April 26, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 32

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

“బాలస్తావత్‌ క్రీడాసక్తః – తరుణస్తావత్‌ తరుణీ సక్తః – వృద్ధస్తావత్‌ చింతాసక్తః – పరమే బ్రహ్మణి కో పినసక్తః” ఈ దేహాన్ని గురించి, దాని యదార్థ తత్వాన్ని గురించి తెలుసుకోలేని సామాన్యులు జీవితాన్ని ఎలా వ్యర్థం చేసుకుంటున్నారో ఆది శంకరులు తెలిపిన శ్లోకమిది. ‘మోహముద్గరం’ గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లోని ఏడో శ్లోకం యిది. మానవుడు.. బాల్యంలో ఆటపాటల మీద ఆసక్తితో ఉంటాడు. యౌవనంలో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాప్యంలో చింతలతో సతమతమౌతుంటాడు. అంతే తప్ప.. పరమోత్కృష్టమైన మానవ జన్మ లభించినా ఆ పరమాత్మ యందు ఆసక్తి చూపేవారెవరూ ఉండరుగదా అని దీని అర్థం. అలాగే అన్నమయ్య “మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను” అంటాడు ఈ కీర్తనలో. ప్రతి ఒక్కరి తపనా, తాపత్రయం ఆనందంగా బతికేందుకే.. జీవితమంతా ఆనందంగా ఏలోటు లేకుండా కష్టాలు రాకుండా బతకాలనే అందరూ కోరుకుంటారు. కాని అందరికీ అనుకున్నట్టుగా అన్ని సమకూరి ఆనందంగా ఉండటం అంటే జరగనిపని. అందుకే తమకు దక్కని వాటిపై దేనికైనా రాసిపెట్టి ఉండాలి, అదృష్టం ఉండాలి అని సరిపెట్టుకుంటుంటారు. కాని అదంతా కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నదని తెలియక అందని వాటికే ఆరాట పడుతూ ఉంటారు. అన్నమయ్య ఆ విషయమే చెప్తున్నాడు ఈ కీర్తనలో చూడండి.

కీర్తన:
పల్లవి: బాపురే నీమాయ భ్రమయించీ జీవులకు
దాపున నున్నదేకాని దవ్వలకుఁ జొరదు

చ.1. మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను
సాక్షియై జగమిది చవి చూపఁగా
దీక్షకుఁ జొరదు మరి దేవ నీపై భక్తి లేదు
దక్షులై యాలుబిడ్డలు దండనుండఁగాను॥బాపు॥

చ.2. జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన
నానాయోనులమేను ననిచుండఁగా
ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక
కానఁబడ కర్మములు గాసిఁ బెట్టఁగాను॥బాపు॥

చ.3. మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు
పంచేంద్రియములాత్మ బలిశుండఁగా
యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని
అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి॥బాపు||
(రాగం: గౌళ, సం.4.సం.25, రాగిరేకు 344-2)

విశ్లేషణ:
పల్లవి: బాపురే నీమాయ భ్రమయించీ జీవులకు
దాపున నున్నదేకాని దవ్వలకుఁ జొరదు

ఓ దేవాది దేవా! ఎంతటి మాయలలో మమ్ము ముంచి, భ్రమలకు గురిచేసి, తేలుస్తున్నావయ్యా! శ్రీనివాసా! బాపురే! నాలాంటి సామాన్యులకు ఈ మాయను జయించడం సాధ్యమేనా? అది మా వెన్నంటి నడుస్తున్నది. ఎంత ప్రయత్నించినప్పటికీ దూరంగా వెళ్ళడంలేదు. ఇక మా గతేమిటి? మమ్ము రక్షించే వారెవరు? అంటూ పరి పరి విధాల వాపోతున్నాడు అన్నమయ్య.

చ.1. మోక్షమురుచి గానదు ముందర నుండఁగాను
సాక్షియై జగమిది చవి చూపఁగా
దీక్షకుఁ జొరదు మరి దేవ నీపై భక్తి లేదు
దక్షులై యాలుబిడ్డలు దండనుండఁగాను

హాయిగా ఇహలోక సౌఖ్యాలను అనుభవించే వారికి మోక్షము యొక్క రుచి ఎలా తెలుస్తుంది. దీనిలోనే స్వర్గం ఉందనుకుంటూ చరిస్తుంటాము. భార్యవద్ద, బిడ్డలవద్దా మేము సమర్ధులము అన్ని కార్యాలను సాధించగలము అని నిరూపించుకోవడానికే మా జీవితం సరిపోతోంది. ఇక మోక్ష మార్గం త్రొక్కేదెన్నడు? మా మనసు మీ మీద దృష్టి మరల్పదు. మాయ అని తెలిసినా దానిలోనే కొట్టుమిట్టాడుతో జీవితాలను గడిపేస్తున్నాం. ఇదంతా నీ మాయ కాదా స్వామీ! చెప్పండి?

చ.2. జ్ఞానమితవు గాదు సంగడి నుండదుగాన
నానాయోనులమేను ననిచుండఁగా
ఆనకమై వైరాగ్యమంట దలవాటులేక
కానఁబడ కర్మములు గాసిఁ బెట్టఁగాను

ఋణానుబంధరూపేణా పశుపత్ని సుతాలయ: అన్నట్టు ఋణానుబంధంతో మరల మరల జన్మలెత్తుతూ ఉంటాము. మనుష్యులతో సంగడి (జతగా) జీవనం గడుపుతూ ఉంటాము. ఏ యోనికూపం లో జన్మిస్తే ఆ జీవితంపై మమకారం, ఆ జీవితంపై బ్రతకాలనే కాంక్ష తప్ప వేరొకటి కనిపించడంలేదు నాకు. జ్ఞానము, పుణ్యం వంటి మాటలు అసలు రుచించడంలేదు. అనేక కర్మ కాండల వలన మనసు బాధపడుతున్నప్పటికీ వైరాగ్యం అలవడడంలేదు. ఇదంతా కేవలం నీవు సృష్టించే మాయ కాదా స్వామీ! చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

చ.3. మంచిదని నీ తిరుమంత్రము దలఁచుకోదు
పంచేంద్రియములాత్మ బలిశుండఁగా
యెంచుకొని శ్రీవేంకటేశ నీకే శరణని
అంచల నీదాసులైతే నన్నిటా గెలిచిరి

జీవితంలో ఒక్క సారి కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ నీ తిరుమంత్రరాజమైన “ఓం నమో వేంకటేశాయ” అన్న మంత్రాన్ని ఉఛ్చరించలేకపోవడం ఏమిటి? మాయ కాదా? నా పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు.. ఆత్మను అధిగమించి ఉండడంవల్లనే ఇదంతా జరుగుతున్నదని తెలుసు. అయితే ఒకనాడు నన్ను కరుణతో చేరదీసావు. ఇప్పుడు నీవే శరణని ఆశ్రయించాను. నిన్ను గట్టిగా త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నాను. దరిజేర్చే భారం నీదే! “అంచెలంచెలు లేని మోక్షము చాల కష్టమని” నా అరిషడ్వర్గాలను ఒక్కొక్కటిగా జయించుకుంటూ వస్తున్నాను. నీ దాసులు అన్నిటినీ అధిగమించినవారు. తండ్రీ! స్వామీ! నన్నూ నీ దాసుడిగా భావించు. నాగురించి నేనే వేరుగా చెప్పుకోవడం ఎందుకు. కరుణించు. మోక్షం ప్రసాదించు అని ఆర్తిగా వేడుకుంటున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధాలు: బాపురే = ఆహా! అరెరే! అయ్య బాబో! అని ఆశ్చర్యాన్ని ప్రకటించే భావము; దాపున = దగ్గర; దవ్వల = దూరము; జొరదు = వెళ్ళదు; చవి = రుచి; దక్షులు = సమర్ధులు, అన్ని కార్యములను సక్రమంగా నిర్వర్తించగల వారు; దండ = అండదండగా నుండుట; జ్ఞానమితవు గాదు = జ్ఞానము ఇష్టపడటంలేదు; సంగడి = రెండు తాటిబొండులు ౙతగా కట్టిన తెప్ప, జత, సమీపము; గాసిబెట్టు = బాధపెట్టు; బలిశుండగా = ఆధిక్యంతో ఉండగా, వేరొక ధ్యాసను రానీకుండా ఉండడం; అంచెలు = మెట్లు, ఒక వరుసలో మోక్షమార్గాన్ని అధిరోహించడం అంచెలంచెల మోక్షము అంటారు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *