April 27, 2024

Gausips – ఎగిసే కెరటం-7

రచన:-శ్రీసత్య గౌతమి

రాకేష్ నలుగురు స్నేహితులతో కలిసి పైకి వస్తున్నాడు. బాల్కనీ నుండి సింథియా వాళ్ళని చూసి వెళ్ళి తలుపు తీసింది. అందరూ లోపలికి వస్తూనే సింథియాని ఎంతో ఆప్యాయంగా పలుకరించేశారు, సింథియా వాళ్ళకి క్రొత్తయినా.

సింథియా పొంగిపోయి వాళ్ళకి అదే స్పీడుతో ఆప్యాయతను కురిపించి లోపలికి ఆహ్వానించింది. వచ్చిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ఆడవారు మధు. అందరూ ఎంతో ఆప్యాయంగా కలిసిపోయారు.

రాకేష్ అందరికీ డ్రింక్స్ కలిపేశాడు ఎవరికి ఏది కావాలంటే అది మార్గరిటా కాక్టైల్స్, వైన్ మొదలైనవి. సింథియాకు కూడా ఈ గెట్ టుగేదర్లే ఆనందం. ఇలాంటప్పుడు రాకేష్ చాలా బాగా నచ్చేస్తుంటాడు. ఎప్పుడయినా రాకేష్ ఇంటి పనులు చెయ్యమంటేనే ఆమెకి బాధ.

ఇక వచ్చిన ఫ్రెండ్స్ అందరూ … సింథియా చెప్తున్న తన వీరగాధల్ని (ఉన్నవీ లేనివి చెప్తున్నా) …పాపం వాళ్ళకేం తెలియదు కదా … ఎంతో రెలీజియస్ గా వింటున్నారు, రాకేష్ మాత్రం అందరి కంఫర్ట్స్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నాడు. మొత్తానికి రాత్రి ఒంటిగంటన్నరకి అందరూ మెల్లగా ఇళ్ళకి కదలడం మొదలెట్టారు.

సింథియాకి ఆ రాత్రి అందరితో చాలా బాగా గడిచింది. వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఉండమని బలవంతం చేస్తోంది. మళ్ళీ తెల్లారితే మరి బాధ కదా? ఎంతకని రోజంతా పనిచెయ్యకుండా కుర్చీకే అతుక్కొని, అడిగితే తంతా అన్నట్లుగా రాకేష్ కి సమాధానాలు చెప్తూ కూర్చోవడం?

ఇలా ఎవరయినా ఉండిపోతే … వాళ్ళకోసమని చేసే దాంట్లో తాను కూడా షేర్ చేసుకొని పని కానిచ్చేస్తుంది. అందుకే సింథియా అందరినీ పేరు పేరునా ఉండిపొమ్మని అడుగుతోంది. రాకేష్ మాత్రం అడగటం లేదు.

ఫ్రెండ్స్ అందరూ మర్యాద గా త్రోస్పుచ్చి తమకు ఏవో పనులున్నాయని చెప్పి కదిలి వెళ్ళిపోయారు. అందరికీ బాయ్ చెప్పేసి రాకేష్ తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు.

సింథియాకి అది నచ్చలేదు. తానక్కడ వంటరయిపోయింది. మెల్లగా సింథియా కూడా కదిలి తన గదిలోకి వెళ్ళిపోయింది.

గదిలో ఏసీ ఫుల్ స్పీడ్ లోవున్నా తాను మాత్రం లోపల ఏదో తెలియని అవమానభారంతో దహించుకుపోతోంది, అది బయటకు చిరుచెమటలు పోస్తోంది.

ఏసీ ఇంకా ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించింది సింథియా, కానీ ఏదీ … అదే ఫుల్ స్పీడ్ బటన్.

“చ … ఏసీ కి కూడా నేను చిన్న చూపయ్యాను” … అని ఒక్క ఉదుటున తన గదిలోనుండి రాకేష్ గదిలోకి వెళ్ళింది. ఆ చిరాకంతా వెళ్ళగక్కడం మొదలెట్టింది రాకేష్ ముందు.
“ఇప్పటివరకూ నన్ను నీలా ఎవరూ ట్రీట్ చెయ్యలేదు” … సింథియా అపవాదు వేసింది.
“ఎవరు?” … రాకేష్ కూల్ గా అడిగాడు.
“అందరూ నన్ను నెత్తి మీద పెట్టుకొని చూశారు”
“ఎందుకు?” మళ్ళీ రాకేష్!
చివాలున తలతిప్పి సూటిగా చూసింది రాకేష్ వైపు సింథియా.

“ఇండియాకి, ఇక్కడికీ ఎంత తేడా? ఇండియాలో నేను చెప్పేదే వేదం. ఎప్పుడూ నేను చెప్పిందే ఫైనల్. నన్ను సంతోష పెట్టడమే వాళ్ళ విధి అన్నట్లుగా ఎంతో గొప్పగా ఉన్నాను.

కానీ ఇక్కడా ???? అసహ్యంగా ఉంది ఎవరిని చూసినా? స్వార్ధం! ఎప్పుడూ తమ గురించే ఆలోచిస్తారే తప్పా … నా మాటకు అసలు విలువుందా? … అంటుంటే ఆమె ముఖంలో ఒక అసహ్యాన్ని చూసాడు రాకేష్.

రాకేష్ సింథియాని అర్ధం చేసుకోవడం మొదలుపెట్టాడు.

“మై గాడ్! తనకు నచ్చిన విధంగా జరగకపోతే ఆమె ఇంత అసహ్యాన్ని పెంచుకుంటుందా? ఎందుకు? ఎందుకలా?” అని రాకేష్ ఆలోచనలో పడ్డాడు. అయినా అడిగాడు.

“సింథియా … ఇంతకు ఎవరో చెప్పలేదు”.
“నా బాస్, నా ఫ్రెండ్స్, నా క్లయింట్స్, నా ఇంట్లో వగైరా …” సింథియా సమాధానం.
“హు… వాళ్ళందరి మెప్పు కోసం, తద్వారా డబ్బుకోసం, ఉద్యోగం కోసం నువ్వు, నీ సహాయార్ధం వాళ్ళు కలిసి పెంచుకున్న రిలేషన్స్ అవి. అది నీకానందన్నిచ్చింది. అంతే” … రాకేష్ అక్కడితో ఆపేశాడు.

“అంటే? ఇందులో నా సామర్ధ్యం లేదంటావా?” … మళ్ళీ సూటిగా అడిగింది సింథియా.

“ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ నువ్వు కొంతమందికి మఖ్యమనిపించావ్. అంతే. ప్రతివారు నిన్ను అలాగే చూడాలంటే ఎలా? అందరినీ మెప్పించగలిగే శక్తి సామర్ధ్యాలున్నాయా?” … రాకేష్ కూడా సూటిగా అడిగాడు.

సింథియాకు తల కొట్టేసినట్లయింది. ఎందుకంటే అది తనకూ తెలుసు. అందుకేగా చటర్జీ ని అడ్డం పెట్టుకొని బిశ్వా కెరియర్ ని నేలరాచేసింది? మళ్ళీ అటువంటి చటర్జీ, అటువంటి బిశ్వా దొరకాలికదా తాను మళ్ళీ ఎత్తిరిల్లాలంటే ???????

“అయితే ఇప్పుడేమంటావ్?” సింథియా చిరాకుగా అడిగింది.
“అనడానికేముంది? ఇప్పటివరకూ నీ గురించి నువ్వు ఏమీ చేసుకోలేదు, కనీసం ప్రయత్నించలేదు కూడా. అందుకే అమెరికాలో ఫెయిల్ అయ్యావు” … రాకేష్ ప్రస్తావనను ముందుకు తీసుకెళ్ళాడు.
“అది నేను నమ్మను”… సింథియా ధృఢంగా చెప్పింది.
“కావాలంటే ఒకసారి తరచిచూసుకో” … రాకేష్ పొడి వేశాడు.

“ఓకే… గుడ్ నైట్, చాలా లేట్ అయ్యింది. ఇక వెళ్ళి పడుకో”… అని చెప్పి లైట్ ఆపి నిద్రకుపక్రమించాడు.

సింథియా ఒక అరనిముషం అలాగే కూర్చొని మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అయినా నిద్ర పట్టడం లేదు. వెళ్ళి మళ్ళీ ఈజీ చెయిర్ లో కూర్చుంది. మెల్లగా ఊగుతూ … ఎదురుగా కిటికీలో నుండి బయటికి దట్టమైన చీకటిలోకి చూస్తూ…రాకేష్ చెప్పిన మాటలు మననం చేసుకున్నది.

“అనడానికేముంది? ఇప్పటివరకూ నీ గురించి నువ్వు ఏమీ చేసుకోలేదు, కనీసం ప్రయత్నించలేదు కూడా. అందుకే అమెరికాలో ఫెయిల్ అయ్యావు.
“అది నేను నమ్మను”… సింథియా ధృఢంగా చెప్పింది.
“కావాలంటే ఒకసారి తరచిచూసుకో” … రాకేష్ పొడి వేశాడు

(ఇంతకుమునుపే రాకేష్ కు, తనకు మధ్య జరిగిన సంభాషణ అది)

వెంటనే దానినుండి బయటపడి … చటర్జీ అన్న మాటలతో పోల్చుకున్నది సింథియా.

“ఆనాడు భిశ్వా విషయంలో కూడా చటర్జీ చాలాసార్లు చెప్పాడు తనకు భిశ్వాతో కలిసి పనిచేసి, పని నేర్చుకోవలసిందనీ, తాను భిశ్వాని అన్యా యంగా బాధపెడుతున్నాడని కూడా వాపోతుండేవాడు. నేనేమాత్రం అది పట్టించుకోలేదు. ఇప్పుడు రాకేష్ కూడా ఇంచుమించు అలాంటిదే చెప్తున్నాడు. అంటే … అంటే …ఒకవిధంగా నాకేమీ రాదనేగా రాకేష్ ఉద్దేశ్యం? అందుకే ఉద్యోగం ఊడిందని నన్ను దెప్పుతున్నాడన్నమాట! ” ఇలా ఆలొచన మొదలెట్టింది సింథియా …

అంతేగానీ నిజాన్ని గ్రహించడంలేదు, 24 గంటలూ అహంభావంతో, మూర్ఖత్వంతోనే ఉంటుంది సింథియా.

సింథియా బుర్ర మళ్ళీ పాత సంభాషణలోకి వెళ్ళింది

“వాళ్ళందరి మెప్పు కోసం, తద్వారా డబ్బుకోసం, ఉద్యోగం కోసం నువ్వు, నీ సహాయార్ధం వాళ్ళు కలిసి పెంచుకున్న రిలేషన్స్ అవి. అది నీకానందన్నిచ్చింది. అంతే” … రాకేష్ అక్కడితో ఆపేశాడు.
“అంటే? ఇందులో నా సామర్ధ్యం లేదంటావా? … మళ్ళీ సూటిగా అడిగింది సింథియా.
ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నువ్వు కొంతమందికి మఖ్యమనిపించావ్. అంతే. ప్రతివారు నిన్ను అలాగే చూడాలంటే ఎలా? అందరినీ మెప్పించగలిగే శక్తి సామర్ధ్యాలున్నాయా?”

హు … ఇదీ తప్పుగానే తోచింది సింథియాకి. అందుకే మనసులో…

“రాకేష్ కు ఎంత ధైర్యం? నాకు శక్తి సామర్ధ్యాలు ఉన్నా లేకపోయినా కొంతమందికి నేను ముఖ్యమనిపించడం వల్లనే ఆ మాత్రం పైకొచ్చానంటున్నాడు. ఈ రోజు ఆ పిజ్జా ముక్కకోసమయినా నేను తన మీద ఆధారపడ్డాననేగా ఇంత మాటనగలిగాడు? నన్ను తన ఇంట్లో పని చెయ్యమంటున్నాడు? అప్పటికీ నా గొప్పతనాన్ని చెప్పాక కూడా!

హు … నేనెలాగయినా మళ్ళీ నిలదొక్కుకోవాలి. ఏం…ఈ అమెరికాలో రాకేష్ లేకపోతే నాకు జరగదా? నేనెందుకు ఉద్యోగంలేకుండా ఇంట్లో కూర్చోవాలి? నేను మళ్ళీ నా తఢాఖా చూపించాలి. చటర్జీకి రాకేష్ కి “ఔరా” అని ముక్కున వేలేసుకొనేలా చెయ్యాలి. దానికి తక్షణ కర్తవ్యం? ఎలా ? ఏంటి? ఎవరు? ఎవరు? ఎవరు? …

ఇదే ఆలోచన? అప్పుడు గుర్తొచ్చిన వారు … కౌశిక్ మరియు లహరి!

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *