April 26, 2024

లింగ పురాణము – విమర్శనాత్మక పరిశీలన

రచన: కొరిడే విశ్వనాథశర్మ

ఓం గం గణపతయే నమః
ఓమ్ శ్రీ వాగీశ్వర్యై నమః ఓం శ్రీ మాత్రే నమః

ఒక పురాణప్రస్తావన మరొక పురాణమునందు కనబడున్నది. లింగపురాణప్రస్తావన లింగపురాణమునందే కాక ఏకాదశసాహస్రశ్లోకగ్రథితముగానూ, పదకొండవ పురాణముగానూ మత్స్యాగ్నినారద భాగవతాదులయఓదు కీర్తించబడినది. 12, 13 శతాబ్దీయుడైన బల్లాలసేనుడు తన ‘దానసాగరము’న “షట్సాహస్రమితం లింగపురాణమపరం తథా.” అని ఆరువేల శ్లోకపరిమితమైనది గా పేర్కొన్నాడు. కాని ప్రస్తుతం లభిస్తున్న లింగపురాణము తొమ్మిదివేల శ్లోకముల గ్రంథము లభించుతున్నది. కావున మూలలింగపురానగ్రంథము కాలప్రవాహమువలన శ్లోకముల హెచ్చు, తగ్గులు జరిగియున్నవను అభిప్రాయము కలుగుచున్నది.
ప్రస్తుతలింగపురాణమునందలి పూర్వభాగమునందు 108 అధ్యాయములు , ఉత్తరభాగమునందు 55 అధ్యాయములున్నవి. కాని “ అష్టొత్తర శతాధ్యాయమాదిమంశ మతః పరమ్, షట్ చత్వారింశదధ్యాయం ధర్మకామార్థ మోక్షదమ్.” అని లింగపురాణము(2. 55. 36,37)లో పూర్వభాగమునందు 108 అధ్యాయములు ఉత్తరభాగమునందు 46 అధ్యాయములుమాత్రమున్నట్లు పేర్కొన్నది. ఐనచో ‘ షట్ చ నవ చ చత్వారింశచ్చ’ ( 6+9+ 40) అను మధ్యమపదలోపి కర్మధారయసమాసాధారముగా 55 అధ్యాయములని ‘శివతోషిణీ’ యను లింగపురాణవ్యాఖ్యాకరుడైన గణేశపండితుడు సమర్థించినాడు. కాని అసంగతమగునని కొందరు దానిని వ్యతిరెకించినారు. అటులైన అటుపిమ్మట కాలమందలి పండితులెవరైన మిగిలిన తొమ్మిది అధ్యాయములను చేర్చవచ్చునని అభిప్రాయము కలుగుచున్నది.
నారదపురాణమునందు లింగపురాణప్రస్తావనలో రెండు భాగముల ఈ పురాణము అగ్నికల్పకథాశ్రయమై విచిత్రములైన బహుకథలతో వ్యాసమహర్షి నిర్మించబడినదని పేర్కొనినది. కాని లింగపురాణములో “ ఈశానకల్పవృత్తాంతమధికృత్య మహాత్మనా, బ్రహ్మణా కల్పితం పూర్వం పురాణం లైంగముత్తమమ్ . (1.2.1.) అని ఈశానకల్పకథాశ్రయముగైకొని బ్రహ్మదేవునిచే కల్పించబడినదని చెప్పబడినది.
కావున ప్రస్తుతం లభించుచున్నపురాణము మూలపురాణముకంటే భిన్నమైనదని విమర్శకులు అభిప్రాయపడుచున్నారు. అందులకు మరొక కారణము కూడ వారి అభిప్రాయములలో కనబడుచున్నది. అర్వాచీనవిమర్శకులైన నిబంధకారులు కొందరు తమ నిబంధములలో లింగపురాణముకు సంబంధించినవిగా పేర్కొన్న శ్లోకములలో కొన్ని ప్రస్తుతలింగపురాణమునందు కనబడుతూలేవు. కావున బృహల్లింగపురాణము మరొకటియుండవచ్చను అభిప్రాయము. ఎందుకనగా 12, 13 శతాబ్దీయుడగు బల్లాలసేనుడు తన ‘దానసాగర’మందు బృహల్లింగపురాణమును గురించి పేర్కొన్నాడు. కావున ప్రస్తుతం లభించుచున్నపురాణముకంటే భిన్నమైన పురాణము మరొకటున్నదా అనునది పరిశోధనలో తేలవలిసియున్నది.

లింగపురాణకర్తృత్వ, పౌర్వాపర్యకాల నిర్ణయము.

ఈ పురాణమునందెచ్చటనూ పురాణకర్త పేరు పేర్కొనబడలేదు. దాదాపు అన్ని పురాణములందుకూడా ఆయా పురాణకర్తృత్వ విషయము స్పష్టముగానుండదు. వ్యాసమహర్షి పేరే స్థూలంగా చెప్పబడుచున్నది. ఐననూ ఈ పురాణమునందు ‘బ్రహ్మణాకల్పితం..’ అను శ్లోకవాక్యము బ్రహ్మకల్పితముగా పేర్కొనుచున్నది. బ్రహ్మద్వారా సనత్కుమారుడు, సనత్కుమారుడిద్వారా వ్యాసులవారు, ఆయనద్వారా రోమహర్షుడు (సూతమహర్షి) విన్నారని , ఆయనచే నారద శౌనకామహర్షులకు ఈ పురాణము ఉపదేశించబడినది. ఆద్యంతము మహర్షుల ప్రశ్నలు, రోమహర్షుని ప్రత్యుత్తర, వివరణాత్మక కథనముల ద్వారా పురాణము విస్తరించబడినది. వ్యాసమహర్షిముఖమునుండి రోమహర్షులవారు విని చెప్పబడినందున వ్యాసమహర్షికర్తృత్వముగా స్వీకరించబడుచున్నది.
కాని విష్ణుపురాణము కూడ బ్రహ్మప్రోక్తమైనదే , ఐనప్పటికినీ పరాశరమహర్షిచే మైత్రేయునకు తెలియజేయబడినందున అట్టి పురాణకర్తృత్వమును గురించి, లింగ, భవిష్య పురాణములు పరాశరమహర్షినే విష్ణుపురాణకర్తగా పేర్కొన్నవి.
ఇక పురాణముల పౌర్వాపర్యయముల గురించి కూడ ఇదమిత్థముగా నిర్ణయించుట కష్టమే ! ఐననూ సంక్షిప్తముగా ఇట్లు తెల్పవచ్చును. మిక్కిలి పురాణములగురించి కృషి జేసిన ‘హజారా’ యను విమర్శకుడు ప్రకారము లింగపురాణము కూర్మ, మత్స్యపురాణములనుండి విషయసేకరణ చేసికొన్నదని అభిప్రాయపడినాడు. విష్ణు, లింగపురాణములలో కూడ లోమమహర్షిని ఉపోద్ఘాతము మొదలుకొని, జగత్సృష్టిక్రమాది విషయములలో అనేకశ్లోకసమూహములు పదములుకూడ మార్పు లేకుండ సమానములై యున్నవి. ఒకదానిలోనుండి మరొకదానిలోనికి దించబడినవనునది స్పష్టమే ! ఇట్లు ఒకదానినుండి మరొకదానిలొనికి రావడము సహజమే అని తేలికగా కొట్టివేసినవారున్నారు.
ఐతే దాదాపుగా అన్ని పురాణములందు అన్ని పురాణములగురించిన ప్రస్తావన పేర్కొనబడినది. అదేవిధముగా దాదాపుగా ప్రతి పురాణములోనూ లింగపురాణప్రస్తావన చేయబడినది. కావున పౌర్వాపర్యయముగురించి నిర్ణయించుట కష్టమే!

పురాణాంతర్గత విషయములు – విశిష్టతలు

ఈ పురాణమున పూర్వోత్తర భాగములందు 163 అధ్యాయములున్నవనునది విదితమైనట్టిదే ! “అష్టాదశపురాణేషు దశభిర్గీయతే శివః” అని స్కందపురాణము నందు చెప్పబడినట్లు ఇయ్యది భగవంతుడైన పరమశివుని మహత్తు విశదీకరించుటే లక్ష్యభూతమైనట్టిది. శివపురాణమునందు ఉమామహేశ్వరులకళ్యాణమును ప్రధానఘట్టముగా జేసికొని, అనేక ఆఖ్యానోపాఖ్యానములతో శ్రోతలను రంజింపజేయునట్టిది. అదే విధముగా అనేక పురాణములందు పరమేశ్వరుని గాథలు వివరించినవి.
ఈ పురాణమునందు దాక్షాయణీ వృత్తాంతము, దక్షయజ్ఞ ద్వంసము, పార్వతీ దేవీ అవతారము, తపస్సుచే పరమేశ్వరుని మెప్పించుట, కామదహనము, శివకళ్యాణము వర్ణింపబడినది. ఇందు విశేషమేమనగా కళ్యాణ సమయమున పరమేశ్వరుడు శిశురూపమును దాల్చి దేవతలను పరీక్షించుట గలదు. అదేవిధముగా సృష్ట్యాదికాలమునందు లింగోద్భవముగావించి, బ్రహ్మవిష్ణువులను పరీక్షించుట, దారుకావనమునందు, మహర్షులను పరీక్షించుట, త్రిపురాసుర సంహారము, అంధకాసుర గర్వమును అణచుట, దధీచి మహర్షిని అనుగ్రహించుట, శిలాదమహర్షికి పుత్రునిగా నందీశ్వరుడుగా అవతరించుట, ఉపమన్యుచరిత్ర మొదలైనవి మనోహరముగా వర్ణింపబడినవి. వినాయకజన్మవృత్తాంతమువర్ణింపబడినది. ఇందు పరమేశ్వరుడు దేవతల ప్రార్థనమేరకు సుర రక్షణ, అసుర సంహార, విఘ్నవినాశక, వేద బ్రాహ్మణరక్షణ మొదలైన ప్రయోజనకోరకు సద్యోజాతునిగా విఘ్నేశ్వరుని గజేంద్రవదనునిగా పార్వతీదేవీతనూద్భవునిగా జన్మింపజేయుట కలదు. కాని తారకాసురవధనిమిత్తము జన్మించవలసిన కుమారస్వామి జననముకొరకు జరిగిన శివపార్వతీకళ్యాణము జరిగినట్లు చెప్పబడినా కుమారస్వామి జననం, తారకవధ వర్ణించబడలేదు. (బహుశః మనకు అలభ్యగ్రంథములో నుండ వచ్చునేమో !)
శ్రీమన్మహావిష్ణువుయొక్క అవతారములగు వరాహ, నరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణ వృత్తాంతములకథాకథనములుండుట విశేషము. కాగా హిరణ్యకశిపువధానంతరము శాంతించని ఉగ్రనరసింహాకృతిని జూఛి, భితిల్లిన దేవతలు పరమేశ్వరుని వేడుకొనగా, ఆ మహేశ్వరుడు శరభావతారమెత్తి, యుద్ధముజేసి, నృసింహుని అవతారమునుపశమింపజేసిన వృత్తాంతము, అదేవిధముగా వరహావతారము నుపశమించి తనరూపమును ఇక్కడే వదిలి మహావిష్ణువు వెళ్ళగా, ఆ మహాకాయమునుండి భూమినెత్తిన కోరను పీకి, తన వక్షస్స్థలమునందు ధరించుఘటన ఇందు వర్ణించబడుట విశేషము.
ఐతే ఈ పురాణమునందు ఆఖ్యానోపాఖ్యానములకంటే ప్రాధానముగా లింగోద్భవము, లింగమూర్తి ప్రతిష్ఠ, అర్చనావిధానము, సద్యోజాతాది వేదమంత్రముల వ్యాఖ్యానాదులు, శివవ్రతములు, శివపంచాక్షర, షడక్షరమంత్రముల మాహాత్మ్యము, భక్తి మహిమ, శివసహస్రనామములు ( రెండు మారులు) శివార్చనా విధులు, స్తుతులు, శైవదీక్షావిధానములు, పాశుపతవ్రతవిధులు, తిల, గో, గజ, హిరణ్య, కన్యాది దానముల మాహాత్మ్యములు విపులముగా వర్ణించబడినాయి..వీటితోపాటు కేవలము శివభక్తివృత్తాంతములే కాక ఉత్తరభాగమున ఆరంభమునుండే శ్రీమన్మహావిష్ణువుయొక్క మాహాత్మ్యము విశదీకరించబడినది. శ్రీ కృష్ణుని యొక్క అనుగ్రహము, శ్రీవైష్ణవలక్షణము, మాహాత్మము, శ్రీమన్మహావిష్ణువుయొక్క అష్టాక్షరీ, ద్వాదశాక్షరీ మంత్రముల విశిష్టత, ప్రాశస్త్యములు కూడ వర్ణించబడినవి.
పాతాళభువనకోశములవర్ణన, మేరు ప్రముఖాది పర్వతవర్ణన, జ్యోతిశ్చక్ర,గ్రహసంఖ్యాదులప్రాశస్త్యము, సూర్యవంశ,చంద్రవంశరాజులచరిత్ర మొదలైన విషయములు ఎన్నో ప్రశంసించబడినాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *