May 10, 2024

*** ఏకలవ్య 2016 ***

రచన: గుడిపూడి రాధికారాణి.

“అర్జున్!కమాన్. బీ అలర్ట్. కాన్సంట్రేట్ ఆన్ ద గోల్. “మాస్టర్ సూచనలు వింటూ జాగ్రత్తగా ఎయిం చేసుకుంటున్నాడు అర్జున్.
“ఏం కనిపిస్తోంది?” అనడిగాడు ద్రోణా సర్.
“చిలుక కన్ను సర్. “చెప్పాడు అర్జున్ ఏకాగ్రతగా చూస్తూ.
బాణం సంధించి వదిలాడు. సూటిగా చిలుక బొమ్మ కంటికి గుచ్చుకుందది.
ఇక ఎప్పట్లాగా ఆ వీక్లీ అసైన్ మెంట్లో కూడా టాప్ గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే.
రిలీఫ్ గా ఊపిరి పీల్చి వదిలాడు అర్జున్. కుర్చీలో కూర్చుని టర్కీటవల్తో తుడుచుకుంటూ రిలాక్స్ అవసాగాడు.
“చూశారా! మీకందరికీ చెట్టు కొమ్మలు, చిలుక అన్నీ కనిపించాయి. అర్జున్ కి కన్ను ఒకటే కనబడింది. అదీ కాన్సంట్రేషన్ అంటే. అందుకే అతడు స్టార్ ప్లస్ బ్యాచ్ లో ఫస్ట్ ర్యాంకర్ గా ఉన్నాడు. మీరు కూడా అదర్ ఏవగేషన్స్ పక్కన పెట్టి కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నా సజషన్స్ ఫాలో అయి ర్యాంకింగ్స్ మెరుగు పరుచుకోకపోతే నెక్స్ట్ ఇయర్ ఫీజ్ కన్సెషన్ కష్టమవుతుంది. అండర్ స్టాండ్?” అంటున్న ఆర్చరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ ద్రోణా సర్ మాటలకు తలూపుతూ అర్జున్ ని ఈర్ష్యగా చూశారు కౌరవులు.
“వాడి పట్టుదలకి మీ ఎంకరేజ్ మెంట్ తోడయింది.” అంటూ ఇంకా ఏదో గొణగబోతున్న దుశ్శాసన్ ని “ష్!” అంటూ నిలువరించాడు దుర్యోధన్.
దేశంలోనే పేరెన్నికగన్న నంబర్ వన్ స్పోర్ట్స్ స్కూల్ అది. అందులో ట్రయినప్ అయిన వాళ్ళు ఒలింపిక్స్ లో పతకాలు కొట్టిన సందర్భాలున్నాయి. దాంతో టాప్ ఫీజులతో నడుస్తున్న ఆ స్కూల్లోకి రిచ్ పీపుల్ తప్ప మిడిల్ క్లాస్ వాళ్ళు కన్నెత్తి చూసే సాహసం కూడా చెయ్యరు.
ఇక స్లం ఏరియా కుర్రాడయిన “ఏకలవ్య” సంగతి చెప్పేదేముంది?
ఆ రిచ్ బిల్డింగ్స్, విశాలమయిన గ్రౌండ్, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే బయటికి లీలగా వినిపించే సందడి అతడిని చాలా ఆకర్షించేవి.
ఏకలవ్య వీధుల వెంట తిరుగుతూ చిత్తుకాగితాలు పోగేసుకునే కుర్రాడు. ఆ క్యాంపస్ స్టూడెంట్స్ తాగి పడేసిన కోక్ టిన్స్, డిస్పోజబుల్ గ్లాసులు, కప్పులు, పేపర్ప్లేట్స్, పోలిథీన్ కవర్స్ రోజూ వచ్చి పోగేసుకునే అవకాశం సంపాదించాడు.
వాళ్ళని దగ్గరగా గమనించడమే కాక వీధి వీధీ తిరిగే పని లేకుండా వాటి మీదే అతడికి బోలెడు ఆదాయం వచ్చేది.
రెజ్లింగ్ లో స్టార్ ప్లస్ బ్యాచ్ ఫస్ట్ ర్యాంకర్ అయిన “భీమ్”ని చూస్తే అతడికి చాలా భయమేసేది.
ఇంకా అక్కడ స్విమ్మింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ . . ఇలా రకరకాల అంశాల్లో శిక్షణ జరుగుతున్నా ‘ఆర్చరీ’ అతడిని ఆకర్షించినంతగా మరేదీ ఆకర్షించలేకపోయింది.
ద్రోణా సర్ వింటి నారిని సంధించే విధానం, గురి చూడడం నేర్పే పద్దతి గమనిస్తున్న కొద్దీ అతడికి ఆర్చరీ అంటే ఇంట్రస్ట్ పెరిగిపోసాగింది.
డస్ట్ బిన్స్ లో వస్తువులు తన బస్తాలోకి చేర్చడానికి కాలయాపన చేస్తూ అతడు ద్రోణా సర్ బోధనలు ఒక చెవిన వింటూ బుర్రకెక్కించుకున్నాడు.
ఆ కాలేజిలో చేరాలంటే ఈ జన్మకిసాధ్యం కాదని తెలుసు గనక ఇంటి దగ్గరే సొంతంగా ప్రాక్టీస్ చేద్దామని డిసైడయ్యాడు.
వీధి వీధీ తిరిగే పని లేని కారణం చేత అతడికి చాలా టైం మిగిలేది కూడా.
ఒక రోజు ధైర్యం చేసి తన ఏడొందల యాభై రూపాయల సెల్ ఫోన్ తో ద్రోణా ని ఫొటో తీశాడు.
వెదురు బద్దలతో విల్లు సిద్దమైంది. ఎవరో పారేసిన సైకిల్ చువ్వలే బాణాలుగా మారాయి.
ఖాళీ సమయాల్లో తన గుడిసె ముందు చెట్టు కింద ఆ ఫోన్ లో ఫొటో ఓపెన్ చేసి ఉంచి దణ్ణం పెట్టుకుని చేయసాగాడు. అతిత్వరలో అతడెంత గురిని సాధించాడంటే ఆ స్లం ఏరియా పిల్లలు, పెద్దలు కూడా అతడు జామకాయలు, బొప్పాయి కాయలు కొడుతుంటే నివ్వెరపోయి చూడసాగారు.
ఒక రోజు తన గుడిసె ఎదురుగా ఉన్న గోడ మీద అయిదు వృత్తాలు గీసి మధ్యలో చిన్న చుక్క పెట్టి దూరంగా నిలబడి గురిగా చిన్న చుక్కని కొడుతున్నాడు ఏకలవ్య.
పది సార్లలో తొమ్మిది సార్లు కొట్టగలిగాడు. ఇక ఈ రోజు కి ప్రాక్టీస్ ఆపుదామనుకుంటూ వెనక్కి తిరిగాడు.
అతడినే గమనిస్తూ కనబడ్డాడో జర్నలిస్ట్. స్లం ఏరియా ల ఫొటోలు, ఆర్టికల్స్ కోసం వచ్చిన అతడికి ఏకలవ్యని చూసి ఆశ్చర్యంతో మతిపోయింది.
ఫొటోలు తీసి ఇంటర్వ్యూ చేశాడు.
“ఎవరు బాబూ నీ మాస్టర్?” అనడిగాడు చివర్లో.
“ద్రోణా సర్. ” చెప్పాడు ఏకలవ్య వినమ్రంగా.
మర్నాడే పేపర్లో “మురికివాడ ముత్యం” అనే హెడ్డీంగ్ తో ఏకలవ్య ఫొటో తో బాక్స్ కట్టి మరీ వార్త వచ్చింది.
చివరగా “ఎవరు మీ గురువు?” అన్న జర్నలిస్ట్ ప్రశ్న కు “ద్రోణా సర్” అనే ఏకలవ్య సమాధానం సంచలనం సృష్టించింది. టి. వి. 13 చానల్ లో ఏకలవ్య ఇంటర్వ్యూ ప్రసారం కాసాగింది.
జర్నలిస్ట్ ఇంటర్వ్యూ ముగిస్తూ”ఇది ఒక అద్భుతం. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఒక స్లం ఏరియా బాలుడు పోటీ పడడం స్వాగతించదగ్గ పరిణామం.
స్పోర్ట్స్ స్కూల్ ఆర్చరీ టాపర్ అర్జున్ రికార్డ్ 9/10 ని సరయిన ఎక్విప్ మెంట్ లేకుండానే ఏకలవ్య చేరడం నా కళ్ళతో స్వయంగా చూశాను.
ప్రభుత్వం శ్రద్ద తీసుకుని ఇతడికి కోచింగ్ ఇప్పిస్తే, స్పాన్సర్స్ ఎవరైనా ముందుకొచ్చి అన్నీ సమకూరిస్తే రాబోయే ఒలింపిక్స్ లో ఇతనికి పతకం ఖాయం.
ఈ రోజుల్లో విద్య అనేది కేవలం డబ్బున్న వారికే అందేది. అనే సామాన్యుడి నమ్మకాన్ని వమ్ము చేసి వారిలో ఆశలు చిగురింపజేసి స్ఫూర్తిగా నిలిచిన ఏకలవ్యని టి. వి. 13 అభినందిస్తోంది. ” అన్నాడు.
ఇదంతా గమనిస్తున్న స్పోర్ట్స్ స్కూల్ మేనేజ్ మెంట్ కోపంతో ఊగిపోయింది. కమిటీ పెద్దల అత్యవసర సమావేశం జరిగింది. ద్రోణా సర్ ని పిలిపించారు.
“ఏం సర్? సంవత్సరానికి 22 లక్షలిచ్చి తమరిని ఆర్చరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ గా అపాయింట్ చేసుకుంది దీనికేనా?”అడిగాడో పెద్దాయన వ్యంగ్యంగా.
“స్లం ఏరియా బోయ్స్ కి ట్యూషన్స్ చెప్పి వాళ్ళకి, మన స్టూడెంట్స్ కి తేడా లేకుండా చేస్తావా?ఇంతలేసి ఫీజులు కట్టే మనకు, కట్టని వాళ్ళకు ఇక తేడా ఏముంది? అని పేరెంట్స్ ఫీలయితే అడ్మిషన్స్ తగ్గిపోవా?” నిలదీశాడు మరో సూట్ వాలా.
ద్రోణా సర్ “నిజంగా నేను ట్యూషన్స్ చెప్పలేదు సర్. ఆ ఏకలవ్య ఎవరో. . అతను నన్నెందుకు గురువు అన్నాడో నకూ అర్ధం కావట్లేదు. బిలీవ్ మీ. ” అని ఎంత మొత్తుకున్నా కమిటీ స్పందించలేదు.
“ఒలింపిక్స్ లో మన స్కూల్ కే మెడల్స్ రావాలి. మర్యాదగా అతనితో ప్రాక్టీస్ ఆపుచేయించు. అదర్ వైజ్ గెట్ రెడీ ఫర్ రిసీవింగ్ సస్పెన్షన్ ఆర్డర్స్. ” అని ఫైనల్ అల్టిమేటం ఇచ్చేసింది.
ద్రోణా సర్ నిస్సహాయతతో ఊగిపోయాడు. కోపంతో రగిలిపోతూ వెంటనే స్లం ఏరియా కు వెళ్ళాడు.
ఏకలవ్య పేరు చెప్పగానే అతడుండే పాక చూపించారు. పాక ముందు చెట్టు కింద తన ఫొటో ఓపెన్ చేసి దణ్ణం పెట్టుకుని ప్రాక్టీస్ కి రెడీ అవుతున్నాడు ఏకలవ్య.
ఈ తతంగం చూడగానే సగం విషయం గెస్ చేశాడు ద్రోణా సర్. అతడితో మాట్లాడాక సంగతంతా బోధ పడింది.
“ఏకలవ్యా! నువ్ సరదా కోసం చేసిన ప్రాక్టీస్ నా కొంప ముంచేలా ఉంది. నువ్వు ప్రాక్టీస్ మానకపోతే నా ఉద్యోగం ఊడబీకేలా ఉన్నారు. ” అన్నాడు ఏడుపుగొంతుతో.
సాక్షాత్తూ ద్రోణా సర్ తన ఇంటికి వచ్చారని ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఏకలవ్య కి వెంటనే ఏం అర్ధం కాలేదు. కారణం సరిగ్గా తెలియలేదు గానీ తను ఆడడం మాస్టారికి ఇష్టం లేదనే నిజం మాత్రం మెదడు లో ఇంకింది.
నిర్ఘాంతపోయాడు. నిరాశ చెందాడు. నిస్పృహ ఆవరించినప్పటికీ తేరుకుని గురుభక్తితో “మీ ఉద్యోగానికి ప్రమాదం వచ్చేట్లయితే ఇక నేను జన్మలో విల్లమ్ములు ముట్టుకోను సర్. నన్ను నమ్మండి” అన్నాడు నిజాయితీగా.
అతడి గొంతులో ఆర్తి ద్రోణా ని కలచివేసింది. అయినా గత్యంతరం లేదు. “ఎలా నమ్మడం?” అన్నాడు.
“పేపర్ మీద ఏం కావాలో రాసుకోండి సార్. సంతకం చేస్తాను. “అన్నాడు ఏకలవ్య.
ద్రోణా అందుకు సుతరామూ ఇష్టపడలేదు.
‘తర్వాత ఇలా ఒత్తిడి చేశానని కోర్టుకి ఈడుస్తాడేమో. రిటెన్ గా కమిట్ చేయించడం ప్రమాదమే. ఇతగాడిని ఎంతవరకు నమ్మొచ్చో తెలీదు. ‘అనుకున్నాడు.
“అలా వద్దు. ” అన్నాడు కఠినంగా.
“మరేం చెయ్యాలో చెప్పండి. మీరేం అడిగినా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను. “అన్నాడు ఏకలవ్య విధేయతతో.
అతడి వినయానికి కదిలిపోయినప్పటికీ కరగకుండా “అయితే నా ఫీజు గా నీ బొటనవేలు ఇవ్వు. ” అన్నాడు ద్రోణా కర్కశంగా.
ఏకలవ్య తల్లడిల్లిపోయాడు.
“సార్!మీరేం అడిగినా ఇస్తాను. కానీ వేళ్ళు అడక్కండి. పోనీ కాలి వేళ్ళు ఇవ్వనా?”అన్నాడు దీనంగా.
ద్రోణా ఆశ్చర్యంతో “అంటే నొప్పికి భయపడి కాదా?” అంటే కాదన్నాడు.
“మరేంటి ప్రోబ్లం?బొటనవేలు ఇస్తే ప్రాక్టీస్ కుదరదనేగా! అంటే ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం అనేగా. “అన్నాడు నిష్టూరంగా.
“కాదు సార్. నేను విల్లమ్ములు ముట్టుకోను. నన్ను నమ్మండి. కానీ బొటనవేలు ఇవ్వలేను. క్షమించండి. “తేల్చి చెప్పాడు ఏకలవ్య విలపిస్తూ.
ఏం చేయ్యాలో పాలుపోని ద్రోణా జరిగింది యాజమాన్యానికి వివరించి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనుకున్నాడు. టీ తాగి వెళ్ళమన్న ఏకలవ్యని వారించి బయలుదేరాడు.
బైక్ తీస్తూ జాలిగా అతడిని చూసి తల తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇంతలో అతడికి తన గాగుల్స్ ఆ ఇంటి కిటికీ లో మర్చిపోయినట్లు గుర్తొచ్చింది.
వెనక్కి వచ్చిన ద్రోణా కి ఏకలవ్య ఫ్రెండుతో చెప్పే మాటలు వినిపించాయి.
“అది కాదురా. . సార్ అడిగారని వేలు ఇచ్చేస్తే ఫోన్ లో గేంస్ ఆడడమెలా?మెసేజిలు కొట్టడమెలా? నువ్వే చెప్పు. అసలు ఫోన్ వాడకుండా ఎలా ఉండగలం?అవునా?కాదా?”
“అదా సంగతీ!!” అనుకుని అవాక్కయిపోయాడు ద్రోణా. స్మార్ట్ ఫోన్ కొనిచ్చి రకరకాల కొత్త గేంస్ లో ఏకలవ్యని అఖండుణ్ణి చేసి అప్పుడు తీసుకెళ్దాం బొటనవేలు. “అనుకున్నాడు.
కొన్ని రోజులకే అంత పనీ చేశాడు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *