May 9, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 8

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

123balaji

అన్నమయ్య మనుమడైన చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణమైన “పదచ్ఛందము” లో సంకీర్తనల గొప్ప దనాన్ని ఎంతో వైభవంగా కీర్తించాడు. “శృతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞానసారంబులై / యతిలోకాగమ వీథులై వివిధమంత్రార్థంబులై నీతులై కృతులై వేంకటశైలవల్లభ రతిక్రీడారహస్యంబులై / నుతులై తాళుల పాక న్నయ వచోనూత్నక్రియల్ చెన్నగున్.” అంటాడు. తాతగారైన అన్నముని కీర్తనలు వేద, వేదాంగాలతో సమానం, సకల శాస్త్రాలతో సమానం, ఇవి జ్ఞాన భాండాగారాలు, వివిధ మంత్రాల యొక్క అర్ధాలై, నుతులై, శ్రీవేంకటేశ్వరుని శృంగార క్రీడలై భూమండలంలో విలసిల్లుతాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చాడు.

అది యదార్ధం. పరమ సత్యమైన విషయం. భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు (మార్గాలు) తెలియజేశారు మహాభక్త పోతన. దానికి ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ” శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం / అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం / ఇతి పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా / క్రియతే భగవత్యద్ధా తన్మన్యేధీతముత్తమమ్” అంటే పోతన అచ్చతెనుగులో “తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!” అంటాడు. భగవంతుని పూజిం చడానికి అనేక మార్గాలున్నాయన్న మాట నిజమే కానీ వానిలో కీర్తనం అనగా భగవంతుని గుణగణములను కీర్తించి తరించుట కలియుగం లో మనకు ఇవ్వబడ్డ ఏకైక సులభ సాధనం.

మహాభాగవతం లో చెప్పిన కీర్తన అనే భక్తి మార్గాన్ని అన్నమయ్య ఈక్రింది కీర్తనలో సామాన్య ప్రజలకు సైతం అర్ధమయ్యేల రంగరించి పోత పోశాడు.

సామంతం
పల్లవి: చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం.

చ.1. సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం || చాలదా||

చ.2. సామజముఁ గాచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం || చాలదా||

చ.3. జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యము లిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం || చాలదా||

చ.4. జలజాసనుని నోరి సంకీర్తనం
చలిగొండసుత దలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం || చాలదా||

చ.5. సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం || చాలదా||
(అ.సం.కీర్తన – రేకు 66 – సం.1 కీ. 343)

విశ్లేషణ:
పల్లవి: చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడఁగించు సంకీర్తనం.

వేదవేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు ఏమీ అవసరం లేదు. హరి సంకీర్తన మొక్కటి చాలదా? ఈ సంకీర్తనమే పరమాత్మ! మీ కష్టాలనన్నిటినీ తీర్చి కడతేరుస్తుంది. రండి. దేవదేవుని సంకీర్తనా యజ్ఞంలో పాలుపంచుకోండి అని ప్రభోదిస్తున్నాడు భక్తకోటికి అన్నమయ్య.

చ.1. సంతోషకరమైన సంకీర్తనం
సంతాప మణఁగించు సంకీర్తనం
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం.

అపరిమిత సుఖసంతోషాన్నిస్తుంది ఈ సంకీర్తన. మీ సర్వబాధలను అణిచివేస్తుంది.సృష్టిలోని ఎల్ల జీవకోటినీ రక్షిస్తుంది. నిరంతరం ఈ సంకీర్తననే తలచండి. ఇదే ముక్తి దోవ అని చెప్తున్నాడు.

చ.2. సామజముఁ గాచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం.

ఆ సంకీర్తనే గజేంద్ర మోక్షంలో కరిని రక్షించింది. ముసలి బారిన పడ్డ గజేంద్రుడు “ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై / యెవ్వని యందు డిందు; పరమేశ్వరుడెవ్వడు; మూల కారణం/బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా/డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్” అని అతి దీనం గా విష్ణుమూర్తిని ప్రార్ధించింది. “కలఁ డందురు దీనులయెడఁ, గలఁ డందురు పరమయోగి గణముల పాలంగలఁ డందు రన్ని దిశలను, గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడో” అని సందేహపడింది. చివరకు ఆర్తితో “ఓ కమలాత్మ! యో వరద! కరుణింపవే, తలఁపవే, శరణార్థిని నన్నుఁ గావవే.” అని ప్రార్ధించే సరికి సరోవరాన్ని చేరీచేరుతూనే హరి తన సుదర్శన చక్రాన్ని విడిచి పెట్టగానే విస్ఫుల్లింగాలు చిమ్ముతూ ఆ సుదర్శనం మరుక్షణంలో సరోవరంలోకి ప్రవేశించి ఆ మొసలితలను ఖండించింది. ఆ అనుగ్రహంతోనే గజరాజు వైకుంఠాన్ని చేరుకొంటాడు. నిరంతరం ఎవరైతే శ్రీహరిని స్మరిస్తారో వారిని ఎప్పుడు నేను విస్మరించను అని శ్రీదేవికి చెప్పగా, ఆ లక్ష్మి దేవి దీనుల మొర విని వారిని రక్షించే శ్రీమహావిష్ణువుతో రావడం కంటే భాగ్యం ఎమి ఉంటుందని అంటుంది. వేదాలకంటే ఎక్కువ ఈ సంకీర్తనమే! అని నిరూపణ అయినది. జీవకోటిలో ఏమాత్రం బేధం లేకుండా అందరి సమీప్యంలో లభించేది సంకీర్తన ఒక్కటే! సామాన్య గజేంద్రుడికి మోక్షం ప్రసాదించినది సంకీర్తనే! అటువంటి సంకీర్తన సామాన్యమైనదని తలచవద్దు అంటున్నాడు అన్నమయ్య.

చ.3. జముబారి విడిపించు సంకీర్తనం
సమబుద్ధి వొడమించు సంకీర్తనం
జమళి సౌఖ్యము లిచ్చు సంకీర్తనం
శమదమాదులఁ జేయు సంకీర్తనం!

యముని బారి నుండి రక్షించేది సంకీర్తన ఒక్కటే! ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడే ఇంద్రుడు అతని తల్లిని బంధించి తీసుకుపోతుంటే నారదుడు వారించి, వెనుకకు తీసికొనివచ్చి, గర్భస్థ శిశువునకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. నాటి నుండి, అంటే ఇంకా భూమి మీద పడకుండగానే నారాయణ భక్తిలో మునిగిపోయాడు ప్రహ్లాదుడు. నారాయణుడే దైవమని నొక్కి వక్కా ణించాడు. తండ్రికే ఎదురు చెప్పిన ప్రహ్లాదుణ్ణి, కొడుకు అని కూడా చూడకుండా ఏనుగులతో తొక్కించాడు, గదలతో మోదించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని తాగించాడు, మంటలోకి తోయించాడు, కొండలపై నుంచి లోయలలోనికి గెంటించాడు, సముద్రంలో పడవేయించాడు. ఎన్ని “యమ చెరలు” పెట్టినా కేవలం నారాయణ నామస్మరణంతో బ్రతికాడు ప్రహ్లాదుడు. ఎక్కువ తక్కువలు లేని నారాయన భక్తిలా అందరికీ సమబుద్ధిని ప్రసాదిస్తుంది ఈ సంకీర్తన. ఇహ పర (రెండు) సౌఖ్యాలను ప్రసాదించేది సంకీర్తనే! శాశ్వతమైన శాంతి సౌఖ్యాలనిచ్చేది ఈ సంకీర్తనే!

చ.4. జలజాసనుని నోరి సంకీర్తనం
చలిగొండసుత దలఁచు సంకీర్తనం
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం

విష్ణుమూర్తిని నోరారా సంకీర్తించండి. అన్ని ఆపదలనుండి రక్షించ గలదు. మన నాలుకకు సంకీర్తనే వ్యాయామం. అందువల్ల పట్టుబట్టి దేవదేవుని కీర్తించండి అంటాడు.

చ.5. సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం
సరుస వేంకటవిభుని సంకీర్తనం
సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం

మనకు క్రమంగా సంపదలను ప్రసాదించేది ఒక్క సంకీర్తన మాత్రమే! ఈ సృష్టిలో సంకీర్తనతో సరైనది ఏదీ లేదు. సక్రమ మార్గం చూపేందుకు సద్గతులు పొందేందుకు చెంతనే ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని కీర్తించండి అని ప్రభోదిస్తాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు. బ్రహ్మ = పరమాత్మ; జాలె = బొంగరపుతాడు (కష్టాలలో చిక్కుకోవడం అన్న అర్ధంతో) సంతతము = ఎల్లప్పుడు; సామజము = సామవేదమునుండి పుట్టినది, ఏనుగు; సామము = వేదం, జముడు (వి) = యముడు (ప్ర) ; జమళి = రెండు (డబుల్); శమము = శాంతి; దమము = దండోపాయం; చలుప = రాయి; చలపట్టి = పట్టుబట్టి; సరవి = క్రమముగా; సరుస = చెంత; సరుగనను = సక్రమ మార్గం కనుక్కోవడానికి అన్న అర్ధంలో.

[ఈ పదాలు విశ్లేషించుకోవడం కత్తిమీద సాము వంటిదని విజ్ఞులందరికీ విదితమే! కొన్ని నిఘంటువులలో భేదార్ధాలు గమనించడం జరిగింది. ఎన్నో పదాలు దాదాపు వాడుకలో లేనివే. సమయాన్ని బట్టి అర్ధం వాడడం జరిగింది. సహేతుకంగా ఎవరైనా నా అర్ధాలతో విభేదిస్తే స్వీకరిస్తానని సవినయంగా మనవి చేస్తున్నాను – అన్నమయ్య పదాంఘ్రి రేణువు)]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *