May 9, 2024

కాలం మారిందా?

రచన: సుజల గంటి

ధరణి మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? దీనికి కారణం ఏమిటీ. అన్నిటికీ సర్దుకుపోవడం అన్నది ఎన్నాళ్ళు జరగాలి? సర్దుబాటన్నది భార్యాభర్తలిద్దరి మధ్యా ఉండాలి. కాడికి కట్టిన ఎద్దుల్లా జీవిత భారాన్ని ఇద్దరూ సమానంగా మొయ్యాలి.
ఒక ఎద్దు అలిసినప్పుడు ఇంకో ఎద్దు మిగిలిన భారాన్ని కూడా మొయ్యాలి. ఇది ఇద్దరికీ వర్తించినా అవసరమైనప్పుడు అదనపు భారాన్ని ఎప్పుడూ ఆడదే మోస్తుంది. తప్పించుకుందుకు, సాకులకు ఆమెకు అవకాశం దొరకదు. అమ్మగా ఆమె అలా చెయ్యలేదు కూడా.
“అమ్మా అన్నం పెట్టవా?” అన్న మాటతో ఆలోచనలు ఆపి పక్కన నించున్న కొడుకు వైపు చూసింది. బైటకు వెడతారన్న ధోరణిలో వంట చెయ్యలేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేసి వాడికి పెట్టక తప్పదు. పెద్దవాళ్ళ సమస్యలు వాళ్ళకు అర్ధం కావు.
తల్లి ఆలొచనల్లో ఉండగానే వాడి రూమ్ లో ఉన్న కొత్త డ్రెస్ తెచ్చి, తల్లి చేతిలో పెట్టాడు. అది చూసి వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంది.
“ఇవ్వాళ వద్దమ్మా” అంది.
ఈలోగా అందంగా తన కోసం తీసిన బట్టలు వేసుకుని వచ్చింది ఏడేళ్ళ రజని. “నేను రెడీ” అంటూ.
ఇప్పుడు పిల్లలకు ఎలా నచ్చచెప్పాలి? ఆఖరి ప్రయత్నంగా హేమంత్ గది తలుపు తట్టింది.
“హేమంత్ తలుపు తియ్యి. పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారు. బైటకు వెడదామనుకున్నాము కదా!” అంది
సమాధానం లేదు. ఐనా పిల్లల కోసం మళ్ళీ తలుపు కొట్టింది. పొద్దున్న అనగా తలుపులు బిడాయించుకుని కూర్చున్నాడు.
నాలుగుసార్లు కొట్టాక తలుపు తీసి “ నన్ను డిస్టర్బ్ చెయ్యద్దు” అంటూ తలుపు మళ్ళీ వేసేసుకున్నాడు.
ఒక్కసారి మనసు నొచ్చుకుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు?
“నాన్నగారెందుకు మాతో మాట్లాడటం లేదు అమ్మా?” అని పిల్లలిద్దరూ ఏక కంఠం తో అడిగారు.
వాళ్ళకర్ధమయ్యే భాషలో చెప్పడానికి ఆమె దగ్గర సమాధానం లేదు. కానీ ఏదో చెప్పాలి.
“పాపం నాన్నగారికివ్వాళ చాలా తలనొప్పిగా ఉందిట. అందుకని పడుకున్నారు. మీతో ఆడుకోవాలని ఉన్నా ఆయొచ్చిందిగా అందుకని. ఒక పని చేద్దాం . మనం ముగ్గురం బైటకు వెళ్ళి పిజ్జా తిందామా?” అంది.
పిజ్జా అనగానే పిల్లల కళ్ళల్లో మెరుపు. గబగబా కొడుక్కి బట్టలు మార్చి తను కూడా బట్టలు మార్చుకుని కార్ తాళాలు తీసుకుని బయలు దేరింది.
మర్రే హిల్స్ నించి బయలు దేరి బర్క్లీ హైట్స్ లో ఉన్న మెక్ డొనాల్డ్స్ కి చేరింది. అక్కడ పిల్లల కిష్టమైన చీజ్ పిజ్జా ఆర్డర్ చేసింది. వాళ్ళు తింటుంటే అలా చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. పిజ్జా చూసిన ఆనందంలో తల్లిని పట్టించుకోలేదు వాళ్ళు. అంత వయసు కూడా లేదు.
ఏదో ఊడపొడిచేద్దామని ఇండియాలో ఉన్న జాబ్ వదులుకుని అమెరికా వచ్చారు. వచ్చిన కొన్నాళ్ళు బాగానే ఉంది. మొదటినించీ పని అలవాటు లేని హేమంత్ ఆఫీస్ నించి వచ్చాక టి. వి. కి అతుక్కుపోతాడు. ధరణికి అతను కూడా ఇంటి పనుల్లో సహాయం చేస్తే బాగుంటుందన్న ఆశ.
అప్పుడప్పుడు ధరణి వెనక పడితే చేస్తాడు. రెండుసార్లు ఏదైనా చేస్తే నేను అలిసిపోయానంటాడు. అలసట అతనికేనా? తనకు మాత్రం లేదూ?
ఏవైనా అంటే చిన్నప్పటినించీ నాకు పని అలవాటు లేదంటాడు.
ఆ మాట కొస్తే తనకూ అలవాటు లేదు. అమ్మ ఎప్పుడూ ఏ పనీ చెప్పలేదు. ఐ. ఐ. టి. లో చదువుకుందుకు వెళ్ళినప్పుడు హాస్టల్ జీవితం. పెళ్ళయ్యేదాకా టీ పెట్టడం తప్ప మరేమీ చేత కాదు. ఇండియా లో ఉన్నప్పుడు అమ్మ, పనివాళ్లు ఉండడం తో హాయిగా గడిచిపోయింది.
అమెరికా రావాలన్న కోరిక కూడా హేమంత్ దే. తనకంత పెద్దగా ఇష్టం లేదు. ముందు ఇష్టపడక పోయినా ఇక్కడ ఆఫీస్ లో వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి. పిల్లల కోసం అప్పుడప్పుడు ఇంటినించే పనిచేస్తుంది.
ధరణి ఏదైనా ఒకసారి అనుకుంటే ఆ పని అయ్యేదాకా నిద్ర పోదు. అది ఇంటి పని ఐనా ఆఫీస్ పని ఐనా సరే. అదే ఆమెను ఉద్యోగం లో ముందుకు తీసుకు వెళ్ళింది.
రజని ఇండియాలో ఉండగానే పుట్టింది. కొడుకు ఇక్కడకు వచ్చాక పుట్టాడు. వాడికి మూడేళ్ళు వచ్చేదాకా అత్తగారూ, తల్లీ వచ్చి సహాయం చేసారు. ఆ తరువాత తానే చూసుకోవాలని నిర్ణయించుకుంది.
వర్క్ టెన్షన్ నించి రిలాక్స్ అవడానికి పిల్లలు చక్కని అవకాశం. వాళ్ళ ముద్దు మాటలు, ఆటపాటలతో అన్నీ మర్చిపోవచ్చని నమ్ముతుంది ధరణి.
ఆ రోజు వాళ్ళ మారేజ్ డే. ఈ రోజు ఆనందంగా గడపాలని నెలనించి ఎంతో ప్లాన్ చేసుకుంది. ధరణి, హేమంత్ ల పెళ్ళయ్యి ఆ రోజుకు సరిగ్గా పదేళ్ళయ్యింది. ముచ్చటగా ఇద్దరు పిల్లలు. ధరణి, హేమంత్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే.
పిల్లల కోసమని ఇంటినించే పనిచేస్తుంది ధరణి. ఐనా కొన్నిసార్లు టూర్ లకు వెళ్ళక తప్పదు. అలా వెళ్ళినప్పుడు ధ్యాస పిల్లల మీదే ఉంటుంది. పిల్లలు వేళకు అన్నం తిన్నారో లేదో అన్న బెంగ . పిల్లలు నెగ్లెక్ట్ అవుతున్నారేమో అనిపించినప్పుడల్లా ఉద్యోగం మానెయ్యాలనుకుంటుంది. ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళు రెండు నావల్లో ప్రయాణం చెయ్యడమే. రెండూ బేలెన్స్ చెయ్యాలంటే చాలా కష్టం. అటు ఉద్యోగం ఇటు అమ్మ బాధ్యత రెండూ సమంగా నిర్వర్తించాలంటే ఎంత కష్టమో! అమ్మమ్మ లూ నాన్నమ్మలూ వచ్చి సహాయం చేసినా తల్లిగా తన బాధ్యత పూర్తిగా విస్మరించలేదు.
ఇవన్నీ కాక ఆఫీస్ టెన్షన్స్, టార్గెట్స్, ప్రమోషన్స్, లేట్ నైట్ వర్కింగ్ అవర్స్. వీటన్నిటితో ఇల్లు కూడా మానేజ్ చెయ్యాలంటే కత్తి మీద సాములాంటిదే. ఉద్యోగస్థురాలైన భార్య ఉన్నప్పుడు మగవాడు కూడా సగం బాధ్యత పంచుకోవాలి.
అలా పంచుకునే మగవాళ్ళ శాతం ఇప్పటికీ తక్కువనే చెప్పాలి. ఆఫీస్ టెన్షన్స్ నించి తప్పించుకుందుకు మార్గం ఒకటి రెండు పెగ్గులు వేసుకుని పడుకునే మగవాళ్ళు కొంత మంది. వాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నా ఆడది తన టెన్షన్ నించి బైటపడడానికి మందుని ఆశ్రయించలేదు. మనుషులందరూ సమానమైనప్పుడు సమస్యలు కూడా అంతే కదా! ఆడా, మగా అనేముంది. ఇంకా ఆడవాళ్ళకు సమస్యలెక్కువే కానీ తక్కువ కాదు కదా!
హేమంత్ ప్రవర్తన ఇలా మారడానికి కారణం వారం క్రితం ధరణికి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వచ్చింది. ఇటు పిల్లలు, ఆఫీస్ బాధ్యతలు ఇంటి పని అన్నీ చేస్తూ కూడా ఆమె ఉద్యోగంలో కూడా తన పని చక్కగా చేస్తోంది. ఇదివరకే ఈ పోస్ట్ ఆఫర్ చేసినా రెండు సార్లు రిజెక్ట్ చేసింది. కానీ ఈ సారి ఇంక బాగుండదని ఒప్పుకుంది.
ఇంటికి రాగానే సంతోషంగా ఈ విషయం అతనితో చెప్పింది. హేమంత్ కి మనసులో ముల్లు గుచ్చుకున్న భావన.
అవేమీ గ్రహించని ధరణి “ హేమంత్ మన మారేజ్ డే కి ముందు మనకి మంచి గిఫ్ట్ దొరికింది కదా! ఈ సారి చాలా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుందాము. మన పెళ్ళయ్యి అప్పుడే పదేళ్లయిపోయింది. కాలం ఎంత తొందరగా పరిగెడుతోందో కదా!”అంది.
స్వతహా హేమంత్ చెడ్డవాడు కాదు. కానీ కొన్నిసార్లు అతనిలోని మేల్ ఈగో అతన్ని జయిస్తుంది. అలాంటి తరుణంలో అతను కూడా మామూలు మగాడిలా ప్రవర్తిస్తాడు. అతనికిష్టం లేనప్పుడు ఇంటి పనులు కూడా బాగానే తప్పించుకుంటాడు.
లాప్ టాప్ ఒళ్ళో పెట్టుకుని సుడుకో(suduko) ఆడుకుంటూ ధరణి ఏదైనా పని చెపితే “ చూడటం లేదా! నేను ఆఫీస్ పని చేసుకుంటున్నాను”అంటూ తప్పించుకుంటాడు.
నిజం తెలిసినా రాద్ధాంతం ఎందుకని ధరణి మాట్లాడదు. కానీ ఈ మధ్య విసుగు వస్తోంది. ఎంత సేపూ తానే ఎందుకు సర్దుకుపోవాలి? సంసారం పట్ల అతనికి బాధ్యత లేదా! ఇంకా అమ్మమ్మల కాలం లో లాగా ఆడదే అన్ని పనులూ చెయ్యాలనుకోవడం ఎంతవరకు సమంజసం?
ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు డబ్బులు బాగా దొరుకుతాయని అందరూ ఇందులో దూరుతున్నారు. ఇండియా లో ఉండి అమెరికా కంపెనీకి పని చేసినా అమెరికాలో ఉండి, కస్టమర్ ఇండియన్ అయినా కాలమానాలు వేరవడం తో వచ్చే ప్రాబ్లెమ్స్ ఫేస్ చెయ్యక తప్పదు.
ప్రమోషన్ వచ్చిందని ఎంతో ఆనందంతో చెప్పింది. ఐనా అతను తన ఆనందాన్ని చాలా కాజుయల్ గా కంగ్రాట్స్ అన్నాఒక్క ముక్క తో తేల్చెసాడు. ధరణి ఎంతగానో ఊహించుకుని వచ్చింది. హెమంత్ ఆనందంగా కౌగలించుకుని చిన్న ముద్దు తో తన ఆనందాన్ని వ్యక్త పరుస్తాడని ఆశించిన ఆమెకు నిరాశే మిగిలింది.
భర్త అభివృద్ధిని భార్య సంతోషంగా పంచుకున్నప్పుడు అంతే ఆనందం ఆమె అభివృద్ధి పట్ల కూడా వ్యక్తం చేస్తే బాగుంటుంది కదా! అన్న ఆలోచన వచ్చినా తనకు రానిది భార్యకు రావడాన్ని అతని మేల్ ఈగో ఒప్పుకోవటం లేదని అర్ధమయ్యింది
మగవాడి తో సమానంగా అన్ని పనులూ ఆడది చేస్తున్నప్పుడు వంట, పిల్లల్ని పెంచడం ఆడదే చెయ్యాలన్న నియమేమిటీ? ఎక్కడో కొంత మంది మొగవాళ్ళు ఉద్యోగస్థురాలైన భార్య తో సమానంగా ఇంటి బాధ్యతలు, పిల్లల పెంపకం పంచుకుంటున్నారు. కానీ దాని శాతం తక్కువనే చెప్పాలి. ఏదైనా వస్తే మొగవాడు దులిపేసుకుని వెళ్ళిపోయినట్లుగా ఆడది వెళ్ళలేదు.
ఈ ప్రమోషన్ ఏదో తమ పెళ్ళి రోజయ్యాకైనా వచ్చి ఉంటే బాగుండేది. కనీసం ఈ రోజు ఆనందంగా గడిచేది.
“మమ్మీ వియ్ ఫినిష్డ్ “అన్న పిల్లల మాట తో ఈ లోకంలోకి వచ్చింది ధరణి.
“సరే ఇంటికి వెడదామా?” అంది.
“అమ్మా నువ్వేమీ తినలేదు కదా!” అంది కూతురు.
“నాకాకలిగా లేదమ్మా?” అంది.
ఇంటికొచ్చేసరికి టోస్టర్లో బ్రెడ్ కాలుస్తూ కనబడ్డాడు హేమంత్.
ధరణి మనసు ఉసూరుమంది. పొద్దుటినించీ ఏమీ తినకుండా తలుపులు వేసుకు కూర్చున్నాడు. మంచి నీళ్ళు కూడా తాగాడో లేదో? ఆకలేస్తున్నట్లుంది.
“అరె బ్రెడ్ ఎందుకు? నీకిష్టమని పిజ్జా తెచ్చాను” అంది.
సమాధానం ఇవ్వకుండా టోస్టర్ లో ఉన్న బ్రెడ్, పాంట్రీ లోంచి కార్న్ ఫ్లేక్స్ తీసుకుని ఒక కప్పులో పోసుకుని, పెరుగు వేసుకుని అన్నీ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు.
గట్టిగా ఏడవాలనిపించినా, పిల్లల ముందు ఏడవలేక, వస్తున్న కోపాన్ని దిగమింగి, తెచ్చిన పిజ్జాని డస్ట్ బిన్ లో పారేసింది. ఆకలెస్తున్నా ఆ పిజ్జా ఎందుకో తినాలనిపించలేదు.
నిద్రకు జోగుతున్న కొడుకును తీసుకుని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. కాళ్ళకున్న బూట్లు తీసి బట్టలు మార్చి నైట్ సూట్ వేద్దామనుకుంది. అప్పటికే నిద్రలోకి జారిపోయాడు వాడు. ఇంక ఇప్పుడు మార్చడానికి ప్రయత్నిస్తే వాడి ఏడుపు భరించడం కష్టం. అందుకే వాణ్ని అలాగే పడుకోబెట్టి కంఫర్టర్ కప్పింది. రజని చెప్పకుండానే తన బట్టలు మార్చుకుని బంక్ బెడ్ మీద తన బెడ్ మీద కెక్కి పడుకుంది.
పిల్లలు పడుకున్నాక తమ బెడ్ రూమ్ తలుపు తెరుస్తాడేమో అన్నట్లుగా చూసింది. బెడ్ రూమ్ తలుపులు తీసి ఉన్నాయి. మరైతే ఎక్కడకు వెళ్ళాడు హేమంత్ అన్న అనుమానం వచ్చింది.
కింద బేస్ మెంట్ లో టి. వి. ఉంది. అక్కడికెళ్ళి కూర్చుని ఉంటాడు. ఐనా చూద్దామని మెట్లు దిగి కిందకు వెళ్ళింది. ఏదో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నాడు. శబ్దం చెయ్యకుండా పైకి వచ్చి మంచం మీద వాలింది
ఏమిటో ఈ జీవితాలు. అమ్మలనాడు వాళ్ళకు సౌకర్యాలు లేక కష్టపడ్డారనుకున్నా అన్ని సౌకర్యాలూ, చేతి నిండా డబ్బు ఉన్నా తమ జీవితాల్లో ఉన్న చీకటి ఎవరికైనా కనబడుతుందా! ఆధునిక జీవితాలన్నీ ఇంతేనా? లేక తమ దాంపత్యమే ఇలా ఉందా!
పోనీ ఉద్యోగం మానేద్దామన్నా తాత ముత్తాతలిచ్చిన ఆస్థిపాస్తులేం లేవు. పిల్లల భవిష్యత్తుకూ తమ జీవిత చివరి కాలానికీ కూడా డబ్బు కూడ బెట్టాలి. ఇండియా లో ఉంటే తల్లితండ్రుల సపోర్ట్, పనివాళ్ళ సపోర్ట్ ఉంటాయి. ఇక్కడ దానికీ కరువు. పెద్దవాళ్ళు సహాయం చేద్దామని వచ్చినా ఎక్కువ కాలం ఉండడానికి లేదు.
అలా ఆలొచనల్లోంచి నిద్రలోకి జారుకుంది ధరణి. రేపు ఆఫీస్ కి వెళ్ళాలి. రజనిని స్కూల్లో దింపి, పిల్లవాడ్ని డేకేర్లో దింపి అప్పుడు ఆఫిస్ కి వెళ్ళాలి. అందరి కడుపులూ నింపడానికి సన్నాహాలు కూడా చెయ్యాలి. వారానికొక్కసారి వచ్చి వంట చేసే అమ్మాయి వంట తినలేక మానిపించినప్పటినించీ మరీ పనెక్కువ అయిపోయింది
టి. వి. చూస్తున్నాడే కానీ హేమంత్ మనసు కూడా అల్లకల్లోలంగా ఉంది. తన అలజడిని కప్పి పుచ్చడానికి భార్యా బిడ్డలనించి తప్పించుకుందుకు వాళ్ళను అవాయిడ్ చేస్తున్నాడు. తను చేస్తున్నది తప్పని తెలుసు. కానీ ధరణికి తనకన్నా ముందు ప్రమోషన్ రావడాన్ని తను తట్టుకోలేక పోతున్నాడు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడని ఎవరైనా అడిగితే తన దగ్గర సమాధానం లేదు.
ఒక వారం క్రితం తమ మారేజ్ డే ఎంతో ఆనందంగా గడుపుదామని ధరణి ఎంత ప్లాన్ చేసింది? పిల్లలకు కొత్త బట్టలు, తమిద్దరికీ కొత్త బట్టలు కొంది. కేక్ కి ఆర్డర్ ఇచ్చింది. కానీ తన బిహేవియర్ తో అందర్నీ కష్టపెట్టాడని తెలుసు. కానీ ఎందుకిలా అంటే కారణం చెప్పలేడు.
అమ్మ కూడా ఉద్యొగం చేసింది. కానీ అప్పటి ఉద్యోగాలకీ ఇప్పటి ఉద్యోగాలకీ చాలా తేడా ఉంది. టీచర్ ఉద్యోగస్థులకు వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఫామిలీని చూసుకుందుకు వీలుగా ఉండేవి. గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసేవాళ్లకు కూడా నిర్ణీత సమయాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు తాము చేసే ఉద్యోగాల్లో నిర్ణీత సమయాలు లేవు. టెక్నాలజీ డెవెలప్ అవడంతో సుఖాలతో బాటు కష్టాలు కూడా పెరిగాయి. దేశ విదేశాలతో పనిచేస్తున్నప్పుడు టైమ్ డిఫరెన్స్ నికూడా పరిగణించాలి. ఇలాంటి
వాతావరణంలో పనిచయ్యడానికి ఎంతో ఆత్మ సంయమనం కావాలి. ప్రాజెక్ట్ వర్క్ తో, ఉద్యోగం లోని టార్గెట్స్ తో బుర్ర వేడెక్కిపోతుంది.
అలాంటి సమయాల్లో తానైతే ఎప్పుడో అప్పుడు ధరణి మీద, పిల్లల మీద విసుక్కుంటాడు.
కానీ ధరణి ఆఫీస్ పనిని కానీ దానితో వచ్చే సమస్యల్ని కానీ ఈ రోజు దాకా ఇంటి పరిసరాలకి రాకుండా చూసుకుంది. తను ధరణి లా ఎందుకు చెయ్యలేడు? మగవాడినన్న అహంకారమా? దేనిలో తాను గొప్ప? చదువు ఇద్దరూ సమానంగానే చదివారు
ఐనా ధరణికి ముందు ప్రమోషన్ వచ్చిందంటే అది ఆమె ప్రతిభే కదా! తనకి ప్రమోషన్ ముందు వచ్చి ఉంటే ధరణి ఇలా ప్రవర్తించి ఉండేదా? ఎప్పటికీ కాదు.
మారదు మారదు మగవాడి తత్వం మారదు అన్నది తను ఈ రోజు నిరూపించాడు. హేమంత్ ఆలోచనలు పూర్తి అయ్యేసరికి డేట్ మారింది.
గడిచిపోయిన కాలాన్ని వెనక్కు తీసుకు రాగలడా? ధరణి కోరుకున్న కోరికను ఇప్పుడు తీర్చినా ఆమె మనసులో గుచ్చిన ముల్లుతో అయిన గాయానికి మందు ఉందా?
ఇకమీదట ఇలా జరగకుండా ఉండడానికి ప్రయత్నించ గలడా?
గతజల సేతు బంధనం………. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *