April 27, 2024

బ్రహ్మలిఖితం – 2

రచన: మన్నెం శారద

రక్తంలో ముంచి తీసినట్లున్న ఎరుపురంగు జడలు కట్టిన వెంట్రుకలు, వళ్ళంతా రాసుకున్న బూడిద, మురికి బారిన కాషాయరంగు వస్త్రాలు, మెడలో రుద్రాక్షలు – చూడగానే భయం కొలిపే ఆకృతిలో వున్న ఒక సాధువులాంటి వ్యక్తి కార్తికేయన్ ఎదురుగా నిలబడి వున్నాడు.
స్మశానాన్ని చూసి చలించని కార్తికేయన్ లేత శరీరం అతన్ని చూసి చిన్నగా వణికింది. అతనదోలా నవ్వాడు.
“భయపడుతున్నావా?”
“ఊహూ” అబద్ధం చెబుతూ లేచి నిలబడ్డాడు కార్తిక్.
“ఎవరు పోయేరు?”
“మా అత్త”
“అమ్మ లేదా?” ముందుకు నడుస్తూ అడిగేడతను.
“చచ్చిపోయింది.”
“నాన్న?”
“ఆయనా చచ్చిపోయేడు”
“ప్రస్తుతం ఎవరూ లేరన్నమాట!” అతను స్మశానానికి పక్కగా వున్న మర్రిచెట్టు క్రింద కూర్చుంటూ అన్నాడు.
కార్తికేయన్ జవాబు చెప్పలేదు.
“రా!కూర్చో!”
అతని పక్కనే కూర్చున్నాడు కార్తికేయన్.
అతను తన జోలెలోంచి అన్నం, కూరలు బయటికి తీసి కొద్దిగా ఒక ఆకులో వేసిచ్చి “తిను” అన్నాడు.
“ఊహూ.. వద్దు” అన్నాడు కార్తికేయన్ మొగమాటంగా.
“ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికినా ఆకలి, నిద్ర ఆగవు నాయినా! ఎన్నాళ్లని పొట్ట మాడ్చుకుంటావు తిను” అన్నాడతను తను తింటూ.
కార్తికేయన్ అయిష్టంగానే ఆకు దగ్గరకి తీసుకుని మెల్లిగా అన్నం, కూర కలపసాగేడు.
ఎక్కడో ముష్టెత్తి తెచ్చిన అన్నమది. అన్నం, కూరలు కలగాపులగంగా ఉన్నాయి. ఆకలనిపిస్తున్నా ఎప్పుడూ అలాంటి భోజనం తినలేదతను. అంతరాంతరాల్లో బాగా బతికిన భేషజమడ్డొచ్చినా ఆకలి అతన్ని తినేలా చేసింది. ఇద్దరూ ఆ పక్కనే వున్న చిన్న కుంటలో చేతులు కడుక్కున్నారు.
అతనా చెట్టు క్రిందే మేనిని వాల్చి గట్టిగా ఆవులించేడు.
కార్తికేయన్ అతని పక్కనే కూర్చుని “మీరు తపస్సు చేసేరా?” అనడిగేడూ.
అతనవునన్నట్లుగా తల పంకించి “హరిద్వారం, ఋషికేష్ అన్నీ చుట్టొచ్చేం” అన్నాడు.
“దేని కోసం?”
కార్తికేయన్ ప్రశ్నకి అతను తడబడినట్లుగా చూశాడు.
చివరికి “మనశ్శాంతి కోసం “అన్నాడూ నిదానంగా నవ్వి.
ఆ జవాబు విని కార్తికేయన్ నిరుత్సాహపడ్డాడు.
అతని మొహంలోని ఆశాభంగాన్ని కనిపెట్టి “ఏదో అడగాలనుకుంటున్నావు కదూ!” అన్నాడు మెల్లిగా.
“మీకు మనశ్శాంతెందుకు లేదు?”
“అన్నీ పోగొట్టుకున్నాను కాబట్టి”
“అన్నీ అంటే… డబ్బా?”
“కాదు.. భార్యని, బిడ్డల్ని, తల్లిని, తండ్రిని.. అందర్నీ..”
“ఎలా?”
“ఉప్పెన. మహమ్మారిలాంటి ఉప్పెన ఆదమరచి నిద్రపోతుంటే అర్ధరాత్రి ఒక్కసారి మీద పడి మమ్మల్నందరినీ విడదీసింది. నాకొక్కడికే ఈత వచ్చు. ఎలాగో బతికి బయటపడ్డాను. ఒక చెట్టు కొమ్మన మూడు రోజులు కూర్చున్నాను. పాములతో పాటూ. క్రింద కొట్టుకుపోతున్న శవాలు!”
“భయమెయ్యలేదూ?”
“ఎందుకు? అవి కూడా మనలాగే ప్రాణభయంతో వచ్చి చెట్ల మీద కూర్చున్నాయి. ఇక శవాలా? అంతకు ముందు క్షణం వరకు మనతో కలిసిమెలిసి తిరిగిన ఆప్తులవే కదా”
“మీవాళ్ల శవాలు దొరికేయా?”
“లేదు. వాళ్ల కోసం వెతుకుతుంటే వందలాది ఇతరుల శవాలు కనిపించేయి. దుఁఖంలోంచి విరక్తి ప్రవేశించింది. నాదనుకున్న పంట నాశనమైంది. నాదనుకున్న భూమి ఒండ్రుక కప్పేసింది. నాదనుకున్న ఇల్లు కూలిపోయింది. నాదనుకున్న మనుషులు కొట్టుకుపోయేరు. వైరాగ్యంతో రైలెక్కేను. ఎక్కడెక్కడో తిరిగేను. ఎవరెవరో స్వాముల్ని ఆశ్రయించేను. ఎంత తిరిగినా నాకా మనశ్శాంతి లభించనే లేదు నాయినా?”
అతని వైపు కార్తికేయన్ సందేహంగా చూశాడు.
“మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలో మీకు తోచనేలేదా?”
అతను కార్తికేయన్ కేసి అదోలా చూసి “ఏం చేయాలి?” అనడిగేడు.
“మరణం లేకుండా చెయ్యడం. ఆ విద్య మీకెవరూ నేర్పలేదా?”
అతను కార్తికేయన్ వైపు విభ్రమంగా చూసి “అదెలా సాధ్యం?” అనడిగేడు.
“ఎందుకు సాధ్యం కాదు? రెండు సన్నని ఇనుప పట్టాలు పట్టుకుని రైలంత వేగంగా ఎలా పరుగు తీస్తోంది? అంత బరువైన విమానం గాలిలోకెలా లేచి అంత వేగంగా వేళ్తోంది. కొన్ని వేల మైళ్ల అవతల మనిషి మాట్లాడిన మాటలు టెలిఫోనులో అంత స్పష్టంగా ఎలా వినిపిస్తున్నాయి. అలాగే చావులేని మందో, మంత్రమో ఒకటుండి తీరుతుంది. దాని కనుక్కోవాలన్న జిజ్ఞాస వస్తే తప్పకుండా సాధ్యమవుతుంది స్వామి!”
ఈసారి సాధువు కళ్లకి కార్తికేయన్ ఒక పదమూడేళ్ళ పసికుర్రాడిలా కనిపించలేదు. అంతకంతకు లోతైన మరో మనిషి అతనిలో వున్నాడనిపించింది. అతను చాలాసేపు ఆలొచిస్తూ, నింగిలోని మిణుకుమిణుకుమనే నక్షత్రాల్ని తదేకంగా చూస్తూ పడుకున్నాడు.
ఆకలి కొద్దిగా తీరడంతో కార్తికేయన్ కూడా అక్కడే ఒరిగి నిద్రపోయేడు.
తెలతెలవారుతుండగా కార్తికేయన్‌ని ఎవరో కుదిపి లేపటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు.
ఎదురుగా సాధువు!
“పద, పోదాం!”
“ఎక్కడికి?”
“మరణానికి మందు కనుక్కుందాం”
ఆ మాట వినగానే కార్తికేయన్‌లో ఉత్సాహం చోటు చేసుకుంది. అతన్ని వెంబడించేడు.
తిన్నగా రైల్వే స్టేషనుకెళ్ళి ఇద్దరూ రైలెక్కేరు.
రైలు మద్రాసులో ఆగింది.
అక్కడ తిరిగి బస్సెక్కేరు. బస్సు సాయంత్రానికి కుంభకోణం దగ్గరున్న ఒక చిన్న కుగ్రామంలో ఆగింది. కాలినడకన ఆ దగ్గర ప్రాంతంలో వున్న చిన్న అడవిలోకి తీసుకెళ్ళేడతన్ని సాధువు.
ఒక రెండు కిలోమీటర్లు నడిచేక ఒక చిన్న తాటాకు గుడిసె ముందాగాడు సాధువు. చిన్నగా గుమ్మాన్ని మూసివున్న తడిక మీద తట్టేడు.
అయిదు నిమిషాలనంతరం తడిక చిన్నగా తెరుచుకుంది.
ఆకలితోనూ, ఎంతో దూరం కాలినడకన నడిచిన నీరసంతోనూ తూలుతున్నాడు కార్తికేయన్. తడిక తెరుచుకోగానే కనిపించిన దృశ్యం చూసి అతని శరీరం జలదరించింది.
ఎదురుగా నాలుక బయటికి సాచి, జుట్టు విరబోసుకుని కపాలహారం మెడలో ధరించిన ఎనిమిది చేతుల కాళి విగ్రహం వికృతంగా బెదిరిస్తున్నట్లుగా కనిపించింది. అంతకంటే భయానక దృశ్యమేమిటంటే తెల్లని గడ్డమున్న ఒక నల్లని కంచు విగ్రహంలాంటి మనిషి ఒక గొర్రెపోతుని చంపి దాని తలని పట్టుకుని రక్తాన్ని ఒక గిన్నెలోకి పడుతున్నాడు.
కార్తి వణికిపోతూ సాధువు నడుంని గట్టిగా పట్టుకున్నాడు.
సాధువు చిన్నగా నవ్వి “భయపడ్డావా?” అనడిగేడు.
కార్తి జవాబు చెప్పలేదు.
ఎర్రని, చిక్కని రక్తంతో పాత్ర నిండుతుంటే పక్కనే పడివున్న గొర్రెపోతు మొండెం చాలాసేపు కొట్టుకుని నిటారుగా బిగిసిపోయింది.
ప్రాణం పంచభూతాలలో కలిసిపోతూ, పోతూ చేసిన పోరాటం హృదయవిదారకంగా మనసుని తీవ్రంగా చలింపచేసేదిగా వుంది.
కార్తి పెదవులు సన్నగా వనికేయి.
అప్పటికప్పుడే అతని శరీరం వేడెక్కి జ్వరమొచ్చినట్లయింది.
సాధువు కార్తి నడుం చుట్టూ చెయ్యేసి చిన్నగా తడుతూ”వణక్కం సిరియాక్కారన్ సావీ” అన్నాడు.
కంచు విగ్రహం తల తిప్పి సాధువు వైపు, కార్తికేయన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి “కూర్చో! దేవికి హారతి చేసి మాట్లాడతాను” అన్నాడు తమిళంలోనే.
చూస్తుండగానే సిరియక్కారన్ అరచేతిలో కర్పూరముంచుకొని శంఖాన్ని పూరిస్తూ దేవికి హారతిచ్చేడు. అతని శిష్యుడు గంట వాయించేడు. క్షణాల్లో ఆ ప్రడేశమంతా ఏదో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లనిపించింది. కర్పూరహారతి కాంతిలో కాళి విగ్రహం ఎర్రగా మరింత భయానకంగా కనిపించింది.
హారతికాగానే సిరియక్కారన్ గిన్నెలో పట్టిన రక్తానంతా గడగడా తాగేసేడు.
కార్తి అతన్ని మరింత భయంగా చూసేడు.
రక్తతీర్థం తీసుకున్నాక సిరియక్కారన్ మూతి తుడుచుకుంటూ పక్కనే వునన్ చాపమీద కూర్చుని “ఎందుకొచ్చేవు? అప్పుడు కాదని వెళ్ళిపోయేవుగా?” అనడిగేడు సాధువుని.
“అప్పుడెందుకో భయపడ్డాను. అనుకోకుండా వీడు కనపడ్డాడు. తిరిగి ఆశ కల్గింది.”
సిరియక్కారన్ కార్తిని తేరిపార చూసేడు.
“అంటే వీడికి రక్తసంబంధీకులెవరూ లేరా?”
“అందరూ పోయేరు. మావయ్య వున్నాడంట కాని అతను రక్తసంబంధీకుడు కాదు. మేనత్త మొగుడు. వీడి వయసు పదిహేనులోపునే”
సిరియక్కారన్ తల పంకించేడు.
“ఇది కార్తీకం. క్షుద్రోపాసనకి పనికిరాదు. మార్గశిరంలో వచ్చే అమావాస్య ఘడియలు కాళీ ఉపాసనకి బహు మంచి ముహూర్తం. వీడికేం చెప్పలేదు కదూ!”
“లేదు. మరణాన్ని జయించాలని వాడి కోరిక.”
“మంచిది. ఈ పది రోజులూ వీడు రెండు సంధ్యలలోనూ తలార స్నానం చేసి పూజలో కూర్చోవాలి. ఇదంతా మరణరాహిత్యం కోసమేనని వీడు గట్టిగా నమ్మాలి. నేను రేపొచ్చే ఆదివారం రాహుకాలంలో భైరవ పూజ మొదలుపెడతాను. జాగ్రత్త!”
సాధువు తల పంకించేడు.
సంభాషణంతా తమిళంలో సాగడం వలన కార్తికేయన్ ఏమీ ఆర్ధం చేసుకోలేకపోయేడు.
కార్తిని తీసుకొని గుడిసె బయటకొచ్చేడు సాధువు.
“నాకు భయమేస్తుంది!” అన్నాడు చిన్నగా వణుకుతూ.
“దేనికి? ఏం చేయకుండానే చావుని జయింపడమెలా? పద, నదిలో స్నానం చేసి పూజలో కూర్చుందువుగాని!” సాధువు ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించేడు కార్తి, చావుని జయించబోతున్నానన్న నమ్మకము, సంతోషంలో.

*****

ఎదురుగా హోమగుండం జ్వలితజ్వాలమై శాఖోపశాఖలుగా, శిఖోపశిఖలుగా వేయి నాలుకలు చాపి సిరియక్కారన్ చెక్క తెడ్డుతో పోస్తున్న ఆవు నేతిని ఎగిరెగిరి అందుకుంటూ మండుతోంది.
ఆ హోమజ్వాలలో సిరియక్కారన్ నేరేడు పండు రంగు మొహంలో కళ్ళు ఎర్రని పత్తికాయల్లా ఒక దారుణాన్ని చేయబోయే ముందు మనిషి భావాలకి దర్పణం పడుతున్నట్లు క్రౌర్యంగా ఉన్నాయి.
హోమగుండానికెదురుగా కార్తికేయన్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎర్రని పంచె కట్టుకుని మెడలో పూలదండ, నుదుట రుద్రుడి లయనేత్రం లాంటి ఎర్రని బొట్టు. హోమకాంతి అతని పచ్చని శరీరం మీద పడి పరావర్తనం చెంది ఆ గదంతా చెదిరిపోతున్నది.
సాధువు మరో పక్కన కూర్చుని హోమగుండంలో సమిధలు వేస్తున్నాడు.
“ఇప్పుడు నేనన్నట్లుగా చెప్పు” సిరయక్కారన్ మాటలర్ధం కాక సాధువు వైపు చూసేడు కార్తికేయన్.
“ఆయనేమంటే అదను” అని సాధువు తర్జుమా చేసేడు.
కార్తి తలూపేడు.
అతని మొహంలో వచ్చిన నాటి భయం లేదు. నాలుక సాచి వికృతంగా గుడ్లురిమి చూస్తున్న కాళికా విగ్రహాన్ని చూసినా, శంఖానాదం, ఘంటారవాల ఘోషల మధ్య మేకపోతుని బలిచ్చి ఆ రక్తాన్ని నారికేళపాకంలా స్వీకరిస్తున్న సిరియక్కారన్‌ని చూసినా, కత్తివ్రేటు పడి గిలగిలా తన్నుకుంటున్న మూగజీవాన్ని చూసినా కార్తి ఏమాత్రం చలించడం లేదు. అంతే కాదు. ఉభయసంధ్యలలో అతడు వేలు తగిలినా జివ్వున లాగేసే నదీ మధ్య భాగంలో నిలబడి సాధువు చెప్పిన స్తోత్రాన్ని వల్లిస్తున్నాడు.
కటిక నేల మీద పడుకుంటున్నాడు. ఏకభుక్తంగా జీవిస్తున్నాడు.
అన్నింటికి మించి అర్ధరాత్రి స్మశానంలో జరిపే క్షుద్ర పూజలకి సిరియక్కారన్‌తో హాజరవుతున్నాడు.
కారణం – తను మరణాన్ని జయించే మహారహస్యాన్ని తెలుసుకు తీరాలనే తీవ్ర తపన.
కొద్ది క్షణాల్లో ఆ రహస్యం తనకి తెలిసిపోతుంది.
ఓం, హైం హ్రీం, క్లీం భం భం భం భైరవాయ నమః
ఓం హైం హ్రీం, శ్రీం క్లీం దుం దుం దుం దుర్గాయ నమః
నీచోపాసక సౌలభ్యీ, వికార రూపధారిణి
అతి భయంకర విరూపాక్షి ప్రసన్నేకాళీ!
నిధి నిమిత్తే స్వప్రాణం దారాధత్తం!
ఓం! ఓం! ఓం!
కార్తి సిరియక్కారన్ చెప్పిన మంత్రాన్ని ఉచ్చరించేడు.
అతని మంత్రానికి బలాన్ని, శక్తిని యిచ్చి దేవిని ప్రసన్నం చేసుకోవడానికన్నట్లుగా సిరియక్కారన్ శిష్యుడు గంటని ఆ అడవంతా దద్దరిల్లేలా వాయించేడు. సాధువు శంఖాన్ని పూరించేడు. ఆ నాదం శబ్ద తరంగాలుగా మారి దశదిశలూ వ్యాపించి ఆ అడవినంతా ఠారెత్తించింది.
అసలే ఆర్ధరాత్రి – కీచురాళ్ల ధ్వనులు – అప్పుడప్పుడు పక్షుల కలకలరావాలు తప్ప మరే శబ్దమూ లేని ఆ నీరవ స్తబ్దరాత్రి ఆ శబ్దానికే భూకంపం వచ్చినట్లు కదిలింది.
ఎక్కడో ఒక ఏనుగు నిద్రాభంగమై ఘీంకరించింది.
పక్షుల సముదాయం గూళ్ళలో మేల్కొని భయంతో రెక్కలు టపటపలాడించేయి. లేళ్ళూ, కుందేళ్ళూ వణికేయి. పేరు తెలీని ఎన్నో ప్రాణులు భయోత్పాతానికి లోనయి ముడుచుకుని ఆ శబ్దం వచ్చిన వేపుకి దృష్టిని సారించేయి. సరిగ్గా అప్పుడే సిరియక్కారన్ లేచి నిలబడ్డాడు.
కార్తి దీర్ఘంగా కళ్ళు మూసుకొని కాళి జపం చేస్తూనే ఉన్నాడు.
సాధువు లేచి గొడ్డలిని అందించేడు సిరియక్కారన్‌కి.
“జై కాళి మాతా! జై భైరవే!” అంటూ గొడ్డలిని ఎత్తేడు సిరియక్కారన్ మహావేశంతో.
పైకి లేచిన గొడ్డలి ఏం జరుగుతుందో ఏ మాత్రం తెలీని కార్తికేయన్ మెడని ఒక్క వ్రేటుతో నరకడానికి సిద్ధపడుతున్న ఆ భయంకర క్షణంలో ఆ గుడిసె తలుపులు తెరుచుకోవడమూ, బయట నిలబడిన వ్యక్తి కాల్చిన రైఫిల్‌లోని తూటా సిరియక్కారన్ ముంజేతిలోంచి దూసుకుపోవడం ఒక్కసారే జరిగేయి.
ఆ శబ్దానికి ఉలిక్కిపడి కార్తి కళ్ళు తెరిచేడు.
“అబ్బా!” అంటూ ముంజేతిని పట్టుకుని సిరియక్కారన్ నేలమీదికి కూలిపోయేడు.
ఏం జరిగిందో తెలుసుకునే లోపున ఆ ప్రాంతమంతా శక్తివంతమైన టార్చిలైట్ల కాంతితో నిండిపోయింది.
టకటకా బూట్ల శబ్దంతో ఆ గుడిసెని చుట్టుముట్టేరు పోలీసులు. క్షణాల్లో సిరియక్కారన్‌కి, సాధువుకి, అతని శిష్యుడికి బేడీలు పడ్డాయి. అందర్నీ ఎక్కించుకున్న పోలీసు వేన్ కుంభకోణం వైపు శబ్దం చేస్తూ పరుగెట్టింది.

******************

ఎదురుగా కూర్చున్న వ్యక్తిని భయంతో చూస్తూ నిలబడ్డాడు కార్తికేయన్.
అతను దాదాపు ఆరడుగుల పొడవు. అంతకు సరిపోయిన బలిష్టమైన శరీర సౌష్టవంతో ఉన్నాడు. వెనక్కి దువ్విన వత్తయిన క్రాఫులో అక్కడక్కాడా నెరసిన తెల్లవెంట్రుకలు అతనికొకరకమైన హుందాతనాన్నిచ్చేయి. సిగరెట్స్ ఎక్కువగా కాల్చడం వలన కొద్దిగా కాఫీ రంగు తిరిగిన పెదవులు, ఆ పెదవులపై వత్తుగా పెంచిన మీసాలు, అతనికొక రకమైన గాంభీర్యాన్నిచ్చేయి. కాని ఆ కళ్ళు మాత్రం ఎక్కడో మగవారికి అరుదుగా వుండే పొడవాటి వాలుకళ్లు – రెప్పలకి వత్తుగా వంపు తిరిగిన వెంట్రుకలు – ముఖ్యంగా ఆ చూపుల్లో కారుణ్యం, ప్రేమ పోటీపడి తొంగి చూస్తున్నాయి.
“కూర్చో” అన్నాడతను. అతని గొంతులోనూ కరకుదనం లేదు.
నిన్నటి రోజున సిరియక్కారన్ గుడిసె మీద దాడి చేసి అతన్ని షూట్ చేసిన పోలీసాఫీసరతనేనా అనిపించిందొక క్షణం కార్తికేయన్‌కి.
పోలీసులంటే ప్రజలకి చాలా దురభిప్రాయముంది. అది పొరబాటైన అభిప్రాయం కానే కాదు. ఖాఖీ డ్రస్సులకి పట్టని పొట్టల్ని పెంచి, లాఠీ చేతిలో వుందని హద్దు ఆపూలేని ప్రవర్తనతో సంస్కార సంఘం అసహ్యించుకునే విధమైన పదజాలాన్ని వాడుతూ అధికారం చేతిలో వుందని తమ దగ్గరికి న్యాయం కోసం వచ్చిన వ్యక్తుల్ని నేలబారు మాటలు మాట్లాడి మళ్ళీ ఎప్పుడూ న్యాయం జరక్కపోతే చూద్దాం కాని పోలీస్ స్టేషన్‌కి మాత్రం వెళ్ళొద్దనిపించే స్థాయిలో ప్రవర్తించే పోలీసు డిపార్టుమెంటులోని కొంతమంది గురించి కొద్దిగా తెలుసు కార్తికి.
కాని.. ఇతను చాలా విభిన్నంగా వున్నాడే?
“దా, కూర్చో! నీ పేరేంటన్నావూ?”
“కార్తి.. కార్తికేయన్”
“నువ్వు తమిళవాడివా?”
“కాదు.. తెలుగు.. తెలుగువాణ్ణే! కాకినాడ”
ఈసారాయన మొహంలో వెలుగు కనిపించింది. వికసించిన మొహంతో నవ్వుతూ “మాదీ కాకినాడే. అంటే ఎప్పుడో మా తాతలనాడు బిజినెస్ మీద కోయంబత్తూరులో సెటిలయ్యేరు. ఇప్పుడు నేను తమిళవాణ్ణో, తెలుగువాణ్ణో నాకే తెలీదు. వీళ్ల చేతికెలా చిక్కేవ్? నీకు మత్తు పెట్టి తెచ్చేరా?” అనడిగేడాయన.
“లేదండి. నేనే కావాలని వచ్చేను”
ఈసారతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యేయి.
“ఎందుకు?” అనడిగేడు కుతూహలంగా.
“చావు లేని మంత్రం నేర్పుతామన్నారు వాళ్లు”
కార్తి జవాబు విని క్షణం మాట్లాడలేకపోయేడతను.
“చావు లేకుండానా?” అన్నాడు ఆశ్చర్యంగా.
“అంటే మృతసంజీవిని విద్యా! కచుడు శుక్రాచార్యుల దగ్గర నేర్చుకున్నట్లుగా!”
మళ్లీ తల ఊపేడు కార్తి.
ఈసారి పకపకా నవ్వాడతను. ఎంతగా నవ్వాడంటే అతని కళ్లలోంచి నీళ్లు చెంపల మీదకి జారేయి. అంచెలంచెలుగా అతను నవ్వుతుంటే మేడమీద నుండి అతని ఎనిమిదేళ్ళ కూతురు – ఇంట్లో పనులు చేస్తున్న ఆర్డర్లీలు హాల్లోకి వచ్చేరు.
అయినా అతనికి నవ్వు ఆపుకోవడం అసాధ్యమయింది.
“డేడీ ఏం జరిగింది. ఎందుకలా నవ్వుతున్నారు?” ఎదురు సోఫాలో కూర్చున్న కార్తిని వింతగా చూస్తూ తండ్రి భుజాలు కుదుపుతూ అడిగిందతని కూతురు కెయూరవల్లి.
అతను కూతురి భుజాన్ని ప్రేమతో తడుతూ ఎత్తుకుని వళ్ళో కూర్చోబెట్టుకుని “వీడు చావు లేని మంత్రం నేర్చుకుందామనుకున్నాడటమ్మా.. అదీ ఆ నీచుడు సిరియక్కారన్ దగ్గర” అన్నాడు.
ఆ పేరు వినగానే ఉలిక్కిపడింది కేయూర.”వాడా.. ఇద్దీ అమీన్‌లా బ్లడ్ తాగుతాడూ?”
“ఎగ్జాట్లీ! వాడు పసిపిల్లల రక్తాన్ని పానకంలా తాగుతాడు. రక్తపిపాసి వాడు. ఏదో నిధి కోసం పసిపిల్లల్ని బలిస్తున్నాడు. వాడి చేతులో పడ్డాడు వీడు.
అతని మాటలు వినగానే కార్తి తెల్లబోయేడు.
శరీరం సన్నగా వణికింది.
“కాదు….నిజంగా మంత్రం నేర్పడానికే!”
“నీ మొహం! నేనొక్క క్షణం రావడమాలస్యమైతే నీ తల తెగి పడుండేది. ఈ జిల్లాలో చాలామంది స్కూలు పిల్లలు ఒక్క నెలలోనే మాయమవ్వడంతో మేం నిఘా వేసేం. నిన్ను కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి ఒక సాధువు తీసుకెళ్తున్నాడని రిపోర్టు రాగానే నేనే పర్సనల్‌గా ఈ కేసుని టేకప్ చేసేను. రహస్యంగా ఫాలో అయ్యి ఆ అడవి గెస్ట్ హౌస్‌లోనే వున్నాను. నీ స్నానాలూ, పానాలూ, పూజలూ అన్నీ కనిపెడుతూనే ఉన్నాను. స్పాట్‌లోనే పట్టాలన్నది నా ఆకాంక్ష. అలాగే పట్టుకున్నాను. ఇంతకీ ఆ సిరియక్కారన్ గాడెవరనుకున్నావు. గతంలో పెళ్లాన్ని చంపి పరారై తిరుగుతున్న ఒక హంతకుడు. ఆ ! ఇంతకీ నిన్నెక్కడికి పంపాలి?” అనడిగేడాయన.
కార్తి ఆ వివరాలన్నీ విని చలించిపోయేడు. పెదవులు తడారిపోయేయి.
“నాకు .. నాకెవరూ లేరు సార్!”
“అంటే అనాధవా?”
కార్తి తలదించుకున్నాడు. “అమ్మా,నాన్న చెల్లి అందరూ నెలల తేడాలో చచ్చిపోయేరు. చివరికి అత్త కూడా, నేను నష్టజాతకుణ్ణని మావయ్య తరిమేసేడు” అన్నాడు హీనస్వరంతో.
మనసులో తడి చోటు చేసుకొందతనికి.
“అందుకే చావంటే అసహ్యమేసిందా నీకు?”
ఔనన్నట్లుగా తలూపేడు కార్తి.
“కాని దానికి మందు కనుక్కోవడం ఎవరివల్లా కాదు.”
చప్పున అతివేగంగా తలెత్తి..”నేను కనుక్కుంటాను” అన్నాడు కార్తి.
ఆ పసికళ్లలోని తీవ్రమైన నిర్ణయం తాలూకు చాయలు గమనించి నిరుత్తురుడయ్యేడతను.
“ఎలా? ఇలాంటి దొంగ సాధువులనాశ్రయించా? చావుకి మంత్రం కాదు.. ముందు చచ్చుండేవాడివి” అన్నాడు చిరాగ్గా.
కార్తి మాట్లాడలేదు.
“నీకు నిజంగా అలాంటి నిర్ణయముంటే. ముందు బాగా చదువుకో. గొప్ప సైంటిస్టువి కా. ఆ తర్వాత దానికి మందు కనుక్కో. అంతేకాని ఇలా దొడ్డిదారిన వెళ్లి చావు కొని తెచ్చుకోకు”.
“నన్నెవరు చదివిస్తారు? నాకెవరూ లేరుగా!”
“నేను.. నేను చదివిస్తాను. ఎంత కావాలంటే అంత చదువు .. హాస్టల్లో చేరి..”
“డేడీ!” కూతురి పిలుపుకి తల తిప్పి చూశాడతను.
“హాస్టలెందుకు? మనిల్లు చాలా పెద్దదిగా. నువ్వు కేంప్స్ వెళ్తే నాకు బోర్ కొడుతుంది. నాకు తోడుంటాడు. మేమిద్దరం ఆడుకుంటాం” అంది కేయూర తండ్రి గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్న ధోరణిలో.
అతను చిన్నగా నవ్వి..”యువార్ కరెక్ట్ బేబీ! ఏం కార్తీ మా యింట్లో వుంటావా?”
కార్తి తల పంకించేడు.
“ఇంకేం.. ఆడుకోండి. నేను ఆఫీసుకెల్లొస్తాను” అని అతను గదిలోకి కెళ్లి యూనీఫాం వేసుకుంటుంటే ” మీ నాన్న పోలీసా?” అనడిగేడు కార్తి గుసగుసగా.
“చీ! కాదు. పోలీసాఫీసర్. ఎస్పీ. ఐ.పి.ఎస్. తెలుసా?” అంది కేయూర అసలే పెద్దవైన తన కళ్ళని మరింత పెద్దవి చేసి.
నిజానికి కార్తికేమీ అర్ధం కాలేదు. కాని అర్ధమయినట్లుగా “ఓహో” అన్నాడు.
సూర్యోదయమైంది.
ఒక వెలుగురేఖ లాబరేటరీ కిటికీ అద్దం మీద పడి లోనికి ప్రవేశించే విఫల ప్రయత్నంలో వేయి వ్రక్కలై వెనక్కు మళ్లుతోంది.
“కార్తికేయన్! మిస్టర్ కార్తికేయన్!”
ఉలిక్కిపడి లేచేడు కార్తికేయన్.
గత జ్ఞాపకాల్లోంచి బయటపడటానికి అతనికి రెండు మూడు క్షణాలు పట్టింది.
అతను తల విదిలించుకుని, కళ్లని నులుముకొని పలుచబడిన క్రాఫుని సవరించుకుంటూ “కొద్దిగా నిద్ర పట్టేసినట్లయింది” అన్నాడు నవ్వుతూ.
మీనన్ నవ్వలేదు.
కార్తికేయన్ కేసి నిర్వికారంగా “తెల్లారిపొయింది.” అన్నాదు.
“అవును. అదే చూస్తున్నా. బాగా తెల్లారిపోయింది” అన్నాడు కుర్చీలోంచి లేచి.
“నేను చెబుతున్నది నా భార్య కుట్టియమ్మాళ్ గురించి. ఆవిడ జీవితం తెల్లారిపోయింది.”
ఆ మాట విని ఉలిక్కిపడ్డాడు కార్తికేయన్.
చివాల్న అతను గాజుపెట్టె దగ్గరకి పరిగెత్తేడు.
లోపల నిశ్చలంగా వుంది కుట్టియమ్మాళ్ శరీరం. ఏ కదలికలూ లేకుండా. పెదవుల కొసల నుండి కొద్దిగా క్రిందకి జారుతున్న నురుగులాంటి ద్రవాన్ని చూసి పూర్తిగా హతాశుడయిపోయాడు కార్తికేయన్.
అతనిలోని ఉత్సాహం, విజయం ఈసారి తప్పక సాధించగలనన్న నమ్మకం ఒక చిన్న సూది గుచ్చిన బెలూన్లా చప్పబడిపోయింది.
పూర్తిగా ఓడిపోయేనన్న బాధ అతని గుండెని ఒక ఎండ్రకాయలా పట్టుకుని నొక్కేయడంతో అతను రక్తం పీల్చేయబడిన మనిషిలా కుర్చీలో నిస్తేజంగా కూలబడి తల పట్టుకున్నాడు.
మీనన్ అతని దగ్గరగా వచ్చి అతని భుజమ్మీద చెయ్యేసేడు.
ఆ స్పర్శలో లాలింపుని గుర్తించి తలెత్తి, “అయాం సారీ మిస్టర్ మీనన్!” అన్నాడు గద్గదమైన స్వరంతో.
“ఇట్సాల్‌రైట్! కుట్టీ బ్రతకదని డాక్టరెప్పుడో చెప్పేసేడు. కుట్టికి, నాక్కూడా ఆ విషయం తెలుసు. అయినా నీ ప్రయత్నానికి ప్రయోగంగా ఆమెని నీకప్పగించేను. ఆమె చనిపోయినందుకు కాదు నేను బాధపడుతున్నది. ఇరవై సంవత్సరాలుగా భార్యాబిడ్డల్ని, సుఖసంతోషాల్ని త్యజించి ఈ ప్రయోగశాలలో నువ్వు ఒంటరిగా చేసిన పోరాటానికి విజయం దక్కలేదని, ఇదిగాక ఇంకేం చేసిన ఒక్క భారతదేశమే కాదు భూగోళంలోని అన్ని దేశాలు గుర్తించి అద్భుత పరిశోధకుడిగా పేరు గడించేవాడివి. బట్! నీ ఆశయం చాలా పిచ్చిది. మరణం అనివార్యమైంది. దానినెవరూ ఆపలేరు. సముద్రం ముందు కట్టిన గూళ్ళు నిలబడవు. ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించి ఈ వృధా ప్రయాసని కట్టిపెట్టు. ఎదిగిన నీ కూతుర్నొకసారి వెళ్లి చూడు!” అన్నాడు మీనన్.
“నో” అంటూ గట్టిగా అరిచాడు కార్తికేయన్.
అతని అరుపులు మూసిన తలుపుల్ని, నిర్బేధ్యమైన గోడల్ని ఢీకొని పదిరెట్ల ధ్వనితో మారుమోగింది.
వెంటనే “నో మీనన్! డోంట్ సే లైక్ దట్! అయివిల్ ఫైట్ విత్ ద బ్లడీ డెత్ అంటిల్ మై డెత్!” అన్నాడు జుట్టు పీక్కుంటూ.,
మీనన్ పరిహాసంగా నవ్వి, “నువ్వే ఒప్పుకుంటున్నావన్నమాట చావుకి చావు లేదని” అన్నాడు.
“వాడ్డూయూ మీన్?” అన్నాడు కార్తికేయన్ అసహనంగా.
“అర్ధం కాలేదా, నీ చావు వరకు పోరాడతానన్నావు. అంటే నీకూ తెలుసు.. చావుని లేకుండా చేయడం అసాధ్యమని. నేనొస్తాను మరి కుట్టికి దహన సంస్కారాల ఏర్పాటు చేయాలిగా. నాదొకటే రిక్వెస్టు. రెండ్రోజులు ఏ ట్రాంక్విలైజర్సన్నా వాడి విశ్రాంతి తీసుకో. లేకపోతే ఈ ఓటమి నిన్ను తినేస్తుంది.” అంటూ కుట్టి శరీరాన్ని తీసుకుని కారులో వేసుకొని వెళ్ళిపోయాడు మీనన్.
కార్తికేయన్ ఒక్కడే ఆ ప్రయోగశాలలో, ట్యూబుల మధ్య, జార్‌ల మధ్య, రకరకాల రసాయన పదార్థాల మధ్య మిగిలిపోయేడు ఒంటరిగా.
కేవలం శారీరకంగానే కాదు మానసికంగా కూడా..

***********

కాన్వోకేషన్ మామూలుగానే జరిగిపోయింది. దాని పద్ధతిలో యాంత్రికంగా.
ఏటా కొన్ని వేలమంది పట్టభద్రుల్ని దేశంలో నలుమూలలా ఊరిఊరికి, పేటపేటకి వున్న కాలేజీలు – సబ్బు బిళ్ళల్లా, అగ్గిపెట్టెళ్ళా వుత్పత్తి చేస్తూనే వున్నాయి. వాళ్లందరికీ ఒక కాగితాన్ని గొట్టంలా చుట్టి వారివారి కుర్చీల్లో పడేసి భావితరపు నిరుద్యోగులమనే బాధతో నల్లడ్రెస్సులు వేసుకుని మౌర్నింగ్‌కి హాజరయినట్లున్న విద్యార్థుల కందజేసి తమ చేతులు దులుపుకుంటూనే వున్నారు ఈ దేశపు పాలకవర్గం.
గవర్నర్ తనదైన పద్ధతిలో విద్యార్తుల్ని వుద్దేశించి మాట్లాడేడు. వైస్ చాన్స్‌లర్ యూనివర్సిటీలని, కాలేజీలని వదిలి వెళ్ళే విద్యాథులకి హితబోధలు చేసేడు.
ఇన్నివేలలో చాలా కొద్ది మందికి మాత్రమే ప్రత్యేకత వుంది. అది గవర్నర్ చెతుల మీదుగా మెడల్‌ని అందుకోవడం.
ఆ ప్రత్యేకత వున్నవారిలో లిఖిత ఒకర్తి.
వరుస క్రమంలో అందరూ మెడల్సు తీసుకున్నారు.
లిఖిత కూడ స్టేజి మీదకెళ్లి గవర్నర్ చేతుల మీదుగా మెడల్, పట్టా తీసుకుంది. విద్యార్థులు కరతాళ ధ్వనులు చేసేరు. ఏదో ఉద్వేగానికి గురయిందామె మనసు.
ఫంక్షన్ ముగిసింది.
హాల్లోంచి బయటకొచ్చింది. యూనివర్సిటీ ఫస్టొచ్చిన స్టూడెంట్స్‌ని వాళ్ళ పేరెంట్స్, అక్కచెల్లెళ్లు, అయినవారు కౌగలించుకుని ప్రశంసిస్తున్నారు.
ఒక్క లిఖితకి మాత్రమే ఎవరూ రాలేదు.
లిఖిత మనసులో ఎక్కడో అసంతృప్తి మొలకెత్తి గుండెలనిండా పాకింది.
తనకి తండ్రెవరో తెలీదు. అసలున్నాడో లేదో కూడా తెలీదు. తన తల్లి అర్ధరూపాయంత బొట్టు పెట్టుకుంటుంది. కాబట్టి ఆయన వుండి వుంటాడని తనకో నమ్మకం. తల్లి మాత్రం ఆ సంగతులు మాట్లాడదు. అడిగితే ఎర్రబడిన కళ్లతో చూసి విసురుగా వెళ్లిపోతుంది.
పోనీ తనయినా రాకూడదా?
ఊహూ! తన కసలిలాంటి సరదాలే లేవు.
తమ ఇంట్లో అన్నీ యాంత్రికంగా జరిగిపోతుంటాయి. ఆమె తనని నిర్లక్ష్యం చెయ్యదు. టైముకి అన్నీ ఏర్పాటు చేస్తుంది. మంచి బట్టలు కొంటుంది. తనని చదివిస్తుంది. తన బాగుకోసం అనుక్షణం శ్రమిస్తుంది. కాని… అందులో ప్రేమని వ్యక్తం చెయ్యదు. అనురాగాన్ని చూపించదు. బాధ్యత మాత్రమే వుంటుంది. కేవలం రోబోట్‌లా, మదర్ రోబోట్‌లా ..
తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది లిఖితకి.
“ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?”
తన ఆలోచనల నుండి బయటపడి పక్కకి చూసింది లిఖిత. వెంకట్ నిలబడి వున్నాడక్కడ.
“ఏం లేదు. నువ్వొచ్చావా ఫంక్షన్‌కి?” అనడిగింది.
“రాకుండా ఎలా వుండగలను. దేవిగారు గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే!”
“మెడల్ని గోల్డ్ కాదు” అంటూ నవ్వింది లిఖిత.
ఇద్దరూ బయటకొచ్చేరు.
“కాస్సెపేటైనా వెళ్దామా?”
“ఇప్పుడా?” అంటూ వాచీకేసి చూసింది లిఖిత.
“ఏం పర్లేదు. ఓ పావుగంట. నేనే వదిలేస్తాను.”
లిఖిత అతని వెనుక బైకెక్కింది.
బైక్ బీచ్ రోడ్డు పట్టింది.
“నాకు తెలుసు నువ్వెక్కడికి తీసికెల్తావో!” అంటూ నవ్వింది లిఖిత గాలి హోరుకి ఎగిరిపోతున్న బాబ్డ్ హెయిర్ సరిచేసుకుంటూ.
“నీకిష్టం కదా సముద్రమంటే.. అందులోనూ ఈ రోజు పౌర్ణమి” అన్నాడు వెంకట్ నవ్వుతూ.
లిఖిత దూరంగా వున్న సముద్రం కేసి చూసింది.
ఆకాశంలో నిండు చందమామ అందని పెళ్ళి కొడుకులా వున్నాడు. సముద్రం అంతరాలు మరచి ప్రేమించి అర్రులు చాస్తున్న పేద పెళ్లికూతురిలా వుంది.
తన ఆలోచనలకి తానే నవ్వుకుంది లిఖిత.
బైక్‌ని పార్క్ చేసి వేరుశనక్కాయలు కొనుక్కుని వెంకట్ వచ్చేంతలో బీచ్‌లో కొంతదూరం నడిచింది లిఖిత.
అతను నడక వేగం పెంచి లిఖితని అందుకొని “ఇక్కడ కూర్చుందాం” అన్నాడు.
లిఖిత కూర్చుని “ఇప్పుడు చెప్పు” అంది.
వెంకట్ ఆమె కళ్ళలోకి అదోలా చూసి”చెప్పాలనే ప్రయత్నం. ఎప్పటికప్పుడు నిన్ను చూసి మూగపోతుంటాను” అన్నాడు.
లిఖిత కిలకిలా నవ్వి “ఇది కవిత్వమా లేక పైత్యమా?” అంది.
వెంకట్ తిరిగి జవాబివ్వలేకపోయాదు.
అదే అతని బలహీనత. లిఖితని అతను ప్రేమిస్తున్నాడు. ఆరాధిస్తున్నాడు. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. రెండేళ్ళుగా ఇది సాగుతూనే వుంది. కాని తన మనసులోని మాట గట్టిగా లిఖితకి చెప్పలేని పిరికి మనసతనిది.
వాళ్లిద్దరూ ఒకరినొకరు ఎలా పరిచయమయ్యేరన్నదొక గొప్ప విషయం కాదు. కాని లిఖితని చూసిన మరుక్షణమే “ఆమెనొక్కసారి ముద్దు పెట్టుకోలేని జీవితం వృధా!” అనిపించిందతనికి. తన ఆలోచన తప్పేమోనని సిగ్గుపడ్డాడు కూడా. అయినా అతని కలల్లోకి ఆమె తీవ్రంగా జొరబడసాగింది. పగలు – రాత్రి అతని కళ్లలో, మనసులో లిఖిత రూపం ఆక్రమించుకుంటుంది. ఇక తనవల్ల కాదనుకున్నాడతను. వెంటనే తన ప్రయత్నాలు సాగించేడు. లిఖిత స్నేహితురాలు సుమన ద్వారా లిఖితతో స్నేహం సాగించేడు. వెంకట్‌లోని మంచితనం, తన పట్ల వున్న అభిమానం, లిఖితకి కూడా నచ్చాయి. ఇద్దరి స్నేహం బలపడింది.
వేరుశెనక్కాయలు తినడం అయ్యేక “ఇక పోదామా?” అంది లిఖిత.
“అప్పుడేనా?” అతని మొహంలో ఆందోళన చోటు చేసుకుంది.
“నువ్వేం మాట్లాడకపోతే ఏం చేయాలి?” అంటూ లిఖిత విసుక్కుంది.
వెంకట్ గొంతు మరీ పట్టేసింది. “వెన్నెల వృధా అయిపోతుంది” అన్నాడు స్వగతంలా.
“ఈ సంగతి చెప్పడానికేనా ఇంత దూరం తీసుకొచ్చెవు. వెన్నెల వృధా అయిపోవదం లేదు. అసలు వెన్నెలే వృధా అయిన అయిటెం. వెన్నెల వలన పంటలు పండవు. ప్రాణికోటి జీవించదు. క్రిమికీటకాలు నశించవు. ఆ పవర్ సూర్యుడికే వుంది. మగాడంటే సూర్యుడే. చంద్రుడు కానే కాదు. ప్రేమించి పెళ్లి చేసుకోలేని భీరువులకి, డ్యూయెట్లు పాడుకోడానికి మాత్రమే ఈ పనికిమాలిన వెన్నెల పనికొస్తుంది” అంది లిఖిత వెక్కిరింతగా.
ఆమె ఆలోచనా విధానానికి వెంకట్ తెల్లబోయేడు.
“నువ్వు చాలా విపరీతంగా మాట్లాడుతావు. కవిలకి భావుకతనిచ్చే వెన్నెల్ని ఇంత కించపరచి మాట్లాడిన మొట్టమొదటి మనిషివి నువ్వే” అన్నాదు చిన్నబోతూ.
“సారీ! నా ఉద్దేశ్యం నేను చెప్పేను వెంకట్!. ఇక వెళ్దాం పద” అంటూ లేచి నిలబడింది లిఖిత.
వెంకట్ నిస్సహాయంగా ఆమెని అనుసరించేడు.
“నీ తర్వాత ప్రోగ్రాం ఏమిటీ?”
“భోంచేసి నిద్రపోవడం”
“యూ సిల్లీ! ఇంకా చదువుతావా? లేకపోతే మీ అమ్మగారి బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతావా?”
“ఇంకా నిర్ణయించుకోలేదు వెంకట్. ఆ చీరల బిజినెస్సయితే చెయ్యను. చీరలమ్మడం, పచ్చళ్ళు పెట్టడం లాంటి వ్యక్తిత్వం లేని పనులు నాకిష్టముండవు. మనం చేసే పనులు కూడా ఆడతనాన్నే ప్రస్ఫుటించేలా ఏదైనా ఎడ్వంచర్ చేయాలని!” అంది గమ్మత్తుగా భుజాలెగరేసి నవ్వుతూ.
వెంకట్ మరేమీ మాట్లాడలేదు.
అప్‌లాండ్స్‌లో లిఖిత యిల్లు రాగానే బైక్ ఆపేడు వెంకట్.
“బై వెంకట్ గుడ్‌నైట్” అంటూ మెట్లెక్కుతుంటే “లిఖితా ఇది మరచిపోయేవ్!” అన్నాడు వెంకట్.
“ఏంటది?” ఎక్కిన నాలుగు మెట్లూ దిగి గబగబా అతని దగ్గరకొచ్చి అడిగింది లిఖిత అమాయకంగా.
“ఇది” అంటూ చటుక్కున తన చేతులతో ఆమె తలని తిప్పుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని అంత వేగంగానూ వెళ్లిపోయేడు వెంకట్.
ఆ హఠాత్ పరిణామానికి లిఖిత చాలా నివ్వెరపోయింది.
భవిష్యత్తులో ఈ ప్రేమికుడే తనకో ప్రబల శత్రువై అడుగడుగునా తనని మానసిక హింసకి గురిచేసే శత్రువు కాగలడని ఆమె ఊహించలేకపోయింది.

సశేషం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *