May 6, 2024

ప్రపంచమనుగడకు మహిళామూర్తులే ఆలంబన  

రచన: రాచవేల్పుల విజయభాస్కర్ రాజు

 
నేడు అంత్జర్జాతీయ మహిళాదినోత్సవం.

ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ సంపూర్ణహక్కులను నిరాటంకంగా అనుభవిస్తుందో, ఎక్కడ స్వేచ్చగా నడయాడుతుందో, అక్కడి ప్రాంతం, ఆ దేశం సుభిక్షంగా వర్థిల్లుతుంది. ఆ దేశ ఔన్నత్యం పతాకస్థాయిలో నిలబడుతుంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఎన్నోవిప్లవపోరాటాల అనంతరం అలాంటి రోజును అన్ని దేశాలు చవి చూడాలని, ఆ దేశ గౌరవాన్ని అన్నిచోట్లా ప్రతిబింబించాలన్న సత్సంకల్పంతో ప్రతి ఏడాది మార్చినెల 8వ తేదీన అంతర్జాతీయమహిళాదినోత్సవంగా జరుపుకుంటున్నాయి.

ఆడది అబల కాదు సబల అని నిరూపించిన భరతగడ్డ మనది. స్త్రీలు సంస్కృతీ సాంప్రదాయాలను, కుటుంబ వారసత్వాన్నిపుణికి పుచ్చుకున్నారు. సంఘంలో, సమాజంలో తమ ఔన్నత్యానికి పునాదులుగా నిలిచారు.
తమ భర్తలకు ధీటుగా చేదోడు, వాదోడుగా నిలిచారు.  ప్రాచీనకాలంనుండీ స్త్రీలు యుద్ధరంగంలోనూ, రాజనీతి, లౌక్యంలోనూ పేరుమోసి చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డారు. త్రేతాయుగం లో దశరధునితో కైకేయి యుద్ధరంగానికి వెళ్ళింది. శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం చేసేందుకు వెళుతుండగా సత్యభామ కూడా భర్తతోపాటే నేరుగా యుధ్దరంగానికి బయలు దేరింది. యుద్ధంలో కృష్ణుడు మూర్చిల్లినప్పుడు బేలగా భీతిల్లక సత్యభామ నరకాసురున్ని ఎదిరించి హతమార్చింది. ఆధునిక కాలంలోచరిత్రకొస్తే శాతవాహనుల కాలంలో ప్రతి చక్రవర్తి తన తల్లి పేరును తమనామధేయంతో కలిపి పరిపాలన సాగించారు…మాతృస్వామిక వ్యవస్థను పతాక స్థాయికి జేర్చారు. అక్కడి నుండి మరింత ఉన్నత దశకు ఎదిగిన స్త్రీ రాజరిక పగ్గాలను సైతం చేపట్టింది. అందుకు సాక్ష్యంగా రాణీ రుద్రమదేవి వీరోచిత చరిత్ర, మనకు తెలిసిందే…
ఆ తర్వాతనుండీ బాల్యవివాహాలు, సతీసహగమనం వంటిసాంఘికదురాచారాలు స్త్రీల హక్కులను కాలరాశాయి. ఒక్కసారిగా ఉన్నత దశనుండి అట్టడుగుకు స్త్రీ స్వేచ్ఛ కుప్పకూలి పోయింది. కాలక్రమంలో రాణీ ఝాన్సీ లక్ష్మిబాయి స్త్రీ ఔన్నత్యాన్ని మరోసారి నిలబెట్టింది..ఆ పిదప స్వాతంత్ర్యోద్యమం మొదలవ్వడంతో స్త్రీలు సమరరంగంలో కాలుమోపారు. దుర్గాభాయ్ దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు, కస్తూర్బాగాంధీ,  కమలానెహ్రూ, విజయలక్ష్మి పండిట్, సుచేతా కృపలానీ, ఉషామెహతా సావిత్రీ భాయి పూలే, బేగం హజ్రత్ మహల్, అనిబిసెంట్‌, అరుణా అసఫ్‌ ఆలీ, మేడమ్ బికల్జీ తదితరులు తమ సత్తా చాటి పోరాటయోధులుగా పేరు గడించారు. జీవన మనుగడలో అనాది కాలంనుండి నేటి వరకు ఇలాంటి స్త్రీల పాత్ర అంతా ఇంతా కాదు.

ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ నేపథ్యం చూసినా మహిళల అణచి చేత నుండే మరో విప్లవం పుట్టుకొస్తోంది. మరో ప్రపంచం సృష్టించ బడుతోంది. అణచివేసే కొద్దీ అపర కాళిలా మారడం, అత్యున్నతస్థాయికి ఎదగడం మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. ఈనాడు కల్పించబడిన ఈ రాజకీయ పదవులు, అధికారిక హోదాలు, శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రవేశం, వైద్యరంగంలో పరిణతి, కార్మికరంగంలో నిపుణత, సంఘసేవలో అత్యున్నత పురస్కారాలు, విద్య ఉపాధుల్లో ఆరితేరడం, అట్టడుగు నుండి అంతరిక్షం వరకు మహిళ ఎదిగిందంటే  ఇవన్నీరాత్రికి రాత్రే సంక్రమించినవి కావు. ఎన్నెన్నో విప్లవాలు, ప్రాణ త్యాగాలు, ధర్నాలు, హర్తాళ్ళు, ఉద్యమాలు, నిరసనలు, పోరాటాల ఫలితమే ఈనాటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. అయితే ఆ మేరకు సభలు, సంబరాలు చేసుకుంటూ నిర్లిప్తతతగా ఉంటే సమస్య మళ్లీ మొదటికే వస్తుంది. సాధించుకున్న చట్టాలన్నీ చట్టుబండలవుతాయి. ఎన్ని చట్టాలున్నా ఈనాటికీ మనదేశంలో వేలాదిమంది మహిళలు ఇంకా అణచివేతకు గురవుతూనేఉన్నారు. ఒకవైపు లింగవివక్షతతో భ్రూణ హత్యలు అనగా స్త్రీ శిశు గర్భస్రావాలు, వరకట్న వేధింపులు, గృహహింస, అత్యాచారాలు, అత్తింటి ఆరళ్లు, ఆత్మహత్య ప్రేరేపణలు నానాటికీ పెరుగుతుండగా మరోవైపు అభత్రతాభావం పెరిగిపోతోంది. ఈకాలంలో ఎంతోమంది స్త్రీలు తమకు రక్షణగా ఏఏ చట్టాలు ఉన్నాయో కూడా తెలియనిపరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి వారందరికీ తగు మద్దతునిచ్చి తమనీ, తమ హక్కులను పరిరక్షించుకోగలిగే అవగాహనని కల్పించడం విద్యావంతులైన ప్రతి ఒక్కరి మీదా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *