May 9, 2024

సస్పెన్స్ కధలు: 2 – అమ్మా, నాన్న ఒక బాబు

రచన: మధు అద్దంకి

కెవ్వుమనరిచాడు సోను. ” మమ్మీ వద్దు మమ్మీ , కొట్టకు మమ్మీ, మళ్ళీ చెయ్యను మమ్మీ అంటూ ఏడుస్తూ, అరుస్తున్నాడు సోను.. అయినా కనికరించకుండా బెల్టుతో చితక బాదుతోంది లక్ష్మి..పనిమనిషి రత్తాలు అడ్డమొచ్చి తల్లి చేతుల్లోంచి బెల్ట్ లాక్కుని, సోనూని పక్క గదిలోకి తీసుకుపోయింది.. ” రాస్కెల్ వద్దన్న పని చేస్తాడా ఇవాళ వీడిని చంపేస్తాను” అని మళ్ళీ పక్కగదిలోకి పోబోయింది. లక్ష్మి అరుపులు విన్న రత్తాలు గభాల్న తలుపేసి గొళ్ళెం పెట్టింది..
దబా దబా తలుపుల మీద బాది ఎంతకీ తెరుచుకోకపోవడంతో కాలితో ఒక తన్ను తన్ని తిరిగి గదిలోకి పోయింది లక్ష్మి.
ఏడుస్తూ కూర్చున్న సోనూని చూస్తున్న రత్తాలుకి కడుపు తరుక్కుపోయింది. సోనూ దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిచి ” ఏమయ్యింది సోనుబాబు ? ఎందుకు అమ్మగారు నిన్నిలా కొట్టారు? ఎందుకు అమ్మగారికి కోపం తెప్పించావ్” అనడిగింది రత్తాలు.
“నేను టీ.వీ చూసున్నాను పొరపాటున సవుండ్ తగ్గించపోయి పెంచాను.. మమ్మీ ఆఫీస్ నుండొచ్చి పడుకుంది. సవుండ్ వల్ల డిస్టబ్ అయ్యి నన్ను కొట్టింది ” అని వెక్కుతూ చెప్పాడు సోను.
ఇంత చిన్న విషయానికి పిల్లాడిని గొడ్దుని బాదినట్టు బాదింది ఏం మడిసో అనుకుంటూ సోనూని దగ్గరికి తీసుకుని ఓదార్చింది రత్తాలు.. అలా వెక్కుతునే నిద్రపోయాడు సోనూ.
టింగ్ టింగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. వొళ్ళో పడుకున్న సోనూని ఎత్తుకుని మంచమ్మీద పడుకోబెట్టి వెళ్ళేలోపే బెల్ల్ మళ్ళా రెండుసార్లు మోగింది.. రత్తాలు వెళ్ళి తలుపు తీసేలోపే లక్ష్మి వెళ్ళి తలుపుతీసింది..తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న భర్తను చూసి ” అంత కొంపలేమి మునిగిపోయాయని బెల్లు అన్నిసార్లు కొడుతున్నారు? కొద్దిగా ఆగలేరా? పడుకున్న వాళ్ళు వచ్చి తలుపు తీయడానికి టయిం పడుతుంది కదా” అని అరిచింది.
అసలే విపరీతమైన తలనొప్పితో వచ్చిన భాస్కర్ కి లక్ష్మి ప్రవర్తన, అరుపులు చెడ్డ చిరాకు తెప్పించాయి ” కొంపలో నువ్వు చేసేడ్చే పనేముంది? వొళ్ళు కొవ్వెక్కి పడుకున్నావు.. బెల్లు కొట్టగానే రాకుండా లోపలేమి చేస్తున్నావు?” అనరిచాడు..
“నేనూ మీలాగే అలిసిపోయి వచ్చాను ఆఫీస్ నుండి.. కాసేపు నడుం వాల్చే యోగం కూడ లేదు నాకు. ఛీ ఖర్మ” అనరిచింది లక్ష్మి..
దానితో వారిద్దరిమధ్య వాదోపవాదాలు అరుపులు హెచ్చుమీరాయి.
ఈ గొడవకి ఉలిక్కిపడి లేచాడు సోనూ..హాల్లోకి వచ్చాడు.. వాడిని చూసిన లక్ష్మి ” ఇందాక వీడి వల్ల నా నిద్ర పాడయ్యింది, ఇప్పుడు మీ వల్ల..అసలు నా చిరాకుకి కారణం వీడే అని సోనూ దగ్గరికి వచ్చి చెంపలు వాయించింది..
” వొద్దు మమ్మీ, కొట్టకు మమ్మీ “అని ఏడుస్తున్నాడు సోనూ. అయినా ఆపకుండా వాడిని కొడుతునే ఉంటే, భాస్కర్ వచ్చి సోనూని లక్ష్మి నుండి అప్పించాడు.
” నువ్వు మనిషివా పశువ్వా? పసి పిల్లాడిని గొడ్డుని బాదినట్టు బాదుతున్నావ్ .నీ నిద్ర కోసం పసివాడిని చంపేస్తావా” అని అరిచి లక్ష్మిని చెంప మీద కొట్టాడు..లక్ష్మి తిరిగి భాస్కర్ చెంప మీద కొట్టింది..
అక్కడినుండి రెచ్చిపోయి ఒకరినొకరు ఇద్దరి చెంపలూ వాయించుకున్నారు..మధ్య మధ్యలో లక్ష్మి సోనూని కూడ కొడుతోంది..ఈ గొడవ చూస్తున్న రత్తాలు సోనూని లాక్కుని గదిలోకి తీసుకుపోయింది.
” నేను చచ్చిపోతా రత్తాలు మమ్మీ కి నేనంటే అసలు ఇష్టం లేదు” అని వెక్కుతూ అన్నాడు సోనూ.
ఆ మాటలకి చాల బాధపడింది రత్తాలు ” ఊరుకో బాబు మమ్మీ ఏదో చికాకులో ఉంది” అన్నది.
“మమ్మీకి రోజూ చికాకే.రోజూ కొడుతుంది నన్ను” అంటూ ఏడుస్తున్నాడు సోనూ.
ఏడుస్తున్న సోనూ ని దగ్గరికి తీసుకుని ఓదార్చి, బుజ్జగించి పడుకోబెట్టింది రత్తాలు.
మరునాడు పొద్దున్న సోనూ కి విపరీతమైన జ్వరం వచ్చేసింది.. కంగారు పడ్డ రత్తాలు వచ్చి లక్ష్మి కి చెప్పింది..
” ఈ మాత్రం జ్వరానికి వాడేమి చావడులే . ఇంద డబ్బు తీసుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళు ” అని రత్తాలు చేతిలో డబ్బు పెట్టింది.
అది చూసిన భాస్కర్ ” ఒసేయ్ పాపిష్టిదానా! కన్నకొడుక్కి జ్వరంగా ఉంటే ఏ మాత్రం ఆత్రం చూపని నువ్వు తల్లివా? ఛీ” అని చేతిలో ఉన్న కాఫీ కప్ లక్ష్మి మీదకి విసిరేసి, ” పద రత్తాలు, బాబుని హాస్పిటల్ కి తీసుకెళదాం” అని సోనూ గదిలోకి వచ్చి, సోనూని ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు.
అక్కడ సోనూని పరీక్ష చేసిన డాక్టర్ ఏమి కంగారు పడొద్దు, భయంతో కూడిన జ్వరం అని చెప్పి మందులు రాసిచ్చి, రెండు రోజులు హాస్పిటల్ లో ఉంచమని చెప్పాడు.. సోనూ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి , పళ్ళూ, ఫ్లాస్కు లో పాలు, మందులు కొనిచ్చి, రత్తాలుని తోడుగా ఉంచి ఇంటికెళ్ళిపోయాడు భాస్కర్. రాత్రంతా సోనూ కలవరిస్తూనే ఉన్నాడు “వద్దు మమ్మీ కొట్టకు మమ్మీ” అంటూ. ఆ రెండు రోజులూ లక్ష్మి కొడుకుని చూడటానికి రాలేదు.
రెండు రోజులు గడిచాక జ్వరం తగ్గాక, సోనూని డిస్చార్జ్ చేశారు. ఇంటికొచ్చిన సోనూ తల్లికి కనపడకుండా భయం భయంగా గదిలోనే ఉంటున్నాడు..జ్వరం తగ్గి స్కూలుకు వెళ్ళడం మొదలుపెట్టాడు..
“ఏమయ్యింది సోనూ ఎందుకు స్కూల్ కి రాలేదు “అని టీచర్ అడిగితే జరిగిందంతా చెప్పాడు.. టీచర్ అతని మాటలు నమ్మలేదు” మమ్మీ నిన్నెందుకు కొడుతుంది నువ్వబద్ధం చెబుతున్నావ్ ” అంది
అప్పుడు సోనూ తన షర్ట్ విప్పి చూపించగా లక్ష్మి కొట్టిన దెబ్బలు వాతలుగా కనిపించాయి.
అయ్యో అనుకుంటూ సోనూని దగ్గర తీసుకుంది టీచర్.
“టీచర్” నాకు హెల్ప్ చెయ్యండి, ప్లీస్ నేను మీతో ఈ విషయం చెప్పినట్టు మా మమ్మీకి చెప్పకండి ” నన్ను చంపేస్తుంది “అంటూ ఏడ్చాడు సోనూ..
“చెప్పనులే సోనూ ఊరుకో” అంటూ ఓదార్చింది టీచర్.
“టీచర్ నన్నెక్కడికైనా పంపించెయ్యండి టీచర్, నేనా ఇంట్లో ఉండలేను” అన్నాడు సోనూ..
“సారీ సోనూ నేనా పనిచెయ్యలేను, నువ్వు ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడి హాస్టల్ లో చేర్పించమను ” అన్నది టీచర్.
తండ్రితో ఈ విషయం మాట్లాడితే తల్లికి తెలిసి తనని మళ్ళీ కొడుతుందని ఊరుకున్నాడు సోనూ..
అ తర్వాత కూడా ఎదో ఒక విషయంలో లక్ష్మి సోనూని చితకబాదుతూనే ఉంది.. తన ఫ్రస్ట్రేషన్ అంతా కొడుకు మీద తీర్చుకునేది..

ఒక రోజు ఇంటికి వచ్చిన లక్ష్మి రత్తాలుని అడిగింది సోనూ ఎక్కడా అని..
“చదువుకుంటున్నాడమ్మా” అన్నది రత్తాలు.
సరే అని తన గదిలోకి వెళ్ళిపోయింది. స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళింది. బకెట్లో నీళ్ళు తిప్పుదామనుకుని టాప్ ముట్టుకోగా షాక్ కొట్టి కెవ్వున అరిచింది.. అరుచుకుంటూ బయటకు వచ్చేటప్పటికి రత్తాలు కంగారుగా పరిగెత్తుకొచ్చింది. “ఏమయ్యింది అమ్మగారు అంటూ”
“టాప్ తిప్పితే షాక్ కొట్టింది రత్తాలు” అన్నది లక్ష్మి.
ఇంతలో భాస్కర్ వచ్చాడు .ఏమయ్యిందో తెలుసుకుని బాత్రూంలోకి వెళ్ళాడు చెక్ చెయ్యడానికి.. అక్కడ ఏదో వయిర్ వదులుగా ఉండటం చూసి దానిని సరిచేసి వచ్చాడు..
“నువ్వెళ్ళి స్నానం చెయ్యి అంతా బానే ఉంది ” అన్నాడు..
సరే అని వెళ్ళి భయం భయంగా టాప్ ఓపెన్ చేసింది లక్ష్మి.. షాక్ కొట్టలేదు.. హమ్మయ్యా అనుకుంటూ స్నానం ముగించి వచ్చింది.
అర్ధరాత్రి ఎందుకో ఊపిరాడలేదు లక్ష్మి కి. ఎవరో గొంతు పిసుకుతున్నట్టు అనిపించింది. ఆ చేతులు విడిపించుకోటానికి గిలగిల లాడింది.. కొంతసేపయ్యాక ఆ చేతులు లక్ష్మి మెడని వదిలేసాయి..దిగ్గున లేచి కూర్చుంది లక్ష్మి. పక్కన గాఢంగా పడుకున్న భర్తని నిద్రలేపింది
” ఏమండీ ఎవరో నా గొంతు పిసికి నన్ను చంపుదామని ట్రై చేశారు అంది”.
ఆ మాటలకి చిరాకు పడ్ద భాస్కర్ ” నువ్వే ఎవరినైనా చంపాలి, నిన్నెవరు చంపుతారు? మాట్లాడకుండా పడుకో” అని కసిరి తను పడుకున్నాడు..
ఆ తర్వాత చాలాసేపు లక్ష్మి నిద్రపోలేదు.
ఇది జరిగిన రెండు రోజులకి పొద్దున్నే బ్రష్ చేసుకుందామని బాత్రూంలోకి వెళ్ళిన లక్ష్మి కెవ్వుమంది.. టూత్ పేస్ట్ వేసుకుందామని తీస్తుంటే అందులోనుండి రక్తం వచ్చింది..భయపడిపోయి విపరీతంగా కేకలు పెడుతు బయటకి వచ్చింది..

ఏమయ్యింది అంటూ అందరూ వచ్చారు..” బాత్రూంలో టూత్ పేస్ట్ నుండి రక్తం వస్తోంది” అంది లక్ష్మి.
” టూత్ పేస్ట్ నుండి రక్తం రావడమేంటి? నీకేమన్నా మతిపోయిందా” అన్నాడు భాస్కర్
“మీరు చూడండి” అని అతన్ని బాత్రూంలోకి తీసుకెళ్ళింది లక్ష్మి..
అక్కడ క్లోసప్ టూత్ పేస్ట్ ను చూసి ” ఇదేనా రక్తం” అనడిగాడు భాస్కర్..
“ఇది కాదు ఇదిక్కడికెలా వచ్చింది? నేను వాడే పేస్ట్ ఇది కాదే” అని అన్నది లక్ష్మి.
“మీరు ఎప్పుడూ వాడే పేస్ట్ ఇదేనమ్మా” అన్నది రత్తాలు.
“నువ్వు నిద్రమత్తులో ఉండి చూసుంటావు, మమ్మల్నందరిని కంగారుపెట్టేసావు” అన్నాడు భాస్కర్.
సోనూ రత్తాలు వెనక దాక్కుని భయం భయంగా చూస్తున్నాడు.
“రత్తాలు సోనూని రెడీ చెయ్యి స్కూల్ కి టయిమవుతోంది “అని చెప్పాడు భాస్కర్.
సోనూని తీసుకుని వెళ్ళిపోయింది రత్తాలు..
ఇది జరిగిన కొన్నాళ్ళకి ఆఫీస్ నుండి లేటుగా వచ్చిన లక్ష్మి , రిలాక్స్ అయ్యి రతాలుని భోజనం పెట్టమంది
“భోజనం టేబుల్ మీద సర్ది పెట్టానమ్మా” అని చెప్పింది రత్తాలు.. రత్తాలు సోనూని నిద్రపుచ్చడానికి వెళ్ళింది.
టేబుల్ ముందు కూర్చుని స్పూన్ తో వడ్డించుకోబోయిన లక్ష్మి కెవ్వుమంది.. ఎదురుగా గిన్నెలో రక్తం, అందులో ఎలకపిల్ల ఉన్నాయి.. అలా కెవ్వు మంటూ నే తన గదిలోకి పరిగెత్తింది.
“ఏమయ్యిందమ్మా” అంటూ పరిగెత్తుకొచ్చింది రత్తాలు.
“రక్తం రక్తం..ఎలకపిల్ల ” అంటూ భయం భయంగా చెపింది లక్ష్మి..
గబుక్కున డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళిన రత్తాలు అంతా చూసి “అక్కడ ఎలకపిల్ల లేదమ్మా , రక్తం కూడ లేదు” అంటూ చెప్పింది.
“లేదు నేను వడ్డుంచుకుందామనే గిన్నెలో ఎలకపిల్లుంది రక్తంలో నేను చూపిస్తా పద ” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళి గిన్నె తీసి “చూడు ఇదిగో రక్తం అందులో ఎలకపిల్ల “అంది లక్ష్మి
“అది ఎలకపిల్ల కాదమ్మా మటన్ కూర, ఆ ఎర్రగా ఉన్నది మసాల” అంటూ గరిటెతో తీసి చూపించింది రత్తాలు..
అయినా నమ్మబుద్ధి కాలేదు లక్ష్మికి. తను ఎలకపిల్లని రక్తంలో కళ్ళారా చూసింది కాని ఇక్కడ మటన్ కర్రీ ఉంది.. ఇదెలాగబ్బా అనుకుంది..
ఈ అరుపులకి సోను లేచాడు, కర్టెన్ చాటున నిలబడి భయం భయంగా చూస్తున్నాడు.
ఇంతలో భాస్కర్ ఆఫీస్ నుండి వచ్చాడు..భాస్కర్ ని చూడగానే సోను “డాడీ” అంటూ పరుగెత్తికెళ్ళి చుట్టేశాడు.
” ఏంటి అందరూ ఇక్కడ సమావేశమయ్యారు” అనడిగాడు భాస్కర్
జరిగిందంతా చెప్పుకొచ్చింది రత్తాలు..
అంతా విన్నాక ” నీకీమధ్య మనసు, మతి నీ దగ్గర ఉండటం లేదు. రోజూ ఏదో ఒకగొడవ చేసి అందరినీ కంగారు పెడుతున్నావు.. చూడు సోనూ ఎలా బెదిరిపోయాడో” అంటూ లక్ష్మిని మందలించి
సోనూ ని తీసుకుని గదిలోకెళ్ళిపోయాడు భాస్కర్.
“డాడీ నాకు భయమేస్తోంది. మమ్మీ ఏంటో అరుస్తుంది, మనింట్లో ఏం జరుగుతోంది డాడీ” అనడిగాడు సోను.
“ఏమి లేదు సోనూ మమ్మీ ఏదేదో ఊహించుకుని భయపడుతోంది .అన్నీ సర్దుకుంటాయిలే నువ్వు పడుకో నాన్న” అంటూ కొడుకుని ముద్దుపెట్టుకున్నాడు భాస్కర్..
“డాడీ ఇవాళ నా దగ్గర పడుకో డాడీ” అన్నాడు సోనూ. అలాగే అంటూ సోనూ పక్కనే పడుకున్నాడు భాస్కర్.
సోనూ పడుకున్నాక తన గదిలోకి వెళ్ళి ” నీ ప్రవర్తన ఈ మధ్య మారింది..నీ ప్రవర్తన వల్ల సోనూ భయపడుతున్నాడు కంట్రోల్ చేసుకో.. లేనిపోనివి ఊహించుకుని రభస చెయ్యకు” అని చెప్పాడు లక్ష్మికి.
“మీరు నా మాట నమ్మడం లేదా? నేను కళ్ళార రక్తం, ఎలక పిల్లని చూసానండీ” అన్నది లక్ష్మి.
సరే నీ మాటే నిజమనుకుందాం కొద్దిసేపు. ఒకవేళ గిన్నెలో ఉన్నది రక్తం, ఎలక అయితే మా అందరికీ ఎందుకు కనిపించలేదు?
“ఏమోనండీ నాకు తెలియడంలేదు మీకెందుకు కనిపించలేదో.. నేను భ్రమ పడ్దానేమో” అనుకుంటూ పడుకుంది లక్ష్మి.
మరునాడు పొద్దున్న ఆఫీస్ కి తయారవుతున్న లక్ష్మి కెవ్వుమంది ..తల దువ్వుకుంటున్న లక్ష్మి హెయిర్ బ్రష్లో ఉండే బ్రిసిల్స్ స్థానంలో గుండుసూదులు ఉండటం వల్ల మాడుకి గుచ్చుకుని విపరీతమైన మంట పుట్టింది. సూదులు గుచ్చుకోవడం వల్ల కొద్దిగా రక్తం కూడ వచ్చింది.. కెవ్వుమంటూ అరుచుకుంటూ హాల్లోకి పరిగెత్తుకొచ్చింది లక్ష్మి.
“ఏమయ్యింది “అంటూ వచ్చాడు భాస్కర్.. జరిగిందంతా భయంగా చెప్పింది లక్ష్మి.
తనే హెయిర్ బ్రష్ తీసుకొచ్చి లక్ష్మికి చూపించాడు, చూడగా అది మామూలుగానే ఉంది..అందులో గుండు సూదులు లేవు.
“రాను రాను నీ వ్యవహారం తలనొప్పిగా ఉంది.. మమ్మల్నందరినీ విసిగిస్తున్నావు.. ముందు డాక్టర్ దగ్గరికి తీసుకువెళతాను నిన్ను” అన్నాడు భాస్కర్.
ఆ సాయంత్రం సైకయాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు భాస్కర్..
స్ట్రెస్స్ వల్ల ఒకోసారి ఇలా జరిగుతుందని, స్ట్రెస్స్ తగ్గడానికి కొన్ని మందులు రాసిచ్చాడు..
కొన్నాళ్ళు ఈ మందులు వాడాలి అని, ఒకవేళ పరిస్థితిలో ఏ మార్పు లేకుంటే , కొన్ని పరీక్షలు చెయ్యల్సి ఉంటుందని చెప్పాడు డాక్టర్.
ఇంటికొచ్చిన లక్ష్మి భోంచేసి, మందులు వేసుకుని పడుకుంది..
అర్ధరాత్రి ఊపిరాడక దిగ్గున కళ్ళు తెరిచింది లక్ష్మి.. అంతా చీకటిగా ఉంది.. తల నల్లటి బట్టతో కప్పేసుంది. ఎవరో గుండెల మీద కూర్చుని లక్ష్మి తలని దిండుతో నొక్కేస్తున్నారు. గిల గిలా గింజుకుంటూ కాళ్ళు చేతులు టప టపా కొట్టుకుంది లక్ష్మి..కొద్దిసేపటి తరువాత ఆ చేతులు నెమ్మదిగా దిండుని తీసేశాయి.. గుండెల మీద భారం దిగిపోయింది.. గబుక్కున లేచి పక్కన గాఢంగా నిద్రపోతున్న భర్తని లేపింది లక్ష్మి.
“ఏంటి లక్ష్మీ ఏమయ్యింది” అనడిగాడు నిద్రమత్తులో ఉన్న భాస్కర్ . ఏమండీ అంటూ ఘొల్లుమంది లక్ష్మి.
“ఎవరో నా గుండెల మీద కూర్చుని నా మొహం మీద దిండుతో నొక్కేశారు అని చెప్పింది
“వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి.లోపలికెవరొస్తారు ” అనడిగాడు భాస్కర్.

“ఏమోనండీ మనింట్లో ఏదో దయ్యం తిరుగుతోందని అనిపిస్తోంది. ”
“దయ్యం లేదు, భూతం లేదు, పిచ్చి అనుమానాలు నీవి.. ఏమి లేదు పడుకో” అని చెప్పి తను పడుకున్నాడు భాస్కర్.
పడుకుంటే ఎక్కడ దయ్యం తనని చంపుతుందో నని పడుకోకుండా రాత్రంతా జాగారం చేసింది లక్ష్మి.
అప్పటినుండి రోజూ దయ్యం ఉంది అంటూ గొడవ చేసేది లక్ష్మి. అన్నం, నీళ్ళు మానేసింది. ఏది తిన్నా రక్తం కనిపించేది.. ఎవ్వరూ తన మాట నమ్మకపోవడంతో తనలో తను మాట్లాడుకునేది. ఒక మానసిక రోగిలా తయారయింది. రోజు రోజుకీ దిగజారుతున్న లక్ష్మి పరిస్థితి చూసి భాస్కర్ ఆమెని మళ్ళా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు..
డాక్టర్ ఆమెకి కొన్ని టెస్టులు చేసి, ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని, అది తగ్గేవరకు ఆమెని హాస్పిటల్లో ఉంచాలని చెప్పాడు. కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంటే నయమవుతుందని ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశాడు భాస్కర్.. అయినా ఆమె పరిస్థితిలో ఏమి మార్పు రాలేదు..
చూడటానికి వెళ్ళిన భాస్కర్ ని, సోనూ ని చూసి భయపడిపోయి వస్తువులు విసిరేసేది.. తోటి పేషంట్స్ ని కూడ కొట్టడం లాంటివి చేసేది.. ఎవరితోను కలవకుండా భయం భయంగా మూల కూర్చునేది..
కొన్నాళ్ళు ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఆమెకి ఇక ఈ వ్యాధి నయమవ్వదని ఆమెని ఇంక మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ లోనే ఉంచాలని తీర్మానం చేశాడు..
ఆమెని హాస్పిటల్ లో చేర్పించి భారమయిన గుండెతో బాధగా తిరిగి వస్తున్నాడు భాస్కర్ వెనక సేట్లో కూర్చున్న సోను వెనక్కి తిరిగి హాస్పిటల్ వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వి పక్కనున్న రత్తాలుకి షేక్ హాండ్ ఇచ్చాడు..రత్తాలు నవ్వుతూ తన బొటను వేలెత్తి చూపించింది.

ఉపసంహారం:

టూత్ పేస్ట్ లో రక్తం, బ్రష్లో గుండుసూదులు ఇవన్నీ ఏర్పాటు చేసింది సోనూ నే… తల్లి అరుచుకుంటూ బయటకు పరుగెత్తినప్పుడు చప్పుడు కాకుండా వెళ్ళి అన్నీ మార్చేసేవాడు..

అలానే రక్తంలో ఎలుక టేబుల్ మీద పెట్టింది రత్తాలే.. లక్ష్మి అరుస్తూ పరిగెట్టాక ఆ గిన్నె మార్చేసి వేరే గిన్నె పెట్టింది.
పడుకునేటప్పుడు భాస్కర్ నీళ్ళల్లో స్లీపింగ్ టాబ్లెట్ వేసిచ్చేది రత్తాలు..అర్ధరాత్రి సోనూ లక్ష్మి గుండెల మీద కూర్చుకి గొంతు పిసుకుతుంటే అతనికి తెలిసేది కాదు . లక్ష్మి పెద్ద పెద్ద అరుపులకి అతను కదిలినప్పుడు సోను మంచం కింద దూరేవాడు.
అలా తనను చిత్రహింసలు గురిచేసిన తల్లిని పిచ్చిదాన్ని చేసి కక్ష తీర్చుకున్నాడు సోనూ..

3 thoughts on “సస్పెన్స్ కధలు: 2 – అమ్మా, నాన్న ఒక బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *