April 26, 2024

మాయానగరం -37

రచన: భువనచంద్ర

“జూహూ బీచ్ అద్భుతంగా వుంది ” అదిగో అదే సన్ & సాండ్ ” చూపిస్తూ అన్నది వందన.
“విన్నాను, బోంబే లో ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ ” ఇక్కడి స్మిమ్మింగ్ పూల్ చాలా సినిమాలలో చూపించారు. ‘బత్తమీస్ ” సినిమాలో మొదటిసారి బికినిలో సాధన షమ్మీ కపూర్ ని ఏడిపిస్తూ ” సూరత్ హసీ.. లగతా హై దివానా ” అంటూ పాట కూడా పాడుతుంది అని చెప్పాడు ఆనందరావు. వారి సంభాషణ ఇంగ్లీష్, హిందిలో సాగుతోంది.
“ఇంకేం తెలుసు ” అడిగింది వందన.
“దేవానంద్ చాలా ఏళ్లు యీ హోటల్లోనే ఒక సూట్ లో వున్నారట. ఆ రోజుల్లో సినీతారలు, రాజకీయ నాయకులు అందరికీ ఇదే ‘అడ్డా ‘ అని చదివాను. ” హోటల్ వంక బీచ్ వైపు నుంచి చూస్తూ అన్నాడు ఆనందరావు.
“ఆ పక్కనే ‘సాండ్స్ ‘ హోటల్ వుంది, ఇంకా సీ ప్రిన్సెస్, ఝ్వ్ మారియట్ లాంటి ఫైవ్ స్టార్, సెవన్ స్టార్ హోటళ్ళు బోలెడున్నాయి. హోటల్ రెహమత్ కూడా వుంది. “లీలా ” గ్రూప్ హోటల్స్ వున్నాయి. చనువుగా ఆనందరావు చెయ్యి పట్టుకొని ముందరకి తీసుకెళ్తూ అన్నది వందన.
“ఇదో.. ఇలా వొడ్డునే ఓ కిలోమీటరు నడచి వెళ్ళే రైట్ హాండ్ రోడ్ వస్తుంది. రోడ్డేక్కి మెయిన్ రోడ్ వైపు వెడితే , ధర్మేంద్ర రికార్డింగ్ థియేటర్ “సన్నీ సౌండ్స్” వస్తుంది. చుట్టుపక్కలే ‘ఇస్కాన్ టెంపులూ, రెస్టారెంట్లు ఉన్నై, అక్కడి రెస్టారెంట్ లో అన్నీ ప్యూర్ వెజ్ మాత్రమే కాక ఆవుపాలతో చేసినవే (స్వీట్స్ ) దొరుకుతాయి. అలాగే ‘టీ ‘ కూడా మూలికలతో చేసినది దొరుకుతుంది. జూహూ బీచ్ లోనే కె. ఏ. అబ్బాస్ వీధీ చూడొచ్చు. ఎందరో సినిమా తారలూ, దర్శకులూ, సంగీత దర్శకులూ, యీ జూహూ బీచ్ లో వున్నారో ” వివరించింది వందన.
“కదూ! ” స్టైల్ గా నడవడం మొదలెట్టాడు ఆనందరావు.
“అదేంటీ? నడక మారిందీ? ” ఆశ్చర్యంగా అడిగింది వందన.
“అంతమంది నటీనటులు యీ బీచ్ లో నడిచే వుంటారుగా, వారి అడుగుజాడల్లోనే మనమూ వెళ్తున్నాము. అందుకే… కాసేపు మనమూ స్టార్స్ అయ్యిపోయి నడుద్దాం ! ” పకపక నవ్వి అన్నాడు ఆనందరావు.
“అబ్బా.. నవ్వితే ఎంత బాగున్నాడో ” అని తనలో తాను గొణుకుంది వందన.
“ఏమన్నారు? ” అని అడిగాడు ఆనందరావు.
“ఏమీ లేదు. వూహించుకోవాలనుకుంటే మిమల్ని మీరు ఏ స్టార్ గావూహించుకుంటారా అని అడగబోయి ఆగాను. ” కొంచం సిగ్గుపడి అంది వందన.
“అన్ కండీషనల్ గా రాజ్ కపూర్ ” అన్నాడు ఆనందరావు.
“అదేం? అప్పటి తరం వాళ్ళు తప్ప ఇప్పటి ‘ఖాన్ ‘ సాహెబ్ లు ఎవరూ నచ్చరా? ” ఆశ్చర్యంగా అన్నది.
“అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడే కాదు… ఓ గొప్ప ప్రేమికుడు. ఓ గొప్ప నిర్మాత… అన్నిటి కంటే తాను తీసిన సినిమాల్లో స్త్రీకి గొప్ప గౌరవమిచ్చిన వ్యక్తి. ” వందనని చూస్తూ అన్నాడు ఆనందరావు.
“రామ్ తేరి గంగా మైలీ సినిమా చూళ్లేదా? ” చిన్నగా నవ్వింది.
“మీరు అడగదల్చుకున్న ప్రశ్న నాకు అర్ధమైంది. కానీ ఆ షాట్స్ ఒక గొప్ప ఆలోచనతో తీసినవి. ఆ ఆలోచనే “డైలాగ్ ” రూపంలో తరవాత సినిమాలో వస్తుందిగా. సింబాలిక్ షాట్స్ లో రాజ్ కపూర్ గొప్ప ఎక్స్ పర్ట్. ” ఉత్సాహంగా అన్నాడు ఆనంద రావు.
ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్టు జూహూలో బీచ్ షాపుల్లో కెరంటు దీపాలు వెలిగాయి. సన్నగా అలల సవ్వడి. చేతుల్లో చేయి వేసుకొని ఉత్సాహంగా నడుస్తున ప్రేమికులు. కొందరైతే బాహాటంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు ఒకరిమీదకు ఒకరు వొరిగిపోయి నడుస్తున్నారు. చిరుచలి… రొమాంటిక్ గా వుంది వాతావరణం. “అదిగో ఆ సర్దార్జీ షాప్ లో సమోసాలు అద్భుతంగా వుంటై. అతనిది ఢిల్లీ. ఢిల్లీ సమోసా రుచి ప్రపంచంలో మరే సమోసాకీ రాదు. చూద్దామా? ” అదిగింది వందన.
“చలో జీ, వందనా జీ…. ఆప్ భీ ఏక్ సమోసా ఖావోజీ. మజా కరోజీ. … జీ జీ జీ జీ జీ ” పకపకా నవ్వి అన్నాడు ఆనందరావు.
“నిజం చెప్పండి. మీకు హిందీ వచ్చా? ” అడిగింది వందన
“ఊహూ కొంచమే వచ్చు, కానీ హిందీ పాటలు బోలెడు వచ్చు. ” అన్నాడు ఆనంద రావు.
“ఓ. కే. సో నైస్ .. అయితే ఇక నుంచి డైలీ పాటలు వినవొచ్చన్న మాట ” ఉత్సాహంగా అన్నది వందన.
“మీకూ పాటల ఇంట్రస్టు వుందిగా, పాడుతారా? “అడిగాడు ఆనంద రావు.
“కొంచం! మరాఠీ పాటలు, హిందీ పాటలు,పాడగలను. అయితే ఏవరేజ్ సింగర్ని. ” నవ్వింది వందన.
“అయితే మీకు మా తెలుగు పాటలు కూడా నేర్పుతా, చాలా బాగుంటాయి. కానీ కొంచం కష్టపడాలి. ప్రపంచంలో వున్న గొప్ప భాషల్లో మాదీ ఒకటి. యాభై ఆరు అక్షరాలు. ” గర్వంగా అన్నాడు ఆనందరావు.
“ఓహ్.. సో నైస్.. సో హాపీ… ” ఆనందరావు చెయ్యి పట్టుకొని వూపేసింది వందన. ఓ యవ్వన కెరటం పరిమళ భరితంగా తనని లోపలకి లాగేసుకుంటున్నట్టు అనిపించింది ఆనందరావుకి.
నిజంగా సమోసాలు అద్భుతంగా వున్నాయి. ఢిల్లీ సర్ధార్జీ జూహూ బీచ్ లో చాలా ఫేమస్. జనాలు ఫుల్ గా వున్నారు. “కచోరీ(డీ) భీ లేలో సాబ్ ” తలోకటి వేశాడు సర్దార్జీ. “కచోరీ ” లను కొంత మంది “కచోడి ” అని కూడా అంటారు. రాజస్థాన్, గుజరాతీ లో చాలా ఫేమస్. ఢిల్లీలో కూడా “ఆలూ టిక్కీ ” చాలా చాలా ఫెమస్.
సమోసాలు అయ్యాక ఓ ముప్పావు గంట సముద్ర తీరం వెంట తిరిగారు. బీచ్ నిండా జనాలే. బోంబే నైట్ సిటీ. నిద్రపోనీ నగరం ఏదైనా వున్నదంటే అది బోంబేనే.
“మా వాళ్ళు అంటే ముంబైవాళ్ళు చాలా విశాల హృదయులు. ఏ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా , ఏ అల్లర్లు జరిగినా కులమత భేదాలు లేకుండా ఒకరికొకరు సహకరించుకుంటారు. ఇక్కడ “డబ్బా వాలా ” వ్యవస్త ప్రపంచంలో మరెక్కడా లేదు. పెర్ ఫెక్షన్ కు మారు పేరు. ఏ రాష్ట్రం నుంచి వచ్చినవారైనా ఏ దేశాన్నించి వచ్చిన వరైనా మా ముంభై నగరం వొళ్ళోకి తీసుకొని ఆదరిస్తుంది. కాస్మోపాలిటిన్ సిటీకి నిజమైన నిర్వచనం మా ముంబై. ” చాలా గర్వంగా చాలా భక్తితో అన్నది వందన. ఆశ్చర్యంగా చూశాడు ఆనందరావు. ఇక్కడి వాళ్ళందరూ అంతే. అందరి నోటా యీ నగరం గురించి విన్నది ప్రశస్తే! అందరూ తమ తల్లితండ్రుల్ని, గురువుల్ని ప్రేమించినంత గొప్పగా యీ నగరాన్ని ప్రేమిస్తారు. ఇది ఆనందరావుకి నిజంగా కొత్తే!
“హాట్స్ ఆఫ్ వందనా…. మీ ముంబైట్స్ ప్రేమించినంతగా తమ నగరాన్ని ఎవరూ ప్రేమించలేరు. ఆ..! కొంతమంది తమ ఊరిని ప్రేమించి , ఆ వూరినే ఇంటి పేరుగా మార్చుకున్నవారిని చూశాను. లైక్, హస్ రత్ జైపూరీ, మజ్రూ సుల్తాన్ పూరీ, షాహిర్ లుధియానవి, జలాల్ ఫరీదాబాద్, ఇలా. ఓ చిత్రం చెప్పనా? మా తెలుగు వారిలో ఓ గొప్ప గాయకుడు, కవీ వున్నాడు. ఆయన పేరు ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు. వారినే పి. బి. శ్రీనివాస్ అంటారు. ఆయన రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, పద్య, గద్య, కవితా రచనలు చేశారు. వారి వూరు కాకినాడ. వారు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, ఉర్ధు, కన్నడ, ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “శాభాష్ కోకానాడి ” పేరుతో రాసేవారు. ” ఆనందంగా అన్నాడు ఆనంద రావు.
“ఓహ్.. సో నైస్… ” అన్నది వందన.
“అంతే కాదు షేక్స్పియర్ నాటకాల్లో నిష్ణాతుడు రాఘవ గారు తన వూరి పేరుతో “బళ్ళారి రాఘవ ” గా సుప్రసిద్ధులు. అలాగే తెలుగులో ఫస్ట్ ఎవర్ సూపర్ స్టార్ , గొప్ప గాయకుడు, సంగీత దర్శకుడు, త్యాగయ్యగా, పోతనగా, రామదాసుగా, చరిత్రలో నిలిచిపోయిన వి. నాగయ్యగారు కూడా ” చిత్తూరు నాగయ్య ” గా ప్రసిద్ధులు. త్యాగరాయ ఆరాధనోత్సవాలకు సర్వం సమర్పించిన నాగరత్నమ్మ గారు బెంగుళూరు నాగరత్నమ్మగా, పెహెల్ వాన్ కాంతారావు నెల్లూరు కాంతారావుగానూ సుప్రసిద్ధులు. ఇంకా ఎంతో మంది వున్నారనుకో ” తెలుగు మీద అభిమానం గంగ లా పొంగుకొస్తుంటే అన్నాడు ఆనందరావు.
“నాకు నా నగరమంటే అభిమానం. మీకు మీ తెలుగన్నా, తెలుగువారన్నా అంత కన్నా అభిమానమెక్కువే. ఓ.కే ఆనంద్ జీ .. ఇప్పుడేం చేద్దాం. మా మరాఠీ భోజనంతో మీరు ఇక్కట్లు పడుతున్నారని తెలుసు. అందుకే మైన్ రోడ్ లో వున్న “శివ్ సాగర్ ” లో డిన్నర్ గానీ, టిఫిన్ గానీ కానిద్దాం. అది మీ సౌత్ ఇండియన్ వాళ్ళదే. ఉడిపి హోటల్. ” మెయిన్ రోడ్ కి పోయి క్రాస్ రోడ్ వైపు దారి తీస్తూ అన్నది వందన.
“ఓహ్ లవ్లీ పైర్… ” పక్క నుంచి పోతున్న వారెవరో కామెంట్ చేయగా విని పులకితురాలైంది వందన.
ఆమె మంచి హైట్ గల వ్యక్తి. ఆనంద రావు మాత్రం చిన్న నవ్వు నవ్వాడు. ఆ నవ్వుకి అర్ధమేంటో అతనికే తెలియదు.

*****************

“లివింగ్ టుగెదర్ ” ఇదీ ఇవాల్టి మన చర్చాంశం. తరతరాలుగా లివింగ్ టుగెదర్ వితౌట్ మారేజ్ అని ఇతర దేశాల్లో వున్నా భారతదేశంలో మాత్రం యీ మధ్యనే ప్రాచుర్యం పొందింది. అది కూడా బాలీవుడ్ సినీ నటీనటుల వలనే! సౌత్ లో కమల్ హాసన్ గౌతమీ తప్ప యీ పద్దతిని పెద్దగా ఎవరూ పాటించడం లేదు. వివాహం కాకుండా ఒక ఆడామగా ఒకే చోట కలిసి వుండడం మంచిదా? కాదా? మంచిదైతే ఎందువల్ల? … కాకపోతే ఎందుకు? ” వివరించాడు శామ్యూల్ రెడ్డి. విస్తుపోయారు టీచర్లు. పిల్లలకైతే అసలు సబ్జెక్టే సరిగ్గా అర్ధంకాలేదు. సినిమా కబుర్లు బాగా చదివే కొంతమంది 10th క్లాస్ వాళ్ళకి మాత్రం సల్మాన్ ఖాన్ , వివేక్ ఓబ్రాయ్ లాంటి వాళ్ళు ఠక్కున గుర్తుకొస్తారు.
“సర్… యీ సబ్జెక్ట్ పిల్లలకి అర్ధం కాదు. అంతే కాదు, యీ చర్చ వల్ల పిల్లలకు ఉపయోగమూ ఉండదు ” స్పష్టంగా చెప్పింది వసుమతి టీచర్.
“అవును సార్… లివింగ్ టుగెదర్ అనేది సమాజం ఆమోదించిన పద్దతి కాదు ” దాన్ని చర్చించడం వల్ల అనవసర కుతూహలాన్ని బాలబాలికల్లో రేపడమే అవుతుంది. ” వసుమతికి వత్తాసుగా అంది సౌందర్య.
శామ్యూల్ రెడ్డికి మండుకొచ్చింది. అయినా శాంతంగా “మీరన్నది నిజమే… ఇది సమాజం ఆమోదించిన విషయం కాదు. రేపటికి ఇదే పద్ధతిని సమాజం హర్షించనూ వచ్చు. ఒక్క విషయం నన్ను స్పష్టంగా చెప్పనివ్వండి. నా దృష్టిలో మనం చెబుతున్న పాఠాలు , భోధనా పద్ధతులే పనికి రానివి. సిలబసన్నది ఒకటున్నది గనకా అదీ మనం ఫాలో అయి తీరాలి గనకా నేను సైలెంటుగా వున్నాను. అసలు విద్యాలయం అంటే ఏమిటి? పాఠాలు చెప్పడం పిల్లల్ని పాస్ చేయ్యడం అంతేనా? చదువయిపోయాక వీళ్ళు బ్రతికేది, బతకాల్సింది ఎక్కడ? సమాజం లోనేగా? ఆ సమాజం, ఆ సమాజపు తీరు తెన్నులు నేర్చుకోకపోతే, రేపటి వీళ్ల పరీస్థితి ఏమిటి? జీవితంలో అతి ముఖ్యమైనది ‘తోడు “. ఆ “తోడు ” అనేది వివాహ రూపంలో రావొచ్చు. రాకనూ పోవచ్చు. ప్రేమ రూపంలో రావచ్చు. రాక, విషాదాన్ని మిగల్చవచ్చు. చెట్టు పుట్టా లేని చోట్లు లోకంలో ఎన్నయినా వుండొచ్చు. ప్రేమలేని, లేక ప్రేమించని హృదయం మాత్రం లోకంలో వుండనే వుండదు.
కేవలం మనిషి మాత్రమే కాదు. పశుపక్ష్యాదులు కూడా తోడు కోరుకుంటాయి. అందుకే కలిసి జీవిస్తాయి. వాటికి ‘వివాహం ‘ అనే తంతో , నిబంధనో లేదే! మానవుడు బుద్ధి జీవి. ఏది మంచిదో నిర్ణయించగల, నిర్ణయించుకోగల తెలివితేటలు మనుష్యులకి వున్నాయి. కొన్ని యుగాల పాటు మనిషి ‘వివాహం ‘ అనే చట్రంలో ఇరుక్కుపోయాడు. ఇప్పుడిప్పుడే అదో పద్మవ్యూహం అనీ, దాన్ని ఛేదించకపోతే మనో స్వాతంత్రం వుండదని నిర్ణయానికొచ్చాడు. అందుకే యీ లివింగ్ టుగెదర్ పద్ధతిని ఎంచుకున్నాడు. మనుషులకి యీ పద్ధతి కొత్తది కావచ్చు. కానీ సృష్టాది నుంచి పశుపక్షాదులు ఫాలో అవుతున్న పద్ధతి లివింగ్ టూగెదరే! ” ఉపన్యాసానికో చిన్న గాప్ ఇచ్చాడు శామ్యూల్ రెడ్డి.
“అయ్యా… మనిషి బుద్ధి జీవి గనకనే ‘వివాహం ‘ అన్నిటికన్నా ఉత్తమోత్తమైనదని తరతరాలుగా భావించడమే గాక, వివాహ వ్యవస్థలోనే ఇంకా కొనసాగుతున్నాడు. మీరన్నట్టు ‘లివింగ్ టుగెదర్ ” పద్ధతిని ఫాలో అవుతున్నది పశుపష్యాదులు. అంటే, ఇప్పుడు ఇంత నాగరీకత ప్రబలిన తరవాత మనిషిని మళ్ళీ పశు వ్యవస్థవైపు మరలమంటారా? : కొంచం తీవ్రంగా అన్నాడు ఫిజికల్ డైరెక్టర్ డెనియల్ డేవిడ్.
“మిస్టర్ డేవిడ్… ఇది నా స్కూల్ అని, నేను రెక్టార్ ననీ మర్చిపోకండి. ఇవ్వాళ రేపు ఆరేళ్ళ పిల్లలు రియాల్టీ షోల్లో డాన్సర్లు గానూ, సింగర్లు గానూ, పాల్గొంటున్నారు. వారు పాడే పాటలకి గానీ, వారు ఇచ్చే మూమెంట్స్ కి గానీ వాళ్ళకి అర్ధం తెలుసా? ఆరేళ్ల పిల్ల “అప్పటికింకా నా వయసు ” పాటకి యాధాతదంగా దింపేసింది. ఆ పాటకి అర్ధం తెలుసా? అయినా వాళ్ళకి ఓ రకమైన ‘సాధన ” లభిస్తోంది . పదేళ్ళ క్రితం ఏ అర్ధమూ తెలీకుండా రియాల్టీ షోల్లో పాడిన పిల్లలే నేడు సినీ గాయనీ గాయకులులౌతున్నారు.
సమాధానంగా సంగీతమూ, నాట్యమూ ‘కళ ‘ లు అని మీరు చెప్పొచ్చు. కళలు వచ్చినా రాకపోయినా మనిషికి వచ్చిన నష్టం లేదు. లాభం ఎంతైనా వుండొచ్చు గాక. కానీ సరైన ‘తోడు’ జీవితంలో లభించకపోతే మాత్రం జీవితం ప్రత్యక్ష నరకం అవుతుంది. అందుకే యీ చర్చ వుండాలని నేననేది. డెఫాడిల్స్ పద్యం ఆరో తరగతిలో బట్టీపట్టాము. మీనింగ్ ఏమాత్రమూ తెలియకుండానే. కానీ, అదే పద్యం బి.ఏ. లో చదివినప్పుడు ఎంత ఆనందించాము. వీళ్లు, అంటే యీ పిల్లలు రేపు పెద్దయ్యాక యీ చర్చ గుర్తుకు తెచ్చుకొని ప్రభావితం కావొచ్చు. ఎనీ క్వెశ్చన్స్ ” సీరియస్ గా అన్నాడు శామ్యూల్ రెడ్డి.
జవాబు చెప్పేదెవరూ!
“ఓ.కే మేడం మేరీ…. విద్యార్ధులు పాల్గోబోయే ముందే మీ ఒపీనియన్ అన్నట్టు యీ చర్చ కేవలం విద్యార్ధులకు మాత్రమే పరిమితం కాదు, స్టాఫ్ కూడా పాల్గొని తీరాలి.
“సార్… అసలీ పాయింట్ వ్యూహల్లో లేక ముందేనా పెళ్ళి అయ్యిపోయింది సార్. అయినా మీరడిగారు గనక సిన్సియర్ గా చెబుతున్నాను, ట్రెడిషనల్ మారేజీ కంటే లివింగ్ టుగెదరే మంచిది. ఎందుకంటే ఇష్టం వున్న వాళ్ళు కలిసి హాయిగా వుండొచ్చు. ఇష్టం లేని నాడు ఏ గొడవలూ లేకుండా ప్రశాంతంగా విడిపోవచ్చు. ” అన్నది మేరీ. ఆమె శామ్యూల్ కి వత్తాసుగా మాట్లాడిందని అందరికీ తెలుసు. “కాకా ” పట్టే అవకాశం ఏనాడు వదులుకోని వాళ్ళలో మేరీ ఒకతి.
“మరి పిల్లలు పుడితే? కలిసి వున్నారు గనక అఫీషియల్ గా తండ్రి పేరు వుండదు. వాళ్ళ పరీస్థితి ఏమిటి? ” వసుమతి టీచర్ అన్నది.
“తల్లి ఇంటి పేరే వాళ్ళదీ అవుతుంది. బాధ్యత తీసుకుంటే సరే సరి. బాధ్యత తీసుకోనంటే అసలు పిల్లల్నే కనకూడదు ” మేరీ జవాబిచ్చింది.
“సరే… ఒకడు తనకి ఇష్టం వచ్చినంత కాలం స్త్రీని తనతో ఉంచుకొని ఆ తరవాత అక్కర్లేదని వదిలించుకుంటే నష్టపోయేది ఎవరూ? వివాహం అనేది రెస్పానిసిబిలిటీ తో కూడుకున్న వ్యవస్థ. లివింగ్ టుగెదర్ కి పునాది ఆనందమూ, బాధ్యతారాహిత్యము. ” సూటిగా అన్నది సౌందర్య.
“సపోజ్ వాలిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టమైతే అప్పుడు పెళ్ళి చేసుకోవచ్చుగా! ” మేరీ అన్నది.
“కలిసి వుండటం అనేది ప్రేమించుకోవడం లాంటిది. ఎందుకంటే , ప్రేమలో హక్కులూ, బాధ్యతలూ వుండవు. కులాలు, మతాలు, సోషల్ స్టేటస్ వంటివేమీ అడ్డకులు రావు. హాయిగా ఎంతకాలమైనా ప్రేమించుకోవచ్చు. దానికంటే ‘లివింగ్ టుగెదర్” లో స్వేఛ్చ మరింతగా వుంటుంది. ఇద్దరూ హాయిగా శారీరక సంబంధాన్ని కొనసాగించవచ్చు. యవ్వనం వున్నంత వరకు మహోత్సాహంగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. వృద్ధాప్యం వచ్చినా, లేక ఏదైనా ప్రమాదం జరిగి శారీరకమైన అవిటితనం వచ్చినా , సదరు పాట్నర్ చూస్తాడా? బుద్ధి ఉన్న ఆడదైతే లివింగ్ టుగెదర్ కి ఒప్పుకోదు. ఏ సినిమా తారలు యీ లివింగ్ టుగెదర్ ని మహా స్టైల్గా మొదలు పెట్టారో వాళ్ళ జీవితాలని గమనించండి…. అలా వున్న ఆడవాళ్ళె బుద్ధి తెచ్చుకొని మూడుముళ్ళూ వేయించుకొని సంసారాన్ని నడుపుకుంటున్నారు. “డిప్ గానే చర్చించింది కాంతిమతి టీచర్.
“ఓ కొత్త విధానం వచ్చినప్పుడు సనాతన వాదులంతా వ్యతిరేకించడం యీ దేశంలో అనాదిగా వస్తున్నదే ” నొసలు విరిచి అన్నది మేరీ టీచర్.
“కొత్తదైనంత మాత్రాన ఆలోచనారహితంగా స్వాగతించడం అర్ధం లేని పని. ” సూటిగా అన్నది వసుమతి టీచర్.
“నువ్వేమంటావ్ శోభా? ” జావాబివ్వబోతున్న మేరీని మధ్యలో ఆపి అన్నాడు శామ్యూల్.
“సార్.. యీ విషయంలో చర్చించేటంత పెద్ద వయస్సు కానీ లోకానుభవం కానీ నాకు లేదు. ఓ అనాథగా అనాధాశ్రయంలో పెరిగాను. నాకు చుట్టాలైనా పక్కాలైనా మీరందరే. నేనున్న పరీస్థితిలో వివాహం గురించి ఆలోచించడమే తప్పు. దయతలచి మీరో ఉద్యోగం ఇచ్చారు. బి.యి.డి. చేయడం నా మొదటి లక్ష్యం. ఆ తరవాత పోస్ట్ గ్రాడ్యుయేషన్. కనుక నేనేమీ చెప్పలేను సార్ ” వినయంగా చేతులు జోడించి అంది శోభారాణి.
“గుడ్ వేరీ గుడ్.. లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యాన్ని అధికమించాలి. ఎనీవే…. మేరేజ్ విషయంలో ఎప్పుడైనా కానీ ఎటువంటి సందేహమొచ్చినా , సలహా కావాలన్నా తప్పక నన్ను అడుగు… సరేనా? ”
తలూపింది శోభ. ఆ తరవాత చర్చ ఓ పదినిమిషాలు సాగింది కానీ , ఉత్సాహంగా సాగలేదు. విచిత్రంగా విద్యార్ధుల నుంచి కనీసం ఒక్కరి పార్టిసిపెషన్ అయినా లేకుండా చర్చ ముగింపబడింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్లారు.
“నీ మనసులోని విషయం తెలుసుకుంద్దామనే శామ్యూల్ యీ చర్చ మొదలుపెట్టి వుండాలి ” నడుస్తూ మెల్లగా శోభతో అంది సౌందర్య.
“అదెలాగా? “ఆశ్చర్యంగా అంది శోభ.
“ఆయనకి ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నారు. మళ్ళీ పెళ్ళి అంటే పెళ్ళాం యీయన గొంతు పిసికి చంపుతుంది. అధికారం ఎంత యీయనదైనా , ఆస్తి ఆవిడదేనని విన్నాను. సో.. బెస్ట్ వే ఏమంటే లివింగ్ టుగెదర్ పేరు మీద కలిసి వుండటం… అదీ భార్యకు తెలిసేటట్టు కాదు… అప్పుడప్పుడు ! ” తన అనుమానాన్నంతా కోపాన్ని అణచుకుంటూ శాంతస్వరంలో చెప్పింది సౌందర్య.

ఇంకా వుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *