April 30, 2024

తొలగిన మబ్బులు (తరాలు – అంతరాలు)

రచన:నాగలక్ష్మి కర్ర

ఆగకుండా మోగుతున్న డోరు బెల్లు శబ్దానికి నిద్రా భంగం కలిగిన మహేందర్ వీధి తలుపు వైపు నడిచేడు. హాలులోని గడియారం సమయం ఆరు చూపిస్తోంది. యీవేళప్పుడు యెవరొచ్చేరో అనుకుంటూ తలుపు తీసేడు. ఎదురుగా శివాని … చేతి మీద గిల్లుకు చూసుకున్నాడు. అమ్మో నొప్పి అంటే తను కలగనటం లేదు నిజంగానే శివానీ వచ్చింది. తన జీవితం, తన సర్వస్వం. పది సంవత్సరాలు ప్రేమించుకొని మూడు ముళ్ళతో యేకమై, ఏడాది తిరగకుండా తూ…తూ…….. మై……..మై……. అనుకొని వారం కిందట ‘ యింక నువ్వు నేను కలిసి వుండడం కష్టం’ అని సూట్ కేస్ సర్దుకొని వెళ్లి పోయిన శివాని, ఈ వేళప్పుడు యిలా ఎదురుగా….
మహేందర్ ని తోసుకొని తిన్నగా బెడ్ రూంలోకి నడిచిన శివానీని చూస్తూ వీధి తలుపేసి యెటు వెళ్ళాలో తెలీనివాడిలా హాలు లో సోఫా లో చతికిల బడి చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు.
“మహీ కమాన్ గెట్ అప్. బ్రేక్ ఫాస్ట్ యీజ్ రెడీ ” అన్న పిలుపుతో లేచిన మహేందర్ శివానీని అపనమ్మకంగా చూస్తూ వాష్ రూం వైపు నడిచేడు.
షాక్ మీద షాక్ తగులుతోంది మహేందర్ కి.
ఏ మాటకి ఎలా రియాక్ట్ అవుతోందో, ప్రశాంతంగా వున్న వాతావరణం పాడు చేసుకోడం యెందుకు. శివానీనే చెప్పనీ. తినబోతూ రుచి తెలుసుకోవాలనే తొందర వుండకూడదు.
అందుకే ” మాలతి ఆంటీ వాళ్లు కులాసావా శివీ ” శివానీతో మాటకలపడానికి అడిగేడు.
అంతవరకు తనలోనే దాచుకున్న ఉద్వేగాన్ని మాటల రూపంలో బయట పెట్టింది.
తను అత్త దగ్గర తెలుసుకున్నవి మహేందర్ తో పంచుకోసాగింది.
” అత్త అనుభవమంత వయసులేనిదానిని ఆమె సంసారాన్ని చక్కదిద్దాలను కోవడం యెంత తెలివితక్కువతనం కదూ, తెలివి తక్కువగా వాగిన నన్ను క్షమించడమే కాదు నన్ను సంస్కరించినందుకు నేను యెప్పుడూ ఋణపడి వుంటాను, నిన్న మధ్యాహ్నం అత్త యింట్లో ఏం జరిగిందంటే…….
“అత్తా యీ నస యెలా భరిస్తున్నావు, నేనొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఓ కామా లేదు ఓ ఫుల్ స్టాప్ లేదు, అటు ఏడుతరాలకి యిటు ఏడుతరాలకి నైన్ సెర్మనీస్ పెడుతోంది. పక్కవాళ్ళనీ వదలలేదు. ఎదురింటి వాళ్లని, పాలవాడిని, పేపరువాడిని ఆఖరుకి ఆకాశం లో యెగిరే పక్షిని, వీధిలొ మొరిగే కుక్కని కూడా విడిచి పెట్టలేదు అమ్మమ్మ. యెలా వేగుతున్నావు యీవిడతో. సెర్మనీస్ పెట్టే హడావిడిలో చాలాసార్లు హద్దులు మీరి తిట్ల దండకం కూడా పఠిస్తోంది. రెండు రోజులకే నాకు చిరాకొస్తోంది. నువ్వేంటి యిలా నిమ్మకి నీరెత్తినట్టుంటున్నావు. యిన్నాళ్లు ఊరుకోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు ” చిరాగ్గా అంది శివాని మాలతిని ఉద్దేశించి.
“పొనీలే శివీ, యేదో పెద్దావిడ “.
“పొనీలే అని చిన్న వాళ్లని, పొనీలే అని పెద్దవాళ్ళని వదిలేస్తూ పొతే అదే అలుసుగా తీసుకొని ప్రతీ వాళ్లు మన మీదెక్కి స్వారీ చేస్తారు తెలుసా, ఎవరో మెచ్చి మేకతోలు కప్పుతారనుకుంటున్నావేమో, ‘ మామంచి కోడలు ‘ అని అనదు సరికదా చేతకాని దానివని, ముట్టముంగి అనే బిరుదులు మాత్రం యిచ్చింది. మావయ్యని ప్రేమించి పెళ్లాడిన నువ్వు అమ్మమ్మ చేత యిన్ని మాటలు పడ్డం ఏమిటి ?, అదీ నీ తప్పు లేకుండా, అసలు నీ ఒంట్లో ప్రవహిస్తున్నది నెత్తురేనా ? ఆవేశంగా అంది శివాని.
మాలతి సన్నగా నవ్వి అత్తగారికి వడ్డించసాగింది.
అలవాటుగా మాలతి అత్తగారు తింటున్న తిండిని, దాన్ని వండిన మాలతిని, వాటిని పండించిన వారిని, వారిని కన్నవారిని కలిపి తిడుతూ కడుపునిండా భోజనం చేసి, గొణుగుతూనే మధ్యాహ్నపు నిద్రకి వుపక్రమించింది.
శివానీకి మాలతి ప్రవర్తన నచ్చడం లేదు. యిన్నాళ్ళు అత్త ఆర్ధికంగా మావయ్య మీద ఆధారపడి వుంది కాబట్టి ముసలమ్మని భరిస్తోంది అనుక్కుంది. కాని బావ పెద్ద వుద్యోగం చేస్తూ బాగా అర్జిస్తున్నాడు. మరింకేవిటి అత్త యింకా అమ్మమ్మ చేత తిట్లు తింటూ వెన్నెముక లేని మనిషిలా బతికేస్తోంది. అత్త స్థానంలో తనుంటే మావకి విడాకులిచ్చేసి రైల్వే స్టేషన్ లో దోశెలు పోసుకొని బతికేదానినని చాలాసార్లు అనుకొంది. తాను అనుకోడమేకాదు చాలాసార్లు అత్తతో అంది కూడా. ప్రతీమారు వో సన్నని నవ్వునవ్వేది, ఇప్పడు కూడా అంతే.
తాత్కాలికంగా తన సమస్యలన్నీ మరిచిపోయి, అత్త సమస్యకి పరిష్కారం చూపించాలని నిర్ణయించుకుంది. అవుసరమైతే యీ విషయం గురించి మావయ్యతోనూ, బావతోను కూడా చర్చించాలని నిశ్చయించుకుంది.
భోజనాలు ముగించుకొని శివాని, మాలతి బెడ్ రూములో నడుం వాల్చేరు.
ముప్పై ఏళ్ళ శివానీ అత్త పక్కలో చేరగానే మూడేళ్ళ పిల్లగా మారిపోయింది. తనలో జరుగుతున్న సంఘర్షణ పంచుకోవాలని అనిపించింది. అత్త తనని అర్ధం చేసుకుంటుందని ఏమూలో ఆశ. యిన్నాళ్లుగా అత్త తెగించి చెయ్య లేకపోయిన పనిని తను యెంత సులువుగా చేసిందో చెప్పాలని వుబలాటం, అత్తలా తను సర్దుకుపోయి బతకడం లేదని చెప్పాలనే ఆతృత. తన నిర్ణయం ఎవరు మెచ్చినా, మెచ్చక పోయినా అత్త మెచ్చుకుంటుందని శివాని నమ్మకం. అందుకే మెల్లగా మొదలు పెట్టింది.
” అత్తా, పెళ్ళంటే నూరేళ్ళ పంట కదా ? ”
” ఔను ”
” పెద్దలు కుదిర్చిన పెళ్లి అయితే సర్దుబాట్లు తప్పవు, కాని ప్రేమ వివాహంలో కూడా సర్ధుబాట్లా ? ఎందుకత్తా ” యెంత దాచుకున్నా దాగని తడి శివానీ గొంతులో.
” ప్రేమించి పెళ్ళాడిన మన పరిస్థితే యిలా వుంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న వారి సంగతేమిటి ? పది సంవత్సరాల ప్రేమ, పెద్దవాళ్లు వొప్పుకొనేంత వరకు వోపిక పట్టిన ప్రేమ, హానీమూన్ తరవాత ఆవిరై పోతుందా ? చెప్పవా…….?, ప్లీజ్ కాస్త సర్దుకుంటారా ? పక్క స్టేషనులో దిగిపోతాను అని అనడానికి యిదేమీ బస్సో, రైలు ప్రయాణమో కాదుగా ? ఒక జీవితకాలం వుండవలసిన బంధం ” గొంతులో తడి, గుండెలోని బరువు గొంతుకి అడ్డుపడింది.
తట్టుకోలేని శివాని మాలతి గుండెల్లో మొహం దాచుకుంది.
నెమ్మదిగా శివాని వెన్ను నిమురుతూ ” ఊరుకో శివీ…. చిన్న పిల్లలా ఏంటిది, యింత ఆవేశం అవసరమా ? యిప్పుడేమయిందని యింత దుఃఖం మొదటి అడుగులోనే ఓటమిని అంగీకరిస్తున్నావా ? “.
” ఓడిపోయాను, అత్తా ఓడిపోయేను ఘోరంగా వోడిపోయేను “.
” ఏమైందో సరిగ్గా చెప్పు శివీ పెళ్లై యేడాది అయిందో లేదో అప్పుడే గొడవలా ?”
“మర్నాడు నుంచే ”
“యేంటీ మర్నాడు నుంచా ? ”
” ఆ… హా… మన వూర్లో పెళ్లైన తరువాత వాళ్ళింటికి వెళ్లేం కదా ? అక్కడ నుంచి మొదలైయింది. చెమ్కీలు కుట్టిన చీర, మొహం కనిపించకుండా ముసుగు వేసుకొని తలెత్తకుండా రోజంతా తిరగడం, పొద్దున్న పెద్దవాళ్ళందరి కాళ్ళకి దండాలు పెట్టడం, యిదేమైనా చారుమతీదేవి కాలమా? మర్నాడు గంగిరెద్దులా నగలన్నీ వేసుకోమని చెమ్కీలు, పూసలు కుట్టిన చీర, అదెంత బరువుందో తెలుసా ? అలాంటిదే జాకెట్టు , యినప్పెట్టిలో పెట్టి తాళం వేసినట్లు నాకు వుక్కిరి బిక్కిరిగా వుంది. తరవాత మొదలయ్యింది జాతర, యెవరెవరో రావడం ముసుగు యెత్తి చూడడం చేతిలో డబ్బులు పెట్టడం. పెద్దవాళ్ళ కాళ్లు పట్టుకొని దండం పెట్టాలిట, నా తోటి వాళ్ళయితే కౌగలించుకోడం.. ఛఛ కౌగలించుకోడం యేమిటి. నేనేం అంగడి బొమ్మనా డబ్బులు పుచ్చుకోడానికి.
మహేందర్ తో చెప్తే ‘ సర్దుకో, నాలుగు రోజులేగా ? ఏదో పెద్దవాళ్లు, వాళ్ల చాదస్తాలు వాళ్లకుంటాయిగా ‘ అన్నాడు. సరే ఎలాగో కళ్లు మూసుకు గడిపేద్దాం అనుకున్నాను. కాని ఆ మర్నాడే నా సహనానికి పరీక్ష ఎదురౌతుందని అనుకోలేదు”.
” మహేందర్ చెప్పినట్లు నాలుగు రోజులు వోపిక పట్టివుంటే పోయేదిగా ”
“నేనూ అలాగే అనుకున్నాను, కాని…. కాని…. రోజూ డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళు తింటున్న మాంసాహారం చూస్తూ వుంటే నాకు కడుపులో తెమల్చుకు పోయేది, వాళ్ల భాష, ఆచార వ్యవహారాలూ, వాటిని తుచ తప్పకుండా పాఠిస్తున్న మహేందర్ ని చూస్తూ వూరుకోలేకపోయేను “.
” మహేందర్ ఫేమిలీ మాంసాహారం తింటారని నీకు ముందుగానే తెలుసుగా ?,
మహేందర్ ఉత్తరాది వాడని తెలుసుగా ? ”
” ఆ తెలుసూ…..కానీ…”
” కానీ, అణా యేమీ లేదు శివీ, కలల ప్రపంచంలో వున్నప్పుడు యిదో పెద్ద ఆటంకంగా కనబడలేదు కదూ.., వాస్తవంలోకి రాగానే మింగడు పడలేదు అంతేనా “.
” ఏమో నువ్వు చెప్పింది నిజమేనేమో ”
” శివీ నాకు తెలీక అడుగుతానూ, నువ్వు పనిచేసేచోట పార్టీలు అవీ వుండవా ? ”
” ఎందుకుండవత్తా, ప్రతి వీకెండ్ కీ వుంటాయి, మాది మల్టీ నేషనల్ ఫర్మ్ కదా ”
” కదా మరి అక్కడ శాఖాహారం, మాంసాహారం రెండు ఉంటాయికదా ? నీ కొలీగో, ఫ్రెండో మాంసాహారం తింటూ వుంటే నువ్వేం చేస్తావు ?
” ఏమీ చెయ్యను, ఎవరి తిండి వారు తింటాం, మరీ భరించ లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతాను అంతే సింపుల్ ” అదో పెద్ద విషయం కాదన్నట్టుగా అంది శివాని.
” మరి మీ అత్తవారింట్లో కూడా అలాగే చెయ్యవలసింది కదా ? ”
” అంటే ”
” మరేం లేదు శివీ, మీ అత్తవారింట్లో కూడా నువ్వు అలాగే వెళ్లిపోవలసింది కదా ? గొడవ జరగకపోను ”
” ఆఫీసు, ఇల్లు వొకటి ఎలా అవుతాయి, నా యింట్లో నా అభిప్రాయాలు చెప్పుకొనే స్వాతంత్రం నాకు లేదా ? ”
” స్వేచ్ఛ, స్వాతంత్రం అన్నీ వున్నాయి శివీ, యిప్పుడు నీకో చిన్న క్లాసు తీసుకుంటాను సరేనా ?
” నా యింట్లో నా అభిప్రాయలు… అన్నావు చూసేవా? అదే యింట్లో వున్న మిగతా వాళ్ల స్వాతంత్రం గురించి యెప్పుడూ ఆలోచించలేదా ?, వాళ్లు కూడా నీలాగే ఆలోచిస్తారు కదా ? మరి వాళ్ల ఫీలింగ్స్ మాటేమిటి యెప్పుడైనా ఆ కోణంలో ఆలోచించేవా ? మీ తరం పిల్లలకి ప్రేమంటే ఏమిటో అవగాహన వుండటం లేదు. ఒకరు ఇచ్చేవారు, మరొకళ్లు పుచ్చుకోనేవారు కాదు శివీ యిద్దరూ యిచ్చి పుచ్చుకోవాలి. ప్రేమ యిద్దరు వ్యక్తులని మాత్రమే కలుపుతుంది కాని పెళ్లి రెండు కుటుంబాలని కలుపుతుంది. అతని వారు నీవారు అనే భావం నీలొను, నీ వారు అతనివారు అనే భావం అతని లోను రావాలి . కష్ఠసుఖాలలో నీకు తోడూ నీడగా వుంటాను అనే ప్రమాణం యే మతం లోనైనా వుండి తీరుతుంది. కాని ఎంతమంది యీ ప్రమాణానికి కట్టుబడి వుంటున్నారు శివీ. యివాళ ప్రేమ, దోమ అంటూ వొకరితో తిరిగి రేపు మరొకరితో తిరుగుతూ, వాళ్ళని వాళ్లు పిచ్చి కారణాలతో మభ్య పెట్టుకుంటూ వున్న వాళ్లని ఎంతమందిని చూడటం లేదు. మాకు పెళ్లొదు, కొన్నాళ్లు కలిసుంటాం, పడకపోతే విడిపోతాం అంటూ కలిసి కాపురాలు చేస్తున్న వాళ్లు రాబోయే తరానికి యెంత చేటు చేస్తున్నారో తెలుసా ? వాళ్లకి పిల్లలు పుడితే వారి గతేంటి? డబ్బున్నవాళ్ళైతే పెద్ద హాస్టల్స్ లో పెరుగుతారు, లేదంటే అనాధలుగా గాలికి ధూళికి పెరుగతారు. మీ తరం అహంకారానికి తరవాతి తరం బలి అవ్వాలా ? ఇదెక్కడి న్యాయం శివీ? మీతరం వారిలో సర్దుబాటు తత్వం లోపించింది కాబట్టి మీ తరువాతి తరం వాళ్లు పుట్టినప్పటి నుంచి సర్దుకుంటూ బ్రతకాలా ?
పది సంవత్సరాల ప్రేమలో యెప్పుడూ కనిపించని అంతరాలు పెళ్ళైన మరునాటి నుంచి నీకు కనిపించటం మొదలయాయి. దక్షిణాదికి చెందిన నీకు, ఉత్తరాదికి చెందిన మహేందార్ కి సంప్రదాయాలలోనూ, అలవాట్లలోనూ చాలా తేడాలు వుంటాయని వూహించుకోలేకపోవడం యింత చదువు, తెలివితేటలూ వున్న నీ తప్పా? నీ కడుపులో పెరుతున్న యీ పిండం తప్పా ? మహేందర్ దుర్మార్గుడు కాడు, నీలాగ తొందరపాటు మనిషి కూడా కాదు. అందుకే అతని అభిప్రాయాలని, అలవాట్లని నీ మీద రుద్దాలని చూడలేదు. పెద్ద వాళ్ళంటే గౌరవం వున్నవాడు. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్ను మనస్పూర్తిగా ప్రేమించినవాడు ఔనా ? ”
శివానీ ఆలోచనలో పడింది. అత్త చెప్తున్నది నిజమే మహేందర్ చాలా మంచివాడు. తను ఆవేశపడి వాళ్ల అచారాలని అలవాట్లని నిందించినా మహేందర్ మాత్రం యెప్పుడూ నోరుజారలేదు. శివానీకి ఎందుకో తప్పంతా తనదేనని వోప్పుకోవాలని అనిపించలే, అందుకే,
“మంచి వాడే అనుకో కాని వాళ్ల వాళ్లకి చెప్పొచ్చుగా నేనున్నప్పుడు మాంసాహారం, ముసుగులు వద్దని ” చిన్నపిల్లలా బుంగమూతి పెట్టి అంది.
” మనం విందు భోజనం అంటే నాలుగు రకాల పిండి వంటలు వండుకున్నట్లే వాళ్ళు నలుగురు కలిసినప్పుడు వాళ్లకి యిష్ఠమైనవి వండుకున్నారు గాని నిన్ను కించపరచడానికి కాదు శివీ. యిది నువ్వు అర్ధం చేసుకోవాలి, మీ ఇద్దరే వున్నప్పుడు మహేందర్ వండమన్నాడా? లేక పొతే బయటనుంచి తెచ్చుకు తిన్నాడా ? “.
” లేదత్తా! వాళ్ల వాళ్లు వచ్చినా యేదో హోటల్ కి తీసుకువెళ్ళేవాడు, అయినా శాఖాహారం ఆరోగ్యానికి మంచిది అని అంతా అంటున్నారు కదా మరి వాళ్లు మాంసాహారం మానేయొచ్చు కదా ? ”
” ఔనా, మరి ఫాస్ట్ ఫుడ్స్, డ్రింక్స్ కూడా మంచివి కావనే చెప్తునారు కదే! నువ్వు మానేసేవా ?, అలాగే యిదీను, మరో విషయం శివీ ఆడైనా మగ అయినా వివాహ బంధంలోకి అడుగు పెట్టే ముందు తెలుసుకొని ఆచరించ వలసిన విషయాలు యేమిటంటే వీధిలొ[ విషయాలు గుమ్మం బయటే విడిచి పెట్టాలి. యింట్లో విషయాలు పడక గది బయట విడిచి పెట్టాలి. అలాగే పడక గది విషయాలు గది దాటి బయటికి రాకూడదు, యింట్లో విషయాలు వీధి గుమ్మం దాటకూడదు. యీ మాట మా నాయనమ్మ మాకు చెప్పేది. యీ మాట ఆ తరమైనా యీ తరమైనా ఆచరణీయం తెలుసా ?, అలాగే మరో మాట గుర్తు పెట్టుకో, ఆలుమగలు మధ్య మూడో వ్యక్తికి చోటు యివ్వకూడదు . నీ సమస్యలకి పరిష్కారాలు నీ దగ్గరే వుంటాయి, ఆవేశంతో కాక వివేకంతో ఆలోచిస్తే, సరి అయిన పరిష్కారం లభిస్తుంది “.
శివానీ అత్త సమస్యకి పరిష్కారం సూచిద్దామని యీ సంభాషణ మొదలు పెట్టింది. కానీ అత్త తన సమస్యకి పరిష్కారం చూపిస్తోంది. శివానీలో యెన్నో జవాబులేని ప్రశ్నలు, ఆలోచనలతో తల బద్దలయిపోతోంది. అత్తనే అడగాలి.
” అత్తా, పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో సమస్యలు వుండవా ?, పదేళ్ళు ప్రేమించుకున్న మాకు పెళ్లైన తరువాత వొకరి గరించి వొకరికి యేమీ తెలీదు అని అనిపించింది. మరి పెద్దలు ఏకం చేసిన జంటల సంగతేమిటి “.
“అందుకే నాకనిపిస్తుంది యువతకి పెళ్లికి ముందు పెళ్లి మీద పూర్తి అవగాహన వుండాలి. వేరు వేరు ఇళ్ళల్లో పుట్టి పెరిగిన యిద్దరు సంపూర్ణ వ్యక్తులు వొకటై వొక కప్పుకింద బతకాలంటే యెన్నో రకాలైన సర్దుబాటులు చేసుకోవాలి, కొత్తగా యేర్పడ్డ చుట్టరికాలని నిభాయించుకోగలగాలి. బాధ్యతలని భారం అనుకోకూడదు. వీటన్నిటికి తట్టుకోవాలంటే మానసికంగా సిద్ధపడాలి. వొకమారు మనముందున్న సమస్య మీద మనకి అవగాహన వుంటే అది సమస్యలాగే కనిపించదు. కొన్నింటిని కాలానికి వదిలి పెట్టెయ్యాలి.
మన పెళ్లిళ్ల లో చదివే వేద మంత్రాలన్నీ వధువు వరుడు సమానమని, సమానంగా సంసారపు బాధ్యతలని పంచుకోవాలనే చెప్తున్నాయి. అంటే వేదకాలంలోనే ఆడమగ సమానమనే భావన వుండేది. ఎప్పుడు యీ భావన పోయి, యెవరు గొప్ప అనే ప్రశ్న యిద్దరిలోనూ ప్రవేశించిందోగాని బస్ అప్పటినుంచే యీ సో కాల్డ్ ఇగో గొడవలన్నీ మొదలయ్యేయి. ముక్కు మొహం తెలీని వాళ్లు మనని ఎన్ని మాటలన్న సర్దుకుపోతాం, కాని ‘ మన ‘ అనుకొనే వాళ్లు మనని చిన్న మాట అన్నా పరిసరాలని కూడా మరిచిపోయి ఎదురు తిరుగుతాం. కారణం ఏమిటి అని ఆలోచిస్తే నాకేమనిపించిందో తెలుసా ? బయట వాళ్లు చేసిన అవమానాలకి ఎదురు చెప్పలేక మనసులోనే దాచుకున్న భావాలు మన వాళ్ల మీద చూపిస్తున్నామేమో అని, అంతేకదూ శివీ ” ట్రాన్స్ లో వున్నట్లుగా చెప్పుకుపోసాగింది మాలతి.
“నువ్వు చెప్తూ వుంటే నిజమేనేమో అనిపిస్తోంది ఆత్తా , యీ సమస్యకి సమాధానం కూడా నీ దగ్గర వుండే వుంటుంది, అది కూడా చెప్పు నాలాంటి వాళ్లకి పనికి వస్తుందేమో ? ”
” నాకు తోచిందేదో నేను చెప్పాను, నీకు నచ్చినందుకు చాలా సంతోషం, చాలా సులువైన పరిష్కారం ఏంటో తెలుసా కోపాన్ని నియంత్రించుకోవడం. మా చిన్నప్పుడు మా టీచరు ‘ కోపం వచ్చినపుడు మౌనాన్ని ఆశ్రయించు, తప్పనప్పుడు మాటలు పొదుపుగా వాడు ‘ అని చెప్పేవారు. యిన్ని సంవత్సరాలుగా యిదే సూత్రాన్ని పాటిస్తున్నాను, ఎదుటి వాళ్లు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాలనే రూలు లేదు. ఒక్కొక్కప్పుడు మన మౌనమే వంద సమాధానాలతో సమానం. సో యిప్పుడు నీ జీవితం నీ చేతల్లో వుంది. మనసంతా ప్రేమనింపుకొని ప్రేమలో జీవిస్తావో, నీ నరనరాన ద్వేషం నింపుకొని, జీవితాన్ని పాడు చేసుకుంటావో నీ యిష్టం. మీ అమ్మమ్మ కి కాఫీ కలపాలి. నే వంటింట్లోకి వెళ్తున్నా, శాంతంగా ఆలోచించుకో, తెలివయినదానివి, మంచి నిర్ణయమే తీసుకుంటావనే నమ్మకం నాకుంది “. శివానీని ఆలోచనలకు వదిలి వంటింటి వైపు నడిచింది మాలతి.

—————

మాలతి వంటిట్లోకి వెళ్లిన తరువాత శివానీలో అంతర్మధనం మొదలయ్యింది. యీ యేడాదిలో తనకి మహీకి జరిగిన గొడవలు పునరావలోకనం చేసుకుంటే మొత్తం తప్పంతా తనదేనని అనిపించింది. అన్ని గొడవలకి తనే గెలవాలనే తన మూర్ఖత్వమే కారణంగా అనిపించింది. తను యెంత పిచ్చిగా ప్రవర్తించినా మహీ తననే సపోర్ట్ చెయ్యాలనే అనుకొంది, అలా చెయ్యకపోతే తన మీద ప్రేమ లేదని అతనిని నిందించింది . చేసిన తప్పులు వొక్కొక్కటీ కళ్ల ముందు తిరగాసాగేయి. అమ్మవారిలా నోరేసుకు పడిపోయినా సహనం కోల్పోని మహి అంటే మరింత యిష్టం పెరిపోయింది. అందుకే మరి ఆలస్యం చేయ్యదల్చుకోలేదు. రాత్రి బస్సుకి టికెట్ బుక్ చేసుకొంది శివాని.
ఎప్పుడు శివానీ మహిని అల్లుకుపోయిందో యిద్దరికీ తెలియలేదు.
” మరి మాలతి ఆంటీ సమస్యకి పరిష్కారం యేమిటి శివీ, మీ అమ్మమ్మకి యింకా కొడుకులు వున్నారుగా ? కొన్నాళ్లు వాళ్ళదగ్గరకి పంపిస్తే యిద్దరికీ కాస్త విరామం దొరుకుతుందేమో ?”
” నేను అదే చెప్పేను, దానికి ఆవిడ ఏమందో తెలుసా ? ” కొత్తలో మీ అమ్మమ్మ మాటలు నన్ను చాలా బాధించేవి, చాలా కోపం తెప్పించేవి. నేను ఎప్పుడూ నోరు జారదలుచుకోలేదు. అందుకే మౌనంగా వుండేదాన్ని, తరవాత తరవాత అలవాటయిపోయింది. తినగ తినగ వేము తియ్యనుండు లాగ, యిక యిన్ని సంవత్సరాల తరువాత అలవాటయిపోయింది. యిప్పుడు ఆవిడ మౌనంగా వుంటే ఆవిడకి ఆరోగ్యం బాగులేదేమో అని నాలో గుబులు మొదలవుతుంది. ఓ నాలుగు రోజులు ఆవిడ మరో కొడుకు దగ్గర వున్నా నన్ను మా యింటికి పంపెయ్యి అని గొడవపెట్టి వచ్చేస్తారు. ఓ సారి మీ చిన్నమావ యింటి నుంచి వచ్చేక ‘ నన్ను వాళ్ళింటికీ వీళ్లింటికీ పంపకే నువ్వు లేని యింట్లో నేనుండలేనే, నీ చేతుల్లోనే కన్నుముయ్యాలే, ఏదో యీ జన్మకి యిలా కానీ. మళ్లా జన్మలో నేను నీ కోడలినై నీ ఋణం తీర్చుకుంటాను, అంతవరకూ ఓపిక పట్టు తల్లి మాలతమ్మా ‘ అన్నారు. మేమిద్దరం ఒకరికొకరం అలవాటు పడిపోయేము ” అంది.
” అవును శివీ, యిది కూడా ఒకరకమైన ప్రేమేనేమో ”
” ఏమైనా మహీ నా మనసున కమ్మిన మబ్బులు తొలగించిన మా అత్తకి యెప్పుడూ ఋణపడి వుంటాను “.
” నేను కూడా శివీ ” అంటూ శివానీని గుండెలకి హత్తుకున్నాడు మహేందర్.

విశ్లేషణ: స్వాతీ శ్రీపాద
వారం కి౦దట “ఇక నువ్వూ నేనూ కలిసి ఉండటం కష్టం “ అని అలిగి వెళ్ళిపోయిన భార్య శివాని తిరిగి రావడం అత్తను ఉద్దరి౦చాలనుకుని అత్తచేత తానే ఉద్ధరి౦చబడట౦, అక్కడ ఎం జరిగి౦దో ఆ జరిగిన విషయం తనను ఎలా మార్చేసి౦దో భర్తకు వినిపిస్తు౦ది శివాని. కొత్త తరానికి కావలసిన సర్దుకుపోయే తత్వం కుటుంబాలు విచ్చిన్నం కాకు౦డా కాపాడుకోడం గురి౦చి రమ్య౦గా చెప్పిన కర్రా నాగలక్ష్మి గారి కధ చదువరులను చక్కగా అలరిస్తు౦ది. తొలగిన మబ్బులలాగే తొలగిన అపోహలూ ఆహాలూ మ౦చి వెలుగునిస్తాయి బ్రతుకు బాటలో.

6 thoughts on “తొలగిన మబ్బులు (తరాలు – అంతరాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *