May 4, 2024

బాధ్యత

రచన: వై.యస్.ఆర్. లక్ష్మి

“శనక్కాయల్…………వేరుశనక్కాయల్………వేవేడి కాయల్”అరుచుకుంటూ వెళుతున్నాడు ఒక 12, 13 ఏళ్ళ కుర్రాడు. ఇంట్లో ఖాళీగా ఉండటంతో రోజూ సాయంత్రం పార్కుకు రావడం అలవాటైంది. ఆ పార్కు రెండు కాలనీల మధ్య ఉండటంతో రెండు కాలనీల్లోని పిల్లలు, పెద్దలు అక్కడకు వస్తుంటారు. ఎందుకో మొదటి రోజు నుంచి అతని ఉత్సాహం, అరుపులు ఆకర్షణగా అనిపించాయి. చాలా రోజుల్నించి చూస్తున్నాను ఎవరు పిలిచినా దగ్గరకు వెళ్ళి కబుర్లు చెప్పి కాయలు అమ్మేస్తాడు. రెండు గంటల్లో బుట్ట ఖాళీ చేసి చెట్టు దగ్గరున్న బెంచీ మీద కూర్చొని గుడ్డ సంచిలోని డబ్బులు గుమ్మరించి మూడు భాగాలుగా చేసి కవర్లలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. రోజూ ఇదే దినచర్య. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కుర్రాడిలో ఏదోతెలియని ఆకర్షణ, చురుకుదనం నన్ను ఆకట్టుకో సాగాయి.

ఆ రోజు దసరా పండుగ కావడంతో పార్కుకు ఎక్కువ మంది రాలేదు. అలవాటుగా నేను కూర్చునే స్థలంలో ఎవరో ఉండటంతో చెట్టు కింద బెంచి మీద కూర్చుని పరిసరాలు గమనించసాగాను. నా నోట్లో ఒక యువ జంట కూర్చొని ఆనందం పంచుకుంటున్నారు. వారి నుంచి చూపులు మరల్చి పక్కకు చూస్తే నడివయసు జంట సీరియస్ గా ఏదో చర్చించు కుంటున్నారు. కొంచెం దూరంగా ఇద్దరు వృద్దులు లోకాభి రామాయణం మాట్లాడుకుంటున్నారు. అవతల గా నలుగురు కుర్రాళ్ళు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వేరుశనక్కాయలు కుర్రాడు అక్కడే ఉన్నాడు. కాసేపటికి నేను కూర్చున్న బెంచీ దగ్గరకు వచ్చి సంచి లోని డబ్బులు లెక్కపెట్టుకుంటూ నన్ను గమనించి చిరునవ్వు నవ్వాడు. నేను కూడా పలకరింపుగా నవ్వి “నీ పేరేంటి ?”అని అడిగా.” శ్రీను అండీ”అంటూ తన పని తాను చేసుకొని వెళ్ళడానికి బయలు దేరి రెండు అడుగులు వేసి మరల ఏదో గుర్తు వచ్చినట్లు వెనక్కు తిరిగి “మా అమ్మకు మందులివ్వాలి. వస్తానండి” అంటూ పరుగున వెళ్ళిపోయాడు. ఎంత బాధ్యత.

ఆ రోజు నుంచీ రోజూ కొంచెం సేపు కబుర్లు చెప్పుకోవడం అనే కంటే నేను శ్రోత పాత్రను పోషిస్తున్నానంటే బాగుంటుంది. మాటల మధ్యలో అతని కుటుంబ విషయాలు చెప్పాడు. తండ్రి మద్యానికి బానిసై కల్తీ మద్యానికి బలయ్యాడు. అమ్మ అనారోగ్యంతో మంచాన ఉన్నది. తమ్ముడు 6, చెల్లి 4 చదువు తున్నారు. అమ్మమ్మ ఏదో సహాయం చేసినా కుటుంబపోషణ భారం తనదే నని చెప్పాడు.

కొంచెం పరిచయం పెరిగాక మూడు కవర్లలో డబ్బులు దాయడం గురించి అడిగాను.”ఒక కవరు మరునాటి పెట్టుబడికి, రెండవది భవిష్యత్తు అవసరాలకు మూడవది కుటుంబ పోషణ కని చెప్పాడు. అతని ముందు చూపుకి ముచ్చటేసింది.

ఒక రోజు ఖాళీగా ఉన్న సమయంలో “నీవు ఇంత కష్ట పడుతూ అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు?” అని అడిగా.

“ఏమున్నది సార్? కష్టాలేమున్నాయి అని ఎదురు ప్రశ్నిస్తూనే … తమ్ముడు,చెల్లి చక్కగా చదువుకుంటున్నారు. అమ్మను చూసుకోవడం కష్టం కాదు బాధ్యత. కొద్దో గొప్పో అమ్మమ్మ సహాయం చేస్తూనే ఉంటుంది. కుటుంబానికి నేనే కదా ఆధారం.ఇందులో కష్టం కాని బాధ గాని నాకేమనిపించదు. ఇది అంతా నేను ఇష్టంతోనే చేస్తాను కాబట్టి నాకు కష్టం అనిపించదు అందుకే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను.”అన్నాడు. అతని మాటలలో కాని, ముఖంలో కాని ఎక్కడా కల్మషం కనిపించలేదు. ఎంతో బాధ్యత, నిజాయతీ కనిపించాయి. అందరూ ఇంత బాధ్యతగా ఆలోచిస్తే సమాజంలో అనాధాశ్రమాలకు, వృధ్ధాశ్రమాలకు తావుండదేమో!

ఆ రోజు ఆదివారం కావడంతో పార్కంతా సందడిగా ఉన్నది.శీను కూడా గంటలోనే శనక్కాయలు అమ్మేసుకొని నేను మామ్మూలుగా కూర్చునే ప్రదేశానికి వచ్చి కబుర్లలోకి దిగాడు.”నువ్వు ఉదయం ఇడ్లీలు ,సాయంత్రం శనక్కాయలు అమ్ముతూ ఎంత కూడ బెడతావు?తమ్ముడిని,చెల్లిని ఎలా చదివిస్తావు”అని అడిగా.

“నేను ఆఫీసు బాయ్ గా నాలుగు రోజులలో చేరుతున్నాను. ఉదయం సాయంత్రం నా పని నాకున్నది. జాగ్రత్తగా ఖర్చు పెట్టి డబ్బులు దాస్తాను. వాడు బాగా చదివితే ప్రభుత్వ సహాయం, మీ వంటి పెద్దల సహకారం ఉంటుంది. చెల్లినీ అలాగే చదివిస్తాను. కృషి, పట్టుదల ఉంటే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని మాటీచర్ చెప్పింది. తప్పకుండా సాధిస్తాను సార్ “అన్నాడు.

అతని మాటలలో ఆత్మ విశ్వాసం తొంగి చూసింది. నిరాశా పరులకు ఇతని కధ ఆశను కలిగిస్తుంది. అతని కలలు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *