May 7, 2024

మాయామాళవగౌళ రాగ లక్షణములు

రచన: భారతి ప్రకాష్.

ఈ రాగము 15.వ. మేళకర్త రాగం. మూడవ చక్రమైన “అగ్ని” లో మూడవ రాగం. ఈ రాగం యొక్క అసలు పేరు ” మాళవగౌళ “. కటపయాది సూత్ర ప్రకారం 15.వ. సంఖ్య కోసం ” మాయా ” అనే పదం ఈ పేరుకు ముందుగా జేర్చబడింది.

ఆరోహణ -> స రి గ మ ప ద ని స.

అవరోహణ -> స. ని ద ప మ గ రి స

షడ్జమ, పంచమాలతో పాటు ఈ రాగం లోని స్వరాలు:

శుద్ధ రిషభం; అంతర గాంధారం; శుద్ధ మద్ధ్యమం; శుద్ధ దైవతం; మరియు కాకలి నిషాదం.
ఈ రాగం మూర్చనకారక రాగం.
ఈ రాగం యొక్క ” రి ” ని షడ్జమం చేస్తే ” రశికప్రియ ” ( 72.వ. మేళకర్త రాగం ) అవుతుంది.”
ఈ రాగం యొక్క ” మ ” ని షడ్జం చేస్తే ” సింహేంద్రమధ్యమం ” ( 57. వ. మేళకర్త రాగం. ) అవుతుంది.

సంపూర్ణ రాగం; సర్వ స్వర గమక వరీక రక్తి రాగం; ఈఅ జనక రాగం నుండి ఎన్నో జన్య రాగాలు పుట్టాయి.

జీవ స్వరాలు – “ గ మరియు ని ”
ఆధార స్వరాలు – “ గ మరియు ప ”

విస్తారమైన రాగం; ఎల్లవేళలా పాడదగిన రాగం; ఎలాంటి దోషాలూ లేని రాగం; త్రిస్థాయి రాగం; ్చాలా పురాతనమైన రాగం; “ సంగీత రత్నాకరం ” లో కూడా ఈ రాగం గురించి చెప్పబడింది.
ఈ రాగం లోని రచనలు ” స, గ, ద, ని ” అనే స్వరాలతో మొదలవుతాయి.
హిందుస్తానీ రాగమైన ” భైరవ ” ఈ రాగం తో బాగా కలుస్తుంది.

కర్ణాటక సంగీతం లో విద్యార్ధులు మొదటి పాఠాలన్నీ ఈ రాగం లోనే నేర్చుకుంటారు.

-2-

ఈ రాగం లోని కొన్ని ముఖ్య రచనలు:

రచన సాహిత్యం తాళం రచించినవారు.

1. లక్షణగీతం రవికోటితేజ మఠ్య –

2. కృతి మేరుసమాన మధ్యాది శ్రీ త్యాగరాజు.

3. కృతి తుళసీదళములచే రూపక శ్రీ త్యాగరాజు.

4. కృతి విదులకు మ్రొక్కెద ఆది శ్రీ త్యాగరాజు.

5. కృతి మాయాతీత స్వరూపిణీ రూపక శ్రీ పొన్నయ్య

6. కృతి దేవాదిదేవ రూపక శ్రీ మైసూర్ సదాశివరావ్.

తులసీదళములచే మాయామాళవాగౌళ రాగం రూపక తాళం శ్రీ త్యాగరాజు.

పల్లవి: తులసీదళములచే సంతోషముగా పూజింతు //

అనుపల్లవి: పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను //

చరణం: సరసీరుహ పున్నాగ చంపక పాటలకురవక

కరవీర మల్లికా సుగంధ రాజసుమముల్

ధరనివి యొక పర్యాయము ధర్మాత్ముని సాకేత

పురవాసుని శ్రీ రాముని వర త్యాగరాజనుతుని //

-3-

తులసి శ్రీ మహావిష్ణువు కి ప్రియ భక్తురాలు. పరమ పవిత్ర స్వరూపిణి. అలాంటి తులసీదళములచే పరమాత్ముని పాదములను పూజించెదనని శ్రీ త్యాగరాజ స్వామివారు సాభిప్రాయముగా పేర్కొన్నారు. సుగంధ కుసుమములగు పద్మములు, పున్నాగ చంపక మల్లికాదులతో నొక పర్యాయము శ్రీ రాముని అర్చించి, ప్రత్యేకముగా తులసీదళములతోనూ అర్చింతునని చెప్పుటవలన ఇతర సుగంధ రాజములన్నీ ఒక ఎత్తు, విష్ణు ప్రియములైన తులసీదళములొక ఎత్తు అని శ్రీ త్యాగరాజ స్వామి వారి అభిప్రాయము.

ఈ రాగములోనున్న కొన్ని సినిమా పాటలు:

పాట – సినిమా

1. గూటిలో చిలకేదిరా – బాలరాజు.

2. ఏ నిమిషానికి ఏమి జరుగునో – లవకుశ

3. ఎవరికెవరు ఈ లోకం లో – సిరిసిరి మువ్వ

4. పావురానికీ పంజరానికి – చంటి.

5. యమహో నీ యమా యమా అందం – జగదేకవీరుడు అతిలోకసుందరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *