April 27, 2024

వేద వాజ్మయము – పరిచయము

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

భారతదేశము పుణ్యభూమి అనడానికి కారణము వేదాలు పుట్టినచోటు కావటమే. అందుచేతే వేదభూమి అని కూడా అంటారు . వేదాలు భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి అదర్శజీవనానికి మూలాధారము. మనిషిని నడిపించే ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్ధలను తెలియజేసే శబ్దరాశే వేదము. వేదమనే శబ్దము”విద్” అనే సంస్కృత శబ్దము నుండి ఏర్పడింది . వేదాలు ఒక మతానికి, ఒకప్రాంతానికి లేదా ఒక వర్గానికి , దేశానికి చెందినవి కావు వేదాలను విశ్వవాజ్మయముగా పేర్కొనవచ్చు . ఇవి మానవ ధర్మాలతో పాటు అనంత విజ్ఞానాన్ని మానవాళికి అందిస్తాయి.

మానవుడి సర్వతోముఖాభివృద్దికి అవసరమైన తత్వాలు వేదాలలో ఉపదేశింపబడ్డాయి . భారతీయ సంస్కృతీ సభ్యతలకు దార్మికతకు ఈ తత్వాలే పునాదిరాళ్ళు. అత్యంత విశాల దృక్పథముతో మన మహర్షులు వేదాల ద్వారా సమస్త లోకాల సుఖాన్నిమనసారా వాంచించారు. వేదాలను ఎవరు రచించలేదు భగవంతుని ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా వేదములో చెప్పబడ్డాయి. బ్రహ్మదేవుడు గ్రహించి లోకానికి ఉపదేశించాడు కనుక వీటిని”అపౌరుషేయాలు” అని చెబుతారు. బ్రహ్మ నుండి పరంపరగా వచ్చిన వేదాన్ని, సామాన్య జనులను దృష్టిలో ఉంచుకొని, ప్రజల సంక్షేమము కోసము వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా ప్రసిద్దిచెందాడు. వేదవ్యాసుడు తన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని , సుమంతులకు ఉపదేశించి వేదాల వ్యాప్తికి సహకరించాడు. వేదాలు స్వరాలపై ఆధార పడిఉన్నాయి మారితే అర్ధమే మారుతుంది కాబట్టి వేదానికి స్వరాలే ప్రాణాలు ప్రతి వేదము సంహిత, బ్రాహ్మణం, అరణ్యకము , ఉపనిషత్తులు అనే నాలుగు భాగాలుగా ఉంటుంది.

ప్రస్తుతము వ్యాసుడు చేసిన విభజన ప్రకారము నాలుగు వేదాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాము.

1. ఋగ్వేదము:- వేదాలలో మొదటిది ఋగ్వేదము, “ఋక్” అనే శబ్దానికి అర్ధము. స్తోత్రము , వేద స్తుతి అని అర్ధము. ఋగ్వేదము అగ్ని నుండి ఉద్బవించింది. ఇంద్రుడు మొదలైన దేవతలను ఈ వేదము స్తుతిస్తుంది యజ్ఞాలు, యాగాలలో దేవతలను ఆవాహన చేయటానికి అంటే దేవతలను స్తోత్రము చేయటానికి ఈ ఋక్కులను ఉపయోగిస్తారు. ఋగ్వేదములో పది మండలాలు ఉన్నాయి. ఇంకొక విభాగము ప్రకారము 64 అధ్యాయాలు ఉన్నాయి 64అధ్యాయాలను ఎనిమిది అష్టకాలుగా విభజించారు. ప్రపంచోత్పత్తిని తెలిపే “నాసదీయ సూక్తము”, సృష్టి గురించి చెప్పిన “పురుష సూక్తమ్”, ఋగ్వేదములోనివే. పకృతి రహస్యాలు, వివాహ బంధము, ఏక పత్నీవ్రతము, అశ్రమవ్యవస్త , ఆయుర్వేద విజ్ఞానము మొదలైన విశేషాలు ఎన్నోఋగ్వేదములో ఉన్నాయి

2. యజుర్వేదము :-వాయువు నుండి వుద్భవించిందే యజుర్వేదము. సమాజ అభ్యుదయము కోసము యజ్ఞాలు, యాగాలు అచరించటము, అధ్యాతికభావాలను పెంపొందించటము, బౌతిక విజ్ఞానము, గణితము, మొదలైన విషయాలు ఈ వేదములో వివరించబడ్డాయి. దేవతలను పూజించటానికి, యజ్ఞాలు చేసేటప్పుడు దేవతలకు హవిస్సులను సమర్పించటానికి ఉపయోగించే మంత్రమే యజుస్సు ఇటువంటి మంత్రాలతో కూడిన వేదమే యజుర్వేదము. ఇవి గద్య రూపములో ఉంటాయి. యజుర్వేదము – కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము అని రెండుభాగాలు. దక్షిణ భారతములో కృష్ణ యజుర్వేదము, ఉత్తర భారతములో శుక్ల యజుర్వేదము ప్రాచుర్యములో ఉన్నది. యజుర్వేదానికి ధనుర్వేదము ఉపవేదము ఇందులో ముక్తక , అముక్తక , మూక్తాముక్త , యంత్ర ముక్తకాలు అనే నాలుగు రకాల ఆయుధావిద్యాలు చెప్పబడ్డాయి కాని అవి ఏవి ప్రస్తుతము అందుబాటులో లేవు అంతరించిపోయినాయి.

3. సామవేదము:-సామవేదము సూర్యుడి నుండి ఉద్బవించింది గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు “వేదాలలో నేను సామవేదంగా ఉన్నాను “అని విభూతియోగముగా పేరున పదవ అధ్యాయములో పేర్కొన్నాడు . సామవేదము సంగీతమాయమైంది కాబట్టి సామగానాన్ని విన్న దేవతలు ప్రసన్నులవుతారు. సామవేదములో ఋక్కులనే ఋగ్వేదమంత్రాలను రాగబద్దముగా గానముచేస్తారు సామవేదములో ఎక్కువ భాగము ఋగ్వేదములోని ఎనిమిది, తొమ్మిది మండలాలనుండి గ్రహించబడ్డది. సామవేదములో సప్తస్వరాలు ఉంటాయి కాబట్టి సంగీత శాస్త్రానికి ఈ వేదమే మూలము. పూర్వము సామవేదము వెయ్యి శాఖలుగా విస్తరించి ఉండేదని పండితులు చెపుతారు ప్రస్తుతము రాణాయనీయ , కౌధుమ జైమినీయ అనే మూడు శాఖలు మాత్రమే లభ్యము అవుతున్నాయి. భారతీయ సంగీతానికి మూలమైన గాంధర్వ వేదము సామవేదానికి ఉపవేదము. మిగిలిన వేద పాఠము కంటే సామగానము చాలా కష్టమయింది. స్వరము మారితే శబ్దానికి అర్ధము మారుతుంది అర్ధము మారితే అనర్ధమే జరుగుతుంది.

4. అధర్వ వేదము :-అధర్వ ఋషి ఈ వేదాన్ని లోకానికి చెప్పాడు కాబట్టి ఈ వేదానికి ఈ పేరు యజ్ఞాన్ని నిర్వహించే బ్రహ్మవిదిగా ఈ వేదములో నిష్ణాతుడై ఉండాలి. యజ్ఞ నిర్వహణకు బ్రహ్మతో పాటు అధ్వర్యుడు , హోత, ఉద్గాత అనే ముగ్గురు ఋత్వికులు కూడా కావాలి. అధ్వర్యుడు గా ఉండే వ్యక్తికీ యజుర్వేదము , హోతగా ఉండే వ్యక్తికీ ఋగ్వేదము , ఉద్గాతకు సామవేదము వచ్చి ఉండాలి ఈ ముగ్గిరిపై పర్వేక్షించే వ్యక్తీ బ్రహ్మ . ఈ వేదములో శరీర చికిత్సకు సంబందించిన 144 సూక్తాలు చెప్పబడ్డాయి ఈ సూక్తాలలో మానవ శరీరములోని ప్రతి అవయవము యొక్క స్వరూపము వివరించబడింది అలాగే రాజ్యానికి రాజధర్మానికి సంబందించిన అనేక విషయాల ప్రస్తావన ఉంటుంది వ్యాధులను, శత్రువులను, భూతాలను , క్రూర మృగాలను మాయావులను నివారించటానికి ఈ వేదములో మంత్రాలు ఉన్నాయి. రాజనీతితంత్రాలు , అర్ధ తంత్రాలు , కృషివాణిజ్యాలను, సమాజ నిర్మాణాన్ని ప్రతిపాదించే అర్ధ వేదము అధర్వవేదానికి ఉపవేదము. దీని అధారముగానే బృహస్పతి అర్ధశాస్త్రాన్ని రచించాడు . చాణుక్యుని అర్ధ శాస్త్రానికి, శుక్ర నీతికి కూడా ఇదే మూలము. వేదార్ధాన్ని తెలుసుకోవటానికి, వేద హృదయాన్ని సరిగా అర్ధము చేసుకోవటానికి శాస్త్రకారులు ఆరు వేదాంగాలను నిర్దేశించారు. శిక్షా, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము , జ్యోతిష్యము , కల్పము అనేవి అరు వేదాంగాలు వీటి గురించి క్లుప్తముగా తెలుసుకుందాము

1. శిక్ష :-ఇది ఉచ్చారణ శాస్త్రము(ఫోనెటిక్స్)ఇది వేదములోని వర్ణాలను, స్వరాలను , మాత్రలను, ఉచ్చరించే విధివిధానాలను నిర్దేసిస్తుంది శిక్షలో యాజ్ఞ వల్క్య శిక్ష , నారదీయ శిక్ష, పాణినీయ శిక్షలు ప్రధానమైనవి.
2. వ్యాకరణము:-పదము యొక్క స్వరూపాన్ని చక్కగా తెలియపరచటము, పదాలలోని ప్రకృతి -ప్రత్యయాలను వివరించటము తద్వారా అర్ధాన్ని తెలుసుకోవటము వ్యాకరణము ద్వారా వీలు అవుతుంది . యజ్ఞ యాగాదులలో ఒక యాగములో నిర్దేశించిన మంత్రాలను విభక్తి మార్పు చేత మరొక యాగములో వినియోగిఃచటానికి వ్యాకరణ జ్ఞానము అవసరము. వేదాల ఉచ్చారణ దోషాలను సరిదిద్దుకోవటానికి వ్యాకరణము తోడ్పడుతుంది .
3. ఛందస్సు :-యజ్ఞయాగాది అనుష్టానికి ఋషి దేవతా ఛందస్సుల పరిజ్ఞానము తప్పనిసరి.
4. నిరుక్తము:-దీనిని యాస్క మహర్షి రచించారు దీనిలో నైఘంటుక కాండ, నైగమకాండ, దేవతాకాండ అనుమూడు భాగాలు ఉంటాయి మొదటి కాండలో దిక్కులు, కాలాలు, పృధివ్యాధి లోకాలకు సంబందించిన శబ్దాలు. రెండవకాండలోమనుష్యుల అవయవాలకు సంబంధించిన అంశాలు , మూడవ కాండలో పై రెండింటిలో వివరింపబడిన ధర్మాలకు సంబందించిన పేర్లు వివరించబడ్డాయి.
5. జ్యోతిష్యము: ఏ యజ్ఞము ఎప్పుడు చేయాలో నిర్దేశిస్తుంది. అప్పుడు చేస్తేనే సరి అయిన ఫలితాలను ఇస్తుంది . యజ్ఞ ఆచరణకు తగిన కాలాన్ని నిర్ణయించేది జ్యోతిష్య శాస్త్రము.
6. కల్పము:- యజ్ఞశాల నిర్మాణము మొదలైనా అంశాలను శ్రౌత సూత్ర గ్రంధాలలో వివరింపబడింది. వీటినే కల్ప సూత్రాలు అని కూడా అంటారు ఇవి శ్రుతిప్రతిపాదితమైన యజ్ఞ యాగాదుల ప్రయోగాలను వివరిస్తాయి. ఈ విధముగా ఈ ఆరు అంగాలు వేదార్ధాన్ని తెలుసుకోవటానికి దోహద పడతాయి. ఒక తపస్సు చేసేటప్పుడు ఎంత ఏకాగ్రత, నియమము, నిష్ట అవసరమో వేద అధ్యయనానికి కూడాఅవి అంత అవసరము అంటే వేదాభ్యాసము ముఖ్యమైన తపస్సు అప్పుడు మాత్రమే సత్ఫలితాలను వేదము ఇస్తుంది సర్వజనులు సుఖ శాంతులతో వర్ధిల్లుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *