May 3, 2024

చిగురాకు రెపరెపలు-10

రచన: మన్నెం శారద

మా స్కూలు పక్కన ఒక మల్లెపూల తోట వుండేది. అక్కడ ఎండలెక్కువ కాబట్టేమో మల్లెపూలు చాలా కాలం పూసేవి. అక్కడ ఒక పధ్నాలుగేళ్ళ అబ్బాయి తోటకి ఏతా వేసి నీరు పెడుతూ, కాలవలు తీస్తూ, తోట పనిచేస్తూ వుండేవాడు. మా స్కూలుకి తోటకి మధ్య బార్బ్‌డ్ వైర్ ఫెన్సింగ్ వుండేది. అక్కడ ఖాళీ స్థలంలో నేను తొక్కుడు బిళ్ళ ఆడుతుండేదాన్ని. ఆ అబ్బాయి నన్నే తదేకంగా చూస్తుండేవాడు. ఒకరోజు నాకొక తుమ్మముల్లు గుచ్చుకుంది. తుమ్మ ముల్లు చాల నొప్పి. రక్తం కారుతోంది. క్రింద చతికిలబడ్డాను. వెంటనే ఆ అబ్బాయి ఫెన్సిగ్ లోంచి బయట కొచ్చి పిన్నుతో ముల్లు తీసేడు. ఆ తర్వాత బాగా విచ్చుకున్న మల్లెపూలు తెచ్చి యిచ్చేడు “నాకెందుకు నాకసలు జడలే లేవుగా! “అన్నాను. “ఇంటికి తీసికెళ్ళూ” అన్నాడు. కాని స్కూల్లో అమ్మాయిలు తమకి కావాలంటూ తీసేసుకున్నారు.
అలా ఆ అబ్బాయి ప్రొద్దుట విచ్చిన పూలు, సాయింత్రం మొగ్గలు యిచ్చేవాడు. అలా ఆ అబ్బాయి నాకు బాగా స్నేహం ఆయ్యేడు. ఆ అబ్బాయి పేరు మల్లెపూలబ్బాయి అయిపోయింది. అలానే పిలిచేదాన్ని. ఖాళీ వుంటే తోటలోకి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. నేనే అతను ఏ పని చేస్తున్నా కూడా తిరుగుతుండేదాన్ని. మల్లెపూలు కోస్తూ స్కూలు సంగతులు చెబుతుంటే నవ్వుతూ వినేవాడు. అతని పేరు. హుస్సేన్. ముస్లిం. కాని తెలుగు బాగా మాట్లాడేవాడు.
అతను ఏతాం వేస్తుంటే నేను దిగుడు బావిలోకి తొంగి చూస్తుండేదాన్ని. చంద్రవంక పక్కనే వుంది. బావిలో నీళ్ళు నల్లగా జల జలా పాడుతుండేవి. వాటిని చూస్తే ఒకలాంటి భయం, మరోలాంటి సరదా కలిగేవి నాకు. ఎప్పుడూ నీళ్ళంటే దిగాలని, ఈత కొట్టాలని వుండేది. ఒకసారి హుస్సేన్ ఏతాలో కూర్చోబెట్టి బావిలోకి దించమని అడిగేను.
“అమ్మో! చచ్చిపోతావ్, చాలా లోతు” అన్నాడు.
“నీళ్ల అంచుల దాక దింపి మళ్ళీ పైకి లాగేయ్” అన్నాను.
“వద్దొద్దు” అన్నాడు హుస్సేన్.
కాని.. మాడు రోజులు సతాయించేను.
చివరికి ఒప్పుకున్నాడు.
అంతే! ఎగిరి గంతేసి అందులో కూర్చున్నాను.
అదొక పెద్ద బుట్టలా వుంటుంది. తాడు తెగితే అంతే సంగతులు!
నీటి అంచుల దాకా దింపేడు. నేను తాడు పట్టుకుని కేరింతలు కొడుతుంటే పైకి లాగేడు.
“మళ్ళీ, మళ్ళీ!” అని బ్రతిమాలేను.
అలా మూడుసార్లు!
చివరకు పైకి లాగేసి క్రిందకి దింపేడు.
ఇంకెప్పుడన్నా మళ్ళీ అడిగితే వూరుకోనన్నాడు.
‘అందులో పడిపోతే ఏం చేసేవాడిని?” అనడిగా నవ్వుతూ.
‘నాకు ఈతొచ్చు. అందుకే దింపా’ అని చెప్పేడు. ఒకసారి ప్రొద్దుటే మా ఇంటి గుమ్మం ముందు తారట్లాడుతూ కనిపించాడు. మా పనిమనిషి కళ్ళాపి చల్లుతూ చూసి ‘ఏం కావాలి?’ అని ఉర్దూలో అడిగింది.
మా పనిమనిషి కూడా ముస్లిమే.
మేమంతా ‘బూబమ్మౌ’ అనిపిలిచే వాళ్ళం. చాల మంచిది. మా అమ్మగారికి జాండీస్ వచ్చి మూడు నెలలు మంచమెక్కితే మమ్మల్ని కన్నతల్లిలా చూసుకుంది.
ఆ హుస్సేన్ మల్లెపూలు ఇంటికి తెచ్చేడు.
బూబమ్మ అవి తీసుకుని లోని కొస్తుంటే “ఏంటవి? ఎవరబ్బాయి?” అనడిగింది మా అమ్మ.
“హుస్సేనని మా వాళ్లే. సైదులు కొడుకు. మల్లెతోటుంది. రెండో పాపకిమ్మన్నాడు” అంది.
అంతే!
నేను హుషారుగా బయటికి పరిగెత్తి హుస్సేన్ రానంటున్నా చెయ్యి పట్టుకుని బలవంతంగా లోపలికి లాక్కొచ్చేను. హుస్సేన్ ఇబ్బందిగా వచ్చాడు.
హుస్సేన్ ఇబ్బందిగా వచ్చాడు. అక్కడే నిలబడి నిశితంగా చూస్తున్న మా అమ్మకి ‘సలాం’ చేసేడు. మా అమ్మ మాత్రం అతన్ని నేరస్తుడిలా చూడటం నాకిప్పటికీ గుర్తే.
మా అమ్మ అతన్ని కూర్చోబెట్టి కాఫీ యిస్తే బాగుండునని నాకుంది. కాని మా అమ్మ అసలే హిట్లర్!
రోజూ పూలన్నీ తీస్కుని దేవుడికి పెడ్తుంది కాని… మర్యాదా లేదని ఏడుపొచ్చింది. చెప్పే ధైర్యం లేదు.
ఇంతలో నాన్న వచ్చేరు. హుస్సేన్ మళ్ళీ సలాం చేసేడు. నాన్న మాత్రం బాగానే మాట్లాడేరు. తోట వివరాలడిగేరు. ‘చదువుకోలేక పోయేవా?’ అన్నారు.
“ఎక్కడ సాబ్, బాబా పెద్దగా అయిపోయేరు. నేనే అంతా చూసుకోవాలి” అని చెప్పేడు.
పాపం, ఇదంతా నిలబడే మాట్లాడి వెళ్ళిపోయాడు. “ఇలా ఎప్పుడూ కొంపలకి తేకు. అయినా ఎవడంటే వాడేనే నీకు స్నేహితులు?” అంటూ తిట్టింది అమ్మ.
బూబమ్మ ఆ మాటలకి నొచ్చుకుందేమో. “మంచి కుటుంబమేనమ్మా! సైదులంటే అందరికీ చాలా మర్యాదా” అని చెప్పింది.
అమ్మకా మాటలేం నచ్చలేదు.
తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళే గొప్పవాళ్ళు, మనుషులు అని మా అమ్మకి చాలా గట్టి నమ్మకం. ఇక హుస్సేన్ ని ఏమి గౌరవిస్తుంది.
‘ఇది చూడండి. ఆ తోటల వెంట తిరుగుతోంది. ఎప్పుడో ఎవడో పీక నొక్కి చంపేస్తాడు” అంది నాన్నతో.
“నువ్వలా వెళ్ళకూడదురా” అని నాన్న ఏదో మాట వరసకి మందలించి పోస్టాఫీసులోకి వెళ్ళిపోయారు. కాని… నేను హుస్సేన్ తో ఆ స్కూల్లో చదివిన రెండేళ్ళూ స్నేహం సాగించేను. హుస్సేన్ కి నేనంటే ఎందుకంత ఇష్టమో నాకు తెలియదు.
ఆ వూరునుండి ట్రాన్స్‌ఫరయి వెళ్ళిపోతున్నప్పుడు మ బండి వెనుక కన్నీళ్ళతో నడిచిన వాళ్ళల్లో బూబమ్మ, హుస్సేన్ కూడా వున్నారు. ఇప్పటికీ అతనిచ్చిన మల్లెపూల పరిమళం నా మనసుకి హత్తుకునే వుంది.
ఒకరోజు మాస్టారు పాఠం చెబుతూ దయ్యం గురించి చెప్పారు.
ఆయనెళ్ళేక “దయ్యాన్నెప్పుడయినా చూశావా?” అని నా క్లాస్‌మేట్ నాగేశ్వరమ్మని అడిగేను.
“చూశాను గాని…” అంటూ నసిగింది.
“అవునా? ఎక్కడ?” అనడిగేను ఆసక్తిగా.
“స్మశానం దగ్గర” అంది.
“ఎలా వుంటుంది?” నేను వుత్సాహం ఆపుకోలేక పోయాను.
“ఎర్రటి కళ్ళు, పాదాలు అయ్యోరు చెప్పినట్టే ఎనక్కుండాయి” అంది.
‘మరి కోరలు..’
“ఆ..ఆ.. అయ్యీవుండాయి.
“ఏం చేయలేదా నిను?”
“ఆంజనేయస్వామిని తల్చుకున్నా. పారిపోయింది”
“సరే, మధ్యాహ్నం మనం ఎవరికీ చెప్పకుండా స్మశానానికి వెళ్ళి దయ్యాన్ని చూద్దాం” అన్నాను.
“అమ్మో నేను రాను. మనతో ఇంటికొస్తుంది” అంది గుండె మీద చేతులుంచుకుని భయంగా.
“సరే నేనెళ్తా… మా అక్కకి చెప్పకు” అన్నాను.
“నువ్వొక్కర్తివే వెళ్తావా?” ఆశ్చర్యపోతూ అడిగింది.
“నీకు తెలుసో లేదో దయ్యంకి నేనంటే హడల్” అని చెప్పేను.
“ఏమో బాబూ! నీ యిష్టం” అంది.
మధ్యాహ్నం స్కూలుకి అవతల చంద్రవంక పక్కనున్న స్మశానానికి బయల్దేరేను.
లోపల కొద్దిగా భయం, దెయ్యాన్నెలా అయినా చూడాలన్న కోరిక- రెండింటితో సమతమవుతూ చివరికి స్మశానం చేరుకున్నాను. అక్కడంతా ఖననం చేసే ఆచారం వుంది. దహనం చెయ్యరు.
అందుకని చాల సమాధులున్నాయి. చుట్టూ పెద్ద పెద్ద వేప చెట్లు చింత చెట్లు ఆకాశంలో పందిరి వేసినట్లుగా మూసేసి వున్నాయి. దాంతో అక్కడ వెలుగు సరిగ్గా లేక కొద్దిగా భయంగానే అనిపించింది.
కాని దయ్యాన్ని చూసిన ఘనత దక్కాలంటే కొంచెం ధైర్యం చేయాలి కదా!
అందుకే చిన్నగా లోపల భయాన్ని ఆణచుకొని మెల్లిగా ఆ ప్రాంతంలో అడుగులేస్తున్నారు.
కొంతమంది పల్లెటూరివాళ్ళు అప్పుడప్పుడూ అటూ యిటూ వెళ్తున్నారు. ఒక సమాధి మీద ఒకావిడ ఒక కాలు చాపుకుని వేలు ముడేసుకొని కూర్చొని వుంది. దయ్యమా?
ఉలిక్కిపడ్డాను.
దయ్యాన్ని చూసి భయపడితే అని మరింత ఏడిపిస్తాయని నాకు నాగేశ్వరమ్మ చెప్పింది. అందుకే ధైర్యం తెచ్చుకుని ఆవిడ దగ్గరగా వెళ్ళి సమాధి చుట్టూ తిరిగాను. కాళ్ళు వణుకుతున్నాయి.
ఆవిడేం మాట్లాడలేదు.
నన్నే సీరియస్ గా చూస్తున్నది.
నేనావిడ కాళ్ళు ఎటు తిరిగి వున్నాయో చూడాలని ప్రయత్నిస్తున్నాను. సరిగ్గా కనబడడం లేదు.
ఎలాగైనా దయ్యాన్ని చూశానన్న ఘనత దక్కించుకోవాలని భయాన్ని జయించి ప్రయత్నిస్తున్నాను.
‘ఎవరు నువ్వు?’అనడిగాను చివరికి.
ఆవిడ నా వంక కోపంగా చూసింది కానీ మాట్లాడలేదు. ఇంతలో హుస్సేన్ రొప్పుతూ పరిగెత్తుకొచ్చాడు.
“ఇక్కడేం పని నీకు? స్మశానానికి కెందుకొచ్చావ్?” అన్నాడు ఆయాసపడుతూ.
నేను హుస్సేన్ ని చూసి ఆశ్చర్యపోయాను.
‘నువ్వు రావడం చూశాను. అందుకే పరిగెత్తుకొచ్చేశాను. పద మీ హెడ్మాస్టారుగారికి చెబుతాను” అన్నాడు కోపంగా.
“వద్దొద్దు, దయ్యాన్ని చూడాలని… వచ్చాను హుస్సేన్!” అన్నాను బ్రతిమలాడుతూ.
“నువ్వు చాలా అల్లరి. నేనీ రోజు నుండి నీతో మాట్లాడను” అన్నాడు.
నాకు ఏడుపొచ్చింది. ఏడ్చేసేను.
“సర్లే! మాట్లాడతా గాని… ఇలా ఏం అనిపిస్తే అది చేసేస్తావా? పద” అంటూ స్కూలుకి తీసుకొచ్చాడు.
“ఇంతకీ ఆవిడ దయ్యమేనా?” అనడిగేను హుస్సేన్ ని దారిలో.
హుస్సేన్ పక పకా నవ్వి ” పాలమ్ముకునే ఆవిడ. దుర్గి నుంచి మాచర్ల వచ్చి మళ్ళీ పోతున్నది” అన్నాడు.
“మరక్కడ సమాధి మీద కూర్చుంటే?” అన్నాను ఆశ్చర్యం గా.
“ఆవిణ్ణి చూసి దయ్యలే భయపడతాయి. నువ్వు నిజంగానే దయ్యాన్ని చూసేవ్!” అన్నాడు.
నాకు అర్ధం కాలేదు.
“మొగుణ్ణి చంపేసింది. ఆవిడకేం భయం?” అన్నాడు.
“మరి నన్ను చంపలేదే?”
‘నిన్నెందుకు చంపుద్ది? మొగుడి మీద కక్షతో చంపింది. ఇక్కడంతా కక్షలకే చంపుతారు” అన్నాడు.
ఆ కక్షలేంటో నాకప్పుడర్ధం కాలేదు.
ఆ మర్నాడు హుస్సేన్ పోస్టాఫీసులో హుస్సేన్ మా నాన్నని కలిసి ఏం చెప్పాడో ఏమో కాని మా నాన్న మా అమ్మకి చెప్పి నా చేతి గాజులు, జూకాలు తీయించేసేరు.
‘దానికి తెలిసీ తెలియని వయసు. బంగారం ఎందుకులే?” అని నచ్చచెప్పేరు.
పోస్టాఫీసులో కార్డులు, కవర్లు, స్టాంపులు అమ్మడం చూసి నాకొక అయిడియా వచ్చింది. నేను కాగితాలతో పడవలు, స్టీమర్లు, విమానాలు, సిరాబుడ్లు- ఇవన్నీ చేయడం నేర్చుకున్నాను. వీటిని కూడ అమ్మితే ఎలా వుంటుందని అయిడియా వచ్చింది. ఇవన్నీ స్కూల్లో రైటరబ్బాయి నేర్పించేడు.
నేనవన్నీ తయారు చేసి పోస్టల్ బాగ్ మీద పెట్టుకుని మా నాన్నగారికి కనిపించేట్లు కూర్చున్నాను.
పోస్టాఫీసు కొచ్చినవాళ్ళందరూ అవి చూసి మెచ్చుకుని ” దేనికివన్నీ పాపా?” అనడిగారు.
“అమ్మడానికి” అన్నాను.
వాళ్ళు నవ్వారు.
మా నాన్నగారది విని “నీ మొహం, అదెవరు కొంటారు? ఎవరైనా వాటిని అమ్ముతారా? లోపలికెళ్ళు” అన్నారు. నాక్కోపం వచ్చింది.
“ఏం, మీరు కార్డులు, కవర్లూ అమ్మగా లేందీ నేనివి అమ్మకూడదా?” అనడిగేను.
మిగతా స్టాఫంతా ఫక్కున నవ్వారు.
నిజంగా నాన్న అన్నట్లే ఎవరూ కొనలేదు.
చివరికి లేచి నిలబడ్డాను. నేను కూర్చున్న చోట నేలపై నాపరాళ్ళు అతికిన చోట కన్నంలోంచి ఒక తోక కనిపించింది అది మాటి మాటికీ కదులుతోంది.
నాకు తమాషాగా అనిపించింది. కాలితో దాన్ని కదిలుతోంది. అది అటూ ఇటూ కదులుతోంది. ఇక అలా ఆడుతూ కూర్చున్నాను. ఇంతలో దాసు పొస్ట్‌మాన్ చూశాడు.
“ఏంటమ్మా అది?” అనడిగేడు.
“ఏదో దాసు, భలే కదులుతోంది” అన్నాను.
దాసు అటు చూసి నన్ను వెనక్కి లాగి “సార్, పాప పాముతో ఆడుతోంది. అది త్రాచుపాము” అన్నాడు గట్టిగా.
అంతే!
అందరూ లేచి నిలబడ్డారు.
నాన్న వెంటనే పోస్టాఫీసు బంద్ చేశారు. స్టాఫంతా బిల బిలా వచ్చేసేరు.
అమ్మ విని తనూ వచ్చేసింది.
జనం పోగయి పోయారు.
“పగ పడుతుందేమో?” అని భయపడిపోయారు అమ్మా నాన్న!
అందరూ పలుగులు తెచ్చి తవ్వడం ప్రారంభించేరు. నన్ను బల్ల మీద ఎక్కించేరు.
పోస్టాఫీసు వరండాకి మా యింటికి మధ్యలో వున్న పార్టిషన్ తవ్వేసేరు.
పాము మా వరండా వైపుకి వుంది.
తవ్వుతూ తవ్వుతూ మా హాలంతా తవ్వారు. పాము అంతు దొరకడం లేదు. అంత పొడవుగా వుంది, నల్లత్రాచు.
చివరికి విసిగి పట్టుకారులతో లాగారు. అయినా రాలేదు. చివరికి ముక్కలయ్యింది గాని రాలేదు. కలుగులో పాముని గుర్రాలు కట్టి కూడ లాగలేరు. అంత బలం దానికి! అని మాస్టారు చెప్పిన మాట గుర్తొచ్చింది.
చివరికి వరండా అంతా తవ్వాక బయట పడింది.అందరూ కలిసి చంపేరు దాన్ని. నిజం అప్పుడు భయమేసింది దాన్ని చూసి. అంత పెద్ద పాముని నేనెన్నడూ చూడలేదు. చాలా రోజులు భయంతో వణికేదాన్ని.
మా రెండో మామయ్య కూతురి పెళ్ళికి అందరం పెద్దాపురం వెళ్ళాం. అక్కడ మామయ్య అప్పట్లో పంచాయితీ ఆఫీసరనుకుంటూ చేస్తున్నారు.
అందరూ నవ్వులూ వేళాకోళాలు- సరాదాగా వుంది. అనసూయ మాత్రం ఎవరితో కలిసేది కాదు. అసలే గర్వం? ఆ పైన పెళ్ళికూతురు. అదేదో హోదాలో వుంది. మాటి మాటికి సబ్బుతో మొహం కడుగుతుంటే అందరూ ముసిముసిగా నవ్వుతున్నారు.
నాకేం అర్ధం కాలేదు. మా క్రిష్ణక్క నన్ను పిలిచి “ఎన్నిసార్లు కడిగినా తెలుపవ్వవులే!” అని అనమంది.
నేను సిన్సియర్ గా వెళ్ళి “ఎందుకలా అదే పనిగా మొహం కడుగుతున్నావ్? ఎన్నిసార్లు కడిగినా తెల్లగా అవ్వవులే” అన్నాను.
అంతే!
అనసూయ కోపంతో ఊగిపోయింది.
“చిన్నత్తా.. చిన్నత్తా” అని సీరియస్ గా మా అమ్మని పిలిచింది.
మా అమ్మ హడావుడి గా వచ్చింది.
“చూడత్తా, ఇది వేలెడు లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది” అని చెప్పింది.
నేను బెదిరి మణక్కా వాళ్ళ దగ్గిర కెళ్ళి దాక్కున్నాను. మా అమ్మ ఏ అవకాశం దొరికితే సీరియస్సయి పోదామా అని చూస్తుంది. వెంటనే అక్కడికి వచ్చింది కర్ర తీసుకుని.
“అదేం చెయలేదులే చిన్నమ్మా. ఆ అనసూయ అన్నిటికీ సీరియస్సయి పోతుంది. ఏదో పెళ్ళిల్లు కదా! జోక్ చేశాం” అంది మణక్క.
కాని.. అనసూయ వూరుకో లేదు. వెళ్ళి మా అత్తకి చెప్పింది. ఆవిడ ఒకటే గొణుగుడు సణుగుడు మొదలెట్టింది.
“ఏవే.. ఎవరనమన్నారే నిన్ను?” అంది నన్ను పిలిచి.
“క్రిష్ణక్క!” అని చెప్పేను.
“ఈ క్రిష్ణకి పెళ్ళి కూడ అయింది గాని బుద్ది రాలేదు” అంటూ తిట్టింది.
నేనొచ్చి క్రిష్ణక్కకి చెప్పేను.
బయట పెట్రోమాక్స్ లైటుల్లో డాన్సు ప్రోగ్రాములు జరుగుతున్నాయి. అసలే పెద్దాపురం.
పిల్లలూ, మగాళ్ళు హుషారెత్తి పోతున్నారు. లోపల ఆడవాళ్ళ మొహాలు కోపంతో జేవురిస్తున్నాయి. ఎంత పనుండి పిలిచినా ఎవరూ లోపలికి రారే? భోజనాలు మొదలయ్యేయి. అందరూ వడ్డిస్తున్నారు. “వెళ్ళి పెరుగుతే” అని ఒక చెంబు యిచ్చింది అత్త నాకు. నేను నాకొకపని చెప్పినందుకు పరమ సంతోషపడిపోయి వంటలున్న గదిలోకి వెళ్ళేను. అక్కడ క్రిష్ణక్క నిలబడి వుంది. “ఏం కావాలి!” అంది.
“పెరుగు”
ఇదిగో తీసుకెళ్ళు. అంటూ పెద్దగిన్నె చూపించింది. వెంటనే పెరుగు చెంబు ముంచాను.
చెయ్యి కాలింది.
“అక్కా, ఇది వేడిగా వుంది” అన్నాను.
క్రిష్ణక్క విలన్ లాగ నవ్వింది.
“అవును అవి పాలు! ఇదీ పెరుగు” అంటూ ఇంకో పాత్ర చూపించింది.
“మరి?”
“అవి కాస్సేపటికి విరిగి పోతాయి. నువ్వు నోర్మూసుకుని పెరుగు తీసుకెళ్ళు” అంది.
నాకర్ధం కాలేదు.
తెల్లబోయి చూశాను.
“ఇందాక తిట్టింది కదా, అందుకే ఎవరితో అన్నా అన్నావా.. నీకే తన్నులు!” అంది వెళ్ళిపోతూ.
నేను దడదడ లాడిపోయాను.
గబా పెరుగు తీసుకెళ్ళేను గాని… భయంగా లోలోపల వణికి పోయాను.
నేను అల్లరి చేసేదాన్ని కాని… ఇలా ఇతరులని బాధించే అల్లరి నాకు యిష్టం వుండదు.
అసలే పెళ్ళిల్లు!
అంతా నిశ్శబ్దం గా జరిగిపోయింది.
తెల్లవారే ముందు అత్తయ్య, మావయ్య వంట వాళ్ళు హడావుడి పడుతున్నారు.
“గిన్నె ఎలా తోవిందో?” అంటూ పనిమనిషి విరుచుకు పడుతున్నారు వంటవాళ్ళు.
“అయ్యో రాం! మాకు తోవడవేవన్నా కొత్తా?” అని రాగం తీస్తోంది పనమ్మాయి.
“ఏవయ్యింది?” అడిగింది దొడ్డమ్మ.
“పాలన్నీ విరిగిపోయాయి వదినా?” దాదాపు ఏడుస్తున్నట్లుగా చెప్పింది అత్త.
“అయ్యో!అయ్యో!”
“కాఫీలెలా? ఇల్లంతా బంధువులు” అందరూ టెన్షన్ పడిపోతున్నారు.
నేను బిక్కజచ్చి క్రిష్ణక్క వైపు చూశాను.
క్రిష్ణక్క కళ్ళతోనే సైగ చేసింది.
తన కళ్ళల్లో సంతోషం గమనించేను.
నాకు చాలా ఏడుపొచ్చింది.
ఏం చేయలేను. నన్నే తిడతారు.
అందుకే ఆ పెళ్ళిని నేను ఆనందించలేకపోయేను.
ఎలాగో మావయ్య తంటాలు పడి పాలు తెప్పించాడు.
ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే … నాకు చాలా అపరాధ భావన కల్గుతుంది.

ఇంకా వుంది…

3 thoughts on “చిగురాకు రెపరెపలు-10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *