May 25, 2024

నవరసాలు..నవకథలు.. వీర 4

రచన: జ్యోతి వలబోజు

ధైర్యం.

రాత్రి తొమ్మిదిన్నర అవుతోంది. భాస్కర్ తన దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు.
ఇంట్లోకి రాగానే కూతుళ్లిద్దరూ మొహాలు మాడ్చుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటూ కనపడ్డారు.
అమ్మానాన్నలు అప్పుటికే నిద్రపోయినట్టున్నారు. వాళ్ల రూమ్ తలుపు దగ్గరగా వేసుంది.
చెప్పులు విప్పి తన రూమ్ లోకి వెళ్తున్న భాస్కర్ ని చూసి “నాన్నా!” అరిచినట్టుగా పిలిచారు పిల్లలిద్దరూ.
“ఏంట్రా బంగారం? తినండి. నేను స్నానం చేసి వస్తాను.” అన్నాడు ప్రేమగా.
“అదంతా మాకు తెలీదు. ముందిలా రండి.” అని గట్టిగా అరిచారు.
ఇదేదో చాలా సీరియస్ వ్యవహారంగా ఉందని వెళ్లి వాళ్లకెదురు కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్.
“నాన్నా!.. అమ్మ చూసావా.. నాలుగు రోజులనుండి అమ్మ టమాట తప్ప వేరే వండడం లేదు. టమాటా పప్పు, టమాటా చారు, టమాటా చట్నీ.. వేరే కూరగాయలు చేయమంటే లేవంటుంది. ఆమ్లెట్ వేయమంటే ఎగ్స్ లేవంటోంది. నాన్నగారు తెచ్చాక అన్నీ వండిపెడతా అంటోంది” అని కోపంగా , ఉక్రోషంతో చెప్పారు.
“అవునా అమ్మలూ.. శ్యామలా ఇలా రా. ఏం జరిగింది? పిల్లలు అడిగినవి ఎందుకు చేయడం లేదు. కూరగాయలు తెచ్చిపెట్టా కదా!” కాస్త గట్టిగానే అడిగాడు వంటింట్లోనుండి వచ్చిన భార్యని.
“చాలా ఖరీదున్నాయని మీరే కదా రెండు రకాల కూరగాయలు, చవగ్గా ఉన్నాయని రెండు కిలోల టమాటాలు తెచ్చారు. గుడ్లు కూడా అయిపోయాయి. రెండు రోజులనుండి మీతో చెప్తూనే ఉన్నాను. మీరేమో లేటుగా వస్తున్నారు. ఎవరు తెస్తారు మరి. నేనేం చేయను?”
“ఏం చేయను అంటే అన్నీ నేనే తేవాలా? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు. బయటకు వెళ్లి కావలసినవి తెచ్చుకోవచ్చుగా. ఆమాత్రం తెలివితేటలు లేవా? ఎప్పుడు చూసినా ఇంట్లోనే పడుంటావు. అన్నీ తెచ్చి పెడితే వంట చేస్తానంటావు. ఒక్కటీ సొంతంగా చేయలేవు. తెలీదు. భయం అంటావు. ఎలా చచ్చేది నీతో? తల పట్టుకున్నాడు భాస్కర్.
శ్యామలకి ఏం చెప్పాలో తెలీక భయంగా, మౌనంగా నిలబడింది.
ఇందులో తన తప్పేమీ లేదు. ఒక్కతే కూతురని, ఆడపిల్ల అని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలు బయటకు వెళ్లరాదు. సేఫ్ కాదు అని అడగకుండానే అన్నీ అమర్చేవాడు తండ్రి. బయట పని ఏదున్నా కొడుకులను పంపించేవాడు. అలా ఇంటిని దాటి బయటకు వెళ్లడం అలవాటు లేదు. ఏదైనా కావాలంటే తల్లిని వెంట తీసుకుని వెళ్లడమే.
పెళ్లయ్యాక కూడా తను మారలేదు. భర్త కూడా ఆమెని అలాగే వుండనిచ్చాడు. ఇంట్లోకి కావలసిన సామాన్లు, బట్టలు కూడా తనే తీసుకొచ్చేవాడు. లేదా అందరూ కలిసి వెళ్లి షాపింగ్ చేసేవాళ్లు. ఎప్పుడూ ఒంటరిగా బయటకు వెళ్లలేదు. అలా వెళ్లాలంటే కూడా భయం ఆమెకు.
ఆడపిల్లలు కాస్త పెద్దయ్యారు కాబట్టి తమకు కావలసినవి తెచ్చుకునేవారు కాని ఇంటికి సంబంధించిన పనులు మాత్రం భాస్కరే చేయాల్సి వచ్చేది. తండ్రి కూడా పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయనను బయటకు పంపలేడు.
అప్పుడప్పుడు ఇలా అవస్ధలు పడ్డా కూడా శ్యామల తన భయాన్ని పిరికితనాన్ని వీడలేదు. తనకు ఇంటిపని, వంటపని , పిల్లలు, భర్త , అత్తమామలకు కావలసినవి చేసిపెట్టడం మాత్రం వస్తే చాలనుకునేది. ఇంటర్ వరకు చదివినా కూడా వంటరిగా ఇంటిగడప దాటలేదు. ఇంటి పనయ్యాక ఇంట్లోవాళ్లు తినడానికి ఏదైనా చేసిపెట్టడం, ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం మొదలైన పనులతో ఎప్పుడూ ఖాళీగా ఉండేది కాదు.

******

ఆ రోజు ఆదివారం. సాయంత్రం ఏడు గంటలైంది.
భాస్కర్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు.
పిల్లలు తమ గదిలో చదువుకుంటున్నారు. వాళ్లకు పరీక్షలు జరుగుతున్నాయి.
తల్లిదండ్రులిద్దరూ తమ గదిలోనే ఉన్నారు.
శ్యామల రాత్రి భోజనాలకోసం వంటింట్లో బిజీగా ఉంది. అరగంటలో వంట పూర్తవుతుంది.
డోర్ బెల్ వినపడింది. భాస్కర్ వెళ్లి తలుపు తీసాడు.
వంటపనిలో నిమగ్నమై ఉన్న శ్యామల ఏదో గొడవలా వినిపించి హాల్లోకి తొంగి చూసింది.
హల్లో టీవీ నడుస్తోంది. భర్త కనపడలేదు. మరి ఈ గొడవ, ఈ శబ్దం ఎక్కడినుండి వచ్చిందని వంటింటి తలుపు దాటి వచ్చింది.
అక్కడినుండి హాలు ముందుగదిలోకి చూడగానే శ్యామల గుండె ఝల్లుమంది.
ముందుగదిలో ఇధ్దరు దొంగలు భర్తను బెదిరిస్తున్నారు. ఒకడు చేతిలో కత్తి చూపిస్తూ ఏధో అంటున్నాడు. టీవీలో వస్తోన్న సినిమా శబ్దంలో సరిగ్గా వినపడలేదు.
శ్యామల వెంటనే తేరుకుంది. మెల్లిగా శబ్దం రాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ అత్తామామల రూమ్, పిల్లల రూమ్ లకు బయటనుండి గొళ్లెం పెట్టింది.
తర్వాత వంటింట్లోకి వెళ్లి అటు ఇటూ చూసింది. ఏం చేయాలో ఆలోచించసాగింది.
తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన తప్ప ఆ సమయంలో ఆమెలో భయం తాలూకు ఛాయలు అస్సలు కనపడలేదు.
ముందుగా గాస్ ఆఫ్ చేసింది. చీర చెంగును నడుముకు దోపింది. పక్కనే ఉన్న కారం పొడి డబ్బా నుండి రెండు పిడికిళ్లలో కారం పొడి తీసుకుని వెనకాల పెట్టుకుని “ఏవండి! ఏం చేస్తున్నారు. వంట పూర్తయింది. భోజనానికి రండి”అంటూ హాల్లోనుండి ముందు రూమ్ లోకి రాబోయింది.
అప్పుడే ఆ దొంగలిద్దరు భాస్కర్ ను తోసేసి హాల్లోకి వచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ కత్తులున్నాయి. నల్ల తుమ్మ మొద్దుల్లా చూస్తేనే భయపడేలా ఉన్నారు.
భాస్కర్ భయపడ్డాడు, ఏం చేయాలో కూడా ఆలోచించే పరిస్థితిలో లేడు. కాని శ్యామల తన భయాన్ని మొహంలో కనపడనీయలేదు.
ఆ దొంగలిద్దరూ హాల్లోకి రాగానే కారంపొడి వాళ్ల కళ్లల్లో పడేలా చల్లింది. భాస్కర్ ముందుగదిలోనే పడిపోయాడు కాబట్టి అతనికి ఏం కాలేదు.
ఆ వెంటనే శ్యామల హాల్లో సోఫా పక్కన ఉన్న మామగారి చేతికర్ర తీసుకుని వాళ్లను చంపేయాలన్నంత కోపంగా, గట్టిగా అరుస్తూ చాలా ఆవేశంగా బాదసాగింది.
ఒకవైపు కళ్లల్లో మంటలు. ఒకవైపు దెబ్బలతో దొంగల ఒళ్లు హూనమవ్వసాగింది.
ఇంట్లోకి కావలసిన వస్తువులకోసం ఎంత అవసరమైనా కూడా బయటకు వెళ్లని పిరికిదైన భార్య ఇంత వీరావేశంతో ఆ దొంగలను అరుస్తూ, కొడుతూ ఉంటే కొద్దిసేపు బిత్తరపోయి చూసాడు భాస్కర్.
వెంటనే తేరుకుని కింద పడిపోయిన దొంగల కత్తులను తీసి పక్కన పెట్టి తాడు తెచ్చి శ్యామల గట్టిగా కొట్టిన దెబ్బలకు తల్లడిల్లిపోతున్న దొంగలను కట్టేసాడు.
ఇంకా ఆవేశంగా కొడుతున్న భార్యని “ఇక చాలు. శాంతించు శ్యామల” అంటూ ఒడిసి పట్టుకున్నాడు.
శ్యామల అరుపులు, దొంగల కేకలు విన్న భాస్కర్ తల్లిదండ్రులు, పిల్లలు కంగారుగా తలుపులు బాదసాగారు. కాని అవి బయటనుండి గొళ్లెం పెట్టి ఉన్నాయి.
అది విన్న భాస్కర్ వెళ్లి తలుపు తెరిచాడు.
చూస్తుండమని చెప్పి బయటకు వెళ్లి కాలనీ వాచ్ మెన్ ను, ఇరుగు పొరుగు వారిని పిల్చుకొచ్చాడు.
కళ్లనిండా కారం పడ్డ దొంగలు మంటలు భరించలేక విలవిలలాడారు. దానితోపాటు శ్యామల ఆవేశంగా, గట్టిగా కొట్టిన దెబ్బల మంటలు వేరే.
ఇల్లంతా కారం. చేతిలో కర్రతో ఆవేశంగా రొప్పుతున్న శ్యామలను చూసి పిల్లలు, అత్తామామలు హతాశులయ్యారు.
నిజంగా తమ తల్లేనా అని నమ్మలేకుండా ఉన్నారు పిల్లలు. దొంగలను పోలీసులు పట్టుకెళ్లారు. తర్వాత తెలిసిందేంటంటే వాళ్లు పాత దొంగలు, హంతకులు కూడా అని. వాళ్లని పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటించారంట. అది శ్యామలకే అందిస్తామని పోలీసులు చెప్పి వెళ్లారు.
ఆ తర్వాత భాస్కర్ ఇంటిపనులు, బయటపనులు కూడా శ్యామలే ఒంటరిగా చేసుకునేలా వెంట తిప్పి, చూపించి అన్నీ నేర్పించాడు.

ఆడది ఎంత పిరికిదైనా, భయం ఉన్నా, ఏమీ తెలీకున్నా తన కుటుంబానికి, పిల్లలకు ఆపద వస్తే మాత్రం అమ్మోరు తల్లే అవుతుంది.

1 thought on “నవరసాలు..నవకథలు.. వీర 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *