April 30, 2024

ఇదో పెళ్లి కథ (తరాలు – అంతరాలు)

– డా ॥ గురజాడ శోభా పీరిందేవి

పెళ్లి హాల్ అత్యంత ఆధునికంగా,అట్టహాసంగా వెలిగిపోతోంది . లైట్ల తోరణాలు, పూలపందిళ్ళు నయనానందాన్ని కలిగిస్తూ కట్టి పడేస్తున్నాయి
ఆ అందాన్ని వైభవాన్ని తిలకించాలని సూరీడు తెగ ఆరాటపడుతూ తూర్పు తలుపు తీసుకుని వొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు . ఆయన వొస్తే తమకి చూసే చాన్స్ పోతుందని మబ్బుల గుంపులు అడ్డుకుంటూ వున్నాయి అయినా వొస్తానంటున్న సూరీడు మీద ఆగ్రహం వొలక బోస్తూ వురుముతున్నాయి . వారిద్దరి మధ్యా నిశ్శబ్ద పోరాటం సాగుతోంది. అరుదైన ఆ దృశ్యాన్ని క్లిక్కు మానిపించి ఫేస్బుక్లో పెట్టాలని తెగ ఆరాట పడుతూ మెరుపులు మహా ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి . గాలి గలగలా నవ్వుతూ చోద్యం చూస్తోంది. పక్షులు కువకువ లాడుతూ ఇరువర్గాలనీ రెచ్చగొడుతున్నాయి. చెట్లు తలలూపుతూ చోద్యం చూస్తున్నాయి .
ఆ వేళలో సరిగ్గా ఆ వేళలో గుసగుసలు వినిపించాయి .. హడావిడిగా అయినవాళ్ళు అటూ ఇటూ ఆదుర్దాగా తిరగ సాగారు. ముఖ కవళికల్లో భయం,కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది
ఎవరో ఏదో చెప్పబోతుంటే పక్క వ్యక్తి అటకాయించాడు . హుష్ మగపెళ్లి వాళ్లెవరైనా ఇక్కడ వుంటే వాళ్లకి వినిపిస్తుంది జాగ్రత్త అని చెప్పాడు . అక్కడ వున్న వారోకరిద్దరి చెవిలో ఆమాట పడింది . అంతే వాళ్లకి కుతూహలం పెరిగింది.
” ఏమై వుంటుంది ‘?
”ఈ కుటుంబ సభ్యులకి భేషజాలేక్కువ కదా కట్నం డబ్బు చేతికి అంది వుండదు దాన్ని ఎలా కప్పిపుచ్చి తంతు జరిపిద్దామా అని చూస్తున్నారనుకుంటా ”
”పిల్ల తండ్రి ఏదో స్కామ్లో ఇరుక్కుని వున్న సంగతి ఇప్పుడు చెవిన పడి వుంటుంది అందుకే ఆ గాభరా ”
” ఆ పిల్ల కారెక్టర్ మంచిది కాదేమో| ఏ కడుపో వొచ్చిందని తెలిసి ఉండచ్చు ”
”సరే మనం ముగ్గురం బెట్ కట్టుకుందాం .ఎవరమ్ గెలిస్తే వాళ్ళం మిగతా ఇద్దరికీ మందు పార్టీ ఇద్దాం”
” ఓకే ”
మగవారి మాటలు అలాఉండగా ఆడవారివి ఇంకోలా వున్నాయి
” రకరకాల నగలు పెట్టుకుంటారు తల్లి కూతుళ్ళు అవి గిల్టువేమో? అది బయట పడిందేమో ”
” ఆ ముసలావిడకి… అదే వాళ్ళ బామ్మకి నోరేక్కువ కదా దానివల్ల ఏదైనా కొత్త సమస్య వొచ్చి పెళ్లి ఆగిందేమో ”
”ఏమైతే ఏo కాని.. అందరికీ పెళ్లి ఆగిందని తెలియగానే కారణం నేనే చెప్తానబ్బా ”
” లేదు లేదు నేను చెప్తాను ”
పెళ్లి వారింట్లోని బంధువుల గుసగుసలు ఎక్కువయ్యాయి
దానికి కారణం వుంది . ‘నిప్పు లేకుండా పొగ రాదుగా’
హటాత్తుగా ఆడపెళ్లివారంతా పెళ్లి హాల్లో లేకుండా పోయారు
కూతుర్ని ఇంటినుండి పెళ్లి హాల్ కి తీసుకొస్తానని వెళ్ళింది తల్లి. ఆమె ఇంకా రాలేదేంటి పిల్లతో కలిసి అనుకుంటూ తండ్రి వెళ్ళాడు. అప్పటిదాకా అక్కడేవున్న అన్న ఎటో గాయబయ్యాడు
ముసలావిడ ఎందుకో పత్తా లేదు.
మగపెళ్ళివారు తరలివొచ్చే వేళ అయ్యింది
ఎదుర్కోలుకి బంధుమిత్రులు తెల్లవారుజాముకే వొచ్చి వున్నారు . అటువంటి అప్పుడు పెళ్ళికూతురు కుటుంబం లేకపోవడం అందరికీ అనుమానంగా మారడంలో ఆశ్చర్యమేముంది?
ఆడపెళ్ళి వారి దగ్గర బంధువు పెళ్లి పన్లలో ముఖ్య పాత్ర వహిస్తున్న అతనికి అందరి ప్రశ్నలకీ జవాబివ్వడం ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
కొంపదీసి పెళ్లి ఆగిపోయిందా ?
అదేమీ కాకుంటే సెల్ ఎత్తరేమిటి?
ఇప్పుడు తనేం చెయ్యాలి??
అతనికి గుండె దడ మొదలయినట్లుంది
ఈలోగా ఎవరో పెళ్లి ఆగిపోయింది అన్నారు .
క్షణాల్లో ఆ వార్త దావానలంలా వ్యాపించింది .
అందుకేనా ముహూర్తం దాటినా మగ పెళ్ళివారు రాలేదు అన్నారొకరు సాలోచనగా
ఘనంగా చేద్దామని ఖర్చుకి ఖర్చూ చేసారు. తెగ హెచ్చులకీ పోయారు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వీటికి డబ్బు ఇవ్వక తప్పదుగా అసూయగా గొంతు పెంచి అంది ఒకావిడ
అందరూ ఆడ పెళ్లివారిని ఆడిపోసుకుంటూ కూర్చున్నారు
ఈలోగా కారాగింది కార్లోంచి కుటుంబ సభ్యులందరూ దిగారు
మరో కార్లోంచి దిగిన బామ్మ ఎవరో కొత్త వారితో లోపలి వొచ్చింది . . .
” ఆలస్యం అయ్యిందని ఏమీ అనుకోకండి ముహూర్తం వేళ ఇంకా దాటిపోలేదు . సరదాగా తంతు చేద్దాం”అంది బామ్మ
” మగపెళ్లివారింకా రాలేదుగా ఇప్పుడొస్తారా”? మగ పెళ్ళివారి పిలుపు అందుకుని వొచ్చినావిడ అడిగింది
“వీళ్ళే మగపెళ్ళివారు” అంది బామ్మ
”వీళ్ళా?” ఆశ్చర్యంగా బామ్మతో వొచ్చిన అబ్బాయిని, అతనితోటే వున్న ఇద్దరు స్త్రీ పురుషులనూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఇందాకా ప్రశ్నించినావిడ .
బామ్మ అందరి వైపూ చూస్తూ ఇలా చెప్పింది
” మా మనవమనవరాలికి మీ వాళ్ళతో పెళ్లి కుదిర్చిన మాట నిజమే. అన్ని వ్యవహారాలూ మాట్లాడుకుని ఇవాళ ఇక్కడికి వారిని ఆహ్వానించినదీ నిజమే. కాని ఈలోగా అమ్మాయికి ఈ ఆబ్బాయి అంటేనే ఇష్టమని తెలిసి ఆ పెళ్లిని ఆపేసి వారిని క్షమార్పణ కోరాము. దయచేసి వచ్చినవారంతా ఈ పెళ్లి చూసి ఆశీర్వదించి వెళ్ళండి ఇక్కడ తప్పు మాదే అమ్మాయి ఇష్టా ఇష్టాలు ఆలస్యంగా తెలుసుకున్నాము. పెద్దదానిగా మీకందరికీ ఒక సలహా ఇస్తున్నాను . దయచేసి మీ పిల్లల ఇష్టాలని తెలుసుకున్నాకే పెళ్లి ప్రయత్నం చేసుకోండి . అలాగే ఎక్కడైనా ఏదైనా తేడా వస్తే మీ వంతు సహకారం ఏదైనా చెయ్యగలిగితే చెయ్యండి లేదా ఊరుకోండి కాని రాళ్ళు వెయ్యకండి”
అంతకుముందు దాకా మాట్లాడినవారు ఇబ్బందిగా నవ్వారు.
అమ్మాయి, అబ్బాయిల ముఖాలు వెలిగిపోతున్నాయి . పెళ్లి కళ వచ్చింది పిల్లకి.. పిల్లాడి ముఖంలో రిలీఫ్ కనిపిస్తోంది..
పెళ్లి తంతు ప్రారంభమయ్యింది
అక్కడున్నవారికి తెలీదు పెళ్ళికూతురు ముందురోజు రాత్రి కట్టుబట్టలతో ఈ అబ్బాయితో పారిపోదామనుకుందని. పట్టుబడితే చావాలనుకుంది కాని నచ్చని వాడిని చేసుకోదలచలేదని ;;;;;;;;
బామ్మ గమనించి ఆపి ఆ అబ్బాయిని వారి తాలూకు వారినీ కలిసి పెళ్లి రాత్రికి రాత్రి కుదిరించిందని। అంతేకాదు ఎప్పటినుండో వేరే కులమైనా సరే తను ప్రేమించిన అబ్బాయినే చేసుకుంటా కాని ఈ అబ్బాయిని చేసుకోనని చెప్పిందని, అయినా కులాంతర వివాహం వద్దని ఆమెని కన్నవారు కాదన్నారని కూడా ఊరినుండి పెళ్ళికి వచ్చిన పెద్దావిడకి అప్పుడే కొడుకూ కోడలి ద్వారా తెలిసింది. తెలిసిన వెంటనే ఆమే రంగంలోకి దిగి అటు వారిని ఇటువారిని కలిసి పెద్దతనంగా సమస్యని పరిష్కరించిందని ఎవ్వరికీ తెలియదు
మధ్యవయస్కులు పెద్దలను చాలా తక్కువగా అంచనా వేస్తారు . సలహాలు అడగరు. వారికేమి తెలియదనుకుoటారు అలాకాక వెనకటిలాగే పెద్దలకి గౌరవమిచ్చి వారి తోడ్పాటుతో పని చేస్తే అన్ని బాగా జరుగుతాయి. విడాకులుండవు . వితండ వాదనలు ఉండవు.. వేర్పాటు ఆలోచనలూ రావు .
రాత్రంతా నిద్ర లేకున్నా ఓపిక అసలే లేకపోయినా పెద్దావిడ ఉత్సాహంగా పెళ్లి పనులకి కదిలింది. తల్లి తమ పరువు కాపాడింది . లేదంటే అటు అపవాదు, ఇటు కూతురు దూరం కావడము, ఖర్చూ ఏవి తప్పేవి కాదు అనుకుంటూ తల్లిని అనుసరించాడు కొడుకు.

==============

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద
ఆధునిక సమాజ౦లో అమ్మాయి ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వవలసిన అవసరం గురి౦చి , వెనక తరాల వాళ్ళు వివేక౦తో ఆలోచి౦చి సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరం గురి౦చి ఆలొచి౦పజేసేదిగా ఉత్తేజపరచే కధ “ఇదో పెళ్లి కధ” కొంచెం సస్పెన్స్ , కొంచెం ఆసక్తి మరికొంత ట్విస్ట్ కలగలిపి ఆగిపోవలసిన పెళ్లి జరిగిన కధ ఈ కధ. పెళ్ళిళ్ళలో జరిగే చర్చలు ఊహలు , గుస గుసలు చక్కగా వర్ణించారు రచయిత్రి. కొ౦త ఆదర్శం, కొ౦త హైడ్రామా మొత్తానికి చదివించగలిగే కధనంతో ఆకట్టుకునే కధ అ౦ది౦చారు రచయిత్రి గురజాడ శోభా పేరి౦దేవి.

2 thoughts on “ఇదో పెళ్లి కథ (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *