April 28, 2024

మాయానగరం – 30

ఒక కుర్రాడు కాశీ వెళ్ళాలని బయలుదేరాడు. కారణం తల్లిదండ్రుల చితాభస్మాన్ని గంగలో కలపడానికి. ఆ రోజుల్లో బస్సులు, రైళ్లు, విమానాలూ లేవు. కాలినడకన పోవాల్సిందే. అదృష్టం బాగుంటే కాశీకి, లేకపోతే కాటికి. మొత్తానికి ఓ నలభై రోజుల పాటు నడిచి నడిచి ఓ నగరం చేరాడు. అక్కడి పెద్దలు యీ కుర్రవాడికి జననీ జనకుల మీద వుండే భక్తిని చూసి చక్కని భోజనాలు వసతులూ అమర్చి ‘సేద ‘ తీరమన్నారు.
అక్కడో యువతి యీ కుర్రాడి మీద మనసుపడింది. గుట్టుగా కబురంపింది. అభం శుభం తెలియని కుర్రాడికి ‘అమ్మాయిల ‘ రుచి తెలిసొచ్చింది. అంతే ఆర్నెల్లు అక్కడే వుండిపోయాడు. ఎవరేనా ప్రేమతో గౌరవంతో కొన్నాళ్ళే చూస్తారు కానీ ఆజన్మాంతం కదుగా. అది ఆ కుర్రాడికి అర్ధం కావడానికి ఆర్నెళ్లు పట్టిందన్న మాటా! “నవ్వాడు గురూజీ!
అసలీ కథ గురూగారు ఎందుకు మొదలెట్టారో బోస్ కి అర్ధం కాలేదు. ప్రశ్నించడానికి ధైర్యమూ లేదు. “అదీ ” సణిగాడు బోసు.
“ఆగాగు అక్కడితో కథ అయిపోలేదు. మొత్తానికి ఆ నగరం విడిచి మరోసారి ప్రయాణం మొదలెట్టాడు కుర్రాడు. మళ్ళీ దీక్ష పట్టి నడక సాగించాడు. మూడు నెలలకో బస్తీ చేరాడు. ఆ బస్తీ వాళ్ళు కూడా యీ కుర్రాడిని గౌరవించి సత్కరించారు. బస ఏర్పాటు చేశారు. కాళ్ళు నొప్పులు పుళ్ళు తగ్గడానికి వైద్యుడ్ని ఏర్పాటు చేశారు. ఆ వైద్యుడికి ఓ విధవరాలైన కూతురుంది. అంతే కాదు, ఆ వైద్యుడికి పేకాటంటే పంచప్రాణాలంత ఇష్టముంది. పగలంతా వైద్యుడు కుర్రాడికి పేకాటలో కిటుకులు నేర్పితే , రాత్రిళ్ళు వైద్యుడి గారి కూతురు కామశాస్త్రం కుర్రాడికి కూలంకషంగా నేర్పింది. ” మళ్ళీ నవ్వాడు గురూగారు.
తలొంచుకున్నాడు బోస్. గురూగారి కథలో ‘సూచన ‘ అర్ధం అయీ అవనట్టుగా వుంది.
“ఒరేయ్ బోసు.. యీ కథ తెలుగు టి.వి. సీరియల్ లాగా పదివేల ఎపిసోడ్ల దాకా పొడిగించవచ్చు. యమా సెక్సీగా ఆటా పాటా మాటా జోడిస్తే అన్నీ భాషల వాళ్ళూ అడిగినంత ఇచ్చీ మరీ కొనుక్కునేట్టు చేయచ్చు. కానీ చెయ్యను. ఎందుకంటే క్లైమాక్స్ మన చేతుల్లోనే వుంది గనక! ” కళ్ళ జోడు తీసి సూటిగా చూశాడు గురూజీ. రెండు కత్తులు తన కళ్ళలోకి దూసుకుపోయినట్టు అనిపించింది బోసుబాబుకి.
“కథలోని కుర్రాడిని కాశీకి పంపొచ్చు చివరికి. లేదా వీడి అమ్మానాన్నల భస్మాన్ని ఏ గుంటలోనో కలిపించి , ఆ కుర్రాడికి మరో సూపర్ ‘గుంట ‘ తో యావజ్జీవం రొమాన్సు సాగించే అవకాశమూ ఇవ్వచ్చు. ఇది కథ గనక. మరి నీ జీవితం కథ కాదే? ఏం చేద్దామంటావు?
మరో కత్తిలాంటి చూపు విసిరాడు గురూజీ. బోసుకి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
” నీ ఏరియాలో నీకు తెలీకుండా నువ్వు పెట్టిన సారా కొట్లోనే కల్తీ జరుగుతుందా? ఎవడో కోన్ కిస్క గాడొచ్చి కల్తీసారా తాగి నొప్పితో దొర్లుతున్న వెధవల్ని స్టార్ హాస్పటల్లో చేర్చి అర్ధరాత్రి దేవుడై పోతాడా? కోమాలో వున్నవాళ్ళ అవయవాలని ‘అవయవదానం ‘ పేరిట హస్తగతం చేసుకొని రాయల్ హాస్పటల్ వాడు లక్షలు గడిస్తాడా? అవయవదానానికి వొప్పు కున్న చచ్చినోళ్ళ బంధువులకి ‘వేలు ‘ మాత్రమే ఇచ్చి మిగితాది శామ్యూల్ రెడ్డి గాడు భోంచేస్తాడా? ఇవేవీ తెలీకుండా ఎర్రి ఎదవలాగా నువ్వు శోభ చుట్టూ పాలు చూసిన పిల్లిలా గంతులేస్తూ తిరుగుతావా? నిన్నగాక మొన్న చూశావు ఎంతమందికి ‘సీటు ‘ మీద ఆశ వుందో? ఏం చెయ్యమంటావు? ” దిగ్గున లేచి పచార్లు మొదలెట్టాడు గురూజీ. రాముడు రావణాసురుడి వేషంలోకి మారినట్టుంది గురూజీ నడుస్తుంటే.
“కనుక్కుంటాను గురూజీ. దీని వెనకాల ఎవరున్నారో కనుక్కుని తీరతాను. ” పట్టుదల ముంచుకొచ్చి అన్నాడు బోసు.
“కనుకుని ఏం చేయగలవు? జరిగిన డామేజీని ఏ తట్టలో మూసిపెట్టగలవు? ” ఆగి సూటిగా చూస్తూ అన్నాడు గురూజీ.
“గురూజీ… ఎవరు చేశారో ముందు కనుక్కుంటాను. ఆ తరవాత ఏం చెయ్యాలో మీరే నిర్ణయిద్దురుగానీ…. సెలవు. ” అంటూ నమస్కరించి బయటకొచ్చాడు బోసు.
“అదేంటీ?మీ అనుమతి లేకుండా ఏనాడు బయటకి పోనివాడు సడన్ గా తానే సెలవంటూ వెళ్ళిపోయాడేం? “ఆశ్చర్యంగా అడిగాడు గురూగారి ఆంతరంగిక శిష్యుడు.
“ఏం మాట్లాడితే ఎదుటివాడు రెచ్చిపోతాడో అది మాట్లాడటమే రాజకీయం ! ” నవ్వాడు గురూజీ. ఆ నవ్వులో కనీకనిపించని విజయం వుంది. అప్పుడే పుట్టిన రాజకీయ నిర్వచనమూ వుంది.

***************************

కల్తీ సారా కేసు మరోసారి “డిసెంట్రీ ‘ కేసుగా నమోదయ్యింది కాబట్టి ‘కొట్టి ‘ వేయబడింది. కారణం రాయల్ హాస్పటల్ వారు ఎనిమిది మంది చావుకి పన్నెండు మంది అస్వస్థకి కారణం డ్రైనేజ్ వాటర్ కలిసిన నీటిని తాగటమే అని నిర్ధారించి చెప్పబట్టి . అలాంటి నిర్ధారణకి రావడం కోసం బోసుబాబుకు కూడా ‘భారి ‘ గా చెల్లించక తప్పలేదు. మర్నాటి నుంచి కల్లు సారా యథాతథంగా గుడిసెల సిటీలో ప్రవహించసాగింది.
అన్నీ చూస్తోన్న మాధవికి మతి పోతోంది. ‘చివరకి గెలిచేది సత్యమే ” అన్న వాడు మహాబుద్ధిశాలి. అందులో రెండర్ధాలు వున్నాయి. చివరివరకూ అన్యాయానిది గెలుపైతే , చిట్టచివర న్యాయం గెలుస్తుందన్న మాట. అలాగే సత్యమూ ధర్మమూ కూడా. కనక యధాతధంగా అసత్యమే గెలిచింది. అన్యాయమే గెలిచింది.
‘చిట్ట చివరిదాకా ‘ పోరాడే ఓపిక ఎవరికి వుంది? పోనీ పోరాడినా ఆ గెలుపులో వచ్చేదేమిటి? కోర్టు ఖర్చుల కోసం చేసే అప్పు తప్ప.
మూడు రోజులుగా జరుగుతున్న ‘తంతు ‘ ఇదే. వీళ్ళు ముగ్గురూ గుడిసెల సిటికి పొద్దున్నే పోయి రాత్రికి రావడం. సుందరి ప్రతీ రోజు మాధవి కోసం ఎదురు చూసి ఆవిడ రాకపోవడంతో విసుగెత్తి ఇంటికెళ్ళిపోవడం … ఇదీ రోజూ వారి జరుగుతున్న చర్య.
ఓ విధంగా యీ విషయంతో శామ్యూల్ రెడ్డికి కూడా సంబంధం లేకపోలేదు. కావాలనే అతను శోభతో చెప్పాడు. డైలీ గుడిసెల సిటికి వెళ్ళి సదరు కల్తీ సారా బాధితుల కష్టనష్టాలు కనుక్కోమని , వీలున్నంత సేవ చేయమని , స్కూల్ నుంచి సేవకి ఆమెని ప్రతినిధిగా నియమించాననీ.
కనుక ప్రస్తుతం ‘సేవా ప్రతినిధిగా ‘ శోభ గుడిసె గుడిసె కు వెళ్ళి బాగోగులు కనుక్కుంటోంది. మరీ కష్టాలున్న కుటుంబాల విషయం శామ్యూల్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తోంది.
ఆమె తన దృష్టికి తెచ్చిన ప్రతీ ‘కేసు ‘ ని శామ్యూల్ రెడ్డి ఎంత ఖర్చైనా వెంటనే పరిష్కరిస్తున్నాడు. దాంతో గుడిసెల సిటిలో శోభ వైభవం శోభాయమానంగా వెలిగిపోతోంది. ఎంత అంటే తోటి టీచర్లు యీర్ష పడేంతగా. ఆల్ రెడీ మేరీ టీచర్ పేట్రిక్ ఫెర్నాండోతో “చూశావా ప్రెటీ ! సాటి క్రీష్టియన్స్ ని నిర్లక్షం చేసి ఓ హిందూ గాళ్ కి ఎంత ఇంపార్టన్స్ నిస్తున్నాడో? ” అని అందిట. దానికి సమాదానంగా సులోచన వసుమతితో “చూశావా వసు… సేవకి కూడా కులం మతం అంటగట్టే ఛండాలపు రోజులొచ్చాయి. ఇదేనేమో కలియుగ మహత్యం అంటే! ” అని అన్నదనీ, దానికి ప్రతిగా స్కూల్లో టీచర్లందరూ కులాల వారిగా, మతాల వారిగా వేరు పడి ఎవరి కుంపట్లు వారు వెలిగించుకోవడమే కాక , పిల్లల్లో కూడా విడి కుంపట్లు రగిలిస్తున్నారని కూడా ప్రత్యేక ప్రాంతీయ వార్తలు గుప్పుమన్నాయి.
లోకంలో పంచభూతాలైన నీరు,నిప్పు,గాలి, నేలా ఆకాశము ఎంత బలమైనవో … మనుషుల్లో కులమూ, మతమూ, ప్రాంతమూ, భాషా, వృత్తి, కూడా అంతే బలమైనవి. అవి సర్వాన్ని నిర్మించనూ గలవు. సర్వాన్నీ నాశనమూ చేయగలవు.
స్కూలు వాతావరణం విచిత్రంగా వుంది. విద్యార్ధులు , బోధనా , క్రమశిక్షణా వంటి వాటిని పక్కన పెడితే టీచర్ల అసహనమూ, శామ్యూల్ రెడ్డి పేరు దాహమూ, ఇవి ముందు వరుసలో వున్నై. శోభ పుట్టిన రోజైన పదో రోజున డేనియల్ డేవిడ్ గారి పుట్టిన రోజు వచ్చింది. కానీ, ఆయన పుట్టిన రోజుని శామ్యూల్ రెడ్డి గారు ఘనంగా చేయలేదు. అసలు డేవిడ్ పుట్టిన రోజు శామ్యూల్ పట్టించుకోలేదన్నది పచ్చి నిజం.
ఊరందరికీ ఉపకారం చేస్తున్నానని ఆనందపడిపోతున్న శోభకి , స్కూల్లో జరుగుతున్న వ్యవహారాలు ఓ రోజు తెలిశాయి. చెప్పింది ఎవరో కాదు వసుమతి. విన్న వెంటనే దిగాలు పడింది.
“అక్కా.. నేను అనాథనని అందరికీ తెలుసు. అనాథకి కులమతాలెక్కడి నుంచి వస్తాయక్కా? తల్లెవరో తండ్రెవరో తెలీని నాతో ఏ దేవుడు పూజలందుకుంటాడు అక్కా. ఒట్టేసి చెబుతున్నా… నా మీద మిగతావారికి యీర్ష కలిగితే నేను స్కూల్ వదిలి వెళ్ళిపోతా. అంతేకానీ చదువుకునే పిల్లల మధ్య చిచ్చు రగలనివ్వను. ” అని సౌందర్యతోనూ, మాధవితోను చెప్పుకొని ఏడ్చింది.
“ఏడ్వకు శోభా, కష్టాలు గాయాల్లాంటివి. అవి కాలం తోటే మానుతాయి. అయినా ఓ సమస్య వచ్చినప్పుడు , ఆ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలి కానీ పారిపోతారా పిచ్చిదానా? ” అని ధైర్యం చెప్పింది మాధవి. కానీ ఆమెకి తెలుసు , టీచర్ల మధ్య రేగిన చిచ్చు అంత త్వరగా ఆరదని.

*******************

జీవితమంటే ఏమిటి?
పుట్టుక… కొన్ని కష్టాలు.. కొన్ని సుఖాలు, కొన్ని రోగాలూ రొప్పులూ, కొన్ని రాజపూజ్యాలు అవమానాలు, కొన్ని ఆదరణలూ… కొన్ని అవహేళనలూ… చివరికి చావు.. ఇంతే!
“ఇంకా? ”
“కష్టనష్టాలూ సుఖదుఖాలూ పక్కపక్కనే వుంటై. సుఖం పక్కన దుఖం దుఖం పక్కనే సుఖం ”
“ఇంకా? ”
“ఓ ఇంకా ఇంకా అనేదానా నువ్వెవరూ? నీ పేరేమిటి? ” నవ్వుతూ అన్నాడు ఆనంద రావు.
” నా పేరు మిస్ శోభా రాణీ బి.యెస్.సీ. ప్రస్తుతం నేనో దేవదూతగా మీ గది ముందుకొచ్చాను ”
“ఆహా.. ఇంతకీ ‘వర్జిన్ ఏంజిల్ ‘ సందేశమేమిటి? ”
“బాచులర్ డివోటీ కి బాంక్ ఉత్తరం అందించడమే! ” నవ్వింది శోభారాణి ఉత్తరం ఇస్తూ. అది ‘లక్ష్మీ విలాస్ బాంక్ ‘ వారి లేఖ.
“ఇది మీకెలా వచ్చింది? ” ఆశ్చర్యంగా అన్నాడు ఆనందరావు.
“వస్తుంటే పోస్ట్ మాన్ మీకందించమని చెప్పి నా చేతికిచ్చాడు. మీరు మాకు స్నేహితులని అతనికి తెలుసు. మనందరినీ గుడిసెల సిటీలో చూస్తున్నవాడే. ఇంతకీ ఉత్తరంలో ఏముందో చదవండి ముందు ” నేల మీద కూర్చొని అంది శోభ.
“శోభగారు నిజంగా మీరు దేవతేనండి. రికామీగా తిరిగే నన్ను దేవుడు చూడలేక బ్యాంకు ఉద్యోగం ప్రసాదించాడండి! అర్జెంటుగా నన్ను బోంబేకి రమ్మని , ఖర్చులు వారే భరిస్తారని , నెల రోజుల గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుందని ఉత్తరం వ్రాశారు ” ఆనందంగా అన్నాడు ఆనందరావు.
“వావ్… అయితే ఇవ్వాళ బ్రహ్మండమైన ట్రీట్ ఉందన్న మాట! ” దిగ్గున లేచి అతనికి షేక్ హాండ్ ఇస్తూ అంది శోభ.
ఆనందరావు కూడా ఆ చేతిని ఊపుతూ నవ్వుతున్నాడు.
“కొంపదీసి పాణిగ్రహణమేమిటోయ్? ” శోభని నఖశిఖపర్యంతం చూస్తూ అన్నాడు సామాన్యరావు.
“కళ్లకి కనపడుతుంటే చూసి కూడా అడుగుతావేంటయ్యా వెంగళప్పా… ” అసూయగా ద్వారానికి అడ్డంగా నిలబడి అన్నది అనసూయ. ఆవిడ చూపంతా బనీను, లుంగీ మీదున్న ఆనందరావు మీదే వుంది.
“అయ్యా.. సామాన్యరావు గారు!! అనసూయమ్మగారూ, వీరు శోభగారని నా స్నేహితురాలు. వృత్తి ఉపాధ్యాయిణి. దేవతలాగా వీరు .. ఇదిగో యీ బ్యాంకు అపాయింట్ మెంట్ ఉత్తరం నా చేతికిచ్చి అభినందిస్తూ హస్తచాలనం చేశారే కానీ , ఇదేమీ పాణిగ్రహణమో పాదగ్రహణమో కాదు. సరేనా? ఇంకేమన్నా సందేహాలున్నాయా? ” నవ్వుతూనే అన్నాడు ఆనందరావు.
” మరి ఆ ముక్క ముందు చెప్పవేం? నీ నోట్లో పంచదార పొయ్య. నీకూ మా చెల్లెలి కూతురికి వివాహం జరగాలి! ” ఆశీర్వాదంతో పాటు తన ఆలోచన కూడా బయట పెట్టి పంచదార తేడానికి ఇంట్లోకి పోయింది అనసూయ.
“ఓహో.. అదా.. ” నిరుత్సాహంగా వెనక్కి తిరిగాడు సామాన్యరావు.
మరో నిమిషమున్నార సమయంలో ఆనందరావుకి బ్యాంక్ ఉద్యోగం వచ్చిందన్న వార్త ఆ వీధికే కాక అటు ఇటు ఉండే ఐదారు వీధులకు పాకిపోయింది.
నిన్నటి దాకా ఉద్యోగం సద్యోగం లేనివాడికి పిల్లనెలా ఇస్తాం అనుకునే వాళ్ళు కూడా అర్జెంటుగా స్వీట్లు, బొకేలు పట్టుకొని ఆ గదిలోకి ఎంటరైపోయారు. ఆనందరావు అందరినీ ‘థాంక్స్ ‘ తో రిసీవ్ చేసుకుంటుంటే శోభ మాత్రం జనాల తాకిడికి ఓ మూల నిలబడి అవాక్కైంది.
ఆ నిశబ్ధం లోనుంచే మొదటి సారి, మొట్టమొదటిసారి ఆనందరావు ని కళ్ళు విప్పి మనసుతో చూసింది.
“ఓహ్.. నిజంగా ఆరడుగుల అందగాడు , అసలా నవ్వు ఎంత నిర్మలంగా ఎంత హాయిగా ఉంది. ఇతను నావాడైతే? ” తనలో తాను అనుకుంటూ అతని వంకే చూస్తోంది శోభ. ఆ ఆలోచనకే ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. పెదాలు చిన్నగా వణికాయి.
‘చెప్పాలి వెంటనే మాధవక్కకి చెప్పాలి. తను తలచుకుంటే ఇతన్ని నాకిచ్చి పెళ్ళి చేసే ప్రయత్నం చెయ్యగలదు.
మరోసారి ‘పెళ్ళి ‘ అనుకోగానే ఆమె ఒళ్ళంతా తటిల్లతలా వొణికింది. అప్పటి వరకు పురుషుడ్ని పురుషుడిగా చూడని ఆమె మనసు ఒక్కసారి వూహాలోకానికి తలుపులు బార్లా తీసింది.
ఆనందరావూ, తనూ వధూవరులుగా పక్కపక్కన నిలుచునట్టు , ఊరూవూరంతా తమ మీద అక్షింతలు వేస్తున్నట్టూ అక్కడికక్కడ ఓ దృశ్యం ప్రత్యక్షమయ్యింది.
“మిమల్నే ఏమిటాలోచిస్తున్నారూ? ‘ట్రీట్ ‘ అన్నారుగా పదండి. మాధవిగారికి చెప్పి అటునుంచి అటే ‘ గ్రాండ్ గాలా ‘ లంచ్ కి పోద్దాం. ” నవ్వుతూ ఆనందరావు అన్న మాటలకి యీ లోకానికొచ్చి సిగ్గు పడుతూ నవ్వింది మిస్ శోభా రాణి బియ్యెస్సీ.

ఇంకా వుంది…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *