May 1, 2024

ఓ మహిళా మేలుకో …

రచన: సరిత భూపతి

భూమ్మీదకు రాకముందే
యంత్రంతో వెతికి మరీ చంపుతాం

పొరపాటున భూమ్మీద పడితే
గొంతులో వండ్లగింజ వేసి చంపుతాం

అలా కూడా బతికి బయటపడితే
ఆసిడ్ పోసి చంపుతాం

కోరిందివ్వకపోతే
కామంతో చంపుతాం

పైశాచిక ఆనందంతో
సూదులు గుచ్చి చంపుతాం

మాకు మేమే వెల కట్టుకొని
వరకట్నం అడిగి చంపుతాం

ఇవ్వకపోతే సిగేరేట్ లతో
కాల్చి చంపుతాం

ఆ వాడినే మగాడినే ….
కరడుగట్టిన పురుషహంకారంతో విర్రవీగుతున్న మగాడినే

పుట్టగానే నీ రొమ్ము పాలు తాగుతూ
నీ గుండెల మీద తన్నిన వాడినే

దాన్ని నువ్వు అపుడు సంతోషంగా స్వీకరించావు
నువ్వు ఇచ్చిన అలుసే కదమ్మా ఇదంతా ……

ఓ మహిళా మేలుకో …

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః” అన్నది ఓ ఆర్యోక్తి . ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించ బడతారో అక్కడ దేవతలు తాండవిస్తారని దాని అర్థం. పూజించటం సంగతి పక్కన పెడ్తే అసలు స్త్రీని ఒక మనిషి గా అయినా చూస్తుందా ఈ సమాజం ??? స్త్రీ అనే పదం గురించి సంభాషించవలసి వస్తే కొన్ని లక్షల పదాలు కూడా పూర్తిగా వివరించలేవేమో …భూదేవి తో పోలుస్తారు స్త్రీ ని అంత సహనశీలి అనో లేక ఉచ్చ పోసినా , ఉమ్మేసినా భూమి నిశబ్దంగా ఉన్నట్టే ఆమె కూడా ఏం చేసినా నిశబ్దంగా ఉంటుందనో కాబోలు !

ఇరవై యేళ్ళు అల్లారుముద్దుగా కూతురుని పెంచి , విద్యాబుద్ధులు నేర్పితే … పెళ్లి అనే రెండక్షరాల పదం కోసం, తాళి అనే రెండు సూత్రాల తాడు కోసం ఆ లైసెన్స్ కి కట్టుబడి ఉండేది స్త్రీ ….

ప్రేమ అని ఒకడు , కామంతో ఒకడు , వరకట్నం అని ఒకడు , పురుషహంకారంతో ఒకడు. ఇవీగాక ఆడపిల్ల పుడ్తే కొంపలు మునిగిపోతాయేమో అని భ్రూణ హత్యలు , అత్త పోస్ట్ లో అహంకారాలు, చెడు అనుమానాలు , ఉద్యోగం చేస్తే బయట వేదింపులు , చేయకపోతే ఇంట వేధింపులు , చదువుకున్న స్త్రీ ఉద్యోగం చేయాలనుకుంటే వంటిల్లే మేలనే హితబోధలు ఇలా ఎన్నో ఎన్నెన్నో …. నచ్చిన బట్టలు వేస్తే తప్పు , బయటికి వెళ్తే తప్పు , నచ్చినట్టు ప్రవర్తిస్తే తప్పు అడుగడుగునా అవమానాలు …. చావటానికి కారణాలెన్నో … మరి బతకటానికి అవకాశం ఏది??? మరి చావా స్త్రీ కి స్వతంత్రం?? …… కాకూడదు ……. కాకూడదు ……….

ప్రతీ మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు … ప్రతీ ఆడదాని చావు వెనుక ఒక మగాడు ఉన్న సమాజం ఇది … కాదంటారా???

“అర్దరాత్రి నడిరోడ్డు పై మహిళ ఒంటరిగా నడవగలిగినప్పుడు దేశానికి స్వతంత్రం” అని గాంధీజీ అన్నారు పట్టపగలు ఒంటరిగా నడవటానికి భయపడాల్సిన లోకం ఇది … ఇంకా స్త్రీ అర్దరాత్రి ఒంటరిగా నడిచేది ఏనాడు? దేశానికి స్వతంత్రం ఏనాడు???

మనిషి ఒక మృగంగా కాకుండా మనిషి గా ఆలోచించినపుడే దేశానికి స్వతంత్రం ..అదే మహిళా స్వతంత్రం ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *