May 4, 2024

గౌసిప్స్!!! Dead people don’t speak-4

రచన: డా. శ్రీసత్య గౌతమి

ఏరన్ చూస్తుండగానే ఆ అబ్బాయి బొమ్మ ఫేన్ డయల్ పైనుంచి మాయమయిపోయింది. ఆశ్చర్యంతో కళ్ళు నులుముకొని చూశాడు, అక్కడ ఏమీ కనబడలేదు. మొదటినుండి ఆలోచించడం మొదలుపెట్టాడు తనకెప్పుడూ ఇలా జరగలేదు. అనైటా ఈ కేసు వివరాలు వివరించిన దగ్గిరనుండి ఇలాంటివి జరుగుతున్నాయి, తానింకా అసలు కేసులోనే దిగలేదు, ఆ సమాధి దగ్గిరకే వెళ్ళలేదు, ఏమిటి? ఈ హోటల్ కి ఆ బోయ్ చావుకి ఏదైనా సంబంధాలున్నాయా? నా రూమ్ కి ఇప్పుడు ఎవరు ఫోన్ చేసారు? నేనీ రూమ్ లో ఉంటున్నాననే విషయం ఎవరికి తెలుసూ? కనీసం అనైటాకి కూడా తెలియదే! అప్పుడు మెరుపులాగ ఆలోచన తట్టింది. రిసెప్షన్ లో రూబీ, అమాండా వచ్చి వెళ్ళిందని, తన గురించి వివరాలు అడిగిందని, రూమ్ నెంబర్ కూడా తెలుసుకుందని. వెంటనే ఒక్క ఉదుటున లేచి జోళ్ళేసుకుని, గబ గబా నడుచుకుని వెళ్ళాడు రిసెప్షన్ వైపు. రూబీ కనబడలేదు, అసలా సీటులో ఎవరూ లేరు. వెనక్కి తిరిగి చుట్టూ చూశాడు. ఈలోపల లోపలి గదినుండి మేల్ రిసెప్షన్ వచ్చాడు.

“మే ఐ హెల్ప్ యూ సర్”… అడిగాడు (మాలే భాషలో)

“గంట క్రితం, రిసెప్షన్ లో రూబీ అనే అమ్మాయి ఉంది. ఆమెతో మాట్లాడాలి. తను ఉందా?” మాలే లోనే అడిగాడు ఏరన్.

“తను డ్యూటీ దిగిపోయి వెళ్ళిపోయింది. నేనేమైనా సహాయ పడగలనా? మై నేమ్ ఈస్ ఇవాన్”….

“యస్.. యు కెన్.. నాకోసం అమాండా అనే వ్యక్తి వచ్చి వెళ్ళిందిట. నేనికా అప్పటికి రూమ్ కి రాలేదు. తాను నేను దిగిన రూమ్ వివరాలు, నేను హోటల్ లో దిగానా లేదా అనే వివరాలు అడిగి తెలుసుకొని వెళ్ళిందట. ఆమె ఎన్నింటికి వచ్చింది? ఎక్కడినుండి వచ్చినది? ఇంకా తన వివరాలేమున్నా నాకు ఇవ్వగలరా?”

ఓ ష్యూర్… అని చెప్పి చక చకా రికార్డ్ వెతకడం మొదలుపెట్టాడు. పెద్దగా అమాండా వివరాలు దొరకలేదు, కానీ ఫోన్ నెంబర్ ఒకటి దొరికినది. ఏరన్ అది తీసుకున్నాడు. రూబీ ఫోన్ నెంబర్ కూడా కావాలని అడిగాడు. ఇవాన్ అది ఇవ్వలేదు, రేపు తను డ్యూటీ కి వచ్చినపుడు తన్నే అడిగి తీసుకోండి అని చెప్పాడు.

ఆ నెంబర్ తీసుకుని రూమ్  కి వెళ్ళిపోయాడు. వెంటనే తన సెల్ నుండి కాల్ చెయ్యడానికి నెంబర్ నొక్కబోయాడు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు ఆగాడు. ఎందుకైనా మంచిది సెల్ ఫోన్ నుండి చెయ్యకపోవడం తనకి ఎవరి గురించీ పూర్తి వివరాలు తెలియకుండా. కొన్ని డిటెక్టివ్ అంశాలలో రాసి ఉంది. తెలియని నెంబర్లకు ఫోన్లు చేసినప్పుడు అవతలి వాళ్ళు, చేసిన సెల్ఫోన్ లోని మిగితా నెంబర్లను కూడా ట్రాప్ చేయగలరు అనీ. తమ ఫోన్ లో ప్రత్యేకంగా పెట్టుకున్న చిప్ ద్వారా రాడార్ సిగ్నల్ ని పంపి, అవతలి ఫొన్ లోని సిమ్ కార్డ్ లోవున్న ఇన్ ఫర్మేషన్ (మిగితా నెంబర్లు) ని అంతా కాపీ చేయగలరని. ఇది గుర్తొచ్చిన వెంటనే ఆ ఆలోచనని మానుకుని హోటల్ రూం లోని ఫోన్ డయల్ చేశాడు. రిసీవర్ చేతిలోకి తీసుకోగానే డయల్ టోన్ మామూలుగానే విన్నాడు. ఒకసారి అమాండా నెంబర్ డయల్ చేశాడు. రెండు మూడు రింగులు మామూలుగానే వచ్చి… ఇందాక వచ్చిన హిస్స్..స్స్స్ అనే స్టాటిక్ సౌండ్ వచ్చింది. ఈసారి ఏరన్ భయపడలేదు. ఇదేదో మిస్టరీ అనుకున్నాడు. ఇంకా జాగ్రత్తగా ఆ తరువాతి శబ్దాలు కూడా వస్తాయేమో అని వినడం మొదలెట్టాడు గానీ రాలేదు. ఆశ్చర్యపోయాడు. ఆ హిస్స్…స్స్స్.. అనే సౌండ్ చాలా ఫెమీలియర్ సౌండ్ అయిపోయింది తనకి. ఈ సౌండ్ తరవాతే విచిత్ర గొంతులను వింటాడు, కానీ ఈసారి మరేది తర్వాత రాలేదు. ఫోన్ పెట్టేసి, మళ్ళీ చేశాడు. మళ్ళీ అదే శబ్దం. అంటే ఈ అమాండాకి ఈ శబ్దాలకి ఏదో లింక్ ఉన్నట్లున్నది. కానీ ఇది అనైటా వినిపించిన కేసెట్ లో కూడా ఉందే!!!!…. ఆలోచనలో పడ్డాడు ఏరన్. కానీ ఏది ఏమైనా సమాధినుండి వస్తున్న ఈ స్టాటిక్ సౌండ్ కి బయట ఇతర డివైస్ ల నుండి వస్తున్న స్టాటిక్ సౌండ్ కి తేడాలేదు. ఒక పాయింటు కనుక్కున్నాడు తనకి తాను. ఎందుకంటే బాస్ ఏ క్లూలు ఇవ్వలేదు ఎవరి గురించీ, దేని గురించీ.. అన్నీ తనకు తానే కనుక్కోవాలిట, ఈవెన్ తనకు తెలిసినా కూడా చెప్పనన్నాడు.

“శాడిస్ట్” మనసులో కసిగా అనుకున్నాడు.

అమాండా ఇచ్చినది దొంగ నెంబర్ కానీ ఒక క్లూ దొరికినది అనుకుంటూ వచ్చి బెడ్ మీద ఒరిగిపోయాడు, నిద్దట్లోకి జారుకున్నాడు.

నిద్దట్లోకి జారుకున్నాడన్న మాటే గాని, మెదడు ఇవే ఆలొచనలతో ఉన్నట్టున్నాయి. సడన్ గా నిద్రలోంచి ఒక్క ఉదుటున లేచాడు. మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది- ఇప్పుడు అమాండాకి కాల్ చేస్తే ఈ సౌండ్ వచ్చింది, మరి ఇందాక తనకి ఎక్కడి నుండి ఫోన్ వచ్చింది ఇదే సౌండ్ తో? వెంటనే తెలుసుకోవాలి. ఫోన్ పైన వెతికాడు, ఎక్కడైనా కాలర్ ఐడి ఉందేమో అని…ఉహు.. లేదు. వెంటనే.. రిసెప్షన్ కి కాల్ చేసి అడగాలి.. ఆ టైంలో తన రూమ్ కి కాల్ కనెక్ట్ చేసినప్పుడు.. అది ఏ నెంబర్ నుండి వచ్చిందనీ..

******************

వెంటనే రిసెప్షన్ కి కాల్ చేశాడు. ఎవరూ ఎత్తలేదు. గడియారంలో టైం చూసుకుంటే రాత్రి 2.30. ఈ ఈవాన్ ఏడబ్బా? మళ్ళీ కొంత సేపాగి, ఫోన్ చేశాడు. ఈవాన్ అప్పుడు ఎత్తాడు.

12 గంటల ప్రాంతంలో నాకొక ఫోన్ వచ్చింది బయటి నుండి, ఎక్కడినుండి కనెక్ట్ చేసారో చూసి చెప్తారా?.. ఏరన్ అడిగాడు.

ఈవెన్ రికార్డ్ చేసి ఉన్న రిజిస్టర్ లో చూసాడు, నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ చూసిన వెంటనే ఎగిరి గంతేశాడు. అది అమాండా నెంబరే. అంటే ఈ అమాండా కి ఈ కేసుకి ఏదో సంబంధం ఉన్నది. సంబంధం ఉన్నదనీ అమాండా తెలియపరిచింది. అంటే నేను ఆమెని ఎలాగైనా కలుసుకోవాలి! ఎక్కడ ఉంటుంది?? ఎలా కలుసుకోవాలి???? బాస్ నేనే తెలుసుకోవాలని అన్నాడు. ఎందుకు??

రూబీ ప్రొద్దున డ్యూటీలోకి వచ్చేసింది. ఏరన్ రాత్రంతా ఈ గోలతోనే  గడపడం వల్ల సరిగ్గా నిద్రలేక, తెల్లవారుఝామున ఎప్పుడో నిద్రపోయాడు, లేచేసరికి బారెడు పొద్దెక్కింది. ఇక గబ గబా తయారయ్యి రూబీ కోసం రిసెప్షన్ కి వచ్చాడు.

“గుడ్ మార్నింగ్”.. రూబీ విష్ చేసింది.

“వెరీ గుడ్ మార్నింగ్”.. ఏరన్ తిరిగి విష్ చేశాడు.

“మే ఐ హెల్ప్ యు?” .. మళ్ళీ రూబీ.

“నిన్న అమాండా అనే అమ్మాయి నా గురించి వచ్చి వెళ్ళిందనీ, నా వివరాలు తెలుసుకున్నదని చెప్పారు. ఆమె ఎక్కడో ఉంటుందో, ఆమె కాంటాక్ట్ నెంబర్ వగైరా ఏ వివరమున్నా కూడా నాకు ఇవ్వగలరా?”

“ష్యూర్.. ఉండండి.. చూస్తాను”…. అని మళ్ళీ అదే రిజిస్టర్ ని చూస్తున్నది రూబీ.

వెంటనే ఏరన్.. “నిన్న నాకు ఇవాన్ ఒక నెంబర్ ఇచ్చాడు అమాండాది అని, కానీ ఆ నెంబర్ లో హిస్స్స్.. అనే స్టాటిక్ సౌండ్ తప్ప”.

“ఈజ్ ఇట్? లెట్ మి చెక్ వాట్ నెంబర్ హి గేవ్?”.. రూబీ రెండు నెంబర్లు మ్యాచ్ చేసింది.

“ఓహ్.. రెండూ ఒకటి కాదు”.. అని చెప్పి వేరే నెంబర్ ఇచ్చింది.

ఆశ్చర్యంతో ఏరన్ మరిన్ని వివరాలడిగాడు. మరి ఈ నెంబర్ ఏవిటీ? రాత్రి ఆమె పేరు ఎదురుగా ఈవాన్ ఇచ్చిన నెంబరే చూశానే?

మళ్ళీ రూబీ ఒకసారి చెక్ చేసి, మీ దగ్గిర ఉన్న నెంబర్ ఇక్కడ లేదే? అని మళ్ళీ ఆ రిజిస్టర్ ని ఏరన్ కి చూపించింది.

ఆశ్చర్యం. నిజమే.. పూర్తిగా వేరే నెంబర్ వుంది. ఎలా సాధ్యం? అలా ఎలా నేంబర్ మారింది? ఆ హిస్స్…అనే నెంబర్ కాస్త టోటల్ గా ఎలా చేంజ్ అయ్యింది? తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఇది సాధ్యమా? ఏవిటీ మాయ? మరి ఇది అమాండా నెంబర్ అయితే ఆ హిస్స్..నెంబర్ ఏవిటీ? ఏవిటీ? ఏవిటీ? తనకు ఒకసారి ఆ నెంబర్నుండి కాల్ వచ్చింది, తాను ఒకసారి చేశాడు. ఇప్పుడా నెంబర్ పూర్తిగా మారిపోయి వుంది. ఇప్పుడు అమాండా నెంబర్ కన్నా ఈ హిస్స్..నెంబర్ ని చేధించడం ముఖ్యం. అనైటా ని అర్జెంట్ గా కలవడం ముఖ్యం తానేమైనా క్లూ ఇవ్వగలదేమో.

అనుకున్నదే తడువు అనైటాకి తన సెల్ ఫోన్ నుండి ఫోన్ చేశాడు.

“గుడ్ మార్నింగ్”.. అనైటా గొంతు.

“గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్”… ఏరన్ తిరిగి అన్నాడు.

“ఏమైనా అర్జెంటు వున్నదా?”…. అనైటా మళ్ళీ అడిగింది.

“రేడియో స్టేషన్ కి ఆ అబ్బాయి ఏ నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నాడో ఆ నెంబర్ చెప్పగలరా????”… ఏరన్.

“ష్యూర్.. చూస్తాను ఇప్పుడే. అయినా ఏమయింది?”…… అనైటా.

“చెప్తాను.  ఒకసారి నెంబర్ చెబితే”….. ఏరన్

3436675643…. అనైటా.

ఏరన్ షాక్ తిన్నాడు. అదే నెంబర్.. అదే నెంబర్. అంటే..అది అమాండా కాదు. ఆ అబ్బాయే సమాధినుండి తనకి కాల్ చేశాడు. తాను కూడా తెలియక ఆ అబ్బాయికే సమాధికి ఫోన్ చేశాడు. రేడియో స్టేషనికి చేస్తున్నట్లే నాకూ చేశాడు, అదీ శ్మశానం నుండి, సమాధి లోపలినుండి ఒక చనిపోయిన కుర్రాడు.  A dead person speaking ???????

ఏరన్ కి ఆలోచిస్తున్న కొద్దీ షాక్ మీద షాక్ !!!

 

 

ఇంకా వుంది……

 

 

 

 

 

 

2 thoughts on “గౌసిప్స్!!! Dead people don’t speak-4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *