May 3, 2024

మాయానగరం – 14

రచన: భువనచంద్ర

తలుపు తీసే వుంది. ధైర్యంగా లోపలికి అడుగెట్టాడు ఆనందరావు. చాప మీద అర్ధనగ్నంగానే కూర్చుని వుంది సుందరీబాయి. గభాల్న వెనక్కి తిరగబోయేలోగా చూడనే చూసింది సుందరి. తటాల్న లేచి “మీకోసమే పొద్దున్నించీ నేను తపస్సు చేస్తున్నది. .. వచ్చావా నా దేవుడా..”మెరుపులా పెనవేసుకుపోయింది సుందరీబాయి.

“సారీ అయినా.. ఇదేంటి మీరు… ఇలాగా… నో.. వదలండి.. లీవ్ మీ…”ఖంగారు ఖంగారుగా  అంటూ విడిపించుకో బోయాడు ఆనందరావు..   ఆమె నోట్లోంచి ఖరీదైన విస్కీ వాసన. “ఏం? నేను అందంగా లేనా .. యూ.. నో… నిన్ను చూసిన మరుక్షణంలోనే ప్రేమించాను. ఎంత ప్రేమో తెలుసా? నాకున్న కోట్ల అస్థిని కూడా నీకోసం వదులుకునేటంత. ఇంకా.. ఊ.. జానూ ” అతని మెడ చుట్టూ రెండు చేతులూ వేసి  బలంగా కౌగిలించుకుంది. బలంగా ఆమెని తోసి విడివడ్డాడు ఆనందరావు. “ఏమిటిది? పిచ్చా? పీకలదాకా తాగి యీ నాన్సెన్స్ ఏమిటి? మీకు పెళ్లయింది అని గుర్తుంచుకోండి!” కోపంగా అన్నాడు ఆనందరావు.

“పెళ్ళా? అవును అయింది.. అయినా ఆ పెళ్ళి జరిగింది ఆల్సేషన్ కుక్కలాంటి మనిషితో. అతన్ని నేను ఏనాడూ ప్రేమించలేదు. ఇవాళ్టినించీ ఐ హేట్ దట్ బాస్టర్డ్. కానీ నిన్ను.. నిన్ను చూడగానే ప్రేమించాను. ఎంత అంటే, తాగుతూ పడిపోయినా నిన్నే కలవరించేటంత. కావాలంటే మాధ్వీని అడుగు. కమ్.. నా  వళ్ళు ఎలా కాలిపోతోందో చూడు..” ఆనందరావు చేతుల్ని పట్టుకుని లాగి తన వంటిమీద వేసుకుని పిచ్చిగా అతన్ని మళ్లీ పెనవేసుకుంది సుందరి.

“స్టాపిట్… “గట్టిగా తోశాడు ఆనందరావు. ఆ తోపుకి కిందపడింది సుందరి.

కోపంతో రెచ్చిపోయిన సుందరి తన బట్టలు చింపుకుంటూ “ప్రేమించానని చెబితే అలుసా మిస్టర్? నువ్వు మర్యాదగా నన్ను ప్రేమిస్తే నిన్ను మహారాజులా చూసుకుంటా. లేదా. ఇలాగే రోడ్డు మీదకు వెళ్లి  నువ్వు నన్ను బలాత్కారం చేశావని చెబుతా.. ఈ రోజున నేను అన్నది జరిగి తీరాలి. యూ.. నో… దట్ బాస్టర్డ్ ఇన్‌సల్ట్ చేశాడు. నువ్వూ అవమానిస్తున్నావు. నా ప్రేమని తిరస్కరిస్తూ..”

ఆనందరావుకి మతిపోయింది. ఇటువంటి సంఘటన ఎదురవుతుందని అతను ఏనాడూ వూహించలేదు. జీవితంలో ఏనాడూ ఆడదాన్ని చెడు దృష్టితో చూడని అతనిని యీ సంఘటన నూటికి పది వొంతులు ఓ చిత్రమైన కుతూహలాన్ని కలిగిస్తే తొంభై వొంతులు వొణుకు పుట్టించింది. అసలు ఆడవాళ్లు “ఇలా” ప్రవర్తిస్తారని వూహించను కూడా లేదు..

“సుందరిగారూ, మీరేదో ఆవేశంలో వున్నారు. దయచేసి బట్టలు సర్దుకోండి. ప్లీజ్..” బ్రతిమాలాడాడు ఆనందరావు.

“నా మాట నువ్వు వింటే నీ మాట నేను వింటా…” పట్టుపట్టింది సుందరి.

“చెప్పండి..” తొందరతొందరగా అన్నాడు ఆనందరావు.

“ముందు నన్ను సుఖపెట్టు. నాకు నువ్వు కావాలి” ఓ రకమైన ఉన్మాదంతో వెర్రిగా, వంకరగా నవ్వి అన్నది సుందరి.

“ముందు మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే నేను వెళ్లిపోతా..” బెదిరించాడు ఆనందరావు.

“నేను ముందే చెప్పా.  నీ వెనకే నేను బయటకు పరిగెత్తుకొచ్చి నువ్వు నన్ను రేప్ చేశావని చెబుతా…” అదే వంకర నవ్వుతో అన్నది సుందరి.

అక్కడితో ఆగక అతని మీద మీదకు పోతుంటే వేరే దారిలేక  కిచన్‌లోకి  వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వెళ్లాడు ఆనందరావు. ఆమె అతన్ని అందుకునేలోగా కిచెన్‌లో వున్న కూరగాయలు తరిగే చాకు తీసుకుని “సుందరిగారూ, దయచేసి దగ్గరికి రాకండి.  యీ చాకుతో గొంతు కోసుకుంటా.. నా ప్రాణాలు తియ్యడమే మీ ప్రేమకి పరాకాష్ట అయితే ఆ పని చెయ్యండి..” మొండిగా చాకుని గొంతుకి ఆనించుకుని అన్నాదు ఆనందరావు. నిర్ఘాంతపోయింది సుందరి. కథ ఇలా మలుపు తిరుగుతుందని వూహించలేదు.

సైలెంటుగా వెనక్కి వచ్చి అడ్డదిడ్డంగా వున్న బట్టలు సర్దుకుంది. అప్పుడు బయటకు వచ్చాడు ఆనందరావు (చాకుతోనే)..

“ఇప్పుడు చెప్పండి .. ఏమైంది?” అనునయంగా కాస్త దూరంగానే నిలబడి అన్నాడు. అంత చిన్న అనునయానికే సుందరికి ఏడుపు తన్నుకొచ్చింది..”మీకు తెలుసా? దట్ బాస్టర్డ్.. అదే నా మొగుడు వెదవ. ఆ జరీవాలా, మా ఇంటి పనిమనిషితో కులుకుతున్నాడు. ఏమీ లేని కుక్కని మా నాన్న యువరాజుని చేస్తే ఆ వెధవ తను కుక్కననే నిరూపించుకున్నాడు. ఇప్పుడు చెప్పు ఆనంద్.. అది చూసి నాకు పిచ్చెక్కింది. వాడ్ని అక్కడే పొడిచి చంపుదామనుకున్నా. ఊహూ. అలా చేస్తే అది వాడికి వరమే అవుతుంది పనిష్మెంటు గాదు. వాడు జీవితాంతం ఏడవాలి. నేను నిన్ను ప్రేమించిన మాట నిజం.

దాన్ని ప్రేమంటారో, కోరికంటారో, ఇంకేమంటారో నాకు తెలీదు. నన్ను నేను నీకు సంపూర్ణంగా ఇచ్చేసుకోవాలి. ఆ వెధవ ఎదురుగానే గర్వంగా నీతో తిరగాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. నువ్వు ఏమడిగినా నేను కాదన్ను. ప్లీజ్. లవ్ మీ.. లవ్ మీ.. “సగం ఉన్మాదంగా, సగం జాలిగా అడిగింది సుందరి.

“అంటే మీ పగ చల్లారడం కోసం నేను మీతో తిరుగుతూ, మీరు చెప్పినట్టు చెయ్యాలి. దానికి ‘కూలి’గా నేనేమడిగినా మీరు ఇస్తారు.. అంతేనా? సుందరిగారూ ప్రేమ అంటే డబ్బుతో కొనుక్కునేది కాదు. అసలు ఒక మనిషి మరో మనిషిని ముట్టుకోవాలన్నా మనసు ఒప్పుకోవాలే! మనసు లేని చోట శరీరాలు ఎలా కలుస్తాయి? మొన్నమీరు కలిసినప్పుడు మీ భర్తనే ‘దట్ క్యూట్ ఫెలో’ అన్నారు. అసలతను అన్నీ యిచ్చే మిమ్మల్ని వొదులుకుని పనిమనిషిని ఎందుకు ఎంచుకున్నాడో అర్ధమైందా? కారణం మీరే. ఏనాడూ అతన్ని మీరు ప్రేమించలేదని మీరే అన్నారు. మీ నాన్నకోసం అతన్ని పెళ్లి చేసుకున్నారు బాగానే వుంది. ప్రేమలేని చోట పెళ్లి ఎలా నిలుస్తుందీ? డబ్బు ఉన్నది గనక అతను అడిగినవన్నీ మీరిచ్చారేమో.. కానీ ప్రేమని ఇవ్వలేకపోయారు. కదూ? ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుందా అని అతను వెతికి, చివరికి ఆ పనిమనిషి దగ్గర పొంది ఉండొచ్చు. ఇదంతా నేను అతన్ని సమర్ధించడానికి చెప్పడం లేదు. ఒక్కసారి ఆలోచించమంటున్నాను. ప్రేమకి యజమానీ, పనిమనిషీ అనే తేడాలు వుండవు. మీరు ఇవ్వలేనిది అతను వెదుక్కున్నాడు. ఇప్పటికీ మీరేమంటున్నారు..? మీరు ప్రేమించారు గనక నేను మిమ్మల్ని ప్రేమించి తీరాలని.. ఇదేం న్యాయం? పిచ్చిలోనించో, విస్కీ మత్తులోనించో ప్రేమ పుట్టుకు రాదు సుందరిగారూ, అది మనసులో పుట్టాలి…!”

ఓ పెద్ద వుపన్యాసాన్ని జీవితంలో మొదటిసారిగా ఇచ్చాడు ఆనందరావు.

సీసాలో మిగిలి వున్న విస్కీని నీళ్లు కూడా కలపకుండా గటగటా తాగింది సుందరి.

“స్పీచ్..? గుడ్. మంచి స్పీచ్.. పావలాకి పనికిరాని వెధవ గురించి సానుభూతి. గుడ్… ఆ వెధవ పనిమనిషితో ప్రేమసామ్రాజ్యాన్ని ఏలుతూ వుంటాడు. నేనేమో నీ స్పీచిని విని అర్జంటుగా సతీసావిత్రినై పోయి, ఆ మొగుడు ముండావాడి కాళ్లు పట్టుకుని “అన్నీ ఇచ్చినా ప్రేమని మాత్రం ఇవ్వలేకపోయాను శ్రీవారూ, నన్ను క్షమించి , నన్నూ నా ప్రేమనీ మరోసారి స్వీకరించి, నన్ను ధన్యురాలిని చెయ్యండి, కావాలంటే మీ ప్రేయసిని నా సవతిగా స్వీకరించి మీ ఇద్దరికీ సేవ చేసుకుంటానూ’ అనాలి. అంతేగా నీ వుద్ధేశ్యం? ఆనందరావ్ ప్రేమకీ, పగకీ తేడా లేదు. రెండూ మనిషిని గుడ్డివాడిగా మార్చేవే.. కానీ.. వాడి మీద పగైనా తీరాలి, నీ మీద పెంచుకున్న ప్రేమైనా గెలవాలి. చూస్తా…” తూలుతూనే బయటికి నడిచింది సుందరి. ఆనందరావుకి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇలా అడ్డదిడ్డంగా కట్టుకున్న బట్టలతో ఆమె రోడ్డు మీద నడిచి వెళ్లడం ఘోరంగా వుంది. పోనీ ఆపుదామంటే మళ్లీ మొదటికొచ్చి ఏం చేస్తుందో అన్న భయం. అదృష్టవశాత్తు మెట్లు దిగుతుండగానే వాళ్ల కారు రావడం, ఆమె మెట్లన్నీ దిగి అందులో ఎక్కడం జరిగింది.

గాఢంగా నిట్టూర్చి అక్కడే, అలాగే నిలబడ్డాడు. ఆనందరావు. జరిగినదంతా ఓ కలగా అనిపించింది అతనికి.

 

*****************

 

“శోభగారూ..” ఆల్‌మోస్టు పరిగెత్తుతూ అరిచాడు బోస్‌బాబు.. వెనక్కి తిరిగి చూసింది శోభ. ” మీరా…! అబ్బ మీరు కనిపిస్తే బాగుండునని అనుకుంటూ వుండగానే మీరు కనిపించారు..” సంభ్రమంగా అన్నది శోభ.

“నిజంగానా? నిజంగా నేను కనిపిస్తే బాగుండుననుకున్నారా?” ఆశ్చర్యంగా అన్నాడు బోస్.

“నిజంగా… ప్రామిస్! మీరు అవ్వాళ పిల్లల్ని మాతో పంపించారు గదా, దానికి మా సార్ చాలా సంతోషించారు. ఫుల్ అటెండెన్స్ పడినందుకు ఆనందించి, మాకందరికీ ఓ నెల ‘బోనస్’ ప్రకటించారు తెలుసా? మీకు ఎన్ని థాంక్సులు చెప్పినా తక్కువే..” ఆనందంగా అన్నది శోభ.

“అంత మంచి వార్త చెప్పినందుకు నేనూ థాంక్స్ చెబుతున్నా. అయితే మీలాగా మామూలుగా కాదు. డిన్నర్ ఇచ్చి..” నవ్వుతూ అన్నాడు బోస్.

“అమ్మో.. నేను ఎవరితోటీ రానండీ..” స్ట్రిక్టుగానే అన్నది శోభ.

“ఒంటరిగా కాదులెండి. మీరూ, సౌందర్య అక్కయ్యగారూ, ఇంకా మిగతా టీచర్సు అందరూ కలిసే రావాలి. కారణం చెప్పనా.. సండే నా బర్త్‌డే..!” కళ్లనిండుగా శోభ అందాన్ని తాగేస్తూ అన్నాడు బోస్.

” ఆ మాట చెప్పరేం… అలా అయితే ఓ.కే.. అడ్వాన్స్ విషెస్ ముందే చెప్తున్నా. వెరీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ద డే..!” షేక్ హాండ్ ఇస్తూ అన్నది శోభ.

ఈ షేక్ హాండ్ కనిపెట్టిన వాడెవడోగానీ మహా ఘటికుడు. స్నేహమూ, కామమూ, ప్రేమా, వికారమూ అన్నీ యీ షేక్ హాండ్ నీడలో ఒదిగిపోతుంటాయి.

దీనివల్ల ఇంకో వుపయోగమూ వుంది. ఎదుటివాళ్లు ‘స్వజాతో, విజాతో’ తెలిసిపోతుంది. అదెలాగంటారా? కొందరి చెయ్యి పట్టుకోగానే, ఆ చెయ్యిని అర్జంటుగా పెట్రోలుతోనో, సబ్బుతోనో పదహారుసార్లు శుభరంగా కడుక్కోవాలనిపిస్తుంది. మరి కొందరి చేయి తగలగానే హాయిగా ఇంకాసేపు అలానే పట్టుకోవాలనిపిస్తుంది. ఇదేదో సరదాగా చెప్తున్నది కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే యీ విషయం మీకే అర్ధమవుతుంది.

అయితే ‘కరచాలనం’ చేసుకునేవారికిద్దరికీ ఒకే అభిప్రాయం పుట్టదు. ప్రస్తుతం బోస్‌బాబుకి శోభ చేతిని వదలకుండా జీవితాంతం పట్టుకునే వుండాలని వుంది. శోభకి మాత్రం చాలా ఇబ్బందిగా , చాలా అనీజీగా వుంది. అసలు షేక్ హాండ్‌ని ఎందుకు ఆఫర్ చేశానా అన్న బాధ కూడా వుంది. నిజం చెప్పాలంటే కాస్త బలంగానే తన చేతిని వెనక్కి తీసుకుంది శోభ.

“థేంక్యూ శోభగారూ. నన్ను మొట్టమొదట విష్ చేసింది మీరే…!” హేపీగా అన్నాడు బోస్..

 

********************

“వీడు నన్ను చంపకముందే వీడ్నే నేను చంపెయ్యాలి” అనుకున్నాడు మూడువందల ఇరవయ్యోసారి. లేకపోతే నా పేరు వెంకటస్వామే కాదు!” అని ప్రతిజ్ఞ కూడా చేసుకున్నాడు. కానీ ఎలా?

“పరమశివంగాడు మామూలు వాడు కాదు. నా మనసులో ఏమనుకుంటున్నదీ నాకంటే ముందుగానే పసిగడుతున్నాడు. పరమ కర్కోటకుడు. నేను బతకాలంటే వాడ్ని చంపక తప్పదు” మళ్ళీ మళ్ళీ అదే అదే అనుకుంటూ పచార్లు చేస్తున్నాడు వెంకటస్వామి. అమావాస్య ఆకాశాన్ని కప్పేసింది. నక్షత్రాలు మాత్రం నందిని నవ్వుల్లా వెలుగుతున్నై.

 

మళ్లీ కలుద్దాం

భువనచంద్ర..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *