May 1, 2024

నాన్నకి ప్రేమలేఖ!!!

రచన: శ్రీధర్ నీలంరాజు.,.

రేపు ఎలా అయినా సరే చెప్పేయాలి..అప్పటికి వందో సారి అనుకున్నాను. చాలా టెన్షన్ గా అనిపించింది. పావని నా క్లాస్ మేట్. చాలా అందంగా ఉంటుంది. నన్ను ఇష్ట పడుతుంది కూడా. ఇప్పటికి రెండూ సార్లు నా నోట్స్ అడిగి తీసుకుంది.ఒకసారి సెమినార్ లో నా పక్కనే కూర్చుంది. ఇంతకన్నా ఏ అమ్మాయి అయినా తన ఇష్టాన్ని ఎలా తెలుపుతుంది ??? ఇప్పటికే అర్ధం చేసుకోకుండా చాలా ఆలస్యం చేసాను పేపర్ , పెన్ను తీసుకున్నాను. లెటర్ వ్రాద్దామని.

ప్రియమైన పావని…..
నువ్వు చాలా, చాలా అందం గా ఉంటావు. నవ్వితే చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తుంది. నువ్వు రాని రోజు కాలేజి మానేసి ఇంటికి వెళ్ళి పోవాలి అనిపిస్తుంది నువ్వు నా వంక చూస్తే అదోలా తోస్తుంది. ఒక్క రోజు కనిపించకపోయినా జీవితం మీద విసుగొస్తుంది.వెన్నెల సాయంత్రం, సాగర తీరం ,కోయిల గానం..వీటన్నింటికన్నా నీ రూపే నాకు మధురం. ఐ లవ్ యు.. నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఏమైనా చేస్తాను..
ఇట్లు
నీ ప్రేమ పిపాసి
శ్రీధర్

సంతకం చేసాక అనుమానం వచ్చింది. సంతకం రక్తం తో చెయ్యాలేమో ??ఇలా పెన్ను తో చేస్తే తను నా మాటలు ఎలా నమ్ముతుంది ??? ఆఫ్టరాల్ రక్తంతో చిన్న సంతకం చేయ లేని వాడు ప్రాణాలు ఎలా ఇస్తాడు అని అనుమానం రాదూ???మళ్ళీ దిక్కుమాలిన టెన్షన్. పిన్నీసు తో చేతి వేలి మీద చిన్న డాట్ పెడదాము అనుకున్నాను.చాలా నొప్పి వచ్చింది. వెంటనే రక్త సంతకం ఆలోచన విరమించుకున్నాను. పడినప్పుడు కావాలంటే ప్రాణాలు ఇద్దాం. ప్రస్తుతం ఎందుకు వచ్చిన బాధ????
లెటర్ పుస్తకంలో పెట్టి నిద్రపోయాను. ఆ రాత్రి ఏవేవో కలలు !!!

“శ్రీలు…. “ పొద్దున్నే అమ్మ పిలుపుతో మెలకువ వచ్చింది. పిలుపు ఎందుకో తేడాగా అనిపించింది.అమ్మ చేతిలో నా పుస్తకం. గబుక్కున ఆదుర్దాగా లేచాను.నాన్న చేతిలో నా ప్రేమ లేఖ. షాక్ తిన్నాను. ఏం చెప్పాలో తోచలేదు. ఎదురు తిరగాలి అని నిర్ణయించుకున్నాను ఒక వేళ గట్టిగా తిడితే ఇల్లు వదిలి వెళ్ళి పోవాలి అని తీర్మానించుకున్నాను.ఏది ఏమైనా సరే, పావని విషయం లో రాజీ పడే ప్రసక్తే లేదు….
నాన్న గారు , తిట్టడం ,అరవడం ఏమీ చేయలేదు. నెమ్మదిగా చెప్పటం మొదలు పెట్టారు “శ్రీధర్ నీ వయసులో ఇలాంటి ఆకర్షణలు ఉండటం సహజం.నేను నిన్ను తప్పు పట్టను..నువ్వు చాలా తెలివిగలవాడివి.నీ తెలివితేటలని సరి అయిన మార్గంలో పెట్టుకునే వివేకం నీకు ఉందని అనుకుంటున్నాను.నీ ఆలోచనా సరళి మారడానికి ,పరోపకారం ,త్యాగాలే జీవితం గా గడిపిన మహానుభావుల పుస్తకాలు చదువు.జీవితం విలువ తెలుసుకో..పది మందికి వెలుగుని పంచె జీవితం కోసం ప్రయత్నించు..ఎవరికోసమో నీ లోని వెలుగుని ఆర్పేసుకునే మూర్ఖత్వం వదిలేయి.ముందు బాగా చదువుకొని నువ్వంటే ఏమిటో నిరూపించుకో..తర్వాత నీ ఇష్టం.నేను నీకు అడ్డు చెప్పను..లెటర్ టేబుల్ మీద పెట్టేసి నాన్నగారు ఆఫీస్ కి వెళ్ళిపోయారు తిట్ట లేదు. కొట్ట లేదు.. కానీ అయన మాటలు నా గుండెలకి హత్తుకున్నాయి. పావని కోసం చనిపోవాలి అనుకున్న నా ఆలోచనలు నాకే ఫూలిష్ గా అనిపించాయి ఆ రోజు నించీ రాత్రి ,పగలు చదువుకొని IAS,IPS ,ఆఫీసర్ అవలేదు కానీ, చెత్త ఆలోచనలు పక్కన పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టాను.
అందరూ నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్ , వీడు ప్రాణ స్నేహితుడు అని చెప్తూ ఉంటారు. నాకు మాత్రం మా నాన్న, అప్పటికీ , ఇప్పటికీ బెస్ట్ ఫ్రెండ్. నాకు బాబు పుట్టి చనిపోయినపుడు , పెద్దమ్మాయి చిన్నప్పడు తీవ్రమైన అనారోగ్యం పాలైనప్పుడు, జీవితంలో ప్రతి కష్టంలోనూ నేనున్నానని , భుజం తట్టి ఆయన నా పక్కనే ఉంటారు. అడుగులు వేయటం నేర్పటమే కాదు , తప్పటడుగులు వేయకుండా చేయి అడ్డం పెట్టి కాపాడే తండ్రి ఋణం ఏమి చేసి తీర్చుకోలేను
నాన్నగారు, మీకు father’s డే శుభాకాంక్షలు !!!

8 thoughts on “నాన్నకి ప్రేమలేఖ!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *