May 3, 2024

ప్రేమకు మారుపేరు నాన్న!

రచన: మణి కోపల్లె

mani kopalle

ప్రేమకు మారుపేరు నాన్న!
మదిలో నున్నది చూడగలిగే దూరదృష్టి
చేసే పనిలో చేయూతనిచ్చే అభయ హస్తం
కష్టాలలో మనోస్థైర్యానిచ్చే ఆప్తుడు నాన్న!

ఓర్పుకు సహనానికి మారుపేరు
చేసిన తప్పులు క్షమించేవాడు
మిత్రునిలా తోడునీడై నిలిచేవాడు
అడిగింది లేదనుకుండా ఇచ్చేవాడు నాన్న!

మా ఇల్లంటే నాలుగు గోడలు కాదు
అమ్మనాన్నలు అందించే మమతల పొదరిల్లు
ఆప్యాయతానురాగాలు ముద్దలుగా తినిపించింది అమ్మ ప్రేమ
అనుబంధాలు పెంచి బాధ్యతలు పంచింది నాన్న ప్రేమ!

చిన్నతనాన తప్పటగులు వేస్తే మురిసింది అమ్మ
జీవితాన తప్పటడుగులు వేయకుండా చూసింది నాన్న!
లాలనతో ప్రేమతో జీవిత మాధుర్యాన్ని నేర్పింది అమ్మ
గురువులా వెన్నంటి వుండి జీవిత గమ్యాన్ని చేర్చింది నాన్న!
సమాజంలో నాన్నంటే
పరువు ప్రతిష్ఠ సమాజం గౌరవం నాటి తల్లితండ్రుల కీర్తి కిరీటాలు
సంపాదన, స్వలాభం స్వసుఖం నేటి తండ్రుల అవసరాలు!

చిన్న దొంగతనం చేసినా దండించక దుఃఖించిన తండ్రిని చూచి
పశ్చాత్తాపమొంది జాతి పితగా మారిన కొడుకు నాడు!

పెద్ద అవినీతి పరుడని తెలిసినా దండించని తండ్రిని చూచి
మరింతగా దేశానిన దోచుకునే అక్రమార్కుల రాజ్యం నేడు!

దశరధుని వాత్సల్యం రామరాజ్యానికి పునాది
దృతరాష్ట్రుని పుత్ర ప్రేమ కురుక్షేత్రానికి నాంది!

కాని మా ఇంట…..
యుగాలు మారినా తరాలు మారినా
మారని ప్రేమ మా నాన్నది
ప్రేమకు మారు పేరు మా నాన్న!

 
(1976లోనే నాన్న కాలం చేశారు)
మా నాన్న పేరు దేవరకొండ శ్రీనివాసరావు.
ఆరోజుల్లో శీనుపంతులుగా, గుంటూరులో లారీ మెకానిక్ గా ఎంతో పేరున్న వారు. నేనంటే అభిమానం.
ఇంట్లోనే వర్క్ షాప్. చేతికింద పనివాళ్ళు…. నాన్న నేను ఏది చెప్పినా వినేవారు.

4 thoughts on “ప్రేమకు మారుపేరు నాన్న!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *