May 4, 2024

మాయనగరం – 20

రచన: భువనచంద్ర

“మీకు ఎవరూ స్నేహితులు లేరా? ” అడిగింది మదాలస
“ఉన్నారు.. ఉన్నారనుకుంటే! లేరు… నిజం చెబితే! ” నవ్వాడు ఆనందరావు.
“అదేంటీ? ” కొంచం అయోమయంగా అడిగింది మదాలస.
“మీరూ, మాధవి గారు, శోభ మీరంతా స్నేహితులే! కాదన్ను. కానీ ఏవొక్కరితోనూ నా గుండె విప్పి చెప్పుకోగలిగేంత చనువు లేదు. అందువల్ల లేరన్నాను. మదాలస గారు .. స్నేహం అనేది ఓ గొప్ప వరం. స్నేహితులు దొరుకుతారు. ఆ స్నేహితుల్లో మన మంచి కోరేవారు ఎందరు? స్నేహాన్ని స్వార్ధం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు… తప్పేం లేదు. కానీ , స్నేహితుడ్ని స్వార్ధం కోసం వాడుకోరుగా. అందుకే స్నేహం అంటే నాకు ప్రాణం అయినా , నేను స్నేహితుల్ని చేసుకోడానికి భయపడతా.” తలొంచి అన్నాడు ఆనంద రావు.
“ఒక మాట చెప్పనా? జీవితంలో ప్రేమ, స్నేహం అనేవి రెండూ అమూల్యమైనవే ప్రేమించకండా వుండే కంటే , ప్రేమించి మోసపోవడం లక్ష రెట్లు గొప్పది. అలాగే స్నేహం కూడా. స్నేహితుడు చెడ్డవాడు కావచ్చు. స్నేహం చెడ్డది కాదుగా. చెడ్డదైతే కర్ణుడికీ, దుర్యోధనుడికీ మధ్య స్నేహం ఎలా కుదిరింది? అది సహజమైనది కాదు కృతజ్ఞతతో పుట్టిన స్నేహం. అయినా చివరివరకు నిలిచే వుంది. అదే సీజర్ విషయంలోనే చూడండి… ‘యూ టూబ్రూటస్’ అని ప్రాణం వదిలాడు. ఎంత ఉదాత్తతో. “నువ్వు నన్ను పొడిచావంటే , ఐ యాం నాట్ వర్త్ లివింగ్ ” అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు కాదూ. ” స్నేహం చెప్పిల్లిన కళ్ళతో ఆనందరావు ని చూస్తూ అంది మదాలస.
“మీరు బాగా చదువుతారనుకుంటాను ” ఆనందంగా అన్నాడు ఆనంద రావు.
“అవును చదివేదాన్ని పెళ్ళికి ముందు పుస్తకాలే నా ప్రాణం … పుస్తకాలే నా జీవితం. అవి చదువుతూ కలల్లో తేలిపోయేదాన్ని. పెళ్ళయ్యాక తెలిసింది … కలలు క్షణాల్లో కరిగిపోతాయని. కన్నీరు కార్చడానికి కూడా అదృష్టం వుండాలని ” నిట్టుర్చి అంది మదాలస.
అప్రయత్నంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆనందరావు. కోటి పుస్తకాలు ఇవ్వలేని జ్ఞానం ఓ స్పర్శ ఇవ్వగలదు. పదికోట్ల మాటలు ఇవ్వలేని ఓదార్పు ఒక్క చిన్న స్పర్శ ఇవ్వగలదు. స్పర్శకు మించిన సాహిత్యం, స్పర్శకు మించిన సంగీతం ఏది?
చాలా సేపు వాళ్ళు నడుస్తూనే వున్నారు. రాత్రి ఎనిమిదిన్నర అయిన సంగతి ఇద్దరికీ తెలియదు. మదాలస గుండె తలుపులు ఒక్కసారి తెరుచుకొని మాటల ప్రవాహంలా బయటకొచ్చాయి. ఆమె చిన్నతనం, పెరగటం, పెళ్ళి, కుటుంబ విషయాలు, ఆఖరికి ఆనంద రావుతో చేరి ‘చెడి ‘ పోదామన్న విషయమూ చెప్పేసింది. సరోజ తననీ, తను సరోజని ఓదార్చడం గురించి కూడా చెప్పేసింది. చివరికి సుదీర్ఘంగా నిట్టూర్చి అన్నది “ఆనంద రావు గారు… ఇది నా జీవితం… మీ ముందు నేను తెరిచిన నా జీవిత పుస్తకం. మంచో చెడో నాకు తెలియదు. నేను మూగతనాన్ని వదిలి మాట్లాడాను. సో హాపీ ఫ్రండ్ ! ” అని అతని చేతిని మెత్తగా నొక్కి ఇంటి వైపుకి వెళ్ళిపోయింది.
మనసులోని బాధ మరొకరికి చెప్పుకోవడం అదృష్టం అయితే , అదే సమయానికి సైకిల్ మీద వస్తూ , మదాలస ఆనందరావు చేయిని నొక్కడం ఆమె భర్త కళ్ళబడటం దురదృష్టం . అదృష్టాదృష్టాలు ఒకే రోజున సంభవించడం విధివిలాసం.
**********
“ఏన్నాళ్ళిక్కడ పడుండమంటావు? ” బేలగా అడిగింది బిళహరి. బిళహరి విధవ. పుట్టింది బ్రాహ్మణ కుటుంబం. అందునా సంగీత విద్వాంసుల కుటుంబం. చాదస్తాలకి, ఆచారాలకి, సాంప్రదాయాలకి ఆ కుటుంబం పెట్టింది పేరు. వాళ్ల కుటుంబాన్ని చూసే కె. బాలచందర్ ‘రుద్రవీణ ‘ సినిమా తీశారని గిట్టని వాళ్ళంటారు.
బిళహరిని చిన్నప్పుడే స్కూల్ మానిపించారు. తొమ్మిదోయేటే ఊరు పేరు లేని గుళ్ళో పెళ్ళి కూడా చేసేశారు. కారణం పెద్దమనిషి అయ్యాక పిల్లకి పెళ్ళైతే వాళ్ళింట్లో సనాతులెవరూ విస్తరి వెయ్యకూడదట. అనగా భోజనం చెయ్యకూడదట. బిళహరి తాతయ్య బామ్మ బ్రతికే వున్నారాయే. బిళహరి పెద్దమనిషైపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? విస్తరి వెయ్యడానికి కొడుకు ఇల్లు పనికిరాదు. ఆ వయసులో వారిని ఎవరు చూస్తారు? అందువల్ల కొంచం ‘మోడరన్ ‘ అయినా బిళహరి తండ్రికి పిల్ల పెళ్ళి చెయ్యక తప్పలేదు. మొగుడి పేరు ‘ రాధామోహన్ ‘ . బిళహరికి తొమ్మిదేళ్ళు, రాధామోహనుడికి ఇరవై .
అప్పటికే అతనికి ఇద్దరు రాధలు, ఒక సత్యభామా వున్నారు. ఆ విషయాలు బిళహరి తండ్రికి తెలీవు. వాళ్ళకి ఎప్పుడూ సంగీత ఆరోహణ, అవరోహణా, ఆచారాలు, ప్రాయశ్చిత్తాలూ తప్ప , పిల్లనిచ్చే ముందు కాస్త వివరంగా భోగట్టా రాబడదామన్న ఆలోచనే లేవు.. రావు. కారణం కర్మసిద్ధాంతం. “పిల్ల నుదుట ఏమి రాసి వుందో అదే జరుగుతుంది గానీ, మన చేతుల్లో వుందిటండీ? “ఇదీ ఆ సిద్ధాంతాసారం.
పదహారో ఏట పిల్ల కాపురానికొచ్చేసరికే రాధా మనోహరుడు ముసలోడిలా తయ్యారయ్యాడు. కారణం బోలెడు రోగాలు. డాక్టర్ల దగ్గరకి వెళ్ళడం నామోషి. దాంతో ఒళ్లంతా పుచ్చిపోయింది. శోభనం అనే తంతు ఏర్పాటయింది కానీ మనోహరుడిలో మగతనం ఇంకిపోవడం వల్ల బిళహరి అదృష్టవశాత్తు ‘కన్య’ గానే కాపరం సాగించింది. మూడోనెల దాటి నాలుగో నెల అయింది… కాపరానికొచ్చి. ఓ అమావాస్య రోజున ‘హరీ ‘ మన్నాడు మొగుడు.
ఇంకేం… మహోద్రేకంగా బిళహరిని తన్ని తగలేశారు. “ఛీ… నీ కూతురు రాగానే నా కొడుకుని పొట్టన పెట్టుకుంది … దరిద్రపు జాతకవాని.. దరిద్రపు జాతకం…!” బిళహరిని బయటకు నెట్టి తలుపేసింది అత్తగారు. బిళహరి తండ్రి నిరుత్తురుడయ్యాడు. ఘనత వహించిన ‘కర్మ ‘ సిద్ధాంతం చెప్పేది అదే గదా. “కనీసం నగలివ్వండి… దాని బ్రతుకు అది బ్రతుకుతుంది. ” నంగినంగిగా అడిగాడాయన. ఆ రోజుల్లో యాభై కాసులు పెట్టారాయే.
“నగలా? ఏం పెట్టారు? అలకపానుపు మీద స్కూటరడిగినా ఇచ్చారా? ” కిటికీలోంచి యీసడిస్తూ అడిగింది బిళహరి ఆడపడుచు.
దేవుడా.. ఈ దేశంలో ఇలాగే వుంటుంది. చచ్చిన అన్నని గురించి కాక “అలక పానుపు మీద స్కూటర్ ” గురించి ఈసడించే ఆడపడుచుల దేశం ఇది. కొడుకు తిరుగుళ్ళు తెలిసి కూడా పెళ్ళి చేసి, ఏదో ఒకనాడు కొడుకు రోగాలతోనే చస్తాడని తెలిసి , కోడలే కొడుకు చావుకి కారణమైందనీ దారుణమైన నిందమోపే అత్తగార్ల దేశమిది.
“చట్టప్రకారం నా కూతురికి నీ కొడుకు ఆస్తిలో వాటా వుంటుంది. ముందర నేను పెట్టిన నగలు మర్యాదగా ఇస్తావా లేకపోతే తన్ని తీసుకోనా? ” అని అడగాల్సిన తండ్రి, “నీ ఖర్మ.. నీ ఖర్మ.. నీ ఖర్మ దరిద్రమొహం దానా. నా ఇంట్లో పుట్టి చచ్చావు. ఎన్ని కచేరీలు చేసి సంపాదించానో ! మొత్తం నీ మొహాన్న కొట్టాను గదే! ” అని నానా తిట్లు తిడుతూ కనీసం పిల్ల అన్నం తిందో లేదో , తిని ఎంత కాలమైందో అని కూడా ఆలోచించని తండ్రులు అడుగడుగునా తగిలే స్వర్గలోకమిది.
ఏం చేస్తుంది?
యాభై ఎనిమిదేళ్ళ పెద్ద మావయ్య (స్వయానా బిళహరి తల్లికి అన్నగారు ) “అప్పుడే నీకు వైధవ్యం వచ్చిందా తల్లీ ” అని సానుభూతి కురిపిస్తునట్లు నటిస్తూ అన్నీ చోట్ల చేతులు వేసి చపాతీపిండిలా పిసికినట్లు ఒంటిని పిసుకుతుంటే అసహ్యంతో, జుగుప్సతో మొద్దుబారిన బిళహరి ఏం చేస్తుంది?
“మావయ్య ఇట్లా చేశాడమ్మ ” అని తల్లితో అంటే.. “ఛీ.. నోర్ముయ్య్… నా అన్న దేవుడు… నిన్ను తగలెయ్యా.. ముండమోయడమే కాక అబద్ధాలు నేర్చావా? ” అన్న తల్లి మాటలకి బిళహరి నిశ్చేతురాలు కావడం గాక ఏమౌతుంది?
“ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే…. ” అని శాస్త్రాలు మధించే మహానుభావుడు కూడా “నీ మొగుడు ఒట్టి దురదృష్టవంతుడే బిల్లు… లేకపోతే నవనవలాడే నిన్ను వదిలి నరకానికి పోయాడంటే ఇంకేమనుకోవాలి? ” అంటూ నడుము కింద చేయ్యేస్తే పదిహేడేళ్ళు నిండని బిళహరి ఎవరితో చెప్పుకుంటుంది?
శృంగారానికి ఆచారం వుండదు. ఓ పక్క అన్నా వదినా… మరో పక్క వయసు మళ్ళినా “యావ ” తగ్గని తల్లీతండ్రీ , ఆఖరికి పశువుల కొట్టంలో పశువులు కూడా సృష్టి కార్యం సాగిస్తుంటే , బిక్కుబిక్కుమంటు ఓ గదిలో ఒంటరిగా పడుంటే బిళహరి తన వేదన ఎవరితో పంచుకుంటుంది?
నిన్నటి దాకా అంటే కాపరానికి వెళ్ళేదాక “నువ్వెదురొస్తే చాలే బిళహరి, అన్నీ పనులు చకచక అయిపోతాయి ” అనే మనుషులు , “ఛీ… నీ మొహం తగలెయ్యా… పొద్దుటే వెధవ మొహం చూపించకపోతే ఎక్కడైనా తగలడలేవు? ” అని అసహ్యించుకుంటుంటే బిళహరి గొంతులో ఏడుపు గొంతులో కుక్కుకోక ఏం చేస్తుంది?
ఇరవైఏళ్ళు వచ్చే వరకు ఇంటెడు చాకిరి చేస్తూ ఇంట్లోనే పడి వుంది. ఆ తరవాత ఇంటి పని భరించలేక, ‘ఒంటి ‘ బాధ తట్టుకోలేక , ఓ గుమస్తా ఉద్యోగం చేస్తూ , నాటకాలు కూడా విరివిగా వేస్తూ సినీ హీరో అయిపోవాలని కలలు మాత్రమే కాకుండా , ఆ కలలో బిళహరినే హీరోయిన్ గా వూహించుకోవడం మొదలుపెట్టిన ఓ కామేశ్వర రావుకి మనసిచ్చింది బిళహరి. కామేశ్వర రావుది ప్రైవేటు కంపెనీ. బిళహరి సౌందర్యవతే కాక, సాంప్రదాయాన్ని పాటించే మనిషి. మెళ్ళో మూడు ముళ్ళు వేస్తే కానీ ముట్టుకోనివ్వనంది. ఆ పిల్ల అబద్ధం ఆడదని అందరిలాగే కామేష్ కీ తెలుసు.
“జస్ట్ కొన్నాళ్ళు అంతే. నా ఫ్రండ్ కి అన్ని విషయాలు చెప్పాను. జస్ట్… అక్కడ మనం వుండటానికి చోటు దొరికితే చాలు. వెళ్ళిపోద్దాం. బిల్లూ… నాకోసం కొన్నాళ్ళు ఓపిక పట్టు. ” గంభీరంగానూ, కొంచం నాటకీయంగానూ అన్నాడు కామేశ్వర రావు. సినిమాలు నాటకాలు చూసి చూసి గొంతులో ఆర్టిఫిషియల్ వాయిస్ స్థిరపడింది. ఆ విషయం అతనికే తెలియదు. అతని ఆఫీసులో సహోద్యోగులకి తెలిసినా అతనికి చెప్పరు. కారణం ఆ ‘వాయిస్ ‘ వాళ్ళకి నిరంతరం నవ్వించే ఓ ‘జోక్ ‘ లాంటిది. ఆ వాయిస్ ని ‘ఇమిటేట్ ‘ చేస్తూ అందరూ పగలబడి నవ్వుకుంటారు.
నిజానికి కామేశ్వర రావు అని పూర్తి పేరున్న ‘కామేష్ ‘ మంచివాడు. గొప్ప సాహసం చేసి మహా గొప్ప పేరు సంపాయించాలని కలలు కనే స్వప్నికుడు. బిళహరిని అతను నిజంగానే ప్రేమించాడు. ఇరవై రెండేళ్ళ కామేష్ కన్నా బిళహరి మెచ్యూరిటీ చాలా ఎక్కువ.
ఆమె కామేష్ ని ప్రేమించింది. కానీ ఆ ప్రేమలో ‘ఇల్లు’ అనే నరకం నుంచి బయటపడాలనే తపనే ఎక్కువుంది. ‘నా’ అనే నిజమైన తోడు లేని వారికి, ఆకలితో లుంగాలు చుట్టుకొనిపోయేవారికి ‘ప్రేమ’ అనే ‘భ్రాంతి’ ఎక్కువుంటుంది. బిళహరి పరిస్థితి అదే.
కామేష్ కి ఊహల్లో ఉండే ధైర్యం నిజ జీవితంలో లేదు. అందుకే ‘సమస్య ‘ ఎదురైనప్పుడు అందరూ (అంటే అలాంటివాళ్ళు) ఏం చేస్తారో అదే చేశాడు. సర్వేశ్వర రావ్ అనే స్నేహితుడికి ఫోన్ చేసి సమస్యని పరిష్కరించే భారం అతని మీద పెట్టేశాడు.
ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోక తప్పదు. ఇరవైరెండేళ్ళ కామేష్ ప్రేమలో పడటం నిజమే. కానీ ప్రేమకి పెళ్ళికి మధ్య చొరబడే లక్షాతొంబై చికాకుల గురించి అతనికి ఏమాత్రం అవగాహన లేదు. వేరే వూరు వెళ్ళిపోతే అంతా ‘సెట్ ‘ అవుతుందనే పిచ్చి నమ్మకమే కానీ, తన వాళ్ళు బిళహరిని కోడలిగా అమోదిస్తారా , అసలామె విడో అన్న విషయం తన వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది, తన వాళ్ళ సంగతి అలా వుంచితే సమాజం ఎలా తీసుకుంటుంది, ఇలాంటి ప్రశ్నలు అతని బుర్రలో పుట్టలేదు. ఇరవైరెండేళ్ళ వయసులో వుండే ఆలోచనలు ఆశలు వేరు.
ఆశలు ఆచరణలు రైలు పట్టాల్లాంటివి. అవి కలవవు. పొరపాటున కలిస్తే ఏక్సిడెంట్ తప్పదు. ఈ సంగతి కామేష్ కి చెప్పేదెవరూ?
గుండె పగిలిపోతున్నా ‘గుంభనం’ గా సాగిపోయే కాలం ఏమన్నా చెబుతుందేమో చూడాలి. కాలాన్ని మించిన గురువేది?

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *