May 25, 2024

నవరసాలు..నవకథలు.. భీభత్సం 8

రచన: మంథా భానుమతి

చిట్టి చెల్లెలు

ఆదివారం. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు తీరిగ్గా పనులు చేసుకుంటున్నారు. శబ్దాలు బయటికి వినిపించకుండా తయారయి, తమ గది తలుపులు వేసి బైటికొచ్చింది పదమూడేళ్ల వినత. ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్లింది.. ఆదివారం మొక్కలకి నీళ్లుపెట్టటం వినత పని.
ఇల్లంతా దులిపి ఒక కొలిక్కి తెచ్చి, పిల్లల గది సర్దుదామని లోపలికెళ్లిన వనజ, కంఠనాళాలు పగిలిపోయేట్లు కెవ్వుమని అరిచింది.
తోటలోంచి వినత, వరండాలో కూర్చుని పేపరు చదువుతున్న వాసు, ఒకేసారి గదిలోకి వెళ్లారు.
అక్కడ పరిస్థితి భీభత్సంగా ఉంది.
వనజ, తలుపు దగ్గరే అడ్డంగా స్పృహ తప్పి పడిపోయుంది. పక్కింటి వైపుకున్న కిటికీ గ్రిల్ లోనుంచి సగం శరీరం బైటికి, సగం లోపలికి వేళ్లాడుతూ కళ్లు రెండూ బైటికి వెళ్లుకొచ్చిన పక్కవాళ్ల నల్ల పిల్లి, నాలుక బైట పెట్టి, వీళ్లకేసే చూస్తున్నట్లుగా ఉంది. కిటికీ అంతా రక్తం.. రోజూ కిటికీ లోనుంచి పిల్లల దగ్గరికి వచ్చి ఆడుకునే పిల్లి.. ఎలాగో గ్రిల్ లో ఇరుక్కుపోయినట్లుంది.
కిటికీ దగ్గర నిలబడి, చేతుల నిండా, మొహం నిండా రక్తంతో, కళ్లు పెద్దవి చేసి చూస్తోంది ఏడేళ్ల సరిత. బుగ్గల నిండా నీళ్లు. ఎప్పటి నుంచీ ఏడుస్తోందో!
అదాటుగా చూస్తే బలహీనులకి గుడె నొప్పి రావటం ఖాయం.
అది పిల్లల గది.. రెండు సింగిల్ మంచాలు చెరో గోడకీ వేసి ఉన్నాయి.
వినత అరుస్తూ చెల్లెలి దగ్గరికి వెళ్లబోగా, తల అడ్డంగా తిప్పి,వెనక్కి వెనక్కి జరుగుతూ కళ్లు ఇంకా పెద్దవి చేసి మొహం వికృతంగా పెట్టింది సరిత. అయినా సరే, వెళ్లి చెల్లెల్ని పట్టుకోబోయింది.
వాసు గట్టిగా నిట్టూర్చాడు, సరిత మొహంలోకి చూసి..
“వినతా! నువ్వు అటెళ్లకు.బకెట్లో నీళ్లు, తువ్వాలు తీసుకురా!” వాసు హెచ్చరించి, భార్యని లేపి, హాల్లోకి నడిపించాడు. వనజ మొహం మీద నీళ్లు కొట్టి, వేడిగా పాలు తాగించి సోఫాలో దిళ్లు సరిచేసి పడుక్కోబట్టాడు.
కళ్ల నీళ్లు కారుస్తూ, వనజ దీనంగా చూసింది.
సరితని బాత్ రూం లోకి తీసుకెళ్లి కడిగి స్నానం చేయించి బట్టలేసి, హాల్లో కూర్చోపెట్టాడు.
పక్కింటావిడని పిలిచి, యాక్సిడెంటని చెప్పి, అప్పుడే వచ్చిన పనమ్మాయి చేత, కిటికీ దగ్గరంతా శుభ్రం చేయించేసరికి తాతలు దిగొచ్చారు. వాసు సరితని తయారు చేస్తున్నప్పుడే, వినత, కిటికీ వెనక్కి వెళ్లి అక్కడున్న ఇనప రాడ్ ని ఎవరికీ కనిపించకుండా విసిరేసింది.
……………
మరునాడు పొద్దున్న.. పనిమనిషి రాలేదు..చీపురు పట్టుకుని హాల్ ఊడుస్తోంది వనజ.
గోడ మూల ఒకచోట.. పాతగుడ్డలో చుట్టి..అటూ ఇటూ కదులుతున్న మూట కనిపించింది..
భయపడుతూనే విప్పింది.
పచ్చడైపోయిన బొద్దెంకలు.. కొన్ని బ్రతికున్నవి బిలబిల్లాడుతూ బైటికొస్తుంటే.. వాంతొచ్చినంత పనైంది. కెవ్వుమని అరిచి, చీపురు కింద పడేసి, లోపలికి పరుగెత్తింది…..
వాసు గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టి మంచి నీళ్లు తాగించాడు. గట్టిగా హత్తుకుని పోయి, వెక్కుతూ ఉండిపోయింది.
వినత ఆ మూట చెత్తబుట్టలో పడేసి, హాల్ తుడిచి, తను తయారయి స్కూల్ కి వెళ్ళి పోయింది.
…………
“సిరీ అని పిలుచుకుందామని, వినూకి మంచి తోడుంటుందని ఎంతో సంతోషంగా, సరితని కన్నాము వాసూ. అది పుట్టిన పది నెలలు ఏం బాగుందో! అప్పటి నుంచీ మన పాట్లు మొదలయ్యాయి. ఆ ఉయ్యాల్లోంచి ఎలా పడిపోయిందో.. పైకి దెబ్బ కనిపించలేదు. గట్టిగా ఏడవను కూడా లేదు. ఇంక అంతే. మన బతుకే మారి పోయింది. మాటలు రాలేదు. పిచ్చి బలం. మిడిగుడ్లేసుకుని చూట్టం.. ఎలా వస్తాయో ఆ పిచ్చి ఐడియాలు.. పిచ్చి అల్లరి.” పగలంతా నిస్త్రాణగా పడుకుని,సాయంత్రం మొదలు పెట్టింది బొంగురు గొంతుతో వనజ.
స్కూల్నుంచి వచ్చాక తనే పాలు తీసుకుని తాగటం మొదలెట్టింది వినత. అమ్మ, నాన్నా మాట్లాడుకోవటం వినిపిస్తూనే ఉంది. రోజూ అలవాటై పోయింది.
“అవును. సరిత మనింట్లోకి రాకపోతే ఏ గొడవా ఉండేది కాదు..” వినత తనలో తను అనుకుంటూ తమ గదిలోకి వెళ్లింది సరిత ఏంచేస్తోందో చూట్టానికి.
అమ్మానాన్నల ఆక్రోశాలు వినిపిస్తూనే ఉన్నాయి. సరిత, తెల్ల కాగితం మీద ఏవో గీతలు గిలుకుతోంది. ఏంటో.. పిచ్చిగీతలు, చూద్దామని దగ్గరగా వెళ్లిన వినతకి అందకుండా ముక్కలు చేసేసింది. ఆ ముక్కలేరేసి, తను అనుకున్నట్లుగా గదిని తయారు చేసి, ఫ్రెండింటికెళ్లింది, హోం వర్క్ చేసుకోడానికి.
చెవులు వినిపించకపోయినా, మాటలు రాకపోయినా తెలివికేం లోటు లేదు.. సరితకి. ఎంతమంది డాక్టర్లకి చూపించారో! అంతుబట్టని సమస్య. మానసికం అని తేల్చారు.
అక్క చేస్తున్నదంతా చూస్తూనే ఉంది సరిత.. లేచి తనకు చేతనయినంత సర్ది పెడదామని కింద కూచుని సవరించ సాగింది.
అంతలో.. తలుపు తోసుకుని వచ్చిన అమ్మని చూసి, తల అడ్డంగా తిప్పుతూ, గబగబా మంచం ఎక్కేసింది, ఏడుస్తూ.
గదంతా భీభత్సంగా ఉంది. పుస్తకాలన్నీ చిందరవందరగా పడున్నాయి. వినత తెచ్చుకున్న ఎర్రని నైల్ పాలిష్ గది మధ్యలో వంపేసి ఉంది. మడతపెట్టిన బట్టలు చిమ్మేసి ఉన్నాయి. గదంతా పౌడర్ చల్లేసి ఉంది. ఎక్కడ జారి పడతానో నని వెనక్కి వెళ్లి పోయింది వనజ. సరితనేమీ అనలేదు. అనటానికి మాటలే రాలేదు.
…………………
“ఊరుకో వనజా! రేపు హోమ్ కి పంపించేద్దాం. అక్కడేమో బాగానే ఉంటుందిట.
విచిత్రంగా ఉంది మీ అమ్మాయి కేసు అంటారు డాక్టర్లు.”
“ఇక్కడున్నప్పుడు కూడా మొదటి రెండురోజులూ బానే ఉంటుంది. చక్కగా నా వెనుకే తిరుగుతూ, గిన్నెలవీ అందిస్తూ ఉంటుంది. కనిపించకుండా చేసేస్తుంటుంది విధ్వంసం. మొన్నటికి మొన్న.. గోధుమ పిండి కలిపి చపాతీలు చేద్దామని అంతా సర్ది, ఫోన్ వస్తే లోపలికి వెళ్లాను. ఎప్పుడెళ్లిందో.. నూనె సీసా ఆంతా పిండి నిండా వంపేసి, పక్కనే కూరలో వేద్దామని పెట్టిన కారప్పొడి సీసాలో కారం ఇల్లంతా చిందరవందర చేసేసింది. ఒళ్లు మండి నాలుగు తగిలించాను. గుడ్లలోంచి నీళ్లు కారుస్తుంది తప్ప, ఏ స్పందనా లేదు. రాయిలా నిలుచుంటుంది.” వనజ గొంతు కొరబోయింది, ఏడుపుతో.
“అదే ఆశ్చర్యంగా ఉంది.. హోంలో నేమో ఏమీ చెయ్యదుట. చిన్న చితకా పనులన్నీ చక్కగా చేస్తుందిట. కానీ అక్షరాలు నేర్చుకోమంటే మటుకు మొరాయిస్తుందిట. అందుకే మీ అమ్మాయిని తీసుకుపొండి..”షి ఈజ్ నార్మల్” అంటుంటారు. ఇక్కడేమో ఎప్పుడెవరికి మూడుతుందో తెలీట్లేదు. చివరికి తను కూడా రక్తాలొచ్చేట్లు కోసుకోడం..” వాసు విచారంగా అన్నాడు.
“మళ్లీ అక్క జోలికి వెళ్లదు. అదేం పిల్లో.. చుట్టుపక్కల వాళ్ల పిల్లలెవరైనా ఇంటికోస్తే, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని, అక్కడే ఉంటాను. ఎవర్నేం చేస్తుందో అని.. ఒక్క సారి వదిలేస్తే, వెనకనుంచి కళ్లు మూసి, ఎదురింటి బుజ్జిగాడి మెడ కొరికిందిట. అప్పుడే.. వినత వెళ్లి విడిపించిందిట.”
అమ్మానాన్నల మాటలు వింటూ వినత నిద్రపోయింది. సరిత అంతకు ముందే పడుకుంది.
“సరే! రేపు హోమ్ కి ఫోన్ చేసి దింపేద్దాం. లేకపోతే, వినూకి పిచ్చెక్కిపోయేలాగుంది. దానికేమో చెల్లెలంటే చచ్చేంత ప్రేమ. ‘హోమ్ కి పంపద్దమ్మా. నేను జాగ్రత్తగా చూసుకుంటా చెల్లిని’ అంటుంది.” వాసు లేచెళ్లి, కూతుళ్లిద్దరి తలలూ నిమిరి, మంచినీళ్లు తాగొచ్చి పడుక్కున్నాడు. సరిత చిన్నగా కదిలింది. ఒంగుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిద్దట్లోనే చిన్నగా నవ్వింది సరిత. కడుపులో పేగులు కదిలినట్లయింది.
“ఏం చేస్తాం.. ఇందాకా పక్కింటావిడని ఊరుకోబెట్టే సరికి తాతలు దిగొచ్చారు. తప్పదు. ఆవిడ ఎంత జుగుప్సాకరంగా చూసిందో!” వాసు ఆలోచన చదివినట్లుగా అంది వనజ.
గట్టిగా నిటూర్చి, కళ్లు మూసుకుని పడుక్కోడానికి ప్రయత్నించాడు వాసు.
…………………..
పేరు పొందిన పిల్లల సైకియాట్రిస్ట్ ఊర్లోకి వచ్చాడని ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు వాసుకి. ఒక్కసారి ఆయనకి చూపించమని బలవంత పెట్టాడు.
“పిల్లలిద్దరినీ తీసుకురండి. మీ పెద్దమ్మాయిని కూడా.. ఇద్దరికీ చెప్పకుండా తీసుకురండి.” ఆ ఆదివారం అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే వివరాలన్నీ కనుక్కుని ఆ డాక్టర్ చెప్పాడు.
సరితని తయారు చేసి, వినతకి బైటికెళ్తున్నాం, తయారవమని చెప్పి, ఇద్దరూ చెరో బాత్ రూం లోకీ వెళ్లారు వనజ, వాసు.
“అయ్యో.. సబ్బైపోయిందే. పిల్లల గదిలో ఉండాలొకటి.” అనుకుంటూ బాత్రూంలోంచి బైటికొచ్చిన వనజ, పిల్లల గది తలుపు చటుక్కున తీసి.. అలాగే తలుపులు పట్టుకుని నిర్ఘాంతపోయి నిలుచుండి పోయింది.
…………………..
ఉప సంహారంః
సైకియాట్రిస్ట్ ఎదురుగా కూర్చున్నారు, వాసు, వనజ, సరిత.
“సో.. సమస్య పెద్దమ్మాయి. ఇప్పుడు అర్ధమయింది కదా! అందుకే ఇద్దరినీ తీసుకురమ్మన్నా.” డాక్టర్ గారు తన దగ్గరున్న నోట్స్ తిరగేస్తూ అన్నారు.
వనజ ఇంకా షాక్ లోనే ఉండిపోయింది.
“ఐతే ఏంటి? మొదట్నుంచీ నేనే చేశానంటావా? చెల్లిని నేనే కావలసి పడేశానా ఉయ్యాల్లోంచి? చెల్లి ఇంట్లో ఉన్నంతసేపూ అయినవన్నీ నేనే చేశానా? మొన్నా పిల్లిని కూడా నేనే రాడ్ పట్టుకుని కొట్టానంటావా? చెల్లిని భయపెట్టి మాటలు రాకుండా చేశానంటావా? అది నా చిట్టిచెల్లెలమ్మా!” పొద్దున్న తలుపుతీసిన వనజ, గదంతా భీభత్సంగా చిందరవందర చేస్తున్న వినతనీ, నోట్లో వేలేసుకుని, మంచం మీద కూర్చుని చూస్తున్న సరితని చూసి మ్రాన్పడి నిలబడి పోయినప్పుడు, వినత కూడా షాక్ తిని, వెంటనే అరచిన అరుపులు, ఇంకా చెవుల్లో గింగురుమటూనే ఉన్నాయి.
“ఇది రేర్ గా నైనా, అక్కడక్కడ కనిపిస్తూ ఉండే సమస్యే. ఆధునిక జీవనంలో ఒక్కరూ లేక ఇద్దరూ అనే కాంసెప్ట్.. చెల్లో తమ్ముడూ వస్తే, అమ్మానాన్నా సరిగ్గా చూడరేమోననే అభద్రతాభావం.. ఫస్ట్ చైల్డ్ ని సైకో కింద మారుస్తోంది. మీ అమ్మాయి కేసులో.. మొదట్లోనే కనిపెడితే కాస్త సులభమయ్యేది. అటువంటి పిల్లలకి కొంచెం కూడా అనుమానం రాకుండా వ్యవహరించే తెలివి బాగా ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చిన్నమ్మాయికే ప్రాబ్లం లేదు. నార్మల్ చైల్డ్. ఆ భయం పోగొడితే.. మాటలు కూడా వచ్చే అవకాశం ఉంది.” డాక్టర్ గారు అంతా వివరించారు.
“మరి వినత.” గొంతు కొరబోయి.. మాట కంఠంలోనే ఉండిపోయింది వాసుకి.
“ఆ పాపకి కూడా కొంత మందులతో, కొంత కౌన్సిలింగ్ తో నయమైపోతుంది. ముఖ్యంగా మీరిద్దరూ, తనకి ఏమీ జరగదనే ధైర్యం ఇవ్వాలి. వారానికి రెండు సార్లు కౌన్సిలింగ్ కి తీసుకురండి. నేను ఇక్కడ రెండు నెలలుంటాను. ఆ లోగా బాగా గుణం కనిపించవచ్చు. మీ ఇద్దరిలో ఎవరితో క్లోజ్ గా ఉంటుంది తను?”
“వాళ్లమ్మతో.”
“ఐతే.. ఇద్దరూ మీ మీ రూమ్స్ లోకి చెరొక పాపనీ మార్చండి. మీ ప్రేమంతా రంగరించి వాళ్లని నార్మల్ పాపలుగా మార్చచ్చు.. అండర్ మై గైడెన్స్.”
******

1 thought on “నవరసాలు..నవకథలు.. భీభత్సం 8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *