April 28, 2024

నేను అమ్మనయ్యాను!

రచన: వడ్లమాని బాలా మూర్తి.

“నువ్వు గొడ్రాలివి… నువ్వు గొడ్రాలివేనే మహాతల్లీ ఏం పాపం చేసుకున్నామో మా పాలిట పడ్డావు. నాకా వీడొక్కడే, వీడికో నలుసైనా పుడుతుందా అంటే, నీ కడుపు పండదాయే..ఖర్మ…… నువ్వు గొడ్రాలివి……. గొడ్రాలివి…… గొడ్రాలివి……..”
“అబ్బా” అని రెండు చెవ్వులూ మూసుకుంది రమావాణీ. గత రెండు సంవత్సరాలై ఇదే తంతు. ఏడాది దాటింది తానూ శేఖర్ విడిపోయి. డైవోర్స్ కూడా వచ్చేసింది. కానీ అత్తగారి శాపనార్ధాలు ఇంకా చెవులో గింగుర్లాడుతూనే ఉన్నాయి. అబ్బా తల బద్దలైపోతోంది అని అనుక్కుంటూ బాల్కని నించి లేచొచ్చి కిచెన్లో కెళ్లి ఓ కప్పు కాఫీ కలుపుకొని సోఫా లో రిలాక్స్డ్ గా కూర్చుంది.
అమ్మ కూడా లేదు. తిరిగి గతంలోకి వెళ్ళిపోయింది.
శేఖర్ మంచివాడే కానీ తల్లికి ఎదురాడలేడు. ఎంతమంది డాక్టర్లని కలిసారో. అందరూ ఏ ప్రాబ్లం లేదు తప్పకుండా మీకు సంతానం కలుగుతుందన్నవారే! అప్పటికీ తన చిన్ననాటి స్నేహితురాలు డా. సుధా దగ్గరికి వచ్చి చెక్ అప్ చేయించుకుంది. అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఒక్కసారి శేఖర్ని కూడా రమ్మను చెక్ చెయిద్దామంది. ఎన్నిసార్లు చెప్పినా అతడు మాట దాటవేసే వాడు తప్ప చెకప్ కి రాలేదు. అత్తగారి సాధింపూలూ శాపనార్ధాలూ ఎక్కువై పోయాయి. అతడు నిస్సహాయంగా ఉండిపోయేవాడు. ఇదంతా భరించలేక విడిపోదామని నిర్ణయానికొచ్చేరు. ఇదంతా జరిగి అప్పుడే రెండేళ్ళవుతోంది.
“తల్లిని కాలేదన్న విషయం తననీ కాల్చేస్తోంది. ఒక ఆడదానికి మాతృత్వం ఒక వరం. తనను తానూ ప్రూవ్ చేసుకోవాలి. ఎలా? ఒక్క అనుభవంతో ఇంక ఏ మగవాణ్ణీ నమ్మలేదు! పెళ్ళి అనే ఝంఝాటంలో పడలేదు! ఏదో చెయ్యాలి. కొన్నాళ్ళ క్రితం ‘వీక్ ‘ పత్రికలో సరోగసీ (surrogacy) గురించీ చదివింది. అది కాకుండా ఇంటర్నెట్ లో దొరికిన సమాచారం అంతా క్షుణ్ణంగా చదివింది. అంటే గర్భాన్ని అద్దెకివ్వడం అన్నమాట. తన మనస్సు ఇటువైపే మొగ్గుతోంది. అప్పటినుండి దానిగురించే ఆలోచిస్తోంది. డా. సుధతో ఈ విషయం పై విస్తృతంగా చర్చించింది. ఆ రోజు సుధ చెబుతూనే ఉంది ” రమా నువ్వు అనుక్కున్నంత సులభం కాదు. సాంఘికంగా దీనికి ఇంకా. అంత గుర్తింపు రాలేదు. అందరూ రకరకాలుగా విమర్శిస్తారు. అందరి విమర్శలు ఎదుర్కొనే గుండె ధైర్యం ఉండాలి. అంతదాకా ఎందుకు మీ అమ్మకే నచ్చకపోవచ్చు. అయినా మనం అనుకున్నప్పుడే చాన్స్ రాకపోవచ్చు. ఇంకొకటి అసలు పిల్లలే పుట్టని స్త్రీని ప్రిఫర్ చెయ్యకపోవచ్చు.”
“ నువ్వు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించాను సుధా! నాకు సరోగసీ ఒకటే సొల్యూషన్ అని అనిపిస్తోంది. చాన్స్ కోసం నేను వెయిట్ చేస్తాను. నేనేమీ అవినీతికరమైన పని చెయ్యడం లేదు, ఏ తప్పు చెయ్యడం లేదు. నేను చేస్తున్న పని నా మనస్సాక్షికి నచ్చినది. ఈ రకంగా నేనింకో సంతానం లేని దంపతులకి ఆనందాన్ని కలిగిస్తాను. దీనివల్ల మా ఇద్దరి కోరికలూ తీరుతాయి. ఇక్కడ కాకుండా దూరంగా, ఎవరికీ తెలియని వేరే ఇంకో రాష్ట్రంలో అయితే కుదురుతుందేమో చూడు సుధా.” అని రిక్వెస్ట్ చేసి వచ్చేసింది.
వాణీ భర్త నించి విడిపోయి వచ్చినప్పటినుండి, ఆమె తల్లీ శ్యామలకి ఆమె గురించీ బెంగ పెట్టుకుంది. చిన్నప్పుడే తన భర్త పోవడంతో, పదేళ్ళ వాణిని పెంచి పోషించడం కోసం శారదగారి దగ్గర గవర్నెస్ గా చేరిపోయింది. ఆవిడ మన్ననకు పాత్రురాలైంది. శారద కూడా ఇంటినీ, పిల్లలిని నిశ్చింతగా శ్యామల మీద వదిలి తన ఉద్యోగము, సోషల్ సర్వీసు చేసుకొనేది. ఇరవై ఏళ్ళై, శ్యామల వాళ్ళింట్లో మనిషిలాగా మెలగ సాగింది. శారద కూడా శ్యామలకి సుఖదు:ఖాలలో, అండదండగా నిలిచింది. రమావాణి పెద్దదై ఉద్యోగం చెయ్యడం మొదలు పెట్టాక, శ్యామల ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండసాగింది. అప్పు డప్పుడు శారదా వాళ్ళింటికి వెళ్ళి, కలిసి వస్తూంటుంది.
“ఇంకా అమ్మ రాలేదు. తొందరగా వచ్చెయ్యమని మరీమరీ చెప్పి పంపింది. ఈ మధ్య అమ్మకి, అప్పుడప్పుడు ఎడం చెయ్యి పీకడం, కొంచెం ఆయాసంగా ఉండడం మొదలైంది. అన్ని టెస్టులు చేయించింది. రిపోర్టులు రాగానే చెబుతానని డా. సుధా చెప్పింది. తనూ వస్తాననీ ఇంకా రాలేదు. ఇంతట్లోకి డోర్ బెల్ మోగింది. ” అమ్మ వచ్చేసినట్లుంది” అని అనుక్కుంటూ తలుపు తీసింది. “హలో! ఎలా ఉన్నావు” అంటూ వంశీ లోపలకోచ్చేడు.
“రా రా వంశి. అరే నాని బాబు కూడా వచ్చేడా?” అంటూ ఆరు నెలల నానినీ ఎత్తుకుని, “ఏమిటి విశేషం ఈ టైములో వచ్చేవు”?
“ఎం లేదు వీడు ఒకటే ఏడుస్తూ అమ్మని హైరానా పెట్టేస్తున్నాడు. ఆవిడ సంభాళించలేక పోతోంది. బయట చల్లగా ఉంటుందనీ తిప్పేందుకు తీసుకు వచ్చేను. నిన్ను చూసి చాల రోజులైంది చూసి పోదామని వచ్చాను. ఏమిటీ చాలా డల్ గా కనిపిస్తున్నావు? మళ్లీ ఆలోచిస్తూ కూర్చున్నావా?”
“ఏదో పనిలేక ఆలోచనలు.”
“నానిగాడు బాగా అల్లరి చేసేస్తున్నాడు. అమ్మ చూసుకోలేక పోతోంది. నన్ను పెళ్ళి చేసుకొమ్మని గొడవ చేస్తోంది. కమల పోయి ఇంకా ఆర్నెల్లు కుడా కాలేదు. ప్రస్తుతానికి నాకా ఉద్దేశం లేదు. బాబుని చూసెందుకు ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తున్నాను.”
“ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం, కాఫీ తాగుతావా?”
“ఇప్పుడేం వద్దు వాణీ. ఆలస్యం అవుతోంది. ఇంకో రోజు వస్తా.” అని వంశి వెళ్ళిపోయాడు.
వంశి తన చిన్ననాటి మిత్రుడు. తనకంటే రెండేళ్ళు పెద్ద. స్కూల్ కి తీసుకెళ్ళడం దగ్గర్నించీ, తెలియని పాఠాలు చెప్పడం దాకా ప్రతీదీ చేసిపెట్టేవాడు. ఏ చిన్న కష్టం వచ్చినా, సంతోషమైనా అతనితోనే చెప్పుకునేది. ఏ కాలేజ్ లో చేరాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో అనే సలహా తీసుకుంది. తానూ శేఖర్ ని పెళ్ళి చేసుకోబోతున్నట్లు కూడా అతనితోనే షేర్ చేసుకుంది. పాపం ఈ మధ్యే అతని భార్య పురిట్లో పోయింది. చంటిపిల్లాడితో అవస్త పడుతున్నాడు…..”అని ఆలోచిస్తుంటే, సెల్ మోగింది.
” హలో!”
“హలో రమా! నేను సుధని. ఇప్పుడే బయలు దేరాను, పావుగంటలో అక్కడ ఉంటా. కాఫీ రెడీ ఉంచు, వచ్చేస్తున్నా. ”
> “రా సుధా! ఇంత లేట్ అయింది, క్లినిక్ నుంచేనా ? ”
“అమ్మయ్య! నీ కాఫీ బాగుందే. ఇవాళ ఒకటే రష్ అనుకో. లాస్ట్ పేషంట్ వెళ్ళగానే ఇటోచ్చేసాను. అమ్మ రిపోర్ట్స్ వచ్చేయి, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నట్లుంది. కంగారు పడేదేమీ లేదు. వేరే టెస్ట్ లు చేయిద్దాము. డా. విక్రంతో మాట్లాడాను. రేపు పొద్దున్నే అమ్మని తీసుకోచ్చేయ్యి. నేను బయలుదేరుతాను. అన్నట్లు అమ్మ ఏదీ?”
“శారద గారింటికి వెళ్ళింది. ఆవిడ ఉండి పొమ్మన్నారట రేపు వస్తానంది. నేను పొద్దున్నే తీసుకొస్తా!”
“ఓకే బై. గుడ్ నైట్.”
డా. విక్రం దగ్గర అన్ని టెస్టులు చేయించుకున్నాక ఆవిడకీ హార్ట్ లో బ్లాకేజేస్ ఉన్నాయనీ తేలింది. హార్ట్ ఆపరేషన్ చేయడం అనివార్యమని చెప్పేరు. అప్పటిదాకా కొన్ని మందులు వాడమనీ చెప్పి పంపేరు. డా. సుధ కూడా వాళ్ళని భయపడనక్కర లేదని ధైర్యం చెప్పింది. రమని ఆపరేషన్ కోసం అయ్యే ఖర్చు సర్దుబాటు చేసుకోమని సలహా ఇస్తుంది. రమావాణికీ ఈ పరిస్తితుల్లో ఏమి చెయ్యాలో పాలు పోకుండా ఉంది. అంత ఖర్చు ఎలా సమకూర్చు కోవడం, అనే సందిగ్ధంలో పడింది. “ఎలాగో అలాగ సర్దుబాటు చేద్దాంలే రమా దిగులు పడకు” అని డా. సుధ ధైర్యం చెబుతుంది.
వెంఠనే బయలుదేరి రమ్మని కబురు వస్తే, సుధ క్లినిక్ కి బయలుదేరుతుంది రమ.
“హల్లో రమావాణిగారా దయచేయండి! పిలిస్తే గాని తమ దర్శనాలు కావు!”
“ఏమిటోయ్ సుధా ఇవాళ చాలా ఫ్రీగా ఉన్నట్లున్నావూ! ఏమిటి స్పెషల్గా, రమ్మని పిలిచావు! ఏమిటో విశేషం?”
“ఉండుండు నాగమ్మగార్ని కాఫీ తెమ్మంటాను, తర్వాత తీరుబడిగా కబుర్లు.”
“కఫీ బాగుంది సుధా. ఇంక తొందరగా విషయం ఏమిటో చెప్పు.”
“నీకు కావాలన్న రెండూ కుదిరేట్టు ఉన్నాయి. టూ బర్డ్ స్ అట్ వన్ షాట్ అన్నట్లు.”
“దేనిగురించీ?”
“అమ్మకీ హార్ట్ ఆపరేషన్ అండ్ నీ సరొగసీ గురించీ.” “నిజమా?!”
“అవును, నా క్లాస్మేట్ డా. దమయంతి, మైసూర్ లో లీడింగ్ గైనకాలజిస్ట్. తన పేషంట్, మైసూర్ రాజా ఫ్యామిలీకి చెందిన దంపతులు. వాళ్లకి పెళ్ళయి ఆరు సంవత్సరాలైనా పిల్లలు లేరు. వాళ్ళకీ ఒక ఆరోగ్య వంతమైన ముప్పైఐదు సంవత్సరాల్లోపు ఉన్న యువతి సర్రోగేట్ మదర్ గా కావాలట. ఈ విషయం చాలా గోప్యంగా ఉంచాలనీ వేరే రాష్ట్రపు యువతిని ప్రిఫర్ చేస్తున్నామని డా. దమయంతి చెప్పింది. వాళ్ళు ఎంతైనా పే చేసేందుకు తయ్యారుగా వున్నారట. మరి ఏం అంటావూ?”
“ఎంత మంచి న్యూస్ ఇచ్చేవే సుధ. ఐ అమ్ వెరీ హ్యాపీ. ఉం…ఈ ప్రపోజల్ ని కాదనే ప్రసక్తే లేదు. కానీ, నేను సరోగసి కోసం ఏమి పేమెంట్ తీసుకోను. అదీ కాకుండా నాకు కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకోవాలీ.”
“చూడు రమా! పేమెంట్ తీసుకోవడం గురించి నీ ఆలోచన సరైంది కాదు. అమ్మ ఆపరేషన్ గురించి ఆలోచించావా?” “అవును అదీ పాయింటే. ఏం చేద్దామంటావు?”
“ఆపరేషన్ ఖర్చు వాళ్ళే పెట్టుకోవాలని చెబుదాం. వాళ్ళు ఏదైనా పే చేస్తే మాట్లాడకుండా తీసుకో. ఏమీ డిమాండ్ చెయ్యకు. నేను ముందు దమయంతితో మాట్లాడేక నీకు ఏ సంగతీ చెబుతాను.”
మరో వారానికి అన్ని విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. డా దమయంతి ద్వారా తనకున్న అనుమానాలు తీర్చుకుని, ప్రయాణానికి సిద్ధమైంది రమ. బంధువులకీ, స్నేహితులకీ, హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. ఇంటిని చూసుకునే బాధ్యత వంశికీ అప్పచెప్పి, మైసూర్ కి వచ్చి చేరారు తల్లీ కూతుళ్ళు.
శ్యామలనీ అక్కడి హాస్పిటల్ లో చేర్చి అన్నీ చెక్ అప్ లు చేసి వెంఠనే ఆపరేషన్ కీ తీసుకెళ్ళారు. ఈ నాలుగు రోజులై ఏమౌతుందో అనే ఆత్రుతతో గడిపింది రమ. డా. దమయంతి వచ్చి ఆమెకు ధైర్యం చెప్పి రోజు చూసి వెళ్ళేది. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగిందని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పాక, కొంచెం స్థిమితంగా కూర్చుని గత పదిహేను రోజులై జరిగినవి నెమరు వేసుకుంటూ కూర్చుంది రమ.
ఎంత ఆత్రుత పడుతూ వచ్చిందో! వచ్చే ముందు వంశీకీ తానూ ఎందుకు వెడుతోందో వివరించింది. “నిజంగా నువ్వు ఇలాంటి నిర్ణయం తిసుకోవాలంటావా వాణీ? నన్ను పెళ్ళి చేసుకో. నిజం చెబుతున్నాను. నిన్ను మొదటినుండి నేను ప్రేమించాను, నాకు ఉద్యోగం దొరకగానే నీకు చెప్పి నిన్ను పెళ్ళి చేసుకుందామనుక్కున్నాను, అంతలోనే నువ్వు శేఖర్ ని వివాహం చేసుకుంటున్నానని చెప్పేవు. అందుకే చాలా రోజులు నేను పెళ్ళి తలబెట్టలేదు. ఇప్పుడు నేను నిన్ను వదులుకోలేను. ప్లీజ్ ఆలోచించుకో.”
“వంశీ ! నేను అమ్మనౌతే తిరిగి వచ్చేక నిన్ను తప్పక వివాహం చేసుకుంటాను. నేను కనుక గర్భవతిని కాకపొతే నేను తిరిగి పెళ్ళి చేసుకోను. ఇదే నా నిర్ణయం. నేను సరోగేట్ మదర్ నైతే, నీకేమైనా అభ్యంతరం ఉండి నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, నేను నిన్ను తప్పు పట్టను. నన్ను వెళ్ళనియ్యి.”
“ ఐ లవ్ యూ వాణీ! వెళ్ళు.. నేను నీకై ఏదురు చూస్తుంటాను. ఆల్ ద బెస్ట్!”
మైసూర్ చేరినప్పటి నుండి దమయంతి చాలా సహాయపడింది. వచ్చిన రెండో రోజే పెద్ద రాజావారు వచ్చి కలిసి వెళ్ళేరు. ఆయన మాటలు ఇంకా వినిపిస్తున్నట్లే ఉన్నాయి.
“అమ్మాయి నా పేరు రాజేంద్ర. నాకు ఒక్కడే కొడుకు జయేంద్ర, చాలా ఆలశ్యంగా పుట్టెడు. అతడు, భార్య వైజయంతీ, ఏడాది కొడుకు విజయేంద్ర తో కలిసీ యూరోప్ చూడ్డానికి వెళ్ళి, అక్కడే కార్ ఆక్సిడెంట్ లో పోయారు. చంటి పిల్లాడు ఎగిరి గడ్డి దుబ్బుల్లో పడ్డం వల్ల బతికిపోయాడు. నా భార్య ఈ విషయం వినగానే మంచం పట్టి మూడు నెలలకు స్వర్గస్తురాలైంది. నేను గుండె దిటవు చేసుకొని ఆ చంటివాణ్ని పెంచేను. విజయేంద్ర వివాహం వసుంధరతో ఆరు సంవత్సరాల క్రితం జరిపించాను. వాళ్ళకే పిల్లలు కలుగలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కదా అందుకే నీ సహాయం తీసుకుంటున్నాము. మీ అమ్మకి ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఏమి కావాలన్నా మొహమాట పడవద్దు. నువ్వు నా మనవరాలివంటిదానవే. ఈ సక్కుబాయి నీ దగ్గరే ఉండి అన్ని అవసరాలు చూసు కుంటుంది. డా. దమయంతి నీకు సహాయంగా ఉంటుంది. ఏలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకు. ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను.”
ఇంకో రెండు రోజుల్లో శ్యామలని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేసారు. బంగ్లాకి తీసుకు వచ్చి ఆమె కోలుకుంటుంటే , డా. దమయంతి రామావాణిని తన నర్సింగ్ హోం కి తీసుకెళ్ళి, చికిత్స చేయడం మొదలు పెడుతుంది. మొదటి నెలలో చికిత్స విఫలమౌతుంది. రమ చాలా నిరుత్సాహపడుతుంది. దమయంతి ఆమెని ఓదార్చి మొదటి నెలలోనే సఫలమవడం చాలా కష్టమని, ఒకటి రెండు నెలలైనా పడుతుందని, ధైర్యంగా ఉండమని చెబుతుంది. ఇంకో రెండు నేలలయ్యేసరికి గర్భం నిలుస్తుంది. ఇద్దరూ చాలా ఆనందిస్తారు. రమ తీసుకోవలసిన జాగ్రత్తలు, తినవలసిన మందులు, అన్ని తెలిపి పంపిస్తూ, ఈ సక్సెస్ అయిన విషయం ఇంకో నెల్లాళ్ళ దాకా ఎవ్వరికీ చెప్పవద్దని. కొంచెం స్టబిలైజ్ అయ్యాక పెద్ద రాజావారికి చెబుదామని చెప్పి పంపింది. రమ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే తల్లీ రెండు చేతులు ఊపేస్తూ గిరగిరా తిప్పేస్తూ ” అమ్మా నేను గొడ్రాలిని కానే, నేను తల్లిని కాబోతున్నానే! ఐ అమ్ సో హ్యాప్పీ!”
” ఉండవే తల్లీ! నా కళ్ళు తిరుగుతున్నాయి. అలా కూర్చో! పోన్లే నువ్వింత పెద్ద భాద్యత తీసుకున్నందుకు, దేవుడు నీయందే ఉన్నాడు. నీ కోరిక తీరింది. అదే నాకు పదివేలు”
“అవునమ్మ నేను తీసుకున్నది చాలా పెద్ద రిస్కే. ఒకవేళ ఇది సక్సెస్ కాకపొతే, దీనివల్ల రాజావారి ఫామిలీ, డా. దమయంతి, అక్కడ డా. సుధా అందరూ డిసప్పాయింట్ అయిపోదురు. ఆ దేవుడు నిజంగా నాయందే ఉన్నాడు. అమ్మా ఈ విషయం ఇంకో నెల్లాళ్ళదాకా ఎవ్వరికీ చెప్పొద్దు అనీ డా. చెప్పింది. నీ లోనే ఉంచుకో. నేను కొంచెం రిలాక్స్ అవుతా. ” ఇంకో నెల్లాళ్ళ తర్వాత రాజావారికి విషయం చెప్పడము జరిగింది.
డా. దమయంతి రమని కంటికి రెప్పలా చూసుకుంటోంది. రమ కూడా ఆమె చెప్పినవన్నీ తూచా తప్ప కుండా పాటిస్తోంది. రోజు పొద్దున్నా, సాయంత్రం గార్డెన్లో వాక్ కి వెళ్లి రావడం, టైం ప్రకారం భోజనం, మందులు తీసుకుంటూ తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ప్రతీ వారం చెకప్ కి రమ్మంటే వెళ్లి వస్తోంది. ఆ రోజు వెళ్ళినప్పుడు ” డాక్టర్ ఏమిటో మరీ బరువుగా, అనీజీగా ఉంటోంది. బేబీ రెండు పక్కలా డొక్కల్లొ తన్నేస్తున్నట్లు ఉంటోంది. ఇలాగే ఉంటుందా”
” ఇంక త్రీ వీక్స్ లో డెలివరీ అవ్వాలి. కొంచెం బేబీ వైట్ ఎక్కువ ఉన్నట్లుంది. అందుకే నీకు బరువుగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇవాళ నీకో విషయం చెప్పాలి. యూ అర్ కారీయింగ్ ట్విన్ బేబీస్. అందుకే నీకు రెండు వేపులా తన్నుతున్నట్లు ఉంది. ”
“అరే! అవునా , ట్విన్సా?! ముందు చెప్పలేదు.”
“అవును నువ్వు భయ పడతావని చెప్పలేదు. ఇంక ఈ వారంలో చెబుదాం అనుకున్నాను. ఇంకా రాజావారికీ చెప్పలేదు.”
చటుక్కున డా. దమయంతి చేతులు పట్టుకుని “డాక్టర్! ఒక చిన్న రిక్వెస్ట్. ఒక పాపని నాకిచ్చెయ్యండి ప్లీజ్,”
“నీకెమైన మతి పోయిందా రమావాణి! మన మీద ఇంత నమ్మకముంచిన రాజవార్ని ఎమారుస్తామా? వాళ్ళ బిడ్డలు వాళ్ళకే చెందుతారు. అయినా నువ్వు ఈ పిల్లలి మీద ప్రేమా, మమతా పెంచుకోవద్దు అని నీకు ముందు నించీ చెబ్తూనే ఉన్నాను. నువ్వు ఇష్ట పడి ఈ గర్భాన్ని మోస్తున్నావు, అంతే తప్ప పిల్లల మీద నీకు వేరే హక్కులు ఉండవు. అయినా రాజావారి కుటుంబలో దొరకబోయే గౌరవం, పేరు ప్రతిష్ట నువ్వు ఎలా ఇవ్వగలవు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకోకు. రేపు డెలివరీ అయ్యాక పిల్లల్ని వెంఠనే అసలు-తల్లికి ఇచ్చేస్తాము. నీ దగ్గర ఉండరు. వీటన్నింటికీ నువ్వు ప్రిపేర్డ్ ఉండు.” భారమైన మనసుతో తిరిగొచ్చింది రమ.
డెలివెరీ టైం కి రెండు రోజుల ముందే రమావాణికి నెప్పులు మొదలైయ్యాయి. శ్యామల డా. దమయంతికి ఫోన్ చేసి, ఆమె నర్సింగ్ హోమ్ కి తీసికెళ్ళి అడ్మిట్ చేసింది. డెలివరీ కి టైం పడుతుందని చెప్పి అందరినీ బైటకు పంపేసింది. రమకి ధైర్యం చెప్పి తానే పర్సనల్గా చూసుకుంటూ గడిపేసింది.
వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు, రమ ” డా. నాదొక చిన్న రిక్వెస్ట్. డెలివరీ అవగానే ఒకేఒక్క సారి బేబిస్ నీ నా పొత్తిళ్ళలో ఉంచుతారా ప్లీజ్. నేను పడిన ఈ కష్టానికి, నాకో గిఫ్ట్ గా అనుక్కోండి. ఇంక నేనేమీ కోరను.”
” సరే ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుంది. నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. కొంచెం రిలాక్స్ అవ్వు. పొద్దున్నకి నీకు డెలివరీ అయిపోతుంది.”
మర్నాడు సూర్యోదయానికి నార్మల్ డెలివరీ అయి ఇద్దరు మొగపిల్లలు పుట్టేరు. డా. దమయంతి ప్రామిస్ చేసినట్లే ఇద్దరినీ రమకి అందించింది. రమ, ఇద్దరినీ రెండు చేతులతో అందుకుని, కళ్ళారా చూసుకొని తన గుండెల్లో పొదువుకొని ముద్దులు పెట్టుకుంది. ఆమెకి ఆనందంతో కన్నీళ్ళు జలజలా రాలిపోతుంటే. ” నా కన్నతండ్రులూ! మీరెక్కడున్నా ఈ అమ్మ దీవెనలు మీకు సదా ఉంటాయి. ఆనందంగా ఆరోగ్యంగా నూరేళ్ళు జీవించండి! థాంక్స్ డాక్టర్!” అని పిల్లల్ని తిరిగిచ్చేసింది.
అప్పుడే లోపలకొచ్చిన తల్లినీ అల్లుకుపోయి, “అమ్మా! నేను గొడ్రాలిని కాను. నేను కూడా అమ్మనయ్యాను, అమ్మనయ్యానమ్మా…..!” అని ఆనందంతో భోరుమంది……

……………………………………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *