May 2, 2024

శోధన – 3

రచన: మాలతి దేచిరాజు

sodhana 3 colore copy

ఒక మెరుపు మెరిసి మురిసినట్టు సడెన్ బ్రేక్ వేసి లిప్త కాలం చిన్న ఉద్వేగానికి లోనైంది శోధన. ఎదురుగా వైదేహి. . . సడెన్ బ్రేక్ వేసింది బ్రేక్ వేసి ఉండకపోతే రెండు వెహికల్స్ గుద్దుకుని ఉండేవి. తను పొరపాటున మూల మలుపు చూసుకోలేదు.
ఎదురుగా వున్న వైదేహి వైపు చూసింది. . . చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలని అనిపించే రూపం.
వెహికల్ ఆపి స్టాండ్ వేసి వైదేహి దగ్గరికి వెళ్లి “సారీ మేడం”అంది సిన్సియర్ గా శోధన.
“పర్లేదమ్మా. . . రోడ్డు ప్రమాదాలు భయంకరమైనవి. ఒక్కో సారి అవి ప్రాణాలు తీస్తాయి. వేగం ప్రమాదకరమైనది. అంత కన్నా నిర్లక్ష్యం ఇంకా ప్రమాదకరం. ఏదో ఆలోచిస్తూ నడిపించడం ఇంకా ఇంకా ప్రమాదకరం”చెప్పింది వైదేహి.
“యస్. . . మేడం. . . ఏదో ఆలోచిస్తూ నడిపాను సారీ ” అని చిన్నగా నవ్వింది.
“ఇంత రాత్రి వేళ బయల్దేరుతున్నావు . . . అదీ ఒంటరిగా”
“మన స్వతంత్రాన్ని పరీక్షిద్దామని” చిన్నగా నవ్వి అంది శోధన.
“మన స్వతంత్రం మన చేతుల్లోనే వుంది, ఉంటుంది కూడా. ఎవరైనా లాక్కున్నా, లాక్కుందామని ప్రయత్నం చేసినా మనం ఇవ్వకూడదు”
వైదేహి మాటల్లో స్పష్టత వుంది. అందుకో మరెందుకో కానీవాదించ లేకపోయింది విచిత్రంగా శోధన .
ఆమెని ఇంతకుముందేప్పుడూ చూసిన గుర్తు లేదు కానీ ఎక్కడో కలుసుకున్నట్టు ఎక్కడో కనెక్ట్ అయినట్టు ఏ జన్మ బంధమో ఉన్నట్లు మనసుకి తాకింది తెలియని ఒక అనుబంధం.
ఇవేవీ తెలియని వైదేహి “నాకు చిన్న అర్జెంటు పని వుంది జాగ్రత్తమ్మా ” చెప్పింది స్కూటి స్టార్ట్ చేసి.
వైదేహి వెళ్తోన్న వైపే చూస్తూ ఉండిపోయింది.
ఎవరు తను. . . తనని చూడగానే ఏదో ఒక భావం తనను చుట్టుముట్టింది. అనుకుంటూనే వెహికల్ ముందుకు పోనిచ్చింది శోధన.
యాక్సిడెంట్ స్పాట్…. .
ఘోరమైన రోడ్డు ప్రమాదం సిటీ నడిబొడ్డున…. .
అప్పటికే ఆమె వెనుకే శివ వచ్చాడు కెమెరా బయటకు తీసాడు.
“అర్థరాత్రి వాహనాల స్వైరవిహారం, తాగి వాహనాలు స్పీడ్ గా నడిపే సెలబ్రిటీలను,వారి పుత్రరత్నాలను నిలదీసే నాథులెవరు? యాక్సిడెంట్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఎవరు పట్టించుకుంటారు? శోధన చెప్పుకుపోతూనే వుంది. అక్కడ జరిగిన యాక్సిడెంట్ దృశ్యాలు చిత్రీకరిస్తున్నాడు శివ.
అయితే హోం మినిస్టర్ కొడుకు యాక్సిడెంట్ చేసిన విషయాన్నీ కొందరు పోలీసు అధికారులు తొక్కి పెట్టారు. అదే విషయాన్నీ శోధన ఎత్తి చూపింది, హోమ్ మినిష్టర్ కొడుకు పబ్ నుండి తాగి తూలుతూ బయటకు వచ్చిన ఫుటేజ్ ని పబ్ ద్వారా సంపాదించింది.
హోం మినిస్టర్ కొడుకుని కేసు నుంచి తప్పించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శించింది అదంతా కెమెరాలో రికార్డు చేయిస్తోంది .
యాక్సిడెంట్ స్పాట్ లో వుండవలిసిన పోలీసులు యాక్సిడెంట్ చేసింది హోం మినిస్టర్ కొడుకు కాబట్టి హాస్పిటల్ కు వెళ్లారు సెక్యూరిటీ అన్న నెపంతో.
శోధన ఇక్కడ యాక్సిడెంట్ దృశ్యాలు షూట్ చేస్తున్న విషయం ప్రజలకి తెలిసేలోపే శోధన హాస్పిటల్ కు వచ్చింది.
హాస్పిటల్ పరిసర ప్రాంతంలో పూర్తి భద్రత వుంది. పోలీసులు ఎలర్ట్ గా వున్నారు. అదే హాస్పిటల్ లో జనరల్ వార్డ్ లో నలుగురు వ్యక్తులు చావు బ్రతుకుల మధ్య వున్నారు. అయిదుగురు వ్యక్తులు తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. హోం మినిస్టర్ కొడుకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోవున్నాడు. తలకు దెబ్బలు బలంగా తగిలాయి.
వైదేహి అక్కడికి వెళ్లేసరికి డాక్టర్స్ కూడా ఎదురుచూస్తున్నారు. వైదేహి హాస్పిటల్ లోకి వస్తూనే అడిగిన ప్రశ్న”ఎవరైనా చనిపోయారా?”
“లేదు మేడం. . . కాకపోతే నలుగురి పరిస్థితి తీవ్రంగా వుంది. “డ్యూటీ డాక్టర్ వైదేహిని గుర్తుపట్టి చెప్పింది. ఎవరికి, ఎప్పుడు రక్తం అవసర పడినా వైదేహి ముందుంటుంది. ఆమె అంటే చాలా మంది డాక్టర్స్ కు గౌరవం. ఒక్కో సారి బ్లడ్ బ్యాంకుల కన్నా వైదేహినే నమ్ముకుంటారు.
“మంత్రిగారి అబ్బాయి నిరంజన్ పరిస్థితి తీవ్రంగా వుంది” డ్యూటీ డాక్టర్ చెప్పాడు.
వైదేహి ముందుకు నడిచింది. ఆమె దృష్టిలో మంత్రి కొడుకు అయినా, కూలీ అయినా ఒక్కటే. . . ప్రాణాలు కాపాడడమే తనకు తెలుసు.
అప్పటికే శోధన అక్కడికి వచ్చింది. వస్తూనే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. యాక్సిడెంట్ లో తీవ్ర గాయాల పాలైన వారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ వున్న పోలీసులు వారించారు. అడ్డుకునే ప్రయత్నం చేసారు. శివ తన కెమెరా కు పని చెప్పాడు. కొద్దిసేపటి క్రితమే యాక్సిడెంట్ వార్త యు ట్యూబ్ లోకి అప్ లోడ్ అయింది.
“ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన మంత్రి కొడుక్కి వైద్యం చేయకూడదు”గట్టిగా అరిచింది శోధన. అప్పటికే జనం గుమికూడటం మొదలుపెట్టారు .
కొందరు గాయపడిన వారికీ నష్టపరిహారం ఇవ్వాలని అరుస్తున్నారు. మరికొందరు కాదు “యాక్సిడెంట్”చేసిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఆవేశపడిపోతున్నారు. ఒక్కోసారి ఇలాంటి సందర్భాల్లో ఆవేశం శృతి మించుతుంది. అవకాశవాదులు తల దూర్చడం మొదలు పెడతారు. స్వలాభం కోసం ఇంకొందరు.
శోధన మంత్రి కొడుకు ను ఉంచిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైపు కదిలింది. హాస్పిటల్ సిబ్బంది,పోలీసులు అడ్డుకున్నారు.
గొడవ ముదురుతోంది అక్కడ . . . సరిగ్గా అప్పుడు బయటకు వచ్చింది వైదేహి.
“మేడం మీరా? మీరు ఇక్కడ?”
“మంత్రి కొడుక్కి రక్తం ఇవ్వడానికి వచ్చారు” శివ మెల్లిగా తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
“రోడ్డు మీద వెళ్ళే అమాయకుల మీదికి కారును పోనిచ్చి వారి రక్తాన్ని కళ్ళ జూసిన వాడికి రక్తం ఇస్తారా మేడం?” ఆవేశంగా అడిగింది శోధన.
వైదేహి మొహం మీద చిరునవ్వు చెరగలేదు.
“నేను రక్తం ఇస్తున్నది ప్రాణాపాయ స్థితిలో వున్న ఒక నిస్సహాయుడికి అంతే. అతను ఎవరు? ఎవరి కొడుకు? అని ఆలోచించించి రక్తాన్ని దానం చేయముగా, అయినా ప్రాణాన్ని కాపాడడం మన ధర్మం” చెప్పింది వైదేహి.
“కానీ హంతకుడిని కాపాడడం ధర్మం ఎలా అవుతుంది మేడం?”
“వురి కంబం ఎక్కుతున్న వాడికి కూడా చివరి కోరిక వుంటుందని దాన్ని తీర్చటం మానవత్వం అనిపించుకుంటుందని చెప్పడానికే న్యాయస్థానమే దాన్ని అమలుపరుస్తుంది. అనారోగ్యంతో వున్న వారిని ఉరి తీయరు. ఒక మనిషి ప్రాణాన్ని చూస్తూచూస్తూ పోనివ్వటం ధర్మం కాదు అలాంటివారిని చూస్తూ మనం మౌనంగా వుండకూడదు. ”
“మరి అతని వల్ల గాయపడ్డ వాళ్ళు?”
“అది పోలీస్ లు చూసుకుంటారు అక్కడ న్యాయం జరగకపోతే నీ లాంటి సామజిక స్పృహ వున్న వాళ్ళు స్పందిస్తారు. నువ్వు ఓ మనిషి చేసిన నేరాన్ని ప్రశ్నించు అతని ప్రాణాన్ని తీయాలన్న వాదాన్ని బ్రతికించవద్దు. ”
శోధన కొద్ది క్షణాలు మౌనంగా వుంది. కేవలం తన వాదన మాత్రమే కరెక్ట్ అనే తత్త్వం కాదు.
ఎదుటివారి వాదనలో నిజాయితీని కూడా గుర్తించాలని భావించే మనస్తత్వం శోధనది.
కొన్ని సార్లు మౌనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. వైదేహి అప్పటికే శోధన గురించి తెలుసుకుంది.
“మీరు చేస్తున్న పని చాలా మంచిది. సోషల్ అవేర్ నెస్ యు ట్యూబ్ ద్వారా ఒక మంచి మెసేజ్ కమ్యూనికేట్ చేస్తున్నారు. నేతాజీ,గాంధీ మహాత్ముడు ఇద్దరూ దేశ భక్తులే. . . కానీ వాళ్ళ అనుసరించే పంథాలు వేరు. మీ ఆవేశంలో నిజాయితీ వుంది,కానీ ఒక్కో సారి ఆవేశం ఉపద్రవాన్నికూడా తెచ్చి పెడుతుంది” అన్నది మెల్లని స్వరంతో వైదేహి.
అప్పటికే పోలీసులు శోధనను చుట్టుముట్టారు. ఇష్యూ హోం మినిస్టర్ ది కదా అత్యుత్సాహం తప్పనిసరిగా వుంటుంది.
“మేడం మీరు ఈ హాస్పిటల్ వదిలి వెళ్ళాలి” ఓ పోలీస్ అధికారి తన దర్పాన్ని ప్రదర్శించాడు.
“ఎందుకు? ఈ హాస్పిటల్ కు మీకు మాత్రమే సంబంధించినదా?” అడిగింది రెక్ లెస్ గా శోధన.
“ఇక్కడ న్యూ సెన్స్ చేయకూడదు? అవతలి మినిస్టర్ గారి కొడుకు పరిస్థితి సీరియస్ గా వుంది?” పోలీస్ అధికారి అన్నాడు.
“గుడ్. . మీ స్వామిభక్తి బావుంది. ఈ హాస్పిటల్ మీ మినిస్టర్ గారి స్వంతమా? మిగితా వారి ప్రాణాలు ఏమైనా పర్లేదా? రమ్మనండి మీ మినిస్టర్ ని, మేమే అడుగుతాం” శోధన అంది.
“మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళక పొతే మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకు వెళ్ళాల్సి వుంటుంది ” హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు.
“ఓకే అరెస్ట్ చేయండి. . జీపులో వెళ్దామా? నడుచుకుంటూ వెళ్దామా? అదే అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డిని తీసుకువెళ్లినట్టు.”
ఇన్స్పెక్టర్ షాకింగ్ గా చూసాడు. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. వైదేహి జోక్యం చేసుకుంది.
“ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి తన కోసం న్యూ సెన్స్ చేయడం లేదు, బాధితులకు న్యాయం జరగాలని అంటోంది. ” అని శోధన వైపు చూసి “ఇది వాదనకు సమయం కాదు ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు కాపాడవలిసిన బాధ్యత మన మీద వుంది మనం మళ్ళీ కలుద్దాం” అని మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్తూ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి “ఆ అమ్మాయికి హాని జరిగితే అది మీ పోలీస్ కు మంచిది కాదు” అందులో సూచన,వార్నింగ్ రెండూ వున్నాయి.
అక్కడ పరిస్థితి తుఫాన్ కు ముందు ప్రశాంతతలా వుంది. హోం మినిస్టర్ వచ్చాడు. వస్తూనే డి సి పి ని వివరాలు అడిగాడు. తన కొడుకు తప్పతాగి డ్రైవ్ చేసిన విషయం తెలిసింది. మిగితా బాధితుల గురించి తెలుసుకున్నాడు. అతనికి ఒకే కొడుకు. పెళ్ళైన చాల కాలం తర్వాత పుట్టాడని గారాబం చేసాడు. దానికి తోడు తన రాజకీయాల్లో తను ఎప్పుడూ బిజీ గా ఉండటం వలన కొడుకు బాగానే అదుపు తప్పాడనికూడా తెలుసు అయినా ఇప్పటివరకు తెలియని ఒకవిషయం ఆ క్షణంలోనే అర్ధం అయింది ఆయనకి
ప్రాణం ఎంత విలువో తెలుస్తోంది. అక్కడ ప్రాణాపాయ స్థితిలో వున్నది తన ఒక్కగానొక్క బిడ్డ కావటం వలన . . . ఒక మనిషిలో పశ్చాత్తాపం కలగాలన్నా, ఆలోచనలో మార్పు రావాలన్నా నెలలు, సంవత్సరాలు అవసరం లేదు, జరిగే సంఘటనలు,అనుభవాలు చాలు. దానికి విచక్షణ తోడైతే… హోం మినిస్టర్ ధనంజయ రావ్ ఇప్పుడు అదే స్థితిలో వున్నాడు.
అతనిలోని విచక్షణ పనిచేయడానికి కారణమైన సంఘటన జరిగింది.
వైదేహి కారణంగా…
తన కొడుకును ఉంచిన ఐ సి యు వైపు కదిలాడు. అక్కడి దృశ్యం చూసాడు. . క. . . ది. . . లి. . పో. . యా. . . డు.
తన కొడుకు రక్తం మడుగులో వున్నట్టు వున్నాడు. ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో వుందో అర్థమవుతోంది.
మరో దృశ్యం తన కొడుక్కి రక్తం ఇస్తున్నది మరెవరో కాదు వై. . . దే. . హి
తన కోసం ఉదయం నుంచి ఎదురు చూసి, అర్థరాత్రి కూడా తన ఇంటికి వచ్చి, మహిళల సమస్య గురించి మాట్లాడాలని ప్రయత్నించిన వ్యక్తీ, దాహం అని చెప్పి మంచినీళ్ళు కూడా తాగకుండా హడావుడిగా వెళ్ళింది. తన బిడ్డకు రక్తం ఇవ్వడానికి…
మొదటిసారి అతనికి ఏడవాలని అనిపించింది.
తను ఒక విధంగా అవమానపరిస్తే, అదేమీ పట్టించుకోకుండా ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే వ్యక్తులు ఇంకా బ్రతికే వున్నారా?
బయట గొడవ జరుగుతోంది. మరొకప్పుడైతే తన దర్పాన్ని ప్రదర్శించేవాడు. కానీ ఇపుడు మౌనంగా ఉండిపోయాడు. ప్రముఖుల పిల్లలు యాక్సిడెంట్ లో చనిపోయన వార్తలు చదివాడు. మితిమీరిన వేగంతో వాహనాలు రోడ్ల మీద స్వైర్యవిహారం చేయడం తెలుసు, కానీ తనదాకా వస్తేనే కదా ఎవరికైనా తెలిసేది?
“సార్ ఎవరో శోధన గొడవ చేస్తున్నది. మన అబ్బాయికి కూడా రక్తం ఇవ్వకూడదని గొడవ చేసింది. వైదేహి మేడం చెప్పడం వల్ల ఆగిపోయింది. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించమంటారా?” అడిగాడు ఇన్స్పెక్టర్.
“వద్దు ” అన్నట్టు తల అడ్డంగా తిప్పాడు.
అతని మనసులో తెలియని ఆందోళన. అది కొడుకును అలాంటి పరిస్థితిలో చూడటం వల్లనా? వైదేహి తన కొడుక్కి రక్తం ఇవ్వడం వల్లనా? తనలో ఏ మూలో మానవత్వం ఇంకా మిగిలి వుండడం వల్లనా?
“సార్. . . మన అబ్బాయి అవుట్ అఫ్ డేంజర్ ” పి. ఏ వచ్చి చెప్పాడు.
“మిగితా వాళ్ళు ఎలా వున్నారు?” మొదటి సారి పాజిటివ్ గా ఒక ప్రజాప్రతినిధిగా,బాధ్యత గల హోం మంత్రిగా అడిగాడు.
పిఏ ఏదో చెప్పబోయాడు.
“ముందు వాళ్ళందరినీ స్పెషల్ వార్డ్ లో చేర్పించండి. ” “వాళ్ళకు సంబంధించిన కుటుంబాలవారికి కబురుపెట్టండి. వీలయితే మన వెహికల్స్ పంపి తీసుకు రండి. వాళ్ళ ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చు మనమే భరిస్తామని హాస్పిటల్ లో ఇన్ఫార్మ్ చేయండి. ” చెప్పాడు.
ఇదంతా శోధన వింటూనే వుంది. తన కెమెరాలో రికార్డు చేస్తోంది కూడా.
చీఫ్ డాక్టర్ రూం లో కూచున్నాడు హోం మినిస్టర్…
ఎందుకో మొదటిసారి అతను తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్నాడు, యాక్సిడెంట్ లో గాయపడిన వారిని పరామర్శించాడు. ప్రాణం ఎవరికైనా గొప్పదే. . . అన్న జీవితసత్యం తెలుసుకోవడానికి అతనికి చాలా టైం పట్టింది. అధికారం,రాజకీయం ,తన కళ్ళ ముందు పొరలు గా ఏర్పడ్డాయి. కంటి ముందు వున్న ఆ పొరలే చాల మంది రాజకీయ నాయకులను కళ్ళున్న అంధులుగా మారుస్తున్నాయి.
బయట కారిడార్ లో నిలబడి వుంది శోధన. గాయపడిన వారి బంధువులు వచ్చారు. వారితో హోం మినిస్టర్ మాట్లాడుతున్నారు, వారికి ధైర్యం చెపుతున్నారు.
హోం మినిస్టర్ లోని మార్పును గమనిస్తోంది శోధన. బహుశా కొడుక్కి జరిగిన యాక్సిడెంట్ అతనిలో మార్పు తీసుకువచ్చి వుంటుంది.
ఇక తనకు ఇక్కడ పనిలేదు అనిపించింది. . . ఎందుకంటే బాధితులకు హోం మినిస్టర్ న్యాయంచేస్తాడు. ఒక్కసారి పశ్చాత్తాపంతో మారినవాడు మరో సారి తప్పు చేయడు.
తను వెళ్లిపోవాలి తను చేయవలిసిన ముఖ్యమైన పని మరోటి వుంది.
ఎందుకో వెళ్ళే ముందు ఒక్కసారి వైదేహిని కలిసి వెళ్లాలని అనిపించింది. మళ్ళీ ఈ టైం లో డిస్ట్రబ్ చేయడం ఎందుకు అనిపించింది. హాస్పిటల్ బయటకు వెళ్లబోతుంటే ఎవరో పిలిచినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే హోం మినిస్టర్.
“ఒక్కసారి నాతో రాగలరా?” అడిగాడు హోం మినిస్టర్
మౌనంగా అతడిని అనుసరించింది శోధన.

*****

అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు దిగి బయటకు వచ్చాడా యువకుడు.
పదేళ్ళ క్రితం అదే స్టేషన్ లో ఆకలితో వారం రోజులు కడుపును కాళ్ళలో పెట్టుకుని ఆకలి బాధను పంటిబిగువున అనుభవించిన వ్యక్తి అతను బన్ కోసం చిల్లర వెతుక్కుని అవి లేక పంపులో నుంచి వస్తోన్న వేడి నీళ్ళు తాగిన దృశ్యం గుర్తొచ్చింది.
అతను స్టేషన్ బయటకు వచ్చి ఓ ఆటోవాలాకు ఓ ఫోటో చూపించి “ఈ అమ్మాయి మీకు ఎక్కడైనా కనిపించిందా?” అని అడిగాడు.
అతని పేరు విశ్వక్. . .
అతని చేతిలో వున్న ఫోటో శోధనది. . .
బ్రహ్మదేవుడు తథాస్తు దేవతల వంక చూసాడు.
బ్రహ్మదేవుడు తను రాయకుండా వదిలేసిన శోధన తలరాతను రాయడానికే వచ్చాడా?

*****

హోం మినిస్టర్ శోధన వైపు చూసాడు. చాలా చిన్న వయసు, తన రాజకీయ అనుభవమంత కూడా లేని వయసు. కానీ ఆ కళ్ళలో పట్టుదల కనిపిస్తోంది. నిజాయితీ కనిపిస్తోంది.
“చెప్పమ్మా తప్పు జరిగిపోయింది, ఆ తప్పుకు ఇప్పుడు హాస్పిటల్ లో వున్న నా బిడ్డను పోలీసులకు సరెండర్ చేసి అరెస్ట్ చేయించమంటావా?”
“హోం మినిస్టర్ గా అధికారంతో అడగడం లేదు, ఒక తండ్రిగా అడుగుతున్నాను. ఈ యాక్సిడెంట్ లో గాయపడ్డవారికి పూర్తి న్యాయం చేస్తాను. ఒక వేళ వారు ప్రాణాలు కోల్పోతే నేనే స్వయంగా నా బిడ్డను పోలీస్ లకు అప్పగిస్తాను. అలా కాక ఈ సమస్య సమిసిపోతే నా బిడ్డ తప్పును నేను సరిదిద్దుతాను. అంతే కాదు హోం మినిస్టర్ గా ఈ యాక్సిడెంట్స్ కు అడ్డుకట్ట వేస్తాను, అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాను చట్టాన్ని కట్టుదిట్టం చేస్తాను. పబ్స్ విషయంలో, స్పీడ్ డ్రైవ్ విషయం లో డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కేర్ తీసుకుంటాను. ”
“ఇది ఓ రాజకీయ నాయకుడి వాగ్దానం కాదు. ఓ తండ్రిగా నా తప్పును సరిదిద్దుకుని, హోం మినిస్టర్ గా నా బాధ్యత నిర్వహించుకోవాలనే స్వార్థం. ”
“నువ్వెవరో కానీ జనం కోసం అర్థరాత్రి ధైర్యంగా వచ్చావు, నా బిడ్డకు రక్తం ఇస్తోన్న ఆ మహాతల్లి ఎవరో కానీ నా బిడ్డను బ్రతికిస్తోంది. ఇంత కంటే చెప్పటానికి ఏమీ లేదు తర్వాత నీ ఇష్టం” హోం మినిస్టర్ తను చెప్పవలిసింది చెప్పాడు.
నిర్ణయాన్ని శోధనకు వదిలి పెట్టాడు.
శోధన ఎక్కువగా ఆలోచించలేదు. హోం మినిస్టర్ చెప్పినదానిలో ఉన్న నిజాయితీ గురించి ఆలోచించింది. కొన్ని సార్లు చట్టం కన్నా, ధర్మం ముఖ్యం మారిన మనిషిని నిలదీయడం కన్నా అభినందించడం సంస్కారం అన్న ఓ రచయిత మాటలు గుర్తు చేసుకుంది.
తను చేయవలిసిన పనులు చాలా వున్నాయి వాటికి హోం మినిస్టర్ సహకారం కూడా తనకు అవసరం.
తెలివైన వారు శత్రువులు లేకుండా చేసుకోవాలి. . .
“సార్. . . నేను వచ్చిన పని పూర్తయింది. మీ మాటలు నమ్ముతున్నాను. మీ అబ్బాయి త్వరగా కోలుకోవాలని, ఈ ప్రమాదంలో ఎవరూ విషాదంలోకి వెళ్ళకూడదనీ కోరుకుంటున్నాను. మీలా ప్రతి మంత్రీ ఆలోచిస్తే చాల సమస్యలు సమిసిపోతాయి మాలాంటి వాళ్ళ అవసరమే ఉండదు ఈ సమాజానికి వస్తాను సర్” అంది రెండు చేతులు జోడిస్తూ.
ఆ రెండు చేతులు పట్టుకుని “కృతఙ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు నాకు ఆడపిల్ల వుంటే నా బిడ్డ నీలానే వుండేదేమో, నీకు ఎప్పుడైనా నాతో పనిపడితే నిస్సంకోచంగా అడుగు నీకు తండ్రి లాంటివాడిని, నాకు కొడుకుతో పాటు కూతురు కూడా వుందని అనుకుంటాను. ” సిన్సియర్ గా అన్నాడు.
“థాంక్యూ. . . నేను అడిగానని వైదేహి మేడంతో చెప్పండి” అంటూ ఇందాక పంజాగుట్ట సెంటర్ లో తీసిన వీడియో క్లిప్స్ చిప్ హోం మినిస్టర్ కు ఇస్తూ ఇక వీటితో పని లేదు” అంది.
నడిచి వెళ్తోన్న అగ్నితేజాన్ని చూస్తున్నాడు బయటకు వెళ్తోన్న శోధన వైపు చూస్తూ
ఆ క్షణమే స్ట్రిక్ట్ గా ఉత్తర్వులు తయారయ్యాయి.
ఒకటి అర్థరాత్రి దాటక ముందే పబ్స్ క్లోజ్ అవ్వాలి. తాగి డ్రైవ్ చేస్తే వెంటనే ఎలాంటి వారైనా అరెస్ట్ చేసి ఆ వెహికల్ సీజ్ చేయాలి. ముఖ్యంగా అమ్మాయిలను వేధించే వారి పట్ల సీరియస్ ఏక్షన్ తీసుకోవాలి. వైదేహి తన దగ్గరికి వచ్చిన విషయం గుర్తొచ్చింది.
ఒక సంచలనాత్మక మలుపుకు ఆ సంఘటన ఒక కారణం అయింది.

*****

స్మార్ట్ డిటెక్టివ్ ఏజెన్సీ. . .
చాలా మందికి పరిచయం లేని పేరు అది. డిటెక్టివ్ అనే పదం ఒకపుడు అపరాధ పరిశోదన నవలల్లో మాత్రమే కనిపించేవి. కానీ నయా జమానాలో వీటి పాత్ర, ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఒకప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడేవి ఈ డిటెక్టివ్ సంస్థలు కానీ ఇపుడు జనాలు చాలా పనులకు ఉపయోగించుకోవడం ప్రారంభించడం వలన ఈ డిటెక్టివ్ సంస్థలు కూడా ఒక పరిశ్రమల్లా మారాయి.
రజనీ పండిట్ లాంటి మహిళా డిటెక్టివ్ లు ఈ “డిటెక్టివ్” అనే పేరుకు న్యాయం చేస్తున్నారు.
ఆఫీసులో స్టాఫ్ మీద, పెళ్లి చేసుకోబోయే వధూవరులు ఒకరి మీద మరొకరు నిఘా వేసుకువడానికి కూడా డిటెక్టివ్ ఏజెన్సీ ఒక ఫ్లాట్ ఫాం గా మారింది.
కార్పోరేట్ ఆఫీసులలో స్టాఫ్ మీద నిఘా వేయడం దగ్గరి నుంచి భర్త/బార్య లు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం వరకూ డిటెక్టివ్ లు సహాయ పడుతున్నారు.
అలా మూడేళ్ళ క్రితం మొదలైంది. . . ఈ స్మార్ట్ డిటెక్టివ్ ఏజెన్సీ.
చాలా కేసుల్లో విజయం సాధించింది. ముఖ్యంగా తన క్లయింట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అందుకే విశ్వసనీయత కోసం ఆ డిటెక్టివ్ ఏజెన్సీ ని నమ్ముకుంటున్నారు చాలామంది ఈనాడు.
ఉదయం పదిగంటలు. . .
రిసెప్షన్ లో వున్న మాధురి ఆ వారం స్వాతి వీక్లీ తిరగేస్తోంది. అందులో వచ్చే”ఈ శీర్షిక మీదే” అంటే ఆమెకు చాలా ఇష్టం. అందులో ఎన్నో సరదా ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి అవి చదవడం సరదా ఆమెకి. సరిగ్గా అప్పుడే మిసెస్ మన్మథ రావ్ లోపలికి వచ్చింది. నలభై ఏళ్ళు వుంటాయి. అయినా ముప్పయిలా కనిపించాలన్న తాపత్రయం ఆమెలో కనిపిస్తుంది.
ఆమెను చూడగానే గుర్తు పట్టింది మాధురి.
“హలో మేడం ఎలా వున్నారు?” అడిగింది చిరునవ్వుతో.
“ఫైన్ డిటెక్టివ్ సాగరిక లేరా?” అడిగింది మిసెస్ మన్మథరావ్.
“వస్తారు పార్కింగ్ లో మేడం పార్క్ చేసిన స్కూటి లో నుంచి ఎవరో మేడం గాగుల్స్ కొట్టేసారు. అవి సింగపూర్ నుంచి మేడం బావ పంపించినవి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు” అంటూ చిన్నగా నవ్వి “మేడం మీరు స్వాతి లో ఈ శీర్షిక మీరు చదువుతారా?” అడిగింది ఉత్సాహంగా.
“అప్పుడప్పుడు ఏం?” అడిగింది మిసెస్ మన్మథరావ్.
“డిటెక్టివ్ షాకయ్యేదెప్పుడు? ప్రశ్నకు సమాధానం తన బైక్ ను ఎవరో కొట్టేసినపుడు” అని నవ్వింది.
అపుడే డిటెక్టివ్ సాగరిక అక్కడికి వచ్చింది. ఎదురుగా కనిపిస్తున్న మిసెస్ మన్మథరావ్ ని చూస్తూ “గుడ్ మార్నింగ్ మేడం నేనే మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను ఈ లోగా
“మీ గాగుల్స్ పోయాయా?” నవ్వుతూ అడిగింది మిసెస్ మన్మథ రావ్.
సాగరిక మాధురి వంక చూసింది.
“సారీ మేడం ఏదో సరదాకి “నసిగింది మాధురి.
సాగరిక అదేమీ పట్టించుకోకుండా “రండి మేడం” అంది. ఇద్దరూ లోపలి నడిచారు
“చెప్పండి మేడం మీకు పూర్తీ రిపోర్ట్ ఇచ్చాను రికార్డు వాయిస్ కూడా వుంది” “ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు?” అడిగింది సాగరిక.
“ఏం చేయమంటారు?” అడిగింది మిసెస్ మన్మథ రావ్.
“నేనెలా చెప్పగలను మేడం, కొందరు ఈ ఆధారాలను విడాకుల కోసం ఉపయోగించుకుంటారు,” “మరికొందరు భర్త ను దారిలోకి తెచ్చుకోవడానికి ఇంకొందరు”. . అని ఆగింది సాగరిక.
“చెప్పండి సాగరిక ఇంకొందరు?”
ఒక్క క్షణం మౌనంగా వుండిపోయి అప్పుడు చెప్పింది సాగరిక. . “బ్లాక్ మెయిల్ చేయడానికి. ”
“నేను నా భర్తను,ఈ సాక్ష్యాలను అందుకోసం ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను” అంది మిసెస్ మన్మథ రావ్.
ఒక్క క్షణం ఏం మాట్లాడలేకపోయింది సాగరిక ఎందుకంటే తాము ఇచ్చే సాక్ష్యాలను చట్ట విరుద్దంగా ఉపయోగించుకోవడానికి సాగరిక వ్యతిరేకం.
మన్మథరావ్ కు బుద్ధి చెప్పడానికో, తన కాపురం చక్కదిడ్డుకోవదానికో, లేదా చట్టపరంగా విడిపోవడానికో తను సేకరించి సాక్ష్యాలు ఉపయోగించుకుంటుందనుకుంది ఈమే కాదు ఎవరికైనా అలా ఉపయోగపడాలని మాత్రమే కోరుకుంటుంది సాగరిక .
కానీ ఈవిడేవిటిలా మాట్లాడుతోంది ఇలా అతడిని బ్లాక్ మెయిల్ చేసి ఏం చేస్తుంది.
“ఏంటి సాగరిక ఆలోచిస్తున్నారు? కట్టుకున్న భర్తను బ్లాక్ మెయిల్ చేస్తానన్న నన్ను చూస్తోంటే ఆశ్చర్యంగా ఉందా?” అడిగింది.
“ఈ ప్రపంచంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు మాయమయ్యాయి మేడం ఒక మనిషి నిజాయితీగా వుంటే ఆశ్చర్యం, ఒక వ్యక్తి నిజాయితీగా ప్రేమిస్తే ఆశ్చర్యం” అంది నిర్లిప్తంగా సాగరిక.
“ఒక మనిషిని చంపేస్తే ఉరి శిక్ష విధిస్తుంది మన న్యాయస్థానం మరి ఒక మనసును చంపేస్తే ఏ శిక్ష వుండాలి సాగరికా? మీరేమైనా చెప్పగలరా?” అడిగింది మిసెస్ మన్మథ రావ్.
ఆ ప్రశ్న అర్థం కానట్టు చూసింది సాగరిక.
“నా భర్త ఉమనైజర్ అయితే పెద్దగా బాధ పడను కానీ ఒక బ్రోకర్ అయితే, ఒక హంతకుడు అయితే, అమ్మాయిల బలహీనతలతో ఆడుకొని, వాడుకుని, వారిని విదేశాలకు అమ్మేస్తోంటే ?” సూటిగా అడిగింది.
“మీరు నా భర్త ఒకమ్మాయితో మాట్లాడిన మాటలు వినిపించారు,ఫోటోలు సంపాదించారు, సాక్ష్యాలు ఇచ్చారు కానీ ఆ అమ్మాయి నేను నియమించిన అమ్మాయే అని మీకు తెలుసా? ఆమె ఒక సెక్స్ వర్కర్, మన్మథరావ్ లాంటి వాళ్ళ చేతుల్లో మోసపోయిన అమ్మాయి” అంటున్న ఆమె మాటలకి షాకింగ్ గా చూసింది సాగరిక
“అవును నేను చెప్పేది నిజం సాగరికా ఒకప్పుడు మన్మథ రావ్ చేతిలో మోసపోయిన మరో అమ్మాయి వత్సల అంటే నే. . నే ” చెప్పింది నిశ్శబ్దాన్ని శబ్దంగా మారుస్తూ.
సాగరిక మౌనంగా ఉండిపోయింది.
“ఈ ప్రపంచంలో ఏ మగాడైనా అమ్మాయిల విషయంలో సెక్స్ పరంగానే అలోచిస్తారన్న నమ్మకం నాది. కొందరు మగాళ్ళు ఇందుకు మినహాయింపు కావచ్చు. ప్రేమ పేరుతో మోసం చేసి మొహం చాటేసే వారిని క్షమించవచ్చేమో కానీ ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని అమ్మాయిల అవసరాలను, బలహీనతలను కాష్ చేసుకోవాలని అనుకునే వారిని క్షమించకూడదు సాగరిక” అంటు ఒక్క నిమిషం మౌనంగా ఉండి… “నా భర్త కేవలం నన్ను మోసం చేసి పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే బార్యగా స్పందిస్తాను లేదా నిస్సహాయంగా నాలో నేనే కుమిలిపోతాను కానీ నాలాంటి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ వుంటే ఒక మహిళగా స్పందిస్తాను, భధ్రకాళిలా వాళ్ళ అంతు చూస్తాను ”
ఆమె మాటల్లో కోపం కంటే ఆవేదన కనిపించింది సాగరికకి వెంటనే “సారీ మేడమ్ మీరు కేవలం మీ భర్త ఎఫయిర్స్ తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నారని అనుకున్నాను మిమ్మల్ని హార్ట్ చేసి ఉంటే క్షమించండి మీరు చేస్తున్న పని మంచిదే ఎవిడెన్స్ మీ దగ్గరే వున్నాయి ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి” సిన్సియర్ గా అంది సాగరిక,
ఏం చేయాలో చెప్పింది మిసెస్ మన్మథ రావ్.
“వన్ సెకన్ మేడం. . “అంటూ పర్స్ లో నుంచి డబ్బు తీసి ఇచ్చింది.
“ఇదేమిటి?” అడిగింది వత్సల
“మీరు ఇచ్చిన ఫీజు మీరు చేస్తున్న మంచి పనికి ఫీజు తీసుకోకూడదని నిశ్చయించుకున్నాను” చెప్పింది సాగరిక.
“ఆ డబ్బు మన్మథరావ్ దే మీరు ఇలాంటి మంచి సంస్థలు నడపాలంటే డబ్బు వుండాలి కదా. అలాగే మీ కష్టానికి తగిన ఫలితమూ వుండాలి కాదనకుండా తీసుకోండి” అంటూ లేచింది వత్సల.
ఫస్ట్ కిక్ . . కాస్ట్ లీ పబ్ రాత్రి పది దాటి పది నిముషాలు
కుర్రకారుకు కిక్కు ఎక్కించి వాళ్ళను మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్ళే స్వర్గం లాంటి నరకం.
బాగా డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీల పిల్లలు, చీకటి మాటున బిజినెస్ చేసే వారికి అది ఒక అడ్డా.
ఒక రాజకీయ నాయకుడి బినామీ అది. ఆ పబ్ ను టచ్ చేయాలంటే పోలీసులైనా కొద్దిగా ఆలోచిస్తారు. అక్కడ నిబందనలు ఎన్నికల్లో రాజకీయ నాయకుల వాగ్దానాల్లాంటివి.
ఆ పబ్ ముందు మన్మథరావ్ కారు ఆగింది. అందులో నుంచి మన్మథరావ్ దిగాడు. ఆ వెనుకే గీతిక దిగింది.
“అమ్మో నాకు భయంగా ఉంది అంది ఆ వాతావరణాన్ని చూసి కళ్ళను చక్రాల్లా తిప్పుతూ గీతిక.
“భయమెందుకు కాఫీ హౌస్ లో నుంచి పబ్ వరకూ వచ్చాం అంటే దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది. ?” అడిగాడు మన్మథ రావ్ గీతిక నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ.
“కాఫీ హౌస్ కు వెళ్తే, తర్వాత పబ్ కు వెళ్ళొచ్చని” అమాయకంగా అంది గీతిక
ఒక్క క్షణం తల పట్టుకుని “అలాకాదు బంగారం నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యావని, మన రిలేషన్ షిప్ బెడ్ రూం వరకూ వచ్చిందని దాని అర్ధం” పబ్ లోకి ఆమెను తీసుకు వెళ్తూ అన్నాడు.
“అమ్మో నాకు భయం”అంది భయం నటిస్తూ.
“ఒక్కసారి నేను చెప్పినట్టు వింటే భయం పారిపోతుందిలే. పద పబ్ లో వున్న మజా చూపిస్తాను” ఆమె వంక చూస్తూ అన్నాడు.
పబ్ వాతావరణం మరో ప్రపంచాన్ని తలపిస్తోంది.
ఓ పక్క ఆకలి కేకలు, కుప్ప తొట్టిలో అన్నం వెతుక్కునే దృశ్యాలు. మరో పక్క ఫైవ్ స్టార్ హోటల్స్. ఒకరిది ఆకలి సమస్య, మరొకరిది కోరిక సమస్య. లైట్స్, మ్యూజిక్, ఏరులై పారే మద్యం, నాన్ వెజ్ ఘమ ఘుమలు ఆ ప్రపంచమంతా మరో రంగులో కనిపిస్తుంది. చూసేవారికి వినోదం. . . అనుభవించేవారికి స్వర్గమే అది.
రూల్స్ కు విరుద్దంగా కూడా అక్కడ సౌకర్యాలు కరెన్సీ కి దొరుకుతాయి.
అందమైన వెయిట్రెస్ లు డబ్బున్న మగాళ్ళ వీక్నెస్ లను కాష్ చేసుకోగలిగే గొప్ప వ్యాపారం.
అక్కడ తాగుతున్నారు, తూలుతున్నారు, అరుస్తున్నారు, అమ్మాయిలతో చిందేస్తున్నారు.
కరెన్సీ వరదలా ముంచెత్తుతున్నది. చీకటి బేరాలు, నేరాల మీటింగ్ లు అక్కడ షరా మామూలే.
ఆ పబ్ ను సీజ్ చేసే ధైర్యం చేయలేదు ఎవ్వరూ ఇప్పటిదాకా. . . ఎందుకంటే అలా ధైర్యం చేసిన వాళ్ళు ఆఫీసర్లు అయితే యాక్సిడెంట్ లో చచ్చిపోతారు. మంత్రులైతే పదవులు కోల్పోతారు. ఇదీ ఆ పబ్ చరిత్ర అసలు ఆ పబ్ చతుర్వేదిది. రాజకీయమనే ముసుగులో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న వ్యక్తి చతుర్వేది.
అతనికి ఉచ్చనీచాలు తెలియవు. . . డబ్బుకు ఏ రిలేషన్సూ వుండవు.
డబ్బుతో తప్ప. . . అతనికి ఏ రిలేషనూ లేదు. డబ్బు . . . డబ్బు. . డబ్బు అతనికి నచ్చిన మూడు విషయాలూ డబ్బే. అందుకే అతను ఏ పదవిలోనూ వుండటానికి ఇష్టపడడు.
సి. యం పదవిని ఆఫర్ చేసిన సున్నితంగా తిరస్కరించాడు. సి. యం అయినా ప్రతిపక్షాలకు భయపడాలి. ప్రతీ దానికి సమాధానం చెప్పుకోవాలి, స్వపక్షంలోని వ్యతిరేక వర్గాన్ని దారిలో పెట్టుకోవాలి . హైకమాండ్ కూ భయపడాలి కానీ రాజకీయ నాయకుడు అవతారంలో తను ఎవరికీ భయపడవలిసిన అవసరం లేదు. తన దగ్గర వున్న డబ్బు అందరినీ తనకే భయపడేలా చేస్తుంది.
ఏ పార్టీ అధికారంలో వుంటే వారికి చతుర్వేది నుంచి నిధులు సునామీలా తరలి వెళ్తాయి.
ప్రతిపక్షాలకు , చివరికి స్వతంత్ర ప్రజా ప్రతినిధులకూ నిధులు వెళ్తాయి అతని ఖజానా నుంచి.
అందుకే అతడిని వేలెత్తి చూపే సాహసం ఎవరూ చేయరు. రాజకీయ నాయకుల పుత్రరత్నాలు, బిజినెస్ మేగ్నేట్స్ వంశాంకురాలు అక్కడ హాయిగా రిలాక్స్ అవుతూఉంటారు .
అక్కడ కూర్చున్న ఆ హైక్లాస్ కుర్రాళ్ళ కళ్ళు అందమైన వెయిట్రెస్ మీద పడ్డాయి. “ఏయ్ బ్యూటీ ” ఒకడు పిలిచాడు.
వెయిట్రెస్ వచ్చింది “యస్ ప్లీజ్ సార్” అంది.
“నిన్ను చూస్తుంటే ఫుల్ కొట్టినంత కిక్ వస్తోంది నాతో డాన్సు చేస్తావా?” అడిగాడు ఓ రాజకీయ నాయకుడి కొడుకు.
“సారీ సార్. . మీకు ఏ డ్రింక్ కావాలో చెప్పండి సర్వ్ చేస్తాను. ”
“నాకు నీ అందం అనే డ్రింక్ కావాలి ” చెప్పాడతను.
ఆ వెయిట్రెస్ అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా బిగ్ షాట్స్ అని తెలుసు. వారితో గొడవ పడే సాహసం ఎవరూ చేయరు. విధి లేని పరిస్థితిలో అక్కడ పని చేయడానికి వచ్చింది ఆమె. కానీ ఆమెకి తెలుసు ఇలాంటి కామెంట్స్ నుంచి తప్పించుకోవడం తనకి కష్టమే అని. ఒక్కో సారి అడ్వాన్స్ అవుతారు.
ఒక్క క్షణం అ అమ్మాయికి ఏడుపు వచ్చింది. ఎక్కడ చూసినా ఈ ఎక్స్ప్లాయిటేషన్ తప్పదా?
“ఏయ్ బ్యూటీ నాక్కావలిసిన డ్రింక్ ఇవ్వనే లేదు” అక్కడికీ వచ్చాడు ఇందాకటి వ్యక్తి. అతని తండ్రి పేరున్న రాజకీయ నాయకుడు. తండ్రి రాజకీయ పలుకుబడిని తన కోరికలకు పెట్టుబడిగా పెట్టుకుంటాడు.
అతని పేరు వివేక్ అందరూ విక్కీ అంటారు.
“హలో విక్కీ ఏమిటి ఏదో డ్రింక్ అంటున్నావు మాకూ ఇస్తే మేమూ సిప్ చేస్తాంగా” అతని మిత్ర బృందం వచ్చింది.
“నాకు ఈ అమ్మాయి అందాన్ని డ్రింక్ లా సిప్ చేయాలని వుంది” చెప్పాడు విక్కీ.
“ఓహ్ నువ్వెంత లక్కీ మా విక్కీ నిన్ను సిప్ చేస్తాడట నీ టెన్ ఇయర్స్ శాలరీ ఒక్క నైట్ కే వస్తుంది” అన్నారు
కోరస్ గా.
ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది. కేవలం తండ్రిని బ్రతికించుకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి ఈ పబ్ లో చేరింది.
ఆ అమ్మాయికి ఏడుపు తన్నుకు వచ్చేస్తోంది అంతే పరుగున వాష్ రూం లోకి వెళ్ళింది. గోడకు చేరిగిలపడి ఏడుస్తోంది.
“రేయ్ మనవాడిని రమ్మని హింట్ ఇచ్చేసిందిరా బెడ్ రూం కన్నా వాష్ రూం బెటర్ అని వెళ్ళింది. విక్కీ నువ్వు లక్కీ రా ” అంటూ ఫ్రెండ్స్ వెకిలి కామెంట్స్ చేసారు. విక్కీ అప్పటికే మూడో రౌండ్ లో వున్నాడు. ఒకమ్మాయిని పైశాచికంగా హింసించడమే కిక్ అనే భ్రమలో వున్నాడు. విక్కీ అడుగులు వాష్ రూం వైపు కదిలాయి.
అదే సమయంలో . . .
“యువర్ ఆర్డర్ ప్లీజ్ ” అంటూ అడిగింది తన ఎదురుగా వున్న మన్మథరావ్ ని శోధన.
వెయిట్రెస్ గెటప్ లో వుంది.
“వైన్ కన్నా విమెన్ ఎక్కువ కిక్ ఇస్తుందని విన్నాను,ఇప్పుడు చూస్తున్నాను. . . స్లీపింగ్ పిల్స్ వేసుకోకపోయినా మత్తు ఎక్కించే బ్యూటీ మీది” మన్మథ రావ్ శోధనకు మాత్రమే వినిపించేలా కామెంట్ చేసాడు.
“పాయిజన్ కూడా మంచి కిక్ ఇస్తుంది. వైన్ లో మిక్స్ చేసి తెమ్మంటారా?” చిన్నగా అతనికి మాత్రమే వినిపించేలా అంది.
ఆ మాటలు విని ఒక్క క్షణం షాకయ్యాడు. తనతో అంత ధైర్యంగా చెప్పిన వాళ్ళను అతను ఇంతవరకు చూడలేదు.
కోపంతో ఏదో అనబోయాడు. . . అప్పుడే గీతిక వాష్ రూం లో నుంచి వచ్చింది. వస్తోనే “సార్ వాష్ రూం లో ఎవరో అమ్మాయి ఏడుస్తోంది. . . నేను బయటకు వస్తోంటే కొందరు మగాళ్ళు లేడీస్ టాయిలెట్ వైపు వెళ్తున్నారు” అంటూ చెప్పింది.
ఆ మాటలు శోధన చెవిని చేరిన మరుక్షణమే రియాక్టయింది. వేగంగా ముందుకు కదిలింది. శోధన చేతిలోని ఖర్చీప్ కింద పడింది. అది గమనించిన గీతిక “మేడం మీ ఖర్చీప్” అంది, కింద పడిన ఖర్చీఫ్ ని శోధనకు తీసి ఇస్తూ దాని మీద “యస్”అన్న అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి వున్నాయి.
“మేడం ‘యస్’ అంటే ఏమిటి?” అడిగింది గీతిక ఆ ఖర్చీప్ వంక, దాని మీద వున్న ఆ “యస్”అన్న అక్షరాల వంక చూస్తూ.
“యస్” అంటే సత్యం ది ట్రూత్. . . అంటూ వాష్ రూం వైపు వెళ్ళింది.
వెయిట్రెస్ ఆగకుండా కారుతున్న కళ్ళనీళ్ళని తుడుచుకుంది. . . ఇంక ఈ ఉద్యోగానికి గుడ్ బై చెప్పాలి. ఇలా భయంతో బ్రతకకూడదు అనుకుంది. లేచి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చి మొహం కడుక్కుంటూ ఉలిక్కిపడింది. అద్దంలో కనిపిస్తున్న మనిషిని చూస్తూ.
“హలో బ్యూటీ” అన్నాడు.
ఆమె మొహం ఎర్రగా మారింది. లేడీస్ టాయిలెట్ లో మగాడు.
“ఏం చేయను బ్యూటీ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే కదా.. నువ్వే కదా ఇక్కడికి వచ్చావు. నీ లాంటి బ్యూటీని షేర్ చేసుకోవడం ఇష్టం లేక. . నేనొక్కడినే వచ్చాను. ” వాష్ రూం తలుపు వేయబోతూ అన్నాడు.
ఆ అమ్మాయి భీతావహరిణి అయింది. భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తోంది. అప్పుడే వాష్ రూం తలుపు తెరుచుకుంది.
శోధన లోపలికి వచ్చింది. క్షణాల్లో అక్కడి సిట్యూయేషన్ అర్థమైంది.
ఆ అమ్మాయి వైపు చూసింది. . . వణికి పోతోంది.
“నువ్వెళ్ళు. . “. . చెప్పింది శోధన.
“హే హలో ఎవరు నువ్వు మధ్యలో నీ కమాండ్ ఏమిటి? ఇక్కడ శోభనం కోసం వెయిటింగ్” వెకిలిగా అన్నాడు వీక్కి.
“నేనున్నాగా మై హునా” అని చిలిపిగా కన్ను గీటింది. ఏం ఆ అమ్మాయి కన్నా అందంగా లేనా నేను” అంటూ ఆ అమ్మాయి వైపు తిరిగి వెళ్ళమని సైగ చేసింది.
ఆ అమ్మాయి రెండు చేతులు జోడించి అక్కడి నుంచి వెళ్ళింది.
శోధన హ్యాండ్ బాగ్ లో నుంచి స్కార్ప్ తీసి మొహాన్ని కవర్ చేసుకుంది.
“ఏంటి సిగ్గా స్కార్ప్ లో కూడా అందంగా వున్నావు “అంటూ విక్కీ శోధన దగ్గరికి వచ్చాడు.
“ఆడపిల్లలు అంటే నీకు ఇంత చులకనా?” అడిగింది శోధన.
“ఆడపిల్ల అగ్గిపుల్ల ఈ రెండూ వెలిగి, వెలుగుని ఇచ్చి ఆరిపోవడానికే” శోధన దగ్గరకి వస్తూ అన్నాడు విక్కీ.
“ఇప్పటి వరకూ ఎన్ని అగ్గిపుల్లలను గీసి పారేశావు?” శోధన అడిగింది.
“ఒక అగ్గిపెట్టె ఖాళీ అయింది. రెండో అగ్గిపెట్టెలో మొదటి అగ్గిపుల్లవి నువ్వే” నవ్వుతూ శోధన దగ్గరికి వచ్చాడు.
“అగ్గిపుల్ల ఒక్కసారి వెలిగి ఆరిపోయేలోగా తలచుకుంటే ఈ ప్రపంచాన్నే తగలబెడుతుంది” ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న విక్కీ వంక చూస్తూ అంది.
అప్పటికే అతను శోధన దగ్గరికి వచ్చాడు. శోధన చేయి హ్యాండ్ బాగ్ లోకి వెళ్ళింది. లోపల వున్న పెన్ నైఫ్ ని బయటకు తీసింది. చాలా షార్ప్ గా వుంది. ఆమె చేయి వేగంగా కదిలింది.
ఆ వాష్ రూం లో పెద్ద కేక. . హృదయ విదారకమైన కేక . . . రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది.
శోధన మొహం వాష్ రూం లోని ఎడమ వైపుకు తిరిగింది.
“మగాడు అంటే ఒక జెండర్ కానీ అదేదో అమ్మాయి శీలాన్ని గాయపరిచే పదునైన ఆయుధం అనుకునే వాడికి ఇలాంటి శిక్ష తప్పదు. ”
ఆమె మాటలు,అప్పటి వరకూ జరిగిన సంఘటన, శోధన స్కార్ప్ లో మాట్లాడినప్పటి నుంచి అక్కడ వున్నసీక్రెట్ కెమెరాలో రికార్డ్ అవుతోంది.
వాష్ రూం రక్తసిక్తం అయింది. అతని శరీరంలోని ఒక పార్ట్ . . . చిధ్రమైంది.
శోధన వెళ్తున్నప్పుడు పొరపాటున ఆమె చేతిలో వున్న ఖర్చీప్ కిందపడింది.
ఒక్కసారిగా రేగింది పబ్ లో కలకలం.
వాష్ రూం కు వచ్చిన ఎవరో అమ్మాయి వాష్ రూం లో రక్తం మడుగులో వున్న విక్కీ ని చూసి కెవ్వున కేకవేసింది. క్షణాల్లో ఆ సంఘటన పబ్ మొత్తం వ్యాపించింది. విక్కీ ఫ్రెండ్స్ భయంతో వణికి పోయారు.
చతుర్వేది పబ్ లో హత్యాప్రయత్నం . . . అదీ ఒక బిగ్ షాట్ కొడుకు మీద. పబ్ లోని జనం అంతా వాష్ రూం దగ్గరికి చేరారు. తీవ్రమైన రక్తస్రావం. . . అమ్మాయిలు ఆ దృశ్యం చూడలేకపోయారు. మగవాళ్ళు ఒక్క క్షణం వణికి పోయారు.
ఇందాకటి అమ్మాయి ఆ దృశ్యాన్నిచూసి షాక్ కు గురైంది. రక్తపు మడుగులో కొట్టుకుంటున్నాడు. అంబులెన్స్ వచ్చింది. పోలీసులు వచ్చారు.
అక్కడకి వచ్చిన మన్మథ రావ్ అక్కడి దృశ్యంతో పాటు మరోటి చూసాడు. వాష్ రూం లో ఖర్చీఫ్, దాని మీద “యస్”అన్న అక్షరం. ఒక్క క్షణం అతని మెదడు మొద్దు బారింది.
అంటే. . . ఆ అమ్మాయి? అతని మెదడు బ్లాంక్ గా మారింది. ఇప్పుడు తను దాని గురించి అలోచించి కూడా లాభం లేదు. అతను గీతిక వైపు చూసాడు. ఆమె ఖర్చీప్ ని గుర్తించలేదు. తను గీతికను గెస్ట్ హౌస్ కు తీసుకు వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడి నుంచి జర్దార్ ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకు వెళ్ళాలో అక్కడికి తీసుకు వెళ్తాడు. అనుకుంటూ
గీతికను బయటకు తీసుకు వెళ్ళాడు.
విక్కీ తండ్రి కేంద్రంలో చక్రం తిప్పడానికి వెళ్ళాడు. తనకు కావలిసిన టెండర్ దక్కించుకోవడానికి అతను డబ్బును,లేదా అమ్మాయిని ఎర వేస్తాడు,ఈ రెండింటితో కాక అప్పుడప్పుడు బ్లాక్ మెయిల్ తోనూ తన పనులు సాధించుకుంటాడు.
ఇప్పుడు ఆ పనిమీదే అతను వచ్చాడు. సరిగ్గా అప్పుడే కొడుక్కి జరిగిన పరాభవం వార్త అతనికి చేరింది. వెంటనే హుటాహుటిన వెనక్కి వచ్చేసాడు.

******

అది కొందరి దృష్టిలో స్మశానం. ఇంకొందరి దృష్టిలో మరణానికి వేడ్కోలు చెప్పే చివరి మజిలీ. వైదేహి దృష్టిలో నిస్సహాయులకు నీడనిచ్చి, సేదతీర్చే అమ్మ ఒడి.
సమాధులు ఓ పక్క, కూరగాయల చెట్లు మరోపక్క, పూల చెట్లు ఇంకో పక్క, ప్రతీ సమాధి అక్కడ ఓ కథ చెబుతుంది. ప్రతీ కథ అక్కడ ఓ వ్యథ వినిపిస్తుంది .
అక్కడికి హోం మినిస్టర్ కారు వచ్చిఆగింది. కూరగాయలు కోస్తున్న వారు కొందరు, పూలు కోస్తున్న వారు మరి కొందరు, మొక్కలకు నీళ్ళు పోస్తున్న వాళ్ళు కొందరు. . ఉద్యానవనంలా కనిపిస్తోంది ఆ శ్మశాన వాటిక.
ఒక చల్లని ప్రదేశంలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చోని వైదేహి తలసీమియా వ్యాధి గురించి, దాని తీవ్రత గురించి ఓ పత్రిక్కి ఆర్టికిల్ రాస్తోంది. తను చేసే ఈ అక్షర యుద్ధాన్ని ఎవరు గుర్తించక పోయినా ఏదో ఓ రోజు దీని అవసరాన్ని గుర్తిస్తే చాలు అన్నది ఆమె ఫీలింగ్.
హోం మినిస్టర్ కారు రావడంతో అక్కడ హడావుడి మొదలైంది.
ఆ రోజు హాస్పిటల్ లో ఆ సంఘటన జరిగాక వైదేహి హోం మినిస్టర్ కొడుక్కి రక్తం ఇచ్చి వెళ్ళిపోయింది. కనీసం తనకు కృతజ్ఞత చెప్పే అవకాశం కూడా ఆమె హోం మినిస్టర్ కు ఇవ్వలేదు.
వైదేహి ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించింది. రెండు చేతులు జోడించి నమస్కరించాడు హోం మినిస్టర్. అతని వెంట అతని కొడుకు కూడా వచ్చాడు. బహుశా మృత్యు ముఖం వరకూ వెళ్లి రావడం వల్ల కాబోలు, లేదా ఒక సంఘటన మన మీద ఒక్కోసారి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
కారణం ఏదైనా అతను మారాడు ఆ మార్పుని స్పష్టం గా కనిపిస్తోంది ఆమెకి.
“మేడమ్! మీ ఋణం తీర్చుకోలేను, ఏమీ చేయకుండా ఏదో ఆశించే ఈ రోజుల్లో ఎంతో చేసి ఏమీ ఆశించకుండా మౌనంగా ఈ స్మశానంలో కూర్చోని హాయిగా ఏదో రాసుకుంటున్నారు స్మశానాన్ని సైతం నందన వనంగా మార్చారు. ఇక్కడ వుంటే ఏంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. మీరు చేసే సేవల గురించి తెలుసుకున్నాను. మీకు ఏ సాయం కావాలన్నా నేను చేయగలను” మనస్ఫూర్తిగా అన్నాడు హోం మినిస్టర్ ధనంజయరావ్.
“అది మీ సహృదయం , మీరు మారటం మీ సంస్కారాన్ని సూచిస్తుంది. ఈ ప్రపంచంలో తప్పులు చేయని వారు ఎవరు? కానీ వాటిని సరిదిద్దుకునేవారే గొప్పవారు. మీరు ఈ రాష్ట్రానికి రక్షణమంత్రి. దీని శాంతి భద్రతలు మీ చేతుల్లో వున్నాయి. వాటిని కాపాడితే ఈ రాష్ట్రం ప్రశాంతంగా వుంటుంది. ” అంది వైదేహి.
హోం మినిస్టర్ కొడుకు నిరంజన్ వైదేహి పాదాలకు నమస్కరించాడు. ఆశ్రమంలో వున్న వాళ్ళు గులాబి మాలను అప్పటికపుడు తయారుచేసారు. దానిని హోం మినిస్టర్ కు ఇచ్చింది వైదేహి అంతేకాదు స్వయంగా తనుచేసిన పాయసం తెచ్చింది.
మొదటిసారి హోం మినిస్టర్ కు ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి ఇక్కడే వుండి పోవాలనుకున్నాడు.
సరిగ్గా అపుడే అతనికి ఫోన్ వచ్చింది.
ఆ ఫోన్ సిద్దప్ప నుంచి.
పబ్ లో చావుకు దగ్గరగా వెళ్ళిన విక్కీ తండ్రి.
“సరే వస్తున్నాను” చిరాగ్గా అనేసి ఫోన్ పెట్టేసాడు. తర్వాత వైదేహి వైపు తిరిగి వెళ్తున్నట్టు చెప్పాడు.

*****

శోధన ఫస్ట్ కిక్ పబ్ నుంచి బయటకు వచ్చింది. తన గురించి త్వరలో వేట మొదలవుతుందని తెలుసు, తనకు కావలిసింది అదే. తన టార్గెట్ ఎవరో తనే తెలుసుకోవాలి, యుద్ధంలో శత్రువు ఎవరో తెలియకుండానే ఆ శత్రువు కోసం చేస్తోన్న యుద్ధం అది.
స్కూటీ స్టార్ట్ చేసింది ఈ రోజు తను వెతకవలిసిన ప్రాంతం గోల్కొండ… శోధన మెదడులో ఆలోచనలు తన స్కూటీ కన్నా వేగంగా పరిగెడుతున్నాయి సిటీ లోని ప్రతీ అంగుళం గాలించాలి, తన శోభన ఆచూకీ తెలుసుకోవాలి. శోధన స్కూటీ గోల్కొండ వైపు వెళ్తోంది. స్కూటీ అటు వెళ్ళగానే ఓ అమ్మాయి బయటకు వచ్చింది ఓ నంబర్ కు డయల్ చేసింది.
“శోధన గోల్కొండ వైపుకు వెళ్తోంది జాగ్రత్త” అని చెప్పింది.
తర్వాత మొహానికి స్కార్ప్ కట్టుకుని పక్కనే పార్క్ చేసి వున్న కారు దగ్గరికి వెళ్లి కారు డోర్ ఓపెన్ చేసి కారును మన్మథ రావ్ గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చింది.
ఆమె శోభన . . . సి బి ఐ ఆఫీసర్ శోభన.
శోభన కళ్ళు తడిబారాయి. అవి చెల్లెలు శోధన జ్ఞాపకాల తాలూకు గుర్తులు అని అర్థమైంది.
దీపావళి రోజు చిచ్చుబుడ్లు కాల్చడానికి భయపడే శోధన ఇప్పుడు రివాల్వర్ తో శత్రువులను అతి సునాయాసంగా చంపేసి వస్తోంది. అది కేవలం తన వల్లనే
ఒక మహా యజ్ఞంలో తను శోధనను భాగస్వామిని చేసింది కానీ ఇంకా తన కళ్ళకు శోధన పాపాయిలా నే కనిపిస్తోంది. చిట్టి పొట్టి గౌనుతో తనను పట్టుకోవడానికి అడుగులు వేస్తూ పరుగెత్తుకు వచ్చిన శోధన.
“ఎక్కడున్నానో చెప్పుకో” అన్నప్పుడు పెద్ద పెద్ద కళ్ళతో, అమాయకపు చూపులతో తనను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ముచ్చట వేసేది. అందుకే తనే దోరికి పోయేది అప్పుడు చాలా ఇష్టంగా .
“దొరికి పోయావ్. . . దొరికి పోయావ్” అని తానే అక్కని కనిపెట్టేసినట్లు భావించి విజయగర్వంతో చప్పట్లు కొట్టేది.
ఆదమరిచి తన ఒడిలోనే పడుకున్నప్పుడు ఆ అమాయకపు మొహాన్ని చూస్తే ముద్దొచ్చేది.
“నా చిట్టి తల్లీ, నా గారాల చెల్లీ నన్ను క్షమించు. ఈ మహా యజ్ఞంలో నిన్ను భాగస్వామిని చేసినందుకు” మనఃస్ఫూర్తిగా చెల్లెలికి మనసులోనే క్షమాపణ చెప్పుకుంది శోభన.

అదే సమయలో. . .
రైల్వే స్టేషన్ రద్దీగా వుంది , రాత్రి పదకొండు దాటింది, రైలు ఫ్లాట్ ఫారం మీద ఆగింది.
స్టేషన్ బయట హడావుడి మొదలైంది. చలి ఎక్కువగా వుండడం మూలాన కొందరు ఆటోవాలాలు ముడుచుకుని పడుకున్నారు. స్టేషన్ లో నుంచి ఒకతను బయటకు వచ్చాడు. . . వయసు నలభైకి పైగానే వుంటుంది.
లావుగా వున్నాడు, పెరిగిన గడ్డం. . ఆ చూపుల్లో కొట్టొచ్చినట్టు క్రూరత్వం కనిపిస్తుంది. భుజానికి లగేజీ బ్యాగ్ వేలాడుతుంది.

ఇంకా ఉంది….

1 thought on “శోధన – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *