May 11, 2024

వీడెవడండీ బాబూ..!

రచన: – కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్

ఆ మధ్య నేను ఒక సమావేశానికి హాజరయ్యేందుకు విజయవాడ వెళ్ళా..! రైలు దిగి బయటకు రాగానే. ఆ సమావేశానికి హాజరయ్యే మరొక ఇద్దరు తారసపడ్డారు. పరిచయాలు పూర్తయ్యక సమావేశమందిరానికి బయలుదేరాం.. వీథులు చూస్తూ… విజయవాడ నగరంతో ఎవరికి వారికి ఉన్న అవినాభావ సంబంధాన్ని, చిన్నతనంలో వదిలేసిన పాతరోజులను , ఆ మధుర జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ నడకమొదలెట్టాం..!
కొద్దిదూరం వెళ్ళాక కౌతవరపు వారి వీథి దగ్గరకు వెళ్లేసరికి అంత వరకు నిశబ్దంగా నా ప్రక్కన నడుస్తున్న మూడో వ్యక్తి.. పేరు నిక్కింటి గిరి అట .ఇందాక పరిచయం చేశాడుగా పక్కనతను….ఆ గిరి మాటలు మొదలెట్టాడు..!
“ఇదగో.. ఈ కౌతవరపు రోడ్లోనే నేను చాలా కాలం వున్నా..! ఇక్కడ రూం నుంచి నేరుగా ‘ఊర్వస ‘ ‘ధయేటర్ ‘ క వెళ్లేవాళ్ళం. ‘బాండడ్ క్వన్ ‘ లాంట ‘సనమాలూ ‘ఎన్న ‘ చూసేమో..! ” అన్నాడు. అంతటితో ఆగకుండా కొనసాగిస్తూనే వున్నాడు…ఇక్కడే.. కళ్యాణ రెస్టారెంట్ వుండే. అదగో అక్కడే ‘పద్మనా ఎంక్లేవ్ లో మా ఫ్రెండ్ వుండేవాడు. పేరు ” గతా ‘రావు అని, మాంచ వస్తాదు. వాడంటే అందరం భయపడేటోళ్ళం. ఒన్ టైం, ఒక సమావేశం లో నేను ప్రధాన వక్తను.. ఆ సమావేశానక… ప్రయదర్శన, రమాకాంత్ కొండూర , యామన భమడపాట, వెంకటప్పారావు, మనాక్ష , భమభాస్కర్, సుందర శ్రనవాస్, కుమార శ్రదేవ , వజయా రావు, గతా,సంధ్య ప్రయ, కావూర వెంకటేష్ , నరేష్ కందుల, గోపకృష్ణ …. ” అంటు జంధ్యాల గారి సినిమాలో సుత్తి వీరభద్రరావులాగా పేర్ల లిస్ట్ చెప్పేస్తూ పోతున్నాడు.. ఎక్కడైనా బ్రేక్ పడుతుందేమో చూశా..! ఊ హూ లిస్ట్ పెరుగుతూనే వుంది.
నా ప్రక్కనే నడుస్తున్న రెండవ వ్యక్తి,.. పేరు రామకోటి లెండి.. ఆయనా రైలు దిగగానే పరిచయం చేసుకున్నాడు.. ఎక్కడో నన్ను గతంలో చూసారట. ! ఆ రామకోటి నాకేసి, నా చూపుల కేసి చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.. ముందే ఏదో తెలిసిన వాడిలా..! నాఫేస్ లో రంగులు మారుతున్నట్లు రామకోటి గ్రహించాడని అర్ధమైంది నాకు.
నిక్కింటి గిరి ఏం మాట్లడుతున్నాడో నాకు బొత్తిగా అర్ధం కావటంలేదు. ఒకటే టెన్షన్…బుర్ర వేడెక్కిపోయింది.. తొలుత అతనికి నత్తి ఉందేమో అనుకున్నా.. కానీ, కొన్ని పదాలు స్పష్టంగా పలుకుతున్నాడు. వేరే రాష్ట్ర్రం నుంచి వచ్చారేమో తెలుగు భాషలో అక్షరాలు పలకటంలో తేడా అనుకున్నా.. మాట్లాడినంతవరకూ చక్కని తెలుగునే మాట్లాడుతున్నారు.

మరి ఎందుకిలా మాట్లాడుతున్నారు..? నాచిన్ని బుర్రకి బోధ పడటం లేదు..
నాకు ఒక వైపు కోపం తన్నుకోస్తోంది… ఎర్రమిరపకాయ్ నాలికను కరిచినంతగా ఎక్కేస్తుంది అరికాలి మంట. అరె వీడికి ఇదేం పోయేకాలం, అలా తెలుగుకు తెగులు పట్టిస్తున్నాడు.. మనుష్యుల పేర్లను ఖూనీ చేసి, నన్ను చంపుతున్నాడు.. అసలే తెలుగు అక్షర దోషాలుంటేనే నాకు మంట..అలాంటిది నా దగ్గరే ఇలా తిక్క తిక్క గా ఎప్పుడెప్పుడు సమావేశ మందిరం వస్తుందా.. ఎప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకు పోదామా ..? అని మనసు పెడుతున్న గోలతో, గబగబా నడుస్తున్నా అయాసం తప్ప, సమావేశ మందిరం మాత్రం రావట్లే..!
గిరి అలా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలనిపించింది.. అతన్నే అడిగితే నొచ్చుకుంటాడేమోనని , ప్రక్కన నడుస్తూ, నా పరిస్థితికి ముసిగా నవ్వులు దాచుకుంటున్న రామకోటి నడుగుదామనుకున్నా అంతలో…
” ఆ ఇంతకీ ఆ సభలో మీరేం మాట్లాడారో సెలవివ్వండీ..” అనేశాడు రామకోటి..
“ఆ అక్కడికే వస్తున్నా.. నేను మాట్లాడుతుంటే.. చప్పట్ల మోత తెలుసా..!” అని గిరి చెబ్తుండగానే ఆపుకోలేక..
“ఏం మాట్లాడారేమిటి అంత గొప్పగా” అన్నాడు రామకోటి.
” ఎప్పుడులాగే మాట్లాడా..! ఎవరేమనుకున్నా నా స్టైల్ నాదే..! ఆకాశంకు గుడుందా.. ?నేలకు గుడుందా..? అమ్మకు గుడుందా..? నాన్నకు గుడుందా..? వాళ్లందరకూ లేకపోతే మునుష్యులకు, రాళ్ళకు ఎందుకంటా..? అని నిలేశా..! ” అంటు ఏదో చెప్పబోతున్న గిరికి మరోసారి అడ్డంపడ్దాడు రామకోటి..
“అదేంటండీ..! ఆన్యాయం కాకపోతే.. అమ్మ జయలలితకు గుడుందిగా” అన్నాడు రామకోటి..
“కానవ్వండి.. అందరకు నేనంటే చులకన.. నేను మాట్లాడతే ఎక్కడెక్కడవారో మెచ్చుకుంటారు, ఇదగో ఇక్కడివాళ్లకే ఇలా వేపకాయంతుంది..” అని కళ్ళెర్రజేశాడు గిరి,కొరకొరా రామకోటిని చూస్తూ..!
రామకోటి, గిరిల సంవాదం ఒకవైపు ఇంట్రస్టింగ్ గానూ, మరో వైపు అర్ధం కాని వెర్రిమాలోకాల గోలలానూ వుంది.. ఎరక్కపోయి వీరికి దొరికానేమో అనిపించింది..
“సారీ అండీ, మీరు కంటిన్యూ చెయ్యండి.. అనుమానం వస్తే నివృత్తి చేసుకుందామని అడిగానంతే .. తర్వాత ఎక్కడ మరచిపోతానేమోనని..,” అని సణుగుతూ, సముదాయించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు ..రామకోటి.
అదే అదనుగా తీసుకున్న గిరి మరలా తన నోటికి పనిపెట్టారు. ఆ సభలో అతను మాట్లాడినదంతా పూసగుచ్చటం మొదలెట్టాడు.
” ప్రపంచంలో ఎవరైనా స్వశక్త తో ఎదగాల.. దేవుడు, దయ్యాలంటూ ఎంతకాలం వెనకడుగేస్తుంటారు.. ఒకవైపు ప్రపంచం ముందుకెళుతుంటే, అందరూ గుడలు, చర్చలు, మసాద్ లు కట్టుకుంటూ భూమండలమంతా వాటతోనే నంపేస్తున్నరు.. ఇద ముందుముందు మరెంత పరణామాలకు దార తస్తుందో తెలుసా..? అందుకే ప్రతొక్కరూ గుడలకు బదులు బడలు కట్టాలన పలుపస్తున్నా..!” అని చెప్పుకొస్తున్నాడు గిరి గుక్క తిప్పుకోకుండా..! బహుశా ఆరోజు మీటింగ్ లో ఏస్థాయిలో మాట్లాడి ఉంటాడో అదే స్థాయిలో రోడ్డు మీద ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా .. చెప్పేస్తున్నాడు.. ఇంకా కొనసాగిస్తుండగా..
రామకోటి అందుకుని “అందుకే అందరూ చప్పట్లు మోగించుంటారండి..అవునా సర్ ” అని మధ్యలో బ్రేక్ వేశాడు..
వీడేంట్రా ఇలా మాట్లాడి నా మెదడుకు పనిపెడుతూ చస్తున్నాడని..నాకు చిరాకెత్తింది.!
కాసేపుంటే.. ఉల్లిబాంబు పేలినట్టు, నా తల పేలిపోయేలా ఉంది..
వీడి బాధేంటో తెలుసుకోకపోతే బేతాళుడన్నట్లు తల వెయ్యివక్కలయ్యేలానూ ఉంది.
గిరి గురించి తెలిసే రామకోటి ఇప్పటిదాకా సరదాగా అతడిని రెచ్చగొడుతున్నాడని, గ్రహించి నెమ్మదిగా రామకోటిని నిలదిశా..! “ఏమిటి ఇతగాడి కథ “అంటూ….!
“నానోటికి ఎందుకు సార్ పనికల్పిస్తారు వారినే అడగండి..తెలిసిగూడా అడుగుతావా అంటూ వెర్రికేకలేసి చస్తాడు దిమ్మరిగాడు ” అంటూ గుసగుసగా ఒక ఉచిత సలహా ఇచ్చి, తప్పించుకున్నాడు రామకోటి . గిరి అసలు కథంతా ఎరిగుండటంతో.!
“ఏవిటి నీకా పోయేకాలం” అని నేరుగా అతడినే అడిగితే, పైనపడి పీక్కుతింటాడేమో అనిపించింది.. అడక్కుండా ఉంటేనేమో,”ఆమాత్రం ధైర్యం లేదా..?” అని మనసు వెక్కిరిస్తోంది.
కొన్ని విషయాలు కడుపులో దాచుకుంటే ఉబ్బరంతో ఉక్కిరిబిక్కిరవుతారని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది.. ఆ మాటలు గుర్తొచ్చాయి… ఇక ఆగదలుచుకోలేదు.. తాడో పేడో తేల్చేయాలని నిర్ణయించుకున్నా..!
కాసేపు ఆలస్యం చేయడానికి కూడా కుతూహలం,ఉత్సుకత,వెర్రి కోపం, ఆపుకోలేకపోతోంది నా మనసు..!
తేల్చేయాలి ఇప్పుడే ఈ క్షణమే మనసు రొదపెడుతూనే ఉంది..
ఇష్టదైవాన్ని తలచుకుని కాస్త ధైర్యం అప్పు తెచ్చుకున్నా..! ఏదైతే అది అయ్యిందని…అతగాడిని కదిలించా.. !
“సార్! మీరెందుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే పదాలలో కొన్ని శబ్ధాలు వదిలేస్తున్నారు.. మీ మాటలు చిత్రంగా ఉన్నాయ్, తెలుగుని బ్రష్టుపట్టించినట్లు మాట్లాడుతున్నారు” అని అప్పు తెచ్చుకున్న ధైర్యం తో కడిగేశా.. !
క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా జవాబిచ్చాడు గిరి..అతని నుంచి అణుబాంబు లాంటి జవాబు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు..
కళ్ళు ఎరుపెక్కి, పూనకం వచ్చిన వాడిలా కోపంతో ఊగిపోతూ..
” నేను నాస్తక్..” అని వెర్రికేకొకటి పెట్టాడు.,.
“నాస్తక..???****…అంటే..???
నా బుర్ర కంప్యూటర్ సెర్చ్ కుక్క పాత్రలోకి పరకాయప్రవేశం చేసి ఆంధ్రభారతి డిక్షనరీ చుట్టేస్తోంది.
అంతలో కంటిన్యూ చేశాడు గిరి.
“అందుకే నా పేరు కుడా నేను ఇష్టపడను… కనుకే పలకను.. ” అని … అన్నాడు గిరి…”
“ఓహో నాస్తికులా..!” వారి దేవుడా అదేం సౌండు …అని మనసులో అనుకుని .
ప్రశ్నల శరాలు కొనసాగించా..!
“అదిసరే సర్ ..!.. నాస్తికుడైతే ఏంటి? దేవుడులేడనేది మీ వాదన…, అంతే కదా..! దానికి మీరు ఇంత వింతగా, విడ్డూరంగా తెలుగును ఇష్టం వచ్చినట్లు ముక్కలు ముక్కలు చేస్తూ మట్లాడటానికి ఏమిటి సంబంధం ?” అని నిలదీసా..! అప్పటికే సమావేశమందిరం ప్రాంగణంలోకి అడుగెట్టాం..
“అయ్యో ఈ టైం లో అతని నుంచి సమాధానం రాబట్టకుంటే బుర్ర పిచ్చెక్కిపోతుందనిపించింది, లోనికి పోకుండా ఆయన అడ్డంగా నిలబడి, ఇంకా ఏదో చెప్పబోతున్న గిరిని చూస్తూ.. చెవులు రిక్కరించా..! రామకోటి మాత్రం నా పరిస్థితికి నవ్వాపుకోలేకపోతున్నాడని నాకర్ధమవుతూనే ఉంది.
” నేను నాస్తక్, కనుక గుడి నాకు నచ్చదు. దేవుడే లేనప్పుడు గుడి ఎక్కడుంటుంది. అందుకే నేను గుడి గురించి పలకను, గుడి శబ్దంని పలకను.. నాచే పలకించాలన ప్రయత్నంచొద్దు.. నువ్వేసే తంగర ప్రశ్నల తో నన్ను చంపకు…! ఇప్పటికే చాలా గుడ శబ్దాలు పలికించ చచ్చవ్.. నేను పలకలేక చచ్చా..! ఆ..*** ” అని సీరియస్ గా సమావేశమందిరంలోకి నన్ను నెట్టుకుంటు వెళ్ళిపోయాడు.. !
నా జుట్టూ మొత్తం ఒక్కసారిగా రేగిపోయింది.. కనుగుడ్లు బయటకు తన్నుకొచ్చాయ్.. మొఖమంతా మల్లిక్ కార్టూన్ లా మారిపోయింది. పాదాలు వెనక్కి తిరిగిపూతున్నట్లు భ్రమ.
దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి.. అప్రతిహతంగా తెరుచుకున్న నా నోరు మూతపడలేదు.
” ఆరి వీడి దుంపతెగ..! చేపల మార్కెట్ లో వీభూతి గడ్డలమ్ముకుండే ఫేసూ వీడు..” దేవుడు లేడని గుడి వుండదంట..! అందుకే అన్నీ పదాలకు గుడి,గుడి దీర్ఘం లేకుండా మాట్లాడేశాడట… అమ్మ భడవకానా ..! వీడి తెలివి తెల్లారిపోనూ..!
చిన్నప్పుడు ఇళ్ళల్లో ఆడవాళ్ల తిట్లన్నీ గుర్తు తెచ్చుకొని, వరసగా వాడి చెవిన వేయాలనిపించేంత కోపం వచ్చింది.. ఆశ్చర్యం నుంచి నేను తేరుకునే పరిస్థితి కనిపించలేదు.. రామకోటి మాత్రం ‘ఎందచేట ఆలీ’లా నాలిక ఊపుతూ, నవ్వాపుకుంటూ సమావేశ మందిరంలోకి వెళ్లాడు, గిరిని అనుసరిస్తూ..!
వాడి పేరుకూడా వాడికి నచ్చదా..? అన్నట్లు వీడి పేరేందీ.. నిక్కింటి గిరి.. ఆర్ని అన్నీ గుడి ఉన్న అక్షరాలే..! అందుకే ఈ హేతువాదికి తన పేరే నచ్చలేదన్నమాట..! పాపం వారి తల్లిదండ్రులు ఇతగడి మాట వినుంటే ఏమయ్యేవాళ్ళో అనిపించింది..!
అయినా, నా+అస్తి = నాస్తి..! నాస్తికత్వంలోనే, ఆస్తికత్వం ఉందన్న విషయం తెలియని వీణ్ణి మూర్ఖుడనుకోవాలో.. ! అక్షరం పొరబాటు లేకుండా గుడి తీసేసి గడగడ మాట్లాడిన వాడి నేర్పరితనానికి దండం పెట్టాలో అర్ధం కాక తెల్ల మొహం వేయటం నా వంతైంది. చివరాఖరకు నా పేరు మీదే డౌటొచ్చి అక్షరమాల తిరగేశా…!
కరణం కళ్యాణ కృష్ణ కుమార్..హమ్మయ్య..! నా పేరు మీద ఎవరూ గుడి కట్టలేదు.. గుడికి దీర్ఘమూ కట్టలేదు,,
భగవంతుడా !… వీడి చేతిలో నేను ఖూనా..ఛీ..ఛీ.. వీడి వెధవ భాషే వచ్చి చస్తోంది… వీడి చేతిలో నేను ఖూనీ కాలేదు అనుకుని సమావేశంలో వాడికి దూరంగా బిక్కు బిక్కు మంటూ కూర్చున్నా… ప్చ్..!
సమావేశం లో వక్తలు , అతిథులు ఎవరు ఏమి మాట్లాడుతున్నా..అక్షరాల మీద గుడి మాయమవుతున్నట్లే ఉంది… చెవులు గింగిరాలు తిరుగుతున్నాయ్… ఏమి సేతురా..లింగా..! అనుకుంటూ బయటపడ్డా.. తిరుగు ప్రయాణానికి రైల్వే స్టేషన్ వైపు అనాలోచితంగా అడుగులు కదిలాయి. దేవుడా నా తెలుగును రక్షించు అని లోలోన కేకలు మొదలెట్టింది నా అంతరంగం.. నా అడుగులు మాత్రం ముందుకు వెడుతూనే ఉన్నాయ్.!

———————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *