May 9, 2024

“పోరనట్టి ఆలిగలదె?” ఆటవెలదులు

రచన: కిభశ్రీ

ఏ మగాడైనా, భార్య పదే పదే ఏదైనా చెప్పిందంటే దాన్ని పోరు కింద పరిగణిస్తాడు.
సరదాగా భార్య పెట్టే పోరుగానే వివరిస్తూ, తనమంచికే ఆమె చెబుతూందన్న భావాన్ని కొన్ని ఆటవెలది పద్యాలలో …..

ఏమగాడికైన ఇంట్లోన యేబాధలసలు పెట్టనట్టి ఆలి గలదె?
చదువులెన్నియున్న చవటాయివేనీవుయనుచు పోరనట్టి ఆలి గలదె?

సూర్యుడదిగొ లేచె చూడెంత బాగుండె మొద్దు నిదుర మాని ముసుగు తీసి
జాగుచేయకుండ జాగింగుకే పొమ్మననుచు పోరనట్టియాలి గలదె?

బానపొట్ట చూడు పనస పండంతయ్యి మోయలేక బరువు మూల్గుటేల
వళ్ళు తగ్గగాను వర్కౌటుచేయరాయనుచు పోరనట్టియాలి గలదె?

పగలు రేయి నేను పనిచేయుచుంటినే కౌచుమీదినుంచి కదలవీవు
హెల్పు కొంత చేయ హెల్లు కూలదులేయననుచు పోరనట్టియాలి గలదె?

కూరలైన తరిగి కుక్కింగులో కొంత సాయపడక పోతె సమయమునకు
డిన్నరేవిధము రెడీ ఔనననుకొందువనుచు పోరనట్టియాలి గలదె?

మొహము వెలుగునే సమోసా కచోరీలు చూడగానె నీకు చొంగకారు
కాలరీలు ఫాటు గలఫుడ్లు తిననేల యనుచు పోరనట్టియాలి గలదె?

లాగులుతుకగాను లాండ్రీకి డబ్బేల ఇంట మిషినుయున్నదేల మనకు
ఆదివారముతుకటలవాటుచేసుకోమనుచు పోరనట్టియాలి గలదె?

దుమ్ములో కదలక తుమ్ముతూకూర్చోని ముక్కు చీదుకుంటు మురుగకుండ
వడిగ లేచి వచ్చి వాక్యూముచేయరాయనుచు పోరనట్టియాలి గలదె?

కొన్ని కూరలేవొ కొనితేగ నినుపంప మోసుకొస్తివేల మూటలెన్నొ
వేస్టు చేతువేల విత్తమీవిధినీవననుచు పోరనట్టియాలి గలదె?

ఆబు రోలరెక్కి ఆయాసపడుదువే పాంటు పట్టనంత ఫాటువున్న
సిక్సు పాకు వున్న షేపెట్లువచ్చేను అనుచు పోరనట్టియాలి గలదె?

తీయ మనసె కాని తీపియే తనువంత తీయదనముతో రుధిరమునిండె
షుగరు తగ్గగాను సూపులేనీకింకయనుచు పోరనట్టియాలి గలదె?

ఎన్ని విధులనామె నేడిపించినకూడ ఇంటనుండనిచ్చు ఇంతియామె
వెంటబడుచు తరిమి వెళ్ళపో యిటనుండియననుచు పోరునట్టియాలి గలదె?

చదువమనుచునివ్వ చదివేసి నవ్వేసి చిదిమి బుగ్గ చూపి చిలిపితనము
ఇంక కొన్ని రాయ ఇన్స్పైరుచేసేను అణచి పోరుపెట్టు ఆలిగలదె?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *