March 19, 2024

రెండో జీవితం – 7

రచన: అంగులూరి అంజనీదేవి

”నేను ఆర్‌.టి.సి. బస్‌లో పనిచేస్తున్న రోజుల్లో నా భార్య డబ్బు మీద ఆశతో నన్ను బాగా సంపాయించమనేది. జీతాన్ని మించిన సంపాదన నాకెలా వస్తుంది? రోజుకోరకంగా, ఏదో ఒకటి లేదంటూ తనలోని వెలితిని బయటపెట్టి బాధపడేది. నన్ను బాధపెట్టేది. రాను రాను ఇంటికి రావాలంటేనే భయపడేవాడిని… అప్పటికే శ్యాం పుట్టాడు. శ్యాం కోసమైనా నేను నా భార్య మాట వినాలి. లేకుంటే నన్ను ఇంటికి రానివ్వదు. బస్‌లో టికెట్స్ ఇవ్వకుండానే ప్రయాణీకుల దగ్గర డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టాను… నా భార్యకి నెలకోసారి ఇచ్చే జీతంకన్నా నేను రోజూ ఇచ్చే పది, ఇరవై చూసి ఎక్కువ సంతోషించేది. ఆ సంతోషాన్ని దూరం చెయ్యలేక నేను ఆ ఉద్యోగానికి దూరమయ్యాను. అంటే స్వాడ్‌ వచ్చినప్పుడు దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నాను.
… పోయిన ఉద్యోగం మళ్లీ రాలేదు. భార్యా, బిడ్డలను పోషించుకోవాలంటే డబ్బులేదు. ప్రొద్దున లేచి ఏదో ఒక పనికి వెళ్లేవాడిని… నేను చెయ్యని పనిలేదు. పడని కష్టం లేదు.
నేను చేసిన తప్పుకి అనుభవిస్తున్న శిక్షను చూసి నామీద నాకే జాలేసేది. ఒకరోజు దొరికిన పని ఇంకోరోజు దొరికేది కాదు.. క్వారీలల్లో రాళ్లు తీసేపని దగ్గరనుండి రైల్వేస్టేషన్లో మూటలు మోసే పనిదాకా అన్ని పనులు చేశాను. చివరికి బరువైన పనులు చెయ్యలేని స్థితికి వచ్చాను. కారణం నాలో కాల్షియం లోపించిందన్నారు డాక్టర్లు.
…అప్పుడు నాకో వ్యక్తితో పరిచయం అయింది. ఆయన పేరు డా||కె.కె. నాయుడు ఆయన నన్నో కోరిక కోరాడు.” అంటూ ఆగాడు గంగాధరం.
”ఏమి మామయ్యా ఆ కోరిక?” అంది నిశిత ఆసక్తిగా..
”వర్షాకాలంలో పొలాల గట్లపై తుంగగడ్డి మొలస్తుంది. ఎక్కడైనా ఆ గడ్డిని కోసి పశువులకి మేతగా వేస్తారు. లోపల గడ్డలు విస్తరించి ఎంత కోసినా ఆ తుంగ మళ్లీ మొలకెత్తటం దాని నైజం. ఆ తుంగను బలంగా పీకితే గడ్డలు బయటపడ్తాయి. ఆ గడ్డల్ని ఎలాగైనా సంపాయించి తనకి సప్లై చెయ్యమని కోరాడు.. నేను పనికెళ్లి రాళ్లు మోస్తే వచ్చే డబ్బుకన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. నేను ఒప్పుకున్నాను…
…ఇంట్లో నా భార్యతో చెప్పాను. సరే వెళ్లమంది. నెల మొత్తంలో నేనెక్కువగా అక్కడే గడపాల్సి వచ్చేది. ఆ తుంగగడ్డల్ని తీసికెళ్లి ఒకరూంలో వుంచి దానికి నేనే కాపలా వుండేటట్లు ఏర్పాటు చేశారు. ఆ తుంగగడ్డల్ని ఎండబెట్టి ఆ గడ్డలనుండి సుగందద్రవ్యాన్ని తయారు చేయ్యాలన్నదే ఆయన ప్రయోగం… అది నిర్విఘ్నంగా సాగుతోంది.
ఆయన నన్ను పూర్తిగా నమ్మి – ఆ గదిని, అందులోని ఇన్‌స్ట్రుమెంట్స్ ని నామీద వదిలి ఇంటికెళ్లేవాడు. నేను ఇంటికెళ్లకుండా రాత్రంతా అక్కడే కాపలా వుండేవాడిని… పగలంతా తుంగగడ్డల్ని సేకరించి ఎండబెట్టేవాడిని. అక్కడ ఆ తుంగగడ్డలకన్నా ఆ డాక్టర్‌గారి ఇన్‌స్ట్రుమెంట్స్ చాలా ఖరీదైనవి కాబట్టి నేను వాటికి గట్టి కాపలా కాసేవాడ్ని…
ఒకరోజు రాత్రి…
నిద్రకి ఆగలేక టీ తాగుదామని, ఒక చెట్టుకింద టీ కాస్తుంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్లాను. అక్కడ అప్పటికే టీ తాగుతూ నిలబడివున్న నలుగురు యువకులు అదే రోడ్డుపై ఆ రాత్రి రెండుగంటలకి వెళ్లే ఓ బస్‌ను దోచుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. వాళ్ల గురించి అప్పుడప్పుడు పేపర్లో రావటం నేను చదవటం వల్ల వెంటనే వాళ్ల ఎత్తుగడల్ని అర్థం చేసుకోగలిగాను.
అప్పటికప్పుడు వాళ్లను ఎదుర్కొనే శక్తి, పట్టించే నేర్పు లేక మౌనంగానే వుండిపోయాను. ఆ రాత్రికి ఆ బస్‌ దోపిడీలో నగలు, డబ్బు దోచుకోవటమే కాక ఇద్దరు చంటిపిల్లల్ని చంపెయ్యటం నన్ను బాగా కదిలించింది. నా మౌనం మంచిది కాదనుకున్నాను. జీవితంలో నేనేంత కష్టపడ్డా నా భార్య, కొడుకుకే ఉపయోగపడ్తాను. వీళ్లను పోలీసులకి పట్టిస్తే చాలామందిని బ్రతికించగలుగుతాను. అని ఓ నిర్ణయానికి వచ్చాను.
చాలా కష్టపడి వాళ్లను ఫాలో అయ్యాను. పోలీసులకి పట్టించాను. వాళ్లలో ఒకడు మాత్రం తప్పించుకున్నాడు. పట్టుపడిన వాళ్లకి వాళ్ల వాళ్ల నేరాలను బట్టి శిక్షలు పడ్డాయి. ఒకడికి యావజ్జీవకారాగార శిక్ష కూడా పడింది.
తక్కువ శిక్షపడ్డవాళ్లు కొద్ది రోజులకే బయటకొచ్చారు. వాళ్లు బయటకి రాగానే ముందుగా తప్పించుకున్న వాడు వాళ్లతో కలిసి నా వెంటపడ్డాడు.
మబ్బుపట్టి, గాలికొట్టి, వానపడ్తు నేలంతా బురదగా వుంది. పెద్దకాలువ కట్టదాటి రోడ్డెక్కిన నేను వాళ్లను తప్పించుకుందామని ఒకప్పుడు హాస్పిటల్‌ కోసం కట్టి పాడుబడిపోయిన బంగ్లాలోకి దూరాను. వాళ్లుకూడా లోపలకి వచ్చారు.
నా చేతిలో సంచిని లాక్కుని విసిరికొట్టారు.. వాళ్లలో క్రోధం, కసి పెట్రేగి పోయి ముగ్గురు కలిసి నా మీద పడ్డారు. నేను ఎంత ప్రయత్నించినా వాళ్లను విడిపించుకోలేకపోయాను. బయటకి అరుపులు విన్పించకుండా నా నోట్లో గుడ్డ కుక్కారు. నేను కళ్లు మూసి తెరిచేలోపలే ఒకడు వెనక నుండి కత్తితీసి నా చేయి నరికాడు. నేను సృహ కోల్పోయాను.. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.
హాస్పిటల్లో డా||కె.కె. నాయుడు గారు నాకు వైద్యం చేయించారు. అప్పటికే నేను ఇంటికెళ్లక చాలాకాలమైంది. నాభార్యా, బిడ్డ గుర్తొస్తున్నారు. కానీ, వాళ్ల గురించి ఆలోచించే ఓపిక కూడా లేకుండా అయింది. గాయం పచ్చిగానే వుంది.
కానీ ఈ మధ్య మళ్లీ వాళ్లు నన్ను చూశారు. నన్ను చంపేవరకు నిద్రపోయేలా లేరు. వాళ్ల చేతుల్లో చావటం ఇష్టంలేక ఇలా వచ్చాను.
ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు.
ఇప్పుడు ఇక్కడ నా భార్యా, నాకొడుకు, నా కోడలు – ముఖ్యంగా నువ్వు వున్నారు. చిన్నదానివైనా – ఒక చెయ్యి పూర్తిగా లేని నన్ను అర్థం చేసుకొని, సేవచేసి నా గాయాన్ని నయంచేశావు. పెద్దవాడినన్నది మరచిపోయి నీకు చేతులెత్తి దండం పెట్టాలని, ఒకసారి నీ పాదాలను తాకాలని ఎన్నోసార్లు అన్పించింది. రాగద్వేషాలతో వుండే మానసిక వికలాంగులకన్నా నువ్వు గొప్పదానివి నిశితా!” అన్నాడు.
నిశిత అలాగే విస్తుపోయింది… ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని, కుటుంబానికి దూరమై శారీరకంగా, మానసికంగా ఆయన ఎంత చిత్రహింసకు గురయ్యాడో అర్థంచేసుకొని మనసులో ఏడ్చింది.
”నిశితా! ఆ దురదృష్ట సంఘటన, ఎంత మరచిపోదామన్నా నన్ను వెంటాడి బాధిస్తోంది. అప్పుడు అరిచిన అరుపులు ఇంకా అలాగేనా మైండ్‌లో సెట్ అయి రిపీట్ అవుతున్నాయి. నువ్వు భయపడకు…” అన్నాడు.
”అలాగే ! మామయ్యా! ఇదంతా అత్తయ్యతో, బావతో, అక్కతో చెబుతాను. అందరు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీరెంత నరకాన్ని అనుభవించారో ముఖ్యంగా అత్తయ్యకి తెలియాలి. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న భర్తని ఇంకా ఎక్కువ సంపాయించమని టార్చర్‌ పెట్టే ఆడవాళ్లకి తెలియాలి.” అంది నిశిత.
గంగాధరం మాట్లాడలేదు
”పడుకోండి మామయ్యా! ఇంకేం ఆలోచించకండి! మేమంతా వున్నాం కదా! ప్రశాంతంగా వుండండి!” అంటూ ధైర్యం చెప్పి, ఆయన పడుకోగానే దుప్పటి కప్పి ఫ్యాన్‌ స్పీడ్‌ పెంచింది.
తండ్రి పడుకోవటం చూసి శ్యాంవర్ధన్‌ వచ్చాడు.
”మా నాన్న కేకలతో నీకు చాలా ఇబ్బందిగా వున్నట్లుంది కదూ?” అంటూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు శ్యాం.
”అలాంటిదేం లేదు బావా! అసలేం జరిగిందంటే..!” అంటూ గంగాధరం చెప్పిన విషయం చెప్పబోయింది.
”జరిగిందాన్ని గురించి ఇప్పుడెందుకు? జరగబోయేది కావాలి” అన్నాడు ఒకరకంగా చూస్తూ…
మగవాడి చూపులు తన మీద నిలిచినప్పుడు, అవి ఏ దృష్టితో నిలిచాయన్నది స్త్రీ వెంటనే పసిగడ్తుంది. బావ తనని కోరుకుంటున్నాడని, అది ధర్మం కాదని, అక్కకి అన్యాయం చెయ్యబోతున్నాడని అర్థం చేసుకొంది. అందుకే ఈ మధ్యన అతను ఎప్పుడు కన్పించినా ఇబ్బందిగా విసుగ్గా అన్పిస్తోంది.
”మీరు వెళ్లండి బావా! నాకు నిద్రొస్తుంది” అని అనలేక వెంటనే
”మామయ్యా! పడుకున్నారా ! మీ అబ్బాయి వచ్చాడు.” అంది నిశిత గంగాధరం వైపు చూస్తూ…
శ్యాం కంగారుగా చూస్తూ… ”ఆయన్నెందుకు లేపటం? పడుకోనీయ్‌!” అన్నాడు
…టక్కున దుప్పటి తొలగించి లేచి కూర్చున్నాడు గంగాధరం.
”ఏం శ్యాం! నిద్రరావటంలేదా?” అన్నాడు.
”వస్తోంది నాన్నా! నువ్వేదో అరిచినట్లుంటే వచ్చాను.” అన్నాడు శ్యాం
”అరిచి చాలాసేపయింది” అన్నాడు గంగాధరం.
ఒక్కక్షణం మౌనంగా వుండి ”నేను వెళ్తాను నిద్రొస్తోంది.” అంటూ లేచాడు శ్యాంవర్ధన్‌. అతను వెళ్లగానే
”పడుకో నిశితా! అవసరమైతే నన్నులేపు. భయపడకు.” అన్నాడు గంగాధరం.
దేవుడు మనిషి రూపంలో వుంటాడనానికి గంగాధరమే నిదర్శనంగా అన్పించి – తండ్రి పక్కన పడుకున్నంత ధైర్యంగా పడుకొంది నిశిత.
*****
ఆ రోజు ద్రోణ మీద కోపంతో ఇంట్లోంచి బయటకెళ్లి ఆటో ఎక్కిన శృతికకు ఎటెళ్లాలో అర్థంకాలేదు.
అక్కకన్నా ఆత్మీయులు, తన గురించి ఆలోచించేవాళ్లు ఎవరున్నారు అని అక్క దగ్గరకి వెళ్లింది.
కృతిక ఇంకా ఆఫీసునుండి రాలేదు.
పిల్లలు నానమ్మ పెట్టిన టిఫిన్‌ తింటున్నారు… పిన్నిని చూడగానే ”హాయ్‌” చెప్పారు. శృతిక ఓ నవ్వు నవ్వి… ”బావున్నారా అత్తయ్యా?” అంటూ వంటగదిలోకి వెళ్లింది. ఆవిడ తిట్టిన తిట్లు ప్రస్తుతం గుర్తురాలేదామెకు…
”నేనేదో హాస్పిటల్లో వున్నట్లు ఏమి పరామర్శ? అడగకూడదు కాని ఎందుకొచ్చావిప్పుడు ? ఏదైనా పని కాని, పంక్షన్‌ లాంటిది కాని వుండి వచ్చావా? ద్రోణ ఏడి? ఒక్కదానివే వచ్చావా? నీకలవాటేగా ఇలా రావటం…!” అంటూ ప్రశ్న మీద ప్రశ్న వ్యంగ్యంగా వదిలింది.
బిక్క చచ్చిపోయింది శృతిక. వెంటనే తేరుకొని…
”ఒక్కదాన్నే రాకూడదా? నాకు దారి తెలియదా?” అంది బింకంగా
”దారి తెలిసినా పెళ్లయ్యాక ఆడవాళ్లు ఒంటరిగా ఎటూ వెళ్లరు. వెళ్తే భర్తకి ఇబ్బంది కదా! కలిసి వెళ్తారు. మీకలాంటి ఇబ్బందులేం లేవు కాబోలు…” అంటూ ఇంకో వ్యంగ్యబాణాన్ని విసిరింది.
”నానమ్మా ! మాకు టైమవుతుంది. త్వరగా పాలివ్వు…” అంటూ కేకేశారు పిల్లలు.
”వస్తున్నా! అదిగో! మొన్న నీ చెయ్యి విరగొట్టి వెళ్లిందే మీ పిన్ని! ఆవిడొస్తే మాట్లాడుతున్నా… అన్నట్లూ! నువ్వేం పనిమీద వచ్చావో, అది చూసుకొని వెళ్లు.. తొందరేం లేదు. పిల్లల్ని మాత్రం బయట తిప్పకు. నీకసలే స్పీడెక్కువ.. అదే మా బాధ… నువ్వంత తింటే పోదు. నా కొడుకు, నాకోడలు ఇద్దరు సంపాదనపరులే…” అంది.
ఆ మాటలు శృతిక చెంప చెళ్లుమనిపించాయి.
‘అయినా ఈవిడ మాటలకేంటి… ఇలాగే అంటుంది. ఇవన్నీ పట్టించుకోకూడదు.’ అని మనసులో అనుకొంది.
…కానీ పిల్లలు తనని చూడగానే ‘హాయ్‌!’ చెప్పి ఏ మాత్రం హ్యాపీ లేనివాళ్లలా మౌనంగా ట్యూషన్‌కి వెళ్లటం మనసు చివుక్కుమనిపిస్తోంది. ఇదంతా వాళ్ల నానమ్మ ట్రైనింగే… ‘మీ పిన్ని రాక్షసి నీ చేయి విరగ్గొట్టింది. ఎప్పుడొచ్చినా సరిగా మాట్లాడకండి’ అని చెప్పి వుంటుంది.
మెల్లగా పిల్లలకి నచ్చచెప్పాలి. ‘నేను మీపిన్నిని, మీ అమ్మలాగా నాక్కూడా మీరంటే ప్రేమ వుంటుంది. యాక్సిడెంట్లు అనేవి అనుకోకుండా జరుగుతుంటాయి. అవి కామనే…’ అని వాళ్లను దగ్గరకు తీసుకోవాలనుకుంది.
కృతిక ఆఫీసునుండి, పిల్లలు ట్యూషన్‌ నుండి రాగానే అందరు కలిసి భోంచేశారు.
భోంచేస్తున్నప్పుడు, ఆఫీసు విషయాలు ఆలోచించుకుంటూ పిల్లలతో కాని, శృతికతో కాని మాట్లాడలేదు కృతిక…
అక్క మాట్లాడితే బావుండని ఆశించింది శృతిక.
అక్క మాట్లాడకపోవటంతో అసంతృప్తిగా వుంది.
”ఇవాళ ఆఫీసులో బాగా స్ట్రెయిన్‌ అయ్యాను శృతీ! పడుకుంటాను. మళ్లీ మీ బావ వస్తే ఆయన పని చూడాలి…” అంటూ తన బెడ్‌రూంలోకి వెళ్లింది.
ఆమె అలా వెళ్లిన కొద్దిసేపటికే ఆమె భర్త వచ్చాడు.
అతను ముఖం కడుక్కుని ప్రెషెప్‌ అవుతుంటే ”త్వరగా రండి! వడ్డిస్తాను!” అంటూ నిద్రకళ్లతోనే కేకేలేస్తోంది కృతిక.
పిల్లలు హోంవర్క్‌ చేసుకొని, వాళ్ల గదిలో వాళ్లు పడుకున్నారు. నానమ్మ వాళ్ల గది ముందుండే హాల్లో పడుకొంది.
శృతిక వెళ్లి పిల్లల దగ్గర పడుకొంది… పిన్ని వచ్చి పడుకున్నట్లు ఒక్క కన్ను మాత్రమే తెరిచి గమనించిన మోనా మెల్లగా లేచి వెళ్లి నానమ్మ పక్కన పడుకొంది. శృతిక ఆశ్చర్యపోయింది. టీనా గాఢనిద్రలో వుంది.
మోనా వచ్చిపడుకోగానే.. ”నిద్రరావటం లేదా?” అంటూ పైన చేయివేసింది లాలనగా నానమ్మ.
”పిన్ని మా గదిలోకి వచ్చింది అందుకే ఇలా వచ్చాను.” అంది మోనా.
”వస్తే ఏం? పడుకోవలసింది పిన్నియే కదా!” అంది నానమ్మ
”అప్పుడు చెల్లి చెయ్యి పిన్ని వల్లనే కదా విరిగింది. అందుకే పిన్నిని చూస్తే భయం నాకు… నేను బాబాయ్‌తో చెబుతాను. పిన్నిని ఇలా పంపొద్దని..” అంది మోనా.
”పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు. మీ మమ్మీతో ఏదైనా పనివుండి వచ్చిందేమో!” అంది నానమ్మ. ఆమె సందర్బాన్ని బట్టి కటువుగా మాట్లాడుతుందే కాని పిల్లలు పెద్దవాళ్లను గౌరవించకపోతే హర్షించదు.
”పనేంలేదు నానమ్మా! వాళ్లిద్దరేం మాట్లాడుకోలేదు” అంది టక్కున మోనా.
పిల్లలు పెద్దవాళ్లను ఎంతగా గమనిస్తారో అర్థమైంది నానమ్మకి.
వాళ్లకిప్పుడు ఏది చెబితే అది గ్రహించే శక్తి వుంటుంది.
మంచీ-చెడు అనేవి వెంటనే వాళ్ల మనసులోతుల్లోకి వెళ్లి బాగా పనిచేస్తాయి.
”నానమ్మా! బాబాయ్‌ లేకుండా పిన్ని ఒక్కతే వస్తే తప్పా?” అంది మోనా.
”మంచి ప్రశ్న వేశావు. తప్పులేకపోవచ్చు. కానీ పెళ్లయ్యాక ఆడప్లిల తన సంసారాన్ని అంకితభావంతో చూసుకోవాలి… ‘ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి’ అంటూ పెళ్లిలో భర్తచేసిన ప్రమాణానికి ‘నాతిచరితవ్యం’ అంటూ భార్య ప్రతి ప్రమాణం చేస్తుంది.
…దాన్ని జీవితాంతం పాటించాలి. భర్తతోనే వుండాలి. అవసరాన్ని బట్టి భర్తతోనే బయటకి రావాలి. అంతేకాని అక్కలదగ్గర, చెల్లెళ్ల దగ్గర గడపకూడదు. అలా గడిపితే ఎంత దగ్గరివాళ్లయినా చిన్నచూపు చూస్తారు” అంది నానమ్మ.
అవునా అన్నట్లు చూసింది మోనా.
”ఏ రోజుల్లో అయినా… అంటే ఇప్పటి కంప్యూటర్‌ యుగంలోనైనా సరే పెళ్లయ్యాక ఒడిదుడుకులు వుంటాయి. తట్టుకోవాలి. స్వాతంత్య్రం కూడా తగ్గుతుంది. కట్టుబడాలి. అందరితో అవసరాలు వుంటాయి. అర్థం చేసుకోవాలి.
…ఇతరుల అవసరాల కన్నా భర్త అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సంతోషపెట్టాలి. దగ్గరవ్వాలి. అలా అని భర్తంటే భయభక్తులతో ప్రతిక్షణం మనసు చంపుకోమని కాదు. కలిసి, మెలిసి వుండాలి” అంది.
ఇప్పుడు మోనాకు భర్తతో పనిలేకపోయినా భర్తతో ఎలావుండాలి అనేది భవిష్యత్తులో తెలుసుకుంటుందని నానమ్మ ఆలోచన.
మోనా కూడా ఆసక్తిగానే వింటోంది.
”ముఖ్యంగా వ్యక్తిగత జీవితం కన్నా సంసారం బాగుండాలి అనుకోవాలి. అనుమానాలు, చికాకులు వుండకూడదు. అవివుంటే అరిష్టం. అన్ని అరిష్టాలకు మూలం ఆవేశం…” అంది నానమ్మ.
మోనా వింటూ నిద్రపోయింది
శృతికకు నిద్రరాలేదు.
*****
తెల్లవారింది.
తనలోని ఆవేదనను అక్కతో చెప్పుకుంటే కొంతయినా తగ్గుతుందని అక్క దగ్గరకి వెళ్లింది శృతిక… ఆఫీసుకెళ్లే తొందరలో శృతిక చెప్పేది వినకుండానే ఆఫీసుకెళ్లింది కృతిక. బావ కూడా అంతే హడావుడితో తన ఆఫీసుకి వెళ్లాడు. పిల్లలు స్కూల్‌కి వెళ్లారు.
స్నానంచేసి చీరకట్టుకొని హాల్లోకి వచ్చిన శృతిక నానమ్మను చూసి షాకైంది.
కారణం నానమ్మ చెవిదగ్గర సెల్‌ఫోన్‌ పెట్టుకొని పోటో చూస్తోంది. కళ్లార్పితే అవతల మాటలు మిస్సవుతానేమో నన్నట్లు కళ్లుకూడా ఆర్పకుండా అతిశ్రద్ధగా వింటోంది.
‘…ఈ వయసులో ఈవిడ కూడా సెల్‌ఫోన్‌ పట్టుకొని పోటో చూడాలా? ఈవిడకు కూడా ఫీలింగ్స్‌ వుంటాయా? భర్తలేడు. మరెవరితో మాట్లాడుతోంది? చిన్నప్పటి బాయ్‌ఫ్రెండా? అయివుండొచ్చు. ఈ సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఎక్కడెక్కడి వాళ్లు లైన్లోకి వస్తుంటారు. అంతటి అవకాశం ఈ సెల్‌ఫోన్ల వల్లనే దొరుకుతోంది.
రాత్రి ఎంతో చక్కగా భార్యా, భర్త అంటూ మోనాతో డైలాగులు చెప్పింది. ఇప్పుడేమో అందరు వెళ్లాక బుద్దిగా కూర్చుని, ఓల్డ్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతూ తరిస్తోంది. ఇలాంటి వాళ్లను వయసుతో పనిలేకుండా ఏది దొరికితే అది తీసుకొని కొట్టాలి.’ అనుకొంది మనసులో శృతిక.
నానమ్మ మాత్రం అప్పటివరకు సెల్‌ఫోన్‌లో ‘ఓం గణేశా! వందనం!’ అన్న యాడ్‌ని విని.,. విన్నది చాలదన్నట్లు ‘ఇంకా కొద్దిసేపు మాట్లాడితే వాడి సొమ్మేం పోయిందో అప్పుడే ఆపేశాడు’ అని పైకే తిట్టుకుంటుంటే…
శృతిక ”ఆ…” అని ఆశ్చర్యపోతూ ”ఛీ.. ఛీ ఈ ఇంట్లో ఒక్కక్షణం కూడా వుండకూడదు. ఎక్కడికి పోయినా ఇదే గోల” అని మనసులో అనుకుంటూ నానమ్మతో చెప్పకుండానే బయటకొచ్చి ఆటో ఎక్కింది.
*****
ఆటో దిగి శృతిక నేరుగా తను చదువుకుంటున్నప్పుడు వున్న హాస్టల్లోకి వెళ్లింది.
ఆ హాస్టల్లో రకరకాల అమ్మాయిలు వున్నారు. వాళ్లలో చాలావరకు ఆ చుట్టుపక్కల ఊర్లనుండి చదువులకోసం చదువులు ముగించుకొని, ఉద్యోగాలకోసం వచ్చినవాళ్లు వున్నారు. పిల్లల్ని ఉన్నతమైన స్థానాల్లో చూడాలని, అందుకు తగిన స్వాతంత్య్రాన్ని ఇచ్చిన వాళ్ల తల్లిదండ్రుల ఆశలకి వక్రభాష్యం చెప్పకుండా బాగా చదివి వారి లక్ష్యసాధన కోసం ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ, కోరుకున్న స్థానాలకు చేరుకోవాలని చూసేవాళ్లే ఎక్కువగా వున్నారు.
ముఖ్యంగా వాళ్లలో చిన్న చిన్న ఊళ్లలో క్రమశిక్షణతో పెరిగిన అమ్మాయిలే ఎక్కువగా వున్నారు. బయట కృత్రిమ వాతావరణం కన్పిస్తున్నా – కన్నవారితో కట్టుబాట్ల మధ్యన పెరిగిన రోజుల్ని మరచిపోకుండా అర్ధరాత్రి వరకు బయట తిరగటం, అబద్దాలు చెప్పటం లాంటి వ్యసనాలకు దూరంగా వుంటూ… చక్కగా చదువుతూ కోరుకున్న భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు.
వాళ్లలో చైత్రిక ఒకతి…
చైత్రిక చూడానికి సున్నితంగా వుండి, మెత్తని స్వభావం గల అమ్మాయిలా అన్పించినా మనోదారుఢ్యంతో ఏ పని అయినా భయపడకుండా కచ్చితంగా చేయగలిగేలా వుంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో వివేకంగా వుండి సరిగా స్పందిస్తుంది.
హాస్టల్లోకి వెళ్లగానే ”నేను చైతూతో మాట్లాడాలి. మీరు కొంచెం బయటకి వెళ్తారా?” అంది మర్యాదగా ఆ రూం మేట్స్ ని ఉద్దేశించి శృతిక. వాళ్లు ”అలాగే” అంటూ బయటకెళ్లి హాల్లో పార్టీషన్‌ చేసిన గదిలో కూర్చున్నారు.
చైత్రికను పట్టుకొని ఏడ్చింది శృతిక.
చైత్రిక శృతికకు బెస్ట్‌ ఫ్రెండ్‌.
ఏడుస్తూనే జరిగింది మొత్తం చెప్పింది. రాజీలు, సహనాలు, ఆత్మవంచనలు బాగా తెలిసినవాళ్లే ద్రోణ దగ్గర వుండగలుగుతారని కూడా చెప్పింది.
”ఏయ్‌! పిచ్చీ! ఏడుపు ఆపు. ఇందులో ఏముందని అంతగా ఏడుస్తున్నావ్‌? నీకసలు బాధలు అంటే ఏమిటో తెలుసా?” అంది చైత్రిక శృతిక గడ్డంపట్టుకొని…
”నీకు తెలుసా?” అంది శృతిక ముక్కుని కర్చీప్‌తో తుడుచుకుంటూ…
”తెలుసు. ఈ ఏడాది రుతుపవనాలు సరిగ్గా పనిచేయక అనేక జిల్లాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అదలా వుండగానే మన సి.ఎం. హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూశారు. అందులోంచి తేరుకోకముందే కనీవినీ ఎరుగని వరదలతో అనేక జిల్లాలు కొట్టుకుపోయి జనం వీధిన పడ్డారు…” అంది చైత్రిక.
”ఇది పేపర్‌ న్యూస్‌ నాక్కూడా తెలుసు…” అంది శృతిక.
చైత్రిక మాట్లాడలేదు.
”చైతూ! నా ఏడుపు చూడవే. నాగురించి ఆలోచించవే!” అంది శృతిక చైత్రిక భుజం పట్టి కదుపుతూ…
”నీకు కష్టమంటే ఏమిటో తెలిస్తే కదా నేను ఆలోచించటానికి… చాలామంది ఆడవాళ్లు కన్నీళ్లతో నిత్యం తడుస్తున్నారు. దారి తెలియక, ఎటు వెళ్లాలో తెలియక, ఎలా వెళ్లాలో తెలియక చీకటి దుఃఖంలో, దుఃఖపు చీకటిలో బేలగా మారి… గుప్పెడు మాటలకోసం, పిడికెడు మెతుకులకోసం ఎదురుచూస్తూ వున్నారు. వాళ్ల గురించి ఆలోచించేవాళ్లు లేరు. వెన్నుదన్నుగా నిలబడేవాళ్లు లేరు…” అంది చైత్రిక ఆలోచనగా.
”చైతూ ప్లీజ్‌! నీ మాటలతో నాకు ఆర్ట్‌ ఫిలిం చూపించకే. ద్రోణ బయట ఆడవాళ్లతో వున్నంత ప్లజంట్ గా నాతో వుండటంలేదు. దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. బాధను బాధగా చూడవే..” అంది.
”అది బాధెలా అవుతుంది. అతను ఆర్టిస్ట్‌. మనసులో ఎన్ని బాధలు వున్నా అవి పైకి కన్పించకుండా నవ్వుతాడు. మట్లాడతాడు. అందరి అభిమానాన్ని పొందుతాడు. అదే అతని పెట్టుబడి…నీదగ్గర అలాంటిదేం అవసరంలేదు. అందుకే నటించడం లేదు.” అంది చైత్రిక.
గట్టిగా చైత్రిక చేతి మీద కండవూడేలా గిల్లింది శృతిక.
”అబ్బా…” అంది వెంటనే చైత్రిక.
”ఎందుకలా అరుస్తావ్‌! నేను గిల్లింది నటన అనుకొని ఎంజాయ్‌ చెయ్‌!” అంది శృతిక.
ఎర్రగా కందిన చేతిని చూస్తూ ‘ఉఫ్‌’ అనుకొంది చైత్రిక ఆ బాధకి చైత్రిక కళ్లలో సన్ని నీటిపొర కదిలి మాయమైంది.
*****
ఆ ఇద్దరు అలా ఓ గంటసేపు మాట్లాడుకోలేదు. ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు.
”చైతూ! నన్నర్థం చేసుకోవే! మునీంద్ర అనే రచయిత నీకు గుర్తున్నాడు కదా! ” అంది శృతిక.
”ఎందుకు గుర్తులేడు! మన ఫ్రెండ్‌ దీపిక ఆయనకి గ్రేట్ ఫ్యాన్‌ కదా! అది ఆయన్ని ప్రేమించి ఆయన తన ఒక్కదానికే సొంతం అని మనతో వాదించేది. మనం ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు ఆ రచయిత శాతవాహనాలో వస్తున్నాడని తెలిసి అది వెళ్తుంటే మనం కూడా ఆయన్ని పరిచయం చెయ్యమని వెళ్లాం. ఆయన మనల్ని చూడగానే దాన్ని వదిలేసి మనకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు. అది చూసి దీపిక హర్టయింది. ఆయన ప్రేమ నుండి డైవర్ట్‌ అయింది. అయితే ఏంటి?” అంది.
”ద్రోణ అలాంటివాడే అని నా అనుమానం” అంది శృతిక
”అది తప్పు. అందరు ఒకేలా వుండరు. అందరి అనుభవాలు ఒకేలా వుండవు. నీకో ఎగ్జాంపుల్‌ చెబుతాను విను. ఒక ప్రముఖ కవి మా పిన్నితో ఆయన బయట వున్నంతసేపు ‘నువ్వే నా ప్రాణం’ అంటాడు. ఇంటికెళ్లాక ‘ఇక్కడ నా ప్రాణం పోతుంది’ అని పిన్ని ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చెయ్యడు. కారణం భార్య పక్కన వుంటుంది కాబట్టి.. ఇదేం జీవితంరా బాబు అని మనకి అన్పించవచ్చు. ‘అదే జీవితం’ అనుకుంటారు వాళ్లు…” అంది చైత్రిక.
”కానీ ద్రోణ అలా కూడా చెయ్యటంలేదు. ఇంట్లో నన్ను వదిలేసి ఫోన్‌ పట్టుకొని బయటకెళ్తాడు” అంది శృతిక.
”నీకు ఇబ్బంది అని వెళ్తున్నాడు. కాని ఆ కవిలాగా దొంగ వేషాలు వెయ్యటం లేదు. అలా వేసేవాడే అయితే ఆడవాళ్ల ఫోన్‌కాల్స్‌ ఇంటికి రాకుండా చూసుకుంటాడు” అంది చైత్రిక.
”ఏది ఏమైనా నేనోపని చెయ్యదలచుకున్నాను చైతూ! మన ఫ్రెండ్‌ స్వప్నికను మానవ బాంబులా ద్రోణ మీదకి ప్రయోగించాలనుకుంటున్నాను.” అంది శృతిక.
చైత్రిక ఆశ్చర్యపోతూ ”ఇలాంటి తిక్క ఆలోచన నీకెందు కొచ్చిందో నాకు తెలియదు. కానీ ఆత్మాహుతి దళంలో చేరానికి తన చుట్టూ తన చేతులతోనే బాంబులు పెట్టుకొని వెళ్తున్న అమ్మాయిలా అన్పిస్తున్నావు నువ్వు… ఎందుకంటే స్వప్నిక…” అని ఏదో అనబోయే లోపలే తలుపు నెట్టుకుంటూ గదిలోకి వచ్చింది స్వప్నిక.
శృతికను చూడగానే ”హాయ్‌! శృతీ!” అంటూ చేతిలో వున్న కవరు బెడ్‌మీద పడేసి శృతిక మీదపడి వాటేసుకొంది స్వప్నిక.
”హాయ్‌!” అంది కాని నవ్వలేదు శృతిక.
శృతికను వదిలి ”ఏంటే అలా వున్నావ్‌! ఇంట్లో ద్రోణ దగ్గర నవ్వి, నవ్వి వున్న నవ్వంతా అక్కడే వదిలేసి వచ్చావా?” అంది స్వప్నిక.
శృతిక ఇబ్బందిగా కదిలింది.
”చెప్పు! ఎలావుంది నీవైవాహిక జీవితం? హ్యాపీనా? మేం కూడా పెళ్లి చేసుకోవచ్చా? పర్వాలేదా చెప్పు?” అంది స్వప్నిక తెగ ఉత్సాహపడ్తూ.
‘ఇది ఇలా కూడా ఇంటర్వ్యూ చెయ్యగలదా’ అన్నట్లు చూస్తోంది చైత్రిక.
”ద్రోణతో అప్పుడప్పుడు బయటకెళ్తున్నావా? ఎక్కడెక్కడ తిరిగారు? తిరిగిన ప్రతిచోట నువ్వెలా ఫీలయ్యావ్‌? చెప్పవే? ఏదీ నీ ఫోనింకా రింగ్‌ కాలేదే! మీ ఆయనకి నువ్వు గుర్తురాలేదా ఏం?” అంది స్వప్నిక.
శృతిక మాట్లాడలేదు
”ప్లీజ్‌! స్వప్నీ! దాన్ని వదిలెయ్‌! తలనొప్పిగా వుందట…” అంది చైత్రిక.
స్వప్నిక తను తెచ్చిన కవరు విప్పి…”ఈ గిఫ్ట్‌ ఎలా వుంది?” అంటూ చైత్రిక చేతిలో పెట్టింది. చైత్రిక ఏకాగ్రతతో ఆ బొమ్మనే చూస్తోంది.
అది సజీవ ప్రకృతి చిత్రం.
ఆ చిత్రంలో సాయం సంధ్యవేళ పచ్చని పంటపొలం, ఆ పొలం గట్టున వున్న రెండు తాటితోపుల మధ్యలోంచి అస్తమిస్తున్న సూర్యబింబం. ఆ సాయం సమయంలో అద్భుతంగా అన్పిస్తున్న వాతావరణం.
”చూపు మరల్చుకోలేకపోతున్నావ్‌! అందులో ఏం కన్పిస్తోంది చైతూ?” అంది స్వప్నిక. ఆమెకు పల్లెటూర్లు, పంటపొలాలు నచ్చవు.
ఆ బొమ్మ కింద ద్రోణ పేరును చూస్తూ. ”ద్రోణ బొమ్మలు వేస్తాడని తెలుసుకాని ఇంత బాగా వేస్తాడని తెలియదు.” అంది ఎమోషనల్‌గా చూస్తూ. నెంబరుంటే వెంటనే అబినందించాలనిపించింది చైత్రికకు.
శృతిక ఇలాంటి ఫీలింగ్స్‌ని పట్టించుకోదు. ఆయనేదో గీస్తాడు. వీళ్లేదో చూస్తారు. ఇద్దరు పిచ్చోళ్లే ఆమె దృష్టిలో…
”అయినా నీ బాయ్‌ఫ్రెండ్‌కి ఈ గిఫ్టేం బావుంటుందే…” అంది పెదవి విరిచి చైత్రిక.
”మొన్నటి వరకు బాయ్‌ఫ్రెండే అనుకున్నా చైతూ! కాదని చెప్పేశాడు నిన్న. అందుకే ఇదివ్వాలని తెచ్చాను.” అంటూ షాపులో సెల్‌ఫోన్‌ పెట్టి మరచిపోయినట్లు గుర్తొచ్చి హడావుడిగా బయటకెళ్లింది స్వప్నిక.
”ఇప్పుడు చెప్పు! ద్రోణను స్వప్నికకు అప్పజెప్తే హీటర్‌ని తలమీద పెట్టుకున్నట్టు కాదా? అదేమైనా బొమ్మలు పెట్టి ఆడుకోవటం లాంటిది అనుకుంటున్నావా? తెగ సంబరపడిపోతున్నావ్‌? పిచ్చి, పిచ్చి గేమ్‌లు ఆడకు.” అంది తన స్నేహితురాలు సముద్రంలో మునగబోతుందని తెలిసి తప్పించాలన్నట్లు…
”అదేం కాదులే! స్వప్నిక ద్రోణకి ఫోన్‌చేసి అతని ఫ్యాన్‌లా మాట్లాడుతుంది. అతని మూమెంట్స్, రియాక్షన్స్‌, ఫీలింగ్స్‌ ఎలావుంటాయో నాకు చెబుతుంది. ఆ రోజు దీపిక ఉడ్‌బీ ఎలాంటివాడో టెస్ట్‌చేసి చెప్పింది కూడా స్వప్పికనే… దానివల్ల దీపిక కెంత ఉపయోగమయిందో మనందరికి తెలుసు. ఇదికూడా అంతే!” అంది శృతిక.
”అతను స్టూడెంట్! అతని వెదవ్వేషాలు అక్కడక్కడ విన్నాం కాబట్టి చూస్తూ, చూస్తూ దీపికను అతనకివ్వటం ఇష్టంలేక టెస్ట్‌ చేశాం. ద్రోణ అలా కాదు. పెళ్లయి భార్యవున్న బాధ్యతగల భర్త….” అంది చైత్రిక.
”అంత సీన్‌లేదు. అదేవుంటే ఈ ఇది ఎందుకు నాకు.. అతనికి అమ్మాయిల పిచ్చి వుందని, వెరయిటీ కోరుకుంటాడని నిరూపించటానికి ఇదొక్కటే మార్గం నాకు…” అంది.
”ఇదేంటే బాబూ! ఏదైనా ఒక లక్ష్యం కోసం తపించే వాళ్లున్నారు. పదిమందిలో ఒకరిగా వుండేందుకు తమలో ఏదో ఒక ప్రత్యేకత కన్పించాలని ఆరాటపడే వాళ్లున్నారు. బ్లెడ్‌ టెస్ట్‌ చేసినట్లు ఈ టెస్టేంటి? ఈ అన్వేషణేంటి?” అంది చైత్రిక.
”నన్ను చంపేస్తానన్నాడు. మాట్లాడే అర్హత లేదన్నాడు. తనముందు నిలబడొద్దన్నాడు. ఇంతకన్నా అవమానం ఏం కావాలి? అతని మనసులో బలంగా ఎవరో ఒకరు వుండబట్టేగా ఇదంతా?” అంది శృతిక.
”మనసులోకి తొంగి చూసే యంత్రాలు ఇంకా తయారుకాలేదు శృతీ! కానీ ఎంతోకాలంగా అతను వేసుకున్న బొమ్మల్ని నువ్వలా డేమేజ్‌ చేసివుండాల్సింది కాదు. అతని ప్త్లేస్‌లో ఎవరున్నా అలాగే చేస్తారు. నువ్వు ఇంటికెళ్లి ద్రోణకి సారీ చెప్పు!” అంది చైత్రిక.
”గంటలు, గంటలు గాళ్‌ఫ్రెండ్స్‌తో ఫోన్లో మాట్లాడేవాడికి సారీ చెప్పాలా?” అంది శృతిక నిరసనగా చూస్తూ…
”నువ్విక ఈ ఫీలింగ్‌ లోంచి బయటపడవా?” అంది
”పడతాను. కానీ ద్రోణ ఎలాంటివాడో నువ్వు టెస్ట్‌చేసి చెప్పు! ద్రోణను ప్రేమిస్తున్నట్లు తాత్కాలికంగా నటించు..” అంది సడన్‌గా.
స్థాణువైంది చైత్రిక. ఒక్కక్షణం ‘వింటున్నది నిజమా’ అన్నట్లు చూసింది.
”నువ్వు నా ఫ్రెండ్‌వి చైతూ! ఆ మాత్రం హెల్ప్‌ చెయ్యలేవా? ఎలాగూ నీ మనసులో రుత్విక్‌ వున్నాడు కాబట్టి దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది వుండదు.” అంది శృతిక.
శృతిక వదిలేలా లేదని… ”ద్రోణ మరీ అంత వీకా? నేను ప్రేమిస్తున్నానంటే నమ్మానికి? అయినా నేనలా నటించాలన్నా అతనితో మాట్లాడాలన్నా నాకు ఇన్సిపిరేషన్‌ రావొద్దా!” అంది చైత్రిక, నేనీ పని చెయ్యనని ముఖం మీద చెప్పలేక…
”దానికేం! ద్రోణ అందగాడేగా! పెళ్లిలో చూసి ముందుగా ఆయన్ని పొగిడింది నువ్వే… మాట బాగుంది, నవ్వు బాగుంది అని మన ఫ్రెండ్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేశావు. నేను చూస్తూనే వున్నా నీ అల్లరిని… ”మీ ఆయన్ని ఇదెప్పుడో లేపుకెళ్లిపోతుంది జాగ్రత్త.” అని కూడా మన ఫ్రెండ్స్‌ అన్నారు నాతో… ఆ ఇన్సిపిరేషన్‌ చాలదా? ఆయనతో నువ్వు మాట్లాడటానికి…? అంది శృతిక.
అసలే శృతిక ఆనుమానపు పీనుగ… ఇందులో నేను ఇరుక్కుంటే ఎటుపోయి ఎటు తేల్తానో అన్న భయంతో ఏం మాట్లాడలేదు చైత్రిక.
”మాట్లాడు చైతూ!” అంది రిక్వెస్ట్‌గా శృతిక.
”నేను ద్రోణతో మాట్లాడితే నువ్వేమీ అనుకోవుగా…? ఒక్కసారి నీ మనసులోతుల్లోకి వెళ్లి ఆలోచించి చెప్పు! ఎందుకంటే ఇది ‘ప్రేమ’ వ్యవహారం… ఇద్దరి మధ్యన రకరకాల మాటలు దొర్లుతుతుంటాయి. కట్టె, కొట్టె, తెచ్చెలా వుండదు మరి…” అంది చైత్రిక.
ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా చైత్రికపై నమ్మకంతో.. ఉద్వేగంగా చూస్తూ… ”మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా నేనేమీ అనుకోను.” అంది దృఢంగా.
”నువ్వు వినవు కాబట్టి నీకలాగే అన్పిస్తుంది. కానీ నువ్వు మాఇద్దరి మాటలు వింటావు. ముందు నీకు కాల్‌చేసి తర్వాత ద్రోణకి కాల్‌ చేస్తాను. నీ ఫోన్‌కి కాన్ఫ్‌రెన్స్‌ కలుపుతాను. ప్రతిమాట, ప్రతిఫీలింగ్‌ నువ్వు వినాలి. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధంలేదు.” అంది చైత్రిక. స్వప్నిక చేతిలో ద్రోణ బలికాకుండా వుండాలంటే తనకీ రిస్క్‌ తప్పదనుకుంటూ…
”ఓ.కె. అలాగే కానివ్వు…”అంది శృతిక.
”ద్రోణ నెంబరివ్వు… ” అంది చైత్రిక.
వెంటనే చైత్రిక మొబైల్‌ని తీసుకొని ద్రోణ నెంబర్‌ని సేవ్‌ చేసి ఇచ్చింది శృతిక.
”ఇక నేను వెళ్తాను చైతూ!” అంటూ లేచి నిలబడింది శృతిక.
”అప్పుడే ద్రోణ గుర్తొచ్చాడా? వెళ్తానంటున్నావ్‌?” అంది చైత్రిక
”నేను వెళ్లేది ద్రోణ దగ్గరకి కాదు.” అంది శృతిక.
”మరి…?” అంటూ ఆశ్చర్యపోయింది చైత్రిక.
”మా పేరెంట్స్ దగ్గరకి… నేను దూరంగా వుండి ద్రోణకి నా విలువ తెలిసేలా చెయ్యాలి…” అంది.
ఏం మాట్లాడలేక అలాగే చూసింది చైత్రిక.
*****
ఆముక్త – సంవేద ఇంటికి వెళ్లింది.
కాలుమీద కాలు వేసుకొని, ఫైబర్‌ కుర్చీలో కూర్చుని కుడిచేత్తో పేపర్‌పట్టుకొని చదువుకుంటున్న గంగాధరం – ఒక చేయి లేకపోయినా ఇస్త్రీ చేసిన ఖద్దర్‌ బట్టల్లో ఇప్పుడే ఏదో సోషల్‌వర్క్‌ మీటింగ్‌ నుండి బయటకొచ్చిన ప్రజా నాయకుడులా వున్నాడు.
ఆయన పక్కనే వీల్‌ చెయిర్లో కూర్చుని సంవేద శారీకి పూసలు, అద్దాలు కుడుతోంది నిశిత.
గంగాధరాన్ని చూడగానే గౌరవభావం కల్గిన దానిలా.. ”మీ మామగారా?” అంది ఆముక్త.
”అవును. అప్పుడు చెప్పానుగా ఊరినుండి మా మామగారు వచ్చారని… కూర్చో ఆముక్తా!” అంటూ ఇంకో కుర్చీ తెచ్చి నిశిత పక్కన వేసింది సంవేద.
”నా పేరు ఆముక్త! సంవేద స్నేహితురాలిని…” అంటూ గంగాధరానికి తనని తను పరిచయం చేసుకొంది ఆముక్త.
ఆయన ‘అలాగా’ అన్నట్లు నవ్వి కూర్చోమన్నట్లు కుర్చీవైపు చేయి చూపాడు.
ఆముక్త కూర్చుంది.
”మామయ్యా! ఆముక్త బాగా రాస్తుంది” అంటూ ఆముక్తలో వున్న స్పెషల్‌ క్వాలిటీని గంగాధరానికి పరిచయం చేసింది సంవేద.
”అవునా! నేను బస్‌లో పనిచేస్తున్నప్పుడు బాగా చదివేవాడిని… ఇప్పుడు మానేశాను. ఓపిక తగ్గి కాదు. పుస్తకాల రేట్లు బాగా పెరిగాయి మన రేషన్‌ రేట్లులాగే.. అన్నట్లు మీరు ఏ టైపు రాస్తారు? పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాలా? లేక నవలలా?” అన్నాడు ఆమెవైపు మర్యాదగా చూస్తూ.
”నావి అలావుండవండి! ఏవో చిన్న, చిన్న కవితలు. అదీ భావకవితలు మాత్రమే” అంది.
”పోన్లే! ఏదో నీ సంతోషం కోసం నువ్వు రాసుకుంటున్నావు. మంచిదే.” అంటూ ఆమె కవిత్వాన్ని చదవకపోయినా తన అభిప్రాయాన్ని చెప్పాడు.
”అంటే ! భావకవిత్వం, రాసేవాళ్లంతా కేవలం వాళ్లకోసమే రాసుకుంటున్నారా? ప్రజలకోసం కాదా? వాటిని చదివేవాళ్లు ప్రజలు కాదా?” అంది ఆముక్త.
”ప్రజలు అన్నీ చదువుతారు. కొన్ని మాత్రమే మనసులో నిక్షిప్తం చేసుకుంటారు.” అన్నాడు గంగాధరం.
”నిక్షిప్తం అంటే?” అంది అర్థమైకానట్లు చూస్తూ…
ఆమె ముఖంలోకి ఓసారి చూసి… ”నేను కృష్ణశాస్త్రి, ఊర్వశి, విశ్వనాధ కిన్నెర చదివాను. అవి చదువుతున్నప్పుడు సూర్యాస్తమయంలోని అద్భుతాన్ని, చంద్రోదయంలోని సౌందర్యాన్ని చూసినంతగా పొంగిపోయాను. మహానుభావులు వాళ్లు. లోకంలో సంచరిస్తూ దొరికిన ప్రతి సౌందర్యశకలాన్ని ఏరుకొని వచ్చి సృష్టించారు. అది కేవలం రసాస్వాదన.
…దానివల్ల స్పష్టమైన లక్ష్యాలు, శక్తిమంతమైన సందేశాలు దొరకవు. వ్యక్తిగత, వృత్తిగత సామర్థ్యం పెరగదు. మనిషికి ఏది ఎంతవరకు అవసరమో మనసులో ఏది నిక్షిప్తం చేసుకుంటే ఎంతవరకు వుపయోగపడ్తుందో ఆలోచించే స్థాయికి ఇప్పటి పరిస్థితులు మనిషిని మార్చివేశాయి. నిక్షిప్తం అంటే ఇప్పుడర్థమైందనుకుంటాను.” అన్నాడు.
ఆముక్త ఎప్పుడైనా అర్థం చేసుకునేంత లోతుగా ఆలోచించి కష్టపడదు. మనసుకి నొప్పి కల్గించుకోదు… ఏదో అలా, అలా జరిగిపోవాలి లైఫైనా, రచన అయినా అనుకుంటుంది.
”రచనలనేవి మనిషి లక్ష్యాలకి, సాధించవలసిన వాటికి సమగ్రమైన వెలుగులా పనిచెయ్యాలి. ఇంకా, ఇంకా ప్రేరేపించి మనిషిలోని జడత్వాన్ని మాయం చెయ్యాలి. అప్పుడు మనిషి ఉన్నతంగా ఎదుగుతాడు” అన్నాడు. ఆయనకు పుస్తకాలు చదివిన అనుభవం చాలా వుంది. అందుకే అలా మాట్లాడగలిగాడు.
తలదిమ్మెక్కినట్లైంది ఆముక్తకి. ఈ లక్ష్యాలేంటో, ఈ ఉన్నతాలేంటో బొత్తిగా అర్థంకాలేదు. కొద్ది రోజులు పోతే ‘నండూరి ఎంకి తెలుసా?’ అని అడిగితే మా వీధిలో లేదంటారు. ‘కాళిదాసు ఎవరని’ అడిగితే అతనిది మా వూరే అంటారు అనుకొంది ఆముక్త. ఒక్కక్షణం చింతిస్తున్న దానిలా తన చేతివేళ్ల వైపు చూసుకుంటూ..
”నేనిక వెళ్తాను వేదా!” అంది వచ్చిన పని మరచిపోయి ఆముక్త.
”అప్పుడేనా కూర్చో ఆముక్తా!” అంది సంవేద
ఆముక్త భావాలు అర్థమైనవాడిలా ఇంకేం మాట్లాడలేదు గంగాధరం.
తనొచ్చిన పని గుర్తుచేసుకుంటూ.. ”వేదా! మావారు ఊటీ వెళ్లారు. బిజినెస్‌ పార్టనర్స్‌తో కలిసి… అందుకే నన్ను తీసికెళ్లలేదు. ఇంట్లో ఒంటరిగా వుంటున్నాను. పక్కప్లాట్ లో ఎవరూలేరు. భయంగా వుంది. నిశితను తీసికెళ్తాను. ఒక్క మూడురోజులే… మావారు ఇక్కడ ప్లైట్ దిగగానే నిశితను తీసుకొచ్చి వదులుతాను.” అంది ఆముక్త.
అందరు విన్నారు ఒక్క దేవికారాణి తప్ప…
ఆముక్తకి తోడుగా నిశితను పంపిన సందర్భాలు గతంలో వున్నాయి. వెంటనే ఒప్పుకోవాలని వున్నా – అత్తగారితో, మామగారితో ఓమాట చెప్పాలని ”నిశితను ఆముక్తతో పంపమంటారా అత్తయ్యా?” అంది దేవికారాణి దగ్గరకి వెళ్లి సంవేద.
”ముదనష్టం, దరిద్రం త్వరగా పంపు. శాశ్వతంగా ఎప్పుడు పంపుతావో ఏమోదాన్ని… నాకైతే దాన్ని చూడటమే కష్టంగా వుంది. ఈ మధ్యన కొత్తగా ఇంకో మేళం తోడైంది. వాళ్లతో నువ్వెలా వేగుతున్నావో ఏమో!” అంది ఈ మధ్యన నిశిత తనపనులు చెయ్యటం లేదన్న కోపంతో…
ఆమె ఇంకో కొత్తమేళం అని ఎవరిని అన్నదో సంవేదకి తెలుసు. గంగాధరం కూడా ఆ మాటల్ని విన్నాడు. భార్యకి తన రాక ఎంత కష్టంగా వుందో అర్థంకాని క్షణం లేదు. గాయపడని సందర్భంలేదు.
”వాళ్లు మనల్ని ఏం చేస్తున్నారు అత్తయ్యా? వాళ్లవల్ల నాకైతే ఎలాంటి ఇబ్బందిలేదు” అంది
”ఎందుకుంటుంది? కాళ్లు లేనివాళ్లతో, చేతుల్లేని వాళ్లతో వుండటం నీకు అలవాటేగా! ఆ దరిద్రాన్ని నేనైతే భరించలేకపోతున్నా.,..” అంది.
వినసొంపైన మాటల్ని అయితే వినాలనిపిస్తుంది కాని దేవికారాణి ఎప్పుడు నోరెత్తినా ‘నీకో దండం. నే నెళ్లిపోతా!’ అన్నట్లుగా చూడాలనిపిస్తుంది సంవేదకి. కానీ అలా వెళ్లిపోయే బంధం కాదుగా తమది. అత్తాకోడళ్ల ఐరన్‌ రిలేషన్‌..
”నీ చెల్లికి ఈ మధ్యన తలపొగరు ఎక్కువైంది. ఏది చెప్పినా చెయ్యటంలేదు. చెప్పిన మాట వింటేనే బ్రతకటం కష్టమని చెప్పు!” అంది దేవికారాణి.
చెల్లిమీద కోపంవస్తే అక్కతో చెప్పటం.. అక్కమీద కోపమొస్తే చెల్లితో చెప్పి తిట్టడం ఆమెకి అలవాటైపోయింది.
”సరే ! అత్తయ్యా! ఇప్పుడు దాన్ని ఆముక్తతో పంపి వస్తాను.” అంటూ ఆ గదిలోంచి బయటపడింది సంవేద.
”మీరేమంటారు మామయ్యా?” అంది మామయ్యను పక్కకి పిలిచి.
”పంపించు, సంవేదా! ఒంటరిగా వుండలేకనే అడుగుతోంది. మనం ఎదుటివారికి సహాయం చేస్తే ఆపదకాలంలో మనకు కూడా సహాయం చేసేవాళ్లు దొరుకుతారు” అన్నాడు గంగాధరం. ఆయనకు స్నేహం విలువ, సహాయంవిలువ బాగా తెలుసు.
అక్క చెప్పగానే లేచి వర్క్‌ చేస్తున్న శారీని కవర్లో పెట్టుకొని, ఆముక్తతో వెళ్లింది నిశిత.
*****
నిశిత అలా వెళ్లగానే ఆఫీసునుండి వచ్చాడు శ్యాంవర్ధన్‌.
రాగానే ”నిశిత ఏది?” అన్నాడు
”ఆముక్త దగ్గరకి వెళ్లింది” చెప్పింది సంవేద.
”ఎప్పుడొస్తుంది? ” అన్నాడు త్వరగా చూడాలనిపిస్తుంది అతనికి… రోజూ ఈ టైంలో ఏదో ఒక పనిచేస్తూ కన్పించేది. చూడగానే అదోలాంటి రిలీఫ్‌. పదే, పదే కావాలనిపించే రిలీఫ్‌ అది… ఆ ప్రాణానికి అలా అలవాటైంది.
”మూడు రోజుల వరకు రాదు.” అంది సంవేద.
”మూడు రోజులా! ఏదో ఒక్కరోజంటే అప్పుడప్పుడు పంపుతుండే దానివి… ఐనో. కానీ మూడురోజులంటే మాటలుకాదు. ఎవరినడిగి పంపావు?” అన్నాడు కోపంగా.
”అత్తయ్యను, మామయ్యను అడిగే పంపాను. అయినా ఈ విషయంలో ఎందుకింత సీరియస్‌ అవుతున్నారు?” అంది భర్తవైపు చూస్తూ.
”సీరియస్‌ ఎందుకుండదు? ఆడపిల్లల్ని బయటకి పంపే రోజులా ఇవి…? అందులో రాత్రివేళల్లో వేరే ఇళ్లలో పడుకోటానికి పంపటమేంటి? నీకు ఆ మాత్రం ఆలోచించే జ్ఞానం వుండక్కర్లేదా?” అన్నాడు మరికాస్త కోపంగా.
”మీరు అనవసరంగా ఆవేశపడ్తున్నారు. ముందు భోంచేయండి! ఆకలి తగ్గితే ఆవేశం తగ్గుతుంది” అంది సంవేద.
”నీకు నేను చిన్నపిల్లాడిలా కన్పిస్తున్నానా? ” అన్నాడు.
”అని నేను అన్నానా? ” అంది.
”అనకపోయినా అలాగే అన్పిస్తుంది నాకు… లేకుంటే వెళ్లేముందు నాకు కాల్‌ చేయాలని తెలియదా? చేసుంటే వెళ్లొద్దని అప్పుడే చెప్పేవాడిని… ఇప్పుడీ బాధలేకుండా పోయేది.” అన్నాడు.
”ఇప్పుడంత బాధ పడాల్సిందేంలేదు. అది హాయిగా వుంటుందక్కడ..” అంది
”అక్కడ హాయిగా వుంటే ఇక్కడ నేనుండొద్దా? రేప్పొద్దున ఏం జరిగినా బావను నేనుండి ఏం చెయ్యగలిగినట్లు? ఇలాంటి విషయాలు నీకు తెలియవు. నువ్వు తప్పుకో, నేను వెళ్లి నిశితను తీసుకొస్తాను.” అంటూ సంవేద భుజంపట్టి పక్కకి నెట్టి నాలుగడుగులు వేశాడు.
”ఆగు శ్యాం! నేనే వెళ్లమన్నాను. వస్తుందిలే. నువ్విలా వెళ్తే బావుండదు” అన్నాడు అప్పివరకు కొడుకు వాదనను విన్న గంగాధరం.
”బావుండక పోవటానికి ఏముంది ఇందులో… నేను నిశిత కోసం వెళ్తున్నా … ఆముక్త గారి కోసం కాదుగా!” అన్నాడు వ్యంగ్యంగా.
నిశిత మీద తన భర్తకి ఇంత అభిమానం వుందా అని నివ్వెరపోయింది సంవేద. భర్త చాలా ఎత్తులో కన్పించాడు ఆమెకు…
”నువ్వు నిశిత కోసమే వెళ్తున్నావ్‌! కాదనను కానీ ఇది సమయం కాదు.” అన్నాడు గంగాధరం.
”నేనెవరి మాట వినను. నిశితను పరాయి ఇంట్లో వుంచటం నాకిష్టం లేదు అందుకే వెళ్తున్నా …” అన్నాడు గ్టిగా
అతను నిశితకోసం వెళ్తుంటే సంవేద కళ్లు చెమర్చాయి ప్రేమతో…
గంగాధరం సంవేదవైపు చూస్తూ.. ‘పిచ్చిదానా! నీ మొగుడిది అభిమానమనుకుంటున్నావా! కాదు కామం. ఆ కామదాహం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆ దాహంలో నిశిత జీవితం కొట్టుకుపోయేలా వుంది. ఇది నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. నేనేమో నీకు చెప్పకుండా ఈ అగ్నిని నా మనసులో ఆపుకోలేకపోతున్నా’ అని మనసులో అనుకుంటూ కోడలితో దీన్నెలా చెప్పాలి? చెప్పకుండా ఎలా దాచాలి? అని చూస్తున్నాడు.
”ఆయన మన మాట వినేలా లేరు మామయ్యా!” అంది తనవైపు నిస్సహాయంగా చూస్తున్న మామయ్యను ఉద్దేశించి సంవేద.
…చేసేదిలేక గంగాధరం పడుకున్నాడు.
*****
శ్యాంవర్ధన్‌ ఆముక్త ఇంటికి వెళ్లాడు.
గేటు దగ్గర వున్న గుర్ఖా శ్యాంని చూడగానే సెల్యూట్ చేశాడు.
ఆ ఇల్లు చాలా మోడరన్‌గా వుంటుంది. అంతేకాదు…
గేటు దగ్గరనుండి ఇంటి గుమ్మంవరకు ఓ చిన్న బాటలావుండి, ఆ బాటకి అటు, ఇటు క్రోటన్‌ మొక్కలు హుందాగా నిలబడి ‘హాయ్‌’ అన్నట్లు చూస్తూంటాయి. ఇంటి చుట్టూ లోపల వాళ్లు కన్పించేలా గ్లాసెస్‌ వుంటాయి. కర్టెన్స్‌ వేసి వుంటాయి కాబట్టి లోపలివాళ్లు బయటకి కన్పించరు.
…నేరుగా వెళ్లి అక్కడే ఆగిపోయాడు శ్యాంవర్ధన్‌
కారణం లోపల కూర్చుని శారీకి అద్దాలు కుడుతోంది నిశిత. తలకాస్త వంగి వుండటంతో ఆమె జడలో పెట్టిన ముద్దబంతిపువ్వు అందంగా కన్పిస్తోంది. నిశితకి ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతూ, మధ్య, మధ్యలో నిశిత మాటల్ని వింటోంది ఆముక్త.
…శ్యాంవర్ధన్‌ కూడా ఉత్కంఠతో వింటున్నాడు.
”నిశితా! ఈ మాటలన్నీ నీకెవరు చెప్పారు? ఇంత మెచ్యూర్డ్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నావ్‌?” అంది ఆశ్చర్యపోతూ ఆముక్త.
”మా గంగాధరం మామయ్య రోజూ నిద్రపోయే ముందు చెప్తుంటాడు అక్కా! నేను అవన్నీ గుర్తుపెట్టుకుంటాను.” అంది నిశిత.
”అవునా? మీ మామయ్య మంచి అనుభవజ్ఞానిలా వున్నాడు కదూ?” అంది ఆముక్త.
”అవును. ఆయన అనుభవాలు వింటుంటే కన్నీళ్లొస్తాయి. అభిరుచితో వినాలే కాని ఆ కన్నీళ్లు చెప్పే కథలు కోకొల్లలు.” అంది నిశిత.
చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి నిశితవైపు చూసింది ఆముక్త.
”అవునక్కా! జీవితంలో ప్రతి ఒక్కటీ ప్రాముఖ్యత కలిగి వుంటుందట… ఒక్కోసారి ఇదెంతలే అని దానికి ఇవ్వాల్సిన విలువను ఇవ్వకుండా తక్కువ అంచనా వెయ్యకూడదట… ఏదైనా మన చేతికి అందేంత దూరంలో వుంటే దాని విలువ గ్రహించం కదా! అదే చేయిదాటిపోతే బాధపడ్తాం… అందుకే ఏదైనా చేజారిపోయిన తర్వాత బాధపడేకంటే ముందుగానే దాని విలువ తెలుసుకోవటం ముఖ్యమని చెబుతాడు.
…అంతేకాదు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు కూడా మనలో మనమే బాధపడుతూ కూర్చోకుండా మనమంచి కోరే స్నేహితులకో, ఆత్మీయులకో చెప్పుకోవాలంటాడు. అప్పుడు సమస్య తీరకపోయినా కొంత ప్రశాంతత కలుగుతుందని కూడా చెబుతాడు మామయ్య” అంది నిశిత.
దానికి ఆముక్త ఏమాత్రం ఏకీభవించని దానిలా చూస్తూ.. ”సమస్య ఎప్పుడైనా సమస్యే! చెప్పినంత మాత్రాన తీరదు. అలా చెబితే చీప్‌ అయిపోతాము” అంది.
”అలా అనుకోకూడదక్కా! సమస్య ఎప్పుడూ కష్టంగానే వుంటుంది. కష్టం వచ్చిందని కృంగిపోకుండా ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే దానికి ఆత్మీయులు అండ అవసరం అంటాడు మామయ్య!” అంది నిశిత.
”చూడు నిశితా! నువ్వు సమస్య గురించి మాట్లాడుతున్నావు కాబట్టి చెబుతున్నా… జీవితంలో అన్ని సమస్యల్ని పైకి చెప్పుకోలేం. కొన్నిమాత్రమే చెప్పుకోగలం… అదిగో బయట మీ బావ కన్పిస్తున్నాడు. ఒక్క నిముషం…! అంటూ లేచి వెళ్లి పూర్తిగా కర్టెన్‌ తొలగించి శ్యాంవర్ధన్‌ని చూసి ఓ నవ్వు నవ్వి… తలుపుతీసి ఆ నవ్వుతోనే లోపలకి ఆహ్వానించింది.
లోపలకి వచ్చి కూర్చున్నాడు.. ఎ.సి. సౌండ్‌కి, ఆ చల్లదానికి ఆ వాతావరణం గమ్మత్తుగా, మత్తుగా వుంది.
”ఎంతసేపయింది మీరొచ్చి?” అంది ఆముక్త.
”ఇప్పుడే ! మా నిశిత చాలా క్లవర్‌గా మాట్లాడుతుంటే వినాలనిపించి డిస్టర్స్‌ చెయ్యకుండా అక్కడే ఆగిపోయాను” అన్నాడు.
నిశిత, ఆముక్త ఒకరినొకరు చూసుకున్నారు.
ఆముక్త వైపు చూస్తూ ”మా నిశితను తీసికెళ్దామని వచ్చాను” అన్నాడు
ఉలిక్కిపడ్డట్లు చూసి ”ఎందుకు?” అంది ఆముక్త.
”మా నాన్నగారు తీసుకురమ్మన్నారు.” అంటూ అబద్దం చెప్పాడు. అతనికి నిశితను తన బైక్‌మీద కూర్చోబెట్టుకొని వెళ్లాలని, దారిలో ఏదైనా ఓ రెస్టారెంట్లో కూర్చోబెట్టి, తన మనసులో కోరికను బయటపెట్టాలని వుంది.
”మణిచందన్‌ ఊటీ వెళ్లారు. ఒంటరిగా వుండలేక నిశితను తీసుకొచ్చాను ప్లీజ్‌! మీ నాన్న గారికి నచ్చచెప్పండి! నిశిత ఇక్కడే వుంటుంది.” అంది ఆముక్త.
మాట్లాడలేకపోయాడు. శ్యాంవర్ధన్‌. మణిచందన్‌ లేడు కాబట్టి నిశితను వుంచాలంటే అభ్యంతరం లేదు. కానీ నిశిత లేకుంటే తనుండలేక పోతున్నాడు. ఈ బలహీనత ఎలా జయించాలో అతనికి అర్థం కాకుండా వుంది.
”కొన్ని బలహీనతలు మనిషిని తనవైపుకి బలంగా అాక్ట్‌ చేసుకుంటాయంటే ఇన్ని రోజులు నేను నమ్మేవాడ్ని కాదు ఆముక్తగారు ! ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది. మా నాన్నగారి బలహీనత నిశిత! ఎందుకంటే చిన్నపనికి, పెద్దపనికి నిశితపై ఆధారపడ్తున్నాడు. అదే చెప్పాడు”. అంటూ మొత్తం తండ్రి పైకి నెట్టివేస్తూ తెలివిగా మాట్లాడాడు.
”మామయ్య పనులన్నీ అక్క చేస్తానంది బావా!” అంది నిశిత. ఆమెకు వెళ్లాలని లేదు. కనీసం ఈ మూడు రోజులైనా బావలోని రాక్షసకోరికతో నిండిన చూపుల్ని తప్పించుకుందామని వుంది.
”ఎంతయినా నువ్వున్నట్లు వుంటుందా నిశితా!” అన్నాడు ఆమె కళ్లలోకి సూటిగా, కొంటెగా చూస్తూ…
”ఎలాగోలా అడ్జస్ట్‌ అవుతాడు లెండి! మూడురోజులేగా!” అంది ఆముక్త.
ఇది నిశితను తీసికెళ్లే సందర్భం కాదని అర్థమైంది శ్యాంకి.
అతను మౌనంగా వుండటం చూసి… ”నిశిత నా దగ్గర సేఫ్‌గా వుంటుంది. కావాలంటే అప్పుడప్పుడు మీరు వచ్చి చూసివెళ్లండి!” అంది ఆముక్త.
ఇది నచ్చింది శ్యాంవర్ధన్‌కి.
”నేను రేపు ఆఫీసునుండి ఇటే వస్తానండి! మణిచందన్‌గారు లేరు కాబట్టి మీకేదైనా అవసరం రావొచ్చు. మిమ్మల్ని మా సంవేదతో పాటు నేను కూడా అర్థం చేసుకోగలను. నిశితను వుంచుకోండి!” అన్నాడు శ్యాంవర్ధన్‌.
అతనంత సడన్‌గా మారిపోవటం ఆముక్తతోపాటు నిశితకి కూడా ఆనందం వేసింది.
‘గుడ్‌నైట్…’ చెబుతూ నిశిత వైపు దాహంగా చూశాడు శ్యాం. కంపరంగా అన్పించి ఒళ్లు గగుర్పొడిచింది నిశితకి.
అతను వెళ్లగానే గ్లాస్‌డోర్‌ మూసి, కర్టెన్స్‌ దగ్గరకి లాగి వెనుదిరిగిన ఆముక్త నిశితను చూసి ఆశ్చర్యపోయింది.
నిశిత అనీజీగా గోళ్లు కొరుకుతోంది. చురుగ్గా నేలవైపు చూస్తోంది.
”ఏమి నిశితా అలావున్నావ్‌?” అంది ఆముక్త.
‘వీడు.. వీడు.. మా అక్క భర్త కాకపోయివుంటే బావుండేది’ అనిపైకి అనలేక మనసులో అనుకొంది.
మనసులో మాటను మనసులోనే తొక్కి, గోళ్లు కొరకటం ఆపి, సన్నగా ఓ నవ్వు నవ్వీ… ”ఏంలేదక్కా!” అంది.
కానీ పైకి చెప్పుకోలేని సమస్య నిశితలోని నరనరాన్ని నలిపేస్తున్నట్లు ఆముక్త అంచనా వెయ్యలేకపోయింది.
*****
”ద్రోణతో మాట్లాడావా చైతూ? ఇంకాలేదా? ఈ విషయంలో ఎందుకింత లేట్ చేస్తున్నావు? భయపడ్తున్నావా? నేనే చెప్పినప్పుడు భయం దేనికి? అయినా నాకెప్పుడు ఇలాగే అన్యాయం జరగుతోంది. అప్పట్లో ఎంత చదివినా క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేది కాదు. దానితో మా ఇంట్లోవాళ్లు తృప్తిపడకుండా ఎప్పుడు చూసినా హాస్టల్లోనే వుండి చదివి ర్యాంక్‌ కొట్టమనేవాళ్లు… అక్కయ్యతో పోల్చి చూసేవాళ్లు. ఒకవిధమైన నిర్లిప్తతతో, మొండితనంతో హాస్టల్లో వుండకుండా ఎప్పుడు చూసినా స్కూటీమీద తిరిగేదాన్ని…
పెళ్లయ్యాక ద్రోణకి నా వంట నచ్చేది కాదు. విమలత్తలాగ చెయ్యమనేవాడు. ఆ తరం వంటల్ని చెయ్యటానికి నేను చాలా ట్రైనింగవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేనెంతగా అతన్ని ప్రేమించినా అతని ప్రేమ నామీద వున్నట్లు కన్పించటంలేదు… స్వతహాగా అతనెలాంటి వాడో టెస్ట్‌ చెయ్యవే అంటే నువ్వేమో చాలా క్యాజ్‌వల్‌గా తీసుకుంటున్నావ్‌! కనీసం ఇవాళైనా ద్రోణతో మాట్లాడవే! ప్లీజ్‌!” అంది చాలా బ్రతిమాలుతూ శృతిక.
స్నేహితురాలికి హెల్ప్‌ చెయ్యాలనివుంది చైత్రికకి…
కానీ ద్రోణ సెలబ్రిటీ కాబట్టి ఫోన్‌ చేస్తే అతని రిసీవింగ్‌ ఎలావుంటుందో అని ఆగిపోయింది. శృతిక వదిలేలా లేదు. తను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అంటోంది.
చివరకు ఓ నిర్ణయానికి వచ్చి – ద్రోణకి గొప్ప ఫీలింగ్‌తో కూడిన మెసేజ్‌ ఇద్దామని మొబైల్‌ని చేతిలోకి తీసుకొంది.
”హాయ్‌! ద్రోణా! ఐయాం చైత్రిక… మంచుపొగల్ని, వెన్నెలముక్కల్ని కలగలిపినట్లున్న మీ బొమ్మల అందాలు, సూక్ష్మాతిసూక్ష్మమైన రేఖల్లో ఒదిగిన ఆ అద్భుతాలు నన్ను తమలో మమైకం చేసుకొని, నా మనసును మీ భావనలో మునిగిపోయేలా చేశాయి. మీ హృదయభాషను నా మనోనేత్రంతో స్పర్శించి మౌన ప్రణామం చేస్తున్న… అందుకోండి ద్రోణా!” అని ద్రోణ సెల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
ఒకరోజంతా ఎదురు చూసింది అతని ప్రతిస్పందనకోసం…. సమాధానం లేదు. ఆమెకు నిద్రరావటంలేదు.
‘ఇప్పుడెలా? ఏంచేయాలి?’ అని బాధగా అనుకొని…
”ద్రోణా మీ తలపే నా హృదయస్పందన అయిన క్షణంనుండి ఒక్కక్షణం కుదురుగా వుండలేక పోతున్నాను. అనుక్షణం మీ ధ్యాసే నా ఊపిరైంది. అందుకే నా మనసును ఈ మెసేజ్‌గా పంపిస్తున్నా… దీన్ని మీ పెదవులతో చదువుతుంటే నా మనసును సృశిస్తున్నట్టే వుంటుంది. మిస్‌యు…” అంటూ ద్రోణ సెల్‌కి ఇంకో మెసేజ్‌ ఇచ్చింది.
ఈ మెసేజ్‌ని ఇస్తున్నప్పుడు పర్యవసానం ఎలా వుంటుందన్నది ఆమె ఆలోచించలేదు. శృతికనుండి పుల్‌ పర్మిషన్‌ వుండటంతో దేనికీ వెనుకాడటంలేదు. ఎక్కుపెట్టిన బాణంలా ద్రోణ మీదకి తన భావాలను సంధిస్తోంది
ఈ రోజు కూడా అతని నుండి ఆన్సర్‌ లేదు.
మళ్లీ మొబైల్‌ అందుకొంది. ఈసారి ఆమెలో ఇంకా పట్టుదల పెరిగింది.
”మీ తలపుల దుప్పిలో నన్ను నేను కప్పుకొని మీరంటే ఎంతిష్టమో మీతో చెప్పమని తెల్లని మేఘంలోని ఓ తునకను బ్రతిమాలి మీ దగ్గరకు పంపాను. అందలేదా ద్రోణా? కనీసం మీ మెసేజ్‌ కోసం ఎదురుచూస్తున్నానని అక్కడున్న సన్నజాజి, చల్లగాలి అయినా మీకు గుర్తు చెయ్యటం లేదా? నేనిప్పుడు దుప్పటిలోంచి బయటకొచ్చి, కికీలోంచి చూస్తుంటే… బయటంతా వెన్నెల కురుస్తూ ఆకాశం అద్భుతంగా వుంది. నా ప్రాణంలో ప్రాణమైన మిమ్మల్ని గంగనుండి నీరు తెచ్చి అభిషేకించాలనో ఏమో మేఘాలన్నీ వేగంగా పరిగెడుతున్నాయి… అది చూసి నా మనసు ఉత్సాహంగా, ఆకాశం,భూమి కలిసేచోట కన్పించే గీతలా మారి మీ మెసేజ్‌ కోసం నిరీక్షిస్తుంది.” అని మేసెజ్‌ సెండ్‌ చేసింది.
అతని నుండి సమాధానంలేదు.
*****
నిద్రలేచింది చైత్రిక…
లేవగానే ద్రోణ వర్షిత్‌ గుర్తొచ్చాడు తనకేమైనా మెసేజ్‌ ఇచ్చాడేమోనని ముందుగా మొబైల్‌ అందుకొని చూసింది.
ఒక్క మెసేజ్‌ కూడా రాలేదు. కనీసం కర్టెసీ కోసమైనా రిప్లై ఇవ్వాలనుకోలేదా ఈ ద్రోణ? నేనెవరో అడగాలని కూడా అన్పించలేదా? ఎందుకో గిల్టీగా అన్పించింది చైత్రికకి… తనలోని అహాన్ని మెడలు విరిచినట్లు, అభిమానాన్ని తనంతటతనే చంపుకుంటున్నట్లు కొద్దిక్షణాలు ఇన్‌సల్టింగ్‌గా ఫీలయింది.
ఏ అమ్మాయి అయినా ఒక వయసు వచ్చాక – ‘మగపిల్లలు తాము పిలిస్తే పలుకుతారని, ఏ పని చెప్పినా చేస్తారని, కనుసైగకే పడిపోయి ఇంట్రస్ట్‌ చూపిస్తారని, ముఖ్యంగా ఫోన్‌ చేస్తే పడి చస్తారని’ అనుకుంటారు కానీ ద్రోణ విషయంలో అవన్నీ తలక్రిందులయ్యాయి.
”ద్రోణా! రాత్రంతా నిద్రలేదు. నాకెందుకో మీరు నన్ను అవమానిస్తున్నట్లనిపిస్తోంది. ఒక అమ్మాయి అంత క్రియేటివిటీతో మెసేజ్‌లు పంపితే మీ అంత మౌనంగా ఎవరూ ఉండరనిపిస్తోంది. అంత అద్భుతమైన ఆర్టిస్ట్‌ అయివుండి ఇదేనా ఒక అమ్మాయి మనోభావాలకు మీరిచ్చే ఇంపార్టెన్స్‌? కానీ ద్రోణా ! ఒక్క నిజం చెప్పనా? మనకు తెలియకుండా ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో మీరు నా ఊహల్లో మునిగిపోవటం కూడా అంతే సహజం… ” అంటూ ద్రోణ మొబైల్‌కి మెసేజ్‌ సెండ్‌ చేసింది.
నో రెస్పాన్స్‌…!
నిముషాలు గడుస్తున్న కొద్ది చైత్రిక మనసంతా శూన్యం.. ఎందుకో తెలియదు.
ఏదో తెలియని భావం తన పలకరింతతో, స్పర్శతో ఆమెను ఆక్రమిస్తూ, వ్యాపిస్తూ, మనసును అలజడిగా, ప్రజ్వలితంగా చేస్తోంది.
ఇక ఆగలేక – ధైర్యం తెచ్చుకొని, అతనితో మాట్లాడాలని కాల్‌ చేసింది.
‘హాలో….’ అంది విమలమ్మ
ఒక్కక్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు చైత్రికకి… వెంటనే ”ద్రోణ వర్షిత్‌ గారున్నారా?” అంది చైత్రిక.
”ఒక్క నిముషం లైన్లో వుండమ్మా!” అంటూ అప్పుడే నిద్రలేచిన ద్రోణ దగ్గరకి సెల్‌ తీసికెళ్లి ఇచ్చింది విమలమ్మ. అతను సెల్‌ తీసుకొని ‘హాలో’ అనే లోపలే భయంతో కాల్‌ కట్ చేసింది చైత్రిక.
అతను బెడ్‌ చివరకి జరిగి బోర్లా పడుకొని నేలమీద మొబైల్‌ పెట్టి నెంబర్లు నొక్కుతూ మెసేజ్‌లు చూస్తున్నాడు.
అతను పడుకున్న తీరు ఎంత నిర్లక్ష్యంగా వున్నా, ఒత్తైన క్రాపు, గుండ్రి బలమైన భుజాలు యవ్వన శోభను ప్రస్ఫుటం చేస్తున్నాయి.
కొడుకును లేపటం కష్టంగా వుంది విమలమ్మకి. నిద్రలేచినా మళ్లీ పడుకుంటున్నాడు. తిండీ, నీళ్లు ముట్టుకోడు. కాలిపోయిన బొమ్మల్నే గుర్తుతెచ్చుకుంటున్నాడు. బయట ప్రపంచానికి దూరమయ్యాడు. మళ్లీ కుంచె పట్టలేదు.
”లే! నాన్నా! టైమంతా నిద్రలో గడిపేస్తే నీకంటూ టైమేముంటుంది?” అంది కొడుకు తల నిమురుతూ విమలమ్మ.
ద్రోణ ఒకరకంగా నవ్వి… ”నాకిప్పుడు టైమెందుకమ్మా? ఒకప్పుడు ఆ టైం కోసం… అంటే! నాకంటూ కొంత టైం కావాలని, నాదైన ప్రపంచంలో నేనుండాలని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవాలని, ఇంట్లోవాళ్లు, మిగతా ప్రపంచం నిద్రలేవక ముందే లేచి బోర్డు ముందు నిలబడి అలౌకిక స్థితిలోకి వెళ్లి, నాకంటూ ఓ శైలిని సంపాయించుకొని బొమ్మల్ని గీసేవాడిని… అలా నా సుదీర్ఘ కఠోర శ్రమ చివరికి నాకేం మిగల్చిందో చూశావుగా…! ఇంకా నాకెందుకీ టైం…?” అన్నాడు.
”అలా అనకు ద్రోణా! పోయినదాన్ని తిరిగి సంపాయించుకో!” అంది విమలమ్మ.
”అది ఒక్కరోజులో ఒక్కరాత్రిలో వచ్చేదికాదు. అయినా నాకు జరిగిన లాస్‌ గురించి మీరెవరు మాట్లాడలేదు. ఎందుకంటే శృతిక నీకు కోడలు కన్నా ముందు నీ అన్నకూతురు. దేన్నైనా కడుపులో పెట్టుకోటానికే ప్రయత్నిస్తారు.” అన్నాడు నిష్ఠూరంగా.
కొడుకు మాటలకి బాధపడ్తూ… ”బూడిద గురించి ఎంత మాట్లాడి ఏం ప్రయోజనం ద్రోణా! ఒక్కోసారి అనుకోకుండా వచ్చే నష్టంలాంటిదే ఇది. కడుపులో పెట్టుకోక తప్పదు. మన వేలు, మన కన్ను పొడుచుకుంటే మన కన్నే పోతుంది.” అంది విమలమ్మ.
”సరే! అమ్మా! నేను మామూలు మనిషిని కావాలంటే నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నన్నిలా ఒంటరిగా వదిలెయ్యి…” అన్నాడు.
కొడుకు గదిలోంచి నెమ్మదిగా కదిలి హాల్లోకి వచ్చి కూర్చుంది.
*****
బాగా ఆలోచించి శృతిక తండ్రి నరేంద్రనాధ్‌కి ఫోన్‌ చేసింది విమలమ్మ.
”అన్నయ్యా! శృతికను పంపు…! ఇంకా ఎన్ని రోజులు వుంచుకుంటారు?” అంది విమలమ్మ కోపంగా. కోపమేకాదు. ఏడుపుకూడా వస్తుందామెకు.
”వస్తుందిలేమ్మా! తొందరేముంది?” అన్నాడు చాలా ప్రశాంతంగా.
”ఇంకెప్పుడు? చెరొకచోట వుండటానికా మనం పెళ్లి చేసింది. కలిసివుంటేనే కదా కష్టాన్నైనా, సుఖాన్నైనా భరించే శక్తివస్తుంది? ఇలా వుంటే ఒకరికొకరు ఎలా అర్థమవుతారు?” అంది.
ఆ మాటకి ఆశ్చర్యపోతూ…”ఇంకా అర్థం చేసుకునే స్థితిలోనే వున్నారా వాళ్లు? ” అన్నాడు.
”జీవితాన్ని పూర్తిగా చూసిన వృద్ధదంపతులు కూడా మనసులు కలవక ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతకానికి ప్రయత్నిస్తుంటే వాళ్లకేం వయసుందని అన్నయ్యా? మన కళ్లముందు పుట్టారు. నెమ్మదిగా అర్థం చేసుకుంటార్లే… మనం చూస్తూనే వున్నాంగా…! పుట్టాక.. కొంతమంది పిల్లలు త్వరగా నడవలేరు. మాట్లాడలేరు. వీళ్లుకూడా ఆ కోవకు చెందినవాళ్లే…” అంది.
నరేంద్రనాధ్‌ మాట్లాడలేదు. ఆలోచిస్తున్నాడు.
”శృతికకి ఫోనివ్వు అన్నయ్యా! మాట్లాడతాను.” అంది
”అది ఇంట్లో లేదు విమలా! మీరు చిన్నప్పుడు మన ఇంటి వెనక రింగ్‌బాల్‌ ఆడే స్థలంలో తన ఫ్రెండ్స్‌తో కూర్చుని పాటలగేమ్‌ లాగా మాటలగేమ్‌ ఆడుతూ బిజీగా వుంది… దాని సెల్‌కి చెయ్‌!” అన్నాడు. ఆడపిల్లల్ని ప్రేమించే తండ్రుల్లో అతడొకడు.
వెంటనే శృతిక సెల్‌కి కాల్‌ చేసింది విమలమ్మ.
”ఒక్క నిముషం మీరుండండే… మా అత్తయ్య కాల్‌ చేస్తోంది మాట్లాడి వస్తాను.” అంటూ పక్కకెళ్లి…
”హాలో! అత్తయ్యా! బాగున్నావా?” అంది శృతిక.
”నేను బాగున్నాను. నువ్వెలా వున్నావ్‌?” అంది విమలమ్మ.
”నేను బాగున్నాను అత్తయ్యా!”
”ఇక్కడ నా కొడుకే బాగలేడు.”
”అది ఆయన చేసుకున్నదే!”
”నువ్వు చేసిందేం లేదా?”
”నేను చేసిన దానికన్నా ఆయన నాకు చేసిందే ఎక్కువ. ఒక్కరోజు కూడా ఆయన దగ్గర నేను మనశ్శాంతిగా లేను. నాగురించి ఆలోచించరేం. అత్తయ్యా! పెళ్లికి ముందు నేను స్పీడుగా వున్న మాట వాస్తవమే. పెళ్లయ్యాక పొంగిపోయే పాలు, మాడిపోతున్న పప్పే జీవితంలా మారాను. అర్థం చేసుకోరేం?” అంది శృతిక.
ఓ నిట్టూర్పు వదిలి ”నీకు భర్త విలువ తెలుసా శృతీ?” అంది విమలమ్మ.
”ఎందుకు తెలియదు. నా భర్త చిటికేస్తే నౌకర్లు పరిగెత్తుకుంటూ రావాలని, ఆయన ఎక్కడికెళ్లినా రెడ్‌కార్పెట్ స్వాగతాలు ఎదురవ్వాలని, ప్రతిరోజు అంతర్జాతీయ స్థాయి చర్చల్లో ఆయన మునిగి వుండాలని నేను కోరుకోవటం లేదు. నా స్థాయి విలువల్లోనే నా భర్తను చూడాలనుకుంటున్నాను. ” అంది శృతిక.
”నువ్వు నాకు అర్థం కావటంలేదు శృతీ!” అంది
”ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది అత్తయ్యా! మొదటినుండి నేను చెబుతూనే వున్నాను. ఆయన లోకం ఆయనదే నా మాట వినరని… అయినా మీరు పట్టించుకోవటం లేదు. ఆయనేం చిన్నపిల్లవాడు కాదుగా ఓ కన్నేసి వుండానికి… ”నేను మీ అభిమానిని” అని ఏ అమ్మాయి పిలిచినా వెళ్తాడు. ఇంట్లో వున్నంతసేపు ఒకటే ఫోన్‌ కాల్స్‌…! ఏ అమ్మాయి భరిస్తుంది. అత్తయ్యా ఇలాంటి భర్తని? మీరే చెప్పండి!” అంది శృతిక.
”ఎవరి ప్రొపెషన్లో వాళ్లకి పరిచయాలు, స్నేహాలు వుంటాయి. అంతమాత్రాన అనుమానించాలా? మీ మామగారు ఉమెన్స్‌ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎందరో అమ్మాయిలు ఇంటికి వస్తుండేవాళ్లు. డౌట్స్ క్లారిఫై చేసుకొని వెళ్లేవాళ్లు. నేనెప్పుడైనా నీలాగ మా పుట్టింటికి వెళ్లానేమో మీ నాన్నని, అమ్మని అడుగు. ఒకవేళ వెళ్లినా ఆయనతో కలిసి వెళ్లి వచ్చేదాన్ని… నీలాగ వెళ్లేదాన్ని కాదు.” అంది విమలమ్మ.
”నాలాగ వెళ్లటం అప్పట్లో మీకు రాలేదు. పుట్టింటిని ఎలా యూజ్‌ చేసుకోవాలో తెలియలేదు. అక్కడే వుండి అన్ని బాధలు పడ్డారు. నాకేంటి నీలాగ అడ్జస్ట్‌ కావలసిన అవసరం? మా అమ్మా, నాన్నవున్నారు. నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. అది చాలు నాకు…” అంది.
”చూడు శృతీ! నిన్ను ఒకరు ప్రేమగా చూడాల్సిన వయస్సు కాదు నీది. నువ్వొకర్ని చూడాల్సిన వయసులో వున్నావు. ఇక్కడ నీ ఇల్లు, నీ బాధ్యతలు వున్నాయి. వచ్చి వాటిని చూసుకో…” అంది.
”నేను రాను…” అంది కచ్చితంగా
”నా కొడుకు బాధలో వున్నాడు. నువ్వొచ్చి ఆ బాధలోంచి వాడ్ని బయటకు తీసుకురా! అది నీ బాధ్యత. బాధలు ఎప్పుడూ వుండవు. అవి వున్నప్పుడే మనిషి అవసరం ఎంతగానో వుంటుంది. ముఖ్యంగా మనవాళ్లని మనం చూసుకోవటం కనీస ధర్మం. ద్రోణ నీ భర్త – పరాయివాడు కాదు. పంతాలకు ఇది సమయం కూడా కాదు.” అంది విమలమ్మ.
‘నాకు రావాలని లేదు.”
”ఎందుకు లేదు. ఎప్పుడు చూసినా – నేనూ, నా సమస్య, నా అనుమానం ఇదేనా నీకు కావలసింది? ఇంకేం అక్కర్లేదా? భర్త కావాలని అనిపించదా?”
”అనిపిస్తుంది. అది నాకు తగినది కాదనిపించి దూరంగా వున్నాను.”
”నువ్వు తప్పు చేస్తున్నావు శృతికా!”
”తప్పు తెలుసుకున్నాను అత్తయ్యా!”
”కాదు … పెద్దదానిగా నామాటలు నేను చెబుతున్నాను విను. జీవితంలో ఎన్నో విషమ పరిణామాలు వుంటాయి. తట్టుకోవాలి. చెప్పినా వినలేని భయంకరమైన అలవాట్లు, స్వార్థాలు, ఆత్మవంచనలు వుాంయి. అవన్నీ వుంటేనే జీవితం… ఇవిలేని జీవితాలు ఎక్కడా వుండవు. కానీ ద్రోణ మంచివాడు. అది నీ అదృష్టం చేయిజారనీయకు…” అంటూ కాల్‌ కట్ చేసింది విమలమ్మ.
ఆమెకు తన కొడుకు జీవితం ఇలా అయినందుకు బాధగావుంది. పైకి ఎంత సున్నితంగా అన్పిస్తుందో అంత కఠినమైన సమస్య ఇది.
*****
ద్రోణ మొబైల్‌లో ఇంకా కొన్ని కొత్త మెసేజ్‌లు యాడై ‘నన్ను చూడు..’ అన్నట్లు సౌండ్‌ చేస్తూ వచ్చి చేరుతున్నాయి.
ఆసక్తిలేకపోయినా మొబైల్‌ అందుకొని చూస్తున్నాడు ద్రోణ.
అవి కూడా చైత్రిక పేరుతోనే వున్నాయి.
‘చైత్రిక! చైత్రిక! చైత్రిక! ఎవరీ చైత్రిక? ఇంత ఫీలింగ్‌తో, ఇంత డైరెక్ట్‌గా ఎలా సెండ్‌ చెయ్యగలుగుతోంది? ప్రేమిస్తుందా? తను పెండ్లైనవాడినని తెలియదా?

ఇంకా వుంది…

1 thought on “రెండో జీవితం – 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *