May 26, 2024

ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత సురవరం ప్రతాపరెడ్డి​ గారు ​

 

రచన: శారదాప్రసాద్

​తెలంగాణ రాజకీయ,  సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి​ గారు.   ​తెలుగుభాషకు,  తెలుగువారి సమైక్యతకు జవజీవాలు పోసిన మహామహులలో సురవరం ప్రతాపరెడ్డి గారు ఒకరు.  పత్రికా సంపాదకు​డిగా,  పరిశోధకు​డిగా,  పండితు​డిగా,  రచయితగా,  ప్రేరకు​డిగా,  క్రియాశీల ఉద్యమకారు​డిగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ​గారి ​ప్రతిభ,  కృషి అనన్యమైనది.   స్థానిక చరిత్రల గురించి,  స్థానిక ప్రజల కడగండ్ల గురించి ఆయన పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం.  తెలంగాణలో కవులే లేరనే నిందా ​వ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన “గోల్కొండ కవుల సంచిక” గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి​ గారు ​. ​ఇందులో అత్యధికంగా పాలమూరు జిల్లాకు చెందిన 87 కవుల వివరాలున్నాయి. ఇందులో పదిమంది క​వయిత్రులు​ ఉన్నారు. 183 మంది పూర్వకవుల పరిచయాలు ఇవ్వబడ్డాయి.

ఈయన ​తెలుగు​, ​హిందీ, ​​ ఉర్దూ, సంస్కృతం,  ఫారసీ,  ఆంగ్ల భాషలలో నిష్ణాతులు.  గోల్కొండ పత్రిక,  దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక,  ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా,  పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర,  హిందువుల పండుగలు,  హైందవ ధర్మవీరులు,  గ్రంథాలయో ద్యమము ​ఆయన​ ఇతర ముఖ్య రచనలు. ఆయన రాసిన రచనలు,  చేసిన భాషాసేవ అపారం.  గురజాడ,  గిడుగు,  కందుకూరి వీరేశలింగం పంతులు గార్ల లాగే రెడ్డిగారు ఆంధ్రమహాసభ ఉద్యమ నాయకునిగా,  తెలుగు సాహిత్యోద్యమ వైతాళికులుగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలలో లిఖించబడ్డారు.  నైజాం నిరంకుశ పాలనలో,  తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు,  తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు.  అందుకే తెలుగుభాషోద్యమ సమాఖ్య వారు ఆయన జయంతి మే 28న తెలుగుజాతి వారసత్వ దినోత్సవం​గా​ ప్రకటిం​చారు.

జీవిత ​చరమాంకంలో( 1952​) రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి​ ​కాంగ్రెసు పార్టీ తరపున హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.  తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది.  1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను “కేంద్ర సాహిత్య అకాడమి” అవార్డు లభించింది.  సురవరం ప్రతాపరెడ్డి ​గారు ​1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో జన్మించాడు.  మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి. ఏ,  తిరువాన్‌కూరులో బి. ఎల్ చదివాడు.  కొంతకాలం పాటు న్యాయవాద వృత్తి నిర్వహించాడు.  అనేక భాషలు అభ్యసిం​చాడు.   మంచి పండితుడు.  1926 లో ఆయన నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి.  గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిం​చాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన ​పెట్టాడు.  దాన్ని తిప్పికొడుతూ ప్రతాపరెడ్డి గారు ప్రపంచ మేధావుల  సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురిం​చాడు.  దాన్ని మరింత సమస్యగా ఆనాటి ​నిజాం ​ప్రభుత్వం భావించింది.

గ్రంథాలయోద్యమంలో ప్రతాపరెడ్డి​ గారు​ ప్రముఖపాత్ర​ను పోషించాడు.  1942 లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించాడు.  1943 లో ఖమ్మంలో జరిగిన గ్రంథాలయ మహాసభకు,  1944 లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు ఆయనే అధ్యక్షుడు. 1951 లో ప్రజావాణి అనే పత్రికను ప్రారంభించాడు. సురవరం ప్రతాపరెడ్డి ​గారి ​కథలు నిజాం కాలం నాటి ప్రజల జీవితాన్ని ఉన్నదున్నట్లుగా చిత్రిం​చాయి.   హైందవ ధర్మ వీరులు,  హిందువుల పండుగలు,  రామాయణ కాలం నాటి విశేషాలు మొదలైన ఇతర గ్రంథాలను ​కూడా ​రచిం​చాడు.   భక్త తుకారాం,  ఉచ్ఛల విషాదము అనే నాటకాలు రాసాడు.  రాజకీయ సాంఘీక ఉద్యమంగా సంచలనం కలిగించిన ఆంధ్రమహాసభ మొదటి అధ్యక్షుడు ప్రతాపరెడ్డి​ గారు.

వీరు కేవలం 58 సంవత్సరాలు మాత్రమే జీవించారు.  తాను బతికినంత కాలం తెలుగుభాషోద్ధారకునిగా​,  సాంఘీక సంస్కర్తగా పనిచేశారు. ​ఈయన ​195​3 ఆగస్టు 25న మరణించారు.  ప్రతాపరెడ్డి ​గారి ​తండ్రి చిన్నతనంలోనే మరణించారు.  మరదలు ​అయిన ​పద్మావతిని ఆయన 1916లో వివాహం చేసుకున్నారు.  సురవరం ప్రతాపరెడ్డి ​గారు​ చదువు పూర్తికాగానే హైదరాబాద్‌ కొత్వాల్‌గా ​ఉన్న రాజబహదుర్‌ వేంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో​ పనిచేస్తున్న రెడ్డి హాస్టల్‌​ ​కు వచ్చారు.  ఇక్కడ ఆయన పనిచేసిన ​10 ఏళ్ళల్లో  రెడ్డి హాస్టల్‌ ను ఒక విద్యాలయంగా తీర్చిదిద్దారు.  విద్యార్థులలో దేశభక్తి బీజాలను నాటారు.  మద్రాస్‌ కళాశాలలో చదువుతున్నప్పుడే నాటి జాతీయ ఉద్యమ ప్రభావం ఆయనపై పడింది.  హాస్టల్‌ కార్యదర్శిగా వేయి గ్రంథాలున్న హాస్టల్‌ లైబ్రరరీని 11వేల గ్రంథాల వరకు పెం​చారు. తెలుగు మాతృభాష దుస్థితిపై వారు పడిన మధనం మనకు ​అడుగడుగునా ​కనిపిస్తుంది.  మన మాతృభాషను కాపాడుకోవాలని,  ఉర్దూ రాజ్యమేలుతున్న హైకోర్టు,  ఉస్మానియా విశ్వవిద్యాలయంలోను తెలుగు ఇతర భాషలకు చుక్కెదురు కావడాన్ని ఆయన నిరసించారు.  నూటికి 90 శాతం కాని ప్రజలకు ఉర్దూభాషను విద్యాలయాలలో బోధనా భాషగా ​రుద్దటాన్ని ఆయన తప్పుపట్టారు.

సురవరం హాస్టల్‌ కార్యదర్శిగా పని​చేస్తున్న రోజుల్లోనే గోల్కొండ పత్రికను ​స్థాపించారు. కొత్వాల్‌  తన వేయి రూపాయల చందాతో రెడ్డి గారిని మద్రాస్‌ కు పంపించి,  ప్రింటింగ్‌ మిసన్‌,  అక్షరాల టైపు​ ​పెట్టెలను తెప్పించారు.  నిజాం ​నవాబు​ అనుమతితో,  పత్రిక నగరంలోని ట్రూప్‌ బజార్‌లో ద్వైవారపత్రికగా ఒక చిన్న భవనంలో స్థాపించారు. తదుపరి ​ఇది 1947నాటికి దినపత్రిక స్థాయికి ఎదిగింది.  దాదాపు 23 సంవత్సరాల పాటు దానికి సంపాదకునిగా బాధ్యతలను ​సక్రమంగా ​నిర్వర్తిం​చారు. ఆయన రాసిన సంపాదకీయాలు మేధావుల ప్రశంసలకు నోచుకునేవి.  అయితే రాను రాను పత్రికకు ఎందుకో అమ్మకాలు తగ్గాయి. చివరకు నష్టాలకు గురై 1967లో మూతపడింది. ​కొంతకాలం నీలగిరి అనే పత్రికకు సర్వం తానై (సంపాదకులనుండి మేనేజర్‌గా,  సబ్‌ ఎడిటర్‌,  ఫ్రూఫ్‌ రీడర్‌గా,  గుమాస్తాగా,  ఛప్రాసీగా​), ఆ పత్రికను నిర్వహించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులోని ‘సురవరం వైజయంతి పీఠం’ సురవరం రచనల విశ్లేషణకు కృషి చేస్తున్నది. తెలంగాణా జాగృతి సంస్థవారు 2009లో గోలుకొండ కవుల సంచికను యధాతతంగా ముద్రించి తక్కువ ధరలో విక్రయిస్తున్నారు​.

1949లో ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రకటించిన వీరి ఆంధ్రుల సాంఘీక చరిత్ర అన్నది అద్భుత పరిశోధన గ్రంథం​. ఈ గ్రంథ పరిశోధనకుగాను,  కేంద్ర సాహిత్య అకాడమీ 1955లో తొలి అవార్డును ప్రకటించి ​ఆయన్ని ​గౌరవిం​చారు.  రెడ్డి ​గారు ​1953లో విశాలాంధ్ర ఉద్యమ నేతగా కృషి చేశారు.  శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని,  వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని,  రాజకీయ,  సాంఫిుక,  సాహిత్య సేవ,  గ్రంథాలయోద్యమం,  ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను ,  వంశచరిత్రనూ,  వారి జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం,  బహుభాషా పాండిత్యం,  కవితా నైపుణి,  పత్రికా రచన వ్యాసంగం,  కవి పండిత మైత్రి,  పత్రికా సంపాదకునిగా,  వివిధ వ్యాసరచయితగా,  గోలకొండ పత్రిక ఆవిర్భావం,  తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని డా.  ఇందుర్తి ప్రభాకర్ రావు గారు పరిశోధించి,  పరిశ్రమించి “శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన” అనే గ్రంథం రచించారు.  శ్రీ సురవరం గారి చరిత్రను అధ్యయనం చేయదలచిన భావి తరాలు తప్పకుండా చదవాల్సిన చారిత్రాత్మక గ్రంథం​ ఇది ​.  తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణా వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి ​గారి ​స్మారకార్థం నిర్వహించిన సభలో ఈ గ్రంథం ఆవిష్కృతమైంది.

ఈ తెలుగు భాషాసేవకుడికి నా స్మృత్యంజలి!    ​

 

 

12 thoughts on “ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత సురవరం ప్రతాపరెడ్డి​ గారు ​

 1. ” ఆంధ్రుల సాంఘిక చరిత్రకు విధాత ” సురవరం ప్రతాపరెడ్డి​ గారు ​ అనే మీ వ్యాసం పేరు చక్కగా ఎంచుకున్నారు, సురవరం వారి విశిష్టతను వివరించారు ! అబినందనలు శారదా ప్రసాద్ సురవరం

 2. నేటి యువత తెలుసుకోవలసిన విషయాలు ఇవి!

 3. మరో ప్రముఖుడిని గురించి చక్కగా వివరించారు!

 4. విశిష్ట వ్యక్తులను గురించి చక్కగా వివరిస్తున్నారు!

 5. మరల ఇటువంటి తెలుగు వారు పుట్టాలని కోరుతూ మీకు ధన్యవాదాలతో

 6. I am very much glad to know once again about the great personality..
  My uncles(my mother’s brothers)had close contacts with him and several times I heard his name and about his character.My uncles also had a very important role in establishing VISALANDHRA
  Thank you very much for giving a chance to bring him once again into my memories

 7. బహు భాషాకోవిదుడు, తెలుగుభాషప్రాచుర్యానికి ఎనలేని కృషి సల్పిన మహనీయుడు సురవరం వారిని గురించి నీవ్యాసం చాలాబాగుంది. ఈతరంవారికి సురవరంప్రతాపరెడ్డి గారిని గురించి తెలియపరచడంనీరచనద్వారసాధ్యమైందనిభావిస్తాను. తెలుగుభాషోధ్ధారకుడు సురవరంప్రతాపరెడ్డిగారికిస్మృత్యంజలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *