May 9, 2024

శుభోదయం-5

రచన: డి. కామేశ్వరి

అన్నపూర్ణమ్మ గంటనుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతూంది. ఆవిడ మనసు ఏ పనిమీద నిలవడంలేదు. ఈరోజు కొడుకు పెళ్ళి అన్నమాట పదేపదే గుర్తువస్తూంది. ఆ మాట తలుచుకున్నప్పుడల్లా ఆమె మనసులో ముల్లు గుచ్చినట్లవుతుంది. ఇంటికి పెద్దకొడుకు! ఆ కొడుకుపెళ్ళి తమందరూ వుండి దిక్కుమొక్కులేనివాడిలా చేసుకుం టున్నాడు, అన్న ఆలోచన ఆమె గుండెని రంపపుకోత పెడ్తూంది. ఎంత తమని కాదని చేసుకుంటున్నాడని కోపం తెచ్చుకుంటున్నా ఆ తల్లి ప్రాణం ఎందుకో నిలవడంలేదు… యిదేం ఖర్మ వచ్చింది. ఎంత ప్రారబ్ధం! కొడుకుని కోడలిని నట్టింట గృహప్రవేశం చేయించి ముద్దుముచ్చట తీర్చుకునే అదృష్టం తనకిలేదు. అవతల కొడుకు పెళ్ళి అవుతూంటే ఎవరిదో అన్నట్టు యిక్కడ పడివుండాల్సిన గతి పట్టిచ్చిన కొడుకుని ఒకపక్క క్షమించలేకపోతుంది ఆవిడ. మరొకపక్క మమతని దూరం చేసుకోలేక అల్లాడుతుంది.
వీధివరండాలో పేపరు చదువుతున్న అవధానిగారి పరిస్థితి అలాగే వుంది. మగవాడు కనక అన్నపూర్ణమ్మలా బయటపడకుండా మనసులో మథనపడ్తున్నాడు. “నాకు కొడుకే లేడనుకుంటాను.” అని మాటైతే అనగలిగాడు గాని ఆ బంధం అంత సుళువుగా ఎలా తెంచుకోగలడు! ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు కొడుకుమీద! ఆఖరికి యిలా తనమాట కాదని కులం, వంశం, గౌరవం, చెల్లెళ్ళ, తమ్ముళ్ళ భవిష్యత్తు లెక్కచెయ్యకుండా కులం గోత్రం తెలియని దానిని పెళ్ళాడి తన దారి తను చూసుకోవడం ఆయన క్షమించలేకపోతున్నాడు. ఒక్కక్షణం వాడు లేడు నాకు ఇంక అని నిబ్బరంగా అనుకుంటూ పేపరు చదవడానికి ప్రయత్నిస్తాడు. మరోక్షణంలో పేపరు పక్కనపెట్టి ఆలోచన లో పడ్తాడు.
ఇద్దరికిద్దరూ బాధ పడ్తున్నారు. ఇంట్లో పిల్లలు ఏదో తప్పు చేసినవాళ్ళలా బిక్కుబిక్కుమంటూ తలోమూల కూర్చున్నారు. అన్నగారి పెళ్ళిరోజు! యిదే అంతా సవ్యంగా వుంటే ఎంత కళకళలాడుతూ ఎంత ఆనందంగా హడావిడిగా వుండేవారు అందరూ. కాని యిప్పుడు…యింటినిండా శ్మశాననిశ్శబ్దం- దానికి కారకులెవరు? అన్నగారా? అన్న కోరికని ఆమోదించని తల్లిదండ్రులా! ఆ ప్రశ్నకి జవాబు వాళ్ళకి తెలియదు.
అన్నపూర్ణమ్మ భయపడుతూనే వీధి గుమ్మంలోకి వచ్చి భర్త పక్కన అరుగుమీద కూర్చుంది. ఆవిడ రాగానే ఆయన పేపరు మొహానికి అడ్దం పెట్టుకున్నాడు. భర్త మొహంలో హావభావాలను చూసి ఆయనా కొడుకు గురించే ఆలోచిస్తున్నట్టు పసిగట్టింది ఆవిడ. కాస్త మెత్తపడినట్లు కనపడగానే ధైర్యం చేసి “ఏవండీ మధూ..” ఏదో చెప్ప బోయింది. అవధాని విసురుగా పేపరు పడేసి తీక్షణంగా చూసాడు. ..”వాడి పేరు నా దగ్గిర ఎత్తడానికి వీలులేదని చెప్పానా?” కఠినంగా అన్నాడు.
“అదికాదండి..ఈ పాటికి పెళ్ళి..”
“అన్నపూర్ణా.. మరోసారి వాడి ప్రసక్తి నా దగ్గిర తీసుకురాకు. ఆనాడే వాడు నాకు లేనివాడయ్యాడు. తల్లి, తండ్రి, పరువు, ప్రతిష్ట, మమత, అనుబంధం అన్నింటిని కాలదన్నిన ఆ స్వార్ధపరుడి గురించి నేనేం వినదలచలేదు.” తీక్షణంగా అన్నాడు. అన్నపూర్ణమ్మ ఎటూ చెప్పలేక దీనంగ చూసింది.
అదే సమయంలో గుమ్మంముందు టాక్సీ ఆగింది. టాక్సీలోంచి దిగుతున్న మాధవ్ ని, రాధని చూసి ఇద్దరూ చకితులై ఒక్కక్షణం చూస్తుండిపోయారు. అన్నపూర్ణమ్మ ఆనందంగా ఎదురు వెళ్ళబోయింది. వెంటనే ఆయనకు కర్తవ్యం గుర్తు వచ్చినట్లు “అన్నపూర్ణా ఆగు. లోపలికి పద” తీక్షణంగా అంటూ భార్య చెయ్యిపట్టి లోపలికి లాక్కెళ్ళి విసురుగా తలుపు మూసి గుమ్మానికి జారబడ్డాడు ఆవేశాన్ని అణచుకుంటూ. అన్నపూర్ణమ్మ ఏదో చెప్పబోయి భర్త మొహం చూస్తూ భయంతో ఆగిపోయింది. పిల్లలు కుతూహలంగా కిటికీలోంచి చూడసాగారు.
మాధవ్, రాధా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మాధవ్ ముందుకు వెళ్ళి “అమ్మా, ఒక్కసారి తలుపు తీయి.” అన్నాడు.
అన్నపూర్ణమ్మ యింక ఆగలేకపోయింది. “తలుపు తీయండి. మాధవ్ పిలుస్తున్నాడు. బిడ్డ పెళ్ళి చేసుకుని వస్తే తలుపులు మూస్తారా..ఒకసారి తీసి లోపలికి రానీయండి..ఒక్కసారి..” ప్రాధేయపూర్వకంగా బతిమాలింది.
“వీల్లేదు. నా మాటకి విలువ ఈయనివాడు నా గుమ్మంలో అడుగు పెట్టడానికి వీలులేదు. వెళ్ళమను. “ కఠినంగా అన్నాడు.
మాధవ్ మొహం మ్లానమైంది. రాధ మొహం నల్లబడింది.
“అమ్మా.. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. అది నాకెప్పుడూ వుంటూందని తెలుసు. వెడ్తున్నాను. బాధపడకమ్మా..” అంటూ రాధ చెయ్యి పట్టుకుని వెనుదిరిగాడు.
అన్నపూర్ణమ్మ కొంగు నోట్లో దోపుకుని కింద కూలబడింది.
తెల్లచీర కట్టుకుని, శారద కట్టిచ్చిన సన్నజాజుల మాల తలలో తురుముకుని రాధ నెమ్మదిగా మాధవ్ మంచం దగ్గరికి వచ్చింది. మాధవ్ తలకింద చేతులు పెట్టుకుని అలసటగా కళ్ళు మూసుకుని పడుకుని వున్నాడు. అతను రాధని చూడలేదు. అతని మొహంలో లీలగా మెదిలే ఆవేదన చూసి రాధకి బాధ అనిపించింది. అతని క్లేశం పోగొట్టడానికి తనేం చెయ్యగలదు. రాధ నెమ్మదిగా అతని పక్కన కూర్చుని అతని గుండెలమీద తల ఆన్చి “మాధవ్” అనురాగంతో పిల్చింది…ఉదయంనుంచి ఇద్దరికి మాట్లాడుకునే వీలే చిక్కలేదు. ఇంటికి వెళ్ళి తండ్రిచేత అవమానం పొందాక ఉదాసీనంగా, గంభీరంగా టాక్సీలో కూర్చున్న అతన్ని పలకరించడానికే భయం వేసింది.
“మాధవ్..ఎవరూ లేని దురదృష్టవంతురాలిని… నేను నీకూ అందరినీ దూరం చేశాను. క్షమించు మాధవ్” అంది పట్టుకున్న గొంతుతో.
అతను ఆలోచననుంచి తేరుకుని చటుక్కున ఆమె మొహం చూసి “ప్లీజ్ రాధా… నీవూ ఏదో అని నన్ను బాధపెట్టకు. ఆనాడే అందరినీ వదులుకుని నీకోసం వచ్చాను. ఈ రోజింక కొత్తగా బాధపడడానికి ఏముంది. కాని…అమ్మ పాపం..ఆవిడ బాధ తల్చుకుంటే మనసు గిల్టీగా ఫీలవుతూంది. అంతే. ప్లీజ్, నీవేదో చేశానన్న భావం నీకింక వస్తే వూరుకోను. వాళ్లకి దూరమయ్యాను నీకు దగ్గర కావాలని…యిందులో నీ తప్పు ఏంవుంది?” నెమ్మదిగా చెయ్యి నిమిరి అన్నాడు.
ఇంటికి వచ్చాక పార్వతమ్మ, శారద ఒకటే హడావిడి చేసి పిండివంటలతో భోజనం పెట్టారు. శారద అక్కయ్యా, అక్కయ్యా అంటూ ఒక్కక్షణం వదలకుండా వెంటవెంట ఈ కబురూ ఆ కబురూ చెపుతూ తిరుగుతూనే వుండడంతో యింట్లో అసలు మాట్లాడే వీలు చిక్కలేదు.
సాయంత్రం అతని స్నేహితులు, తన స్నేహితులు మొత్తం ఏభైమందికి హోటల్లో పార్టీ అరేంజ్ చేశారు. ముస్తాబయి, పార్టీకి వెళ్ళి, అంతా ముగిసి యింటికి వచ్చాక పార్వతమ్మ స్నానం చెయ్యమని, తెల్లచీర కట్టుకోమని, కన్నతల్లిలా చెప్తుంటే ఆవిడ చెప్పినవన్నీ తు.చ. తప్పకుండా చేసింది. శారద సన్నజాజులు, మరువం కట్టిన మాల యిచ్చింది. “చూడమ్మాయి, నీకు తల్లీ, తోడూ ఎవరూ లేరు. పెద్దదాన్ని చెవ్పుతున్నాను…మాధవ్ రాధ ఆ రాధాకృష్ణుల్లా కలిసిపోవాలి. తన మనసెరిగి మసలుకో, నీకేం కావాలన్నా నేనున్నాను అడుగు” అంటూ పాలగ్లాసు చేతిలో పెట్టింది.
“రాధా…” ఆర్తిగా ఆమె చుట్టూ చేతులు బిగింఛాడు మధవ్. ..”రాధా.. యింతాలశ్యమా.. నీ కోసం చూసి చూసి..మధ్యాహ్నం ఎందుకు రాలేదు?”
“మీ పిన్నిగారి కూతురు…అంటే మీ చెల్లాయి గాబోలు..అక్కయ్యా అంటూ తోకలా ఒదిల్తేనా..” రాధ నవ్వుతూ అంది.
“అవునూ, నీకంటే అంత పెద్దగా కనిపిస్తుంది. అక్కయ్య అంటూందేమిటి? భలే చెల్లెలు దొరికింది రాగానే..” మాధవ్ హాస్యంగా అన్నాడు.
“పెళ్ళయినదానిని నన్ను చెల్లీ అంటే ఏం బాగుంటూందని కాబోలు” రాధ నవ్వింది.
“రాధా..యిప్పుడామ్మాయి సంగతే మాట్లాడడం” అంటూ రాధని తమకంగా దగ్గిరగా హత్తుకున్నాడు. ..”రాధా” మత్తుగా అన్నాడు.
అతని గుండెలమీద తల ఆన్చిన రాధ కదిలితే ఆ సుందరస్వప్నం మాయమవుతుందేమోనన్నట్టు నిశ్చలంగా, నిశ్శబ్దంగా తల ఆనించి మైమరపుతో కళ్ళు మూసుకుంది.
“రాధా..ఏమిటలా ఉండిపోయావు..” ఆమె తలని గుండెలమీదనుంచి లేపి కళ్ళలోకి అనురాగంతో చూస్తూ అడిగాడు.
“నా అదృష్టం మీద నాకింకా నమ్మకం కలగడంలేదు మాధవ్…ఎక్కడో అనాథగా పుట్టి..నా అన్నవారి ఆప్యాయత అనురాగం లేకుండా గాలికి ధూళికి పెరిగిన ఈ పూవు ఈనాడు మాధవ్ హృదయంలో చోటు సంపాదించుకుంది. నాకే నమ్మకం కల్గడంలేదు. మాధవ్..పదిహేనేళ్ళు అనాథాశ్రమంలో పడిన నరకం, ఆ తరువాత నా కాళ్ళమీద నేను నిలవడానికి పడిన యాతన, ఆ కష్టాలన్నీ ఏవో గతజన్మలో జరిగినవిగా అన్పిస్తూంది యిప్పుడు..”
“ష్..రాధా..మనం ఇప్పుడు మాట్లాడుకోవల్సినవి అవా? ఆ కష్టాలకథ మర్చిపో.”
“కాదు మాధవ్ నన్ను చెప్పనీ.. ఏ కులమో గోత్రమో తెలియకుండా పెరిగిన నేను యింత గొప్పింటి కోడల్ని అవగలనని, నా కోసం యింత అదృష్టం దాచి వుంచాడు దేముడని ఎన్నడూ అనుకోలేదు.”
“రాధా.. కులం, గోత్రం యివన్నీ నాకక్కరలేదు. ఈ అందం, నీ సంస్కారం చాలు నాకు. నిజంగా ఏ గొప్పింటి బిడ్డో నిన్ను కని శరణాలయంపాలు చేసింది, లేకపోతే యింత అందం నీకెక్కడినించి వచ్చేది? యింత సంస్కారం నీకెలా అబ్బేది?”
“కాబోలు.. నా అందమే నాకు శత్రువైంది మాధవ్ యిన్నాళ్ళూ.. శరణాలయంలో పెరిగినన్ని రోజులూ గుమాస్తా దగ్గిరనుంచి వంటవాడి వరకు ప్రతివాడి చూపులనించి, వాళ్ళు విసిరే ఉచ్చులనించి తప్పించుకోవడానికి ఎంత బాధపడ్డానో నీకు తెలియదు మాధవ్. నా అందం చూసి పెళ్ళి చేసుకుంటాం అని ఎందరో వచ్చారు. “
“మరి ఎందుకు చేసుకోలేడు..అనాధగా వున్న నీకు పెళ్ళి అనే వరం దొరికి స్వేఛ్ఛగా దొరుకుతుంటే ఎందుకు చేసుకోలేదు” కుతూహలంగా అడిగాడు.
“ఈ మాధవ్ లాంటి పుణ్యపురుషుడు నాకు రాసిపెట్టి వుండగా ఎవరో చదువు సంస్కారంలేని వాళ్లని ఎందుకు చేసుకుంటాను? శరణాలయం అధికారులు ఆ వచ్చిన సంబంధాలలో ఒకటి కుదిర్చి పెళ్ళిచేసి పంపి తమ బాధ్యత తీర్చుకోవాలనుకున్నారు. కాని నేను వప్పుకోలేదు.”
“అలా నీవనడానికి హక్కు వుందా?”
“శరణాలయం ప్రతి అనాధకి ఉచితంగా మెట్రిక్ వరకు చెప్పిస్తారు. ఆ తరువాత పెళ్ళి చేసుకోవడానికి ఎవరన్నా ముందుకువస్తే పెళ్ళిచేసి పంపిస్తారు. ఉద్యోగం చేసుకుంటామంటే ఏదో ఉద్యోగం చూపించి బాధ్యత తీర్చుకుంటారు. నాకు పెళ్ళివద్దు ఉద్యోగం చేసుకుంటానన్నాను. ఓ ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం చూపారు.”
“నిజంగా రాధా.. మెట్రిక్ చదివి నీ కాళ్లమీద నీవు నిలబడి ప్రైవేటుగా చదివి ఎమ్మే పాసయి కాలేజీలో లెక్చరర్ గా చేరావంటే నీ పట్టుదల, కృషి మెచ్చుకోవాల్సిందే.” మెచ్చుకోలుగా అన్నాడు మాధవ్.
“అంత సుళువుగా అనేశావుగాని, గత ఏడేళ్ళుగా ఎంత బాధపడి, ఎన్ని కష్టాలుపడి, ఎంత త్యాగం చేసి ఈ స్థాయికి చేరానో నీకర్ధంకాదు. స్కూల్లో పనిచేస్తూ, ప్రైవేట్లు చెప్పుకొంటూ, రాత్రిళ్ళు కూర్చుని ప్రైవేటుగా చదువుకుంటూ, డబ్బు చాలక ఒంటిపూట తిని, చుట్టూ సీతాకోకచిలకల్లా అలంకరించుకునే ఆడపిల్లలమధ్య రెండు చీరలతో గడుపు తూ చదువే ఒక తపస్సుగా చేసి ఎమ్మే అయిన రోజున లోకంలో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినంత ఆనందం కల్గింది.”
“నిజంగా రాధా.. మొదటి రోజు కామన్ రూమ్ లో ఎవరితో మాట్లాడకుండా మూల కూర్చున్న నిన్ను చూసిన మొదటిక్షణంలోనే నీలో ఏదో విలక్షణత ఉందని గుర్తించాను సుమా..” రాధ ముంగురులు సవరిస్తూ అనురాగణ్తో అన్నాడు మాధవ్.
“ఏమిటో ఆ విలక్షణత?” చిలిపిగా అంది రాధ.
“ఏమో! ఫలానా అని అనుకోలేకపోయాను. అందరిలాంటిది కాదు అని… నీవు కట్టుకున్న అతి మామూలు వాయిలుచీర, నుదుట ఎర్రని పెద్దబొట్టు, చేతికి మట్టిగాజులన్నా లేకుండా, మెడలో నకిలీ హారమన్నా లేకుండా, నీ లేమితనం దాచుకోడానికి ప్రయత్నించని నీ ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది. కాలేజీలో లెక్చరరుగా చేరిన ఆమె నిరాడంబరంగా వుందంటే…లేమితనమా, ఫ్యాషనా అన్పించింది.”
“కాలేజీలో చేరగానే ఒక నెలజీతం అన్నా తీసుకోకముందు, చీరలు, నగలు ఎక్కడనించి వస్తాయి?”
“అలా అని నాకేం తెలుసు..ఈ కాలం ఆడపిల్ల అంత సింపుల్ గా వుండడం ఆశ్చర్యంతోపాటు కుతూహలం కల్గించింది. నీ అందం అంతా నీ కళ్ళు, నీలో వున్న సెక్సీనెస్ అంతా నీ పెదాలవంపు అని చూసినక్షణంలో గుర్తించాను సుమా.. ఆ క్షణంలోనే మనసు పారేసుకున్నాను.”
“ఆ పారేసింది నేను వెతికి జాగ్రత్త పర్చుకున్నానుగా..” రాధ నవ్వింది అతని మెడచుట్టూ చేతులు బిగించి “మాధవ్.. నాకు దొరికిన ఈ హృదయం నా నుంచి ఎప్పుడూ తీసికెళ్ళిపోకు..ప్రామిస్..” ఆర్తిగా అంటూ అతని మెడవంపులో మొహం దాచుకుంది.
“యూ సిల్లీ…కావాలని కోరి చేసుకుంది నీకు దూరం కావడానికా?”
“ఏమో.. ఈ పెళ్ళి మీ వాళ్ళెవరికీ యిష్టంలేదు. అందరినీ కాదని ఎదిరించి చేసుకున్నావు. నాకెందుకో భయం.”
“రాధా.. మా తల్లిదండ్రులే కాదు, యింకో తల్లిదండ్రులు మాత్రం జాతి, మతం, కులం తెలియని అనాధ అమ్మాయిని పెళ్ళాడడానికి వప్పుకుంటారా? మనం వాళ్ళ వీక్నెస్ అర్ధం చేసుకోవదానికి ప్రయత్నించాలి. అందులో మా వాళ్ళు ఛాందసులు. ..వంశం, పరువు, ప్రతిష్ట వదులుకోవాలంటే వాళ్ళకీ బాధేగా..”
“అదే నా బాధ… ఈ పెళ్ళితో వాళ్ళు అన్నింటితోపాటు నీకు దూరమయ్యారనే.. నా ఆవేదన. నా అన్నవాళ్ళు లేకుండా పెరిగిన నేను అత్తలో అమ్మని, మామగారిలో తండ్రిని, నీ అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళని తోబుట్టువులుగా చూసుకోవాలని మురిసాను. “
“ఆ..ఆ..కబుర్లు చాలించు, ఎవరూ లేరని పెద్దకబుర్లు. నిజంగావుంటే మీ ఆడవాళ్ళు మూతులు తిప్పుతారు. ఇంతకీ ఈ రాత్రంతా ముచ్చట్లతోనే గడుపుదామా..” మీదకి లాక్కున్నాడు.
ఏమిటంత గాభరా? ఆర్నెల్లు ఆగినవారు అరగంట ఆగలేరా” రాధ కోపం నటించింది.
“అరక్షణం కూడా ఆగను..” అంటూ రాధపెదాలు అందుకున్నాడు.
“అక్కయ్యోయ్..ఓ అక్కయ్యా.. ఏడుగంటలయిపోయింది లేవరేమిటి?”
తలుపులు బాదుతూ అరిచింది శారద. ఏ తెల్లవారుజాము మూడుగంటలకో నాలుగ్గంటలకో మాధవ్, రాధ నిద్రలోకి జారి, ఆదమరిచి నిద్రపోతుండగా శారద కేకలకి మెలకువ వచ్చింది. అ రోజు ఆదివారం. కాలేజీ లేదు. కొత్త దంపతులని నిద్రపోనీకుండా తలుపులు బాదిన శారదమీద విసుగు, కోపం వచ్చాయి యిద్దరికీ.
“ఊహు..తలుపు తీయకు” అంటూ మళ్ళీ రాధని దగ్గిరకి లాక్కున్నాడు మత్తుగా.
“ఓ అక్కయ్యా..” అంటూ మళ్ళీ బాదింది.
మాధవ్ కోపంగా “ఈవిడగారెందుకు ఉదయమే అలా తలుపులు బాదుతుంది” అంటూ విసుక్కున్నాడు. రాధ తప్పక లేచి చీర సవరించుకుని, జుత్తు వేళ్ళతో సవరించుకుని తలుపు తీసింది.
“ఏమిటక్కయ్యా… యింత పొద్దెక్కినా ఆడవాళ్ళు పడుకుంటే యింటికి దరిద్రంట తెలుసా? చూడు, నేనప్పుడే స్నానం చేసేశాను. ఏరి బావగారు యింకా పడుకున్నారా!” అంటూ లోపల చొరపడ్తున్న ఆ అమ్మాయిని చూస్తూ విస్తుపోయింది రాధ. నలిగిన పక్క, అడ్డదిడ్దంగా పడుకున్న మాధవ్..చప్పున ఆమెకంటే ముందు బెడ్రూమ్ దగ్గిరికి వెళ్ళి తలుపులు చేరేసి “ మీ బావగారు యింకా నిద్రపోతున్నారు. విసుక్కుంటారు లేపితే..” అంటూ వంటింటివైపు వెళ్ళింది రాధ.
“కాఫీ నే చేసేస్తా అక్కయ్యా! నీవు మొహం కడుక్కురా..” అంది చనువుగా శారద.
ఆ అమ్మాయి చనువు, కలుపుకోరుతనం యింకో అప్పుడైతే రాధకి బాగుండేదేమో కాని, కొత్తగా పెళ్ళి చేసుకుని, మొదటిరోజున తన యింట్లో ఇంకో అమ్మాయి కాఫీ చెయ్యడం ఏమిటి అన్పించింది. ఉదయమే వచ్చిందేమిటి యిలా… అన్పించి మనసులో విసుక్కుంది. ఏమనలేక, ఏమనాలో తెలియక రాధ గాభరా పడింది.
“కాఫీ అది నేను చేసుకుంటాగాని, నేను బాత్రూమ్ అది వెళ్ళాలి..” అలా అంటే వెళ్ళిపోతుందేమోనని చూసింది. అదేం గుర్తించకుండానే “నీ కెందుకక్కయ్యా, నీవు బాత్రూమ్లోకి వెళ్ళొచ్చేలోగా నే చేసేస్తాగా” అంది.
నిస్సహాయంగా చూస్తూ రాధ బాత్రూమ్లోకి వెళ్ళింది.
ఆ అమ్మాయిని చూడగానే మొదటిసారే ఆమెకి శరీరం పెరిగినంతగా మెదడు పెరగలేదన్నది గుర్తించింది. పాతికేళ్ళు పైబడిన ముదురుమొహం, వయసుకి మించిన శరీరం, జుత్తులో నెర్సిన వెంట్రుకలు, వేషం మాత్రం రెండుపిలక జడలు, పరికిణి వల్లెవాటు, పదహారేళ్ళ ముస్తాబు…ముద్దులు గునుస్తూ మాట్లాడ్దం…ప్రతిదానికి అవసరం లేకపోయినా వెకిలి నవ్వు…ఎప్పుడు ఏది మాట్లాడాలో, నలుగురిలో ఎలా ప్రవర్తించాలో తెలియదని, ముందురోజే గ్రహించింది రాధ. ఈ వెకిలిపిల్లకి తెలియకపోతే తల్లి చెప్పకూడదూ. అలా ఇంకోరి యింట్లోకి, అందులో కొత్తగా పెళ్ళయిన దంపతుల మధ్యకి వెళ్ళకూడదని అనుకుంది రాధ. పార్వతమ్మ గురించి ముందుగానే కొంత చెప్పాడు మాధవ్. ఆవిడ భర్త నాలుగేళ్ళు కాపురం చేసి ఈవిడకి చెప్పాపెట్టకుండా తన ఆఫీసులో పనిచేసే తోటి గుమాస్తా అమ్మాయిని తీసుకొని ఏ వూరో పోయి దేశాలు పట్టి మరి రాలేదని అంతా అనుకుంటారు. ఎడ్డిమడ్డిగా అమాయ కంగా వుండే భార్యని, రెండేళ్ళ కూతురిని వదిలిపోయిన ఆ మహానుభావుడు పోతూ పోతూ తండ్రి కట్టించిన యిల్లు, ఓ ఐదువేల రూపాయలు వదిలిపోయాడట. పార్వతమ్మ కొన్నాళ్ళు నెత్తీనోరూ మొత్తుకుని చేసేదేంలేక పిల్లని పెట్టుకుని రెండు గదులలో తానుండి, మిగతా పెద్దభాగం అద్దెకిచ్చి ఆ అద్దె డబ్బులతో గుట్టుగా సంసారం లాక్కొ స్తూందిట. ఈ కూతురు భారీ శరీరం, వెకిలి ప్రవర్తన చూసి ఎవడూ పెళ్ళాడడానికి ముందుకు రాకపోవడంతో కూతు రు పెళ్ళి బెంగతో ఆవిడ సతమతమవుతూంది. ఒకత్తే పిల్ల, భర్త లేకపోవడంతో ఆ పిల్ల ఆడిందాట పాడింది పాటగా పెరిగింది. సెకండ్ఫారం ఫేలయి యింక చదవనని యింట్లో కూర్చుని యిక్కడా అక్కడా తెచ్చిన పుస్తకాలు చదువు కుంటూ, వచ్చిన సినిమా అల్లా చూస్తూ, చిరుతిళ్ళు తింటూ శరీరం పెంచుకుంటూ హాయిగా తిరుగుతూంది.
మాధవ్ రాధని పెళ్ళాడడానికి నిర్ణయించుకుని, తండ్రితో ఘర్షణ పడ్దాక వేరే యిల్లుకోసం వెతికి ఈ యిల్లు అద్దెకి తీసుకున్నాడు. తామిద్దరికి కాలేజీకి దగ్గిర. తామిద్దరూ యింట్లో వుండరు కనక యింటి సాయానికి, పాలు అవి పోయించుకోడానికి, ఏ సలహాకన్నా పెద్దావిడ పార్వతమ్మ అండగా వుంటూందని వెంటనే అంగీఅరించి, పెళ్ళికి ముందే ముఖ్యంగా కావాల్సిన సామానంతా కొని వుంచాడు. అతనూ శారదని చూసి ఏమిటీ అమ్మాయి యిలా వుంది అనుకున్నాడు గాని అప్పుడంతగా పట్టించుకోలేదు.
పెళ్ళిరోజు తల్లీకూతుళ్ళ అభిమానం చూసి మంచివాళ్ళు, చాలా సహాయంగా వున్నారని మురిసింది రాధ, “చూసావామ్మా రాధా! మా శారద సంబరం, ఇన్నాళ్ళకి దానికి తోడు దొరికావని పిచ్చిది ఎలా సంబరపడిపోతూందో చూడు. ఇన్నాళ్ళు ఎవరో ముసలివాళ్ళు, లేకపోతే చిన్నపిల్లలున్నవాళ్ళు తప్ప, దాని ఈడు వాళ్ళెవరూ లేరు. అందుకే దానికింత సంతోషం..” అంది పార్వతమ్మ. రాధా శారద తోడుగా వుంటూందని సంతోషించింది. కాని ఒక్కరోజులోనే శారద సంగతి గుర్తించి ఈ అమ్మాయిని ఈ వాగుడిని రోజూ భరించాలా అనుకుంది.
“అక్కయ్యా.. కాఫీ చేసేశాను, బావగారి కిచ్చేయనా..” రాధ బాత్రూమ్లోంచి రాగానే యెదురువచ్చింది శారద.
రాధ చటుక్కున కప్పులు అందుకుని “నేనిస్తాలే, నీవింక యింటికి వెళ్ళమ్మా. నీకూ పని వుండద్ఫూ. మీ బావగారు మొహమాటపడ్తారు నీవుంటే..” తను చెప్పకపోతే తెల్సుకోలేదని చెప్పింది.
“ఫో- అక్కయ్యా.. యిటికెళ్ళేం చేస్తాను? నీకు పని సాయం చేస్తా. కూరలు తరగనా, ఏం టిఫిను చేస్తావు. అవును బావగారూ నీవూ నేనూ టిఫిను తిన్నాక పేకాడుదామా. ఆదివారంగా యివాళ..”
ఆ పిల్లని యింకేం చెయ్యలో తెలియక నిస్పృహగా మాధవ్ కి కాఫీ అందించింది. కాఫీ కప్పుతో వెళ్ళి అతన్ని లేపాలని, అతడు కళ్ళు విప్పకుండానే తనని ఒడిలోకి లాక్కుంటాడు, ఇద్దరూ ఒకే కప్పులో తాగేవారు…ఆమె ఊహలు, ఆశలు చెదిరిపోయాయి.
ఆ రోజే కాదు, తర్వాత చాలాసార్లు- చాలా రోజులు, చాలా నెలలు…ఎన్నో యిబ్బందులు కలిగాయి శారదవల్ల.
ఒక్కక్షణం ఇద్దరూ ఏకాంతంగా కూర్చుంటే, “అక్కయ్యా” అంటూ వచ్చేసేది. శలవరోజువస్తే మధ్యాహ్నం హాయిగా పడుకుంటే పేకముక్కలు తీసుకువచ్చి లేపేసేది. వంటింట్లో వుంటే నేను పచ్చడి రుబ్బుతా. కూర వేపుతా—అంటూ వెనకపడేది. హాయిగా మాధవ్ తను కబుర్లు చెప్పుకుంటూ ఈ పని ఆ పని చేసుకోవాలంటే తోకలా వెంటపడే శారదని చూసి ఏంచెయ్యాలో తెలిసేదికాదు యిద్దరికి. శారద రాగానే మాధవ్ మొహం చిట్లించి పడక గదిలోకి వెళ్ళిపోయేవాడు. “అబ్బ, ఆ అమ్మాయిని అస్తమానం యింట్లోకి రానిస్తావెందుకు?” అంటూ రాధమీద విసుక్కునేవాడు. “అబ్బబ్బ బాలాకుమారిని అనుకుంటుందేమిటి? ఆ పరికిణి ఏమిటి, ఆ రెండుజడలేమిటి?” చీదరించుకునేవాడు.
“అదేమిటి మీ చెల్లాయి నన్ను కొరుక్కుతినేటట్టు చూస్తుందేమిటి? ఆ చూపులేమిటి బాబూ” అనేవాడు ఒక్కొక్కసారి హాస్యంగా.
“పాపం పాతికేళ్ళున్నా పెళ్ళిలేదేమో, ఆ అమ్మాయికీ కోరికలుంటాయిగదా, తెలివి తక్కువది కనుక అంతా మొహంలోనే కన్పిస్తూంది..” రాధ సానుభూతిగా అనేది.
ఎంత పని సహాయం అన్నా చేస్తుంది. రోజూ మర్చిపోకుండా సాయంత్రం పూలదండలు గుచ్చిస్తుంది. అక్కయ్యా అంటూ అభిమానంగా వెనక తిరిగే శారదని చూస్తే ఒకోసారి పాపం పిచ్చిపిల్ల అనుకునేది. మరీ ఒక్కక్షణం వదలకుండా, మాధవ్తో దొరికే ఏకాంత ఘడియలలో ఇద్దరిమధ్య వచ్చే శారదపట్ల కోపం, విసుగు వచ్చేది. సున్నితంగా, చూచాయగా చెప్పినా అర్ధం చేసుకొనేదికాదు. “చూడమ్మా, అలా మేం పడుకుంటే లేపకూడదు. మీ బావగారికి కోపం వస్తుంది. శారదా! బావగారున్నప్పుడు అలా బెడ్రూమ్లోకి వెళ్ళకూడదమ్మా. చూడు కాలేజీనుంచి యింటికి రాగానే చిరాగ్గా వుంటుంది. ఆ టైములో రాకు. మాకు దొరికేది ఆదివారం ఒక్కటే. మధ్యాహ్నంపూట వచ్చి నీవు మాట్లాడితే ఆయన విసుక్కుంటారు. “ఈ కాస్త పనికి నీ సాయం ఎందుకు” అంటూ ఎన్నోవిధాల చెప్పినా ఆ పిల్ల తలకెక్కేది కాదు.అటు మాధవ్ విసుక్కోవడం, యిటు శారద తెలివితక్కువతనం మధ్య రాధ యిబ్బంది పడేది. ఆఖరికి యిద్దరూ సినిమాకి వెడుతున్నా “అక్కయ్యా, నేనూ వస్తానక్కయ్యా” అంటూ వెంటబడేది. మొదట ఒకటి రెండుసార్లు పార్వతమ్మ ఏం అనుకుంటుందోనని కాదనలేక మొహమాటపడి యిష్టం లేకపోయినా తీసికెళ్ళారు. పెద్దావిడ ఆవిడన్నా కూతుర్ని వాళ్ళిద్దరి మధ్య నీవెందుకే అని మందలించనందుకు యిద్దరికి కోపం వచ్చింది. “పిచ్చిది, సినిమాలంటే ప్రాణం, నేనా సినిమాలు చూడను. ఒక్కతే వెళ్ళాలంటే దానికి తోచదంటుంది. ఏదో మీరు వెళ్ళినప్పుడు కాస్త దాన్ని తీసుకెళ్ళండి నాయనా” అంది పైగా. సినిమాకు వెడుతున్నట్లు తెలిస్తే వెంటపడుతుందని ఏ స్నేహితురాలి యింటికో, బజారుకో అని చెప్పి వెళ్ళారు కొన్నిసార్లు. “నన్ను తీసికెళ్ళకుండా వెళ్ళిపోయేరే అమ్మా” అంటూ ఒకసారి ఏడ్చినంత పనిచేసింది. “ఎక్కడికెళ్ళినా యిద్దరూ స్కూటర్మీద వెళ్ళకుండా యీవిడెందుకు మనకి” అని విసుక్కునేవాడు మాధవ్. “పాపం, ఒక్కర్తీ వెళ్ళాలట పోనీ రానీండి, ఆటోలో వెడదాం” అని రాధ రెండుసార్లు తీసికెళ్ళింది.
“ఇదిగో ఆ బాలాకుమారి వస్తే నేను రాను. నీవూ ఆవిడా వెళ్ళండి” అనేవాడు మాధవ్ ఆఖరికి. అప్పటినుంచి దొంగతనంగా వెళ్ళడం ఆరంభించారు యిద్దరూ. తలుపులు తీసివుంటే లోపల జొరబడుతుందని తలుపులు మూసుకుని నిద్రపోతున్నట్టు చడీచప్పుడు లేకుండా పనులు చేసుకునేవారు. ఒకసారి నిద్రపోతుండగా పిలిస్తే రాధ విసుక్కుందని ఏడుపుమొహంతో తల్లికి చెప్పింది.
“అయ్యో, పిచ్చిమొద్దమ్మా అది! మనిషి కనపడితే ప్రాణం పెడుతుంది. ఏదో ఈడుదానివని నీచుట్టూ తిరుగుతూంది, దాని రాత సరిగా ఏడిస్తే ఈపాటికి పెళ్ళిఅయి పిల్లలతో కాపురం చేసుకునేది. యిలా తోచక వీళ్ళవెంట వాళ్ళవెంట ఎందుకు పడుతుంది” అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది. రాధ ఏదో తప్పు చేసినట్లు తల దించుకుంది. అప్పటినించి ఏమన్నా అనాలన్నా భయం. మాధవ్ విసుక్కున్నప్పుడల్లా యిదెక్కడి బాధ అత్త, ఆడబిడ్దలపోరు లేదనుకుంటే ఈ బెడద ఏమిటనిపింఛేది.
“అబ్బబ్బ రాధా.. మీ చెల్లెలుగారి పోరు తప్పాలంటే యిల్లు ఖాళీ చెయ్యాల్సిందే..కాని కాలేజీకి దగ్గిరగా ఈమాత్రం యిల్లు మళ్ళీ దొరకదని ఆలోచిస్తున్నాను” అనేవాడు.
“అబ్బ, వుందురూ..ఏదో కాస్త విసిగించినా రేపు మనకి ఎంతో ఆసరాగా వుంటారు.” రాధ సిగ్గుపడుతూ అంది నవ్వి.
“మైగాడ్..ఏమిటి..అప్పుడే..నెలకే..” మాధవ్ గాభరాగా అన్నాడు.
“ఎందుకంత భయం?” చిలిపిగా నవ్వింది.
“నిజం చెప్పు రాధా!” గాభరాగా అడిగాడు.
“లేదులెండి..యివాళ కాకపోతే రేపు పిల్లలు పుట్టరా? పుడితే ఎంచక్కా అమ్మమ్మ, పిన్ని లేని లోటు తీరుస్తారు. నిశ్చింతగా వాళ్లమీద వదిలి కాలేజికి వెళ్ళచ్చు. పాపం ఏదో వెర్రివాగుడు వాగుతుంది తప్ప చాలా అభిమానం వుందండి.”
“అయితే ముందే ప్లాన్వేసి రెడీమేడ్పిన్నిని తయారుచేసి వుంచావన్నమాట. పిన్నమ్మ వుందికదా అని పిల్లని కంటాననకు అప్పుడే…”నాడా దొరికిందని ఘోడా” కొన్నట్టుంటుంది. యింకా మనం సెటిల్ అవలేదు. ఒక ఏడాది పిల్లలపర్వం వాయిదావేద్దాం. ఇన్నాళ్ళు యింట్లో వుండేవాడిని ఒక్కవస్తువు కొనుక్కోలేదు. నీవు యింకా పర్మనెంట్ అవలేదు. యీ ఏడాది ఒకరి జీతం యింటిఖర్చుకి, మరొకరి జీతం యింట్లో వస్తువులకి ఖర్చుపెట్టి అన్నీ సమకూర్చుకున్నాక తీరిగ్గా కందాం పిల్లల్ని. నయమే, జ్ఞాపకం చేసావు…యివాళే టాబ్లెట్స్ తెస్తా.”
“వద్దండి..” రాధ అయిష్టంగాఅంది.
“నెలరోజులకే నామీద యింటరెస్ట్ పోయిందన్నమాట. అప్పుడే పిల్లమీదకి మనసు పోతుందన్నమాట. యింతే మీ ఆడవాళ్ళు…యీ ప్రేమలు అన్ని క్షణికాల్..” హాస్యంగా నిష్టూర్యం ఆడాడు.
“వద్దు మాధవ్. అలా ఎప్పుడూ మాట్లాడకు. చూడు నా గుండెలు చీల్చిచూడు, నీ రూపే కనిపిస్తుంది.” రాధ ఆవేశంగా అంది.
“యూ సిల్లీ..ఏమిటంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు. హాస్యానికంటే” రాధని దగ్గిరకు లాక్కుని అన్నాడు. రాధ కళ్ళు ఎందుకో చమర్చాయి.
“మాధవ్! నేనంటూ వున్నన్నిరోజులు నీమీద ప్రేమ పోదు. దుమ్ములో పొర్లాడవలసిన పూవుకి నీ హృదయంలో చోటిచ్చావు. అందుకు కృతజ్ఞతైనా చూపనా మాధవ్! ఈ ప్రపంచంలో నీవు, నీ ప్రేమవుంటే నాకింకేం అక్కరలేదు” మైమరుపుగా అంది. మాధవ్ రాధని గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. ప్రేమించడంలో కంటే, ప్రేమించబడటంలో ఎంతో గర్వం, ఆనందం ఉంటుంది అనుకున్నాడు.
`

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *