April 27, 2024

శ్రీకృష్ణ దేవరాయలు – 6

రచన: విజయ్ భాస్కర్ రాజు

ఎన్నెన్నో విజయాలను అందించి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఘనాపాటిగా తీర్చిదిద్దిన తుళువ నరసానాయకుడు ఉన్నఫళంగా అశ్వస్థతకు గురవ్వడం , ఆ రుగ్మత నుండి కోలుకోలేక మృత్యువాత పడడం విజయనగర సామ్రాజ్యాన్ని విస్మయానికి గురిచేసింది. నరసానాయకుడు అవసాన దశలో ఉన్న సమయం లో రాజ్య కార్యకలాపాలు కుంటుపడ కుండా ఉండేందుకు తన పెద్ద కుమారుడైన వీరనరసిమ్హ రాయలును తన స్థానంలో నియమించి బాధ్యతలు అప్పగించాడు. ఆ మేరకు చక్రవర్తి ఆమోదం కూడా లభించింది. అది జరిగి న కొద్ది రోజులకే నరసానాయకుడు స్వర్గస్థుడయ్యాడు. తదనంతరం వీర నరసింహ రాయలను అన్ని కీలక పదవుల్లో కొనసాగించాలా? వద్దా ? అన్న మీమాంసలో పడ్డాడు చక్రవర్తి రెండవ నరసింహరాయలు. ఈ మేరకు సామంత ప్రభువులతో సంప్రదించాడు. వారంతా వీర నరసిమ్హ రాయలకే మద్దతు తెలపడంతో చక్రవర్తి తన భారాన్ని దించుకున్నాడు. వీర నర సింహ రాయలుకు మరిన్ని బాధ్యతల ను కట్టబెట్టాడు. ఇదిలా ఉండగా దివం గత నరసానాయకునికి ముగ్గురు భార్య లు. వారిలో పెద్ద భార్య తిప్పాజీ. రెండవ భార్య నాగలాంబ . మూడవ భార్య ఓబాంబిక. వారిలో తిప్పాజీకి వీర నరసింహరాయలు,నాగలాంబకు శ్రీకృష్ణ దేవరాయలు, ఓబాంబికకు రంగప్పరాయలు, అచ్యుత దేవ రాయ లు జన్మించారు. అన్నదమ్ములందరూ వీరాధి వీరులే. అయితే రాజ్యార్హత నిబంధనల ప్రకారం ఏ పదవైనా ముందుగా పెద్ద కుమారునికే దక్కు తుంది. అందులో భాగంగానే తన తండ్రి తదనంతరం పెద్దవాడైన వీర నరసింహరాయలను ఆ పదవి వరించింది.

తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వీర నరసింహరాయలు తన చక్రవర్తి పట్ల ప్రభుభక్తికి, విశ్వాసానికి మారుపేరుగా నిలిచాడు. చక్రవర్తిని కంటికి రెప్పలా కాపాడుతూ నిరంతర నిఘాను పెంచాడు. ఫలితంగా చక్రవర్తికి, వీర నరసింహరాయలకు మధ్యన మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వీర నరసింహరాయలు ఏం చెప్పినా చక్రవర్తి జవదాటడం లేదు. ఒకానొక రోజు చక్రవర్తి, రాయలవారు రహస్య సమాలోచనలు జరుపుతున్న సమయంలో వేగుల ద్వారా ఓ ముఖ్య సమాచారం అందింది. అదేమంటే నరసానాయకుని చేతిలో ఓడిపోయిన సామంతులందరూ మళ్ళీ తిరుగుబాటు చేసి స్వతంత్ర ప్రభువులుగా చలామణి అయ్యే పథకాలు రూపొందిస్తున్నారని. సమాచారం అందుకున్న వెంటనే వీరనరసింహరాయలు ఉగ్రుడయ్యాడు. “తన తండ్రి చనిపోయినంత మాత్రాన విజయనగర సామ్రాజ్య శక్తియుక్తులు అడుగంటాయా?వారి సంగతేంటో తేలుస్తానంటూ” వీరనరసింహరాయలు ఆగ్రహంతో మండిపడ్డాడు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. సైన్యాన్ని సర్వ సన్నద్దంగా ఉంచాలంటూ ఆదేశించాడు. అంతలోనే చిన్న ఆలోచన తట్టింది. యుద్ధాల పేరుతో తాను రాజధానికి దూరం ఉంటే చక్రవర్తికి అపాయం తలపెట్టే ప్రమాదం ఉంటుందని భావించాడు. తమ కుటుంబానికి మొదటి నుండి అతి విశ్వాస పాత్రులైన పెనుగొండ దుర్గాధ్యక్షుని సంప్రదించాడు. నిరంతర నిఘా ఉంచి చక్రవర్తిని పకడ్బందీ రక్షణతో కాపాడాలనీ, అందుకు పెనుగొండ దుర్గమే సరైనదనీ, తాను యుద్ధాల నుండి తిరిగి వచ్చే వరకు చక్రవర్తిని అక్కడే ఉంచుకుని ఏ లోటు రాకుండా చూసుకోవాలంటూ ఆదేశించాడు. ఆ మేరకు విషయం చక్రవర్తి దృష్టికి తెచ్చి ఒప్పించాడు. చక్రవర్తి కూడా ఈ ప్రతిపాదనకు ఎంతో ఆనందంగా ఒప్పుకున్నాడు. వీర నరసింహరాయలు చక్రవర్తిని వెంటబెట్టుకుని పెనుగొండ చేరుకున్నా డు. కొద్ది రోజులపాటు ఆక్కడే మకాం వేసి తగిన రక్షణ ఏర్పాట్లు చేశాడు. చక్రవర్తి ఖర్చుల కోసం సంవత్సరానికి ఇరవై వేల క్రూజాడోలు కేటాయించి చక్రవర్తి ఏది కోరుకుంటే అది తక్షణమే అందేలా ఏర్పాట్లు చేశాడు.

తాను యుద్ధాలకు బయలు దేరి వెళ్ళేందుకు ఇక మరెంతో సమయం లేదని, అనుమతిస్తే రాజధాని చేరుకుని యుద్ధ ఏర్పాట్లు పూర్తి చేసుకుంటాననీ చక్రవర్తిని కోరాడు. చక్రవర్తి సంతోషంగా అంగీకరించాడు. ఇక నుండి తను స్వేచ్చగా , స్వతంత్రంగా ఉండొచ్చనీ, తనమీద వీరనరసిమ్హ రాయల పెత్తనం తప్పుతుందనీ వెంటనే అనుమతించా డు. వీరనరసింహరాయలు పెనుగొండ నుండి విజయనగరం చేరుకున్నాడు. తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన తిమ్మప్పనాయకుడిని రప్పించాడు. ఇరవై వేల మంది సైన్యాన్ని చక్రవర్తి అంగరక్షకులుగా నియమించాడు. ఆ సైన్యానికి తిమ్మప్ప నాయకున్ని సైన్యాధ్యక్షునిగా నియమింప జేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజు నగరం విడిచి వెళ్ళకుండా చూడాలని, రాజుపై ఎలాంటి కుట్రలు జరగకుండా కంటికి రెప్పలా కాపాడాలంటూ ఆదేశించాడు. ఆ మేరకు ఆఘమేఘాలపై పెనుగొండ పంపించాడు. అనంతరం యుద్ధానికి బయలు దేరిన వీర నరసింహరాయలు తమ చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన సామంత ప్రభువులను ఒక్కరొక్కరిగా ధ్వంసం చేస్తూ ఓడించసాగాడు. వెళ్లిన ప్రతిచోట స్వైర విహారమే. విజయం విజయ నగర సొంతమే. ఈ నేపథ్యంలో వీరనరసింహునితో కొందరు సేనానులకు సాన్నిహిత్యం పెరిగింది. అందులో కొండమరుసు ఒకరు. నరసానాయకుని కాలం నుండి కొండమరుసుకు ఈ కుటుంబమంటే వల్లమాలిన ప్రేమ. తెలివితేటల్లో, యుద్ధవిద్యల్లో ఆరితేరిన వాడు. ప్రస్తుతం ఎదురు తిరిగిన సామంత ప్రభువుల అణచివేతలో కొండమరుసుదే ప్రధాన పాత్ర. యుద్ధాలు ముగించి వీరనరసింహరాయలు రాజధాని చేరుకున్నాడు. యుద్ధాలలో అరివీర భయంకరంగా పోరాడిన దండనాయకులను ప్రశంసించే కార్యక్రమాలను నిర్వహిస్తున్న రోజుల్లో ఒకరోజు కొండమరుసు వీరనరసింహ రాయల వద్దకు వచ్చాడు. చక్రవర్తితో ఏకాంత సమావేశానికి అనుమతి కోరాడు. అనుమతి లభించాక నిర్ణీత రోజున చక్రవర్తితో సమావేశమై తన మనసులోని మాట బయట పెట్టాడు. చక్రవర్తి రెండవ నరసింహుడు రాజ్య పాలనకు అర్హుడు కాదన్నాడు. చెప్పుడు మాటలకు లోబడి సొంత నిర్ణయాలు తీసుకుంటాడనీ,అలాంటి రాజు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా కొనసాగడం రాజ్య శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని అందువల్ల అతన్ని హతమార్చడమే శ్రేయోదాయకమని చెవిలో నూరి పోశాడు. అయితే గుండెనిండా ప్రభుభక్తి గల వీరనరసింహరాయలు ఆ మాటలు పెడచెవిన పెట్టాడు. మౌనమే సమాధానంగా మిన్నకుండిపోయాడు. అయినా కొండమరుసు తన పట్టు వీడలేదు. మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

కొద్ది రోజులు గడిచాక అక్కడ పెనుగొండలో ఉన్న చక్రవర్తిని కొందరు సామంతులు కలసి రహస్య సమాలోచనలు జరిపారు. భద్రతా పరిస్థితుల దృష్ట్యా అది మంచిది కాదని చెప్పినా చక్రవర్తి ఇటు సైన్యం మాటను కానీ, అటు కొండమరుసు మాట కానీ వినడం లేదు. దీంతో చక్రవర్తి రక్షణ పట్ల సైన్యం ఆందోళన చెందుతూ విషయాన్ని వీరనరసింహ రాయలకు చేరవేయాలంటూ కొండమరుసును కోరింది. ఇదే అదనుగా భావించిన కొండమరుసు వెంటనే వీరనరసింహ రాయలను కలిశాడు. పెనుగొండలో చక్రవర్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడనీ ,కొందరు సామంత ప్రభువులు నేరుగా కలిసి రహస్య సంప్రదింపులు జరుపుతున్నారనీ విన్నవించాడు. దీంతో రాయలు ఈ విషయంపై ఆరా తీశాడు. చక్రవర్తి అంగరక్షక సైన్యాధిపతి తిమ్మప్ప నాయకునితో పాటు వేగులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. చక్రవర్తి తీరును వీరనరసింహరాయలు అను మానించాల్సి వచ్చింది. ఆయన మనస్సులో అనుమాన బీజం నాటు కుందని రూఢీ అయ్యాక కొండమరుసుకు ఓ ఆలోచన తట్టింది. ఎలాగైనా మాటల గారడీతోనే వీరనరసింహుని మనసు మార్చాలనుకున్నాడు. అందుకు సరైన సమయం రానే వచ్చింది. వీరనరసింహుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అడిగిన వారికి ఏదీ కాదనకుండా మంజూరు చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే కొండమరుసు రాయలవారిని కలిశాడు. “చక్రవర్తి ఎవరి మాటలంటే వారి మాట లు నమ్ముతున్నాడనీ,రాజకీయ పరిణతీ, విచక్షణా జ్గ్నానం లేనందువల్ల అనాలోచిత నిర్ణయాలు తీసుకుం టున్నాడనీ, చెప్పుడు మాటలు రాజ్యానికి చేటు తెస్తాయనీ” వీరనరసింహునితో విన్నవించాడు కొండమరుసు. “గతంలో మీ తండ్రి నరసానాయకున్ని ఉన్నఫళంగా పదవులనుంచి తప్పించింది చెప్పుడు మాటల ద్వారానే అనీ, అప్పట్లో మీ తండ్రి పెనుగొండ దుర్గం ద్వారానే తిరిగి పదవిని దక్కించుకున్నాడనీ, ఈసారీ అదే పరిస్థితి తలెత్తితే సామంత ప్రభువుల దృష్టిలో ,ప్రజల దృష్టిలో చులకన అవుతామంటూ వీరనరసింహ రాయల అనుమానానికి ఆజ్యం పోశాడు కొండమరుసు. అంతే! కొండమరుసు మాటలు మనసులో నాటుకు పోయాయి. వీరనరసింహరాయలు ఇక ఉపేక్షించ దలుచుకోలేదు. చక్రవర్తిని మూడోకంటికి తెలియకుండా చంపించడంతో పాటు తన గొప్పతనాన్ని మరింతగా పెంచి ఈ రాజ్యానికి ఏకైక ప్రభువుగా తనను కొలిచే మార్గం గురించి ఆలోచించాడు. అందుకోసమై అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు కొండమరుసును పిలిపించాడు. తన హస్తం ఉందని తెలియకుండా రాజును హత్య చేసే మార్గం సూచించమంటూ అడిగాడు.

ఇంకేం ! అదే ఆలోచనలో ఉన్న కొండమరుసు వెంటనే సమాధానమిస్తూ ” లేకేం ప్రభూ. . . ఎప్పుడో ఆలోచించి పెట్టిన ఒక మంచి మార్గముందని” చెప్పాడు. ” అదెలా ” అన్నాడు వీరనరసింహుడు. కొండమరుసు అందుకు సమాధానమిస్తూ “నేను పెను గొండ దుర్గ పరిపాలనా విషయంలో కొన్ని తప్పులు చేశాననీ ,అందువల్ల తక్షణమే మంత్రి దర్శనానికి రావాలం టూ తమరు నన్ను ఆదేశించాలి. నేను మీ ఆజ్గ్నను ఉల్లంఘిస్తాను. నా క్రమ శిక్షణారాహిత్యానికి మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఫలితంగా మీ ద్వారా నాకు శిక్ష పడుతుందేమోనని నేను భయపడతాను. ఆ భయంతో విజయ నగరం నుండి పెనుగొండకు పారి పోతాను. అక్కడే ఉన్న చక్రవర్తికి ఈ విషయం వివరించి మీ ఆగ్రహం గురించి చెబుతాను. మెల్లమెల్లగా రాజుకు దగ్గరై మంత్రిగా మీరు తగరని, మీకు వ్యతిరేకంగా రాజును ప్రేరేపిస్తాను. తద్వారా చక్రవర్తికి మరింత దగ్గరవుతాను. ఆ పిదప రాజ్యంలోని సామంతులందరూ మీ పట్ల అసంతృప్తికి గురై చక్రవర్తిని అభిమాని స్తున్నట్లు భ్రమ కల్పిస్తాను. అందులో భాగంగా మిమ్ములను వ్యతిరేకిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సామంతుడు వారి వారి లేఖల ద్వారా చక్రవర్తికి ఫిర్యాదు చేస్తున్నట్లు నకిలీ లేఖలు సృష్టిస్తాను. ఆ లేఖల్లో రాజును ఉద్దేశించి చెబుతూ ” భుజబలాన్ని నమ్ముకుని మీ తండ్రిగారు సాధించిన ఈ రాజ్యంలో మీరు చక్రవర్తిగా కాకుండా ఓ రాజరిక బందీగా బ్రతకడం ఎంత మాత్రమూ మాకిష్టం లేదు. మీ రాజ్యానికి మీరే ఏకైక ప్రభువు కావాలి. మీకు మంత్రి, సామంతుడు అయిన వీరనరసింహరాయల అధీనంలో ఈ రాజ్యం ఉండడం మీకు శ్రేయస్కరం కాదు. నిర్ణయాధికారంతో పాటు పెత్తనమంతా మంత్రిదే అయినందువల్ల అతను మీ రాజ్యంలో అత్యంత బలవంతుడిగా మారాడు. మిమ్ములను ఓ బందీగా రాజధానికి దూరంగా ఉంచి, ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసి ఈ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలనే దురాలోచనలో మంత్రి ఉన్నాడని,అదే జరిగితే మీ ఉప్పు, కారం తింటున్న మేము ఎంత మాత్రం సహిస్తూ బ్రతకలే మని” లేఖల్లో రాయిస్తానని చెప్పాడు కొండమరుసు.

“చక్రవర్తి ఆ లేఖలు చదివి మీ మీద అయిష్టత పెంచుకున్నాక మరింత అయిష్టత పెరిగేలా రాజుకు చాడీలు నూరిపోస్తాను. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ రాజుకు మరింత ధైర్యమిస్తాను. ఇలా లేఖలు రాసిన సామంతుల్లో ఓ సామంతుడి దగ్గరికి రహస్యంగా వెళ్ళి అక్కడే మకాం వేసి పెద్ద సైన్యం సమకూర్చు కోవాలని సలహా ఇస్తాను. మన ప్రయ త్నాలు మంత్రి వ్యతిరేక సామంతులకు రహస్యంగా చేరవేద్దామంటూ రాజును నమ్మిస్తాను. దీంతో ఇటు సామంతులు, అటు దండనాయకులు మీ తరపున వీరనరసింహ రాయలపై దాడి చేసి బందీని గావిస్తారు. ఆ తర్వాత మీరే నిజమైన చక్రవర్తి అంటూ అందరూ మిమ్ములను ఆమోదిస్తారంటూ రాజుకు చెబుతాను. నేనందించిన ప్రోత్సాహంతో రాజు ఈ పనికి ఒప్పుకుంటాడు. అనం తరం ఒకానొక రోజు రహస్యంగా నగరం విడిచి ఒక దుర్గాధ్యక్షుని కోటకు వెల్దామని చెబుతాను. ఆ మేరకు పెనుగొండ వదిలేలా పురికొల్పుతాను. మార్గమధ్యంలో మూడోకంటికి తెలియ కుండా చక్రవర్తిని హతమారుస్తాను. ” అంటూ తాను రచించిన పకడ్బందీ పథకాన్ని వీరనరసింహ రాయలకు వివరించాడు కొండమరుసు. పక్కా ప్రణాళికతో కూడిన ఈ కుట్ర పట్ల వీరనరసింహరాయలు చాలా సంతోషించాడు. ఆ ఆనందాన్ని పట్టలేక కొండమరుసుకు విలువైన బహుమానాలొసంగి,తగిన రీతిలో సత్కరించి వెంటనే ఈ కుట్రను అమలు చేయమన్నాడు.

కొద్దిరోజులు గడిచాక కొండమరుసు విజయనగరం నుండి ఉన్నట్లుండి మాయమయ్యాడు. ఆ వెంటనే పెనుగొండ దుర్గం చేరుకున్నా డు. సమయం చూసుకుని చక్రవర్తిని కలిసి మంత్రి తనపట్ల ఆగ్రహంతో ఉన్నాడనీ, చక్రవర్తి పట్ల తాను విధే యత చూపిస్తూ మంత్రి మాటలను పెడచెవిన పెట్టడమే కారణమంటూ విన్నవించాడు. చక్రవర్తి రెండవ నరసిం హుని పట్ల లేనిపోని అభిమానం, ప్రేమ కురిపిస్తూ అచిరకాలంలోనే దగ్గరయ్యాడు. తన మాట రాజు జవదా టడని నమ్మకం కుదిరాక తాను రచించి న కుట్రను అమలు చేయసాగాడు. రోజు కో లేఖను రాజుకు చూపసాగాడు. ఒక రోజు ఒక దుర్గాధ్యక్షునిది చూపితే, మరో రోజు మరో దండనాయకునిది, ఇంకో రోజు ఇంకో అమరనాయకుని లేఖలను చూపసాగాడు. లేఖల పరంపర ఇలా కొనసాగుతుండగానే ఒక రోజు చక్రవర్తి కొండమరుసును పిలిపించాడు. లేఖల న్నీ చూపించాడు. పరిస్థితులు తనకు ఎలా అనుకూలంగా మారాయో వివరిం చాడు. అయితే రాజ్యంలోని అశ్వబలం, గజబలం,ఇతర దండనాయకులను, కోశాగారాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుని మంత్రాంగం,యంత్రాంగం నడిపిస్తున్న వీరనరసింహున్ని ఎలా ఎదుర్కొని పోరాడాలి? ఆలోచించి సలహా ఇవ్వమంటూ కొండమరుసును కోరాడు చక్రవర్తి. ” నిజమే ప్రభూ మీరు చెప్పింది అక్షర సత్యం. మిమ్ములను అసలైన చక్రవర్తిగా చూడాలనుకునే సామంతులకు, దండనాయకులకు మంత్రి పట్ల అయిష్టం,అసహ్యం ఏర్పడింది. మీరు మంత్రిని అణచివేసే చర్యలకు శ్రీకారం చుట్టగానే మీతో పాటు యుద్ధ రంగంలో ఆ సేనానులం దరూ అండగా నిలుస్తారు. అలా చేయడ మే ఆ మంత్రికి తగిన శాస్తి అనీ, అదే న్యాయమనీ వారందరికీ తెలుసు. ఇప్పటికే మిమ్ములను ఆహ్వానించిన దుర్గాధ్యక్షుడు సర్వ స్వతంత్రుడిగా ఉన్నారు. అందుకే మీరు నేరుగా అక్క డికి వెళితే చాలు. కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు. ” అంటూ ప్రోత్సహించాడు కొండమరుసు.

“సరే అలాగే చేద్దాం. నాకు రక్షణ పేరుతో ఇరవై వేలమంది సైనికులను ఏర్పాటు చేశాడు వీరనరసింహుడు. అంతమంది కన్నుగప్పి ఈ దుర్గం నుండి బయట పడే తరుణోపాయమేదైనా ఉంటే చెప్పమంటూ” కొండమరుసును అడిగాడు చక్రవర్తి. ” ప్రభూ మీ అను మతి మేరకు ఓ చక్కటి ఉపాయం చెబుతాను. మీరు ఏ రోజైతే ఈ దుర్గాన్ని వదలి వెళ్ళాలి అనుకున్నారో ? ఆ రోజున మనమిద్దరం మీ ఉద్యానవనం ద్వారా నగర ప్రాకారం వెనుకవైపు గోడ ద్వారాన్ని చేరుకుందాం. ఆ మార్గం నాకు బాగా తెలుసు. భటులు ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న మనలను చూసి మీరే చక్రవర్తి అని ఎవరూ గుర్తు పట్టరు. అలా రహస్యంగా ఎవరి కంట బడకుండా నగరం బయటకు వెళ్దాము. అప్పటికే అక్కడ రెండు మేలు జాతి గుర్రాలను ఏర్పాటు చేసి ఉంచుతాను. మీరు క్షేమమని భావించిన చోటకు నేరుగా వెళ్దాము. ” అని చెప్పాడు కొండ మరుసు. చక్రవర్తికి ఈ ఉపాయం బాగా నచ్చింది. తనను తప్పించే భారం మొత్తం కొండమరుసు చేతిలో పెట్టి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన పథకం పారినందుకు,ఇంత సులభంగా తన కుట్ర అమలవుతున్నందుకు కొండమరుసు చాలా సంతోషించాడు. ఆ తర్వాత విజయనగరానికి ఎప్పటిక ప్పుడు తన యోగ క్షేమాలను, తన అవసరాలను వివిధ మార్గాల ద్వారా తెలియపర్చే ప్రక్రియను చక్రవర్తి ఆపేశాడు.

రాజు నుండి సమాచారం అందక పోవడంతో రాజధానిలో వీరనరసింహుడు అప్రమత్తమయ్యాడు. ఒకవేళ రాజు హతమార్చబడితే తద్వారా ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. తిరుగుబాటు జరిగితే కఠినంగా అణచివేసేందుకు ప్రతిచోట తన నమ్మినబంట్లను నియమించి సర్వం సిద్దం చేశాడు. చక్రవర్తి మరణ వార్త కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. ఇక్కడి పరిస్థితి ఇలా ఉంటే అక్కడ పెనుగొండ దుర్గంలో రాజు అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు కొండమరుసు. ఒకరోజు అకస్మాత్తుగా కొండమరుసును పిలిపించాడు చక్రవర్తి. ఫలానా రోజు పెనుగొండను వదిలి వెళ్దామంటూ రహస్యంగా చెప్పాడు. అందుకు సరేనన్న కొండమరుసు తన కుట్ర అమలుకు శ్రీకారం చుట్టాడు. చక్ర వర్తి ప్రతిరోజు కోట లోపలి భాగంలోని ఉద్యానవనం వెళ్తుంటాడు. ఈ ఉద్యాన వనం రాజుగారి భవనానికి ఆనుకునే ఉంటుంది. తన సతీమణులతో రాజ భవనం నుండి నేరుగా ఉద్యానవనం లోకి ప్రవేశించే సౌకర్యం ఉంటుంది. రాజభవనం నుండి ఉద్యానవనం వరకూ ఉన్న మార్గంతో పాటు ఉద్యా నవనం చుట్టూ మొత్తం కలిపి మూడు వందలమంది రాజ భటు లు కాపలా ఉంటారు. కొండమరుసు ఆఘ మేఘాల పై ఆ భటులను కలసి ఇలా చెప్పాడు. ” నేను ఫలానా రాత్రి, ఫలానా సమయంలో ఇటువైపుగా ఎవరితోనైనా వెళుతుంటే అతన్ని తక్షణమే నిర్దాక్షిణ్యంగా నరికి వేయండి. అతనికి అదే సరైన శిక్ష. ఎందుకంటే వాడు మన ఉప్పుకారం తింటూ శత్రురాజుల గూఢచారిగా పనిచేస్తున్నాడు. మన సైనిక బలా బలాల సమాచా రాన్ని ఎప్పటి కప్పుడు ఎదుటి వారికి చేరవేస్తున్నాడు. పనైన వెంటనే మీకు భారీ బహుమానం ఇస్తాను. మన రాజ్య శ్రేయస్సు కోసం మీరు చేయబోయే ఈ పని చాలా చిన్నది. ” అంటూ చెప్పాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు సంధ్యాసమయం వేళలో కొండమరుసు చక్రవర్తిని కలిశాడు. ” ప్రభూ ఈ రోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయవద్దు. మనం తప్పించుకు పోవడా నికి గుర్రాలు సిద్దం చేసి ఉంచాను. మీ ప్రయాణ విషయం మీ అంతఃపుర స్త్రీలకు కూడా తెలియకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశాను. మూడో కంటికి తెలి యకుండా మిమ్ములను తీసుకు వెళతా ను. ఇక మీరు చేయవలసింది ఒంటరిగా నేరుగా ఉద్యానవనంలోకి రావడమే. అక్కడ మీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను” . అని కొండమరుసు చెప్పాడు చక్రవర్తి సరే మంచిదంటూ తలూపి అంగీకారం తెలిపాడు.

బాగా చీకటి పడ్డాక రాణులందరితో భోజనం ముగించాడు. నిద్రకుపక్రమించడం కోసం అటు రాణులు ఇటు రాజు ఎవరి గదుల్లోకి వారు వెళ్ళారు. రాణులందరూ నిద్ర పోయాక చక్రవర్తి మారు వేషంతో ఎంతో జాగ్రత్తగా తన భవనంలోనుండి దొడ్డి దారిన ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. రాజు కోసమే ఎదురు చూస్తున్న కొండమరుసు మరింత జాగ్రత్తగా ఉన్నాడు. చక్రవర్తి కొండమరుసును సమీపించేందుకు ఇద్దరు భటుల మధ్యనుండి ముందుకు పోయాడు. ఆ వెంటనే కొండమరుసు భటులకు సైగ చేశాడు. భటులు చక్రవర్తి మీద పడి నరికేశారు. ఉద్యానవనం నుండి కోట వెలుపలి ద్వారం వైపు మార్గమధ్యంలో ఒకానొక చెట్టు క్రింద శవాన్ని పూడ్చి పెట్టారు. వాస్తవంగా తామెవరిని చంపింది భటులకు కూడా తెలియదు. కొండమరుసు వారికి కృతజ్ఞతలు తెలిపి అప్పటికప్పుడే బహుమానాలందజేశాడు. ఆ పిదప తన సత్రానికి వెళ్ళి పెనుగొండ వదలి మాయమయ్యాడు. తెల్లారేసరికి రాజు కనిపించడం లేదన్న సమాచారం దావానలంలా గుప్పుమం ది. నగరమంతా వెదికినా ఆయన జాడ తెలియలేదు. వీరనరసింహునితో యుద్ధం చేయడానికి సంకల్పించి తనకు అనుకూలమైన సురక్షిత ప్రదేశానికి పారిపోయాడని అందరూ అనుకున్నారు .

చక్రవర్తి మాయమయ్యాడన్న సమాచారం వెంటనే వీర నరసింహునికి చేరవేయబడింది. వీరనరసింహుడు ఎంతో విచారం నటించి వెంటనే కోటలోని దండనాయకులను, అంతఃపుర స్త్రీలను,రాజోద్యోగులను పిలిపించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అందరి సమక్షంలో ఎంతగానో దుఃఖిం చాడు. వెంటనే చక్రవర్తి జాడ తెలపా లంటూ ఆదేశించాడు. అంతఃపుర స్త్రీలను ఓదార్చాడు. అయితే అదంతా నటనే. రాజు మరణం లేనిపోని గొడవలకు దారి తీయవచ్చునని తెలిసి గుర్రాలను, ఏనుగులను సిద్దంగా ఉంచమన్నాడు. నిజం చెప్పాలంటే రాజు మాయమయ్యాడన్న సంగతి తప్ప అసలేం జరిగిందీ వీరనరసింహునికి కూడా సమాచారం లేదు. పరిస్థితులు సద్దు మణిగాక కొండమరుసు వీరనరసింహున్ని కలిశాడు. జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్లు వివరించాడు. చక్రవర్తిని హతమార్చిన భటులకు కూడా తాము ఎవరిని హతమార్చింది తెలియకుండా చేశానన్నాడు. ఎంతో రహస్యంగా ,మరెంతో పకడ్బందీగా ఈ కుట్రను అమలు చేశానన్నాడు. వీరనర సింహుడు ఎంతగానో సంతోషించాడు. అతి విలువైన వజ్రవైడూర్యాలను కొండమరుసుకు కానుకగా ఇచ్చాడు. సర్వాధికారాలు తన గుప్పిట్లో ఉంచుకున్న వీరనరసింహరాయలు తనకు తాను విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.

( ఇంకా ఉంది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *