May 5, 2024

నాన్న ఒక అద్భుత ప్రపంచం

రచన: కొప్పరపు సుబ్బలక్ష్మి

అవును నాన్న నాకొక అధ్భుత ప్రపంచం. ఒక నిశ్శబ్ధ సంగీతం. నాన్న నాదమయితే ఆ స్వరం అమ్మ. అమ్మ నాన్న శృతిలయలు. మనల్ని ఈ ప్రపంచంలోకి తెచ్చి ప్రపంచం చూపించి ఎలా బ్రతకాలో మనకు నేర్పించిన మార్గదర్శకులు వాళ్ళు.
నాకు మా నాన్నంటే ఓ పిసరు మక్కువ ఎక్కువ.
అందరిలాగానే బడి చదువులు. మాకు పానుగంటివారి సాక్షి, చిలకమర్తివారి గణపతి , విశ్వనాధవారి కిన్నెరసాని గురజాడవారి గిరీశం వీళ్లందరినీ నాన్నే పరిచయంచేసారు. పుస్తకాలు చదవడంఅనే అభిరుచి కలిగించారు. అది తరువాత అలవాటుగా అయిపోయింది. షేక్ష్పీయర్ నాటకాలు కధలుగా చెప్పారు. యులిసస్ లోని తృష్ణను తెలియచేసిన మానాన్నంటే నాకెంతో ఇష్టం.
బంధుమిత్రులకు ఉత్తరాలు మాతో రాయించేవారు.ఎవరిని ఎలా సంభోదించాలో తెలీసేది.. మహాలక్ష్మిసమానురాలయిన, గంగాభాగీరధీ సమానురాలయిన, మహారాజశ్రీ, చిరంజీవీ ఇలా అన్నమాట. ఇప్పుడు అందరికీ మైడియరే.
మీరు నవ్వు తారేమో. పరీక్షలలొ శ్రీజవహరలాల్ నెహ్రూ, శ్రీ రాజేంద్రప్రసాద్ అంటూ అట్లా పెద్దవాళ్లకి శ్రీ చేర్చి రాయాలని చెప్పేవారు.
మనియార్డరు ఎలా చేయాలి? రైల్వే పార్శిలు ఎలా పంపించాలి? అవన్నీ మాతోనే చేయించేవారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకునేలా తయారుచేసారు..
మా నాన్న.. అమ్మతో పలకా బలపం పట్టించలేకపోయారు. అయినా ఆవిడకు మర్చంట్ ఆఫ్ వెనిస్, ఒధెల్లో హామ్లేట్ కధలు తెలుగులో చెప్పేవారు.
పోతనగారి భాగవతం ఆయనకు అత్యంత ప్రీతీపాత్రం. ఆ పద్యాలు వల్లె వేసేవాళ్ళం.
శాంతారామ్ నవరంగ్ ఝనక ఝనక పాయల్ బాజే, stree ఆయన మాకు చూపించిన సినీమాలు. అందుకే ఇప్పటి సినీమాలు నచ్చడంలేదేమో..
మానాన్న .. రైల్వే ఉద్యోగం అవడంవల్ల బయటివూళ్ళకు వెళితే ముందుగా వాటి వివరాలు మధ్యలో వచ్చే పెద్ద స్టేషన్లు అవి దేనికి ప్రసిధ్ధి ప్రయాణంలొ కధలు కధలుగా చెప్పేవారు.
మానాన్న… మేము ఎనిమిది పిల్లలం.
మా నాన్న మమ్మల్ని ఎప్పుడూ కొట్టలేదు. తిట్టిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాగని తెగపొగిడేవారు కాదు. మా కుటుంబాన్ని ఎవరయినా మెచ్చుకుంటే అమ్మ వైపు ఆప్యాయంగా చూసేవారు. ఎప్పుడూ ఏమీ అడగని అమ్మకు ఆ చూపులే పెట్టని సొమ్ములు…
మాది విజయవాడ. సంచలనాలకు పెట్టింది పేరు. ఇప్పటి స్వరాజ్య మైదానంకు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అయిన శ్రీ జవహర్ లాల్ నెహ్రు, శ్రీ రాధాకృష్ణ, శ్రీ కృష్ణ మీనన్ ,శ్రీ మొరార్జీ దేశాయ్ మమొదలైన వారి ప్రసంగాలకు చిన్నపిల్లలమయిన మమ్ములను తీసుకెళ్ళేవారు.
అప్పుడు ఇండియన్ ఎక్సప్రెస్ పేపరు రోజూ చదివించేవారు.
నాన్న…. కుటుంబంకోసం కష్టపడుతూ పిల్లల అభివృధ్ధే తన లక్ష్యంగా తనకంటూ ఏమీ మిగుల్చుకోని శ్రమజీవి నాన్నంటే. ….
అమ్మ ప్రేమ ప్రకటిస్తుంది. నాన్న ప్రకటించలేడు. ఆయన గుండె నిండా మనమంటే ప్రేమే.. మనం ఏదయినా పొరపాటు చేస్తే అమ్మ ఇంటికి వచ్చాక రెండు తగిలిస్తుంది. నాన్న నలుగురిలో వున్నా అక్కడే దిద్దుతాడు. అదీ నాన్నంటే…
మనం సంపాదించకుంటున్నా’ వాళ్ళకేమయినా కావాలేమో అడుగు’ అని అమ్మతో అంటారేకాని నాకిది కావాలని అడగరు. ఇవ్వడమేకాని నాకిది కావాలని అడగలేని పిచ్చివాడు నాన్న. తనకేం కావాలో తనకే తెలియదు నాన్నకి.
నాన్నకి ఎవరూ సాటిరారు.
మా దురదృష్టం ఏంటంటే మా నాన్న మేము 16 ఏండ్ల వయసులో వుండగానే గోడమీద ఫోటోలోకీ ఎక్కేసారు. ఆయన వుండి వుంటే మా అందరి జీవితాలు మరోలా వుండేవి.
ఇప్పుడు నా వయసు ఏడు దశాబ్దాలు.
నాపైన ముగ్గురు నా తరువాత నలుగురు.
అందరూ విశ్రాంత ఉద్యోగులమే.

కొప్పరపు సుబ్బలక్ష్మి

5 thoughts on “నాన్న ఒక అద్భుత ప్రపంచం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *