May 2, 2024

గొర్ల మంద

రచన:కృష్ణ మణి

నేనే పరాన్నజీవిని
పరాన్నబక్కు అని కూడా అంటారు

ఏదైతే ఏందిరాబై
మంది మీద బతుకుడే గదా

మనమందరమూ సోదరా

అవును బై
పక్కొల్లది గుంజుకు తింటేగని నిద్రబట్టదు
అయితేంది ?

అట్లా కాదుగని
ఒక్కసారి ఆలోచించు
సృష్టిలో జీవులన్నీ పరాన్నజీవులు కాకుంటే ఏం జరిగేదో

ఏమయితుండేబై
సముద్రంలో చేపలు నిండి
నీళ్లన్నీ పైకొచ్చి జమీనుని ముంచి
ఈ భూగోళం ఒక వింత ఆకృతితో పంది మసలినట్లు ఉండేది

మనిషి ఎంతకాలమని నీటిమీద బతుకుతడు
ఎన్నడో ఖతంయ్యేటోడు
లేకుంటే ఇప్పటికి గుడ్డబట్ట కానక
కోతికి తాతయ్యేటోడు

నిజమే బై అట్లానన్నా కాకపాయే
ఇని కావురం సల్లగుండా
గుండెలల్ల ఈ అగ్గిగోళాలు బగ్గుమని పొగలు జిమ్ముడు ఉండేవా ?

రంగుల గుద్దులాటలుండేవా ?
నా కులమనీ
నా భాష అనీ
నా సంస్కృతి అనీ
జబ్బలు సరసుడు ఉండేదా ?

ఈ ఓర్వజాలని గుణాలు
పెద్దకూర పంచాదులు ఉండేవా ?
ఆడమగ తేడాలు
కట్నం సావులు
కనికరం లేని కసాయిల షికారులు ఉండేవా ?

మతం గొప్పలు
పీఠం తిప్పలు
తేరని అప్పులు
ఈ దగ్గులు తుమ్ములు
దావఖాన జబ్బులు ఉండేవా ?

మతమంటే అనిపిస్తుంది
కనీసం మనిషికి మతం పిచ్చన్న లేకున్నా
అసలు మతమనేది లేకున్నా చరిత్ర ఎట్లుండేదో ?

జీవులు పరాన్నబక్కులైనా ఏమిగాలేదు కాని
మనిషికి అహంకారమనే విషాన్ని చిమ్మకున్నా బాగుండేది

చలో బై సాబ్
యాదిజేసి మనసుకాలవెట్టినవు
చాయి తాపియ్యి నడువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *