May 2, 2024

మాయానగరం 43

రచన: భువనచంద్ర

“మరోసారి కల్తీ సారా పేరుతో మారణహోమం సాగిస్తే?” చాలా మెల్లగా స్పష్టంగా అన్నాదు శామ్యుల్‌రెడ్డి సర్వనామంతో.
“నో..” స్థిరంగానూ, స్పష్టంగానూ అన్నాడు సర్వనామం.
“అదే అడుగుతున్నాను. ఎందుకు వొద్దని?” చికాగ్గా అన్నాడు శామ్యూల్‌రెడ్డి. ప్రధాన సమస్య బోస్. గత రెండు నెలలుగా బోస్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్నాడు. గుడిసెలు, సిటీలోనే కాదు, ఏ వార్డు నించి ఎవరికి ఏ సమస్య వొచ్చినా తక్షణం ఆ సమస్యని పరిష్కరిస్తున్నాడు. తనవల్ల కాలేకపోతే ఆ సమస్యని అధికారుల దగ్గరికీ, మంత్రులదగ్గరికి తీసుకుపోతున్నాడు. ఓ రాత్రి లేదూ, పగలూ లేదు. గా.మో.క వీధిలో తనింట్లోనే యీ మధ్య వుంటున్నాడు. దాంతో శామ్యూల్‌రెడ్డికి గంగవెర్రులెత్తుతోంది.
అతిత్వరలో మధ్యంతర ఎన్నికలొస్తాయన్న విషయం పుకారు స్టేజి దాటి ఎలక్షన్ కమీషన్ కోర్టులో పడింది. ఒకవేళ ఇద్దరూ అదే సీటుకి పోటీ చేస్తే గెలిచే చాన్సు బోసుబాబుకే వుందని శామ్యూల్‌రెడ్డీ అభిప్రాయం.
“నీ నియోజకవర్గం ఓటర్లని నువ్వే చంపితే, ఓట్లు పోగొట్టుకునేది కూడా నువ్వే. పోలయిన ప్రతీ ఓటూ నిన్ను గెలిపించే ఆఖరి మెట్టు అని అనుకున్న నాడే నువ్వు గెలుపు బాట మీద నిలబడగలవు. కొన్ని ఓట్లు పోయినా ఫరవాలేదనుకునేవాడు ఓటమిని కొని తెచ్చుకున్నట్లే” తాపీగా అన్నాడు సర్వనామం.
“అయితే నన్నిప్పుడు ఏం చెయ్యమంటావూ? చేతులు ముడుచుకుని కూర్చోనా?” చికాగ్గా అరిచాదు శామ్యూల్.
“నన్నడిగితే దానికన్నా మంచిపని ఇంకోటి లేదు” నవ్వాడు సర్వనామం.
“మనం ఇలా ఏమీ పట్టనట్టు వుండబట్టే బోస్‌గాడి పేరు మారు మ్రోగిపోతోంది” అక్కసుగా అన్నాడు శామ్యూల్.
“రెడ్డిగారూ.. మీరెప్పుడైనా నాటకపోటీలు చూశారా? అందులో ఏ నాటకానికి మార్కులు ఆ నాటకానికో, నాటికకో సిన్సియర్‌గానే వేసేస్తారు జడ్జీలు. వాటిల్లో చాలాసార్లు చివరగా చేసినవాళ్ళు పరమచెత్తగా నటిస్తే మనమేమీ చెప్పలేం. అది వేరే విషయం. కొన్ని విషయాల్లో ఫస్త్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. అయితే చాలా విషయాల్లో ముఖ్యంగా రాజకీయాల్లో లాస్ట్ ఇంప్రెషనె బెస్ట్ ఇంప్రెషన్. చివరిగా పీల్చిన సిగరెట్, పప్పూ, చివరగా తాగిన కాఫీగుక్కలాగా, చివర తీసుకున్న లంచమే, పుచ్చుకున్న వారి మనసులో సిన్సీయారిటీని పెంచుతుంది. అంతేకాదు. అసలే మన ప్లానేమిటొ తెలియక ఎదుటివాడు పిచ్చ కన్‌ఫ్యూజ్ అయ్యేది కూడా చివరికాకా చేతులు ముడుచుకుని కూర్చుండటం వల్లనే. పులికైనా సింహానికైనా, వేటకుక్కకైనా ఆఖరికి ఎలుకని వేటాడే పిల్లికైనా విజయం సాధించాలంటే కావల్సింది పుష్కలమైన పేషెన్సు. ఆ పేషన్స్ లేనివాడు దేనికీ కొరగాడు.” వివరించాదు సర్వనామం. అసలేం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు శామ్యూల్‌రెడ్డికి. సర్వనామం చెప్పేవన్నీ శాస్త్రీయమైన సలహాలే. కాదనడానికి వీల్లేనివీ. కానీ, అవతల బోస్ పాప్యులారిటీ కొండలా పెరుగుతోంది. సైలెంటైపోయాడు శామ్యూల్‌రెడ్డి.
“మీరు సైలెంటయ్యారంటే ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారని నా అనుభవం. ఒకవేళ నా మీదా, నా చేతల మీద మీకు నమ్మకం లేకపోతే O.K నేనేమీ వద్దని పట్టుబట్టను. నా మాట వినాలని అసలు అడగను. ఒకవేళ మీకు మీరే ఏదన్నా చేద్దామనుకుంటే మాత్రం బాగా ఆలోచించండి. ఒకటికి వందసార్లు ఆలోచించండి. ఎందుకంటే, మీది నా అంత వక్ర బుద్ధి కాదు.” నవ్వి లేచాడు సర్వనామం.
అసలేం మాట్లాడాలో, ఏ జవాబివ్వాలో కూడా తెలియలేదు శామ్యూల్‌రెడ్డికి. కానీ మనసులోని మంత్రాంగం ఆగలేదు. అది ఆగదని సర్వనామానికీ తెలుసు. అతని ఆలోచన వెనక్కి పరిగెత్తింది.
*****
“నవనీతం ఇపుడు గర్భవతంట” అన్నాదు రొయ్యబాబు. ఎప్పుడూ ఏనాడూ ఎవరెదుటా బయటపడని సర్వనామం ‘ఆ’ అని షాక్ తిన్నాడు. అది గమనించినా గమనించనట్టే, “ప్రస్తుతం నవనీతంగారి పరిస్థితి చాలా క్లిష్టమైనది. ఒకవైపు పరమశివంగాడి పగ, మరోవైపు యీ గర్భం తెచ్చిన మానసిక సంక్షోభం. బోస్‌కీ, నవనీతానికీ మధ్య పూర్తిగా ఏ సంబంధాలూ ప్రస్తుతం లేవు. ఆ విషయమూ ఖచ్చితమైన ఇన్‌ఫర్మేషనే. అన్నట్టు…” ఆగాడు రొయ్యబాబు. “నువ్వెళ్లు… అవసరమైనప్పుడు పిలుస్తా. పరమశివాన్ని క్షణం కూడా వదలొద్దు. అవస్రమైతే నమ్మకమైన వాళ్లని కుదుర్చుకో..” వంద రూపాయల కట్ట ఒకటి రొయ్యబాబుకిచ్చి అన్నాడు సర్వనామం.
“థాంక్స్” తీసుకుని బయటికి నడిచాడు రొయ్యబాబు. అతని పెదాల మీద చిన్న చిరునవ్వు మొలకని సర్వనామం గుర్తించాడు. రొయ్యబాబు బయటికి వెళ్లాక ఓ సుదీర్ఘ నిశ్వాసం వెలువడింది సర్వనామం నాసిక నించి.
” ఏం చెయ్యాలి? మనసులో వేస్కున్న లెక్క ప్రకారం నవనీతం గర్భవతి అయితే ఆ గర్భంలో పెరిగే శిశువు నాదే…!” పదొసారి మనసులో అనుకున్నాడు సర్వనామం. తండ్రి కాబోతున్నాడనే ఆలోచనే అతన్ని ఉత్సాహపు శిఖరం మీద నిలబెట్టింది. మరో ఆలోచన మనసులోకి రానీయకుండా నవనీతం ఆధ్వర్యంలో నడిచే సారా అంగడి వైపు పరిగెత్తాడు.
తలుపులు బార్లా తెరిచి వున్నాయి. లోపలికెళ్ళి చూస్తే ముఖం అంతా వాచిపోయి చచ్చినట్టు పడుంది నవనీతం. రెండు చేతుల్తో ఆమెని ఎత్తుకుని బయటికొచ్చి కనిపించిన రిక్షాలో ఆమెని కూచోబెట్టి తనూ ఎక్కి హాస్పిటల్‌కి పోనిమ్మన్నాడు. హాస్పిటల్ రాగానే చేతికి అందినంత డబ్బు తీసి రిక్షావాడికిచ్చి ఆమెని ఎత్తుకుని హాస్పిటలు మెట్లెక్కాడు. రిక్షావాడు ఆశ్చర్యంగా అతనికేసి చూశాడు. “అయిదురూపాయిలు ఇవ్వాల్సిన చోట అయిదొందలు ఇచ్చాడీ పిచ్చోడెవడో. ఆ నవనీతం బోసుబాబు ‘ఇలాకా’. మరి వీడెవడూ? ఈ సంగతి బోసుబాబుకి చెబితే?” తనలో తనే విశ్లేషించుకున్నాడు రిక్షావాడు. “ఊహూ చెప్పకూడదు. ఆయమ్మని చూస్తే చావుదెబ్బలు తిన్నట్టుంది. ఆయమ్మ ఒంటిమీద చెయ్యేసే దమ్ము బోసుబాబుకి తప్ప ఇంకెవరికుంటాడి?. అందుకే ఎవుడో ఆయమ్మని హాస్పిటల్లో చేర్చిన సంగతి చెప్పకూడదు. అనవసరపు తలనెప్పి మనకెందుకూ?” అని నిశ్చయించేఉసుకున్నాడా రిక్షాడ్రైవరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *