May 4, 2024

కాలమే దీనిని పరిష్కరించాలి (తరాలు – అంతరాలు)

రచన:వడ్లమాని బాలా మూర్తి

“భవ్యా ఇంత లేట్ అయిందేమ్మా?”
“ఆఫీస్ లోనే లేట్ అయిందమ్మా.”
“చప్పున కాళ్ళు కడుక్కురామ్మా భోజనం చేద్దాం.”
“అక్కడే టిఫిన్ తిన్నాను ఇప్పుడేం వద్దు.” అనీ నేరుగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది భవ్య.
“ఏమిటో ఈ పిల్లా ఈ మధ్య రోజూ ఆలస్యంగా రావడం, భోజనం చెయ్యకుండా పడుక్కోవడం. ఎమౌతోందో అర్ధం కావడం లేదు”, అని సణుక్కుంటూ కంచంలో వడ్డించుకుని గబగబా రెండు ముద్దలు తిని లేచింది సీత.
మంచం మీద వాలి ఆలోచనలో పడింది…..గత వారం పది రోజులుగా ఇదే తంతు, ఆఫీస్ లో టెన్షన్ వల్లో ఏమిటో అర్ధం కావడం లేదు. మునుపు రాగానే జరిగిన విశేషాలు చెప్తూ, నవ్వుతూ, నవ్విస్తూ కలిసి భోజనం చేసే వాళ్ళు. ఈ మధ్య భవ్య కొంచెం సీరియస్ గానే కనబడుతోంది. ఏమైందో రేపు పొద్దున్నే కొంచెం కనుక్కోవాలి…..
సీత నర్స్ గా పని చేస్తూ, తండ్రి లేని పిల్ల అనీ భవ్యని చాలా గారాబంగా పెంచింది. గారాబంతో పాటు చాలా పద్దతిగా పెంచింది. భవ్య కూడా చక్కగా చదువుకునీ చాలా మంచి పిల్ల అనే పేరు తెచ్చుకుంది. ఎం బి ఏ చేసి, కాంపస్ సెలెక్షన్ లో ఓ మంచి ఎం ఎన్ సి లో మేనేజర్ గా ఉద్యోగం సంపాయించుకుంది. ఇరవై మూడేళ్ళ భవ్య చూడ చక్కని పిల్ల. ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ చాలా లైవ్లీ గా ఉంటుంది.
తనకీ ఇటువైపు, అటువైపు కుడా ఎవ్వరూ లేకపోవడంతో భవ్య తోడిదే లోకం, తన పంచప్రాణాలూ పిల్లపైనే పెట్టుకుని బ్రతుకుతోంది సీత. పిల్ల గురించి ఆలోచనలతో, సరిగ్గా నిద్ర పట్టక, సీత రాత్రంతా జాగారం చేసింది. పొద్దున్నే లేచి గబగబా టిఫిన్ చేసి డబ్బాలు సర్దుతూండగా, భవ్య తయారయి వచ్చింది. ” అమ్మా నేను తొందరగా వెళ్ళాలి. ”
” ఇదుగో అయింది నీ టిఫిన్ డబ్బా తీసుకెళ్ళు. సాయంత్రం త్వరగా వచ్చేస్తావా?”
భవ్య, ఏదో చెప్పాలనీ, చెప్పనా వద్దా అనీ ఆలోచిస్తూ ” అమ్మా!” అంది. “ఏమిటమ్మా భవ్యా? ఏదో డిస్టర్బడ్ గా ఉన్నావు? ఆఫీస్ లో పనా?లేక ఏదైనా గొడవైందా? “అనీ ఆతృతగా అడిగింది సీత.
“ఏం లేదమ్మా. నీకో…నీకో విషయం చెప్పాలని.” చెప్పు అన్నట్లు చూసింది సీత.
“అమ్మా…..నేను ఒకటో తారీఖునుండి వేరే ఉండడానికి వెడుతున్నాను”.
“అంటే?”
“నీకు నా ఫ్రెండ్ కేదార్ తెలుసుగా! అతనితో వెళ్ళి, కలిసి ఉందామని డిసైడ్ చేసుకున్నాను. వుయ్ విల్ బీ లివింగ్ టుగెదర్.”
“ఆ(((.. ఏమిటి మాట్లాడుతున్నావే? వాడితో పెళ్ళి కాకుండా ఉండడం ఏమిటే?” కాళ్ళు వణుకుతూ ఉంటే చటుక్కున కుర్చీలో కూర్చుండిపోయింది సీత.
“అమ్మా! టేక్ ఇట్ ఈజీ. కేదార్ నాకు మంచి ఫ్రెండ్. మా ఇద్దరి అభిప్రాయాలు కలుస్తాయి. అందుకే కలిసి కొన్నాళ్ళు ఉందామనుకుంటున్నాము.”
” అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా?”
“లేదమ్మా. లివింగ్ టుగెదర్ అన్నానుగా, ఒక ఏడాది కలిసి ఉండి, ఇద్దరకి ఇష్టమైతే పెళ్ళి చేసుకుంటాము.”
“లేకపోతే?”
“విడి పోతాం, ఎవరి దారి వాళ్ళదే.”
“విడిపోతే అప్పుడేం చేస్తావే?” అని ఆవేదనగా అడిగింది సీత.
“అప్పటిది అప్పుడు చూసుకుంటాము.”
“నీకు తెలిసే మాట్లాడుతున్నావా భవ్యా? ఇదేమైనా బొమ్మలాటనుకున్నావా? అప్పుడు నిన్నెవడు ఆదరిస్తాడే?”
“అమ్మా నేనేం చిన్న పిల్లని కాను, ఇది నీ కాలంలోలా కాదు. అమ్మాయి వర్జిన్ అయి ఉండాలి, లేకపోతే పెళ్ళే అవదు అనేది ఓల్డ్ థాట్. లివింగ్ టుగెదర్ అనేది ఇప్పుడు చాలా సాదారణం. అయినా ఇప్పుడన్నీ డిసైడ్ అయిపోయాయి. నిన్ను వదిలేసి వెళ్లిపోతున్నానని అనుక్కుంటున్నావేమో? వారంవారం వచ్చీ కలిసి వెడుతూ ఉంటాను. ఫైనాన్షియల్లి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నాకు లేట్ అవుతోంది వెడుతున్నాను.” అని గబగబా పర్స్ తీసుకుని వెళ్ళిపోయింది.
సీత షాక్ వల్ల నోట మాట రాక అలా కూర్చుండి పోయింది.
…..హిస్టరీ రిపీట్స్ అంటారు. తాననుభవించినదే తన కూతురు కూడా అనుభావిస్తుందా?! హే భగవాన్! నా జీవితంలో సుఖం, సంతోషం అనేవే లేవా?! భవ్య చదువు పూర్తయి స్థిర పడింది, ఇక దానికి నచ్చిన వాడితో పెళ్ళిచేస్తే నా బాధ్యత తీరుతుందని అనుకుంటుంటే, ఈ కొత్త తుఫాను ఎందుకు సృష్టించావయా?
సీత డిగ్రీ ఫైనల్ లో ఉన్నప్పుడు, తనకన్నా ఏడాది సీనియర్ అయిన రాజారావుతో స్నేహం, ప్రేమానుబంధంగా మారినట్లు గుర్తించింది. ఇద్దరి అభిప్రాయాలు, ప్రవృత్తులు కలియడంతో ఇద్దరూ మంచి స్నేహితులైయ్యారు. స్నేహం, ప్రేమగా ఎప్పుడు మారిందో తెలియలేదు కానీ, ఇప్పుడు ఒకర్ని ఒకరు చూడకుండా ఉండలేకపోతున్నారు. రాజారావుకి హైదరాబాద్ లో ఉద్యోగం రావడం సీత డిగ్రీ పూర్తవ్వడంతో ఇద్దరికీ ఒక్కటవ్వాలనే ఆలోచన బలపడసాగింది. ఇద్దరి కులాలు వేరవడం మూలంగా, సీత ఇంట్లో ఈ పెళ్ళికి ఒప్పుకోరని, ఇద్దరూ కలిసీ చెప్పకుండా పారిపోదామని నిశ్చయించుకున్నారు. కొంతమంది స్నేహితుల ప్రోద్బలంతో, ఊరికి దూరంగా ఉన్న వేణు గోపాలస్వామీ గుళ్ళో దండలు మార్చుకొని, హైదరాబాద్ వెళ్ళే రైల్ ఎక్కేసారు.
జీవితం ఊహించుకున్నంత అందంగా, ఆనందంగా ఉంటే ఇన్నీ రకాల కష్టాలు, బాధలు ఎందుకు ఎదురౌతాయి?!
మూడు నాలుగు నెలలు ఆనందంగానే గడిచిపోయాయి. ఆ తర్వాత సాధారణంగా ప్రతీ దంపతులు ఎదుర్కొనే సమస్యలే ….. వచ్చే జీతం సరిపోదు, ప్రేమ కడుపు నింపదుగా! ప్రేమిస్తున్నప్పుడు గుర్తు రాని అమ్మానాన్నా, బంధువులు, ఇప్పుడు లేరే అనే వెలితి తెలుస్తుంది. నిన్ను పెళ్ళి చేసుకున్నందువల్లే, నా వాళ్లకి దూరమైయ్యాను అని ఒకర్నొకరు దెప్పి పొడుచుకోవడం. రాజా నెలకొకమారు ఎక్కడికో వెళ్ళి పోయేవాడు. మెల్లిగా తెలిసిన దేమిటంటే అతడు తన తల్లితండ్రులను కలసి వచ్చేవాడు. వచ్చిన తర్వాత సీతనీ విసుక్కోవడం, ఆమెతో దెబ్బలాటలు ఎక్కువైపోయాయి.
ఇంకో రెండు నెలలకీ ఊరికెళ్ళిన రాజా వారం రోజులైనా తిరిగి రాలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అతడు పని చేసే అఫీస్ కి వెళ్ళి కనుక్కుంటే, అతడు ఉద్యోగం మానేసి వెళ్ళాడని తెలుస్తుంది. అతడి సెల్ “ఔట్ ఆఫ్ రీచ్” అనే మెసేజ్ తప్ప కలవడం లేదు. అతడి తల్లి తండ్రుల అడ్రస్ తెలియదు. ఏం చెయ్యాలా? అనే మీమాంసలో పడింది సీత. ఇంటిగలావిడ దయతలచి, సీతని వాళ్ళ నాన్నకీ తనింట్లోంచి ఫోన్ చెయ్యమనీ సలహా ఇస్తుంది. ఎన్ని సార్లు చేసినా కలవలేదు. పక్క ఇంటి వాళ్ళకు చేస్తే, ఆవిడ నానా శాపనార్ధాలూ పెట్టి సీత చేసిన పనికీ తండ్రికీ హార్ట్ ఫెయిల్ అయిందనీ, తల్లీ ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చింది. దిక్కు లేని పక్షిలా మిగిలిపోయింది సీత……
సెల్ మోగుతుంటే చటుక్కున లేచింది. టైం చూస్తే మధ్యాహ్నం రెండున్నరైంది. డాక్టర్ శాంతి నుంచి ఫోన్. “హల్లో! చెప్పండి డాక్టర్”.
” సారి సీతా! ఇవాళ నీకు ఆఫ్ కదా, డిస్టర్బ్ చేస్తున్నానేమో! ”
” పరవాలేదు…..చెప్పండి.” ” శీలాకి జ్వరమట. ఇవాళ నైట్ డ్యూటీ కీ రాలేదట. నువ్వు డ్యూటీకీ వస్తావా? అన్నీ బెడ్స్ ఫుల్ ఉన్నాయి. రేపటి నీ డ్యూటీ లిల్లీ చేస్తుంది. ప్లీస్ వస్తావు కదూ.”
“ఓకే డాక్టర్! సేవెన్ కల్లా వచ్చేస్తాను.”
డాక్టర్ శాంతితో ఇరవై నాలుగేళ్ల అనుభందం. ఆమె లేకపోతే తానేమై ఉండేదో….
పొద్దున్న భవ్య వెళ్ళి నప్పటినుండీ అలా ఏడుస్తూ, జరిగినది నెమరువేసుకుంటూంటే, టైమే తెలియలేదు.
లేచీ కొంచెం టీ పెట్టుకుని తాగి, స్నానం చేసొచ్చేప్పటికి కొంచెం హాయిగా అనిపించింది. పొద్దున్న వండినదంతా అలాగే ఉంది, ఇంక సాయంత్రానికి ఏమీ చెయ్యక్కర్లేదనీ, మిగతా పన్లు చూసుకొని, డ్యూటీకి తయ్యారైంది. భవ్యకు డ్యూటీకి వేడుతున్నట్లు మెసేజ్ పెట్టి, స్కూటీ తీసుకుని బయలుదేరింది.
************

రెండు రోజులై తిండి, నిద్రా లేక శారీరికంగా, మానసికంగా అలసిపోయింది సీత. మర్నాడు పొద్దున్నే లేచీ, యెవ్వరికీ చెప్పకుండా గమ్యం లేని నడక మొదలుపెట్టింది. నడుస్తూ ఊరికి దూరంగా, అప్పుడే కట్టుకుంటున్న కాలనీకి చేరుకొని, మంచి నీళ్ళు అడుగుదామని వెళ్ళి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ ఇల్లే డాక్టర్ శాంతిది. ఆమె అప్పుడే కొత్తగా ప్రాక్టిస్ మొదలు పెట్టింది. సీత నుంచీ అన్ని వివరాలు తెలుసుకొనీ తానే ఆమెను చేరదీసింది. సీత గర్భవతి అని చెప్పిందీ శాంతే. మొదట్లో డాక్టర్ కీ అన్ని పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉండేది. భవ్య పుట్టాక నర్స్ ట్రైనింగ్ ఇప్పించి తన నర్సింగ్ హోమ్ లోనే ఉంచేసుకుంది. సీత ఆమెకు కుడి బుజంలా నమ్మకంగా పని చేస్తుంది…..
నర్సింగ్ హోమ్ చేరుకొని డ్యూటీలో పడిపోయింది. రాత్రి పది గంటలకి వెళ్ళి తన రూంలో కొంచెం రిలాక్స్ అయింది. అప్పుడే డా.శాంతి కూడా వచ్చి కూర్చుంటూ ఆమెను పలకరించింది.
“ఏమైందీ సీతా? చాల అప్ సెట్ గా కనిపిస్తున్నావు? ఏమిటి విషయం?”
“ఏం చెప్పను అక్కా? నా దురదృష్టం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇవాళ పొద్దున్న భవ్య….” అని జరిగినదంతా వివరిస్తూ ఏడ్చేసింది.
“చూడు సీతా! మన తరానికీ ఇప్పటి తరానికి చాలా అంతరం ఉంది. అప్పుడు తప్పు అన్నది ఇప్పుడు ఒప్పు అంటున్నారు. అలా అని వాళ్ళు నచ్చుకున్నవన్నీ రైటే అని కాదు. ఆ రోజు నువ్వు రాజారావు తో వచ్చేసింది కూడా ఒక రకంగా లివ్ ఇన్ రిలేషనే. నీకా రోజుల్లో ఫైనాన్షియల్ సెక్యూరిటి లేక పోవడం వల్ల నువ్వు అన్ని కష్టాలు పడ్డావు. అదీ కాకుండా తప్పు చేసేమేమో అనే గిల్టీ ఫీలింగ్ కూడా ఉండేది. అందుకే ధైర్యంగా నీ తల్లితండ్రులకి చెప్పి చేయలేక పోయేవు. ఇప్పుడు కాలం మారుతోంది. ఆడపిల్లలు బాగా చదువుకొని, మగాళ్ళతో సమంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి కావలసినవి వాళ్ళు ధైర్యంగా చేయగలుగు తున్నారు. మన సొసైటీ కూడా ఈ మార్పులని, మునపటంత తప్పుగా చూడకుండా, చూసి చూడనట్లు వదిలేస్తోంది.”
“అంటే భవ్య చేసేది తప్పు కాదంటావా?”
“తప్పు కాదు అని అనలేమూ…..! చూడు సీత! రేపు భవ్యకి వీక్ ఎండ్ కదా. నేను లంచ్ కి పిలిచి మాట్లాడతాను. నీ జీవితపు ఆటుపోట్లన్ని దానికి వివరిస్తాను. పిల్ల తెలివైనది, నేను చెప్పేది అర్ధం చేసుకుంటుందనే నమ్మకం నాకుంది. మరీ మొండిగా తాననుక్కున్నదే రైట్ అని అంటే ఎవ్వరం యేమీ చెయ్యలేము. జరిగేది జరుగుతుందని వదిలెయ్యాలి. నువ్వు ఆమెకి సపోర్ట్ గా ఎల్లప్పుడూ ఉంటావనే ధైర్యాన్ని ఆమెకు కలిగించడం నీ బాధ్యత. ఈ విషయం నువ్వు గుర్తు పెట్టుకో.”
“అక్కా నాకు భయమేస్తోంది. భవ్యనించి దాచిన విషయం తెలిసిపోతే నన్ను అసహ్యించు కొంటుందేమో?!”
“ఏ విషయం?”
“దాని తండ్రీ ఆక్సిడెంట్ లో పోయాడని చెప్పాను కదా……. ”
“డోంట్ వరీ సీత! నేనన్నీ చూసుకుంటానుగా. నువ్వు రిలాక్స్ ఆవు. బెడ్ నంబర్ ఫైవ్ కి ఎలా ఉందో చూడు, తెల్లారే లోపుగా డెలివరీ ఐపోతుంది.” అని శాంతి తన రూమ్ కి వెళ్ళి పోతుంది.
మర్నాడు భవ్య లంచ్ కి డాక్టర్ శాంతి ఇంటికి వెళ్లి వచ్చీ, ఏమీ మాట్లాడకుండా తన రూంలో వెళ్ళిపోతుంది.
“రేపు పొద్దున్న భవ్య ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు భగవాన్”, అని సీత తన గదిలో ఆలొచిస్తూ పడుకుంది.

ఇటువంటి సమస్యలకి సరైన సమాధానం ఇవ్వడం కష్టం!
కాలమే దీనినీ పరిష్కరించాలి. ………

********

8 thoughts on “కాలమే దీనిని పరిష్కరించాలి (తరాలు – అంతరాలు)

  1. కధ చాలా బాగుందండి. ఈతరం పిల్లల కధ. ఏ తరంలోనయినా తప్పని సరయిన , తప్పైన ఆకర్షణలు, సహజీవన దౌర్భాగ్యం, వెరసి దగా పడ్డ ఆడపిల్లలు. డాక్టర్ శాంతి మాటల్లో నిజం ఉందనిపించింది. ఒక వయసొచ్చి, స్వతంత్రంగా బతుకుతున్న పిల్లలను వాళ్ళ మానాన వాళ్ళను ఒదిలేయడమే పరిష్కారమేమో.వాళ్ళ గుణపాఠాలు వాళ్ళు నేర్చుకుంటేనే తలకెక్కుతుంది.బోధించే వాళ్ళు నచ్చరు వాళ్ళకి.…మీరన్నట్టు కాలమే నిర్ణయిస్తుంది వీరి భవిష్యత్తు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *