May 7, 2024

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

రచన: లక్ష్మీదేవి

తరచుగా మన సామెతల్లోనూ, పద్యాల్లోనూ మన అలవాట్లు, ఆచారాలు, ఆహారాలు నిక్షిప్తం చేయబడడం మనం గమనిస్తూనే ఉంటాం. నానాటికీ మారే నాగరికతతో పాటు మన అలవాట్లూ, ఆహారవ్యవహారాలు మారడం చాలా సహజమైన విషయం. తనతోటి మానవులతో కలిసి మెలిగే మనస్తత్వం ఉన్న మానవులు తను వెళ్ళగలిగే అన్ని ప్రదేశాలకూ ప్రయాణం చేస్తుంటారు. కొండొకచో శాశ్వతంగానూ పుట్టిపెరిగిన ఊరిని వదలి తనకు నచ్చినచోట, అనుకూలం ఉన్న చోట నివాసముండడం మనుష్యులకే కాదు, ప్రాణిమాత్రులకందరికీ సహజమైన విషయమే. ఆ విధంగా మారిన పరిస్థితుల్లో వచ్చిచేరిన వారితోనూ, వెళ్ళి మళ్ళీ వచ్చిన వారితోనూ, వెళ్ళి ఇంకొక ప్రదేశాన్ని సుసంపన్నం చేస్తున్న వారితోనూ ఆయా ప్రాంతాలలో ఉన్న సంఘపు ఆలోచనలు, అలవాట్లు మారడమూ ప్రతి సమాజానికీ అనుభవంలోకి వచ్చిన సంగతే.
ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త తరంగాలతో శోభిస్తున్న నదీమతల్లులు కూడా తమ సహజ నిర్మలత్వాన్ని, పరిమళాన్ని, గతిశీలతనూ వదలుకోవు. అలాగే, మానవసమాజమూ ఎప్పటికప్పుడు తన గమనంలో స్వీయ మేధాశక్తితో ఏర్పరచుకున్న స్వభావానికి దిద్దుకున్న మెఱుగులనూ, గుణాలనూ తన సాహిత్యంలో పొందుపఱచుకొంటూనే ఉంటుంది. సాహిత్యం యొక్క అసామాన్యమైన ఈ లక్షణం వల్ల మన జీవితాల్లో ఇది ఒక విశిష్టతనూ, గౌరవాన్నీ, ప్రాముఖ్యతనూ సంతరించుకుంది. ఇది లిఖిత సాహిత్యమూ, మౌఖిక సాహిత్యమూ రెండింటికీ వర్తిస్తుంది.
ఈ లక్షణం వల్ల సాహిత్యం రోజువారీ జీవితంలో మన సంస్కారాన్నీ, వ్యక్తిత్వాన్నీ రూపొందించే శక్తి గలిగి ఉంటుంది. సాహిత్యం అంటే కథలూ, గేయాలూ, పాటలూ లేదా పనీపాటూ లేనివాళ్ళు వ్రాసుకొనే పోచుకోలు కబుర్లు అని అనుకోవడం కేవలం అజ్ఞానం తప్ప మరేమీ కాదు.
మన సాహిత్యం లో అక్కడక్కడా కనిపించిన చిన్న చిన్న విషయాలను గురించి ఈ రోజు మాట్లాడుకోగలిగితే , ఆసక్తి కరంగా ఉంటుంది. ఇక్కడ మచ్చుకు కొన్నిటి ప్రస్తావన మాత్రమే జరిగింది.
౧. వ్యక్తిత్వం భాసకవి రచించిన ప్రతిమానాటకంలో రాముడు కానలకు వెళ్తున్న సమయంలో సీత తానూ సిద్ధమైన నాటి సన్నివేశం. జీవితాంతం కష్టసుఖాలలో మాత్రమే కాక కర్తవ్యనిర్వహణలో తోడు ఉంటానన్న మాట నిలబెట్టుకున్న సీత మానవుల స్నేహధర్మానికీ, జీవన సాహచర్యానికీ ఆదర్శకరమైన మార్గం చూపుతుంది. అరణ్యాలలో ఉన్న కష్టాలను వివరిస్తూ రాముడు వారించినప్పుడు కూడా ఏమాత్రం వెరవదు. రాణివాసపు సుఖాల కోసం తన ప్రాథమిక ధర్మాన్నిమరువదు. ఆ సమయంలో రాముడు ఎదురుగా ఉన్న లక్ష్మణునితో సీతను నువ్వైనా ఆపమంటూ కోరతాడు. ఆ సమయంలో లక్ష్మణుడు పలికిన పలుకులు-
‘అన్నా, మెచ్చౕఁదగినపట్టున నీమెను నివారింపుమనుచుంటివి. నివారింప నేనుత్సహింపను. ఏలన- తారక వెన్నడించును సుధాకరు రాహువు మ్రింగునప్పుడున్, భూరుహముర్విబ్రుంగ వెసబ్రుంగును దీవయు, నేన్గు ఱొంపిలోఁ గూరుకొనన్ గరేణువును గూర్కొను, నీమె చరించు ధర్మమా తీరున నిన్ను వెన్కొని, సతీమణి భర్తృసనాథయే కదా! (భాస ప్రణీతమైన ప్రతిమ- వేటూరి ప్రభాకరశాస్త్రి తెనుగుసేత) అంటాడు. ప్రకృతిని గమనించడం, అందులో ఉన్న ఉత్తమ విషయాలను అనుకరించడం మానవ నైజం. ఆవిధంగా గ్రహణం పట్టినపుడు చుక్కలు కూడా చంద్రుణ్ణి అనుసరిస్తాయని, తనతోడు అయిన పెనుమాను భూమిలో కృంగినపుడు దానిని చుట్టిఉన్న తీగ కూడా అనుసరిస్తుందని, ఏనుగు ఊబిలో కూరుకొని పోగా ఆడఏనుగు అనుసరిస్తుందని, ఈమె కూడ నీతో వస్తాననడం, కష్టాలకు వెఱచి తోడు వీడకపోవడం ఆమె యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమని చెప్తాడు.
౨.సంప్రదాయం నందితిమ్మన రచించిన పారిజాతాపహరణంలో శ్రీకృష్ణుని ఇంటికి నారదమునీంద్రుడు అతిథిగా విచ్చేసిన సన్నివేశం. అతిథులను సిరిగలవారు తమ గొప్పలు చూపకుండాను, నిరుపేదలైనా తమకు చేతనైనంతలోనూ వినయంతో ఆదరించే గొప్ప అలవాటు ఇక్కడి వారికి ఉండేది. ఇప్పుడూ ఉంది. ఈ అలవాట్లను అలసత్వంతో వదిలేయకుండా రాబోవు తరాలు కొనసాగించేలా చేయడం మంచిలక్షణం. ఇటువంటి పద్యాలూ సన్నివేశాలూ ఎన్నో రచనలలో మనకు కనిపిస్తాయి. ఇది మన సమాజానికే వన్నె తెచ్చే ఒక సంస్కారవంతమైన అలవాటు. వచ్చిన మునిపతి కెదురుగ వచ్చి నమస్కృతులొనర్చి వనితయుఁ దానుం బొచ్చెంబు లేని భక్తి వి యచ్చరరిపుభేది సలిపె నాతిథ్యంబున్. (పారిజాతాపహరణం- ప్రథమాశ్వాసము-45) నారదుడు వచ్చినపుడు భార్యాభర్తలు స్వయంగా అతనికెదురేగి నమస్కరించారు. కొఱత(ఒచ్చెము)యే లేని భక్తితో సురవైరిభేది అయిన శ్రీకృష్ణుడు ఆతిథ్యమిచ్చాడు. అంతేకానీ అతిథి తుమ్ కబ్ జావోగే అనేది మనం అనుసరించవలసినది కాదు.
౩. నియమపాలన శ్రీనాథుని హరవిలాసం లో ప్రస్తావించబడ్డ భక్త సిరియాళుడు. అతని తండ్రి చిఱుతొండడు ప్రతిరోజూ తన పూజలన్నీ పూర్తయినాక అతిథికి భోజనం పెట్టి మాత్రమే తాను తినే కఠోరనియమం ఉన్నవాడు. అతని కుటుంబం కూడా ఈ నియమాన్ని మనస్ఫూర్తిగా అమలు జరిపేది. వీథికై యేగి వత్తునా వేగ వేగ నేఁడు మాత్రము కొందరు నియమపరులు పాద సరసిజ యుగళ ప్రసాదమాత్ర మబ్బెదరు గాక మన భాగ్యమల్పమగునె? (హరవిలాసం –ద్వితీయాశ్వాసం- 42) అని తన భార్య తిఱువెంగనాంచి తో సంప్రదించి మరీ వెళతాడు. ఏ పనిమీదో , ప్రయాణంలోనో ఉన్న అతిథులెవరైనా, లేదా తమ ఊరివారైనా భోజనం ఏర్పాటు లేక ఆకలితో ఉన్నవారికి ఆదరంతో అన్నం పెట్టి మరీ తాను తినే అలవాటున్నగృహస్థులు వాళ్ళు. ఆ రోజెందుకో ఎవరూ కనిపించలేదు. పోనీలెమ్మనే అలసత్వం ఏమాత్రం చూపించక ‘అలా వీథి చివరివరకూ వెళ్ళి చూసివస్తాను, ఎవరైనా ఉండవచ్చును. ఆ దేవదేవునికి పెట్టిన నైవేద్యమయిన ఈ ఆహారాన్ని తీసుకొనే అదృష్టవంతులు, నియమపరులు ఉండవచ్చు. మన భాగ్యం కొద్దీ దొరకవచ్చును. వెళ్ళి తీసుకువస్తానంటూ భార్యతో మాట్లాడి వెళుతున్న సన్నివేశమిది. అతిథులు వచ్చినపుడు ఆదరించడం ఇప్పుడూ కనిపిస్తూనే ఉంది కానీ ఆనాడు అతిథికి భోజనం పెట్టకుండా తినడమే తప్పని ఆలోచించేవారు, ఆచరించేవారని కూడా తెలుస్తుంది. తనకొక్కటే, లేదా తన కుటుంబానికొక్కటే వండుకొని తినడం అనే అలవాటు కాకుండా ఇంకొకరికి పెట్టి తినాలనే నియమం పెట్టుకున్న వారెందరో.. మనకు గతకాలపు సంస్కారపు వైభవానికి గుర్తుగా సాహిత్యంలో కనిపిస్తారు. దీనికి ధనంతో పనిలేదు.మనం తింటున్నది ఇంకొకరితో కూడా పంచుకోవాలనే నియమం ఉన్నతమైన సంస్కారం.
౪. శుభ్రత-స్వస్థత ఏనాడైనా శరీర ఆరోగ్యం కాపాడుకోవడానికి ఏమేం చెయాల్నో ఒక తరం మరొక తరానికి నేర్పిస్తూనే వస్తోంది. స్వచ్ఛమైన నీరు మాత్రమే ఆరోగ్యానికి మంచిదని తెలుసుకోవడం ఆ విధంగా శుభ్రపఱచిన నీటినే తాగడం అనేది మొదట్నించీ ఉన్న విషయం. ఈ నాటి వలె పెద్ద గంగాళాలను ఊరికొకటి, రెండు పెట్టి అందులో నీరు నిలువ ఉంచి ఏ మాత్రం గాలి, వెల్తురు చేరే అవకాశం లేని పంపులద్వారా సరఫరా కాకుండా, ఎప్పటికప్పుడు పాతనీరు పోయి కొత్త నీరు ప్రవహించే నదులు, ప్రతిరోజూ ఊట ఊరే బావుల్లోనూ నీళ్ళు తెచ్చుకొని వాడేవారు. కానీ గాలి వెలుతురుతో పాటు వచ్చే మట్టి మొదలైన వాటిని శుభ్రం చేసుకోవడానికి ఇందుప(చిల్ల) గింజల వాడకం విరివిగా ఉండేదని మనకీ పద్యం ద్వారా తెలుస్తుంది. తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యములోని శరదృతువు వర్ణన సన్నివేశం. కలకనీరెంతయు గతకల్మషముఁ జేసెఁ గతకఫలమురీతిఁ గలశసూతి….. …………………… (పాండురంగమాహాత్మ్యము-చతుర్థాశ్వాసము-37) ఇందులో కలక నీటిలో ఉన్న కల్మషాలు పోయేలా చేసే ఇందుప(కతక)గింజ వలె అగస్త్యనక్షత్రము ఉదయించిందనే వర్ణన ఉంది. శరదృతువు వర్షఋతువు తర్వాత వస్తుంది. వర్షాల వలన నదుల్లో చేరిన మట్టి వంటివన్నీ శరదృతువులో అడుగుకు చేరి నదుల నీరు తేట గా అవుతుంది. శరదృతువులో అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్లనే అది ఒక ఇందుపగింజ అయినట్టు, దానివల్లనే నీరు తేటగా మారినట్టు కవి వర్ణన.
౫. వైవిధ్యత, శాస్త్రీయత తో కూడిన కళావికాసం. ఇక్కడి సమాజంలో వికసించిన కళలన్నిటికీ శాస్త్రీయమైన, వైవిధ్యతతో కూడుకున్న, సమాజానికి అద్దం పట్టే విధంగా ఉన్న వికాసం జరిగింది. ప్రతి కళా వికసించడంలోనూ లేదా వికసించిన క్రమాన్ని భావితరాలకు అందించడం లోనూ సాహిత్యం పాత్ర మరువలేనిది. కాబట్టి అనేకానేక కళలలో ప్రస్తుతానికి సాహిత్యం గురించే చూద్దాం. కావ్యేషు నాటకం రమ్యం అనే మాట చాలా ప్రసిద్ధమైనదే. కాబట్టి కావ్య వస్తువును పండితులు, పామరులు కూడా చక్కగా ఆస్వాదించగలిగే అవకాశం ఉన్న నాటకం అందరికీ ఇష్టమైనది. ఈకాలంలోని సినిమా కూడా నాటకంకోవలోకే చేర్చవచ్చు. శ్రవ్యము, దృశ్యము అని రెండు రకాలు కావ్యవస్తువులు. ఇవి వస్తు, నాయక, రస భేదములను బట్టి విధ విధములుగా విభజింపబడినవి. నాటకంలో ఇవన్నిటి సమగ్రత కు అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే సర్వోత్తమమైనదని మాట. ఇందులోని వస్తువు అధికారికము, ప్రాసంగికము అని రెండు విధాలు. ప్రధాన పాత్రలకు సంబంధించినది అధికారికము, కథాగమనమునకు తోడ్పడినా, ప్రధానపాత్రలకు సంబంధము లేని కథాంశము ప్రాసంగికము.
ప్రఖ్యాతమితిహాసాద్యైరుత్పాద్యం కవి కల్పితం (ధనంజయుని దశరూపకం-౧-౧౫)
ఇతిహాస ప్రసిద్ధమైన కథ ప్రఖ్యాతము, కవి ప్రతిభా కల్పితము ఉత్పాద్యము, ఈ రెండింటి కలయిక మిశ్రమము. వీటిలో దివ్యము(దేవుళ్ళకు సంబంధించినది), మర్త్యము(మానవులకు సంబంధించినది), దివ్యాదివ్యము(మిశ్రమము) ఉండవచ్చును.
ఇంకా వీటిలో అనేక ప్రభేదాలున్నాయి.
శ్రోత లేదా ప్రేక్షకుని అలౌకికానందమునకు రసమని పేరు. నవరసములలో శృంగార హాస్యములు, వీరాద్భుతములు, భీభత్స భయానకములు , రౌద్రకరుణములు మైత్రితో కూడుకున్నవి. వీటిలో ఒకటి అంగిరసముగా (ముఖ్యమైనది)గా , ఒకటి అంగరసముగా (గౌణమైనది)గా పోషింపబడవచ్చును.
( కావ్యభేదాలు, ప్రభేదాలు స్వప్నవాసవదత్తం పుస్తకంలో ప్రస్తావన నుండి)
అంతేకాదు మన సామెతల్లోనూ మన అలవాట్లు, అభిరుచులు వ్యక్తమౌతాయి. శీర్షికలో సామెత చూడండి. గారెలు తీపి, కారం రెండు రకాలూ ఆయా ప్రాంతాల్లో ఉంటాయి. వేడి గారెలు తలచుకుంటూనే నోరూరకుండా ఉండదు. ఈ విధమైన మన రుచులప్రస్తావన ఈ సామెతలో ఉంది. గోరంత దీపం కొండంత వెలుగు , ఈ లోకోక్తిలో మనిషిని బ్రదికించే ఆశావాదము, నిరాశలో నిర్వేదం పొందకుండా ఉండేందుకు ప్రోత్సాహము కనిపిస్తాయి. పోరు నష్టం, పొందు లాభం ఈ లోకోక్తిలో కలసిఉండవలసిన కారణం వ్యక్తమౌతుంది. తాడెక్కే వాడికి తలదన్నే వాడుంటాడు. ఈ సామెతలో గర్వం పనికిరాదని, మనమెన్ని సాధించినా , అంతకు మించి సాధించేవారూ ఉంటారని, ఉండాలని చెప్తుంది.
_____________________ __________________________

3 thoughts on “తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *