May 2, 2024

‘రేల పూలు’ – ఓ వీక్షణం

రచన: శ్రీమతి నండూరి సుందరీ నాగమణి

rela-330x500

రేల పూలు! పసుపు పచ్చని వర్ణంతో గుత్తులు గుత్తులుగా పూచి, ఆకాశం అందిస్తున్న కాసులపేర్లల్లే భూమివైపు వంగుతున్న ఈ పూలు… రేల పూలు! ఎంత బావున్నాయో కదా!!

వీటిని చూస్తూంటే మనసంతా ఎంత ఆనందంతో నిండిపోతుందో… ఈ మనోహరమైన సుమాల వంటి గిరిజన తండాల గురించిన కథలే ఈ ‘రేలపూలు’ – శ్రీమతి సమ్మెట ఉమాదేవి కథాగుఛ్చం. ఈ కథలు చదువుతూ ఉంటే కూడా, అదే ఆనందం, అదే సంతృప్తి… ఈ అందమైన పుస్తకంలో పొందుపరచబడిన పదిహేడు కథలూ ఒక దానికి మరొకటి సాటి, పోటీ అయినవే … మనసును ఆలోచింపజేసేవి, గుండెను తట్టి లేపేవి, మెదడుకు స్పందన కలిగించేవి… మొట్టమొదటి కథ ‘అస్తిత్వం’ నుండి చిట్టచివరి కథ ‘వారధి’ వరకూ ఆపకుండా చదివించే పుస్తకం ఇది. మరి ఈ కథావలోకనం చేద్దామా ఒక్కసారి?

అది ఒక బడి. ఆ బడి ఆ గిరిజన తండాలో ఉన్నది. అక్కడ ఒక గిరిజన ఉపాధ్యాయుడు చేర్యా కూడా ఉన్నాడు. అక్కడ పిల్లల పేర్లు అన్నీలాల్, పోలీ, అమ్రు, సాల్కి, సక్రూ, రాంనాయక్, హర్యాలాల్, బిక్కూలాల్ వంటి అందమైన అమ్మా నాన్నలు పెట్టిన పేర్లు కాదు. బళ్ళో టీచర్లు పెట్టిన అనిల్ కుమార్, ప్రవల్లిక, అనూష, శైలజ, పవన్ కళ్యాణ్, రాంచరణ్, హరీష్, మహేష్ బాబు… ఈ పేర్ల తేడా వలన ఏమైనా సమస్యలు తలెత్తాయా? ఏం, మాకు మాత్రం మంచి పేర్లు, ఆధునికంగా వినిపించే పేర్లు వద్దా?’ కోపంగా అడుగుతాడు చేర్యా పంతులు గారు. అలా మార్చమని పిల్లలూ, తల్లిదండ్రులు కూడా ముచ్చట పడతారు. మరి చివరికి ఆ పేర్ల వలన ఏమైంది? ఈ కథలో మనకి గిరిజన తండాల ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకొనే పండుగలు, వాటి గురించి సృజనాత్మక శక్తితో చిన్నపిల్లలు వ్యాసాలూ వ్రాయటం – ఎంతో చక్కగా ఆవిష్కరించబడిన ఈ కథ ‘అస్తిత్వం’ తో ఈ తీయని కథల ప్రపంచం లోనికి మనం తొలి అడుగులు వేస్తాం…

రెండవ కథ ‘బిజిలి’ ఇంట్లో కరెంటు దీపం ఉంటే బాగా చదువుకుని, జీవితంలో విద్యాదీపం వెలిగించుకోవచ్చని ఆరాటపడే చిన్నారి సాల్కి కథ ఇది. అయితే అక్రమ పద్ధతిలోనైనా ఆ దీపపు వెలుగులు పొందాలని ఆశించిన ఆ కుటుంబానికి, సాల్కికి ఏమయింది? విధి ఏ బహుమతి ఇచ్చింది? కథ చదవటం పూర్తయేసరికి అక్షరాలు మసకగా కనబడతాయి మనకి విద్యుద్దీపం కాంతిలో కూడా… నీటి తెర పలుచగా అడ్డుకుంటుంది కదా మరి! ఈ కథ ఉపాధ్యాయ మాసపత్రిక వారి కథల పోటీలో ద్వితీయబహుమతిని గెలుచుకొని మార్చి 2012 సంచికలో ప్రచురించబడింది.

తరువాతి కథ ‘చాంది’. చాంది, తమ్ముడు, చెల్లెలు బడిలో చదువుకొంటూ ఉంటారు. వాళ్లకి చదువంటే ప్రాణం. అకస్మాత్తుగా విధి వైపరీత్యం…అమ్మేది? నాన్నకి బుద్ధి చెప్పరేం ఈ కులపెద్దలు? అయ్యో, ప్రేమించుకున్న పిన్ని తార, బాబాయ్ బిక్కూలాల్ లను విడదీస్తారా? గొంతు చించుకొని తన తండాలోని బంధు వర్గాన్ని నిలదీస్తుంది చాంది. ఆ పొలికేకకు తోక ముడుస్తుంది బంధు గణం. చక్కని ముగింపుతో – బాగా ఆకలివేసినప్పుడు మృష్టాన్నం తిన్నంత తృప్తినిస్తుంది ఈ కథ.

దివిలి! అడవిలోని పువ్వుల్లో పువ్వుగా, చెట్టులో చెట్టుగా, పిట్టల్లో పిట్టగా ఆనందించే దివిలి ఒక బంగారు బొమ్మ. ఆమెకు అనురాగాన్ని పంచే అన్న రూప్లా. అతను చదువుకోవటానికి పట్నం వెళ్లినప్పుడు దివిలికి ప్రాణంలో ప్రాణమైన పువ్వులనే ఎరగా వేసి ఆమె మానాన్ని కబళిస్తాడు రాజు నాయక్. పెళ్లి కాని తల్లి అయిన చిన్నారి దివిలి తన పాపకు జన్మనిచ్చి కన్ను మూస్తుంది. ఆ పాప విరిని తన ప్రాణంగా చూసుకుంటూ, రూప్లా తన చెల్లెలు దివిలి సమాధి దగ్గర పూలు పెట్టి, పాపను చూపించే ఘట్టంతో కథ ముగుస్తుంది. అన్నంటే ఇలానే ఉండాలి అనిపించే ‘రూప్లా’ పాత్ర, తుమ్మెద వంటి రాజూనాయక్, పసిపాప వంటి దివిలి… మన మనసులో అలాగే నిలిచిపోతారు. ఈ కథ చదివిన తరువాత మన మనసును ఎవరో పట్టి నొక్కేసిన భావన కలుగక మానదు. తండా ప్రజల చిత్రమైన ఆచార వ్యవహారాలను కూడా తెలుసుకోగలుగుతాము ఈ కథలో…
‘జై జై జై గణేశా!’ ఈ కథలో రజని పాత్ర చిత్రీకరణ అద్భుతం. తండాల్లో ఇంటింటికీ తిరుగుతూ, అందరికీ మందులు ఇస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకై పాటు పడుతూ, అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించే రజని ఒక ప్రభుత్వోద్యోగి. అందరికీ ఆప్తురాలు… తండాల్లోని ప్రతి అబ్బాయికీ ఆమె అక్కే… పెద్ద వినాయకుడిని తెచ్చుకుని గణేష్ చవితి పూజలు చేద్దామని ముచ్చట పడిన తండా యువకులు, యాక్సిడెంట్ పాల్పడిన రజనక్క కోసం వసూలు చేసిన చందా మొత్తాన్ని ఖర్చుపెట్టి ఆమెను ఆస్పత్రి లో చేరుస్తారు. ఒక పెద్ద మట్టి వినాయకుడిని చేసుకుని పండుగ జరుపుకుంటారు. నిమజ్జనం రోజున తన ప్రాణాలను కాపాడిన తమ్ముళ్ళను చూడటం కోసం రజని వస్తుంది. అందరూ కలిసి పండుగ జరుపుకుంటున్న ఆ సమయంలో ‘ఈ తండాయే తన పుట్టిల్లని, తనను కాపాడిన తమ్ముళ్ళే తన వారని, ఆ వినాయకుడే తన వేల్పని మొక్కుకోవటానికి వచ్చింది మీ అక్క…’ అని రజని భర్త చెప్పిన మాటలు ఆ తమ్ముళ్ళ మనసులని, మన మనసుల్నీ కూడా చెమరింప జేస్తాయి…
‘కేస్లా’ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక యువకుని కథ. ‘ఓ పాలబుగ్గల చిన్ని రైతా…’ చదువుకోవాలని తపించే ఒక బాలుడి కథ…రెండు కథలు కూడా మనని ఆలోచింప జేస్తూనే పరిస్థితుల పట్ల మనకి ఒక బాధను, ఆవేదనను కలిగిస్తాయి కూడా.
‘తావుర్యా’ – ప్రాణాలను పణంగా పెట్టి మొక్కజొన్న కంకులు పండించుకుంటారు తావుర్యా, అతని కుటుంబసభ్యులు. ఆ పంటను కోతులు వచ్చి తినేస్తూ నాశనం చేస్తూ ఉంటాయి. వాటిని బెదరగొట్టటానికి ఎలుగుబంటి చర్మంతో చేసిన దుస్తులు ధరించి వాటి బారినుండి పంటను కాపాడుకుంటూ ఉంటారు తావ్యుర్యా పిల్లలు ఇద్దరూ… అయితే మొక్కజొన్న కంకులు ఎదుగుతూనే ఉంటాయి, దొరగారికీ, కుటుంబ సభ్యులకూ వారి బంధు వర్గానికీ కంకులు కాల్చి ఇవ్వటమో, మక్క గారెలు చేసివ్వటమో తప్పదు వీరికి… పిల్లలు నోరు తెరిచి అడిగినా ఒక్క కంకి కూడా ఇవ్వని తావుర్యా భార్య వాటిని దొర కుటుంబానికి ఇచ్చినప్పుడు అసహాయతతో కన్నీరు కారుస్తుంది. పంట చేను మొత్తం సగానికి పైగా కంకులు లేకుండా ఖాళీ అయి, చిందర వందరగా ఉన్నప్పుడు కోతులు మళ్ళీ వస్తాయి. వాటిని బెదిరించబోయిన పిల్లలతో ‘వాటిని తిననీయమని, మనుషుల్లా కాక అవి కడుపు నిండిన వెంటనే తమకూ కాసిని కంకులను మిగిల్చి వెళతాయని’ చెబుతాడు తావుర్యా… తండావాసుల కృషిని, ఘర్మ జలంతో పండించుకున్న పంటలనూ దొరలు ఎలా దోచుకుంటున్నారో తెలియజెప్పే ఒక మంచి కథ ఇది.

‘వాన’ – వర్షంలో బాగా తడిసిపోయి ఇంటికి చేరలేని మాలపల్లి పిల్లలను తన ఇంటికి తీసుకుపోయిన తండా వాసుడు సోమ్లా, ఆ పిల్లలకు భోజనం పెట్టి, తమ గుడిసెలోనే కొంచెం చోటిచ్చి నిద్రపుచ్చిన అతని భార్య పోలి తండావాసుల ఆగ్రహానికి గురియౌతారు. తెల్లారేసరికి తాము ‘వెలి’కి సిద్ధంగా ఉండాలి అనుకుంటారా దంపతులు. అనుకున్నట్టే ఊరి పెద్ద వచ్చి వారిని బెదిరిస్తాడు. అయితే ఆ పసిపిల్లల ముఖాల్లో అమాయకత్వాన్ని, దైన్యాన్ని చూసిన ఆయన క్షణంలో మెత్తబడిపోతాడు. ఎంతో ఆదరంగా ‘మీకోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూసే మీ అమ్మానాన్నల దగ్గరకు త్వరగా వెళ్ళండి’ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాన వచ్చి మలినాలను కడిగేస్తే ప్రకృతి స్వచ్చంగా మెరిసినట్టు, భేదాలు కడగబడిన మనసులు సైతం స్వచ్చం అవుతాయి. దిగువ వర్గాలలోనూ ఎన్నెన్నో భేదాలున్నాయి అని తెలియజెప్పే కథ… వర్షంలా వాటిని అన్నింటినీ కడిగేయాలని ఉద్బోధించే మంచి కథ ఇది.

‘కమ్లి’ – భార్యను ఎంతగానో ప్రేమించే సూర్యా కథ ఇది… ఆడపిల్లను కన్నందుకు అనుదినమూ అత్త తో మాటలు పడే కోడలి కథ… చివరికి అపస్మారక స్థితిలోనికి వెళ్ళిన కమ్లీ ఎవరి పిలుపుతో మృత్యు ముఖంలోనుంచి తిరిగి లేచింది? ఎవరి స్పర్శతో జీవాన్ని నింపుకుంది? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే కథ చదవాల్సిందే. సాహితీ స్రవంతి వారు నిర్వహించిన బ్రౌన్ అకాడమీ బహుమతి పొందిన కథ ఇది.

‘గిరికానదీపం’ – జాలా చదువుకున్న యువతి. చిన్నతనం నుంచీ తన తండాకు మంచి జరగాలని, తన తోటిపిల్లలు అందరూ వెట్టి చాకిరీకి బలి కాకుండా చదువుల తల్లి ముద్దుల బిడ్డలు కావాలని కలలు కని వాటిని సాకారం చేసుకోవటానికి అంతో ఇంతో కృషి చేసిన అమ్మాయి. చదువుకుని, టీచర్ ట్రైనింగ్ అయి, తౌర్యా అనే బస్తీలో ఉద్యోగం చేస్తున్న యువకుడిని వివాహమాడుతుంది. కాని అకస్మాత్తుగా అతనితో విడిపోయి, తన బ్రతుకు తాను బ్రతకాలని నిర్ణయించుకుంటుంది… అందుకు కారణాలేమిటి? కథంతా పూర్తయే సరికి మనం కూడా మనసారా అభినందిస్తాం సుమండీ జాలా నిర్ణయాన్ని… నవ్య వారపత్రిక వారు నిర్వహించిన కథలపోటీలో విశేష బహుమతి గెలుచుకున్న కథ ఇది.

‘చీనా’ – ఇలాంటి అన్న ఉండాలి… ఇలాంటి మామ ఉండాలి… ఇలాంటి కొడుకుండాలి… ఇలాంటి భర్త ఉండాలి… అని అందరూ చీనానే కోరుకుంటారు. అంత యోగ్యుడైన యువకుడు అతను. అలాంటి చీనా జీవితంలో ఎందుకా వెలితి? సాహిత్యప్రస్థానం మాసపత్రికలో జనార్దన మహర్షి పురస్కారం పొందిన ఈ కథను చదవకుంటే ఒక మంచి కథను చేజార్చుకున్నట్టే.
తరువాతి కథ ‘అల్యా’ – తండా యువతి అల్యా, ఉత్తర దేశం నుంచి వలస వచ్చిన చందర్ ల ప్రేమ గాథ ఇది… ఆద్యంతమూ లలితమైన ప్రణయంతో, మురిపాలతో మనకు ముచ్చటగొలిపే కథ. ‘ఆశలు’ – బడిలో ఉచితంగా ఇచ్చిన బూట్లను పిల్లలు ఎందుకు ధరించటం లేదు? ఆర్ద్రతను కలిగించే కథ ఇది. ‘హాథీరామ్’ – కోతులను ఎంతగానో ప్రేమించే జంతుప్రేమికుని కథ.
‘అమ్రు’ – ఆమెకు భర్త చనిపోయిన అనంతరం ఆ ఠాణా లో కొలువు దొరికింది. నైట్ వాచ్ ఉమన్ గా చేరిన అమ్రూ పట్టుదలగా తన కూతురితో పాటుగా పదవతరగతి పరీక్షలు పాసై అదే ఆఫీసులో అటెండర్ పోస్ట్ సంపాదించుకుంటుంది. తనపై కన్ను వేసిన పై అధికారుల పన్నాగాల నుండి తనను తానూ రక్షించుకుంటుంది… ఆపై యూనియన్ లీడర్ గా ఎదిగి, ఆ అధికారులే ఆమెతో అతి జాగ్రత్తగా మాట్లాడే పరిస్థితిని తీసుకు వస్తుంది. చాల మంచి కథ ఇది.

‘వారధి’ – బయటి ప్రపంచానికి, అడవిలో దాగి ఉన్న ఆ తండాకి వారధి – ఊరికి కొత్తగా వేసిన బస్సు… ఆ బస్సు రావటం కోసం టీచర్లు తన్వీ, శాలిని ఎంతగా ప్రయత్నించి సాధించారో, చివరికి ఎంతగా విలపించారో తెలిపే హృద్యమైన కథ.
మొత్తం పదిహేడు కథలూ పదిహేడు మణిపూసలై మెరుస్తాయి ఈ కథల సరంలో… ‘ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై’ అన్నట్టుగా ఉద్యోగ రీత్యా అడవితల్లి ఒడిలోనే ఉంటూ అడవిబిడ్డలకు విద్యను నేర్పించే రచయిత్రి సహజంగానే ప్రకృతి ప్రేమికురాలు కావటంతో, స్వచ్చమైన, సహజమైన అడవి అందాల సౌకుమార్యాలు ఈ కథలకు అలంకారాలు అయ్యాయి. రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవికి ఈ మంచి గ్రంథాన్ని రచించినందుకు అభినందనలు తెలుపుతూ, ఆమె లేఖిని నుంచి మరిన్ని మంచి కథలు రావాలని మరీ మరీ ఆకాంక్షిస్తున్నాను. శుభమస్తు!

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *