May 6, 2024

 స్వర్ణమందిరం – అమృత్ సర్                       

రచన:  వెంకట్ యస్. అద్దంకి   

00    

చరిత్ర ఉన్న ప్రదేశాలను దర్శించగలగడం అన్నది కొన్ని సార్లు అనుకోకుండా కలసివచ్చే అవకాశాలు. అలాంటి ఒక గొప్ప అవకాశమే నా ఈ అమృత్ సర్ యాత్ర. కంపెనీ పనిమీద జమ్మూ వెళ్ళడం, మధ్యలో నా పనిలో చిన్న విరామంగా వచ్చిన ఆదివారం నాకు చేసిన మేలు. ముందు రోజు టాక్సీ డ్రైవర్ ని అడిగితే 200 కిలోమీటర్ల దూరం,4-5 గంటల ప్రయాణం అన్నాడు. ఇంక ఆలస్యం ఎందుకు అని నా ప్రణాళిక  సిద్ధం చేసుకుంటూ, నాతో ఉన్న సహ ఉద్యోగికి చెప్పడం జరిగింది. అతనూ రావడానికి ఉత్సుకత చూపించాడు. రోజువారీగానే మా మా ఇళ్ళకి సందేశాలు ఇచ్చాము. గురువారం ఉదయం అనుకుంటా అతని ఇంటినుండి వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి నాన్నా… పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు దిగబడ్డారు, నువ్వు ఎక్కడకీ బయటకు కదలకు, లేదంటే మీకు దగ్గర కాబట్టి పని వదిలేసి మధ్యలో వచ్చెయ్యి అంటూ. తరువాత తన భార్యా పిల్లలకు మధ్యలో పని వదిలి రావడం కుదరదని సర్దిచెప్పడానికి అతనికి తలప్రాణం తోకకొచ్చింది. సరే రెండో రోజు సాయంత్రానికి పోయిందీ, అనుకున్న ఉగ్రవాదుల ఆపరేషను మళ్ళీ మొదలయ్యింది అని అన్నారు చుట్టు ప్రక్కల. అప్పుడు అతనికి కొంచెం అనుమానం, భయం వచ్చింది. నేను అబ్బే అటువంటిదేమీ లేదు, అసలు మనంవెళ్ళే దారిలో పఠాన్ కోట్ ఒక పక్కకి ఉంటుంది అని చెప్తూ వచ్చి ఆఖరికి ఎలాగైతే ఏమీ బయలుదేరదీసాను. నిజానికి మేము పఠాన్ కోట్ మీదుగానే వెళ్ళాలి. అలా శనివారం అర్ధరాత్రి బయలుదేరి ఉదయం 5:30 కి చేరాము. అసలే జనవరి నెల అమృత్ సర్ దిగే సమయానికి 3 డిగ్రీల ఉష్ణోగ్రత తో మంచి చలి పుడుతోంది. అలాగే కొంచెం ఫ్రెష్ అయ్యి అక్కడనుండి నేరుగా గోల్డెన్ టెంపుల్ కి చేరాము.

0

శ్రీ హరద్వార్ సాహిబ్ గా చెప్పబడే ఈ సిక్కుల పవిత్ర క్షేత్రానికి లెక్కలేనంత చరిత్ర ఉంది. ధైర్యానికీ సాహసానికి మారుపేరైన సిక్కు సోదరుల కి ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. 16వ శతాబ్దిలో “గురు అర్జున్ సాహిబ్” ఇక్కడ ఉన్న సరోవరం తవ్వించి, గురుద్వార నిర్మించారు. అంతకు ముందు” గురు రాందాస్ సాహిబ్” అనే గురువు 1577 లో ముందు ఆ సరోవరం తవ్వించడం మొదలుపెట్టేరు. దానిని 1586లో పూర్తిచేసి 1588 లో గురుద్వారా నిర్మాణానికి  శంకుస్థాపన చేసారు గురు అర్జున్ సాహిబ్. తరువాత 19 శతాబ్దిలో రాజా రంజిత్ సింగ్ బంగారుపూత పూయించారు. ఇక్కడ ఉన్న సరోవరానికి పేరు “అమృత్ సరోవర్”. ఈ సరోవరం పేరుమీదే ఆ ప్రదేశానికి “అమృత్ సర్” అని పేరుపెట్టేరు. సిక్కుల పవిత్ర గ్రంధమైన “గురు గ్రంధ్ సహిబ్” మొదటి గ్రంధాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రముఖ సిక్కు గురువు “గురు హర గోబింద్” ద్వారా ఈ గురుద్వార సంపూర్ణతని సంతరించుకుంది. నాలుగు ద్వారాలతో బంగారుమయమైన ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించడానికి రెండు కళ్ళు చాలవు. తదుపరి వచ్చిన మొఘలాయిల పాలనలో కొన్ని సార్లు దండయాత్రలకి గురి అయినా, ఎందరో ధైర్యం, భక్తి కలిగిన సిక్కుల వల్ల కాపాడబడుతూ వచ్చింది. తరువాత వచ్చిన ఆంగ్లేయుల పాలనలో అప్పటి హెచ్.ఎం.లారెన్స్ అన్న ఆయన ఈ పవిత్ర క్షేత్రం దర్శించుకొనదలచిన వారందరూ తప్పకుండా సిక్కు ధర్మాచారాల ప్రకారమే దర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.

1

ఆంగ్లేయుల పాలనా సమయంలో చాలామంది ఆంగ్లేయులు వస్తూ ఉండడంతో ఆయన ఈ ఆదేశాలు జారీ చెయ్యటం జరిగింది. అలాగే ఇక్కడ నిత్యం నిర్వహించబడే “లంగర్” (నిత్యాన్నదాన సత్రం) నిత్యము భక్తులతో. నిస్వార్ధ సేవాపరులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎందరో సిక్కు సోదరులే కాదు, హిందువులు కూడా నిస్వార్ధ సేవ చెయ్యదలచినవారు తమకు తోచిన విధంగా ఏదో ఒక పని చేస్తూ పోతుంటారు. మన హిందూ మందిరాలలో కనపడే విఐపీ సేవలూ, దర్శనాలు ఇక్కడ ఉండవు. అందరూ సమానమే, ధనిక పేదా అన్న తేడాలేని పవిత్ర స్థలము ఈ హర ద్వార్ సాహిబ్. ఇక్కడి సేవాతత్పరత భావం మనసుకు హత్తుకుపోతుంది. సూర్యోదయ సమయంలో భానుడి లేలేత కిరణాలు ఇక్కడి మందిరం మీద, ఆ సరోవరంలోను పడి మెరిసే కాంతులు రమణీయమైన సుందర దృశ్యం. ఇక్కడి సరోవర జలాల్లో స్నానమాచరిస్తే చర్మవ్యాధులు తొలగుతాయి అన్న నమ్మకం కూడా కొందరు కనబరుస్తారు.

4

లాహోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం అప్పట్లో  స్వాతంత్ర సమరాంలోనూ తన పాత్ర పోషించింది.  ఈ పవిత్ర క్షేత్రానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న “జలియన్ వాలా బాగ్” లో ఏప్రిల్ 13,1919 లో జరిగిన మారణకాండ (379 నిండు ప్రాణాలను బలిగొని, 1200 మందిని క్షతగాత్రులుగా చేసిన సంఘటన), అంగ్లేయుల అరాచకత్వానికి పరాకష్ట. ఈనాటికీ గుర్తుకువచ్చినప్పుడల్లా మన భారతీయుల మనసులు బాధతో మూలుగుతాయి, ప్రతీకారంతో కళ్ళు ఎర్రబడతాయి అన్నది సత్యం. మహా వీరుడు, ఎన్నో కష్టాలకోర్చి చివరికి పట్టుదలతో లండన్ మహా నగరం జేరుకుని, తిండిలేకపోయినా కేవలం మంచినీళ్ళతో బ్రతుకుతూ దెబ్బ తిన్న పులిలా వేచి చూసి, ఈ అరాచకత్వానికి కారణమైన జెనరల్ డయ్యర్ ని చంపి, భారతీయుల ప్రతీకారం తీర్చిన మహాను భావుడు సర్దార్ ఉధం సింగ్ కి మనం ఎల్లవేళలా ఋణపడివుంటాము. ఈ జలియన్ వాలా బాగ్ దగ్గర నిత్యం రక్త దాన శిబిరం జరుగుతూ ఉంటుంది.  ఇది ఒక మంచి ఆలోచన పర్యాటకులలో ఆసక్తి ఉన్నవారు రక్తదానం చెయ్యొచ్చు, బలవంతము ఏమీ ఉండదు. మన ఇష్టాపూర్వకంగానే రక్తదానం చెయ్యవచ్చు. నేను నా వంతుగా రక్తదానం చేసాను.

3

అమృత్ సర్ కి 22 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి లాహోర్, పాకిస్థాన్ ని వేరుచేస్తూ ఉన్న సరిహద్దు, వాఘా సరిహద్దు. ప్రతిరోజూ ఇక్కడ సాయంత్రం జరిగే సైనిక విన్యాసం చూడ దగినది. నేను సమయాభావం వల్ల చూడకుండానే వెనుదిరిగాను. మళ్ళీ ఇంకొక సారి దర్శించినపుడు తప్పక వీక్షించాలి అన్న కోరిక మెదడులో ఉంటే తప్పక జరిగితీరుతుంది.

ఆ పుణ్య క్షేత్రాన్ని దర్శించిన తర్వాత పట్టణమంతా చూడ్డానికి బయలుదేరాము. నా మనస్సుని బాధించినది ఒక్కటే ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రమున్న పట్టణం లో పరిశుభ్రత లోపించడం. పట్టణంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని పట్టణ పారిశుధ్యం, శుభ్రత మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క ప్రధానమంత్రి స్వచ్చ భారత్ కార్యక్రమం చేపట్టినా సిక్కు సోదరులు ప్రతిన బూనితే ఈ పని పెద్ద కష్టంకాదు అని నా అభిప్రాయం.

2 thoughts on “ స్వర్ణమందిరం – అమృత్ సర్                       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *