April 27, 2024

అద్దె గర్భం(సరోగసీ)

రచన: టీవీయస్. శాస్త్రి

తుషార్ కపూర్ పెళ్లి చేసుకోదలుచుకోలేదు. కానీ తండ్రి కావాలని కోరుకుంటున్నాడు. కావాల్సినంత డబ్బులుంటే చాలు అద్దె గర్భం ద్వారా బిడ్డను కనొచ్చు! ఈ విధంగా నేడు చాలామంది బిడ్డలకు పేరెంట్స్ గా మారుతున్నారు!వైవాహిక వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మన దేశం లాంటి దేశంలో వీటిని ప్రోత్సహించటం ఎంతవరకు మంచిది?పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడని తుషార్ అద్దె గర్భంతో తాజాగా తండ్రయ్యాడు. ప్రసిద్ధ హిందీ నటుడు జితేంద్ర కుమారుడైన తుషార్ కపూర్ అవివాహితుడు. అతడికి ప్రస్తుతం 40 యేండ్లు నిండాయి. కానీ సంతానం కావాలనే కోరిక ఉంది. తండ్రి కావాలంటే ‘అద్దె గర్భం’మంచి పద్ధతి అని తుషార్‌కు ఎవరో చెప్పారు. వెంటనే అతను జస్లోక్ ఆసుపత్రి వైద్యులను కలిసాడు. వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసి ‘అద్దె గర్భాన్ని’ఏర్పాటు చేసారు. ఇందులో ముఖ్యమైనది ఏమంటే ఆ అద్దెగర్భం ఇస్తున్న మహిళ ఎవరో తెలియనివ్వకుండా ఉంచడం. నవమాసాలు పూర్తి కాగానే కొడుకును ఆసుపత్రి వర్గాలు తుషార్ కి అందచేశాయి!ఈ పద్ధతిని సరోగసీ పద్ధతి అంటారు. మన సినీ నటుడు మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మీ కూడా ఈ పద్ధతిలోనే తల్లి అయినట్లు మనం లోగడ విన్నాం! కొడుకు తన పోలికలతోనే ఉన్నందుకు తుషార్ సంబర పడిపోయాడు. ఆ పసికందుకు ‘లక్ష్య’ అన్ని పేరు పెట్టుకున్నాడు!అయితే ఇక్కడ కొన్ని(అనేక) సందేహాలున్నాయి నాకు.
1. పుట్టిన శిశువికి తల్లి తండ్రుల పేర్లను గురించి బర్త్ సర్టిఫికేట్ లో ఎవరి పేర్లను ఉదాహరిస్తారు?
2. అటువంటి శిశువును legally borned శిశువుగా న్యాయ స్థానాలు గుర్తిస్తాయా?
3. తదుపరి ఎప్పుడైనా DNA పరీక్షలు చేయవలసివస్తే అప్పటి పరిస్థితి ఏమిటి?
4. ‘అద్దె గర్భం’ఇచ్చిన వారు దానిని అద్దెకు తీసుకున్నవారి మధ్య ఏదైనా agreement(lease agreement) ఉంటుందా?అది న్యాయ సమ్మతమేనా?
5. ఆఖరికి గర్భాలకు బ్యాంక్ లాకర్లకు తేడా లేకుండా పోయింది!
ఇదే కదాంశంతో గతంలో తెలుగులో /హిందీలో ఒక సినిమా కూడా వచ్చింది!ఆ సినిమా పేరు నాకు గుర్తుకు రావటం లేదు!అందులోని ముఖ్యమైన విషయం ఒక వివాహిత స్త్రీ తన భర్తను అనారోగ్యబారినుండి కాపాడుకోవటానికి డబ్బులు తీసుకొని తన గర్భాన్ని అద్దెకిస్తుంది!అయితే, ఆ సినిమా తీసిన విధానం బాగుంది
కానీ,ప్రజల మన్నన పొందలేకపోయింది. ఇంకా అనేక సమస్యలు, సందేహాలున్నాయి!పూర్వం సంతానం లేనివారు తమకు ఇష్టమైన వారి పిల్లలను దత్తత చేసుకునేవారు. వారినే తమ సొంత బిడ్డలుగా పెంచుకునే వారు!అయితే,ఇప్పుడు అలా చేయకపోవటానికి కారణం -‘నా సొంతం’ అనే స్వార్ధం పెరిగిపోవటం!నిజానికి పెంచిన ప్రేమ చాలా గొప్పది!అవివాహితులు సంతానం కావాలని కోరుకోవటం మరీ విడ్డూరం!అలా అవివాహితగా సంతానం కావాలని కోరుకున్న పురాణ స్త్రీ కుంతిని గురించి మనకు తెలుసు. కుంతికి వచ్చిన గర్భాన్ని పురాణాల్లో సద్యో(instant ) గర్భం అన్నారు. ఆమెకు పుట్టిన కర్ణుడు సమాజంలో ఎన్ని అవమానాలను భరించాడో మనకు తెలుసు. ఎక్కడ తగిన ఆశ్రయం దొరకక,ఆఖరికి దుష్టుల చెంతకు చేరాడు! Shakespeare ప్రఖ్యాత విషాదాంత నాటకాల్లో ఒకటైన King Lear లో అక్రమంగా పుట్టిన Edmund అనే పాత్ర పడిన మానసిక క్షోభ నా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. సరే ,ఆ విషయాన్ని పక్కనపెడుదాం!అవివాహితులు దత్తత తీసుకుంటే చెల్లదని నా లాయర్ మిత్రుడొకడు చెప్పాడు. హిందూధర్మం ప్రకారం కూడా వివాహిత దంపతులే దత్తత తీసుకోవాలని సూచిస్తుందని తెలుసుకున్నాను!దానికి ముఖ్య కారణం పిల్లలకు తల్లితండ్రుల ఇద్దరి ప్రేమ, పెంపకం అవసరం. తల్లితండ్రులు ఇద్దరూ పిల్లలకు ముఖ్యమే!. శిశువు పెద్దయిన తర్వాత తనకు తల్లి/తండ్రి ఎవరో తెలుసుకోవాలని కోరుకుంటాడు!ముఖ్యంగా కష్టపడి నవమాసాలు మోసిన కన్నతల్లిని గురించి తెలుసుకోవాలనుకుంటాడు!తల్లి ఎవరో తెలియక అతను తపించిపోయే అవకాశాలున్నాయి!సమాజం కూడా ఆ శిశువు పట్ల అవహేళనగా చూసే అవకాశాలు కూడా లేకపోలేదు!ఒక అవివాహితుడు ఈ విధంగా పొందిన శిశువును జాగ్రత్తగా ఎలా పెంచగలడు?లాలపోసి,జోలపాట ఎవరు పాడుతారు?మళ్లీ వీళ్ళని baby care centers లో చేర్చక తప్పదు!వీటన్నిటికీ మూలం అసహజమైన కోరికలు ఉండటం!ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోకపోవటం! ఈ విధానం దుర్వినియోగం అవుతుందని గ్రహించిన కేంద్రప్రభుత్వం 24-08-16 న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక బిల్లును తీసుకొచ్చింది. మంత్రివర్గ సమావేశంలో విషయాలను,బిల్లులోని ముఖ్య అంశాలను మీ కోసం, ఇక్కడనే తెలియచేస్తాను!పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు వీలు కల్పించనున్నారు. సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో. . వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలయ్యాక అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 లక్షల జరిమానా విధించనున్నారు. సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాల్లో సరోగసి ద్వారా పిల్లలను కనటం ఫ్యాషన్ (పురిటి నొప్పుల బాధపడకుండా) అయిపోయిందని సుష్మ విమర్శించారు. బిల్లులోని ముఖ్యాంశాలు-
1. పెళ్లై ఐదేళ్లు దాటిన జంటలకే అవకాశం
2. భార్య వయసు 23-50 మధ్యలో. .
3. భర్త వయసు 26-55 మధ్యలో ఉండాలి.
4. దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ ఉండాల్సిందే.
5. సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశం.
6. అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు
7. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ కచ్చితంగా వివాహిత అయి ఉండాలి. అంతకుముందే. . ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి.
8. కచ్చితంగా దంపతుల్లో ఒకరికి దగ్గరి బంధువై ఉండాలి.
9. ఒకసారి మాత్రమే గర్భాన్ని అద్దెకు ఇచ్చేందుకు అనుమతి.
10. ఈ విధానం ద్వారా పుట్టిన పిల్లలు అమ్మాయిలైనా, అంగవైకల్యంతో జన్మించినా వారికి భద్రత కలిపించేలా చట్టంలో మార్పులు.
11. ఇతరులకు సాయం చేసేందుకు చేసే సరోగసికీ కొన్ని నియమాలతో అనుమతి. సింగిల్ పేరెంట్స్, లివింగ్ పార్ట్‌నర్స్ (పెళ్లికు ముందే కలిసుండే జంట), స్వలింగ సంపర్కులకు సరోగసీ ద్వారా పిల్లలు కనటంపై నిషేధం.
12. విదేశీయులు, ఎన్నారైలు, పీఐవో (భారత సంతతి)లు, స్వలింగ సంపర్కులు, సహజీవనం చేసేవారిపై నిషేధం. పేద మహిళలను ‘అద్దెగర్భం’ ఆశతో దోచుకోవటం నుంచి విముక్తి.
ఏది ఏమైనా ఈ సరోగసీ విధానం ద్వారా సంతానాన్ని పొందటం కన్నా దత్తస్వీకారమే మంచిదని నా అభిప్రాయం!ఇది మన సంస్కృతిని మరింత దెబ్బ తీస్తుందేమోనని నా అభిప్రాయం !ఈ బిల్లులో ఇంకా అనేక లోపాలున్నాయి. ఈ విధానం ద్వారా కలిగిన సంతానం ఎవరి సొత్తు?నవమాసాలు మోసి కన్న స్త్రీకి ఇటువంటి సంతానం మీద ownership ఉండటం న్యాయం. ఇదే మన ఇతిహాసాలు చెబుతున్న సత్యం. కుంతికి కలిగిన సంతానం అందరూ కౌంతేయులేనన్న విషయం మీకూ తెలిసిందే!ఇది ప్రోత్సహించతగిన పద్ధతేనా? మీరూ ఆలోచించండి!తగిన సూచనలను కూడా ఇవ్వండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *