May 9, 2024

Dead ppl dont speak-12

రచన: డా. శ్రీసత్య గౌతమి

ఈ లోపుల అనైటా సెల్ ఫోన్ మ్రోగింది. ఎవరా అని చూసేసరికి అది జేసన్ నుండి. అదే చెప్పింది మిగితా ఇద్దరికి. వెంటానే ఫోన్ ఎత్తి.. తాను ఎక్కడున్నదీ చెప్పింది, తనతో పాటు ఏరన్, అతని ఫ్రెండ్ కూడా వున్నారని చెప్పింది. జేసన్ కేసుకి సంబంధించిన వివరాలు మాట్లాడాలన్నాడు. అనైటా ఏదో చెప్పబోయేంతలో, ఏరన్ తనని ఫోన్ అడిగి తీసుకొని, జేసన్ తో మాట్లాడాడు. ఏదో ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా గంభీరంగా జేసన్ కి చెప్పాడు. “మేము కూడా కేసు గురించే మాట్లాడుకుంటున్నాము, మీకు వీలయితే ఇప్పుడే ఇక్కడే కలుద్దాము మీరు ఈ చుట్టు ప్రక్కలే ప్రస్థుతం ఎక్కడేనా వున్నట్లయితే మా రెస్టారెంట్ కి వచ్చేయండి” అని ఎక్కడికి రావాలో అడ్రస్ చెప్పాడు.
జేసన్ తల పంకించుకొని, చేతి వాచీలో టైం చూసుకున్నాడు, అప్పుడు కొన్ని క్షణాలు ఆలోచించి “సరే నేను అక్కడికే వస్తున్నాను” అని చెప్పాడు. ఇంతలో ఏరన్ తనకి కూడా ఆర్డర్ చెప్పేస్తున్నామని జేసన్ కి చెప్పాడు. ఎలాగూ చేసిన ఆర్డర్ టేబుల్ మీదకి చేరేసరికి టైం పడుతుంది, జేసన్ రావడానికి ఎలాగూ ఇరవై నిముషాలు పడుతుంది. అప్పటికల్లా ఫుడ్డు వచ్చేస్తుంది. ఇరవై నిముషాల్లో వాళ్ళ దగ్గరకి వచ్చేశాడు జేసన్.
షేక్ హ్యాండ్లు, ఫెర్నాండేజ్ తో క్రొత్త పరిచయాలు అయిపోయాయి. ఈ లోపుల ఆర్డర్ చేసిన ఫుడ్డు కూడా టేబుల్ పైకి వచ్చేసింది. నలుగురూ తింటూ మెల్లగా అసలు కధలోకి వచ్చారు. మొదట అనైటా అడిగింది “జేసన్, కేసు వివరాలు ఐఅవో చెప్తానన్నారు?”.
జేసన్: యస్. మొన్న ఫైల్ లో దొరికిన అడ్రస్ ని ఆధారం గా తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి తాళం వేసేసి వుంది. ఆ ఇల్లు చూడ్డానికి చాలా పాతది. ఎవరూ లేకపోవడం తో ప్రక్కనున్న ఇంటి వాళ్ళని అడిగాను, అందులో ఎవరుంటున్నారని, ఎక్కడికి వెళ్ళారని?
వాళ్ళు వెంటనే ఒక ముసలావిడ పోయిన సంవత్సరం వరకూ వుండేదని, అయితే వాళ్ళకు పెద్దగా వివరాలు తెలియవని, వాళ్ళు వచ్చి కేవలం సంవత్సరమే అయ్యిందని చెప్పారు. ఇప్పుడు చెప్పబోయేదేమిటంటే ఆ ముసలావిడ అక్కడినుండి వెళ్ళిపోయి సంవత్సర కాలమయ్యింది. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ఇంటికి రాలేదు. ఆ ప్రక్కవాళ్ళే ఆ ముసలామెకు తమ్ముడు వరస ఒకతను ఆ ఏరియాకు కొంచెం దగ్గిరలోనే వుంటాడని చెప్పారు.
జేసన్ అతన్ని వెళ్ళి కలిశాడుట. ఆవిడ తమ్ముడు ఆ ఇంటి తాళాలు తన వద్ద వున్నాయని చెప్పాడు. జేసన్ ఆ ముసలావిడ గురించి అడిగాడు. ఆమె తనకు కజిన్ అవుతుందని చెప్పాడు. జేసన్ తానెందుకు వచ్చిందీ టూకీగా చెప్పినప్పుడు, ఆ వ్యక్తి వివరాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆమెకొక కూతురు, అల్లుడు వాళ్ళకొక ఆబ్బాయి వుండేవారనీ, కారేక్సిడెంట్ లో కూతురు, అల్లుడు చనిపోతే ఆ పిల్లాడిని తానే సాకడం మొదలెట్టిందనీ, కానీ ఆ పిల్లాడు ఒక ప్రమాదం లో చిక్కుకొని తన ప్రాణాలు కోల్పోయాడని, అది జరిగిపోయి పాతికేళ్ళపైగా అయిపోయిందదని చెప్పాడు. మరి ఇప్పుడామె బాగా ముసలయిపోవడం వల్ల తనని తాను చూసుకోలేక చూసే వాళ్ళు ఎవరూ లేక వృద్దాశ్రమనికి వెళ్ళిపోయిందనీ, ఈ ఇల్లు అద్దెకిస్తూ ఆ అద్దె డబ్బులు తన ఆశ్రమానికి ప్రతి నెలా పంపమని తనకు చెప్పిందనీ, తానలాగే చేస్తున్నాడని.. ఒక నెల క్రితమే అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేస్తే ఇల్లంతా శుబ్రం చేయించి క్రొత్తవారి గురించి చూస్తున్నానని చెప్పాడు. జేసన్ అతన్ని పట్టుకొని ఆమె ని కలవడానికి వృద్దాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి బెడ్ మీద వుంది. ఆశ్రమం వాళ్ళు సదుపాయాలు బాగానే చేస్తున్నారు, వైద్య సహాయం కూదా అందిస్తున్నారు. మాట్లడానికి ఓపిక తక్కువే వున్నా అడిగినది అర్ధం చేసుకొని చెప్పగలిగే పరిస్థితిలోనే వున్నది. ఆమెను చూడగానే ఒక ప్రక్క సంతోషము ఆమె దొరికినందుకు, మరో ప్రక్క ఆమె దైర్యానికి గర్వమూ కలిగింది. తనకు తాను చేసికోలేని పరిస్థితి లో తనని తాను మార్చుకొన్నది నా అనేదాని మీద వ్యామోహాన్ని తగ్గించేసుకొని క్రొత్త వాతావరణానికి అలవాటుపడడానికి నిశ్చయించుకోవడమనేది ఒక సాహసమే. ఆవిడ ఆత్మ స్థైర్యానికి ముచ్చటేసింది జేసన్ కి.
“తాను వచ్చిన పనిని టూకీగా చెప్పాడు. తాను కొంచెం మగతగా వుండడం వల్ల రేపు మాట్లాడతానని చెప్పింది. కాబట్టి నాతోపాటుగా మీలో ఎవరైనా నాతో రావొచ్చు” అన్నాడు జేసన్. ఏరన్ తదితరులకి ఎగిరి గంతెయ్యాలనిపించింది. అనైటాకి మాత్రం ఆ కలవరం తగ్గలేదు, ఇంకా ఎక్కువయ్యింది గాని. ఏరన్ కి ఎందుకో అనైటా కొద్దిరోజులు డా. హౌసర్ పర్యవేక్షణలో అనైటా వుండడం మంచిదేమో అని అనుకున్నాడు. ఈలోపుల జేసన్..”సరే, మీరెందుకో రమ్మని పిలిచారు నన్ను. ఏదైనా క్లూ లు మీకూ దొరికాయా?” అన్నాడు. ఏరన్ తడబడకుండా తను చేసిన పరిశోధనలు, కేస్ వివరాలకి లింక్ చేస్తూ ఆఖర్న అనైటా విషయం కూడా చెప్పాడు. కానీ ఎందుకో జేసన్ తాను చెప్పిన వాటిలో కొన్నిటిని కొట్టి పారేస్తాడేమో అనుకున్నాడు ఏరన్. కానీ అలా జరుగ లేదు. జేసన్ చాలా శ్రద్దగా విన్నాడు. అనైటా వైపు తిరిగి, అనునయం గా ఈ కేసు వివరాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి, హంతకులను పట్టుకోవడం ఖాయమని, న్యాయాన్ని గెలిపించడమే తమ ధ్యేయమని మాటిచ్చినట్లు గా మాట్లాడాడు. ఏరన్ కి జేసన్ సంభాషించిన తీరు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తర్వాత ఏరన్, ఫెర్నాండేజ్ ల వైపు తిరిగి “నేనిక వెళ్తాను. రేపు పదకొండు గంటలకు వృద్దాశ్రమానికి వెళ్తున్నాను, మీలో ఏ ఒక్కరు వచ్చినా పర్వాలేదు” అని అన్నాడు.
ఏరన్: ఇప్పుడు డా. హౌసర్ ని కలవడానికి వెళ్దామనుకుంటున్నాము, మీరు కూడా మాతో వస్తే మీకన్ని వివరాలు మేము చెప్పకనే మీకర్ధమవుతాయి కదా?
జేసన్: స్టేషన్ లో మీరు చెప్పిన కధనంతా విన్నాకే నా కర్ధమయిపోయింది. పర్వాలేదు నేను మరో చోటకి వెళ్ళాలి ఇప్పుడు. డా. హౌసర్ దగ్గిరకి మీరెళ్ళి రండి, తర్వాత విజిట్ లో నేను జాయిన్ అవుతాను.
జేసన్ చెప్పేసి టక టక మెట్లు దిగి వెళ్ళిపోయాడు. జేసన్ మాటలు విని ఆశ్చర్యపోవడం ఏరన్ వంతయ్యింది. బయలుదేరేముందు డా. హౌసర్ కి ఫెర్నాండేజ్ ఫోన్ చేశాడు తాము రావడానికి సిద్ధం గా వున్నామని. డా. హౌసర్ సరే అన్నారు. ఓ అరగంట కారులో ప్రయాణం చేసుకుంటూ ఆయనున్న హాస్పిటల్ కి వెళ్ళారు. డా. హౌసర్ కి అనైటా పరిచయాలయ్యాయి. కాజువల్ గా ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఎన్నో జెనెరల్ విషయాలను చర్చించారు. అనైటాకెందుకో హాయిగా అనిపించింది. చాలా రిలేక్సింగ్ గా అనిపించింది. హౌసర్ అది గమనించారు, వెంటనే అలాగే తన దృష్టిని అనైటా పైన నిలిపి మిగితా వారిని విస్మరించి అనైటాతోనే మాట్లాడుతున్నారు అప్పటికి ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అదే టాపిక్కుని. ఈ మార్పు ఫెర్నాండేజ్ గుర్తించారు, తాను మాట్లాడడం తగ్గించుకున్నారు. ఇలా మెల్లగా ఒక నిశ్శబ్ద వాతావరణం లో కేవలం డా. హౌసర్ మాట్లాడుతున్నారు, అనైటా కేవలం వింటున్నది, ఇప్పుడు తాను మాట్లాడడం మానేసింది. తాను కూర్చున్న చోటు ప్రక్కనే పేషంట్ టేబుల్ వుంటే అక్కడకి ఆమెను వెళ్ళమని ఆదేశించారు. తానలాగే చేసింది. ఏరన్ కి ఇది చాలా క్రొత్తగా వున్నది. అనైటా కళ్ళు మూసుకొని నిద్రావస్థ లో వున్నది.
డాక్టర్: పెయింటర్..పెయింటర్… (పిలిచారు)
నిశ్శబ్దం..
డాక్టర్: పెయింటర్..పెయింటర్..
మళ్ళీ నిశ్శబ్దం…
డాక్టర్: మళ్ళీ పిలబోయేంతలో … “ఊ” అన్నది అనైటా.
డాక్టర్: వచ్చావా?
అనైటా: వున్నాను.
డాక్టర్: ఎప్పటినుండి?
అనైటా: నలభై ఏళ్ళనుండి. ఇక్కడే.
డాక్టర్: అనైటా ఎలా తెలుసు.
అనైటా: తాను నేను వున్నచోటుకి వచ్చిన దగ్గిరనుండి.
డాక్టర్: నీకేమి కావాలి? అనైటా ని ఎందుకాశ్రయించావ్?
అనైటా: సడన్ గా ఏడవడం మొదలు పెట్టింది. నా మమ్మీ కి బాగోలేదు.
డాక్టర్: ఆమె ఇప్పుడు బాగానే వుంది. తనని అందరూ బాగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఏమి చెప్పదలచుకుంటున్నావ్? నీకు న్యాయం కావాలా? ఎందుకు ఇన్నిరోజులపాటు చెప్పకుండా దాస్తున్నావ్?
మళ్ళీ నిశ్శబ్దం.
అనైటా: నేను మమ్మీ గురించి చెప్పాలని అనుకున్నాను.
డాక్టర్: మేము నువ్వు హంతకులకోసం చెప్తావని కూడా అనుకుంటున్నాము. ఎందుకు చెప్పటం లేదు?
అనైటా: వాళ్ళు మమ్మీ ని చంపేస్తారు.
డాక్టర్: మరి నీకు న్యాయం జరగాలని లేదా?
అనైటా: మమ్మీకి ఏమీ జరగకూడదు.
డాక్టర్: ఏమీ జరగదు. జేసన్ మమ్మీని చూసి వచ్చాడు, నువ్వు కలవరపడవలసినదేమీ లేదు. మాకన్ని వివరాలు చెప్పు. మీ మమ్మీకి ఏమీ కాకుండా చూసే భాధ్యత మాది.
డాక్టర్ : ఫెర్నాండేజ్ ని, ఏరన్ ని ప్రక్క రూం కి వెళ్ళిపొమ్మని సైగ చేశాడు. వాళ్ళు అలాగే సైలంట్ గా అక్కడినుండి వెళ్ళిపోయారు.
మళ్ళీ మౌనం ఆవరించింది అనైటాకి, డాక్టర్ కి మధ్య.
అయినా డాక్టర్ ఓర్పుగా పెయింటర్ కి భరోసా కలిగించాలని అనుకున్నారు.
ఇంతలో మళ్ళీ అనైటా మాట్లాడడం మొదలు పెట్టింది. తాను పదేళ్ళపిల్లవాడుగా వున్నప్పుడు తన స్నేహితులతో ఆడుకుంటుండగా స్కూల్ ఆవరణ నుండి కిడ్నాప్ చెయ్యబడ్డాడని చెప్పాడు.
డాక్టర్: వాళ్ళ వివరాలు, ఎవరు చేయించారో నువ్వు చెప్పగలిగితే నీకు న్యాయం జరుగుతుంది. నీలాంటి పిల్లలను రక్షించిన వాడివవుతావు. చెప్పు. మీ మమ్మీ ని సురక్షితం గా చూసుకునే బాధ్యత జేసన్ ఆల్ రెడీ తీసుకున్నాడు.
అనైటా: సరే. అని చెప్పబోయేంతలో.. అనైటా చాలా డిస్టర్బన్స్ కి గురయ్యి ఆ సబ్ కాన్షియస్ లెవెల్ నుండి కాన్షియస్ లోకి రావడానికి చాలా కష్టపడుతున్నది. ఈ ఆకస్మక మార్పుకి కార ణానికి వర్రీ అయ్యి.. అనైటాని సావధాన పరచడం లో నిమగ్నమయ్యారు. అనైటా సావధాన పడి, కొంచెం అలసటగా నిద్ర లోకి జారుకున్నది. తనని అలాగే నిద్ర పోనిచ్చి ఏరన్, ఫెర్నాండేజ్ ల వద్దకు డాక్టర్ వెళ్ళారు. జరిగినదంతా చెప్పారు. ఎందుకు అలా డిస్టర్బ్ అయ్యిందో తెలియదు అన్నారు.
ఏరన్: ఎలాంటి డిస్టర్బన్స్? ఆ టైం లో తానేమయినా పలికిందా?
డాక్టర్: ఏదో ఫోన్ ఫోన్ అని పలికినట్లున్నది.
ఏరన్: రియల్లీ.. నాకయితే ఇప్పుడే మా బాస్ దగిరనుండి ఫోన్ వచ్చింది. నేను ఎత్తే లోపుల కట్ అయిపోయింది. నేను ఫోన్ చెయ్యడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటే సిగ్నల్ దొరకలేదు.
డాక్టర్: ఈజ్ ఇట్? ఇంట్రస్టింగ్. మీ బాస్ ఫోన్ వస్తే అనైటా లోపల డిస్టర్బ్ అయ్యిందంటావా? ఎందుకు? లేదా ఏదో కో- ఇన్సిడెన్సా?
రకరకాల అనుమానాలు.
సరే. మీ బాస్ ఎందుకు ఫోన్ చేసివుంటారు?
ఏరన్: గత వారం నుండి నాకు సిగ్నల్ దొరకడం లేదు, నేను కూడా ఈ కేసు విషయమై ఎక్కడెక్కడో తిరిగుతున్నాను. సిగ్నల్స్ అన్ని చోట్లా లేనట్లున్నాయి, సర్విస్ మార్చాలి.
డాక్టర్: వెయిట్ ఎ సెక్, వెయిట్ ఎ సెక్. కాస్త బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి చూద్దాం ఈ విషయానికి. మీ బాస్ ఫోన్ వచ్చినప్పుడు పెయింటర్ కలవర పడ్డాడు. ఈ డైరక్షన్ లో కూడా ఆలోచించి చూద్దాం, యాజ్ యాన్ అబ్సెర్వేషన్ .. ఈ పాయింట్ కూడా అవసరమే.
******************
ఏరన్, అనైటా ప్రొద్దున్నే జేసన్ ని స్టేషన్ దగ్గిర కలిసారు. ముగ్గురూ వృద్దాశ్రమానికి బయలుదేరారు. జేసన్ అడిగాడు, “నిన్న డా. హౌసర్ తో మీటింగ్ ఎలా అయ్యింది?”. ఏరన్ “బాగానే అయ్యింది”..ముక్తసరిగా సమాధానమిచ్చాడు, మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అనైటా అందుకొంది “వాళ్ళ మమ్మీ గురించి వర్రీ అవుతున్నట్లుగా చెప్పానుట అంతే”.
“ఓ ఓకె”..క్యాజువల్ గా తీసుకున్నాడు జేసన్. అనైటా మొహం చాలా అలసటగా కనబడుతోంది. ఆశ్రమం వచ్చేసింది. ముగ్గురూ దిగారు. లోపలికెళ్ళేసరికి ఇంకేముంది? ఆవిడ ప్రాణాలొదిలారు అప్పటికే. వృద్దాశ్రమం నడిపే ఓనర్, డాక్టర్స్, నర్సెస్ అలాగే ఇతర సిబ్బందంతా అక్కడే వున్నారు. అప్పుడే చనిపోయిన ఆవిడ తమ్ముడు కూడా లోపలికి అడుగుపెట్టాడు. ఇక వీళ్ళకి ఏమి చెయ్యాలో ఒక్క క్షణం పాలుపోలేదు. ఒక ముఖ్య సాక్ష్యం పోయింది. ఈ లోపుల వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు. అనైటా ఆవిడని చూడాలి, లోపలికి వెళ్దామని అడిగింది. కానీ వీళ్ళకి అనైటాని తీసుకొని వెళ్ళడం మంచిది కాదేమో అనిపించింది, కానీ కుదిరేటట్లు లేదు. సరే అని ముగ్గురూ లోపలికి వెళ్ళారు. ఆవిడ మృతదేహాన్ని చూసింది అనైటా.. మామూలుగానే వున్నది. ఇక వెనక్కి తిరిగి వచ్చేస్తుండగా ఆ ఆశ్రమం తాలూకు సూపరింటెండెంట్, ఆవిడ తమ్ముడిని కూడా తోడు తీసుకొచ్చి.. జేసన్ ని కలిసింది.
“సార్, తాను తెల్లవారుఝామున ఎప్పుడో ప్రాణాలొదిలారు. కానీ రాత్రే నాతో మాట్లాడి, ఈ డైరీ, మరికొన్ని ఈ కాయితాలు మీకు ఇమ్మని చెప్పారు” అని జేసన్ కి ఇచ్చేసింది.
అది చూసి ముగ్గురికీ ఒక హోప్ వచ్చేసింది. జేసన్ వెంటనే ఆ కాగితాలు ఏమిటో తెరిచి చూశాడు. అది తన ఇంటి కాగితాలు, తన తమ్ముడికొక ఉత్తరం, ఒక వీలునామా. జేసన్ కి ఒక నోట్. ఆ నోట్ లో తన ఇంటిని ఈ వృద్దాశ్రమానికి వ్రాస్తున్నట్లు, తన తదనంతరం బ్యాంక్ లో తనదగ్గిర మిగిలిన డబ్బు తన తమ్మునికి దక్కవలెనని ఇవన్నీ దగ్గిరుండి సవ్యం గా జరిగేటట్లు చూడమని కోరుతూ తాను తన కొడుకు, కోడలు, మనవడు పెయింటర్ దగ్గిరకే వెళ్ళిపోతున్నట్లు, జేసన్ కి కావలసిన విషయాలన్నీ ఆ డైరీలో పొందుపరచబడివున్నాయని కూడా వ్రాసింది. ఆవిడ సమయస్పూర్థి కి, న్యాయ విచక్షణకి మళ్ళీ ఒకసారి ఆవిడని మనసులోనే అభినందించుకున్నాడు జేసన్.
*********
జేసన్.. ఆడైరీ తెరిచి చూశాడు, ఏదో కవర్ కూడా వుంది, దాంట్లో ఎవరో నలుగురి ఫొటోలు వున్నాయి. ఈ లోపుల ఆవిడ మృతదేహానికి సంబంధించి హడావిడి మొదలయ్యేసరికి ఫొటోస్ ను, డైరీ, కాయితాలు తన ఫైల్ లో పెట్టేసుకొని ఆ పనిలో నిమగ్నమయ్యాడు, మిగితా ఇద్దరిదీ అదే పరిస్థితి. మొత్తానికి ఒక రెండు గంటలసేపు అన్ని కార్యక్రమాలు అయ్యి, ముగ్గురూ ఇంటి దారి పట్టారు. ముగ్గురికీ హృదయభారం ఆవిడ వెళ్ళిపోయినందుకు. అనైటా కార్లో వుంటుండగనే డైరీ చదివింది తర్వాత ఏరన్ కి ఇచ్చింది. మళ్ళీ స్టేషన్ కొచ్చిపడ్డారు. ఇప్పుడు మెల్లగా ఆ డైరీ మీద జేసన్ దృష్టి పడింది. తాను కూడా చదివాడు. తేదీలు, టైం తో సహా చాలా వివరం గా వ్రాసివుంది.
మలేసియా కు ఆర్ధిక అవకాశాలను వెతుక్కుంటూ చిన్న చిన్న పనిపాట్లకు ఇండోనీషియా, నేపాల్, థాయ్ ల్యాండ్, చైనా, ఇండియా, ఫిలిప్పైన్స్, బర్మా, కాంబోడియా, బంగ్లాదేశ్ మొదలైన దేశాల నుండి స్త్రీ, పురుషులు అఖరికి పిల్లలు కూడా వస్తారు. అయితే ఇదంతా లీగల్ గా జరుగుతున్నా సంఘద్రోహులు తమ స్వలాభాలకోసం తప్పుదారి పట్టిస్తూనేవుంటారు. కొంతమంది వాళ్ళ యజమానుల దగ్గిర అప్పులుండడం వల్లనో, ప్రయివేటు ఎంప్లాయీ రిక్రూటర్స్ వల్లనో, యజమానుల ధనాశలకో బందీలయి నిర్భంధిత కార్మికులుగా మలేసియాకు తరలించబడుతుంటారు, అందులో పిల్లలు కూడా. వాటి మీద గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటూనేవుంటుంది. అయితే వేరే చోటనుండి మలేసియాకి తరలించబడినట్లు కొంతమంది స్వార్ధపరులు మలేసియా లోపలినుండి కూడా మనుష్యుల్ని నిర్భంధించి సింగపూర్, హాంగ్ కాంగ్, ఫ్రాన్స్ మొదలైన దేశాలకి అమ్మేస్తుంటారు. ఆ విధంగా తప్పిపోయిన పిల్లల జాబితాలోని ఒకడు పెయింటర్ ఆనాడు- నిర్భంధిత బాలకార్మికుడు. తనతోపాటు మరో తొమ్మిది పిల్లలు కూడా వున్నారు. వీళ్ళని పట్టడానికి ఒక నెలరోజులనుండి ప్రయత్నాలు జరిగి చివరికి ఒక రోజున వీళ్ళందిరినీ స్కూలు సిబ్బంది యొక్క కళ్ళు కప్పి, స్కూలు ఆవరణ నుండే ఇద్దరు మనుష్యులు వేన్ లో తీసుకుపోయినట్లు.. వూరి అవతల మరో ముగ్గురిని కలుసుకొని వీళ్ళందరూ పిల్లల్ని మరో వేన్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటుండగా.. మొదటి నుండి ఫాలో అయ్యి వూళ్ళోని ఇద్దరు యువకులు వీటి ఆధారాలని ఫొటోలద్వారా పొందుపరిచి తెలివిగా ఆ పిల్లల్ని వాళ్ళ భారినుండి రక్షించడానికి ప్రయత్నాలు చేసి దొరికిపోయి ఆ పిల్లలతో పాటు వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క వ్యక్తి మాత్రం చనిపోయే ముందు ఎలాగోలా తప్పించుకొని ఊళ్ళోకొచ్చి పెయింటర్ అమ్మమ్మ పేరు మీద ఆవిడ వెళ్ళే చర్చికి పోస్ట్ చేశాడు. ఆతర్వాత చనిపోయుంటాడు, ఏనాడూ అతను తనని కలవలేదు అని వ్రాసివుంది ఆ డైరీ లో. ఆ ఆధారాలే ఆ కవర్లో కూడా వున్నాయని వ్రాసింది.

ఆ తర్వాత ఆ కవర్లో వున్న ఫొటోలను చాన్నాళ్ళు ఎవరికీ చూపించకుండా సరి అయిన వ్యక్తికోసం ఎదురు చూస్తూ తన వద్దనే వుంచుకున్నది ఈ విషాదన్నంతా తనలోనే దిగమింగుకొని. ఎందుకంటే తనకు ఆధారాలను పంపిన వ్యక్తి..ఈ నేరస్థులందరూ సంఘం లో బాగా పేరు మోసిన వాళ్ళని, బయటికి పెద్ద మనుష్యుల్లా చెలామణీవుతున్న వాళ్ళనీ వాళ్ళ పేర్లతో సహా వివరాలిచ్చాడు. అందువల్ల తనకు నమ్మకమయిన వ్యక్తులకోసం ఎదురు చూస్తూ..ఈ విషయాన్ని అందరికీ బయటపెట్టకుండా ఎదురు చూస్తున్నదని స్పష్టం గా వ్రాసింది ఒక పేజీలో.

ఆ తర్వాతపేజీలో కొన్నాళ్ళకి తాను చార్లీ (తనకు కుటుంభస్నేహితుడు) ని కలిసినట్లు అతినికి కొన్ని వివరాలు చెప్పి ఈ ఆధారాలని కూడా ఒక కాపీ ఇచ్చినట్లు గా వ్రాసివుంది. చార్లీ అడ్రెస్ వ్రాసి వుంది.

మరో పేజీలో చార్లీ హత్య చేయబడి వుండవచ్చనీ తన నిర్లిప్తతని, ఆవేదన ని వ్యక్తపరిచివుంది.

వెంటనే జేసన్ తన ఫైల్ లోని మరో ఫోల్డర్ లో పెట్టిన ఫొటోస్ ని బయటికి తీశాడు. జేసన్ తో పాటు ఏరన్ మరియు అనైటా కూడా ఉత్సాహం గా ముందుకొచ్చారు ఆ ఫొటోస్ చూడడానికి. ఇంకేముంది?
ఏరన్ దిగ్భ్రాంతయ్యాడు. అందులో ఒక ఫొటో తనని ఈ కేసు వివరాలు పట్టుకొని రమ్మని పంపిన తన బాస్ “డీన్” ది.
ఆవిడ వ్రాసిన కధనం బట్టి ఆ చార్లీ ఆడ్రెస్స్ ఎక్కడిదా అని అప్పుడు ఆ పేజీ కోసం ఏరన్ గబ గబా వెతికాడు. నోటమాట రాలేదు, అది ఎవరిదో కాదు..అది తన పాత అఫీసు అడ్రెస్సు..అది తన పాత బాసు చార్లీది.
ఏరన్ కి వెంటనే మొత్తం డీన్ తోని జరిగిన సంభాషణ అంతా గుర్తు తెచ్చుకున్నాడు. చార్లీ తనకు చిరకాల పరిచయస్తుడనీ, ఈ కేసు గురించి ఇద్దరూ మాట్లాడుకొని తనని డిటెక్టివ్ గా పంపించాలని అనుకున్నారని డీన్ తనతో చెప్పాడు. అంటే తన బాస్ చార్లీ తనకి తెలియకుండా డీన్ ని కలిసి ఏదో వాగ్వివాధాలకు దిగాడన్నమాట. అయితే తాను ఒకమారు డీన్ వాళ్ళు చార్లీ దగ్గరకు రావడం తాను గమనించకపోలేదు.
అప్పుడే డీన్ “నన్ను చూసి వుంటాడు, తర్వాత నా వివరాలు తెలుసుకొనివుంటాడు. మరిఈ అనైటా వ్రాసిన నిశీధి పవనాలు డీన్ వరకూ ఎలా వచ్చింది?”… స్వగతం గా అనుకుంటూ.. వెంటనే… అనైటా వైపుకి తిరిగి అదే అడిగాడు,

అనైటా తాను పనిచేస్తున్న లోకల్ కమ్మ్యూనిటీ పేపర్ ఆఫీసుని క్రొత్తగా మరో ఎడిటోరియల్ బోర్డ్ కొన్నాదని..ఆ క్రొత్త ఎడిటోరియల్ కే రిపోర్ట్ పంపానని చెప్పింది. అది చార్లీ యే. ఏరన్ కి కూడా తెలియలేదు..ఏదో ఎప్పుడూ మన ఆఫీసుని ఎక్స్ పేండ్ చెయ్యాలని అంటుండేవాడు గానీ, ఈ విషయం మాత్రం ఆఫీసులో ఎవరికీ చెప్పలేదు. బహుశా అందరికీ ఒకేసారి చెప్పే లోపుల చనిపోయివుంటడు అని స్వగతం గా అనుకున్నాడు.

డీన్ తనని పంపిస్తూ.. అనైటా వివరాలు కనుక్కొని తనకి తెలియజెయ్యమని, ఆవిడ ఏమేమి విషయాలు సేకరించిందో తనకు తెలియజెయ్యమనీ, ఆ పెయింటర్ ఆత్మ నే నిజం గా చెప్తున్నదా లేక మరెవ్వరయినా మాట్లాడుతూ కన్ ఫ్యూజ్ చేస్తున్నారా అన్నవిషయాలు సేకరించి తెమ్మన్నాడే తప్ప..ఈ కేసుకి సంభందించిన వివరాలకోసం గానీ, న్యాయం కోసం గానీ తాను ఎక్కడా ఆలోచించినట్లు తనతో మాట్లాడినట్లు ధాఖలాలే లేవు. పైగా తననేమీ అడగొద్దనీ..తనకు తానే అన్నీ తెలుసుకొని తనకి కావలసిన వివరాలని అందిస్తూవుండాలని షరతు పెట్టాడు కూడా. ఇవన్నీ అనైటాకి, జేసన్ కి కూడా చెప్పేశాడు. ఇంకేమిటి? క్రైం స్టోరీ మొత్తం అర్ధమయిపోయింది.
*****
ఈ వివరాలన్నీ ఏరన్ అక్కడున్న పోలీసుకి తెలియజేసి..డీన్ ని కస్టడీలోకి తీసుకునేలా చేశాడు. జేసన్ సహాయం తో తమ వద్దనున్న ఆధారాలన్ని కోర్టు లో చూపించారు. డీన్ ఇక ఏమీ చెయ్యలేక నేరాన్ని వప్పుకున్నాడు, అంతే కాక చార్లీ అర్ధాంతర చావుకు డీన్ మరియు అతని అనుచరులే కారణమని కూడా తెలియ జేశాడు. చార్లీ పోలీసులకి లొంగిపొమ్మని, లేదంటే తన దగ్గరున్న వివరాలని పోలీసుకు అప్పజెప్తానని చెబుతుండడం వల్ల అటువంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చార్లీ ని తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. అనైటా వ్రాసిన నిశీధిపవనాలలో పెయింటర్ ఆత్మ మాట్లాడుతున్నదనీ, అది ముప్ఫయేళ్ళ క్రితం నాటి తాము చేసిన నేరం గురించి బయటపెడుతున్నదనీ, తన దగ్గిర తగిన సాక్ష్యాలు వున్నాయనీ చెబుతూ చార్లీ తనని ఇబ్బంది పెట్టాడనీ..ఆ విధం గానే అనైటా గురించి తనకు తెలిసిందనీ, ఆమె వ్రాసిన రిపోర్ట్ ని తాను చార్లీ నుండే పొందాడనీ, అదే ఏరన్ కి ఇచ్చి డోవర్ పంపాడనీ మొత్తం కోర్టు వారికి తెలియపరిచాడు. ఏరన్ తెచ్చిన సాక్ష్యాలకీ, డీన్ చెప్పిన విషయాలకీ పొంతన కుదరడం వల్లా..కోర్టు డీన్ ని అతని అనుచరులని కూడా కస్టడీ లోకి తీసుకుంది.

మొత్తానికి ఏరన్ కి తాను డిటెక్టివ్ కావాలనే కలని నిరూపించుకున్నాడు, తన బాస్ చార్లీని హత్యచేసిన ఆగంతుకులను పట్టిచ్చాడు, ఏనాడో ముఫయ్యేళ్ళక్రితమే భూస్థాపితమయిపోయిన ఒక క్రైం స్టోరీని కూడా బయటికి తీసి అక్కడి పోలీసులకి అప్పజెప్పాడు. ఇవన్నీ జరగడానికి కారణం అనైటా పంపిన రిపోర్ట్ “నిశీధిపవనాలు”. ఆగండాగండి… వాళ్ళిద్దరితో అయిపోయిందా ??????
.
ఇందులో ప్రధాన పాత్ర పెయింటర్ ఆత్మది. ఎవరు చెప్పారు dead people don’t speak అని ???????????
.
(సమాప్తం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *