April 26, 2024

జలజాక్షి.. సంగీతం కోచింగ్..

రచన: గిరిజారాణి కలవల

ఎప్పుడో చిన్నప్పుడు.. కాసిని వర్ణాలూ.. ఇంకాసిని కీర్తనలూ గట్రా.. ఏవో నేర్చుకుంది మన జలజం.. వాళ్ళ బామ్మ బతికున్ననాళ్ళూ సంగీత సాధన చేసాననిపించి.. ఏవో కొన్ని రాగాలని ముక్కున పట్టింది. ఇంటి ఆడపిల్ల చక్కగా సంగీతాలాపన చేస్తోంటే.. సరస్వతీదేవి నట్టింట వీణ వాయించినట్టే వుంటుందని బామ్మ పట్టుబట్టి.. మాష్టారిని ఇంటికి పిలిపించి.. జలజాక్షికి సంగీతం నేర్పించింది. ఆ మాష్టారు కూడా.. జలజానికి తగిన మనిషే… శంకరాభరణం సినిమాలో దాసు కేరక్టరే అనుకోండి.. చక్కటి పాటలని ముక్కలు ముక్కలుగా చేసి నేర్పేవాడు.. ‘ బ్రోచే.. వా..రెవరురా.. టటటడటయ్..’ ఆయన నేర్ఫినట్టే మన జలజం ఆ ముక్కలని ముక్కున పట్టింది. అంతే.. ఆ తర్వాత బామ్మా పోయింది.. సంగీత సాధనా అయిపోయింది.. హార్మోనియం పెట్టిని అటకెక్కించేసింది జలజం.
జలజానికి పెళ్ళి ఈడు వచ్చింది.. సంబంధాలు రావడం మొదలయ్యాయి. పెళ్ళి చూపులప్పుడు… ఎవరైనా సంగీతం నేర్చుకున్నావా? పాటలు పాడడం వచ్చా? అని అడుగుతారేమో అని జలజం వాళ్ళ అమ్మ.. ఆ పెట్టిని కిందకి దింపి బూజులు దులిపింది.
పదమూడో సంబంధం.. ఎవరనుకుంటున్నారూ… ఇంకెవరూ .. మన హీరో జలజాపతే..
కాఫీలూ, ఫలహారాలు ముగిసాయి.. ఒకరినొకరు ఓర చూపుల బాణాలు వేసుకోవడమూ అయింది.. పెద్దోళ్ళు అన్ని కోణాలూ చూడడం అయింది.. ఆలోచించి జాతకాలూ, కట్నాలూ మాట్లాడుకోవడాలూ ముగిసాయి.. ముహూర్తాల దగ్గరకి వచ్చేసరికి.. అదిగో సరిగ్గా అప్పుడే… జలజాపతి బామ్మ… ” ఏదీ.. పిల్లా.. సంగీతం నేర్చుకున్నావని ఆ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు.. ఓ పాటందుకో..” అంది.. ఏదో అప్పచ్చుల పళ్ళెం అందుకో అన్నట్టుగా…
ఇక తప్పదుగా… హార్మోనియం పెట్టి శృతి చూసుకుని.. తన గొంతు సవరించుకుని… ఏడో క్లాస్ లో వదిలేసిన కీర్తనలని గుర్తు చేసుకుంటూ.. మొదలెట్టేసరికి.. ఆ హార్మోనియం పెట్టిలో స్ధిరనివాసం ఏర్పరచుకున్న బల్లి ఫేమిలీ లోని చంటిబల్లి ఒక్క సారిగా పైకి ఎగిరి.. జలజాపతి బామ్మ నెత్తిన పడింది.. ఆ దెబ్బకు ఆవిడ కాస్తా అదిరిపడి.. కెవ్వున కేకతో.. అంతెత్తుకి ఎగిరింది. దాంతో తోక తెగిన బల్లిలా గెంతడం మొదలెట్టింది. జ. ప తల్లికి మాత్రం.. కొద్దిగా బల్లి శకునాలు పెద్ద బాలశిక్షలో చదివిన గుర్తుంది.. నెత్తిన పడితే…. అత్తగారు ఇక పైకి టికెట్ తీసుకున్నట్టే… హమ్మయ్య అనుకుంది… పైకి మాత్రం అయ్యో బల్లి.. అయ్యో బల్లి అంటూ.. సోఫా ఎక్కి గెంతులేయడం మొదలెట్టింది.
వెంటనే.. జలజం తండ్రి… ” శారదా ఆపు” అన్న లెవల్లో ” జలజా ఆపు” అని గావుకేక పెట్టారు. ఈ కంగారులో జలజం పాట ఎప్పుడు ఆపిందో కూడా తెలీలేదు.
బల్లి హడావుడి సర్దుమణిగాక.. పెళ్లి మాటలు మొదలెట్టారు.. బల్లి భయంలో వున్న జ. ప. బామ్మ మళ్లీ మాట్లాడలేదు.. ఓ పదిహేనురోజుల్లో ఎంగేజ్మెంట్ .. ఆ తర్వాత నెల్లాళ్ళకి పెళ్ళి జరిగిపోవడం.. నెల తిరక్కుండా జలజం అత్తారింట అడుగు పెట్టడం జరిగిపోయింది. జలజాపతి బామ్మ మాత్రం.. జలజాన్ని పాటలు పాడమని మాత్రం అడగలేదు ఎప్పుడూను.

ఇంతలో జలజాపతికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవడంతో.. భార్యభర్తలు ఇద్దరూ అక్కడ కాపురం పెట్టారు. తమతోపాటు బామ్మని తీసుకెడదామనుకున్నాడు కానీ.. జలజం సంగీతానికి భయపడి ఆవిడ వెళ్ళనంది. మనవడు ఆఫీసుకి వెళ్ళి పోయాక.. తన పాటలతో .. వాయించేస్తుందేమో అని భయపడి బామ్మ రానని చెప్పింది.
జ. ప ఆఫీసు కి వెళ్ళాక జలజానికి ఖాళీయే.. పనేం వుండేది కాదు.. ఏం తోచక ఏంచేయాలా అని ఆలోచిస్తూ వుండేది. కాలేజీలో స్నేహితురాలు విజయ ఒకసారి సినిమా హాల్లో కనపడి.. పలకరింపులు అయ్యాక.. ఇంటి అడ్రస్ లు తీసుకుని వారం వారం కలుసుకోవడం మొదలెట్టారు.
అటువంటి సమయంలో విజయ.. ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించాలో చెప్పింది బానే వుందనిపించింది జలజానికి. ” కాస్తోకూస్తో సంగీతం నేర్చుకున్నావు కదా… ఇంటి దగ్గర చిన్న పిల్లలకి సంగీతం క్లాసులు తీసుకో.. వారానికి రెండు క్లాసులు తీసుకున్నా.. ఒకొక్కరి దగ్గర.. వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు.. పదిమంది వచ్చినా ఈజీగా పదివేలు నెలకి సంపాదించవచ్చు..” అని చెప్పేసరికి ఇదేదో బావుందే అనుకుంది జలజం. వెంటనే అమలులో పెట్టేసింది.. అదే అపార్ట్ మెంట్ లో చుట్టుపక్కల ఇళ్లలో చెప్పేసరికి.. ఓ పదిమంది పిల్లలు సంగీతం క్లాసుకి రావడం మొదలెట్టారు. అయితే ఒక నెల తిరక్కుండానే.. ఆ పిల్లల తల్లిదండ్రులు.. జలజం దగ్గర క్లాస్ లు మాన్పించడమే కాదు.. పైన.. సా.. అనగానే.. పైన ఇంటి వాళ్ళు, కింద.. రీ.. అనగానే కింద ఇంటి వాళ్ళూ.. వాళ్ళే ఇళ్లు మారిపోయారు జలజం సంగీతం దెబ్బకి..
ఇది వర్క్ అవుట్ కాకపోయేసరికి… ఇలా డైరక్ట్ గా కాకుండా… ఆన్ లైన్ క్లాసులు తీసుకుందామనే ఆలోచన వచ్చింది జలజానికి. పాపం ఇద్దరు ముగ్గురు దొరికారు.. జలజం సంగతి తమ దాకా పాకనివారు..
అందులో ఓ పిల్లని వాళ్ళమ్మ లాప్ టాప్ ముందు.. జలజం క్లాస్ కి కూర్చోపెట్టి.. లోపల తన పని చూసుకుంటూ వుండేది.. ఈ పిల్లకి కుదురేదీ… అటుపోనూ.. ఇటుపోనూ… జలజం వాళ్ళమ్మకి ఫోన్ చేయడం.. ఆవిడ పిల్లని మళ్లీ ఇక్కడ కుదేయడం…. వెంటనే అది మళ్లీ పారిపోవడం..
” మీ పిల్లకి కుదురు లేదండీ.. తాళం కూడా వెయ్యడం లేదు..ఇలా అయితే ఎలా నేర్పించాలీ ” అని జలజం ఆ పిల్ల తల్లికి కంప్లైంట్ చేసేసరికి….
మన జలజం కంటే ఘనురాలు ఆ తల్లి…. పిల్లని లాప్ టాప్ ముందు కుర్చీలో కుదేసి కూర్చోపెట్టి.. తాడేసి కట్టేసి… ఆ రూముకి తాళం వేసి.. జలజానికి ఫోన్ చేసింది…” ఇక మా అమ్మాయి కదలనే కదలదు… తాళం కూడా వెయ్యమన్నారుగా.. వేసేసాను..రూముతలుపులకి గాడ్రెజ్ తాళం.. ఇక మొదలెట్టుకోండి క్లాస్ ని”.. అంది.
అంతే ఇక జలజం నోటికి తాళం పడిపోయింది.

*****

1 thought on “జలజాక్షి.. సంగీతం కోచింగ్..

Leave a Reply to మాలిక పత్రిక జులై 2019 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *