May 2, 2024

బొమ్మల పెండ్లి

రచన: ” ఎన్నెల”

నేను మెల్లగ నడుస్తున్న. గౌను అంచు పైకి వట్టుకున్న. నోటు బుక్కు మీదున్న క్రిష్నుని బొమ్మ ఎంత గుండూరుగ కట్ జేసుకొచ్చిన్నో అండాల్ చూసి పరెషాన్ అయితది. మెల్లగ లంబడోల్ల గుట్ట మీదికి నడిచిన. ఆల్లు జాకెట్ల మీన అద్దాలు కుడతరు. గుట్ట పురాగ ఎక్కక మునుపే రెండు అద్దం ముక్కలు దొరికినయి. గౌన్ల ఏసుకొని ఆండాలోల్ల ఇంటికి నడుస్తున్న. ఒక గాజు పెంక కాలికి తలిగింది. మందు సీసాది కావొచ్చు. అది భీ గౌన్ల ఎసుకున్న . బాగ ఎండున్నప్పుడు దాంట్ల కెంచి చూస్తే సల్లగ్గొడతది. ఆండాలోల్ల ఇంటి ముందు నీటుగున్నది. అవ్వ దినాము సానిపి జల్లి ముగ్గేస్తది. లోపటికి బొయ్యిన. అవ్వ పొద్దుగాల సావిడి అలికినట్టుంది. అంచులకు జాజు అద్దింది. నడిమిట్ల చిన్న ముగ్గు వెట్టింది. సావట్లకి పోంగనె, పెండ జాజు కలిపి ఎండిన వాసన ఒస్తుంది. అండాలు ఉర్కొచ్చింది. “ఒచ్చినావె ఏందెచ్చినవ్ “అని నా గౌను గుంజింది. నేను మడత వెట్టి పట్టుకున్న గౌన్ల కెంచి అమ్మ చేతికున్న పంచ వొన్నెల గాజు ముక్కలు, పక్కింటి అర్వోల్ల పొల్ల సీరకు కుడుతున్న చెమ్కీలు, నాయిన సెల్ల అంచుకు ఉండేటి మెరుపు తీగెలు, అద్దాలు , గాజు పెంక అన్ని రాలి పడ్డయి. “అంత ఆత్రమేంది పొల్లా జెర్ర సైసు” అవ్వ అరిచింది.

ముగ్గురం అలికిన సావిడి మీద చెమక్కుమంటున్న చెమ్కీలు ఏరవట్టినం. అవ్వ నన్ను జూచి నవ్వింది. అక్కేది అవ్వా అన్న. జెర పానం సుస్తుందని పన్నది బిడ్డా,ఈడ గూకోని గమ్మున ఆడుకోన్రి, లొల్లి జెయ్యద్దు అన్నది అవ్వ. తమ్ముడెప్పుడొస్తడవ్వా అని అడిగిన. “ఇగ రెండు మూడు దినాలు గావొచ్చు” అన్నది అవ్వ. “అవ్వా బొమ్మల పెండ్లి చేస్తము బొమ్మలు చేసిస్తావా” అన్న. “బట్టలున్నై బిడ్డా పిండినంక జేద్దం “అన్నది అవ్వ. “ఎయ్ మనం బాసింగాలు చేద్దామావె “అన్నా. “అన్ను గోందు తే పోవే” అన్నది అండాలు. పాత నోటు బుక్కు అట్టలు తెచ్చింది ఆండాలు. ఆ అట్టలు గుడ్డు లెక్క కత్తిరిచ్చి క్రుష్నుని బొమ్మ, దాని మీదికెంచి అద్దాలు, సుట్టుముట్టు చెమ్కీలు అత్కవెట్టినం. నాయిన సెల్ల నుంచెలి పీకిన మెరుపు దారాలు గుబురుగ్గ జేసి కుచ్చులెక్క చేసి అట్ట కొన కాడ రంద్రం చేసి కట్టినం. అట్టకు ఎన్క ఒక దారం అత్క వెట్టంగనె బాసింగం తయారయ్యింది. అమ్మ చేతి గాజు ముక్కను రెండు చిన్న ముక్కలు తుంచింది ఆండాలు. అద్దానికి అటు ఇటు అంటవెట్టినం. “ఎంత బాగుంది కదనె అన్న” నేను. “అక్కా, ఆండాలక్కి పెండ్లికి బాసింగాలు కొనొద్దని మా నాయినకి చెప్తా..నువ్వే చేద్దువు” అన్నది అన్ను. “చేద్దం తియ్యి గాని పెండ్లి పిల్లకు చేద్దాం పట్టు బాసింగం” అన్నా. అవ్వ బట్టలు పిండి ఎండెయ్యనీకి పోతా ఇటు జూచి, “బాగున్నయి పొల్లా ” అన్నది. “అవ్వా బాసింగాలైతున్నాయి, మరి బొమ్మలు..” అండాలు నసిగింది. “జెర్ర సైసు బట్టలు ఎండేసొస్త “అన్నది అవ్వ. మా చెల్లొచ్చింది. రాజ్ కుమారక్క మిషీను కాడికెంచి బట్ట పేగులు తెచ్చింది. అవ్వ ఒక గలాసల లీల్లు తెచ్చింది. “అన్నూ కొత్త చీపులు పుల్లలు తేపో రా” అన్నది. అన్నూ ,మా చెల్లె చిట్టి ఉర్కి పొయ్యి పొయ్యింటి ఎన్క కెంచి చీపురు పుల్లలు తెచ్చిన్రు. అవ్వ బట్ట పేగుల్ల మంచివి ఏరి లీల్లల్ల ముంచింది. పీట మీద బట్ట పేగు లేసి దాని మీద చీపురు పుల్లలు వెట్టి పేనింది. పెద్ద పుల్లకు జుట్టిన బట్ట పేగును నడిమిట్లకి మడతవెట్ట్, ఇంకో బట్ట పేగుని ఏసు కీస్తు సిలువ లెక్క వెట్టి కాల్ల కింద ఉన్న గోనె దారం పీకి గట్టిగ కట్టింది.”అవ్వా ఇది పెండ్లి పిల్ల ఇంకోటి పిలగాడ్ని జెర పెద్దగ చెయ్యి “అన్నం. అవ్వ చేసిచ్చింది.. అండాలు పలక బలపం తెచ్చింది. “అన్ను పిల్లని పిలగాడిని సావడి కొనాకు పెట్టి రా, చిట్టి నువ్వు పీట కొంచబోవే “ఆండాలు హుకుం జేసింది. ఇద్దరు పొయ్యి పెట్టొచిన్రు. “ఎవలను పిలుద్దామె పెండ్లికి పేర్లు రాయి పలక మీద “అన్నది. “నువ్వు జెప్పు ఎవలని పిలుద్దాం” అన్న నేను పలక చేతికి తీసుకుంట.

“అయితె రాయి, గజ్జి కుక్క, కోమటోడు, పెరుగుల బుడ్డి, నిమ్మి, రాదారాని, ఆనంది ఇంకా”.. ఆండాలు చెప్తా పోతుంది. “ఈల్లెవలక్కా” అన్నది అన్ను. “గజెందర్ గాన్ని గజ్జికుక్క అనవట్టిన్రు ఇస్కూల్ల. కోమటోడు ఎర్కలేదా నీకు..ఎంకటెంకటీ కోమటెంకటీ అంటవు గదనె” అన్నది అండాలు..”మరి పెరుగుల బుడ్డి ఎవలు” అన్నది అన్ను..”.ఆడేనే గోపాల్ రెడ్డి గాడు.. టీచర్లు పాలు పెరుగు తెమ్మని ఇంటర్బెల్ ల ఇంటికి పంపిస్తరాడిని.. అందుకే.. ఆని పేరు పెరుగుల బుడ్డి..గోపాల్ రెడ్డి పెరుగుల బుడ్డి అని అందరంటుంటె, నగీ నగీ సచ్చినం” అన్నది ఆండాలు. చిట్టి కి ,అన్నుకు మస్తు నవ్వొచ్చింది. “ఎక్వ మందిని చెయ్యకున్రి బిడ్డా నాయిన కోపానికొస్తడు పెద్ద సారు ఒస్తడంట ” అన్నది అవ్వ. “అవ్వా ఇయ్యాల ఆదివారం గదా.. సారు ఒచ్చుడేంది” అన్న నేను. “పెద్ద సారుకి పనుందంట మొగోల్లని పిలకున్రి.. లొల్లి జేస్తరు.. ఆడోల్లని పిలిచి ఆడున్రి. సారొస్తె కష్టమైతది “అన్నది అవ్వ. “మంచిది తియ్..అన్నూ నువ్వు, చిట్టి పొయ్యి అందర్ని తోల్క రా పొండ్రి ” అన్నది అండాలు. “అక్కా నువ్వొస్తెనే పోతా “అన్నది చిట్టి . “అట్లంటె ఎట్లనే ఈడెన్ని పనులున్నయ్! పిలగానికి పిల్లకు బట్టలెయ్యాలె, పీటలెయ్యాలె, అన్నమొండాలె ,లడ్డూలు జెయ్యాలె” అన్నది అండాలు. “పొయ్యిరన్రి, మల్ల ఆకలయితది” అన్న. వాల్లు పోతున్రు. “ఓ పొల్ల, సుజాతోల్లను, విమలోల్లను పిలువు యాద్ మర్వకు “అండాలు అరిచింది..”మంచిది” అన్నది అన్ను. అవ్వ పొయ్యిల కట్టెలు వెట్టి గాస్ నూనె బట్ట పెట్టి, ఇంగ్లం వెట్టింది. పొయ్యి అంటుకుంది. సత్తు గిన్నె తెల్లగ తోమి ఎసరు బెట్టింది. “అవ్వా బియ్యం ఇయ్యి బాయి కాడ కడిగిదెస్త ” అన్న. అవ్వ బియ్యం కొలిచింది.”పైలం బిడ్డా జెరంత తొక్కుడయ్యింది ఆయింత జారేవు” అన్నది అవ్వ. “నువ్వు ఫికర్ చెయ్యకవ్వా “అనుకుంట నేను బియ్యం కడిగిచ్చిన. తొక్కుడు చూడంగల్నె మంచిగనిపిచ్చింది. ఆ తొక్కుడు పక్కకెంచి మట్టి దీసి ముద్దలు జేసి ఎండకు బెట్టిన. మెషీన్ కాడి కెంచి తెచ్చిన బట్టలల్ల ఒక దాన్ని ఒక బొమ్మకు చీర గట్టిచ్చినము. మొగ బొమ్మకు దోతి గట్టి సెల్ల కప్పినము. బాసింగాలు కట్టాలని అందరం ఎదురుచూస్తున్నం. పిల్లకు పిలగానికి బొట్టు వెట్టినం. పిల్ల చెయ్యి కొనాకి జెర కుంకుమ అద్ది “గోరింటాకే” అని నవ్వింది అండాలు. బాసింగాలు చాన పెద్దగయినయి అయితె మానె కట్టేసినం. “పిల్లని పిలగాన్ని పీట మీద కూకోబెడదామావే” అన్న. “ఒద్దే అందర్ని రానియ్యి “అన్నది అండాలు. “రాదా రానోల్లు నచ్చరు ” అన్న. “ఎందుకన్న”ది అండాలు. “మా అమ్మమ్మోల్ల ఊరికి పొయ్యినప్పుడు మా అత్త రెండు చెక్కబొమ్మలిచ్చింది. రాదారానోల్ల నాయిన వొడ్ల పని చేస్తడు కద. నా ఆడ బొమ్మకి చెవులు కుట్టిపిస్తనని తీస్కుంది. నేను మెరుపు దారాలతోని కమ్మలు చేసిన. రేపు మాపు అనుకుంట ఇప్పుడు వాల్ల నాయిన కోపానికొచ్చి ఎటొ ఇసిరేసిండని చెప్తుంది.. నాకు మస్తు కోపమొస్తుంది” అన్న. “మొగ బొమ్మనెందుకిచ్చినవ్ “అన్నది. “ఆడ బొమ్మకి మంచిగ చేతులు దూరముంటయే. చీర కట్టనీకొస్తది. మొగ బొమ్మకి చేతులు మొండానికి అంటుకోనుంటయి. బట్టలు కట్టనీకొస్తల్లేదంటే చేతుల కాడ రంపం తోని కొయిపిచ్చి తీస్కొస్తనంటె ఇచ్చిన”. “అయ్యొ ముందు చెప్పకపొయినావు పిల్వకపోతుంటిమి ఆవ్ గానీ పున్యవతి, బాగ్యవతోల్లని పిలుద్దమా” అన్నది. “వొద్దే వాల్లిల్లు బొందల గడ్డ దిక్కుంటది గద. ఒక పారి వాల్లింటికి బొందల గడ్డ మీదికెంచి పోతుంటె ఆనందన్న జూసి అమ్మకి చెప్పిండు. అటు దిక్కు పోవద్దని మా అమ్మ ఒట్టేసింది. ఒడ్లోల్ల మనెమ్మకి అటు తిరుగుతుండంగ దయ్యం బట్టిందంట. ఆనందన్నోల్ల గురువు కాడికి తోల్కబొయ్యిన్రంట” అని చెప్పిన.” అవునా” అన్నది అండాలు. అన్ను ,చిట్టి అందర్ని తోల్కొచ్చిన్రు. కవిత దొంతులు తెచ్చింది. అవి ఐరేని కుండలన్నట్టు. అవ్వ చాప తెచ్చింది. అందరం కూకున్నం. అక్క మెల్లగ బయటకొచ్చింది. పీటేసినం పిల్లను పిలగాన్ని పీటల మీద కూకుండపెడదాం అన్నది అండాలు. “మరి పాట పాడరా” అన్నది అవ్వ. నువ్వు పాడు ,నువ్వు పాడు అని అందరం సిగ్గు పడుతున్నం. సరే పట్టున్రి అందరం కలిసి పాడుదాం అని సీతా రాముల కల్యానము చూతము రారండి పాట వొచ్చినంత పాడినం. మా గుళ్ళె ఏ పండుగైనా ఆ పాట పెడతరు. “కొత్త పాటలు నేర్వలే చెల్లె” అన్నది అక్క. “నోము సిన్మా పాటలు బుక్కు ఇచ్చిండు కదనే రాజు “అన్నది విమ్ల. తెచ్చిచ్చింది అన్ను. “నోము పండించవా సామీ..” అందరం ఎత్తుకున్నం..జెర్రంత పాడి నడిమిట్ల ఇడ్సవెట్టినం.. “ఆదిసేషుని అవతారం నీవైతే నేనింత కాలమూ నోచిన నోము నిజమైతే దైవంగా నా పతినే నేను పూజుస్తే నీ మహిమలు చూపాలీ మా కాపురం నిలపాలీ రావా దేవా”దమ్ము దమ్ము అయింది చిట్టి . “అబ్బ ఎంత ముద్దుగ పాడింది చూడు “అన్నది అవ్వ. “అవ్వు చిన్నీ పాడుడొక్కటేంది మంచిగ సదువుతరు. వీల్ల సోపత్తి బట్టినంకనే అండి గాడికి నాలుగు అచ్చరాలొస్తున్నయ్. వీల్లక్క పొద్దుమీకి సదువు చెప్తది. అండాలును తోలిస్తున్న. ఈ నడుమ జెర మంచిగనే సదువుతుందంట.. టీచరమ్మ చెప్పింది ఇట్లనె పదోదన్న అయితె మంచిగ “అన్నది అక్క. పిల్లని పిలగాన్ని కూకుండబెట్టి పసుపు తాడు కట్టిపిచ్చినం. మొన్న గొల్లోల్ల లలితక్క పెండ్లి కండ్లల్లనే ఉన్నది. పంతులు పాడినట్టు నీరాజనం నీరాజనం.. మాదవుడు కేషవుడు గోపికా వల్లబుడు చిన్నారి క్రిష్నునికి నీరాజనం అని అందరం పాడినం. యాదికున్నవన్ని చేస్తున్నం. “అవ్వా అన్నమయ్యిందా “అన్నది అండాలు. “పొయ్యి ఆపిన బిడ్డా ఉమ్మగిలాల అంత ఉడుకు గిన్నె తేరాదు “అన్నది అవ్వ. సాలోల్ల పోషెట్టి మామ ఇస్తరాకుల యాపారం జేస్తడు. అడివి కెంచి ఆకులు దెస్తడు. అత్తమ్మ, నాగమనెక్క ఆకులు కుడతరు. కుట్టిన ఇస్తరాకులు దుక్నాలకేసొస్తడు స్రీరాములన్న. మేము ఆదివారాలు పొయ్యి కొన్ని ఆకులు కుడుతమంటే కుట్టుమంటరు. కుట్టినంక అడుగు బొడుగు ఆకులు తెచ్చుకుంటం. బొమ్మల పెండ్లి అనుకోంగనే పోయినాదివారం నేను అండాలు పొయ్యి ఆకులు కుట్టి కొన్ని ఆకులు తెచ్చుకున్నం. కొత్త చీపురు పుల్లలు దెచ్చి నాలుగాకులు ఒక్క జతన అల్లినము. ఇస్తరాకులు పరిచి అందర్ని తిందురు రా వదినే, తిందువు రా అక్కా, తిందురు రా అత్తమ్మా అని బొట్టువెట్టి చెప్పింది అన్ను. అక్కకు మస్తు నవ్వొచ్చింది.. అవ్వ అందరి కి ఉడుకుబువ్వ బెట్టి నూరిన చింతకయ తొక్కు తెచ్చి ఏసింది. కడుపు నిండ తిన్నం. ఈత చాప మీద కూకొని మాట్లాడుకుంటున్నం. “బారాత్ తీస్తున్నమా” అన్నది విమ్ల. “బారాత్ ఈడ గాదు, పిలగానోల్లింటికాడ రేపు” అన్నది అండాలు. “పెద్దిందులు” అనడిగింది ఆనంది. ” పిల్లనైతె తోలియ్యనియ్యున్రి అవన్ని రేపు చూద్దారి” అన్నది అండాలు.. చిట్టి ఇంటికి బొయ్యొచ్చింది అమ్మ ఒడప్పలు పంపింది అందరం పంచుకున్నం. అవ్వకొకటి, అక్కకొకటి ఇచ్చిన. తిన్నంక “ఇగ లెవ్వుండ్రే పిల్లను తోలిద్దాం” అన్నది అండాలు. నేను పిల్లని ఆనంది పిలగాన్ని పట్టుకున్నం. లలితక్క పెండ్లిల మల్లమ్మత్త ఎట్ల జేసిండొ అండాల్కు మంచిగ చెయ్యొస్తది. అండాలు పిల్ల తల్లన్నట్టు. ” ఓమ్మా పొయ్యొస్తనె” లలితక్క లెక్క నేను.. “పొయిరా పొయిరా బిడ్డ పైలం” మల్లమ్మత్త లెక్క అండాలు.. జెర్ర నడిచినం..” ఓయమ్మ పొయ్యొస్తనే..” ఏడ్పు గొంతుతోని అంటున్న. “పొయిర బిడ్డా పొయిరా బిడ్డా “అండాలు అచ్చం మల్లమ్మత్త లెక్క కొంగు కండ్లకడ్డం బెట్టుకోని అంటుంది.. 4 సార్లయినంక “ఒయమ్మ నేను పోనే నాకు బుగులయితుంది” ఎన్కకు ఉర్కొచ్చింది లలితక్క. “బుగులు పట్టకు బిడ్డా, మాపటికి నేనొస్త పొయిరా బిడ్డా పైలం”..మల్లమ్మత్త. ఇగ పొయ్యొస్తా చిన్నీ, పొయ్యొస్త అత్తమ్మ, పొయ్యొస్త అక్కా అని పిల్ల తోని అందరి కాల్లకి మొక్కిపిచ్చినం.. అక్క, అవ్వ నవ్వుతున్నారు మమ్ములను చూసి. ఆల్లు నవ్వుతున్రని చూసి మేము జెరంత ఎక్కువ జేసినము. అక్కకు నవ్వాగుతల్లేదు.. నవ్వుకుంటా నవ్వుకుంటా అమ్మా అన్నది అక్క. “ఏమయ్యింది బిడ్డా “అని అవ్వ అక్కను పట్టుకుంది. “నొప్పైతుంది చిన్నీ” అన్నది అక్క. మేము ఆట ఆపేసి చూస్తున్నం. అక్కని మెల్లగ కొటీడ్లకి తోల్కపొయ్యిందవ్వ. మేము చిన్నిందులెప్పుడు పెద్దిందులెప్పుడు బారత్ కి ఏమేం చెయ్యాలె, ఐరేని కుండలనేం చెయాలె అని మాట్లాడుకుంటుండంగ ” అండాలూ నాయినని పిలువు బిడ్డా “అవ్వ అరిచింది. అండాలోల్ల నాయినొచ్చిండు. “ఆస్పతాల్కి పొవ్వాలె బిడ్డా నెప్పులు మొదలైనయి “అన్నది అవ్వ. “రామ్రెడ్డి సాబ్ కాడికి పొయ్యొస్త “అని నర్సింలు మామ పొయ్యిండు. ఈన మా అమ్మను అక్కా అని పిలుస్తడు, అందు గురించెలి మేము ఈనను మామా అని పిలుస్తం. ఇగ అండాలోల్లమ్మ మా పెద్దక్క కంటె కొంచెం చిన్నదంట. మేము ఆమెని అక్క అని పిలుస్తం. “అండాలు నేను ఒకటే క్లాస్ ల సదువుతున్నం గద మరి నువ్వెందుకు పెద్దగున్నవ్ అక్కెందుకు చిన్నగున్నదని అమ్మని ఒక పారి అడిగిన. అండాలు తొలిచూరు నువ్వేమో నాకు ఆరవదానివైతివి. పెద్దక్క పుట్టినప్పుడు నాకు 13 ఏండ్లు. మన అక్క సదువుకుంటుంది. అండాలోల్లమ్మకి 12 ఏండ్లకే పెండ్లి చేసిన్రంట నా లెక్కనె “అని చెప్పింది అమ్మ. నర్సింలు మామ టాక్టరు తీసుకొచ్చిండు. మేమందరం మాటలు ఆటలు పాటలు అన్ని బంద్ జేసి ఖాముష్ గూకున్నం.అవ్వ, అక్క ఎక్కిన్రు. “సీకటయ్యెదాంక ఈడనే ఆడుకోన్రి బిడ్డా, ఎన్కసిరికి మామ రాకుంటె అండాలును ,అన్నును మీ ఇంటికి తోల్కపొన్రి ” అని చెప్పింది అక్క. వాల్లు పోంగనే ఇగ పెండ్లి బంద్ జేసి, వనగంట్ల పీట ఆడుకున్నం. చింత గింజల డబ్బల ఒక గురిగింజ కానొచ్చింది.” ఇది ఏం గింజనే” ఎర్ర రంగు దాపెట్టి నల్ల రంగు చూపెట్టింది విమ్ల. “మిరియాలా” అడిగింది చిట్టి . “గురిగింజనే మిరియం గాదు “అన్నది విమ్ల. చిట్టి చిట్టి మిరియాలు- చెట్టు కింద పోసి- పుట్టమన్ను తెచ్చి-బొమ్మరిల్లు కట్టి -బొమ్మరింట్ల బిడ్డ పుడితే -బిడ్డ నెత్తికి సమరు లేద్ నా నెత్తికి సమర్ లేద్-అత్తగారింటికి సల్లకు పోతే -అత్తగారి కుక్క భవ్వుమనే -నా కాల గజ్జెలు ఘల్లుమనెఅందరం లాజిగ పాడినం..

“అమ్మకిప్పుడు బిడ్డ పుడితే సమరు యాడికెంచి తెస్తరొ” అన్నది అన్ను. “నిన్ను అత్తగారింటికి తోలిస్తం తియ్ నువ్వు తెద్దువు సమరు ” అన్నది అండాలు. అందరం నవ్వినం. ఎండవెట్టిన మట్టి లడ్డూలు యాద్కొచ్చినయ్. పెద్దోల్లు లేరు గద పర్వలేదని అందరం తలొక్కటి తిని మూతి తూడ్సుకున్నం. “అవ్వ ఉంటదానె ఈడ్నే” అడిగింది కవిత. “తాతకి చేన్ల పని ఉంటదంటనె, ఒక నెల కాంగనె పోతది అవ్వ “అన్నది అండాలు. “అయ్యో అవ్వ పోతె మనకి బొమ్మలెవలు చేస్తరు” అన్నది అన్ను. “తమ్ముడొస్తడు గదనే కొన్ని దినాలు బొమ్మలఆటలు బంద్” అన్నది అండాలు. “నీ తమ్మునితోని నన్నాడనిస్తవానె “అన్నది కవిత. “ఆ ఆడనిస్త గానీ చింత పండు గొలకలియ్యాలె మల్ల “అన్నది అండాలు. “నేను బెల్లం గడ్డ దెస్తా” అన్నది సుజాత. “మా నాయిన బిస్కట్లు దెస్తే పుడీలకెంచి నీకు రెండు ఇస్త “అన్నది ఆనంది. చీకటయింది ఇగ పోదాం పాండ్రి అనుకుంట తాలమేసినం. అక్క తమ్మున్ని తీస్కోని 3 దినాలకు ఇంటికొచ్చింది. బాబు చాన ముద్దుగున్నడు. అక్కా నేనెత్తుకుంట అన్నా. “తమ్మునికి ఏం పేరు పెడదాం రా “అన్నది అక్క. “తమ్ముడు పుట్టిన టైము చెప్పక్కా పంతులు మామ నడిగొస్తా” అన్న. “ఒద్దు బిడ్డా , నేనెప్పుడు పంతులు కాడికి పోలే. అండాలమ్మకి మొక్కుకున్నందుకు అండాలుకి ఆ పేరు పెట్టిన. అండాలమ్మ పేరు వెడితె మంచిగ సదువొస్తందంట. అన్ను పుట్టినప్పుడున్న డాక్టరమ్మ పేరు అరున. ఆమె లెక్క సదువుకుంటదని అన్నుకు ఆమె పేరు పెట్టిన ” అన్నది అక్క. “తమ్మునికి అంజనేయులని పెడదామక్కా ,అందరి పేర్లు అ తోని ఒస్తయి మంచిగుంటది” అన్న. “నేనదే అనుకున్న బిడ్డా మనసుల , గదే పెడదాం తియ్యి. అనుమాన్ల గుడికి తీస్కపొయ్యి పెడదాం” అన్నది అక్క. రోజు అంజి ని చూసి ఆడుకోకుంటె మాకు పొద్దుపోదు. అక్క అంజికి ఫోట్వ తీపిచ్చింది. ఒక చెయ్యి మీదికి లేపి, ఒక కాలు జెర్రంత మీదికి పెట్టిండు అంజి గాడు ఫోట్వల. మన గుళ్ళె అనుమాన్ల లెక్కనె ఉన్నడని అందరం మురిసినం.

ఇస్కూల్లు మొదలయినయ్. నేరు ఆరుకి పోతున్న. అండాలు ఐదుకి పోతుంది. చెప్ప యాద్ మర్సిన, ఒక యాడాది అండాలుకి అమ్మవారయింది. పరీక్షలు రాయలే. అప్పటికెంచి నా కన్న ఒక క్లాసు తక్కువలుంటది. నేను హై స్కూల్ కి పోవాలె. నాయినకి పైసలొచ్చినయంట చెరువు తాన ఇల్లు కట్టుడు మొదలయింది. నాకు ఇస్కూలు దూరమె అయితది. కానీ ఈడికెంచి పొలాలెంబడి పొవచ్చు. అండాలోల్లింటి కాడికి మస్తు దూరమయ్యింది. ఇగ చెరువు కాడ దోస్తుల సోపత్తయ్యింది. అండాలోల్లింటికి పోతల్లేము. ఈడెవ్వలు బొమ్మల పెండ్లి చెయ్యరు. దుక్నం ఆట, టీచరాట , ఐస్ పైస్ , బొంబాయి, వనగంట్లాట , చీతల పండు గింజలు బొద్దీలల్ల పెట్టే ఆట ఆడుకుంటం. ఒక నాడు గుడి కాడ అండాలు కానొచ్చింది. “ఏయ్ వొస్తల్లేరేందబ్బ , అవ్వొచ్చింది బొమ్మల పెండ్లి చేద్దారి వస్తరా” అన్నది. ఎన్నడని అడిగిన. “ఆదివారం రండ్రి “అన్నది. “అవ్వ ఇప్పుడొచ్చిందేంది కోతల టైము కదా “అన్న. అవ్వ అక్కకు చిన్నమ్మ వరసయితది. అక్కకు ఎవ్వరు లేరని అవుసరానికి నర్సిమ్ములు మామ అవ్వని తోల్కొస్తడు. అవ్వ , తాత చేన్లల్ల పనులకి పోతరంట. కోతల టైంల అవ్వ ఎప్పుడు రాదు. “మల్లొక్క తమ్ముడు పుడతడంట. నాయిన తోల్కొచ్చిండు. రాజ్ కుమారక్క బట్టలు ఇస్తల్లేదే అషోకన్న దుక్నం తీస్కొస్తవా “అన్నది అండాలు. “అషోకన్న మంచోడే పెద్ద పెద్ద బట్టలు ఇస్తడు అడిగితె తెస్త తియ్”అన్న. “అవ్వను అలికినంక ముగ్గెయ్యొద్దను నేనేస్త “అన్నది చిట్టి . “నేను మట్టి లడ్లు చేసి ఆరబెడత “అన్నది అండాలు. “ఒద్దే ఒక ఆంద్రోల్ల పిల్ల కాడ నిజ్జం లడ్లు చెయ్య నేర్చిన నేనొచ్చినంక చేద్దారి “అన్న. “జెల్దిన రండ్రి మల్ల “అనుకుంట పొయ్యింది అండాలు. ఆదివారం పొదుగాల పొయ్యినం. నేను చిట్టి బాసింగాలు ఇంటికెంచి చేసుకొచ్చినం. అమ్మ 2 పైసలిచ్చింది. 4 పిప్పరమెంట్లు కొనుక్కొచ్చినం. అమ్మను బియ్యమడిగి తెచ్చినం. జెరన్ని బియ్యం నీలల్ల నానవెట్టి అలికిన సావిడి మీద ముగ్గులేసినం. “పా మల్ల అందర్ని పిలుద్దారి “అన్నది అండాలు. అన్ను పండుకుంది. ఇంకా లెవ్వలే. “రాత్రి పెయ్యి ఉడుకు ఉండె, పండుకోని బిడ్డా మీరొచ్చినంక లేపుదురు” అన్నది అక్క. “అక్కా తమ్ముడెప్పుస్తడు” అన్నా. “ఇగ టైమైంది చెల్లె రేపటికో మాపటికో ఒస్తడు” అన్నది అక్క. కవితని పిలిచినం. కొబ్బరి చెట్టు దాటి పెద్ద మోరి కాడికెంచి ఆనందిని పిలిచినం. ” మా అమ్మ జాకెట్టు రాజ కుమారక్కకి ఇచ్చి పొమ్మన్నదే. ఇచ్చి పోదాం “అన్నది ఆనంది. జాకెట్టిచ్చినంక “పెద్ద బుజ్జొచ్చిందంటనే ఒస్తదేమొ అడుగుదామా “అన్నది ఆనంది. పెద్ద బుజ్జి బెస్త బాలమ్మ దుక్నం కాడికి పొయ్యిందంట. ఆడికి పొయ్యి తోల్కొద్దామని ముచ్చట్లు పెట్టుకుంట పోతున్నం. నడిమిట్ల పున్యవతోల్లిల్లొచ్చింది. “ఈందాంకొచ్చినం కదనే పున్యవతోల్లని పిల్లుద్దాం పా ” అన్నది కవిత. అందరం కలిసి అండాలోల్లింటికి పొయ్యినం. అవ్వ బొమ్మలు చేసి పెట్టి బియ్యం కడగనీకి పొయ్యింది.. బొమ్మలకి ముద్దుగ బట్టలు బాసింగాలు కట్టినం. మేము బాయి కాడున్న రోట్ల నానిన బియ్యం, పిప్పరమెంట్లు ఏసి దంచినం. జెర దంగినంక గట్టిగ లడ్డూలు చేసినం. అండాలు జెర నాకి “మస్తున్నయే” అన్నది. “ఇగ మట్టి లడ్డూలు తినద్దు” అన్న. “ఈ పారి అన్ను, విమ్ల, ఆనంది పిల్లోల్లు మనందరము పిలగానోల్లము “అన్నది కవిత. “మంచిది” అన్నది పెద్ద బుజ్జి . లడ్డూలు తీస్కోని వొచ్చి చూద్దుము గదా అంజి గాడు పెండ్లి పిల్ల బొమ్మని ఇరిసి నోట్లె పెట్టుకోని కనవడ్డడు. అండాలు ఉర్కి బొయ్యి ఒక్కటిచ్చింది. వాడు ఒక్కటే ఏడ్వబట్టిండు. అక్కొచ్చింది “ఎందుకు బిడ్డా తమ్మున్ని అట్ల కొడుతున్న”వనుకుంట. అంజి గాడు గుక్కవట్టి ఏడ్సుకుంట ఆ పెండ్లిపిల్ల బొమ్మ మీన కక్కిండు. అన్నుకు మస్త్ ఏడుపొచ్చింది. “దాన్ని కడిగిస్తలే బిడ్డా ఏడ్వకు”మంటుంది అక్క. “వాడు కక్కిండు ఆ బొమ్మ నాకొద్ద”ని కింద బడి ఏడ్సింది అన్ను. అవ్వొచ్చి” అన్నూ ఇంకో బొమ్మ చేద్దారి సూరు కిందికెంచి చీపురు పుల్లలు తేపో “అనంగనె పిల్ల లేచి ఉర్కిపొయ్యి పుల్లలు తెచ్చింది. అవ్వ మల్ల బొమ్మ చెయ్యవట్టింది. మనం పోచెట్టి మామోల్లింటికాడికి పొయ్యి ఇస్తరాకులు తెద్దమానె అన్న. “వద్దు బిడ్డా మొన్న అంజి గాని దావతప్పుడు తెచ్చిన ఇస్తరాకులు మస్తున్నయి. మొగులయింది ఏడికి పోకున్రి “అన్నది అక్క. పెండ్లి మంచిగ చేసినం. ఇందులకి బారాత్ కి టైం లేకుండె అమ్మ 4 కొట్టంగనె రమ్మన్నది పెద్దనాయినోల్లు వొస్తరంట. “బారాత్ , ఇందులు వొచ్చే వారం చేస్కుందమె జల్దిన రండ్రి ” అన్నది అండాలు.” పెద్దమ్మోల్లొస్తున్రు గదనే అమ్మ మురుకులు చేస్తది తెస్త తియ్యి” అన్న. ఇంటికి పోంగనె పెద్దమ్మోల్లున్నరు. ఒక వారం ఎట్లయ్యిందో తెల్వలె. శనివారం పొదుమీకి పెద్దమ్మోల్లు ఊరికి పొయ్యిన్రు. చిట్టి కి జెరమొచ్చింది. ఆదివారం పొదుగాల నాయిన చిట్టి ని ఆస్పతాల్ తోల్కబొయ్యిండు. 10 కాంగనె అమ్మ “రేషన్ షాప్ కి పొయ్యొద్దాం రా రా “అన్నది. నేను యాద్ మర్సిన. ఆదివారం బారాత్ ఉండె. “అమ్మా అండాలోల్లింటికి పోదునా” అని అడిగిన. “చెల్లె లేదు కద బిడ్డా మల్ల పోదురు తియ్ . కోపన్ల షక్కరొచ్చిందంట తెచ్చుకుందాం పా ” అన్నది. “నువ్వు కోపన్ కాడ లైన్లుండు ,నేను అండాలుకి చెప్పొస్త చిట్టి కి జెరమొచ్చిందని. వొచ్చే ఆదివారం తీస్తం బారాత్. చెక్కలు చేసిస్తవా “అన్న. “మంచిది చేసిస్త తియ్ అన్నది అమ్మ. “అండాలుకి మల్ల తమ్ముడు పుడతడంటనే” అన్న.

“అవునంట మొన్న అక్క కానొచ్చింది” అన్నది అమ్మ. మేము మాట్లాడుకుంట నడుస్తున్నం. పంచాయతాఫీసు కాడ మస్తు మంది ఉన్నరు. మేము పోనిదే మంచిది. ఆఫీసుల ఏమో అయితున్నట్టుంది. నర్సింలు మామ ఆడనియ్యడు. “ఓట్లేసే టయిము కాదు, ఏందో అంత మంది ఉన్నరు” అన్నది అమ్మ. ఆనందన్న సైకిలు మీదొస్తున్నడు. “ఆడ ఏమయితుంది బిడ్డా ?కోపను కారట్లు చేపిచ్చుకునే టైమా?” అన్నది అమ్మ. “కాదమ్మ, నర్సింలు పెండ్లాం సచ్చిపోయింది” అన్నడు ఆనందన్న. నాకు ఇగ ఏమింటున్ననో తెలుస్తలేదు మస్త్ బుగులయితుంది. “ఏమయింది బిడ్డా మంచిగనే ఉండె గద అన్నది ” రాత్రి నీలాడిందంట. వాతం కమ్మిందంటమ్మా” అన్నడు. “అయ్యొ బిడ్డా ఎంత కష్టమొచ్చింది, చిన్న చిన్న పిల్లలు ఎట్లైతదో ఏమొ ” అనుకుంట అమ్మ నన్ను దగ్గరగ పట్టుకోని అండాలోల్ల ఇంటికి పోవట్టింది. నేను గజ్జ గజ్జ వొనుకుతున్న. “అమ్మా నేను రాను, నేను రాను” అని లాజిగ ఏడ్వవట్టిన. ” ఏంలేదు బిడ్డా బయపట్టకు” అని అమ్మ అంటుండంగనె నేను చెయ్యి గుంజుకోని ఎన్కకు మల్రి ఇంటికి ఉర్కిన. చిన్నక్క దగ్గరకు తీస్కోని “ఏమయ్యిందే అమ్మేది” అనడిగింది. “అండాలోల్లమ్మ చచ్చిపోయిందంటనే” అని చెప్పి ఏడుస్తున్న. అక్క దగ్గరకు తీసుకొని ఒల్ల పండవెట్టుకుంది. అమ్మ ఇంటికొచ్చింది మద్యానం దాటినంక. “బాలెంత కద బిడ్డా ఒక కంట్ల సూది, ఒక కంట్ల జీడి పెట్టిన్రు “అన్నది. అది ఇన్నంక ఇగ మస్త్ బుగులైతాంది. రాత్రి చీకటైనంక ఇగ బైటికి పొవ్వుడే లేదు. ఆటలు లెవ్వు పాటలు లెవ్వు. ఎటు చూసిన అక్క యాదికొస్తుంది. కండ్లల్ల సూది, జీడి పెట్టుకొని కానొస్తుంది. ఒక్కల్లముండ వొషమైతల్లేదు. అమ్మ పున్యవతోల్లింటికి పొవ్వొద్దని ఒట్టేసినంక పొయ్యినందుకు ఇట్లయ్యిందేమోనని ఒకటే బాదయితుంది. పిల్లలని అవ్వ తీస్కబొయ్యింది. అక్క పోయిన టైము మంచిది కాదంట పంచాయతి ఆఫీసు ఖాలీ జేసి అండాలోల్లు మా ఇంటి కెంచి ఇస్కూలుకి పొయ్యే తొవ్వల ఉన్న సొంతింటికి పొయ్యిన్రు. . మామ పెండ్లయిన సంది పంచాతి ఆఫీసులనే ఉన్నరంట. మామ ఇల్లు కట్టిపిచ్చి కిరాయిలకిచ్చిండు. మేము తెల్వొచ్చిన వొద్దిగ ఆదివారాలు ఆఫీసు ఎన్క సావడి మీద బొమ్మలాటలు ఆడుకుంటం. బొమ్మలాటలు ఇష్టం లేకుంటె ఆఫీసుల బల్లల కింద దొంగా పోలీసాట ఆడుకుంటుంటిమి. టైపు మిషన్లు టక టక లాడిస్తం. ఫ్యాక్స్ మిషను సప్పుడంటె మా అందరికి మస్త్ భయ్యం. బెంచీల కింద దాక్కున్నప్పుడు ఆ సప్పుడు ఇనొచ్చిందంటే ఇగ ఆట బంద్ చేసి సావిడి మీదికి పోతం. అండాలోల్లు ఆఫీసు కాడ ఉన్న గుడంగ ఇగ పోకపోదుమేమొ. అక్కను యాద్ చేస్కోని మస్త్ బుగులయితది. ఆఫీసు చూడనీకి భీ బుగులైతుంది. అటు పొవ్వుడు పురాగ బంద్ చేసినం.. ఇల్లు మారినంక మామ పిల్లలను తీస్కొచ్చిండు. అండాలు ఆరుకొచ్చింది. నాతోని ఇస్కూల్కి పోవాలే. ఇస్కూలుకు పోతున్నప్పుడు అండాలు కానొచ్చింది. మొన్నటి దాంక అక్క పెరుగన్నం బుక్క నోట్లె పెట్టంగనె ఉంచుకుంట ఊరంత తిరిగిపిచ్చె అండాలు ఇప్పుడు పిచ్చికలను చూపిచ్చుకుంట అంజి గానికి పెరుగన్నం పెడతాంది. “అండీ ఇస్కూలుకి రావానే” అన్న. “రానే అవ్వకు చాతనైతల్లేదు ఈ దయ్యాన్ని చూడనీకి ఇంట్లుండమన్నడు నాయిన” అని చిన్న పాపని కాల్లతోని తన్నుకుంట అన్నది అండాలు. జెర బయపట్టుకుంటనే పాప దగ్గరికి పొయ్యిన. పాప నిద్రల నవ్వింది. నేను ఉలిక్కి పడ్డ. అండాలుకి , అన్నుకి మామ పోలికలుంటై. అంజిగానికి జెర్ర అక్క పోలిక. యీ పొల్ల అచ్చు కొట్టినట్టు అక్క లెక్కనె ఉంది. “పేరేందే” అన్న. “దయ్యం” అన్నది అండాలు. “కాదే ఎంత బాగుంది చూడు. అమ్మ లాగుందే” అనుకుంట ఎత్తుకున్న. పాప మల్ల నవ్వింది. ఆ నవ్వు అచ్చు అక్క నవ్వు. అక్కా అనుకుంట పాపని దగ్గర తీస్కున్న, మస్తు ఏడ్పొచ్చింది. “దాన్నెత్తుకోకు అది దయ్యం “అన్నది అండాలు. అవ్వొచ్చింది.

” ఊకో బిడ్డా మన రాత బాగలే “అన్నది. “అవ్వా ఇగ ఇప్పుడెట్ల అండాలు ఇస్కూల్కి రాదా “అన్న. “అది జెర్ర సమజ్ జేస్కోని చెప్పిన మాటింటె ఇస్కూల్కి పోవచ్చు ఈ పిల్లకి దయ్యం పట్టింది ఎంత జెప్పిన ఇంటల్లేదు.. నువ్వైన జెర చెప్పు బిడ్డా ఇంటదేమొ” అన్నది అవ్వ . నాకేం సమజ్గాలే . కండ్లు తూడ్సుకుంట జూసిన. “ఇస్కూలిడిసి ఇంట్ల ఎన్నిదిన్నాలుంటరు బిడ్డా, నాకేమొ చాతగాక పాయే. ఊర్లె ఒక పిల్లకు 10 ఏండ్లకి పెండ్లి జెయ్యంగ యాడాదికే మగడు చచ్చిండంట. ఆమెను మామకు మాట్లాడి వొచ్చినం. ఇటుదిక్కు రోజుల పిల్ల , అటుదిక్కు అంజి గాడు, ఇంకో దిక్కు ఎదిగిన ఆడ పిల్లలు. మామకు డూటి . పిల్లలకు ఆసరైతదని మామ ఒప్పుకుండు. ఇంత ఒండి, పిల్లలని చూసుకుంటె, నేను నిమ్మలంగ తాత తానికి పోత. ఆ ముసలోడు ఆ ఊరిడ్సవెట్టి రాదు. ఇట్లైతె నేనేంగావాలె బిడ్డా “అన్నది అవ్వ. “మంచిగనే చెప్తుందిగదనే అవ్వ, నువ్వు ఇస్కూల్కి రావచ్చు.. అవ్వ చెప్పింది ఇను” అనుకుంట పాపను చూసిన.” ఎ చీ.. అమ్మ పోతె ఇంకో అమ్మ ఒస్తదానే , నాకిష్టం లే ఒక దినం ఈ దయ్యం దాన్ని కొంచవొయ్యి బాయిల పడేస్త “అన్నది అండాలు . “చూసినావ్ బిడ్డ ఎట్ల మాట్లాడుతుందో అంజిగాడు బొమ్మనిరగ్గొడితె ఏంజేసినం , ఇంకో బొమ్మని చేస్కోలేదా అట్లనే! దేవునింట్ల పీనుగెల్ల ఆడు అమ్మని కొంచవొయ్యిండు ఏదో చేసి ఇంకో అమ్మని తెచ్చుకోవాలే” కండ్లు తూడ్సుకున్నది అవ్వ. “చూడే అండీ ,అచ్చు అమ్మ లెక్కనే కొడుతుందే దీనికి అమ్రుత అని పేడదామావే “అన్న. “ప్రభ అని పెట్టిన్రు బిడ్డా ఊర్లె “అన్నది అవ్వ. అవునా అనుకుంట ప్రభను ముద్దాడిన. “ఇగ పోతున్ననే ఇస్కూల్ టైమైంది” అనుకుంట పొయ్యిన. రోజు పొదుగాల, పొద్మీకి ప్రభనెత్తుకోనీకి పోతున్నం నేను, చిట్టి . అండాలు ఇస్కూలుకొస్తల్లేదు. మల్ల ఊరికి పొయ్యిన్రు. నెలయినంక తలుపు తీసుందని సూడబోయిన. ఎవలో కొత్తామె ఉంది.”ఎవులమ్మా” అన్నది.”అండాలు లేదా” అన్న. “అండాలూ ఎవలో ఒచ్చిన్రు బిడ్డా “అన్నది ఆమె. అండాలొచ్చింది. చీర కట్టింది. కొత్తగ్గొడుతుంది. “ఈమె నా దోస్తు “అన్నది అండాలు. “అట్లనా రామ్మా కూకో ” ప్రభని ఎత్తుకోనుందామె. “ప్రభలూ” అనుకుంట ప్రభ నెత్తికి నా నెత్తి తల్గించిన. ప్రభ నవ్వుకుంట మీద వడింది. ప్రభనెత్తుకోని అండాలు దిక్కు చూసిన. అండాలు మాట్లాడుతల్లేదు. “ఏందే మాట్లాడుతల్లేవు చీరగట్టినవేంది ఇస్కూల్కి రావా ఇగ” అన్న. “మీ దోస్తుకు పెండ్లయ్యిందమ్మా. రెండు రోజులల్ల అత్తగారింటికి తోలిస్తం. ఈ రెండ్రోజులు జెర అట్కాయించిపో” అన్నదామె. నేను అండాలు మొకం చూసిన. “అమ్మ పోయిన యాడాది లోపు పెండ్లి చేస్తె మంచిదంటనె” అండాలు అన్నది మెల్లగ. “పిలగాని తమ్ముడున్నడు. 9వది చదువుతుండు. అన్నుకి మంచిగుంటదని మాట ముచ్చట అయ్యింది. వొచ్చే యాడాది చెయ్యమంటున్రు ” అన్నది కొత్తామె. “అండాలోల్ల అమ్మ వొయసున్న మా అక్కకు మొన్న పెండ్లి చేసిన్రు. అన్నుకు అప్పుడే పెండ్లా” అన్న నేను పరెషాన్ అవుకుంట. “మిమ్ములను మీ నాయన చదివిపిస్తడు. మా నాయన అట్ల కాదు గద “అన్నది అండాలు. “వేరే ఊరు పొవ్వాలె గదనే నీకు బుగులయితల్లేదా “అన్న. అండాలు నన్ను పట్టుకోని మస్తుగ ఏడ్చింది. కొత్తామె భీ కండ్లల్ల నీలు తెచ్చుకుంది.. అన్ను పెండ్లికి పిలిచిన్రు. అండాలుని అన్నుని చూస్తుంటె బొమ్మల లెక్కనే ఉన్నరు. అన్ను పెండ్లి చూస్తె బొమ్మల పెండ్లి లెక్కనె ఉన్నది. ప్రభ అందరి మీదికి దుంకుతుంది. “ఇగ ఈ బొమ్మకెప్పుడో పెండ్లి “అన్నది ఆనంది. ప్రభ నవ్వింది. మా నాయినకు వొరంగల్లుకు బదిలీ అయ్యింది. మల్ల ఇగ అండాలోల్ల ముచ్చట్లెవ్వి తెల్వలే. ఆడ 9 ఏండ్లుండి నా డిగ్రీ అయినంక మా ఊరొచ్చినం. మంచి కొలువే దొరికింది. చిట్టి డిగ్రీ చదువుతుంది. అండాలోల్లింటికి పొయ్యిన. ప్రభ కు గాజులు రిబ్బన్లు, పెన్సిల్ లబ్బరు కొన్న. అంజి గానికొక గన్ను. ఇద్దరు వొచ్చిన్రు. అంజిగానికి నేను యాదున్న. “అక్కా ఎట్లున్నవ్” అన్నడు. “మంచిగున్న తమ్మీ ఇంట్లెవ్వలు లేరా” అన్న. “అమ్మా అక్కొచ్చిందే” అన్నడు. ప్రభ గాజులు రిబ్బన్లు చూసుకుంటుంది. “ఎందుకు చెల్లె ఇవన్ని” అనుకుంట ఆమే లోపటికెంచి వొచ్చింది. “ఫర్వలే , అండాలు గిట్ల పైలమేనా “అన్న. “అన్నుని రెండో సారి కాన్పుకి తోల్క రావాలే చెల్లె, అండాలు పెద్ద బిడ్డకి చీర కట్టిచ్చి ఇద్దరికి బియ్యం పోద్దామని అనుకుంటున్నం ” అన్నదామె. “అంత పెద్దగయిందా ” అన్న. “ఆ మొన్ననే ఎనమిది పడ్డయి” అన్నది . ” ప్రభకి కట్టిచ్చిన్రా” అన్న. “మేన మామలు లేరు గద చెల్లె, నాకన్న అన్నదమ్ములుంటే మంచిగుండు ,ఆడవిల్లలకంటె తప్పవు ” అన్నదామె. “అవన్ని ఒద్దు తియ్యక్కా ప్రభకి ” అన్న. ఆమె అందర్ని మంచిగ చూస్కుంటుందనిపిచ్చింది. అందుకే అక్కా అని పిలిచిన. ఒడిబియ్యాలకి పొవ్వుడు కాలే నాకు. అమ్మ పొయ్యొచ్చింది. మంచిగనే అయ్యిందంట. అన్ను కాన్పుకొచ్చిందంట నాకు తీరికైతల్లేదు పోనీకి. పిలగాడు పుట్టిండని తెలిసి పొయ్యొచ్చిన. అట్లట్ట యాడాదయింది. మా అక్క బిడ్డ సిరిని నవోదయ పరీక్ష రాపిద్దామనుకున్నం. నిన్న ఇస్కూల్ల చెప్పిన్రంట పరీక్ష రాసెటోల్లందరు పెద్దోల్లని తీస్కరావాలె అని. మా అక్క నన్ను పొమ్మన్నది. “నువ్వైతె అన్ని మాట్లాడతవు గదనె పొయ్యి అర్సుకోని” రా అన్నది. మంచిదని పొయ్యిన. ఇస్కూల్ బైట నిలబడ్డ. పిల్లలందరు బైటికి ఒస్తున్నరు. ప్రభ కానొచ్చింది. చెయ్యి పట్టుకున్న ” ప్రభా బాగున్నవా చెల్లె “అని. “బాగున్నక్క మీరెట్లున్నరు “అన్నది. “బాగున్నం నవోదయ పరీక్ష రాస్తున్నవా” అన్న… “నాయిన్నడిగినక్కా ఒద్దన్నడు” అన్నది. “సిరి గురించి మాట్లాడనీకొచ్చిన. ఇద్దరు కల్సి రాస్తె మంచిగుంటది గద” అన్న. “నువ్వు చెప్తవా నాయినకి నేను గూడంగ రాస్త” అన్నది. “టీచర్ తోని మాట్లాడత తియ్ “అన్న. “సరే అక్కా ఇంటికి రా “అన్నది. “ఆండాలు గిట్ల ఒస్తున్రా “అన్న. “లేదక్క ఆండాలక్కొల్ల అత్తమ్మ కు పానం బాలెదంట యాడాదయింది అక్క రాక. అప్పుడు ఒడిబియ్యాలప్పుడు రాలేదా అంతే ఇగ మల్ల రాలే. అరునక్కకు అస్సలు చాతనైతల్లేదు, బక్కగైంది కట్టెపుల్ల లెక్క ” అన్నది. “అయ్యో అవునా అమ్మ గిట్ల బాగుందా” అన్న. “బాగుందక్క , అరునక్కని తోల్కొస్తా అంటుంది.. ఆదివారం పోతదేమొ” అన్నది. ఫ్రభ అండాల్లెక్కనే టపా టపా మాట్లాడుతుంది. అన్ను జెర్ర నిదానముంటుండె. సిరి ఒచ్చింది. ” ప్రభ నువ్వు మాట్లాడుకుంట ఉండున్రి, టీచర్ని కలిసొస్తా” అన్న. టీచరు తోని నవోదయ పరీక్ష రాయనీకి ఏమేంచెయ్యాల్నో అడిగిన. ఫ్రభ గురించి మాట్లాడిన. “పిల్ల మంచిగ చదువుతదమ్మ, పెండ్లి చేస్తరంట. వాల్ల నాయినని రమ్మన్న వస్తడేమొ మాట్లాడతా అనుకున్న రాలే “అన్నది. “నేను చెప్పి చూస్త టీచర్. అవసరమైతే మీరు సాయం చెయ్యాలె ” అన్నా. “తప్పకుండ పిల్లని చదివిపిస్తాంటె అంతకంటె ఏంకావాలె. తప్పకుండ ఒస్తా” అన్నది టీచర్.

పొయేటప్పుడు అండాలోల్లింటికి పొయ్యిన. అక్క తోని నవోదయ గురించి మాట్లాడిన.” వొద్దమ్మా మీ మామ ఒద్దంటుండు. ఇగ జెల్దిన పెండ్లి చేసేస్తం” అన్నది. “అక్కా పెండ్లి జెల్దిన చేసుకుంటె ఏమొస్తది. సదూకోనియ్యరాదు ” అన్న. “ఏమో చెల్లె నాకు చదివిపిద్దామనిపిస్తది గాని మామ ఒద్దంటె ఏంచెయ్యాలె” అన్నది. “అక్కా నువ్వు పిల్లలని అంత మంచిగ చూస్తున్నవు. ఫ్రభని నీ సొంత బిడ్డ లెక్కనే పెంచుతున్నవు, రేపు అది పెద్దగయ్యి కొలువు చేస్తుంటె నీకు ఎంత మంచిగనిపిస్తది, అందరు నిన్నెంత మెచ్చుకుంటరు. ప్రభ సోపత్తోల్లెవ్వరైన పెండ్లి చేసుకుంటున్రా.. వడ్లోల్ల మనెమ్మ కాడికెంచి, పని పిల్ల సత్తెమ్మ వొరకు అందరు పిల్లలను పెద్ద సదువులు చెప్పియ్యనీకి కష్టపడుతున్నరు. అందర్ల నిన్నేమనుకుంటరు నువ్వొక్కదానివి నీ బిడ్డకు 10 ఏండ్లకి పెండ్లి చేస్తవా” అన్న. అక్క జెర మెత్తవడింది. “మంచిది మామకు చెప్పి చూడు పొల్ల చదువుకుంటే మంచిదే” అన్నది. మామొచ్చిండు “బాగున్నరామ్మా” అనుకుంట. “బాగున్నం మామా మీరెట్లున్నరు” అన్న. “మంచిగనె ఉన్నం, కొలువు చేస్తున్నవంట” అన్నడు. అవునన్న. ప్రభ ను చూసి,” అక్కను చూసినవా ఎంత మంచిగ సదివిందొ, కొలువు చేస్తుంది చూడు మస్త్ పైసలొస్తున్నయి” నవ్వుకుంట అన్నడు. “నేను భీ సదువుత నాయినా “అన్నది ప్రభ.” అవును మామ ప్రభని సదివిపియ్యాలె “అన్న . “నాకు సదివిపియ్యాలని ఉంటది బిడ్డా, కానీ ఏంజెయ్యాలె అంజిగాన్ని ఇస్కూల్కే మస్త్ పైసలైతున్నై, ఇగ ఈమె మీద పెడ్తె పెండ్లికెట్ల. పిల్లని అడగొచ్చిన్రు. మాట ముచ్చటకి పోవాలె రేపో మాపో “అన్నడు. “మామా అప్పుడే పొల్లకు పెండ్లేంది. ఇంక 10 ఏండ్లన్న లెవ్వు ” అన్న. “అండి గానికి , అన్నుకు చెయ్యలేదార ,అట్లనే “అన్నడు. “అవ్వు గానీ గీ 10 ఏండ్లల్ల ఎంత మారింది. ఈ ఊళ్ళె అందరు పిల్లలని సదివిపిస్తున్రు. నువ్వొక్కనివే” అన్న. “ఆడవిల్లలకు సదువెందుకు బిడ్డా” అన్నడు మామ. “అగో! ఇప్పటిదాంక నన్ను మీదికెత్తినవ్, ఇప్పుడు గిట్లంటున్నవ్ “అన్న. “మీది వేరేరా.. ఆడవిల్లలు ఎంత సదువుకుంటె అంతకన్న ఎక్కువ సదువుకున్నోన్ని తేవాలె..ఏడికెంచి తెద్దం, మా దాంట్ల పోరగాండ్లు అంత సద్వరు ,అవన్ని ఒద్దుతియ్ “అన్నడు. “మామ, ఇప్పుడు మీ కులపు పిలగాల్లు మంచిగనె సదువుతున్రు. దొరుకుతరు తియ్, అప్పటికి సూద్దారి “అన్న. “నా తోని కాదు బిడ్డా ,మస్త్ పైసలైతై . సూస్తల్లెవ్వా గీ పదేండ్ల సంది పురుల్లు ,పున్యాలు, పిల్లలు ,జెల్లలు మస్త్ కష్టమైతుంది బిడ్డా.. ఇల్లమ్మి ప్రభకు పెండ్లి చేసేస్తె ఇద్దరం ఇగ ఏడ్నో ఓ తాన క్రిష్నా రామా అనుకుంటం “అన్నడు. “ఫైసల్ కాకుంటె సదివిపిస్తవా “అన్న.” ఏంది నువ్వెత్తుకుంటవా..మీ నాయిన నిన్ను నన్ను కలిపి ఉతుకుతడు” అన్నడు. “నాయినేమంటడు మామా మీ కంటె ఎక్కువనా గానీ ,ఇప్పుడొక ఇస్కూలు పెట్టిన్రు సర్కరోల్లు. మంచిగ చదివే పిల్లలకు 12 దాంక ఉత్తగనే చెప్తరు. తిండి, బట్టలు, పుస్తకాలు అన్ని వాల్లవె. కాని పరీక్ష రాయాలె. అంద్ల పాస్ అయితెనె ఇస్కూల్ల జైన్ చేస్కుంటరు” అని చెప్పిన.” ఏయ్ పోనితియ్ బిడ్డా ఏడేడికి పంపుతరొ ఆడవిల్లలని ఎప్పుడు అట్ల ఇడ్వలే, ఒక్కతి ఎట్లుంటది” అన్నడు. “అయ్యో మామా ఏడ్కి పోవొద్దు లింగం పల్లి కాడ ఈడనే ఉంది. ఒక్కతి కాదు మా సిరిని తోలిద్దామనుకుంటున్నం. ఇద్దరుంటరు ముద్దుగ వారంకొక్క పారి పొయ్యి చూసి రావచ్చు. శెలవులల్ల పిల్లలు ఇంటికొస్తరు” అన్న. “అవునంట మా పెద్ద సారోల్ల పిలగాన్ని తోలిచ్చిన్రంట మంచిగనే ఉన్నదంట గానీ ఏమో బిడ్డ నాకు సమజ్ అయితల్లె “అన్నడు. “మామా, ఇప్పుడేం కాదు గదనె పరీక్ష పాస్ అయినప్పటి ముచ్చట. ఇది నవంబరు గద, పరీక్ష ఫిబ్రవరి రెండొ వారం ఉంటది. మే ల చెప్తరంట పాస్ అయిన్రా లేదా అని. జూన్ కి పొవ్వాలె ఇస్కూల్ల జైన్ కానీకి . డాక్టరు లెక్క సదువుతదని అన్నుకు అక్క డాక్టరమ్మ పేరు పెట్టలేదా.. పరీక్ష అయితె రాయనియ్యి రాదు చూద్దారి” అన్న. “సరె తియ్.. దాంట్లేం పొయ్యేడిది లేదు గద “అన్నడు. అప్పటికెంచి దినాం సిరి తోని ప్రభని కూసోబెట్టి పరీక్షకి చద్విపిస్తున్న. ఫరీక్ష రాసిన్రు ఇద్దరు. ఇద్దరు మంచిగనే రాసినమన్నరు. సూడాలె ఇద్దరికొస్తే మంచిది. ఫ్రభని ఎట్లన్న చదువుకోనియ్యాలె అనుకుని దేవునికి మొక్కిన. పెద్ద పరీక్షలు అయినయ్. “అక్కా మీరు బొమ్మల పెండ్లి మంచిగ చేస్తున్రంట కద అవ్వ చెప్పింది ,మల్ల చేసిన్రా ” అని అడిగింది ప్రభ. “లేదు చెల్లె, నువ్వు పుట్టక ముందు రోజు చేసిందే మల్ల చెయ్యలే, మనసిరిగింది చెల్లె ఇగ చెయ్యబుద్ది కాలే, మీ అక్కల పెండ్లుల్లు చూసినంక ఇగ బొమ్మలెందుకనిపిచ్చింది ” అన్న. ప్రభ ఏందో అనబొయ్యింది గానీ నన్ను అమ్మ పిలిచింది పొయ్యిన.

మే నెలొస్తుంది. ఇగ రెండు రోజులల్ల నవోదయ రిసల్ట్స్ వొస్తయి. పాసయితె గిన 15 దినాలల్ల పొయ్యేది లేనిది చెప్పాల్నంట.
ఒక దినం ఆఫీసుకెంచి ఒస్తున్నప్పుడు అమ్మ, నాయిన ఎదురయిన్రు. “ఏడికే అమ్మ చీకటైనంక పోతున్రు” అన్న. నర్సింలు మామ పోయిండని చెప్పిన్రు. “పాపం జెర సుస్తుందని పనికి పోలేదంట. 11 గంటలకింత తిని పండుకున్నోడు ఇగ లెవ్వలేదంట. రేపు బొయ్యి అండాలుని, అన్నుని మందలించి రా బిడ్డా “అన్నది అమ్మ. “నాకు పోబుద్ది అయితలేదమ్మా మనసు బాదయితుంద”న్న. “మంచిగుంటాది బిడ్డా పోకుంటె పొయిరా పో “అన్నది అమ్మ. పొయ్యొచ్చిన. పెద్దోల్లందరు మాట్లాడుతున్రు. అక్కను ఊరికి తోల్కపోతరంట. ప్రభకు చూసిన పిలగానోల్లు వొచ్చిన్రంట.. అంజి గానికి చదువెట్ల అని అనుకుంటున్రు. బోడింగు స్కూల్ల ఎయ్యచ్చనుకుంటున్రు. అన్ను, అండాలు మస్తు ఏడుస్తున్నరు. అన్ను చెక్కరొచ్చి పడ్డది. పిల్లలు దాని మీద పడి ఏడుస్తున్నరు. ఎవ్వలు తీస్కున్న ఒస్తల్లేరు. అన్ను బల్మీకి లేచి, పిల్లగాడ్నెత్తుకోని, పిల్లను దగ్గర కూసుండవెట్టుకుంది. అండాలు మొకం 50 ఏండ్ల దానిలెక్క ఉంది. బుచ్చెడ , పెద్ద బొట్టు, పెద్దోల్లు కట్టుకునేటి చీర. 20 తులాల కడియాలు, 20 తులాల పట్టగొలుసులు, 10 తులాల మట్టెలు దాని కాల్లు మొయ్యలేక పోతున్నయి. ఇంట్ల 10 మంది ఉంటరంట ఇది ఒండకుంటె ఒక్క రోజెల్లదంట. అందరు మొగ పిల్లలేనంట ఇది పెద్ద కోడలంట. పనోల్లు దొరకరంట. బర్రెలున్నయంట. అత్తకు బాలేని కాడికెంచి అన్ని పనులు ఇదొక్కతే చేస్తదంట. ఇంటుంటెనే కడుపుల తిప్పుతుంది. ఎట్ల చేస్తుందో అంత పని. నేను ఎవ్వలని మందలియ్యలె. జెర్రంత సేపు కూకోని బయటికొచ్చిన.
నవోదయ పరీక్షల సిరి , ప్రభ పాస్ అయ్యిన్రు. ఎట్ల చెప్పాల్నో తెలుస్తల్లేదు. పదొద్దులు అయినంక మాపటికి టీచరమ్మని తోల్కపొయ్యిన . అవ్వ కండ్లు చికిలించి “వొచ్చినావ్ బిడ్డా.. ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి “అన్నది. “అవ్వా బాగున్నవా” అన్న. “ఆ బాగనే బిడ్డా.. మీ బొమ్మల పెండ్లి మస్త్ యాద్కొస్తది ఈ రోజులల్ల ఎవ్వలు ఆడతల్లేరు మీ లెక్క” అన్నది అవ్వ. ఈడ నిజం బొమ్మలకి పెండ్లి చేస్తుంటె ఉత్త బొమ్మలతోని ఎవడాడతడు అనుకున్న. “ప్రభకి పిలగాడిని చూస్తున్నం” అన్నది . “అదింక చిన్న బొమ్మ లాగుంది. దానికి పెండ్లేంది ” అన్నది టీచరమ్మ. “మరి దాన్ని చూసేటోల్లెవలు బిడ్డా తల్లి ,తండ్రి లేని బిడ్డ “అన్నది అవ్వ. “తల్లున్నది గదా.. ఎందుకు లేదు “అన్న నేను. “తల్లుంటే ఏమైతది బిడ్డా చదివిపిస్తదా..తండ్రి ఉన్నట్లైతదా” అన్నది అవ్వ. “తండ్రి ఉండంగ అండాలు, అన్ను ఏంచదివిన్రు” అన్నది టీచరమ్మ. “మీ కులపోల్ల లెక్క మా కులపోల్లు సదువుకుంటారు బిడ్డ.. ఏదో ఇంత బువ్వ ఒండి పిల్లలను చూసుకుంటె అదే ఎక్కువ, సూడు అండాలోల్ల అత్తకు బాగలేదంటె పదొద్దులు కాంగనె పొయ్యింది. ఆడ పిల్లలకు అదే ఉండాలె బిడ్డా.. అత్త , మామ, పిల్లలు” అన్నది అవ్వ. “అవ్వా దానికి 20 ఏండ్లయిన ఉన్నయా అంత బరువు మోస్తుంది , అన్నును చూడు పానాలు కండ్లల్లకొచ్చినయ్. దానికి నిల్వ చాతనయితల్లేదు కూసున చాతనయితల్లేదు. ఆస్పతాల్ల చూపిచ్చిన్రా” అన్నది టీచరమ్మ. “ఇగ పిల్లలతోని ఎట్లుంటరు బిడ్డా.. అదే మంచిగయితది తియ్యి” అన్నది అవ్వ. “అక్కనెవలు తోల్కపోతరు” అన్న నేను. “ఆ పొల్ల సుట్టాలేవలో ఉన్నరంట. ఆడ్నే ఉంటది ,దిక్కు మొక్కు ఎవలున్నరు దానికి “అన్నది అవ్వ. ” అన్న పించను ఒస్తది కదా.. ఈడ ఇల్లుండంగ అక్క సుట్టాల కాడికి పొవ్వుడెందుకు.. అంజి గాన్ని చదివించుకుంటె కాదా బోడింగు స్కూలుకెందుకు పోవాలె పిలగాడు ” అన్నది టీచరమ్మ. “ప్రభ పరీక్ష పాస్ అయ్యింది నవోదయ ఇస్కూల్కి పొవ్వచ్చు” అని చెప్పిన . ప్రభ కండ్లు మెరుస్తున్నై . అక్క నన్ను చూసింది. “అక్కా నువ్వుండగనె మామ ఒప్పుకుండు గద ప్రభను తోలియ్యనీకి” అన్న. ఎవ్వలేమి పట్టిచుకుంటలేరు. నేను చిన్నపిల్లనని తీసి పారేసిన్రు . మల్లొక్క పారి చెప్దారని చూసిన. ” ఓ పొల్ల ఏంది సదువు సదువు అని పట్టినవ్. దాని నాయిన పొయినంక ఇగ సదువేంది. పెండ్లి చేస్తె మగడు , అత్త, మామ చూస్తరు. ఈడెవలున్నరు” అన్నడొక పెద్దాయిన. ” ఎవ్వరు అవుసరం లేదు, సర్కారోల్లు చూస్తర”న్నది టీచరమ్మ.”సర్కారోల్లు చూసేదేంది ఆడువిల్లలని ఏడికి పంపేది లేదు. ఇటు తల్లిగారిల్లు అటు అత్త గారిల్లు సమజ్ అయ్యిందా”గట్టిగ అన్నడు. గమ్మున ఊకున్న గానీ ఎట్ల చెయ్యాలని మస్తు పరేషాన్ అయిన. అయ్యో దేవుడా, మాముంటె చెప్పి సంఝాయిస్తుంటి ఇప్పుడెట్ల అనుకున్న.. టీచరమ్మ చెప్పినంత చెప్పింది. ఈ ఊరోల్లైతె టీచరమ్మ మాట ఇంటరు. ఈడ అక్కనిడ్సవెడితె అందరు ఇంకో తాన్నుంచొచ్చినోల్లె. టీచరమ్మ మాట లెక్క చెయ్యలే.
రాత్రంత నాకు నిద్ర రాలే. భగ్గ ఏడుపొచ్చింది. ఎంకన్నకు మొక్కుకుంట నిద్రలకి జారిన. కలల పంచాయతాఫీసుల పెద్ద సారు కానొచ్చిండు. ఉలికిపడి నిద్ర లేచిన. పొదుగాల 7 దాటింది. ఆయనెందుకొచ్చిండొ నా కలలకి అనుకున్న .మేము చిన్నగున్నప్పుడు ఆయన మమ్ములను మస్త్ బయపిస్తుండె. ఆ మీసాలు చూడంగనె బుగులయితుండె. ఎప్పుడు మేము ఆయనకెదురు పోకపోదుము.. “పెయ్యి ఉడుకుందని లేపలె బిడ్డా ,ఇంక జెర పండుకుంటవేమొ” అన్నది అమ్మ. “లేదమ్మా పనుంది” అని లేచిన. ఆఫీసుకి రానని స్రవంతి తోని చెప్పంపిన. తయారయ్యి పంచాయతాఫీసు కాడికి పొయ్యిన. “పెద్ద సారుని కలవాలె” అన్న ఆడున్న అటెండరు రామయ్య తోని.. “ఉండమ్మ అడిగొస్త” అన్నడు. రామయ్య ఒచ్చి “జెర్ర సైసు ఎవలో మాట్లాడుతున్నరు. వాల్లు పొయ్యినంక అడుగుత” అన్నడు. ఏవలెవలొ ఒచ్చిపోతున్నరు.
అక్క పోక ముందు రోజు బొమ్మలాటకి ఒచ్చుడే మల్ల ఈ ఇంటికెల్లి రాలే. టైమున్నది గద, మెల్లగ కొటీడు కాడికి పొయ్యిన. పొయ్యిల్లు దిక్కు తొంగి చూసిన. సావిడి పెల్లలూడి ఉంది. గోడలు ముట్టుకున్న. అక్కా నువ్వే చూడాలే నీ బిడ్డను. నీకు చదువుకునేటోల్లని చూస్తె ఎంత ఇష్టమయితుండె, నీ బిడ్డని చదువుకి పంపు అనుకున్న. కండ్లల్ల కెంచి నీలు కారుతున్నయి.
రామయ్యొచ్చి సారు రమ్మంటుండని చెప్పిండు. బుగులయింతాంది గాని పని గావాలని తెగింపుతోని పొయ్యిన. నా గుండె కొట్టుకునుడు నాకే ఇనిపిస్తుంది. సారు రెండు మాటలు మాట్లాడంగనె భయమెగిరిపొయ్యింది. ఈన మంచోడే. “ఇంత ప్రయత్నం చేస్తున్నవు చూడు అది నాకు నచ్చింది.. ఆఫీసు కాంగనె నిర్సింలు ఇంటికాడికొస్త , ఆడుండుపొమ్మ”న్నడు. సగం పని అయినట్లే అనుకుంట ఇంటికి పొయ్యి, పొద్మీకి మల్ల అండాలొల్లింటి తాన నిలవడ్డ. లోపటికి పోలె. సారొచ్చిండని రామయ్య చెప్పొచ్చిండు. ఆందరు బయటకొచ్చి తోల్కపొయ్యిన్రు. గోడ పొంటి కుర్సీలేసి కూసోమన్నరు. చాయి చెయ్యుమని ఆడోల్లకి చెప్పొచ్చిన్రు. నేను బయట గోడ పక్కపొంటి నిలవడ్డ. సారెందుకొచ్చిండో అని చూస్తున్నరు. సారెంబడి నలుగురైదుగురొచ్చిన్రు. ఫొలీసు పటేలుని ఎంట తెచ్చిండు సారు ఎందుకో. “నర్సింలు పించను గురించి మాట్లాడదామని ఒచ్చిన. పెద్దోల్లు రండ్రి” అన్నడు. ఇద్దరు మొగోల్లు అక్క చుట్టాలు గావొచ్చు వచ్చిన్రు. “నర్సింలు దిక్కోల్లు ఎవ్వలు లేరా “అన్నడు సారు. ఒక పెద్దమనిషొచ్చిండు.. జగ్మోహనంట ఆయన పేరు. “ఫించను పెండ్లాం పేరుకే పోతది. ఇగ మిలిగిన పైసలొస్తయ్ అవేంచెయ్యాల్నో చెప్పున్రి ” అన్నడు సారు. “పిల్ల పెండ్లికున్నది గద సారూ దాని పెండ్లి మందమొస్తయా “అన్నడు జగ్మొహన్. “పిలగాన్నేం చేస్తరు “అన్నడు సారు.
” పిలగానికేం కావాలె పైసలొస్తె పిల్ల పెండ్లి చేసేస్తం “అన్నడు జగ్మోహన్. “ఏంది పిల్లను చదివిపియ్యర” అన్నడు సారు. “లేదు సారు ఇప్పుడందరమున్నము . ఇది అయినంక ముందుకి ఎవలకెవలో అందరున్నప్పుడైతె మంచిగుంటది “అన్నడు జగ్మోహన్. “ఇప్పుడేం ముంచుకొచ్చింది పిల్ల పెండ్లికి “అన్నడు సారు. “గదేంది దొరా ఎవ్వులైన ఆడువిల్లలనుంచుకుంటరా “అన్నడు జగ్మోహన్. ” నేను మా ఆఫీసుల మాట్లాడిన. అందరు ఒక్కటే అంటున్నరు. పైసల్తోని ఇంటి మీద రెండు పోర్షన్లు ఎయిపి స్తె కిరాయి వస్తుంటది అవన్ని ఒక తాన పిల్ల పేరుమీదెస్తె, ఇటు సదువు కాంగనె పెండ్లికొస్తయ్.. ఏమంటరు” అన్నడు. ఎవ్వలేం మాట్లాడలె, జెర్రయినంక అక్క సుట్టాలాయన ముందుకొచ్చి, “ఇల్లు కట్టియ్యనీకి ఎవలున్నరు.ఉన్న ఇల్లు కిరాయికిచ్చి దాన్ని వసూలు చేసుడే ఎక్కువ “అన్నడు. అందరు ఊకున్నరు. సారు ఆలోచిస్తుండు. “కరెక్టే నేను ఆలోచించలే “అన్నడు సారు. ఇగ అయిపోయింది అనుకున్న. సారు చెప్పంపిండేమొ టీచరమ్మొచ్చింది.” ఏమ్మా నవోదయ పరీక్షలేమైనయ్ “అన్నడు సారు. “ఆరుగురికొచ్చింది సారూ మన ఇస్కూల్లకెంచి. మస్తు పేరొచ్చింది మన ఇస్కూల్కి “అన్నదామె. “మల్ల పిల్లలేమంటున్రు పోతరంటనా” అన్నడు. “ఐదుగురు పోతరంట , ఇగో నర్సింలు బిడ్డదే తెలుస్తల్లేదు. ఏంత మంది జైన్ అయితరో లీస్టు రేపటికి పంపుమన్నరు” అన్నది. “సూడున్రి, పొల్ల ముద్దుగ పాస్ అయింది. మీకేంది కష్టం సర్కారోల్లు ఇస్తమంటుంటే “అన్నడు సారు. “పైసలయిపోతయ్ పెండ్లికి మిల్గవు “అన్నడు జగ్మోహన్.” ఫైసలు నర్సింలు పెండ్లాము, ముగ్గురు బిడ్డలు, కొడుకు పేరు మీద 10 ఏండ్లకేద్దాం . మిత్తి కలుపుకుంట మూడింతలయితది. 10 ఏండ్లైనాంక అసలు ఎవరిది వాల్లు తీస్కోన్రి. మిత్తి మందం పిల్ల పెండ్లికియ్యున్రి , ఇంటి కిరాయిలల్ల తల్లి కొడుకులు బతుకుతరు” అన్నడు సారు. “ఇదంత ఆగామాగముంది, పెండ్లి చేద్దారి “అనుకుంట వొచ్చిండు తాత. “ఆవ్ మాకు గుడంగ గదే మంచిగ్గొడుతుంది “అన్నరు అందరు. ముందుకయితుంది ఎన్క కయితుంది. ఎటూ తెగుతల్లేదు. “మీ ఇష్టమయ్య నేను చెప్పినంత చెప్పిన ఇగ మీరు ఆలోచిచ్చుకోన్రి “అనుకుంట సారు లేచిండు. “పైసల కి ఎవలు రావాలె సారు , పిల్లలందరు ఉండాల్నా “అన్నడొకాయన.” ఆ ఉండాలె గద మల్ల అందరున్నప్పుడు చెప్పిపంపున్రి. కాగిదాలు చేపిద్దం” అన్నడు సారు. ఇగ మాటలన్ని పైసల మీదకు పొయ్యినయ్. నేను బాధ పడుకుంట మెల్లగ కదలవట్టిన. సారు కదిలిండు. ఏమయ్యిందో ఒకాయన గట్టిగ మాట్లాడవట్టిండు, ఇంకిద్దరు ఎగబడి మాట్లాడుతున్నరు. సారు కంపవుండు బయటికొచ్చిండు .ఇంతల పోలీసు మామ అందుకున్నడు. “అరే ఇక్కడున్నోల్లకొక్కల్లకైన తెల్వి ఉన్నాదయ్య. అంత పెద్ద సారు చెప్తుండు ఇనాలని తెల్వదా.. ఆయన తల్చుకుంటె పైసా రానియ్యకుంట జేస్తడు. ఏడ్చుకుంటరు మల్ల అన్నడు” అందరు ఖామూష్ అయ్యిన్రు. “ఇంకొక మాట ఇనున్రి. మీకు తెలుసు కావొచ్చు. ఆడవిల్లకు 18 రాకుంట పెండ్లి చేసుడు తప్పు. ఈడ నేనున్ననని మరిచి మాట్లాడుతున్నరు. అందరినీ బొక్కల ఏస్తా..ఏంది 10 ఏండ్ల పిల్లకి పెండ్లేంది “అన్నడు . నేను నవ్వుకున్న. అటు తిప్పి ఇటు తిప్పి ఆలోచన చేసిన గానీ పోలీసు మామ యాదికే రాలేదు. పోలీసులకి బయపడనోడుంటడా.. అవ్వ ఉర్కొచ్చి ” నీ బాంచను బిడ్డా నువ్వెట్లంటె అట్లనే అన్నది” అందరికి బుగులయ్యినట్టుంది. “మాకు తెల్వక మాటలయ్యా పిల్లను చదివిపిద్దాం గదే మంచిది”అన్నరు . “అమ్మా ఇగ నీ చెల్లె చదువు నీ బాధ్యత.. సల్లగుండు బిడ్డా. ఇగ పోతున్న” అన్నడు పెద్ద సారు. పదమూడో దినం కాంగనె మూడాలున్నయంట గవి రాకుంట అక్కను తోల్కపోనీకి తయారయ్యిన్రు. అంజి గాడు ఇప్పటికి అండాలోల్ల తానికి పోతడంట. పెద్ద సారు ఆస్టలు మాట్లాడి పిలిపిస్త అన్నడు. “ప్రభ మాతోనొస్తది” అన్నది అక్క. ఊరికి పొయ్యినంక పెండ్లి చెయ్యరని నమ్మకం లేదు. “ఒద్దక్క ఈడ ఇస్కూల్ల కాగిదాలు గిట్ల తీస్కోవాలె, ఫోట్వలు తీపియ్యాలె ,ఇగ వారమే ఉన్నది గద, ప్రభ మా తానుంటది తియ్యి. సిరి గూడ ఉన్నది గదా “అన్న. పాపం పోలీసు మామ రోజు ఒచ్చి పోతున్నడు ఎవలన్న మనసు మార్చుకుంటరేమో అని. ప్రభని తోల్కపోతా “మామకు మొక్కు చెల్లె “అన్న. ప్రభ మొక్కింది. మామ “సల్లగుండు బిడ్డా.. మంచిగ సదవాలే ,ఏంది” అన్నడు. ప్రభ బట్టల సంచి తీస్కోని నా చెయ్యి పట్టుకుంది. జూన్ 1 కి నవోదయకి ఇద్దరిని తోలిచ్చొచ్చినము. అమ్మా సాల్సాలయ్యింది అనుకుంటుండంగ అన్ను కి బాలేదని తెలిసింది. పురాగ పానం మీదికొచ్చిందంట. ఇద్దరు పిల్లలు ఆగమైతున్నరని అన్ను మొగనికి పిల్లనెవలనైన చూస్తున్నరంట. ప్రభ అయితె ఇంట్ల పిల్ల, పిల్లలను మంచిగ చూసుకుంటదని అనుకుంటున్రంట. నాకు డగ్గుమన్నది. అయ్యొ దేవుడా మల్ల మొదటికొచ్చిందనుకున్న. ఈ పిల్లకు పాపము దినామొక గండమొస్తదేందో అనుకున్నము. ఇస్కూల్ కి పొయ్యి తోలియ్యమని అడిగిన్రంట. నేను ఫారం నింపుతున్నప్పుడు గార్డియన్ అని ఉన్న కాడ నాయిన పేరు కాకుంట పోలీసు మామ పేరు రాసి సంతకం పెట్టిపిచ్చిన. ఇస్కూలోల్లు గార్డియను చెప్తే తోలిస్తము ఆయనను రమ్మన్నరంట. ఇగ ఎవ్వలు మల్ల ఇస్కూల్ తానికి పోలే. దసరా సెలవులకి సిరిని ప్రభని తోల్కొచ్చిన.. సుట్టుముట్టు పిల్లలు ఆడనీకొచ్చిన్రు. “అక్కా ఒకటడగాల్నా “అన్నది ప్రభ. “చదువు మానేస్తా అని కాకుంట ఇంకేమన్న అడుగు” అన్న.”బొమ్మల పెండ్లి చేద్దామా , అవ్వ చెప్తుంటె ఎంత బాగుంటదొ మీరు చేసిన బొమ్మల పెండ్లి” అన్నది. “మంచిది చేద్దాము గానీ మన బొమ్మలు అవ్వ చేసిన బట్ట బొమ్మలో ,మట్టి బొమ్మలో కావు. గట్టి బొమ్మలు . చదువుకోని కొలువు చేస్తున్న బొమ్మలు. కొలువొచ్చినంక మంచిగ చదువుకున్నోల్లని చూసి పెండ్లి చేసుకుంటయ్” అన్నా. అందరు నవ్విన్రు. ” అక్కా బొమ్మలు కొత్తవైతె మానె, పెండ్లయితె మీరు చేసిన అట్లనే చేస్తం గదా “అన్నది ప్రభ. నేను నవ్వుకుంట.. ” ఏడికెంచి షురూ చేద్దాం? చిట్టి చిట్టి మిరియాలు కాడికెంచా” అన్న. “కాదు కాదు మట్టి లడ్డూల కాడికెంచి “అన్నది సిరి. అమ్మ పిల్లలొచ్చిన్రని లడ్డూలు మురుకులు చేసింది. నాయిన కట్నాలప్పుడు అందరికి నోటు పుస్తకాలు , పెన్నులు ఇచ్చిండు అమ్మ గాజులు రిబ్బన్లు ఇచ్చింది. పిల్లందరు ఆటలు పాటలు. ప్రభ సదువు పురాగ సాగుతదని చెప్పనీకి అయితల్లేదు గానీ ఎందుకో చాన దినాలకి మనసుల ఏడనో మంచిగ్గొడుటుంది. ప్రభ మొఖం ల అక్క నవ్వు కానొచ్చింది..ఈ దినం అక్క ఏడున్నా మురుస్తది ..బొమ్మల పెండ్లి చేసినందుకు కాదు ఒక బొమ్మ పెండ్లి ఆపినందుకు……….

5 thoughts on “బొమ్మల పెండ్లి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *