొడుస్తుందా?” అని మళ్ళా ఒక రంకె వేశాడు..

“సరే సరే ఇంకెప్పుడు పొడవనులే ముందు అన్నం తిను” అంది సు.ల

తడుముకుంటూ చేతికి జిగురుగా ఉన్న పదార్ధం నోట్లో పెట్టుకుని ఏమిటీ విచిత్ర పాకం ” అనడిగాడు పా.రా

అదా..దాని పేరు “కూపాపు..” అనంది సు.ల

” అదేం పేరు? చండాలంగా ఉంది” అన్నాడు పా.రా

“అమ్మా” మళ్ళీ రంకేశాడు ఏ.కొ.. “మర్యాదగా ఇదేంటో చెబుతావా ఇలా రంకెలు వేస్తూనే ఉండనా” అన్నాడు.

“వద్దురా నువ్వనవసరంగా ఆవేశపడకు..నేను చెప్తాలే..”

“అది బీరకాయ కూర చేద్దామనుకుని పొయ్యి మీద పెట్టాక కరెంట్ పోయింది. వేగి వేగి ఇగురు, పచ్చడి అయ్యింది తర్వాత చింతపండు నీళ్ళు పోస్తే పులుసయ్యింది.. మూడు వంటకాలు ఒకే దానిలో ఉన్నాయి గనుక దానిని కూపాపు అని పిలుస్తున్నా” అన్నది సు.ల

“నువ్వు ఏమైనా  పిలుచుకో గాని దీన్ని మేము తినలేము” అని పక్కన పడేశారు..

పెరుగన్నం కలుపుకు తిందామనుకుంటే అన్నం చల్లగా పెరుగు వేడిగా ఉండి అదొక రకమైన వాసనతో తినలేకపోయారు..

ముక్కు మూసుకుని గబిక్కిన రెండు ముద్దలు తిని వేడి నీళ్ళు తాగి లేచారు..

అట్టా తడుముకుంటూనే వంటిల్లు చక్కబెట్టి గదిలోకొచ్చింది సు.ల..ఏ.కొ అప్పటికే వాడి మంచమెక్కాడు..

తడుముకుంటూ వెళ్ళి మంచమ్మీద కూర్చుంది సు.ల.

“కుయ్యోఅయ్” అని మళ్ళా అరిచాడు పా.రా

ఎందుకండీ ఆ కుయ్యోలు అనడిగింది సు.ల

“ముందు నా పొట్త మీదనుండి లేస్తావా..చస్తున్నాను” అని సు.ల ని ఒక్క తోపు తోశాడు పా.రా

తోసి కడుపు పట్టుకుని మెలికలు తిరిగిపోయి శాపనార్ధాలు పెట్టాడు భార్యని కనీసం కాండిల్ అయినా ఇంట్లో ఉంచనందుకు..

నొప్పి నెమ్మదించాక మళ్ళా పడుకుందామనుకుని. భార్యని పిలిచాడు” ఏమోయ్ పడుకున్నావా లేక మళ్ళా తడుముకుంటున్నావా” అని..

“నేను పడుకున్నా, మీరు పడుకోండి” అన్నది సు.ల.

అప్పుడే నిద్రపడుతున్న పా.రా కి ఎవరో గిచ్చినట్టు అనిపించి “ఏమిటి ఎందుకు గిల్లుతున్నావు” అనడిగాడు భార్యని

“నేను గిల్లడమేంటండీ మీరే ఇందాకటినుండి నన్ను గిల్లుతున్నారు, రక్కుతున్నారు” అన్నది సు.ల

నువ్వంటే నువ్వని వారు వాదించుకుంటుండగా  ఒక్క  రంకె వేశాడు ఏ.కొ.” ఆపుతారా మీ నస.. ఒకళ్ళనొకళ్ళు గిల్లుకోవడం కాదు మనల్ని దోమలు గిల్లుతున్నాయి.మాట్లాడకుండా పడుకోండి” అన్నాడు..

గమ్మున పడుకున్నారు భార్యా భర్తలు రాత్రంతా గోక్కుంటూ, కరెంటు కోతలకి కారణమయిన వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టుకుంటూ..

ఈ విధంగా తినడానికి తిండి, నిద్ర కూడ కరువయ్యి జబ్బు పడి ఎండాకాలమంతా అవస్థలు పడ్డారు..తరువాత వర్షాకాలం కదా హమ్మయ్యా అనుకుంటూంటే వరదలు ముంచెత్తాయి..

 

ఇవండీ మన జనాలు కరెంట్ కోతల వల్ల  పడే కష్టాలు..

1 thought on “వెటకారియా రొంబ కామెడియా 9 .. కరెంట్ కోతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *