June 24, 2024

నవరసాలు..నవకథలు.. హాస్యం 5

రచన: కలవల గిరిజారాణి.

జలజాపతి బదీలీ బాధలు..

ప్రతీ మూడేళ్ళకయినట్లే జలజాపతికి మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయింది. నిజామాబాద్ నుంచి విజయనగరానికి. ఇదోమూల అదోమూల.. తప్పదుగా.. తిట్టుకుంటూ.. విసుక్కుంటూ సామాను సర్దడం మొదలెట్టింది జలజం.
పైన అటకల మీద సామాను దించలేకపోతోంది.. పనిమనిషి రెండు రోజుల నుంచీ రావడం లేదు.. ప్రయాణం వారంలో పడింది.. ఎవరైనా మనిషినైనా పంపడు ఈ అయోమయం మొగుడు. చెపితే కోపం.. మొడితే ఏడుస్తాడు అన్నట్టుంటాడు.. అని తిట్టుకుంటూ జలజాపతి కి ఫోన్ చేసింది.. ” ఇదిగో.. మీ ట్రాన్స్ ఫర్ కాదు కానీ.. నేను ఛస్తున్నాను.. అస్తమానం ఈ సామాన్లు సర్దలేక.. మీరేమో ఇటుపుల్ల అటుకూడా పెట్టరు.. నేనొక్కదాన్నే చెయ్యలేకపోతున్నా.. మీరేనా తొందరగా కొంపకి రండి.. లేకపోతే కూలి మనిషినైనా మాట్లాడండి.. ఏదీ కాదంటే.. నేను మా పుట్టింటికి పోతాను.. మీరే ఇక్కడ పేకింగ్ లు చేసుకుని అక్కడ సర్దేసేక పిలవండి.. అప్పుడు వస్తాను.. ” అంటూ గయ్యిన లేచింది.
” అంత విసుగెందుకు జలజం.. సాయంత్రం మా ఆఫీసు ప్యూన్.. సల్మాన్ ఖాన్ ని తీసుకుని వస్తాను.. మేమిద్దరం కలిసి సర్దేస్తాము.. ” అన్నాడు జలజాపతి.
” సల్మాన్ ఖాన్ నే తెస్తారో.. షారూఖ్ ఖాన్ నే తెస్తారో.. నాకనవసరం.. నేను మాత్రం ఇప్పుడు ఏ సామానూ ముట్టుకోనుగాక ముట్టుకోను. అటక మీద నుంచి గంగాళం దించేసరికి నా నడుం పడిపోయింది.. లేవలేకపోతున్నాను.. వచ్చేటపుడు హొటల్ నుంచి భోజనం కూడా తీసుకురండి” అని ఆర్డరేసింది జలజం.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ప్రతీసారీ.. పాపం.. జలజమే ఓపిగ్గా సామాన్లు అన్నీ అట్టపెట్టెలకి సర్దడం.. ఏదో పెద్ద సామాన్లు అయితే మాత్రం జలజాపతి ఓ చెయ్యి వెయ్యడం అంతవరకే. లారీకి ఎక్కించేటపుడు కూడా జలజమే.. వాళ్ళకి జాగ్రత్తగా అందించేది. కొత్త ఊళ్లో కూడా.. అన్నీ తానే సర్దుకునేది..
” ఏంటి సార్.. సల్మాన్ ఖాన్ అంటున్నారూ.. ఏదైన పనుందా ?” అంటూ.. తన సిక్స్ పేక్ లనీ లెక్కపెట్టుకుంటూ వచ్చాడు ప్యూన్ సత్తయ్య.
” ఔను, కండల వీరా.. ఇంటి దగ్గర పనుంది.. సాయంత్రం నాతో పాటు రా.. సామాన్లు పేకింగ్ చెయ్యాలి..” అన్నాడు జలజాపతి.
” మనమెందుకు సార్.. కష్టపడడం.. ఆ పేకింగులోళ్ళుంటారు కదా.. వాళ్ళే అట్టపెట్టెలు తెచ్చుకుంటారూ.. వాళ్ళే సద్దుతారూ.. వాళ్ళే ప్లాస్టిక్ కవర్లు చుడతారూ.. వాళ్ళే లారీ ఎక్కిస్తారూ.. వాళ్ళే అక్కడ దించుతారూ.. వాళ్ళే అక్కడ సద్దేస్తారూ.. మనకేం పనుండదు సారూ..” అంటూ దండకం చదివాడు.. సల్మాన్ ఖాన్.
” ఏమోనోయ్.. నేనెప్పుడూ వాళ్ళతో సర్దించలేదు. .. ఎలా చేస్తారో.. ఏంటో.. నువ్వు రావోయ్ కొంచెం.. ” అన్నాడు జలజాపతి.
” ఏం కాదు సార్.. వాళ్ళు బానే సద్దుతారు.. ఇంతకు ముందు ఆఫీసర్ గారు కూడా అలాగే చేసారు. ఆ పేకింగ్ వాళ్ళ నెంబరు నా దగ్గరుంది.. చేసి ఓ సారి మాట్లాడండి.. మీకే తెలుస్తుంది ” అన్నాడు సల్మాన్ ఖాన్.
వీడి దుంపతెగ… పెంచిన కండలు చూసుకుంటూ.. తాను సల్మాన్ ఖాన్ అనుకుని ఫోజులు కొడతాడు వీడు… తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు వీడు.. పని చెపితే పారిపోయేరకం… వీడితో లాభం లేదనుకుని..
చేసేదేంలేక..
” సరే.. అదేదో.. నువ్వే మాట్లాడు వాళ్ళతో.. .” అన్నాడు జలజాపతి.
” అలో.. అలో.. .. పేకర్సూ.. మూవర్సూ.. వాళ్ళేనా.. మాకు విజీనగరానికి ట్రాన్స్ ఫర్ అయిందీ.. మీరొచ్చి సామాన్లు సద్దిపెట్టాలి.. ఎంతవుతుందీ? ట్రాన్సు పోర్టు కూడా మీదేగా.. దానికెంతవుతుందీ? అక్కడ కూడా సామాను దించేసి సర్దుతారటగా.. దానికెంతవుతుందీ? మొత్తం కలిపి చెపుతారా? విడివిడిగా చెపుతారా? .. ఏంటీ.. ముందొచ్చి సామాన్లు చూసి చెపుతారా? అయితే సాయంత్రం ఫలానా అడ్రస్ కి వచ్చేయండి.. ” అని సల్మాన్ ఖానే.. జలజాపతి తరపున వకాల్తా తీసుకుని మాట్లాడేసాడు.
” సారూ… సాయంత్రం ఇంటికొస్తారట.. మేడమ్ గారికి చెప్పండి. ”
అలాగే.. అన్నాడు కానీ.. పని హడావుడి లో పడి జలజానికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాడు జలజాపతి.
ఆ తర్వాత ఆఫీస్ లో రిలీవర్ రావడం.. ఫేర్ వెల్ పార్టీ.. ఈ హడావుడి ముగిసి ఇంటికి చేరాడు.
ఎదురుగా జలజాక్షి.. టీ. వీ లో..” దెబ్బకి ఠా.. దొంగల ముఠా ” సినిమా దీక్ష గా చూస్తోంది. భర్త ని చూసిన జలజం..
” హమ్మయ్య.. వచ్చారా? ఇందాకటి నుండి మీ గురించే ఎదురు చూస్తున్నాను..” అంది జలజాక్షి.
” ఏమిటోయ్.. హడావుడి.. ఏంటి సంగతి?” అన్నాడు జలజాపతి.
” అదో పెద్ద కధ.. వుండండి చెపుతాను..” అంటూ.. భర్త కళ్ళ ముందు వేలితో రింగులు రింగులు తిప్పింది.
” ఏంటే.. ఇది ? ఈ తిప్పుళ్ళేంటీ? ” అన్నాడు జలజాపతి.
” జరిగిన సంగతి చెప్పాలంటే… సినిమాల్లో అలాగే రింగులు తిరుగుతాయిగా ” అంది.
” నా ఖర్మ.. ఏంటో చెప్పు ముందు .. ” అన్నాడు జలజాపతి.
చెప్పడం మొదలెట్టింది..
ఇందాకా కాలింగ్ బెల్లు కొడితే … మీరే అనుకుని తలుపు తీసాను..
జెమా జెట్టీల్లా వున్న ఇద్దరు.. . నన్ను తోసుకుంటూ లోపలకి వచ్చేసారు.
బిత్తరపోయాను. ” ఎవరు మీరు? ఏంటలా లోపలకి వచ్చేస్తున్నారు? ఆగండక్కడ..” అంటూ అరుస్తూనేవున్నాను… వాళ్ళు వినిపించుకోకుండా హడావుడిగా ఇల్లంతా కలియ తిరిగేస్తున్నారు.
అలమార్లు, బీరువాలు తలుపులు తీసి చూసేస్తున్నారు. ఒకడైతే ఎవరికో ఫోన్ చేసి..” డబల్ డోర్ ఫ్రిజ్ వుంది.. పెద్ద బాక్స్ తీసుకురండి.. రెండు బీరువాలు.. అటక మీద స్టీలు సామాన్లు బాగానే వున్నాయి.. టి. వీ సైజు కూడా పెద్దదే.. మంచాలు అయితే కంప్లసరీ విప్పేస్తేనే కుదురుతుంది… సోఫాసెట్ కూడా వుంది.. పెద్ద వెహికలే తేవాలి..” అని చెప్పడం విని.. నాకు అనుమానం రూఢీ అయిపోయింది. వీళ్ళెవరో ఇల్లు దోచేయడానికి వచ్చిన గజదొంగలే అనుకున్నాను.
” మేడమ్.. కిచెన్ ఎక్కడుందీ? గ్రైండరూ.. ఓవెనూ వున్నాయా? ” అంటూ ఇద్దరూ వంటింటిలోకి వెళ్ళారు.
ఇక లాభం లేదు… పక్కవాళ్ళనెవరినైనా పిలుద్దామన్నా… ఆ పక్కవాళ్ళు, ఈ పక్కవాళ్ళు కలిసి టూర్ కి వెళ్ళారు.. వీళ్ళిద్దరూ కూడబలుక్కుని ఇల్లు దోచేసాలా వున్నారు.. నేనిక వీరఝాన్సీరాణి అవతారం ఎత్తాల్సిందే అనుకున్నాను.
వాళ్ళ వెనకాలే వంటింటిలోకి నెమ్మదిగా నేనూ వెళ్ళాను. వరస పెట్టి చూసిన టి. వి సీరియల్స్ అన్నిటినీ గుర్తు చేసుకున్నాను. “గుడ్డి మందారం” సీరియల్ లో.. విలన్ భూపతి నుండి.. తనని తాను కాపాడుకునేందుకు గుడ్డి హీరోయిన్ చేసిన పని ఠకీమని గుర్తు వచ్చి.. కారం డబ్బా మూత తీసాను.రెండు గుప్పిళ్ళు.. నిండా కారం తీసుకుని.. ఇద్దరి కళ్ళలోకి ఒకేసారి కొట్టాను .. అనుకోని ఈ సంఘటనతో.. కళ్ళలో కొట్టిన కారం భగ్గుమనేసరికి గావుకేకలు పెట్టారిద్దరూ.. కళ్లు తెరవలేక ఇద్దరూ మంటా.. మంటా అని అరవడం మొదలెట్టారు.
అంతటితో ఆగలేదు నేను. మరో సీరియల్.
.” పట్టుకో.. పట్టుకో.” . లో అత్తగారు..
ఆదివరాహలక్ష్మి పెట్టే బాధలు పడలేక కోడలు ..
కూర్మ మహాలక్ష్మి.. పరిగెడుతూంటే.. తన భారీ శరీరంతో.. కోడలిని పట్టుకోలేక.. నూనె సీసా కింద వంపేసి.. జారి పడిన కోడలిని పట్టుకోవడం గుర్తు వచ్చి.. రెండులీటర్ల నూనెని.. నేల మీద ధారగా వాళ్ళిద్దరి చుట్టూ వంపేసాను. ఇహ.. చూస్కోండి.. అసలే కళ్ళు మంట.. ఆపై.. నేలమీద నూనె జారుడు.. లేవడం.. జర్రుమనడం.. లేవడం.. జర్రుమనడం.
ఇదే అదునుగ తీసుకుని.. పచ్చడి బండ తీసుకుని.. బడబడా పచ్చడి దంచినట్లే.. ఇద్దరినీ ఎక్కడపడితే అక్కడ ఇద్దరినీ.. పచ్చడి చేసి పారేసి.. బయటకి వచ్చి.. వంటింటికి గొళ్లెం పెట్టేసి.. హాల్లోకి వచ్చి కూర్చుని.. ఇదిగో.. . ” దెబ్బకు ఠా.. దొంగలముఠా” సినిమా చూస్తూ కూర్చున్నా..
లేకపోతే.. నా ఇల్లే దోచుకుందామని వస్తారా.. వెధవలు.. తగిన శాస్తి చేసాను.. మీరు పోలీసులకు కబురు చేయండి.. మిగిలింది వాళ్ళే చూసుకుంటారు.. ” అంది జలజం..
అప్పుడు జలజాపతి బుర్ర కి ఏదో సిక్త్ సెన్స్ కొట్టింది.. గబగబా వెళ్లి వంటింటి తలుపు గొళ్లెం తీసి లోపలకి వెళ్ళాడు. నూనెలో తడిసి నిగనిగా మెరుస్తూ.. ఇద్దరు దొర్లుతూ కనపడ్డారు.
” ఇదిగో.. కొంపతీసి.. మీరిద్దరూ పేకర్సూ. మూవర్సూ కాదు కదా! ” అన్నాడు.. కంగారుగా..
” కొంపతీసి కాదు కానీ.. మీ కొంపలో సామాను చూసుకుని వస్తామని మీకు చెప్పాం కదా! మీరు మేడమ్ గారికి ఆ విషయం చెప్పలేదా? మా ఇద్దరికీ కూసాలు కదిలిపోయాయి.. ఏ పార్టు ఎక్కడ ఎలా వుందో కూడా తెలీని స్టేజీ లా వుంది మాకు. అయ్యా! మీకో దండం.. మీ సామాను సర్దడానికో దండం.. మీ ఆవిడ గారికి శత సహస్ర దండాలు.. ఏదైనా ఆటో పిలిపించి… మమ్మల్ని హాస్పిటల్ కి పేకింగ్ చేసి.. మూవింగ్ చేయించండి.. ” అన్నాడొకడు..
” అయ్యే.. పొరపాటయిపోయింది.. క్షమించండి… మరి మా సామాన్లు సర్దడం ఎలా? ఎప్పుడు వస్తారు? ” అని అడిగాడు.
” ముందు మా శరీరంలోని పార్టులు సర్దుకోనివ్వండి.. తర్వాత మీ ఇల్లు సర్దడం సంగతి ఆలోచిస్తాము.. ” అన్నారు వాళ్ళిద్దరూ..
” జలజం.. సామాన్లు సర్దలేకపోతున్నానూ.. నడుం పట్టేసిందీ.. అన్నావని.. వీళ్ళ ని మాట్లాడాను.. వాళ్ళ నడుంలు చితక్కొట్టేసావు కదే… ఇప్పుడిక నాకు తప్పేట్టులేదు.. ఈ పేకింగూ.. మూవింగూ.. అన్నాడు జలజాపతి.
” నీ చావు నువ్వు చావు” సీరియల్ లో మునిగిపోయిన జలజానికి.. జలజాపతి మాటలు చెవికెక్కలేదు..

__________________________________________

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *