May 3, 2024

” తండ్రంటే మీరే నాన్నగారూ”

రచన: వెంకట్ అద్దంకి
venkat addanki

“పుత్రొత్సాహము తండ్రికి
పుత్రుడు జనియించినపుడు కలుగదు
జనులా పుత్రుని కనుగొని పొగడగ
పుత్రొత్సహంబు నాడు పొందుర సుమతీ!”

అని సుమతీ శతకంలో చెప్పేరు గానీ ( మళ్ళీ ఇక్కడ స్త్రీవాదులు స్త్రీ వివక్ష అంటారేమో, పద్యానికి పదాలు కుదరాలని మాత్రమే పుత్రుడు అన్నారు ఏ తండ్రికైనా పిల్లలు ఆడ అయినా, మొగ అయినా సమానమే) పిల్లలు పుట్టినపుడు ఏ తండ్రి సంతోషం అనుభవించడు?? దానికి తోడు ఒకింత గర్వంకూడా చూపకుండా చెప్తాడా తండ్రినయ్యానని? తల్లి ప్రసవ వేదన పడి జన్మనిచ్చి అలసిపోయి మగతలోకి వెళ్ళి పుట్టిన పిల్ల/పిల్లాడు ఎలా వున్నారు అని కూడా చూడలేదు, కానీ ముందుగా పుట్టిన పిల్లలని చూసేది తండ్రే. మిఠాయిలు పంచి ఊరందరికి శుభవార్త చెప్పేదీ తండ్రే. పేగు తెంచి జన్మ నిచ్చేది తల్లే అయినా , ఆ బంధానికి ఆధారంగా నిలచి జీవితాన్ని నిలబెట్టేవాడు తండ్రి. కనుపాపలాగ రోజంతా పిల్లలని తల్లి చూస్తున్నా ఇంటికి రాగానే పిల్లలని వెతికే కళ్ళు తండ్రివే. రోజంతా పిల్లలు చేసిన పనులు తల్లి చెబుతుంటే గుంభనంగా తనలో తాను ఆనందిస్తూ ఆ మాటలు వింటూ ఉప్పొంగిపోయేదీ తండ్రే. నడకలు నేరుస్తున్న పిల్లలతో వేలు పట్టి నడిపించి పొంగిపోయేదీ తండ్రే. పైకి అనకపోయినా పిల్లలకి తల్లి దగ్గరవుండే చనువు తల్లి దగ్గర నేర్చుకొంటున్న విషయాలు తనే నేర్పాలి అని తహతహలాడేదీ తండ్రే. ఎవరైనా పిల్లలు ఏమి చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని తల్లిని అడిగితే అన్నీ చెప్తుంది అదే తండ్రిని అడిగితే ముక్త సరిగా చెప్పినా ఆ చెప్పడంలో ఒకింత గర్వం తొణికిసలాడకుండా ఉండదు.
తల్లి కళ్ళలో పెట్టుకు చూసుకుంటే, తండ్రి గుండెల్లో పెట్టుకొని చూస్తాడు. ఏ తండ్రైనా ఇంక పిల్లల చిన్న చిన్న విజయాలకు పొంగిపోయినా బయటకు తెలియకుండా మనసులోనే మరింత పైకి రావాలని అశీర్వదిస్తూ ఉంటాడు. పిల్లలు తండ్రి ఏ రోజూ పొగడటంలేదు అనుకొంటున్నారని తెలిసినా మరీ కళ్ళు నెత్తికి ఎక్కుతాయేమో అన్న భయంతో మౌనంగా ఆ అపవాదుని మోస్తూఉండేది తండ్రే. పిల్లల కోసం త్యాగాలు చేసేది తల్లి తండ్రులే, తన ఖర్చులో లేక తన అలవాట్లనో పిల్లలకోసం త్యాగం చేసి పిల్లలు ఆనందంగా ఉండలని వాళ్ళ ఖర్చులకి సరపడా సంపాదించాలని పిల్లలకి దూరంగా ఉండి అనుక్షణం కష్టపడుతూ కూడా పూర్తి సంతృప్తిని అనుభవించేది తండ్రి మాత్రమే. కొంచం పిల్లలకి నలత చేస్తే తనకే ఏదో అయినట్లు తల్లి బయటపడి బాధపడుతున్నా, గంభీరంగా మనసులోనే రోదించడం తండ్రికే చెల్లు. తనకు దొరకని సౌఖ్యాలు పిల్లలు అనుభవించాలి అని తహ తహలాడే హృదయం తండ్రిది. ఆందుకే తన బాధలు, కష్టాలు పిల్లలకి తెలియనివ్వకుండా కన్నీళ్ళు పైకి రాకుండా దిగమింగుకోవడం ఒక తండ్రికే సాధ్యం అంటే వింతకాదు. పిల్లలని దారిలోపెట్టడానికి దండన సరైన పద్ధతికాబట్టి మందలించో ,లేక చెయ్యి చేసుకున్నా దానివెనుక పిల్లలు అందులో తప్పు తెలుసుకొని వాళ్ల ఎదుగుదలలో వస్తున్న విఘ్నాలు తొలగించుకోవాలనే గానీ, వారిని హింసించాలని కాదు. అలాంటివి జరిగినా రాత్రి నిద్రపోయే ముందు తల్లి దగ్గర చెప్పుకొని బాధపడేదే తండ్రి మనసు. పిల్లలకి చనువు, గారం తల్లి దగ్గరే అయినా వాళ్ళు చిన్నప్పుడు ఒక రోల్ మాడల్ గా , ఒక హీరో గా చూసేది తండ్రినే. స్కూల్లో ఎవరితోనైనా తగాదా వస్తే ఇంటికివచ్చి చెప్పేది తండ్రికే. ఎందుకంటే చిన్నపటి నుండి మెదడులో బలపడే అంశం తండ్రి మన జీవన రక్షకుడు అని. చిన్నప్పుడు ఒక రక్షకుడిగా, యుక్తవయసు వచ్చాక ఒక స్నేహితుడిలా ఉండి, పిల్లలు ఎదిగి ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నప్పుడు కొంత ఊపిరి పీల్చుకున్నా, మళ్ళీ వెంటనే వారి భవిష్యత్తులో తను అనుభవించన కష్టాలు పడకూడదని అనుక్షణం వారి బాగోగులమీద దృష్టిఉంచి వాళ్ళ భవిష్యత్ కోసమే పునాదులు వేసుకునేలా ప్రేరేపిస్తూ వారినుండి ప్రేమను తప్పితే వారి సంపాదనని ఆశించనిది తండ్రే. వివాహ బాధ్యతలు పూర్తిచేసి వారు మళ్ళీ ఏ కష్టం లేకుండా జీవించాలని వీలయినంత దూరంగా ఉండి తన అభిప్రాయాలను కొంత కొంత వ్యక్తం చేస్తూ పూర్తిగా వారి విషయాల్లో కలిగించుకోకుండా తను పెంచిన రీతి వాళ్ళని పైకి తీసుకొస్తుందన్న నమ్మకంతో జీవించేవాడు తండ్రి.
మా నాన్నగారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడు ఎప్పుడైనా రోడ్ మీద ఆయన చెయ్యపట్టుకొని నడుస్తున్నప్పుడు అటు ఇటు కదలిపోతున్నా సైకిళ్ళు రిక్షాలు దాటుతున్నా ఆగవలసి వస్తే పట్టుకున్న చేతిని ఒకరకంగా లోపలకి వంచేవారు అంటే ఆగమని అర్ధం. ఏదో బండికి బ్రేక్స్ అప్ప్లై చేసినట్లు గమ్మత్తుగా వంచేవారు, నేనెప్పుడు రోడ్ మీదకి వచ్చినా ఏదో చెప్పేయాలని ఏదేదో మాట్లాడుతూ ఉండే వాడిని అందుకే రోడ్ మీద ఏమివస్తున్నాయో దృష్టి ఉండేది కాదు. ఎప్పుడు ఏదో ఒక రకమైన తింగరిపనులు అల్లరి చెయ్యడం ఆయన చేత దెబ్బలు తినడం. ఆయన అంటే భయం భక్తీ ఉన్నా మన అల్లరి మనం ఏ రోజూ మానలేదు. ఆయన వస్తువులు అంటే పెన్, అలార్మ్ క్లాక్ లాంటివి జాగ్రత్తగా ఒకే స్థానంలో పెట్టడం ఆయనకి మొదటినుండి అలవాటు, ఏ పొజిషన్లో పెట్టేరో గుర్తుంటుంది ఆయనకు, ముందు అవి తీసినా వాటితో ఆది అక్కడే పెట్టేసినా ఇంటికి రాగానే ఎవరు ముట్టుకున్నారని అరిచేవారు, ఎలా తెలుస్తోందా అని ఆలోచించి ఆ తరువాత అంతే జగ్రత్తగా ఏ పొజిషన్లో పెట్టరో అదే పొజిషన్లో పెట్టడడం చేసేవాడినిగానీ ఆయన తిడతారు అని తెలిసినా తియ్యడం మాత్రం మానేవాడిని కాదు. అలాగే అలార్మ్ క్లాక్ స్క్రూలు ఇప్పేసి స్ప్రింగులన్ని ఎటువటు తన్నేస్తే మళ్ళీ అన్నిటిని ఏరి అందులో వేసి బిగించెయ్యడం. ఎక్కువ గట్టిగా అరవడమే తప్పిటే కోపం తరస్థాయికి చేరితే గానీ కొట్టేవారు కాదు. అలాగే కాలేజ్ కి వచ్చాకా రోజూ రోడ్లమ్మట, ప్లే గ్రౌండ్స్లోను తిరుగుతూ ఇంటికి ఏ రాత్రి తొమ్మిదికో జేరితే కూడా ఒక పది పదిహేను రోజులు చూసి ఒక సారి అరిచేవారుగానీ రోజూ అదే పనిగా అరిచేవారు కాదు. యుక్త వయసు వచ్చిన పిల్లలని కొట్టకూడదు అన్న నియమం మాత్రం తప్పనిసరిగా అమలుచేసారు. మేము ముగ్గురం యుక్తవయసు కి వచ్చిన తరువాత మాత్రం ఏ రోజు కొట్టలేదు. కేవలం మందలించడమే. అయినా మా అన్నా తమ్ముడు ఏ రోజు అల్లరి చేసేవారుకాదు, ఆయనకి కోపం వస్తుంది అని, మన రూటే సెపరేటు. అందుకే ఆయంచేతిలో దెబ్బలు తిన్నది నేనే. ఆయనకి కోపం వచ్చి మా ముగ్గురిని వరుసలో, తమ్ముడు చిన్నవాడు కాబట్టి వాడికి ఎక్సప్షన్ మా అమ్మ పక్కకి తీసేసేవారు, నేను మా అన్నగారు నిలబడితే మా అన్నగారు మాట్లాడకుండా చూస్తూ ఉండేవారుగానీ అంతోకొంతో మేకపోతు గాంభీర్యంతో సమాధానం అయనతో వాడనకి దిగేవాడిని నేనే.
ఆయన జగమొండి , ఏ విషయానికైనా సరే. మా అమ్మ చక్కగా పాడుకోవచ్చు ‘మొరటోదు నా మొగుడు అని. . . “. ఇప్పటికీ అంతే మాట వినరు ఎన్ని చెప్పినా ఆయనకు నచ్చిందే చెయ్యాలి, మా అమ్మకి అలవాటు అయిపోయింది. నాకు నాలుగు ఐదు సంవత్సరాల వయసేమో అప్పట్లో మా బామ్మ గారు మాతో ఉండేవారు, ఏదో మాట అస్సలు వినటంలేదని ఆవిడ చెప్తే ఒక గిన్ని బాగా మాద్చి మసిపట్టేలా చేసి దాన్ని తెల్లగా తోమమని కొబ్బరిపీచు ఇచ్చి పెరట్లో కూర్చోపెట్టారు. రెండు గంటల తరువాత కూడా నేను లోపలకి రాకపోతే ఏమిచేస్తున్నానొ చూద్దామని వస్తే ఒక అంగుళం మాత్రం గీస్త్తూ ఉన్నను గానీ గిన్నేకున్న మసిమాత్రం వదలకుండా ఉంటే వీడు నాకన్నా మొండాడు అని లొపలకి తీసుకొచ్చేసారు. ఇవన్నీ వూహలు తెలిసేక అయితే వూహ తెలియకముందు మనకి ఆయన చేసినవి అన్నీ ఇన్నీకాదు. ఎవరైనా పెద్దవాళ్ళు, లేక మా అమ్మ చెబుతూ వుంటారు. చిన్నప్పుడు నన్ను చూసి తెగ మురిసిపోయేవారుట , నేను అల్లరి చేస్తుంటే మహా అనందంగా చూసేవారుట. అలాగే చిన్నప్పుడు ఏదో స్కిన్ ఇంఫెక్షన్ చెస్ట్ మీద వచ్చి బాధపడుతుంటే ఇంగ్లీషు వైద్యానికి కూడా తగ్గకపోతే ఎవరో చప్పి అది, దానికి మంత్రాలు వేస్తారని చెబితే చలిలో ఆ మంత్రం వేయించడానికి తెల్లవారు ఝామునే క్రమం తప్పకుండా వారం రోజులు తిరిగేరుట ఆయన. ఒక పక్క తల్లికదా మా బామ్మగారు అది నీకు అంటుకొంటుంది అని చెప్తున్నా వినకుండా నాకు ఎక్కడ చలిగాలి తగులుతుందో అని గుండెలలకి పొదవిపట్టుకొని తీసుకెళ్ళేవారుట. ఒక సారి ఏదో పూజలు చేసి సంతర్పణలు అవుతుంటే పాక్కుంటూ బూర్లగంప వెనక్కి చేరి ఒక ఆకు లాక్కొని అందులో పెట్టుకొని తింటూ కూర్చుంటే ఎవరూ చూసుకోలేదు మధ్యలో ఆయనే అడిగారుట నేను ఎక్కడా అని ఎవరికీ కనపడకుండా పోయేసరికి నానా హంగామా చేసి అందరిమీదా అరిచి ఒక పక్క భోజనాలు అవుతుంటే అవి చూస్తూ అతిధులకి ఇబ్బంది రాకుండా, మా కజిన్స్లో పెద్దవాళ్ళని అందరిని తలో పక్కకి పంపించేరుట. తీరా నేను కనపడగానే పట్టుకొని కూర్చున్నారుట , మళ్ళీ ఎటైనా పోతానని. స్కూల్లో చదువుతున్నప్పుడు ఎప్పుడైనా స్కూలు టూర్ కి వెడాతానంటే పంపించేవారుకాదు. చాలా కాలం బాధపడే వాడిని ఎందుకు పంపించరు అని అర్ధంకాక తరువాత తెలిసింది చిన్నప్పుడు నాకు ఆయాశం వస్తూ వుండేది , అలా ఏమన్నా సడెన్ గా వస్తే ఎమీ చెయ్యలేము అని ఆయన కంగారు. రెండేళ్ళ క్రితం మా పెద్దవాడు స్కూల్ టూర్ కి నేను పంపనంటున్నానని చెప్తే పరవాలేదు పంపించు అని మా అమ్మద్వారా చెప్పించేరు, నేను సరదాకి మీ ముసలాయనని అడుగు అప్పుడు నన్ను పంపించలేదుగానీ ఇప్పుడు మనవడిని ఎందుకు పంపించమంటున్నారని? ఇప్పటికీ మా దగ్గరకొచ్చి ఉండండి అంటే వినరు ఆయన పద్ధతి ఆయనదే. ఇలా చెప్పుకుంటూ పోతే తండ్రుల గురించి వారి త్యాగాల గురించి ఎన్ని చెప్పినా ఎన్ని రాసినా తక్కువే అవుతుంది. ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తికీ తల్లి తండ్రుల ఋణం మాత్రం తీరుచుకోలేనిదే.

8 thoughts on “” తండ్రంటే మీరే నాన్నగారూ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *