March 29, 2023

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 23

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

మానవజన్మ లభించడం ఒక వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వివేకవంతుల లక్షణం. ఏదో ఒక రోజు ఈ బొందిలో ప్రాణం కాస్తా ఎగిరిపోతుంది. ఈ అశాశ్వతమైన కాయం కోసమే మనిషి నానా తాపత్రయాలు పడుతున్నాడు. ఇంద్రియ సుఖాల కోసం అదేపనిగా వెంపర్లాడుతున్నాడు. తెలిసి తెలిసీ ఈ కూపంలో ఇరుక్కుంటూనే ఉన్నాం. మమ్ములను ఈ విషయవాంఛలకు లోను చేస్తున్నావని మళ్ళీ నిన్నే నిందిస్తున్నాం. నీవే నా దైవానివని, కరుణతో కైవల్యమిచ్చే వాడవని ఎన్నటికీ గుర్తించలేకపోతున్నాను. ఇతర ప్రాణుల కంటే మిన్న అయిన ఈ మానవ జన్మను సత్కార్యాలు, సదాలోచనలతో సార్థకం చేసుకోవాలి. సుఖాలు అనేవి ఎండమావుల వంటివి, తుచ్ఛమైనవి అని మనిషి అనుకోడు. మోహాగ్నితో దహించుకుపోతాడు. నిజ గతి ఎన్నటికీ గ్రహించలేడు. విషయ వాంఛల్లో మునిగిన అతడు శ్లేష్మంలో చిక్కిన ఈగ లాగా విలవిల్లాడతాడు. విషయలోలత విషమమైనది. మనిషి బయటి శత్రువులను తెలుసుకోగలడు. తన లోపలే దాగి ఉన్న అంతశ్శత్రువులను తెలుసుకోలేడు. అవి మనలను భగవంతుడి సన్నిధికి దూరం చేస్తాయి. అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలకు లొంగితే అధోగతి తప్పదు. వాటి మాయలో పడకుండా జాగ్రత్త వహించకపోతే అనర్థాలు వాటిల్లుతాయి. విషయ వాసనలు, వాంఛలు మనిషిని స్థిరంగా ఉండనివ్వవు. చిత్తాన్ని అదుపులో ఉంచుకోవాలి. అంతఃకరణ అనే మనసు అధీనంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వర్తిస్తున్నప్పుడే- మనిషి మోక్షాన్ని సాధించేందుకు ప్రయత్నించగలడు. కాని, అది దుర్లభమైన విషయం. మనసు తన మాట వినేలా చేయాలని, తాను ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తించేలా అనుగ్రహించాలని అతడు భగవంతుణ్ని వేడుకోవాలి అందుకే నీకు సదా శరణని మొక్కుతున్నాను శ్రీనివాసా! కరుణించు అని ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.

కీర్తన:
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము ॥కటకట॥
చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు ॥కటకట॥
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె ॥కటకట॥
(రాగం: మలహరి; రేకు సం: 317, కీర్తన 4-96)

విశ్లేషణ:
పల్లవి: కటకట యీమాయ గడచుట యెట్లో
ఘటనల హరికృప గలిగినఁ గాక
అయ్యయ్యో! ఈ మాయను దాటడం ఎటుల? అర్ధం కావడంలేదు. ఏదైన దైవ సంఘటన జరిగి ఆ శ్రీనివాసుని దయ కలిగితే వేరే విషయం కానీ మామూలుగా దాట శక్యమా!

చ.1. యిరవగుజీవుల కెంతగలిగినా
పరధనకాంతలే బలుప్రియము
ధరఁ గర్మాపుఁజేతలలోనెల్లా
సొరదిఁ బాపమే సులభము
ఆహా! శ్రీహరీ! ఈ భువిపై స్థిరంగా ఉన్న జీవులు ఎంత చిత్త చాపల్యం కలిగినవారు? వీరికి ఎంత ధనం ఉన్నప్పటికీ పరధనం మాత్రమే వీరికి ప్రియము. ఇంట సతి ఉన్నప్పటికీ పరకాంతలమీదనే వీరి ధ్యాస! ఈ భూమిపై పుణ్యకార్యాలు చేయాలంటేనే అందరికీ కష్టం. పాపకార్యాలు వరుసగా చేస్తూఆ విషయంలో మాత్రం ముందుంటారు కదా!

చ.2. నానారుచులు యనంతము గలిగిన
కానిపదార్ధమె కడుఁ దీపు
పానిన చదువుల పఠన లుండగా
మానని దుర్బాషమాఁటలే హితవు
మనకు తినడానికి తయారుగా అనేక పదార్ధాలు ఉన్నప్పటికీ, మనకు కాని పదార్ధమే ఎక్కువ తీపుగా ఉంటుంది కదా! పొరుగింటి పుల్లగూర రుచి చందాన ఉంటుంది మన నైజం. అలాగే మనం ఎంతో కష్టపడి గురుశుశ్రూష చేసి వేద,వేదాంగాలను చదువుకుని నెమరు వేసుకోవడానికి భగవంతుడిని ధ్యానించడానికి నాలుకపై తయారుగా ఉన్నప్పటికీ, మనం అనకూడని మాటలు పాపపూరిత భాషణలే సదా చేస్తూ ఉంటాము. అవే మనకు ఇష్టంగా ఉండడం మాయకాకపోతే మరి ఏమిటి?
చ.3. యెదలో శ్రీవేంకటేశ్వరుఁడుండఁగ
సదరపు దివిజులు చవులయిరి
అదనను శ్రీగురుయానతి గలుగఁగ
పొదిగొని యివి తలపోయఁగ వలెసె
అందరి హృదయక్షేత్రాలలో స్థిరంగా నెలకొని శ్రీవేంకటేశ్వరస్వామి ఉండగా, తేలికగా అనుగ్రహం కలుగుతుందని వెళ్ళి చిల్లరదేవుళ్ళను చేరి ఇష్టప్రీతి కొలవడం ఎందుకు? తగిన సమయంలో గురువుగారి శిష్యరికం చేసి ఆయన ఆశీర్వాదం పొందవలెను గదా! అలా చేసినట్లైతే మనకు అనేక సమస్యలు నశించి ధన్యులవడం తధ్యము అని అన్నమయ్య నివేదిస్తున్నాడు.
ముఖ్యమైన అర్ధాలు: కటకట = మనం బాధపడే సమయంలో వాడే పదం. అయ్యో! ఏమి పరిస్థితి ఇది? అనుకోవడం; గడచుట = దాటుట; ఘటన = ఏదైనా అనుకోకుండా జరగడం; ఇరవగు = సుస్థిరము; పలు = ఎక్కువ; ధర = ఈ భూమిపై; సొరిది = వరుస, క్రమము; అనంతము = అంతము లేనివి; కడు = ఎక్కువ; పానిన = ఇష్టపడి స్వీకరించడం; దుర్భాషమాటలు = చెడ్డమాటలు, దుర్భాష అన్నా మాటలు అన్నా ఒకటే అర్ధం. అన్నమయ్య దుర్భాషమాటలు అని ప్రయోగించడంలో ఔచిత్యం కనరాలేదు; సదరపు దివిజులు = తేలికగా అనుగ్రహం ఇచ్చే చిల్లరదేవుళ్ళు; చవులు = ఇష్టులు; శ్రీగురుయానతి = గురువు అనే పదం ఆయన బహుశ: సాధారణ గురువును గురించి కాక అహోబల మటస్థాపకుడు, అన్నమయ్య గురువు అయిన ఆదివన్ శఠకోపయతి గురించి వుండవచ్చు. పొదిగొని = గుంపుగూడు.
*****

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 23

  1. చాలా మంచి కీర్తన. చక్కగా వివరించారు. ఈ కీర్తనలు ఎవరైనా పాడితే ఆ వివరాలు కూడా ఇవ్వ గలుగుతే కృతజ్ఞులము వెంకటప్పయ్యగారూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2018
M T W T F S S
« Jan   Mar »
 1234
567891011
12131415161718
19202122232425
262728